Menu Close
Paranandi-Aravindarao
మనసు విప్పిన మడతలు
-- పారనంది అరవిందారావు --

నాకు తెలుసు నాన్నా!

naaku-thelusu-naanna

ఆకలేసి అన్నంకోసం
అమ్మా! అని పిలిచినప్పుడు
నా కంచంలోని అన్నం మెతుకులు
నువ్వే సంపాదించావని తెలుసు నాన్నా!

ఆటలాడుతూ పడి
అమ్మా! అని అరిచినప్పుడు
ఆ గాయానికి మందు
నువ్వే తెచ్చావని తెలుసు నాన్నా!

అలసిపోయి నిద్రకోసం
అమ్మ ఒడిలో ఒరిగిపోయి
కరుచుకున్న ఆ మెత్తటి చీర
నువ్వే కొన్నావని తెలుసు నాన్నా!

అఆలు దిద్దిన బడినుంచి
అంతర్జాతీయ విద్యాలయాల్లో
పట్టాలు పుచ్చుకున్న మాకు
నువ్వు చేసిన త్యాగాలు తెలుసు నాన్నా!

పుట్టిల్లు వదిలి పుస్తె కట్టిన
వానితో పరదేశమేగినపుడు
కంటతడపెట్టిన అమ్మ వెనక
మౌనంగా ఎంత రోదించావో తెలుసు నాన్నా!

నా జీవితానికి ఒక దిశ
ఒక ఆశ. ఆశయం, ప్రేరణ,
ప్రోత్సాహం ఉదారంగా ఇచ్చిన
ఉదాత్తమైన మనిషీ నువ్వే నాన్నా!

 

నలుపూ ఒక రంగే!

nalupu-oka-range

కంటికి రాసే కాటిక నలుపు
కనుపాప నలుపు
కలికి కనుబొమ్మలు నలుపు
కాంతల కురులు నలుపు
కాయంపై కనిపించే
కాలకం నలుపు
ముదితల గళముల మెరిసే
పూసలు నలుపు
బిడ్డడి చెక్కిలిపై అద్దే
దిష్టిచుక్క నలుపు
కోవెలలో వెలసిన
శివలింగం నలుపు
వేలజనం వెలిగించే
అగరొత్తులూ నలుపే!
కవితల్లో కథల్లో కారు
మొగులు వాడుకే!
వీనులకింపుగా పాడే
కోయిల నలుపే
చుట్టమొచ్చేడని
తెలిపే కాకీ నలుపే!

నల్ల పిల్లి దుశ్శకునం
నల్లచీర నిషేధం
నల్లబొట్టు నివర్తనం
మృతి తెలుపు సంకేతం
ఎడలుకి ఓ లక్షణం

…వలపు వగపుల మధ్య
అనుగు అనీహల మధ్య
కలవరపడెనేమో ఈ వన్నె!
నలుపూ ఓ చాయే మరి….
దోషం నలుపుదా లేక మనిషిదా!

