("A Coward" Guy de Moupaasant కథకు స్వేఛ్ఛానుసృజన:)
సత్యవీర విజయ మోహనక్రృష్ణ గారు రాజవంశీకులు. వారి పూర్వీకులు రాజ్యమేలిన వారు.
కానీ వీరి తండ్రి గారి సమయానికే అదంతా దాదాపుగా ముగిసిపోయి గత ప్రాభవంగా చెప్పుకోవటానికి మాత్రమే మిగిలిన చరిత్ర అయిపోయింది.
అయినా,ఆ రాచరికపు ఠీవి,దర్పమూ నరాల్లో జీర్ణించుకొన్న వారసులు సత్యవీరులు. మంచి స్ఫురద్రూపి. సంభాషణా చతురులు. పరపతి కాపాడుకోవటానికి ప్రాణమైన ఇచ్చే స్వాభిమానం మెండుగా ఉన్నవారు!
వారి పేరు ఆ ప్రాంతాల్లో, రాజావారనే! పై పెచ్చు ఆ చుట్టుపక్కల వంద మైళ్ళ పరిధిలో, వీరితో పోటీపడగల మొనగాడు ఎవరూ లేరు- కత్తివిద్యలో, పిస్టల్ పేల్చడంలో- అని మంచి ఖ్యాతి. వారి నడకలో ఆ ధీమా, ఆ విద్యా సంబంధియైన అహమిక కొట్టొచ్చినట్లు కనబడుతూంటుంది!
ఆయన అప్పుడప్పుడు దగ్గరివారితో, "నాతో ఎవడైనా పోటీకి ఉంకిస్తే, నా ఎంపిక,పిస్టలే", అంటూండటం కూడా కద్దే!!
***
ఆ రోజు రాజావారు, బాగా కావల్సిన ఇద్దరు యువ దంపతులతో సినిమాకి వెళ్ళారు. వారికి 10 సీట్లు కేటాయించిన ప్రత్యేక బాల్కనీ ఒకటి ఉన్నది ఆ హాల్లో. అక్కడ కూచుని షో అయిపోగానే, దగ్గరే ఉన్న "గొప్పవారికి" మాత్రం, ప్రవేశం ఉన్న అమ్రృతవిలాస్ కి వెళ్ళారు, సమిత్రంగా!
పెద్దదైన ఆ హాల్లో, అక్కడ ఇంకొంత మంది కూడా ఉన్నారు, అక్కడక్కడా టేబుళ్ళ దగ్గర కూచొని. కొంతమంది ఒంటరిగా, కొందరు జంటలుగా!
వెళ్ళిన కాస్సేపటికి, రాజావారు మూలనున్న టేబిల్ మీద కూచున్న వ్యక్తి, తదేకంగా తనతో వచ్చిన స్నేహితుడి యువ భార్య వైపు గుచ్చిగుచ్చి చూపులు సారించటం, చూశారు. అయిదు నిమిషాలు గమనిస్తూనే ఉన్నారు. అతని వైనంలో ఏ మార్పూ లేదు. రాజావారు ఇక ఓరిమి వహించ లేక పోయారు.
హఠాత్తుగా లేచి, ఆ వ్యక్తి బల్ల దగ్గర కెళ్ళి,
"చూడండి, మీ వాలకం, చూపు సరిగ్గా లేదు, ఆడవారి పట్ల! నేను అంతా చూస్తూనే ఉన్నాను, మీ నయన విన్యాసం! ధోరణి మార్చుకుంటే మీ కుశలానికే మంచిది" అన్నారు.
అతను సత్యవీరుణ్ణి తేరిపార చూసి,"నువ్వెవరివి చెప్పటానికి, ప్రతి జోగినాథం, నీతులు చెప్పేవాడే! నోర్మూసుకొని నడు ఇక్కడ నుంచి," అన్నాడు దురుసుగా!
