Menu Close
Venkat Nagam
మన ఊరి రచ్చబండ
-- వెంకట్ నాగం --

చెప్పేవాడికి చాదస్తం ఉండొచ్చు గాని వినేవాడికి వివేకం ఉండాలి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ఆపరేషన్ సింధూర్ తరువాత భారత్ పై పలు మార్లు కవ్వింపు వ్యాఖ్యలకు పాల్పడ్డారు. భారత్ పాక్ ఇరు దేశాలపై టారిఫ్ వేస్తానని బెదిరించి కాల్పుల విరమణ కు ఒప్పించానని దాదాపు నలభై సార్లు మీడియా సాక్షిగా ఆయన ప్రపంచానికి చాటింపు వేసారు. భారత్‌పై 50 శాతం సుంకాలతో విరుచుకుపడ్డ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన స్థాయికి తగినట్లుగా కాకుండా పొంతనలేని వ్యాఖ్యలు భారత్ పై చేశారు. భారత్ ఆర్థిక వ్యవస్థ ను డెడ్ ఎకానమీగా అభివర్ణించిన ట్రంప్ తాజా వ్యాఖ్యపై స్పందించవలసినదిగా ప్రస్తుత సాంకేతిక యుగంలో కృత్రిమ మేధ (ఏఐ) ను ప్రశ్నించగా, అది ఇచ్చిన సమాధానాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. "భారత్ ఆర్థిక వ్యవస్థ పతనం కాలేదు. అది డైనమిక్. ఎంతో ప్రతిష్ఠాత్మకమైనది" అని చాట్‌జీపీటీ పేర్కొంది. "లేదు. భారత్‌ది డెడ్ ఎకానమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఇది ఒకటి" అని గ్రోక్ ఏఐ తెలిపింది. "భారత ఆర్థిక వ్యవస్థ బలంగా వృద్ధి చెందుతోంది" అని జెమిని ఏఐ సమాధానమిచ్చింది. వాదనకు నిలబడలేని రాజకీయ పూరితమైన "డెడ్ ఎకానమీ" వ్యాఖ్యల మూలంగా ఇరు దేశాల మధ్య పరస్పర అనుమానాలు నెలకొనే పరిస్థితి ఉంది. భారత్ తాజాగా తన పాత మిత్రుల వైపు చూడడానికి అపనమ్మకం ముఖ్య కారణం. కాకాలు తీరిన అమెరికా రాజకీయ విశ్లేషకులు ఈ విషయమై ట్రంప్ ను మీడియా సాక్షిగా దుమ్మెత్తి పోస్తునారు - భారత్ ఇక అమెరికా ను నమ్మడం కష్టం అని వారు నిందిస్తున్నారు. అదీ పరిస్థితి.

భారత్ పై దుందుడుకు వ్యాఖ్యలు చేసి దశాబ్దాల తరబడి భారత్ ను చైనా, రష్యా నుండి దూరం చెయ్యడానికి అమెరికా పడిన కష్టాన్ని ట్రంప్ ముందు చూపులేని చర్యలతో స్వల్ప సమయంలో నేలపాలు చేసాడని పలువురు అమెరికా విశ్లేషకులు నిందిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతను పెంచుతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. దీనిపై నెటిజెన్లు కూడా ట్రంప్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు ఇటు అమెరికాలో, అటు భారత్ లో ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా మాట్లాడుకునే విషయాలలో ట్రంప్ టారిఫ్ విషయం తప్పకుండా చోటుచేసుకుంటుంది. అమెరికాలో నేను నివాసం ఉండే వీధిలో ఉండే ఒక నేపాలీ వృద్ధుడు రెండు రోజుల క్రితం టారిఫ్ విషయమై నా అభిప్రాయం అడిగాడు - అంటే టారిఫ్ ల పరిస్థితిని మీరే అంచనా వెయ్యవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సదరు నేపాలీ అమెరికన్ ను నేను అడిగాను..."అయ్యా మీ దేశంపై ట్రంప్ ఎందుకు టారిఫ్ లు వెయ్యడు" అని. పెద్దగా నవ్వి ఆయన నాకు చెప్పిన సమాధానం.."నేపాల్ లో ఏముంది ట్రంప్ తీసుకోవడానికి!".

