Menu Close
Paranandi-Aravindarao
మనసు విప్పిన మడతలు
-- పారనంది అరవిందారావు --

స్వాతంత్ర్యం?

swatantryam

స్వాతంత్ర్యం అంటే ఏమిటి?
భాషా స్వాతంత్ర్యమా?
భావ స్వాతంత్ర్యమా?
శారీరక స్వాతంత్ర్యమా?
మానసిక స్వాతంత్ర్యమా?
ఆధ్యాత్మిక స్వాతంత్ర్యమా?
మత స్వేచ్చనా?
ఏదైనా కావచ్చు…
నే పుట్టినప్పటినుంచీ
ఈ పదం వింటూనే ఉన్నాను
నా నోట కూడా నానుతునే ఉంది
రాజకీయవేత్తలు… రాష్ట్రాలు.. దేశాలు
నాట్య..గాన…చిత్ర.. కళాకారులు
సామాన్య ప్రజలు చిన్నా పెద్దలు
ఈ పదాన్ని పుక్కిలించి మైకుల్లోకి
దైనందిక జీవనంలో సమాజానికి
వినపడేట్లు గొంతు చించుకుని అరుస్తున్నారు.
దాని అర్ధం అర్ధమైనా
అర్ధం కానిది…. నేనెరుగని స్వాతంత్ర్యం …
ఆన్ని రకాల స్వేచ్ఛలలో లక్ష్మణరేఖలున్నాయి.
బాల్యంలో కాని, కిశోరావస్థ… యుక్తవయస్సు…..
వృధ్యాపంలో కానీ స్వాతంత్ర్యానికీ ఓ మాదిరి సంకెళ్ళు.
గులాబీల పక్కన ముళ్ళున్నట్లు…
మొక్కకి ఎదగడానికి స్వాతంత్ర్యం ఉందిగాని
ఎగరడానికి లేదు
ఉవ్వెత్తున లేవడానికి ఆ అలలకి స్వాతంత్ర్యం ఉంది కాని
కడలి వదిలి వెళ్ళలేవు
వెల లేని త్యాగమడగని
నియమాలు నిబంధనలు నిరోధన
నిషేధం లేని స్వాతంత్ర్యం ..స్వేచ్చ లేవు.
స్వేచ్చలోనే స్వేచ్ఛగా విహరించే సరిహద్దులున్న జీవితంలో
అర్ధం కానిది…. సంకెళ్ళు లేని పరిధులు లేని
నేనెరుగని సంపూర్ణ స్వాతంత్ర్యం.. అసలుందా

సీత ఔర్ గీత

sita-aur-gita

ఆ ఇంటిలో ఒక సీత
ఈ ఇంటిలో ఒక గీత
సీత గీత బాలేదు
గీత సీత కాలేదు.
ఇద్దరూ చూసే నింగి ఒక్కటే!
ఇద్దరూ నడిచే నేలా ఒక్కటే!
ఇద్దరూ పీల్చే గాలి ఒక్కటే!
ఇద్దరిపై వీచే గాలీ ఒక్కటే!
ఒకరిలో చెలగాటం ఒకరిది కోలాటం
ఒకరిలో ఆరాటం ఒకరిలో ఆర్భాటం
ఒకరిలో విలాపం ఒకరిలో విలాసం
ఇద్దరి వీధులు ఒక్కటైనా
ఇద్దరి విధి కాదొక్కటి
సీత గీత బాలేదు
గీత సీత కాలేదు.