ఆ ", నోరు మూసుకొని" అనేది నొక్కి పలుకుతూ, బిగ్గరగా అనటంతో, అందరి దృష్టి, వీరిద్దరి మీదే పడ్డది. తలలు తిప్పి చూశారు కొందరు, సీట్లలోంచి లేచి వివరంగా చూశారు కొందరు! మొత్తానికి అందరూ విన్నారు, కన్నారు, ఆ ద్రృశ్యాన్ని!
రాజావారికి చెడ్డ కోపం వచ్చింది. ఫెడీలుమని ఒక్క గుద్దు గుద్దారు, ఆ వ్యక్తి చెవుల మీద, గూబ గుంయ్ మనేట్టు!
అతను నిశ్చేష్టుడై ఉండిపోయాడు. కొందరు కల్గ జేసుకోవాలని చూశారు, కానీ వృథా అయింది.
***
తన భవనంలో అటు ఇటు పచార్లు చేస్తున్నారు రాజావారు, అసహనంగా!
దాదాపు అరగంట నుంచి! ఆలోచనలు సాగటల్లేదు, ఆవేశం అడ్డొచ్చేస్తోంది-బలంగా!
ఒక్క ఆలోచన మాత్రం గట్టిగా స్థిరపడ్డది వారి మెదడులో, ముఖా ముఖీ ఎదుర్కొనాల్సిందే ఆ వ్యక్తిని!
ద్వంద్వ యుద్దం అన్నమాట!
ఆ ధూర్తుడి ప్రవర్తనకి, తను చేసినది మంచి పనే అని రూఢి అవుతోంది వారికి, ఆలోచిస్తున్న కొద్దీ!
ఇది తప్పకుండా తనకు మంచి పేరు తెచ్చేదే అని ఒక నిర్ధారణకు కూడా వచ్చేశారు.
ఎట్టి పరిస్థితుల్లో ఈ అధ్యాయం, వాడికి గుణపాఠం చెప్పటంతో తప్ప ముగియకూడదు, అని నిర్ణయించేశారు, రాజా సత్యవీరులు!
***
ఈ పోటీ నిర్వహించగల, ఈ విద్య లో బాగా ప్రవేశం ఉన్న ఇద్దరిని నియమించుకోవాలి అనుకోగానే, ఆ క్షణమే వారి మదిలో మెదిలిన పేర్లు, సాటి రాజవంశీయ మిత్రులు, విక్రమ వర్మ గారు; స్థాయిలో కొంచెం తక్కువే అయినా, ఆర్మీ లో పనిచేస్తూ, ప్రస్తుతం సెలవులో ఉన్న చిరకాల పరిచితుడు, త్రినాథ్!
నేను కొన్ని గంభీరపు నియమాలు పెట్టి, పోటీ విషయం వీరిరువురి తో కబురు పంపించానా, ఆ అనామకుడు కాళ్ళ బేరానికి వచ్చి, క్షమాపణ అడగాల్సిందే-అని కూడా అనుకొని, కొంత తేరుకున్నారు, రాజావారు!
***
అయినా ఏదో తెలియని వింత ఆందోళన తారాడుతోంది వారి మదిలో!
ఎవరతను! ఎక్కడి వాడు?! ఎంత ధూర్తత్వం ఆ మనిషికి, మా సహచరులను అవమానించి, చివరికి మమ్మల్నే ఎదిరిస్తాడా?!
నిజానికి ఇది మాకు జరిగిన అవమానమే! మేము కదా మా స్నేహబృందాన్ని ఆహ్వానించి తీసుకొచ్చాము, ఎట్టి అవజ్ఞ వారికి జరిగినా అది మాకు జరిగినట్లే! కనుక ఆ మనిషి సాక్షాత్తు, మమ్ము ధిక్కరించినట్టే!
ఆఁ, ఏవిఁటీ ఆ మనిషి పేరు?!