ప్రధానంగా భారత్ పై ట్రంప్ విధించిన 25% అదనపు సుంకం (మొత్తంగా 50%) ఆగస్టు 27, 2025 ఉదయం 9:30 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే 48 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రధానంగా ఆభరణాలు, చెప్పులు, రొయ్యలు, జౌలీ వస్తువులు, దుస్తువులు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక మెడిసిన్, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులకు దీని నుంచి మినహాయింపు లభించింది.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ పలు మీడియా సమావేశాలలో వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ప్రధాని మోదీతో మాట్లాడానని ఇరుదేశాల మధ్య ఏం జరుగుతుందో తెలుసుకొని ఉద్రిక్తత ఇలాగే కొనసాగితే ఇరుదేశాలతో మేము ఎలాంటి వాణిజ్యం చేసుకోము. అంతేకాదు దిమ్మతిరిగే సుంకాలు కూడా విధిస్తామని తాను హెచ్చరించానని. ఈ నేపథ్యంలోనే భారత్ పాక్‌కు మధ్య యుద్ధం ఆగిపోయిందని ఆయన నమ్మబలికారు. ఏటా జీడీపీ వృద్ధి భారత్ కు 7 ఏడు శాతం ఉందగా, అమెరికా వృద్ధి 2 శాతమేనని ఆర్ధిక నిపుణులు బల్ల గుద్ధి చెబుతున్నారు. దీన్ని బట్టి "బడాయి బండెడు - బ్రతుకు తట్టెడు" సామెతను మనం గుర్తు చేసుకోవాలేమో? ఈ నేపధ్యంలో ట్రంప్ నాలుగు మార్లు మోదీకి ఫోన్ చేసినా కూడా మోదీ ఫోన్ తీయకపొవడం, పైగా 50% సుంకాలను భారత్ ఖాతరు చెయ్యకపోవడంతో ఎవరికి దిమ్మతిరిగిందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఒకటి రెండు మీడియాలు మినహా, మిగతా ప్రధాన అమెరికా మీడియాలు భారత్ పై టారిఫ్ ల విషయంలో ట్రంప్ వైఖిరిని తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

ఇదిలా ఉండగా రెండు దేశాల మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో ఏడు విమానాలు కూలిపోయినట్లు కూడా ఆయన ఒక మీడియాతో చెప్పారు. ఒక్కోక్కటి 150 మిలియన్ యుఎస్ డాలర్ల విలువైన ఏడు విమానాలు కూలిపోయాయని చెపారు. వీటిలో చైనా నుండి పాక్ తెచ్చుకున్న రాడార్లను అయోమయం కు గురిచేయడానికి భారత్ ప్రయోగించిన  డెకాయిట్ (ఉత్తుత్తి) విమానాలను కూడా ఆయన లెక్కించారో లేదో తెలియదు. ట్రంప్ గత మూడు నెలలుగా భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని పదే పదే వ్యాఖ్యలు చేస్తూనే వచ్చారు. మరోవైపు భారత్ కూడా ఈ వాదనను తిరస్కరించింది. భారత్ పాక్ ల మధ్య మూడో పక్షం కు చోటు లేదనే తమ వైఖరిని భారత్ స్పష్టంగా వివరించింది కూడా. పాక్ అభ్యర్ధన మీర ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు భారత్ వెల్లడించింది. పైగా ఈ విరమణ తాత్కాలికమేనని కూడా భారత్ ప్రకటించింది. ఈ విషయమై తనను విస్మరించినందుకు ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం అయి ఆనక భారత్ పై 50% టారిఫ్ విధించారని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని లైట్ తీసుకున్నారా? లేకపోతే ట్రంప్ విధిస్తున్న టారిఫ్ లకు సింబాలిక్ గా నిరసన తెలిపారా? దీనికి సంబంధించి ఓ కొత్త అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. ట్రంప్ నాలుగు మార్లు కాల్ చేస్తే మోదీ పట్టించుకోలేదని జర్మనీకి చెందిన ఫ్రాంక్ ఫర్టర్ అల్జిమైన్ జీతంగ్ పత్రిక రిపోర్ట్ చేసింది. భారత్ పై భారీగా టారిఫ్ లు విధించడం, పాకిస్థాన్ కి స్నేహ హస్తం చాచడం వంటి చర్యల కారణంగా భారతదేశంలో ట్రంప్ పై తీవ్ర వ్యతిరేకత నెలకొందని జర్మనీ న్యూస్ పేపర్ తన కథనంలో పేర్కొంది.  జపాన్ న్యూస్ పేపర్ నికేయ్ ఆసియా కూడా దాదాపుగా ఇదే తరహా కథనం ప్రచురించింది. తన ఫొన్ కాల్స్ మోదీ ఆన్సర్ చేయకపోవడంతో ట్రంప్ అసహనం మరింత పెరిగిందని ఆ పత్రిక పేర్కొంది. అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గలేదని, ఓ రకంగా ట్రంప్ పిల్ల చేష్టలు భారత్ కు అవమాన కరంగానూ, ఒత్తిడి పెంచేవిగా ఉన్నాయని జర్మన్ పేపర్ రిపోర్ట్ చేసింది. బహుశా అందుకే మోదీ.. ట్రంప్ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేదని, అమెరికా అధ్యక్షుడి చేష్టలు, పొంతనలేని వ్యాఖ్యలు తమకు ఇబ్బంది కలిగిస్తున్నాయనే బలమైన సంకేతాలు పంపేందుకే అలా చేశారని పేపర్ లో రాశారు.