*****

ముందుమాట

Paranandi-Aravindaraoనాకు చిన్నప్పటినుంచి వచనకవిత్వంలో ఓ రకమైన కుతూహలం ఉండేది. 14-15 ఏళ్ళ వయస్సులోనే కీర్తి శేషులు డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి కవితలు, వారు ఆ కవితలని పఠించే తీరు నన్ను చాలా ఆకర్షించేది. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రసాయనిక శాస్త్రం అభ్యసిస్తున్నప్పుడు వారు తెలుగు శాఖలో రీడర్ గా ఉండేవారు. వారు నన్ను చాలా ప్రోత్సహించేవారు. క్రమేపీ నాకు వచన కవిత, కథానిక ప్రక్రియల్లో అభినివేశం, అభిమానం కలగడం ప్రారంభమైంది. అలాగే ఆ రోజుల్లో All India Radio లో పనిచేస్తున్న కీ.శే. వేలూరి సహజానందం గారు నా కవితలని రేడియోలో చదవడానికి ఎన్నో అవకాశలిచ్చి ప్రోత్సహించేవారు. ఇంగ్లండు లో రసాయనిక పరిశోధన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు నాకు గీతాంజలి అనే బహుభాషా కవుల సంఘంతో పరిచయమేర్పడి వారి ప్రోత్సాహంతో తెలుగు, ఆంగ్ల భాషల్లో కవితలు రాయడం మొదలుపెట్టాను. ఆ సంస్థ అధ్యక్షులు డా కృష్ణకుమార్ గారు ఉత్తరప్రదేశ్ వారైనా తెలుగు భాష మీద మిక్కిలి గౌరవం చూపించి రెండు సంకలనాలలో నా తెలుగు మరియు ఆంగ్ల కవితలు ముద్రించారు. సుమారు 4 సంవత్సరాల క్రితం ఇంకో తెలుగు సాహితీ అకాడెమీ సమూహంతో పరిచయమేర్పడి తెలుగులో మాత్రమే కవితలు రాయడం మొదలెట్టాను. ఆ సమూహ అధ్యక్షులు మాజీ ఉపకులపతులు గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు ఎంతో అభిమానంతో నాకు స్వాగతం పలికి నాకు మార్గదర్శకులుగా నిలబడి నా సాహిత్య పయనానికి దోహదమిచ్చారు.

మార్చి 2023 హైదరాబాదు సిరికోన సాహితీ అకాడమీ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉపకులపతులు ఆచార్య కిషన్ రావు గారు నా కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు ఆవిష్కరించారు. నా కవితా సంపుటిని ప్రశంసించిన పెద్దలందరికీ వినమ్ర నమస్సులు.

ఆచార్య రాణి సదాశివమూర్తి, కులపతి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, తిరుపతి
వీరి కవితలను చదువుతుంటే ఒక భాద్యత గల కవయిత్రి, కనబడని సూత్రధారిణి గోచరిస్తారు. ప్రతి శీర్షికలో ఒక కొత్తదనం, పద పదంలో మెత్తదనం, కవిత కవితలోచిత్తాన్ని కదిలిచే చిత్తరువులు, చిత్ర వైచిత్రిని నింపుకున్న భావ కల్పతరువులు దర్శనమిస్తాయి.

శ్రీ నివర్తి మోహన్ కుమార్, చార్టెడ్ ఎకౌంటెంట్
పురుషాధిక్య సమాజంలో గ్లాస్ సీలింగ్ బ్రద్దలుచేసి తమదైన ప్రత్యేకత నిలుపుకున్న భారతీయ వనితల్లో అరవిందారావుగారు కూడా ఒకరు. వీరు పరస్పర భిన్న ప్రవృత్తులను సమతుల్యము చేసుకుని జీవితాన్ని ఒక కళగా మలుచుకున్నవారు. ప్రస్తుత కవితాకదంబమే అందుకు సాక్ష్యం.

డా శారదాపూర్ణ శొంఠి షికాగో, యు.ఎస్.ఎ.
అరవింద గజల్ రచయిత్రిగా, సృజనాత్మక గేయరచయిత్రిగా, గాయనిగా పేరెన్నికగన్నారు. ఆమె వృత్తి ఉజ్వలం. ప్రవృత్తి అద్భుతం. ఆమె కవితలు భావ కవిత్వ ధోరణిలో సాగుతాయి. చదువరుల అంతరంగాన్ని సుతారంగా తాకి, ఊపి ఆమె అనుభూతిలో భాగమవుతాయి. భావకవిత్వ సమాలోచనకి ఈ కవితా సంపుటి బర్హిపింఛం.

నా ఈ కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు లోని కవితలు ఇకపై సిరిమల్లె పత్రికలో ప్రతినెలా పాటకులను అలరిస్తాయని నమ్ముతున్నాను.

నమస్కారములతో – పారనంది అరవిందారావు

Posted in May 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!