తాము విలాస్ లో తీసుకున్న అతని కార్డుని మళ్ళీ మళ్ళీ తదేకంగా చదివి, ఆ పేరు చూశారు రాజావారు.
అసలు ఆ పేరే నచ్చలేదు వారికి- "ప్రబల వీర కుమార్" ట!
"చూస్తాము ఏ పాటి వీరుడో", అని అనుకున్నారు.
ఆ కార్డు లోపల పెట్టబోయి, అదేదో ఆ కాయితం ముక్కే ఆ అపరిచితుడైనట్టు, దాన్ని కత్తితో మధ్యన పొడిచారు. ఉక్రోషం కాస్త చల్లారినట్లయింది. అంటే, తాము కత్తి పట్టాల్సిన సమయం వచ్చిందన్న మాట!
ఆహా, ఎంత కాలానికి! కత్తితో ద్వంద్వ యుద్దం అయితే, కాస్త ప్రమాదం తక్కువ! తెలిసి తెలిసి, ఇట్లాంటి పోటీల్లో, ఎవరూ అంత ప్రాణాపాయం వచ్చేట్టు, తీవ్రంగా పొడవరు! పిస్టల్ అని చెప్పటమే సరియైనది అనుకుంటా!
ఒకటి, అందులో మన నైపుణ్యానికి తిరుగు లేదు, ఇంకోటి పిస్టల్ అనగానే ఆ "ప్రబలుడు", జంకి,ముందే తెల్లజెండా చూపించేయ వచ్చు!
అట్లా అయితే, అసలు గొడవే లేదు, పోటీయే ఉండదు, విజయం మనదై పోతుంది.
***
ఇంత ధీరసాగా అనుకుంటున్నా వారి మదిలో ఏదో అనుమానపు పురుగు సన్నగా తొలుస్తూనే ఉంది!
దాహం వేసినట్లయి, రెండు గ్లాసులు మంచి నీళ్ళు తాగారు.
ఇది రెండోసారి ఇట్లా తాగటం! సరే పడుకుందాం, అని పడకకు ఉపక్రమించారు.
***
నిద్ర అనేది పిలిస్తే వచ్చేదా, ఆలోచనలు రొద చేస్తున్న మనిషికి?!
అటు తిరిగీ, ఇటు తిరిగీ, ఏం చేసినా నిద్ర పట్టలేదు వారికి. హఠాత్తుగా బుర్రలో ఒక కొత్త సందేహం తలెత్తింది.
మాది భయమా?! మేము నిజంగానే భయపడుతున్నామా?! ఏమో అర్ధం కాలేదు,ఇదమిత్థంగా!
ఒక మనిషికి ఒక పక్క భయం, ఒక పక్క తెగువా, రెండూ ఉంటాయా ఏకకాలంలో?!
వారికి తెలియలేదు, తమ అంతరంగం, ఆ క్షణంలో!
వెళ్తాం సరే పోటీ స్థలానికి! తీరా వెళ్ళిన తరువాత, కళ్ళు తిరిగి పడిపోతే, కాలు చేయి ఆడకపోతే?!
ఇంత పరువూ, ప్రతిష్ఠా గంగలో కలిసిపోతుందే!
ఈ ఆలోచన రాగానే, వారి గుండె చప్పుడే వారికి పెద్దదిగా, ఆందోళన కలిగించేదిగా అయిపోయింది.
హఠాత్తుగా పక్క మీద నుంచి లేచి, లైటు వేసి, అద్దంలో తమ మొహం చూసుకున్నారు.
చూసుకుని, విస్తు పోయారు, ఇదేమిటి, ఇంత బలహీనంగా కనిపిస్తున్నాము?! మేమేనా ఇది?!
మొదటి సారి తమని తాము సరిగ్గా చూసుకున్న భావన కలిగింది, వింతగా! ఎల్లుండి జరుగబోయే ఆ పోటీలో ఆ మనిషి గెలిస్తే,...అంటే తాము ఓడిపోతే?! ఆ ఆలోచనే దుస్సహమై నిలదీసింది.