ఒకవైపు పాకిస్థాన్ తో అంటకాగుతూ, మరోవైపు  భారత్ మీద టారిఫ్ లు విధించడం కూడా ట్రంప్ మీద భారత్ వైఖిరిలో తీవ్ర మార్పు తెచ్చింది. గత మూడు నెలలుగా ఈ విషయమై చాల పరిణామాలు వేగవంతంగా చోటు చేసుకున్నాయి. భారత్ విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం.. టారిఫ్ లు విధించడం.. పాక్ జనరల్ కు రెడ్ కార్పెట్ పరచడం.. యుద్ధాన్ని తానే ఆపానని పదే పదే చెప్పడం లాంటి చర్యలు పట్ల ట్రంప్ మీద భారత్ ధోరణి మార్పుకి కారణమైంది. కానీ ఈ విషయలో అమెరికా ప్రధాన మీడియా ఆలస్యంగా మేల్కొంది. ఆపరేషన్ సింధూర్ పిదప పాక్ సైనికాధ్యక్షుడు "అసిం మునీర్" ను ట్రంప్ అమెరికాకు ఆహ్వానించి పెద్ద పీట వేసినప్పుడే అమెరికా  మీడియా మేల్కొని ఈ విపరీత ధోరణలు ఖండించి ఉన్నట్లయితే ట్రంప్ దూకుడుపై అమెరికా సమాజంలో ఈ పాటికి సమగ్ర చర్చ జరిగి ఉండేది, ట్రంప్ దూకుడు కు కొంత కళ్ళెం పడేది. అయితే సదరు మీడియా సంస్థలు "అసిం మునీర్" - ట్రంప్ సమావేశం ను కేవలం ఒక వార్తగా ప్రచురించడం వల్ల వారు పరిస్తితి తీవ్రతను అంచనవెయ్యడంలో పొరబడ్డారు అని తెలుస్తుంది. జీ7 సదస్సు కోసం మోదీ కెనడాకు వెళ్లినప్పుడు ట్రంప్ ఫోన్ చేసి, ఎటూ కెనడాకు వచ్చారు కావున వాషింగ్టన్ మీదుగా వెళ్లాలని సూచించారని, విందులో పాల్గొని చర్చించుకుందామని చెప్పారని, కానీ అమెరికా పర్యటనకు రావాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన సదరు ఆహ్వానాన్ని తాను సున్నితంగా తిరస్కరించానని, ఒడిశా పర్యటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు విషయం ఇప్పుడు విశ్లేషకులు ఇప్పుడు బయట పెట్టారు - పాక్ సైన్యాధ్యక్షుడు "అసిం మునీర్" అమెరికాలో ఉన్నప్పుడే, మోదీ ని పిలిచి ఆనక ఇద్దరితో తన ఓవల్ ఆఫీసులో ఫొటో దిగాలనే ట్రంప్ ప్లాన్ కు మోదీ గండి కొట్టారని వారు అంటున్నారు.

