Menu Close
Paranandi-Aravindarao
మనసు విప్పిన మడతలు - 7
-- పారనంది అరవిందారావు --

ఏది నాటకం?….

edi-natakam

నాటకం ముగిసింది
నగరం వెళ్ళిపోయింది
తెర దిగిపోయింది
హాలు ఖాళీ అయింది
పారిపోయిన కరతాళధ్వనులు
పొంగిపొర్లుతున్న నిశ్శబ్దం…
మూగబోయిన మెర్క్యురీ లైట్లు
తలలు వాల్చిన వెల్వెట్ సీట్లు
జనం కోసం పదే పదే పళ్ళికిలిస్తూ
కుంచెను ముంచి కులుకుతూ
పులుముకున్న రంగులు..
చిల్లులులేని చీకట్లో ఇక
తడుముకుంటూ చెరిపేస్తా.
జీవితంలో బెదిరిపోతూ
ఈతరాని దానిలా మునకలు
వేసే నేను తడుముకోక ….
తడబడక… ఈరోజు డైలాగులు కుప్పించా!
ఈ పాత్రకి ఈ రోజు సెలవు…
ఆవంకెకి తగిలించగానే అది
ఆవలించి పడుకుంది.
స్క్రిప్ట్ లేని స్టేజ్ లేని
నా మరో నాటకం అదిగో ..
ఇక మొదలవుతోంది!

కలల అంగడి

kalala-angadi

అందరూ అంటున్నారు
అతనెవడో వచ్చాడని
కట్టగట్టుకుని వచ్చి
కలలమ్ముతున్నాడని
ఆదరాబాదరగా అంగలేసుకుంటూ
అవన్నీ కొనితెచ్చుకుందామని
ఆశతో అందరితో అడుగు కలిపాను
అతని చుట్టూ అన్నీ అందమైన బుట్టలే
కొన్ని బంగరువి కొన్ని వెండివి
కొన్ని రాగివి కొన్ని రతనాలవి
కొన్ని పసిడి కాంతులతో పలుకరిస్తున్నాయి
కొన్ని రజత వర్ణములో రంజిల్లుతున్నాయి
కొన్ని రా రమ్మని పిలుస్తున్నాయి
కొన్ని సిగ్గిలుతూ సైగచేస్తున్నాయి
నా కోరికలు చిలుకలై కలకలమంటున్నాయి
ఆశలు ఆశగా త్వరపడమంటున్నాయి
ఎద సంతసించే కలలు తీసుకో అన్నాడు
రంగు రంగుల కలలు రమ్యమైన కలలు
ప్రతి ఒక్కటి వేరు వాటి పేర్లు వేరు
అరుదైన అపూర్వమైన అబ్బురము చెందే
చిత్ర విచిత్ర విస్మయ వింతలు గొలిపే
అందమైన అనుభూతులందిస్తాయన్నాడు
ఆబగా కొన్నాను అంతులేని కలలు
పగలు గడిచిన పిదప పడకపై పరిచాను
కాని......
ఎదురు చూస్తున్న నిదుర ఎప్పుడొస్తుందో???