ఈ పోటీలో ఓడటం అంటే, అంతమేగా, మానసికంగా తమ మరణమేగా?! అంటే ఎల్లుండి ఈ టైముకి తాము శవం అయి, ఇదే పరుపు మీద పడి ఉంటామా?!
ఈ ఆలోచన వారిని బిర్ర బిగుసుకు పోయేట్టు చేసేసింది! ఇక అక్కడ నిలవలేక పోయారు! పక్క, పరుపు వైపు చూడనే లేకపోయారు.
నిద్ర ఎటో వెళ్ళిపోయింది!
అశాంతిగా, పక్క గదిలోకి వెళ్ళారు, శరీరం చల్లబడ్డట్టూ, చేయి వణుకుతున్నట్టు అనిపించింది!
అనిపించటం మేమిటి, స్పష్టంగా వణుకుతూ, కనిపించింది!
పోనీ నౌకరుని పిలుద్దామా అనుకుని గంట కొట్టబోయి, ఆ ప్రయత్నం మానుకున్నారు.
పనివాడు ఈ సమయంలో వస్తే, తమ భయం,ఆందోళన తెలిసిపోవూ?!
ఎంత నామోషీ!
కానీ బుద్ధి స్థంభించినట్టూ, కాయం మొద్దుబారినట్టు, అనిపించసాగింది.
ఏది ముట్టుకున్నా, ఏ చిన్న శబ్దం వచ్చినా, ఏదో తెలియని భయం ఆవరించసాగింది. ఈ కనిపిస్తున్న శరీరం, ఈ సత్యవీర అనే మేము, ఎల్లుండి ఈ సమయానికి ప్రాణాలతో ఉండమా?!
ఏవిఁటీ మార్పు, ఏమయింది, ఏమవబోతోంది-వారికి అంతా గందరగోళంగా కనిపించసాగింది!
***
ఇట్లా కాదని లేచి ఒళ్ళు విరుచు కొని, కిటికీ తెరిచి చూశారు.
అప్పుడే తెలవారబోతోంది. సన్నని వెలుగు రేఖలు, చల్లని గాలితో వారికి తగిలాయి. ఏదో కొత్త వెలుగు తమలో ప్రవేశించినట్లై, కాస్త మునుపటి ధైర్యం చిక్కినట్టైంది.
ఛీ ఏమిటిది, ఇట్లా ఆలోచిస్తున్నాము, ఏమీ కాని దానికి ఊరికే భయపడుతున్నాము అనుకొని, ముఖం కడుక్కుని బయటకు నడిచారు. మేము మానసికంగా గట్టిగా ఉంటాము, మాకు ఏ భయమూ లేదని నిరూపించాలి.
అవును నిరూపించాలి అని పది సార్లు చెప్పుకున్నారు తమకు తామే!
***
ఇంతలో సహాయకు లిద్దరూ వచ్చారు.
నమస్కారాల తరువాత, "మీరు ఖచ్చితంగా పిస్టల్ తోనే కదా అంటున్నది", అని రాజావారిని అడిగారు.
"ఖచ్చితంగా అంతే, తీవ్ర గాయం అయ్యేవరకు కాల్పులు, సిగ్నల్ దగ్గర చెయ్యి పైకి పెట్టాలి, కిందకు కాదు, ఇవే కండీషన్లు." అన్నారు రాజావారు!
"ఇష్టమై ధైర్యముంటే రమ్మనండి, లేదా క్షమాపణలు చెప్పి విరమించుకోవచ్చు! ఆ ఎంపిక అతనికే ఇస్తున్నాం", రాజావారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు!
వీలైనంత హుందాగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు వారు, లోని సంఘర్షణ బయట కనబడకుండా!
"ఓహ్, గొప్పగా, ధర్మంగా పెట్టారు నియమాలు, రాజావారికి, అభినందనలు" అన్నారిద్దరూ!