ఒక ముల్లు తీయడానికి ఇంకో ముల్లునే వాడాలి. అయితే ట్రంప్ టారిఫ్ ల విషయంలొ అమెరికా దిగుమతులపై ప్రతీకార టారిఫ్ లు విధించి - ఇప్పుడు ఉన్న ఉద్రిక్తతలు మరింత పెంచే కంటే భారతీయ ఉత్పత్తులు వేరే దేశాలకేమన్నా ఎగుమతి చేసే అవకాశం ఉందో తెలుసుకోవడానికే ప్రస్తుత భారత ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది.

అయితే కొందరు నెటిజన్లు – ‘పరిస్థితి ఇంతవరకు తీసుకురావడం ఎందుకు, నీ ఇగో కోసం పోనీలే అన్నా, సరే నువ్వే యుద్ధం ఆపించినావు’ అంటే ఏమి పోయింది. రెండు దేశాల్లో జనాలకి టారిఫ్ వాతలు తప్పేవి అని వ్యాఖ్యానిస్తున్నారు. "ట్రంప్ అన్నా - నువ్వు నీ దౌత్యం సూపర్" అని ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతి కి  ప్రతిపాదిస్తూ భారత్ ఒక నామినేషన్ పడేస్తే పరిస్థితి మరోలా ఉండేదని వీరు బల్ల గుద్ది వాదిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది. సిమ్లా ఒప్పందం ప్రకారం భారత్ - పాక్ ల మధ్య మూడో పక్షానికి తావేలేదు. ఈ విషయంలో భారత్ గత ప్రభుత్వాల వైఖిరికి భిన్నంగా వ్యవహరించే అవకాశం లేదు.

మా ఇంటికి వస్తే మాకేం తెస్తావ్, మీ ఇంటికి వస్తే మాకేం పెడతావ్ - ఇదీ ట్రంప్ వరస. స్వంత దేశ దీర్ఘకాల ప్రయోజనాలు పక్కనపెట్టి వ్యాపార ప్రయోజనాలే ముఖ్యంగా ఆయన వ్యవహరించే విపరీత ధోరణితో ప్రస్తుత సమస్యలు ఉత్పన్నమైనాయి అని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఒక అంతర్జాతీయ నాయకుడి ఫోన్ కాల్‌ను పట్టించుకోకపోవడం అనేది చాలా అసాధారణమైన సంఘటన. పాత రోజుల్లో ఇది జరిగితే, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలలో పెద్ద సంక్షోభం తలెత్తేది, కానీ ఇప్పుడు భారత్ అమెరికా విషయంలో అలాంటిదేమీ జరగలేదు. అంటే అటు అమెరికా దౌత్య వర్గాలు కూడా ట్రంప్ ఫోన్ కాల్స్ ను మోదీ తీయలేదు అనే విషయాన్ని పట్టించుకోలేదా? బహుశా అవుననే చెప్పాలి. కానీ అమెరికా ప్రధాన మీడియా ఈ విషయమై ట్రంప్ ను ఇంకో మూడు ఏండ్లు వేధించే అవకాశం ఉంది. చేసుకున్నవాడికి చేసుకున్నత మహాదేవ అంటే ఇదేనేమో! ట్రంప్ ప్రపంచంలోనే అత్యంత శకివంతమైన వ్యక్తి, కానీ ఆయన అత్యంత చిల్లరగా అలా వ్యవహరించడం వలన మోడీ ఫోన్ తీయలేదు అని మోదీ మద్దతుదారులు వాదిస్తున్నారు. వదురుబోతుతనానికి మౌనంగా ఉన్నవాడే సరైన మొగుడు - ఈ తెలుగు సామెత మౌనం పాటిస్తున్న మోదీ వైఖిరికి అద్దం పడుతుంది.

డోంట్ కేర్.. తాడో పేడో తేల్చుకుందాం..అనే వైఖిరి అవలంబించి ట్రంప్ కి షాక్ ఇవ్వాలన్న వారికి కొదువలేదు, కానీ కానీ ప్రస్తుతానికి వేచి చూసే వైఖిరి ఉత్తమం అని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. ఇలాంటి పరిస్థితుల్లో మన భారతీయులు అందరం ఐక్యం గా ఉండాలి. స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేసుకుంటూ.. ప్రపంచదేశాలకు భారత దేశ శక్తి చూపించాలి. ఎగుమతులు, దిగుమతులపై ఒకే దేశం పై ఆధారపడడం తగ్గించుకోవాలి. దీర్ఘకాల మిత్రుడైన రష్యా తో సంబంధం ఇంకా పెంచుకోవాలి.