*****

ముందుమాట

Paranandi-Aravindaraoనాకు చిన్నప్పటినుంచి వచనకవిత్వంలో ఓ రకమైన కుతూహలం ఉండేది. 14-15 ఏళ్ళ వయస్సులోనే కీర్తి శేషులు డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి కవితలు, వారు ఆ కవితలని పఠించే తీరు నన్ను చాలా ఆకర్షించేది. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రసాయనిక శాస్త్రం అభ్యసిస్తున్నప్పుడు వారు తెలుగు శాఖలో రీడర్ గా ఉండేవారు. వారు నన్ను చాలా ప్రోత్సహించేవారు. క్రమేపీ నాకు వచన కవిత, కథానిక ప్రక్రియల్లో అభినివేశం, అభిమానం కలగడం ప్రారంభమైంది. అలాగే ఆ రోజుల్లో All India Radio లో పనిచేస్తున్న కీ.శే. వేలూరి సహజానందం గారు నా కవితలని రేడియోలో చదవడానికి ఎన్నో అవకాశలిచ్చి ప్రోత్సహించేవారు. ఇంగ్లండు లో రసాయనిక పరిశోధన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు నాకు గీతాంజలి అనే బహుభాషా కవుల సంఘంతో పరిచయమేర్పడి వారి ప్రోత్సాహంతో తెలుగు, ఆంగ్ల భాషల్లో కవితలు రాయడం మొదలుపెట్టాను. ఆ సంస్థ అధ్యక్షులు డా కృష్ణకుమార్ గారు ఉత్తరప్రదేశ్ వారైనా తెలుగు భాష మీద మిక్కిలి గౌరవం చూపించి రెండు సంకలనాలలో నా తెలుగు మరియు ఆంగ్ల కవితలు ముద్రించారు. సుమారు 4 సంవత్సరాల క్రితం ఇంకో తెలుగు సాహితీ అకాడెమీ సమూహంతో పరిచయమేర్పడి తెలుగులో మాత్రమే కవితలు రాయడం మొదలెట్టాను. ఆ సమూహ అధ్యక్షులు మాజీ ఉపకులపతులు గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు ఎంతో అభిమానంతో నాకు స్వాగతం పలికి నాకు మార్గదర్శకులుగా నిలబడి నా సాహిత్య పయనానికి దోహదమిచ్చారు.

మార్చి 2023 హైదరాబాదు సిరికోన సాహితీ అకాడమీ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉపకులపతులు ఆచార్య కిషన్ రావు గారు నా కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు ఆవిష్కరించారు. నా కవితా సంపుటిని ప్రశంసించిన పెద్దలందరికీ వినమ్ర నమస్సులు.

ఆచార్య రాణి సదాశివమూర్తి, కులపతి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, తిరుపతి
వీరి కవితలను చదువుతుంటే ఒక భాద్యత గల కవయిత్రి, కనబడని సూత్రధారిణి గోచరిస్తారు. ప్రతి శీర్షికలో ఒక కొత్తదనం, పద పదంలో మెత్తదనం, కవిత కవితలోచిత్తాన్ని కదిలిచే చిత్తరువులు, చిత్ర వైచిత్రిని నింపుకున్న భావ కల్పతరువులు దర్శనమిస్తాయి.

శ్రీ నివర్తి మోహన్ కుమార్, చార్టెడ్ ఎకౌంటెంట్
పురుషాధిక్య సమాజంలో గ్లాస్ సీలింగ్ బ్రద్దలుచేసి తమదైన ప్రత్యేకత నిలుపుకున్న భారతీయ వనితల్లో అరవిందారావుగారు కూడా ఒకరు. వీరు పరస్పర భిన్న ప్రవృత్తులను సమతుల్యము చేసుకుని జీవితాన్ని ఒక కళగా మలుచుకున్నవారు. ప్రస్తుత కవితాకదంబమే అందుకు సాక్ష్యం.

డా శారదాపూర్ణ శొంఠి షికాగో, యు.ఎస్.ఎ.
అరవింద గజల్ రచయిత్రిగా, సృజనాత్మక గేయరచయిత్రిగా, గాయనిగా పేరెన్నికగన్నారు. ఆమె వృత్తి ఉజ్వలం. ప్రవృత్తి అద్భుతం. ఆమె కవితలు భావ కవిత్వ ధోరణిలో సాగుతాయి. చదువరుల అంతరంగాన్ని సుతారంగా తాకి, ఊపి ఆమె అనుభూతిలో భాగమవుతాయి. భావకవిత్వ సమాలోచనకి ఈ కవితా సంపుటి బర్హిపింఛం.

నా ఈ కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు లోని కవితలు ఇకపై సిరిమల్లె పత్రికలో ప్రతినెలా పాటకులను అలరిస్తాయని నమ్ముతున్నాను.

నమస్కారములతో – పారనంది అరవిందారావు

Posted in August 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!