"విజయం మీదే", అని కూడా ఉత్సాహంగా చెప్పి వెళ్ళారు.
***
తన గదికి వచ్చిన రాజా వారికి, వారిద్దరు ఉన్నపుడు ధైర్యంగా అనిపించినా, మళ్ళీ భయం ఆవరించ సాగింది.
చాలా సేపు మంచం మీదే ఊరికే బేల చూపులు, గోడ కేసీ, తలుపులకు కేసీ చూస్తూ కూచున్నారు.
ఒక సన్నని వణుకు ప్రతి అవయవానికి పాకుతున్నట్టు అనిపించ సాగింది.
ఇక తట్టుకోలేక, ఒకదాని తరువాత ఒకటిగా ఆరు గ్లాసుల రమ్ తాగేశారు. ఏదో మత్తు, ఆవరించ సాగింది శరీరమంతా! అంతా తలకిందులుగా అనిపించి, కనిపించసాగింది.
"భయం" అనేది, ఏ భూతం కంటే, ఏ మాదకపానీయాల కంటే, మహా బలవత్తరమైనది కదూ, ఆయనను వశపరచేసుకున్నది.
మొత్తంగా!
***
రోజంంతా ఆ మత్తులోనే గడిచి పోయింది వారికి.
సాయంకాలం దాటిపోయింది.
రాత్రి చీకట్లు, క్రమంగా తమ స్థానం ఆక్రమించేసినై!.
***
గది బెల్ మోగింది. తలుపు దగ్గరకు వెళ్ళటానికి కూడా ఓపిక లేకపోయింది రాజా వారికి.
నోటితోనూ ఏమి చెప్పలేదు, తమ ఆరిన గొంతులో నుంచి అసలు మాట వచ్చేట్టు లేదు!
ఇంతలో తలుపు దగ్గరగానే వేసి ఉండటం వల్ల, సహాయకులిద్దరూ నిశ్శబ్దంగా ప్రవేశించారు.
"అంతా పూర్తి అయిపోయింది రాజావారూ, అన్నిటికీ ఒప్పుకున్నాడు అతను, రేపే మన అసాధారణ సంఘటన!
"మీరు సిధ్ధమేగా, అన్ని విధాలా", అని అడిగారు వారు.
ఆ గదిలోని నిశ్శబ్దాన్నీ, రాజావారి మదిలోని రొదనూ చీలుస్తూ వచ్చిన ఆ ఇద్దరి మాటలూ, రాజా వారిని ఉలిక్కిపడేలా చేసినట్లైంది, ఒక క్షణం పాటు!
ప్రయత్నపూర్వకంగా తేరుకుని, "ఓ, భేషుగ్గా" అని జవాబిచ్చారు!
"అయితే మేం బయలుదేరుతాం ఇక, మిగతా చిన్న చిన్న ఏర్పాట్లు చేయాలి కదా", అంటూ వారు సెలవు తీసుకొని, వెళ్ళిపోయారు.
***
ఏకాంతంగా మిగిలిపోయిన సత్యవీరుల వారికి మళ్ళీ వివశత్వం ఆవరించసాగింది.
నౌకరు లైట్లు వేసి వెళ్ళిపోయాడు.
ఏదైనా రాద్దామని టేబిల్ దగ్గర కూచున్నారు సత్యవీర గారు!
ఒక కాయితం పైన వ్రాసి ఉంది:
"ఇది నా నిర్ణయం", అని!
చదివి పక్కకు నెట్టేశారు.
ఏమీ వ్రాయలేదు.
వ్రాయటానికి మనస్కరించలేదు.
***
ఆయన ఆలోచనలు యథేఛ్ఛగా పోసాగాయి.
"ఏ అభ్యంతరం చెప్పకుండా అన్ని నియమాలకు ఒప్పుకున్నాడా ఆ వ్యక్తి!