ఏతా వాతా భారీ టారిఫ్ ల నేపధ్యంలో ప్రస్తుత పరిస్థితి కొంత వేదన కలిగించినా, గత 40 ఏండ్లుగా తెలుగు దిన పత్రికల మొదటి పేజీ, సంపాదకీయాలు క్రమం తప్పకుండా చదువుతున్న పాఠకుడిగా నాకు ప్రస్తుత పరిణామాల సుడిగుండంలో భారత్ వైఖిరి చూస్తుంటే చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడుని కలవాలంటే పెద్ద ఎత్తున లాబీయింగ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అదే అమెరికా అధ్యక్షుడిని నువ్వెంత అనే ఎత్తున ఉన్నందువల్ల మన ప్రాభవం పెరిగిందనే చెప్పాలి. గుడ్డిగా ఎదిరించి ఉన్న సమస్యను మరింత జఠిలం చెయ్యమని నేను చెప్పడం లేదు, కానీ ఎదిరించే స్థాయికి చేరడం ముఖ్యం కదా! ప్రపంచంలో బలమైన దేశాలతో దౌత్యం కు ఇది మరీ ముఖ్యం. బ్రిక్స్ దేశాల కూటమిలో భాగస్వామిగా భారత్ బ్రిక్ కరెన్సీ ని ఎంత తొందరగా వస్తే తీసుకు వస్తే అంత మంచిది. అప్పుడు డాలర్ తో సంబంధం లేకుండా, బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ కరెన్సీ తోనే వ్యాపార లావాదీవీలు జరుపుకున్నే అవకాశం ఉంది. అసలు బ్రిక్స్ దేశాలలో భారత్ చేరడం ఇష్టం లేని ట్రంప్ 50% శాతం టారిఫ్ లకు తెగించాడనే వాదన కూడా ఒకటి ప్రచారంలొ ఉంది.

చాలామంది భారత ఎగుమతిదారులు 10–15 శాతం సుంకాన్ని కూడా భరించలేమని చెబుతున్నారు. ఇక 50 శాతం సుంకాన్ని భరించడం వారి సామర్థ్యానికి మించినది. భారతదేశ అతిపెద్ద ఎగుమతి మార్కెట్ అమెరికా. భారత్ తన వస్తువులలో 18 శాతం అమెరికన్ మార్కెట్‌కు ఎగుమతి చేస్తుంది. ఇది భారత జీడీపీలో 2.2 శాతం. 50 శాతం సుంకం విధింపు అనేది భారత్ జీడీపీ అంచనాలలో 0.2 నుంచి 0.4 శాతం తగ్గడానికి కారణం కావొచ్చు. ఈ అంచనాలతో బహుశా సుంకాల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అని విశ్లేషకుల అభిప్రాయం.

ప్రస్తుత పరిస్థితిలో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే ట్రంప్ మోడీని ఒప్పించడానికి ఆయన పదేపదే చేసిన ప్రయత్నాలు. తాను 50% శాతం టారిఫ్ విధించి చివరకి దాన్ని బేరసారాల పేరుతో 25% శాతం కు తగ్గించి అటు అమెరికాలో ఇటు భారత్ లో పేరు కొట్టేద్దామనే ఒక పధకం దాగుందని ఒక విశ్లేషణ.

అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికాపై ఆయా దేశాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు పోస్టల్‌ సర్వీసులను నిలిపివేస్తూ పలు దేశాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ జాబితాలో ఇప్పటివరకూ 25 దేశాలు చేరాయి. భారత్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 25 నుంచి భారత్ అమెరికాకు పోస్టల్ సేవలను నిలిపివేసింది. జూలై 30, 2025న అమెరికా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా భారత్ తో పాటు 25 దేశాలు పోస్టల్‌ సర్వీసులను నిలిపివేసినట్లు యూఎన్ లోని యూనివర్సల్‌ పోస్టల్‌ యూనియన్‌ తాజాగా వెల్లడించింది. పోస్టల్‌ ప్యాకేజీలపై అమెరికా పన్ను మినహాయింపు ఉపసంహరించుకున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా భారత్ తో పాటు ఇప్పటివరకు 25 దేశాలు అమెరికాకు పోస్టల్‌ సర్వీసులు నిలిపివేసినట్లు యూఎన్ విభాగం స్పష్టం చేసింది. ఇప్పటికే భారత్‌ సహా ఫ్రాన్స్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, నార్వే, స్విట్జర్లాండ్‌.. దేశాలు ఈ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జులై 30న అమెరికా యంత్రాంగం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం.. 800 డాలర్ల విలువైన వస్తువులపై ఉన్న పన్ను మినహాయింపులను ఉపసంహరించుకుంది. దీనికి తోడు భారత్ న్యూ ఢిల్లీ నుండి అమెరికా రాజధాని నగరమైన వాషింగ్టన్ డీ.సీ కు వెళ్ళే ఎయిర్ ఇండియా విమాన సర్వీసును  సాంకేతిక కారణాల పేరుతో రద్దు చేసింది - తద్వారా టారిఫ్ ల వ్యవహరం ముదిరి పాకాన పడిందని మనందరికీ తెలుస్తుంది.

ఉక్రెయిన్- రష్యా మధ్య మూడేళ్లకు పైగా జరుగుతున్న యుద్ధాన్ని నిలిపివేసేందుకు రష్యా ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టాలని ట్రంప్ భావించారు, అందుకు భారత్ ను లక్ష్యంగా చేసుకున్నారు అని కొంతమంది విశ్లేషకులు బల్ల గుద్ది చెబుతున్నారు. ఈ క్రమంలోనే రష్యా నుంచి అధిక మొత్తంలో చమురును కొనుగోలు చేస్తున్న భారత్ వస్తువులపై ట్రంప్ టారిఫ్ లు విధించారు అని వారి వాదన.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించడంతో తలెత్తిన ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు భారత్ వివిధ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో జపాన్ భారత ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతమిచ్చే కీలక ప్రకటన చేసింది. రాబోయే 10 సంవత్సరాల్లో 10 ట్రిలియన్ యెన్(దాదాపు రూ.5.6 లక్షల కోట్లు లేదా 68 బిలియన్ల డాలర్లు) పెట్టుబడులు పెడతామని జపాన్ ప్రకటించిది. ఈ శుభవార్తతో ట్రంప్ సుంకాల ప్రభావం కొంత తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు.

2038 నాటికి భారత్.. కొనుగోలు శక్తి సమానత్వంలో ప్రపంచంలోనే రెండో స్థానంలోకి చేరుకుంటుందని ఒక అంతర్జాతీయ సంస్థ అంచనా వేసింది. ప్రస్తుతం జీడీపీ ప్రకారం భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఈ విషయాన్ని ఈ వై ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇటీవల పేర్కొంది. 2015లో 2.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న జీడీపీ విలువ 2025 నాటికి 4.27 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు స్పష్టం చేసింది. అలాగే 2025 నాటికి జపాన్, 2027 నాటికి జర్మనీను అధిగమించి 2038 నాటికి రెండో స్థానంలోకి చేరుతుందని ఈ వై సంస్థ ఒక రిపోర్టులో పేర్కొంది. ప్రస్తుతం 27 ట్రిలియన్ డాలర్లతో అమెరికా తొలి స్థానంలో ఉంది. చైనా, జర్మనీ, జపాన్, భారత్ తరువాతి స్థానాలలో ఉన్నాయి. భారత్ తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఉన్నాయి.

అమెరికా ఎగుమతులపై 50% సుంకాల మోత నేపథ్యంలో భారత్ లో తయారయ్యే వస్త్రాలను మరో 40 దేశాలకు ఎగుమతి చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియాతో పాటు పలు మార్కెట్లు ఉన్నాయి. వీటికి పెద్ద ఎత్తున వస్త్రాలను ఎగుమతి చేయడం ద్వారా అమెరికా సుంకాల ప్రభావం తమ వాణిజ్యంపై దీర్ఘకాలం పడకుండా ఉండేందుకు కేంద్రం వ్యూహం సిద్దం చేస్తోంది. దీంతో అమెరికాకు భారత్ ఇస్తున్న తొలి కౌంటర్ ఇదేనన్న చర్చ జరుగుతోంది. అయితే ఎన్ని కౌంటర్లు ఇచ్చినా - దున్నపోతు మీద వర్షం కురిస్తే దానికేంటి సామెతను కొందరు ఉదహరిస్తున్నారు.

ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ పాత్రను ట్రంప్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవార్రో విమర్శించారు. రష్యా చమురు కొనుగోలు ద్వారా భారత్ రెండు చేతులా లాభాలను ఆర్జిస్తోందని, అంతేకాక తద్వారా యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పరోక్షంగా నిధులు సమకూరుస్తోంది" అని ఆయన ఆరోపించారు. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సరఫరా, ధరలను స్థిరీకరించడానికి రష్యా నుంచి చమురు కొనుగోలుచేయాలని భారత్‌ను స్వయాన కోరింది అమెరికాయేనని విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. "అమెరికాకు వస్తువులను అమ్మకం ద్వారా భారతదేశం సంపాదిస్తున్న ధనంతో రష్యా చమురును కొనుగోలు చేస్తోంది. ఆ చమురును రిఫైనరీలో శుద్ధిచేసి లాభం పొందుతోంది. కానీ ఆ డబ్బుతో రష్యా మరిన్ని ఆయుధాలను తయారుచేసి యుక్రెయిన్లను చంపుతుంది. ఫలితంగా అమెరికా పన్ను చెల్లింపుదారులు యుక్రెయిన్‌కు మరింత సైనిక సాయం అందించాల్సి వస్తోంది. ఇది పిచ్చితనం" అని నవార్రో వ్యాఖ్యానించారు. అయితే "భారత్ రష్యా నుంచి చమురు ఎక్కువగా కొనుగోలుచేస్తున్న దేశం కాదని అది చైనా నని, 2022 తర్వాత రష్యాతో అత్యధికంగా వాణిజ్య ప్రయోజనం పొందిన దేశం కూడా భారత్ కాదని ఈ సందర్భంగా జైశంకర్ స్పష్టంచేశారు. రష్యా నుండి గ్యాస్‌ను అత్యధికంగా కొనుగోలు చేస్తున్నది యూరోపియన్ యూనియన్ అనుకుంటున్నా" అని జైశంకర్ వెల్లడించారు. అమెరికా మాజీ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, కార్నెగీ ఎండోవ్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ వైస్ ప్రెసిడెంట్ ఎవాన్ ఏ. ఫీగెన్‌బామ్ ఇలా  స్పందించారు - "ఇది పూర్తిగా అర్థరహితం. ట్రంప్ మద్దతుదారులు ఇంతకుముందు యుక్రెయిన్‌ యుద్ధానికి రష్యా కారణమని చెప్పేవారు. చైనా, ఉత్తర కొరియా వంటి ఇతర దేశాలు దీనికి సహాయం చేశాయి. ఈ వ్యక్తులు తాజాగా యుక్రెయిన్‌ యుద్ధానికి కారణమని వివిధ దేశాలను నిందించడం మొదలుపెట్టి సదరు జాబితాలో భారత్ ను కూడా చేర్చడంతో -  గత 25 ఏళ్లలో అమెరికా-భారత్ సంబంధాలను బలోపేతం చేయడానికి చేసిన కృషిని వారు వృథా చేశారు" అని ఆయన వాపోయారు.  తాజాగా రష్యా నుండి చమురు కొనుగోళ్ళు ఆపివెయ్యాలని యూరోప్ దేశాలకు ట్రంప్ పిలుపునిచ్చారు. దాంతో ట్రంప్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవార్రో ఇంతకు మునుపు భారత్ పై చేసిన విమర్శలు తప్పని తేలింది. రష్యా నుండి అన్నీ చాలా దేశాలు చమురు కొంటున్నప్పుడు, కేవలం భారత్ ను మాత్రమే నవార్రో టార్గెట్ చెయ్యడంలో ఎదో ముందస్తు వ్యూహం ఉంది అనే అనుమాలు బలపడుతున్నాయి.