*****

ముందుమాట

Paranandi-Aravindaraoనాకు చిన్నప్పటినుంచి వచనకవిత్వంలో ఓ రకమైన కుతూహలం ఉండేది. 14-15 ఏళ్ళ వయస్సులోనే కీర్తి శేషులు డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి కవితలు, వారు ఆ కవితలని పఠించే తీరు నన్ను చాలా ఆకర్షించేది. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రసాయనిక శాస్త్రం అభ్యసిస్తున్నప్పుడు వారు తెలుగు శాఖలో రీడర్ గా ఉండేవారు. వారు నన్ను చాలా ప్రోత్సహించేవారు. క్రమేపీ నాకు వచన కవిత, కథానిక ప్రక్రియల్లో అభినివేశం, అభిమానం కలగడం ప్రారంభమైంది. అలాగే ఆ రోజుల్లో All India Radio లో పనిచేస్తున్న కీ.శే. వేలూరి సహజానందం గారు నా కవితలని రేడియోలో చదవడానికి ఎన్నో అవకాశలిచ్చి ప్రోత్సహించేవారు. ఇంగ్లండు లో రసాయనిక పరిశోధన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు నాకు గీతాంజలి అనే బహుభాషా కవుల సంఘంతో పరిచయమేర్పడి వారి ప్రోత్సాహంతో తెలుగు, ఆంగ్ల భాషల్లో కవితలు రాయడం మొదలుపెట్టాను. ఆ సంస్థ అధ్యక్షులు డా కృష్ణకుమార్ గారు ఉత్తరప్రదేశ్ వారైనా తెలుగు భాష మీద మిక్కిలి గౌరవం చూపించి రెండు సంకలనాలలో నా తెలుగు మరియు ఆంగ్ల కవితలు ముద్రించారు. సుమారు 4 సంవత్సరాల క్రితం ఇంకో తెలుగు సాహితీ అకాడెమీ సమూహంతో పరిచయమేర్పడి తెలుగులో మాత్రమే కవితలు రాయడం మొదలెట్టాను. ఆ సమూహ అధ్యక్షులు మాజీ ఉపకులపతులు గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు ఎంతో అభిమానంతో నాకు స్వాగతం పలికి నాకు మార్గదర్శకులుగా నిలబడి నా సాహిత్య పయనానికి దోహదమిచ్చారు.

మార్చి 2023 హైదరాబాదు సిరికోన సాహితీ అకాడమీ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉపకులపతులు ఆచార్య కిషన్ రావు గారు నా కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు ఆవిష్కరించారు. నా కవితా సంపుటిని ప్రశంసించిన పెద్దలందరికీ వినమ్ర నమస్సులు.

ఆచార్య రాణి సదాశివమూర్తి, కులపతి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, తిరుపతి
వీరి కవితలను చదువుతుంటే ఒక భాద్యత గల కవయిత్రి, కనబడని సూత్రధారిణి గోచరిస్తారు. ప్రతి శీర్షికలో ఒక కొత్తదనం, పద పదంలో మెత్తదనం, కవిత కవితలోచిత్తాన్ని కదిలిచే చిత్తరువులు, చిత్ర వైచిత్రిని నింపుకున్న భావ కల్పతరువులు దర్శనమిస్తాయి.

శ్రీ నివర్తి మోహన్ కుమార్, చార్టెడ్ ఎకౌంటెంట్
పురుషాధిక్య సమాజంలో గ్లాస్ సీలింగ్ బ్రద్దలుచేసి తమదైన ప్రత్యేకత నిలుపుకున్న భారతీయ వనితల్లో అరవిందారావుగారు కూడా ఒకరు. వీరు పరస్పర భిన్న ప్రవృత్తులను సమతుల్యము చేసుకుని జీవితాన్ని ఒక కళగా మలుచుకున్నవారు. ప్రస్తుత కవితాకదంబమే అందుకు సాక్ష్యం.

డా శారదాపూర్ణ శొంఠి షికాగో, యు.ఎస్.ఎ.
అరవింద గజల్ రచయిత్రిగా, సృజనాత్మక గేయరచయిత్రిగా, గాయనిగా పేరెన్నికగన్నారు. ఆమె వృత్తి ఉజ్వలం. ప్రవృత్తి అద్భుతం. ఆమె కవితలు భావ కవిత్వ ధోరణిలో సాగుతాయి. చదువరుల అంతరంగాన్ని సుతారంగా తాకి, ఊపి ఆమె అనుభూతిలో భాగమవుతాయి. భావకవిత్వ సమాలోచనకి ఈ కవితా సంపుటి బర్హిపింఛం.

నా ఈ కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు లోని కవితలు ఇకపై సిరిమల్లె పత్రికలో ప్రతినెలా పాటకులను అలరిస్తాయని నమ్ముతున్నాను.

నమస్కారములతో – పారనంది అరవిందారావు

Posted in July 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!