అబ్బా, అతను ఎంత ఘటికుడో, ఈ విద్యలో!"
లోకల్ షూటర్స క్లబ్ వారి ఇటీవలి ముద్రణలో చూశారు ఆ పేరు కోసం!
"ప్రబలకుమార్", పేరు ప్రముఖ షూటర్ల జాబితాలో లేదు.!
ఎక్కడా కనిపించలేదు.
***
ఒక లెదర్ కేస్ తెరిచి అందులో నుంచి ఒక పిస్టల్ తీశారు.
అది పట్టుకొని, పేలుస్తున్న పోజులో నుంచొని, తమను చూసుకున్నారు.
నుంచున్నారే కానీ, వణికే కాళ్ళతో- స్థిరంగా ఉండలేక పోయారు!
బ్యారెల్ అన్ని వైపులా తిరుగుతునట్టు అనిపించింది, చేయి పట్టు తప్పడంతో!
ఆ క్షణంలో, పెద్దగా అన్నారు, భయంతో వశం తప్పి,:
"లేదు మా వల్ల కాదు, ఈ పోటీ మేము చేయలేము" అని!
ఆ బ్యారెల్ కొస వైపు, ఆ రంధ్రం వైపు చూసి అనుకున్నారు, "ఇదే మ్రృత్యుద్వారం" అని!
తాము పోటీలో పాల్గొనలేక విరమించుకుని, ఆ రకంగా ఓడిపోతే-రాబోయే పేపర్ల శీర్షికలు, ఆడవారి పకపక లు, మగవారి చిన్న చూపులు!
అందరిలో ఒక నిరసన భావన- అన్నీ వారికి కళ్ళ ముందు కదలాడి, కనిపించి, వినిపించి, నాట్యం చేసినయ్!
"ఆ అవమాన భారం, అయ్యో, మరణం కన్నా ఘోరం!" అనుకున్నారు!
***
ఇంకా పిస్టల్ వైపే చూస్తున్న వారి కంటికి, హామర్ కింద ఎర్రని మంట లాగా వెల్గుతూ ఒక టోపీ కనపడ్డది.
అదృష్టమో, మరపో, పిస్టల్- బుల్లెట్లతో లోడ్ అయి ఉండటం గమనించారు.
ఒక అర్ధం చెప్పలేని, అర్ధం కాని ఆనందరేఖ వారి కళ్ళల్లో మెరిసింది, ఆ పేల్చడానికి సిద్ధంగా ఉన్న మారణాయుధాన్ని చూసి.!
***
ఎదిరి పక్షం సమక్షంలో సరిగ్గా పట్టుకోలేకపోయినా, ధైర్యం సన్నగిల్లి కనబడ్డా- అంతే!
తన పరువు ఊడ్చి పెట్టుకుని పోయినట్టే! మిగిలేది అవహేళనలు, ధిక్కార స్వరాలు, అపకీర్తి!
కానీ ధైర్యంగా ఉండటానికే మేము ప్రయత్నిస్తాము. ధైర్యంగానే ఉన్నాము,
ధైర్యంగా నే.......
***
హఠాత్తుగా పిస్టల్ తీసి, నోట్లోకి బ్యారెల్ పూర్తిగా పోనిచ్చి, ట్రిగ్గర్ బలంగా నొక్కేశారు!
***
ఆ పెద్ద పేలుడు శబ్దానికి, నౌకరు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి, తాను చూసిన దానికి నిశ్చేష్టుడై నిల్చుండిపోయాడు!
వెల్లకిలా చచ్చిపోయి పడి ఉన్న సత్యవీర రాజావారినీ, నెత్తురు చిమ్మిన టేబుల్ మీద ఉన్న తెల్లకాగితాన్ని,
ఒక ఎర్రటి నెత్తుటి చార కింద ఈ మూడు మాటలనూ చూశాడతను, చేష్టలుడిగిన వాడై:
"ఇదంతా నా నిర్ణయం"!