ఇంతకీ ఈ పీటర్ నవార్రో మహాశయుడు గురించి చెప్పుకోవాలి, ఇతగాడు ఐదు సార్లు శాండియాగో నుండి ఎన్నికల్లో గెలవడానికి విఫలయత్నం చేశాడు. పలు మార్లు డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీలు మారి, కొనాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండి, తాజాగా 2018 లో రిపబ్లికన్ పార్టీలో చేరి ఆనక  ట్రంప్ పంచన చేరి ఇప్పుడు భారత్ పై కత్తులు దూస్తున్నాడు. భారత్‌లో యూఎస్ తదుపరి రాయబారిగా తన నమ్మినబంటు వైట్‌హౌస్‌లో డైరెక్టర్‌ సెర్గియో గోర్ ని ట్రంప్ ప్రకటించాడు.  ట్రంప్‌నకు సంబంధించిన పుస్తకాలను ప్రచురించడం, ఆయన తరపున ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం వంటి పనులను గోర్ పర్యవేక్షించారు. భారత్, పాక్, చైనా, అఫ్ఘాన్ ప్రాంతానికి గుండెకాయ వంటి భారత్ ప్రాంతానికి ఇటువంటి అర్హతలు ఉన్న వ్యక్తి ఎలా పనిచేస్తారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అర్హతలు లేనప్పటికీ తన నమ్మిన బంటులన్న కారణం చేత ఇటువంటి వారిని దగ్గరకు చేరదీసి వారిని సున్నితమైన స్థానాలలో నియమిస్తున్న ట్రంప్ చివరికి సాధించేదేమిటో ఆయనకే తెలియాలి. ఇంతకు మునుపు ట్రంప్ ప్రభుత్వంలో పని చేసినవారు ట్రంప్ కొత్త సలహాదారుల సామర్ధ్యంపై పెదవి విరుస్తున్నారు.   చెప్పేవాడికి చాదస్తం ఉండొచ్చు గాని వినేవాడికి వివేకం ఉండాలి - సామెతను మరో సారి గుర్తు చేస్తూ, ట్రంప్ ఏమైనా చెబుతాడు, కానీ ప్రపంచం భారత్ తోడుగా ఉండడం ముఖ్యం - కావున ఆ దిశగా మన చర్యలు ఉండాలి.

కాస్త ఉపశమనంగా, తాజాగా మోదీ ఒక టెర్రిఫిక్‌ మ్యాన్‌ అంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. "టెర్రిఫిక్‌ మ్యాన్‌" అంటే తెలుగులో అద్భుతమైన మనిషి, "చాలా మంచి మనిషి" లేదా "గొప్ప మనిషి" అని కూడా నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ఒక వ్యక్తిని "చాలా మంచిగా ఉన్నాడని" లేదా "గొప్పవాడని" చెప్పడానికి ఉపయోగిస్తారు. ఈ లెక్కన ట్రంప్‌ మోదీ ని పొగిడినట్లే అని అనుకోవాలి. ప్రస్తుత టారిఫ్ ల గొడవ నేపధ్యంలో ఈ పొగడ్తలకు ఎవరూ పడిపోవడంలేదు - పెద్దగా ఎవరూ పట్టించుకోవడంలేదు కూడా!

చివరిగా సిరిమల్లె పాఠక మిత్రులారా, టారిఫ్ ల విషయం ఆందోళన చెందకుండా, ‘‌వసుధైవ కుటుంబం’- ‌విశ్వమానవాళి అంతా ఒకే కుటుంబం అన్న ఉదాత్త లక్ష్యం - అదే భారతీయ సంస్కృతికి మూలం విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ - మన పని మనం మౌనంగా చేసుకుంటూ పోతే పరిస్థితులు నేడు కాకపోయినా రేపటికైనా దారికి వస్తాయి, ఏమంటారు? ఎప్పటిలాగే సిరిమల్లె పాఠకులకు సాహిత్యాభినందనాలు అందజేస్తూ...అలాగే పాఠకులందరూ యధావిధిగా క్రింద నున్న కామెంట్ బాక్స్ లో ఈ రచ్చబండ చర్చపై  మీ స్పందనను తప్పక తెలియజేయాలని వారిని అభ్యర్థిస్తూ.. ఈ నెల చర్చ ముగిద్దాం, వచ్చే నెలలో మరో ఆసక్తికరమైన రచ్చబండ చర్చ “H1B - వీసాల లొల్లి” కు తెర తీద్దాం! అంతవరకూ సెలవు.

ఈ అక్టోబర్ నెలలో మనకు రెండు ముఖ్యమైన పండుగలు విజయదశమి మరియు దీపావళి ఉన్నాయి. ఈ సందర్భంగా - ఈ రెండు పండుగలు సిరిమల్లె పాఠకుల గృహాలలో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సును తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం

********

Posted in October 2025, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *