Menu Close
Venkat Nagam
మన ఊరి రచ్చబండ
-- వెంకట్ నాగం --

ప్రవాసాంధ్ర స్నేహితుడు నాతో పంచుకున్న 'ఇల్లు అమ్మి చూడు' కష్టాలు - అనుభవాలు ఈ మార్చి నెల రచ్చబండ చర్చలో మీతో పంచుకున్నాను. ఎడతెరగని పనుల మూలంగా ఏప్రెల్ రచ్చబండ చర్చకు నామం పెట్టి, ఇప్పుడు మే నెలలో తాజాగా రెండో భాగం - బెంగుళూరులో నా స్నేహితుడి స్థలం అమ్మకం గూర్చి చర్చకు నేను ఉపక్రమించడం జరిగింది - నా స్నేహితుడి అనుమతితో. ఈ రెండో భాగంలో లాయర్లు, కోర్టు కేసులు, పోలీసు కేసులు, పంచాయితీ పెద్దల రంగప్రవేశం...వగైరా మసాలాలతో అనేక మలుపులు తిరుగుతుంది. మొత్తం జరిగిన కథ విపులంగా రాస్తే ఏకంగా ఒక పుస్తకమే అవుతుంది, కానీ సందర్భం దృష్ట్యా టూకీగా ఆ వివరాలు మీతో పంచుకుంటాను.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రవాసాంధ్రులలో చాలామందికి ఆస్తి కొనుగోలు అనుభవం బాగానే ఉంటుంది, అంతేగాని అమ్మకంలో పెద్దగా అనుభవం ఉండదు. ఎందుకంటే తర్వాత ఎప్పుడో మనకు అవసరం వచ్చినప్పుడు అమ్ముకోవచ్చులే అనే ఉద్దేశ్యంరో కొనుగోలు చేసిన ఆస్థిని ఉంచుకునే ప్రయత్నంలో ఎక్కువమంది ఉంటారన్నమాట. సింహభాగం పిల్లల చదువుల కోసం, లేకపోతే ఇంకా అక్కడ 10,000 కి.మీ దూరంలో ఇంకా ఆస్తులను చూసుకునే వారు లేరు, కావున ఇప్పుడు అమ్ముకుంటే ఉత్తమం పోను పోను మరీ కష్టమవుతుంది అని భావించి అమ్మకానికి దిగే వారు ఎక్కువ. ఇతర అవసరార్ధం అమ్ముకునే వారు చాలా తక్కువ మంది, వీరు మూడో వర్గం.

అసలు విషయానికి వెళ్ళితే, మొదట ఒక బ్రోకర్ నా స్నేహితుడి కి ఫోన్ చేసి మీ స్థలం యాడ్ ఫలానా వెబ్ సైటులో ఇప్పుడే చూసాను, నా వద్ద కొంతమందికి కస్టమర్స్ ఉన్నారు మీరు సరే అంటే మీ స్థలం వారికి చూపిస్తాను అంటే నా స్నేహితుడు ఓకే అన్నాడు. అదొక దుర్ముహూర్తంలో "ఓకే" అన్నాను అని వాడికి తరువాత తెలిసొచ్చింది.

రెండు రోజుల తరువాత సదరు ఏజెంట్ నా స్నేహితుడి కి మరలా ఫోను చేసి మీ స్థలం బెంగళూరు మునిసిపాలిటీ పుస్తకాలలో బీ- ఖాతా గా నమోదు అయి ఉంది, అందుకని నా కస్టమర్లు చాలా తక్కువ రేట్ కి అది అడుగుతున్నారు, కావున దాని బదులు మీరు ఏ- ఖాతా కు మార్పించుకుంటే రేటు ఎక్కువ వస్తుంది అని ప్రలోభపెట్టాడు. మూడున్నర లక్షలు చెల్లించిన తర్వాత తాపీగా అసలు విషయం తెలిసింది నా స్నేహితుడికి.. సదరు ఏజెంట్ బోగస్ అని...నా స్నేహితుడు ఏ- ఖాతా విషయం అడిగినప్పుడల్లా వాడు ఏదో ఒక కుంటి సాకు చెప్పి తప్పించుకునేవాడట. అడిగినప్పుడల్లా - సార్ ఈ నెలలో బెంగళూరు మునిసిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి మునిసిపాలిటీ ఆఫీసులో ఒక్కడు లేడు అన్నాడట, మరోసారి కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నాడట, తర్వాత లోక్ సభ ఎలక్షన్ సార్.. ఆఫీస్ లో ఎవరు లేరండి అన్నాడట. ఇదేదో అయ్యేది కాదని నా స్నేహితుడు గట్టిగా అడిగేసరికి, ఒక యాభై వేలు డబ్బు రిఫండ్ ఇచ్చాడు - అదీకూడా నా స్నేహితుడు అడగంగా అడగంగా. ఈలోపు మళ్ళీ మిగతా మూడు లక్షలు డబ్బులు గట్టిగా అడుగుతాడేమోనని అనుమానంతో ఆ ఏజెంటు అర్జెంటుగా ఒక బయ్యర్ను కుదిర్చాడు. రెండు కోట్ల విలువైన స్థలానికి మరీ తక్కువలో తక్కువగా ఐదు లక్షల అడ్వాన్స్ తీసుకొని అగ్రిమెంట్ చేసుకుంటున్నావు జాగ్రత్త మిత్రమా, అని నా స్నేహితుడిని నేను హెచ్చరించడం జరిగింది. మనం స్థలం యాడ్ వేసిన సంవత్సరానికి కూడా ఇంకా మంచి బేరం తగలలేదు, సరే వీడెవడొ వచ్చాడు కదా, పైగా మూడు నెలల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను అని నమ్మబలుకుతున్నాడు ఈ బయ్యర్  అని చెప్పాడు నా స్నేహితుడు. సదరు బయ్యర్ మూడు నెలల తర్వాత మరో రెండు నెలలు టైం అడిగాడట..ఆ తరువాత ఇంకో వారం. ఇలాగా ఒక వారం వారం పెంచుకుంటూ పోతున్నాడు ఆ బయ్యర్. దాంతో చిర్రెత్తుకొచ్చిన నా స్నేహితుడు గట్టిగా మాట్లాడేసరికి, ఆ బయ్యర్ "సార్ నాకున్న వేరే ఇల్లు అమ్ముడుపోవడంలేదు, కావున మీరు మీ స్థలాన్ని మీకు నచ్చిన ఇతర పార్టీకి అమ్ముకోవచ్చు, అయితే...". ఇక్కడే ఉంది ఆ బయ్యర్ పెట్టిన లిటిగేషన్...సదరు బయ్యర్ నా స్నేహితుడికి ఇచ్చిన ఐదు లక్షల అడ్వాన్స్ కు తోడు, దానికి 6 నెలలకు వడ్డీ, దానికి తోడు స్థలానికి తాను చొరవతీసుకొని మునిసిపాలిటీ లో పరపతి ని ఉపయోగించి ఏ - ఖాతా కాగితం తెచ్చినందుకు ఇంకో ఏడు లక్షలు, మొత్తం దాదాపు 13 లక్షలు డిమాండ్ చేసే సరికి నా స్నేహితుడికి గొంతులో తడి ఆరిపోయిన పరిస్థితి వచ్చిదంటే నమ్మండి.

స్పందన లేని నా స్నేహితుడి పరిస్థితిని గమనించి ఆ బయ్యర్, ఒక మంచి రోజు చూసుకొని నా  స్నేహితుడికి లాయర్ నోటీస్ పంపించాడు. ఏమనీ? అయ్యా నేను సదరు స్థలం కు డబ్బు పూర్తిగా సర్దుబాటు చేసుకొని ఎప్పటినుండో సిద్ధంగా ఉన్నాను, కానీ ఇతగాడు రిజిస్ట్రేషన్ కు రాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు, కావున మరో 15 రోజుల్లో నాకు మర్యాదగా నీ స్థలం రిజిస్ట్రేషన్ చెయ్యాలి అని. బయ్యర్ పంపిన సదరు లాయర్ నోటీస్ చదువుకొని పట్టపగలే నక్షత్రాలు చూసిన నా స్నేహితుడు వెంటనే నన్ను సంప్రదించటం, ఆనక నేను తెలిసిన ఒక లాయర్ ను కలవమని చెప్పడం సలహా ఇవ్వడం జరిగింది. నా స్నేహితుడికి - బయ్యర్ కు మధ్య వాట్సాప్ లో ఉన్న మెసేజీలు అన్నీ స్క్రీన్ షాట్లు అన్నీ సదరు లాయర్ కు నా స్నేహితుడు ఇచ్చి, అయ్యా నా తప్పేం లేదు నేను సిద్ధంగా ఉన్నాను, సదరు బయ్యర్ డబ్బు సర్దుబాటు చెయ్యలేక రిజిస్ట్రేషన్ అంటే తప్పించుకు తిరిగాడు, చివరికి చేతులెత్తేసాడు, ఇప్పుడు ఎదురు తిరుగుతున్నాడు  అని మొర పెట్టుకోగా, నా స్నేహితుడిని ఆ లాయర్ ఊరడించి మరేం ఫరవాలేదు మనం కూడా ఆ లాయర్ నోటీస్ కు జవాబు ఇద్దాం అని అన్నాడట.

ఈలోపు ఈ నా స్నేహితుడు స్థలం ఎదురు ఇంట్లో ఉన్న ఒక స్నేహితుడి కి ఫ్రెండ్ అనుకోండి..ఫోన్ చేసి మిత్రమా ఎవరో పొద్దున్నే వచ్చి నీ స్థలంలో ఉన్న బొప్పాయి చెట్టుకు ఒక బోర్డు కట్టారు, సదరు బోర్డుపై.. "ఈ స్థలం రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ నా పేరు మీద ఉంది, కావున కొనేవారు నన్ను సంప్రదించండి అని...". ఇంతకీ బోర్డులో ఉన్న ఫోన్ నెంబర్ మరెవరిదో కాదు, ఐదు లక్షలు ఇచ్చి నా స్నేహితుడితో అగ్రిమెంట్ చేసుకున్న బయ్యర్ దే.

చెట్టుకు కట్టిన సదరు బోర్దు ఫోటో నా స్నేహితుడు లాయర్ కు ఇచ్చి - ఈ తాజా విషయం చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గమ్మత్తు అయిన విషయం ఏమిటంటే నా మిత్రుడి ఆ కొంటె లాయర్ బయ్యర్ కు ఇచ్చిన జవాబు నోటీసు కాపీ (రిప్లై) ని బెంగళూరు మున్సిపల్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ కు, మరియూ స్థానిక పోలీస్ స్టేషన్ కూడా ఈమెయిలులో పంపించాడట. తద్వారా నా మిత్రుడి స్థలంలో బయ్యర్ పెట్టిన బోర్డు ఫోటో ను చూసిన పిదప నా స్నేహితుడి లాయర్ కు కోపం నషాళానికి అంటింది అని తెలుస్తుంది.

లాయర్ నోటీస్ ఒరిజినల్ బయ్యర్ కు పోస్టులో వెళ్ళనే వెళ్ళింది. ఈ లోపు లాయర్ నా స్నేహితుడికి ఏం చెప్పాడంటే, అయ్యా నీ బయ్యర్ కోర్టుకెళ్ళి నీ స్థలం పై కేసు వేసి ఓనర్ షిప్ నెంబర్ అంటారు బెంగళూరులో... అది తెచ్చుకుంటాడేమో, అది కానీ వాడు కోర్టు నుండి తెచ్చుకుంటే, నీ స్థలంలో ఇప్పటికే వాడు చెట్టుపై పెట్టిన బోర్డుపై ఆ నెంబర్ కూడా రాసేస్తాడు, ఇంక నీ స్థలం కొనడానికి కనుచూపు మేరలో వేరే బయ్యర్ రాడు కాక రాడు, పైగా ఆసక్తిఉన్న వారు కూడా ఈ కోర్టు కేసు లో ఉన్న  స్థలం మాకు వద్దనే వద్దు - బాబు, నీకు నీ స్థలానికి ఒక దండం అని పారిపోతారు. కావున ఎందుకైనా మంచిది మనం బెంగళూరు సివిల్ మరియూ అర్బన్ కోర్టుల్లో ఒక కేవియాట్ పిటిషన్ వేద్దాము  అని చెప్పడం జరిగింది. కేవియాట్ పిటిషన్ వేస్తే, సదరు కోర్టు బయ్యర్ కు ఓనర్ షిప్ నంబర్ ఇచ్చేముందు స్థలం అసలు యజమానిని అంటే నా మిత్రుడిని సంప్రదిస్తుంది అన్నమాట.

మొత్తానికి ఈ లాయర్ నోటీసు, పైగా కోర్టులో వేసిన రెండు కేవియాట్ పిటిషన్లు ఇవన్నీ అందుకున్న ఆ బయ్యర్ కి కొంత భయమేసినట్టుంది, వాడు నా స్నేహితుడికి ఇచ్చిన 15 రోజుల గడువు వరకు వాడు ఖాళీగా  కూర్చున్నాడు మొత్తానికి. ఆ పిదప సమయం చూసుకొని నా మిత్రుడు మధ్యవర్తులను దించి, బయ్యర్ కు దాదాపు తొమ్మిది లక్షలు చెల్లించి, అగ్రిమెంట్ అసలు ప్రతిని అతగాడి నుండి రాబట్టి, ఆనక మధ్యవర్తులకు అదేనండి పంచాయితీ పెద్దలకు కొంత దక్షిణ సమర్పించుకొని మొత్తానికి సమస్య నుంచి బయటపడ్డాడు. ఆటలో అరటిపండు లాగా తాపీగా ఒక మూడు నెలల తర్వాత బెంగుళూరు  పోలీసుల నుంచి నా మిత్రుడి లాయర్ కు ఒక ఈమెయిల్ వచ్చింది. "సార్ మీ నుండి ఒక లాయర్ నోటీసు కాపీ ఒకటి మాకు మూడు నెలల క్రితం వచ్చింది,  ఏంటి ఆ బయ్యర్ మీద  పోలీసు కేసు ఓపెన్ చేయాలా? ..." - ఇది ఆ పోలీసు వారినుండి వచ్చిన ఈమెయిలు సారాంశం. అది చూసి నవ్వుకొని, కేసు గట్రా వద్దులే బాబు, మేము సెటిల్ చేసుకున్నాము అని నా మిత్రుడు లాయర్ ద్వారా బెంగుళూరు పోలీసులకు జవాబు ఇవ్వడం జరిగింది. పాత తెలుగు సినిమాల క్లైమాక్స్ సీన్లో  హీరో విలన్ను, అతగాడి అనుచర బృందాన్ని చావబాది, హీరోయిన్ ను రక్షించి - దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ విజయవంతంగా చేసి ఒక పోజు పెట్టినప్పుడు - అప్పుడే పోలీసులు తాపీగా విజిల్ ఊదుకుంటూ జీప్ లోంచి దిగి పరుగుపరుగున సీన్లోకి రంగప్రవేశం చెయ్యడం మీకు గుర్తుకురాలా?

ఇలా నా స్నేహితుడి స్థలం అమ్మకం ఒక మలుపు దాటి మరో మలుపు తిరిగింది. ఈ రెండో మలుపులో భాగంగా ఇంకొక బయ్యర్ (ఇతగాడు వేరే వ్యక్తిలేండి) అగ్రిమెంట్ చేసుకోవడం, ఈ రెండో బయ్యర్ 20 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి ఓ నాలుగు నెలల తర్వాత నాకు డబ్బు సర్దుబాటు కాలేదు, కావున అగ్రిమెంట్ కాన్సిల్ అని చెప్పి,  నా స్నేహితుడు నుండి 20 లక్షలకు తోడు 4 నెలల వడ్డీ కూడా ముక్కు పిండి వసూలు చేసుకోవడంతో - ఈ రెండు సంవత్సరాలుగా సాధించింది శూన్యమని నీరసపడిపోవడం నా స్నేహితుడి వంతైంది. రాముడు - భీముడు సినిమాలో "ఉందిలే మంచికాలం ముందు ముందునా" పాట పాడుకోవాల్సిన సమయం ఇదని నా మిత్రుడికి నేను గుర్తుచేసాను.  ఏతావాతా చివరికి మంచి రోజులు వచ్చి నా స్నేహితుడి స్థలం అమ్మకం అనే బృహత్ ప్రయత్నానికి మొత్తానికి శుభం కార్డు పడిందండి. ముచ్చటగా మూడో కృష్ణుడు  అదేనండి మూడో బయ్యర్ వచ్చాడు. అతని నిజం పేరుకూడా "కృష్ణ" అట. మూడో కృష్ణుడి రంగప్రవేశంతో చివరికి నా స్నేహితుడి బెంగళూరు స్థలం అమ్మకం కథ కంచికి చేరింది.  జరిగింది మీకు క్లుప్తంగా నివేదించాను అయితే ఈ రెండు సంవత్సరాల పాటు సాగిన స్థలం అనుభవాల్లో నాకు అర్థమైంది ఏందంటే, నా స్నేహితుడి ఒక లక్కీ ఫెలో అని. బెంగళూరులో ఆస్తి అమ్మకం ముఖ్యంగా స్థలం అమ్మకం అనేది కొనుక్కున్నంత సులభం కాదు. అమ్మకం విషయం వచ్చేసరికి సరైన కొనుగోలు దారుడు గనక తగలకపోతే మాత్రం అమ్మకందారుకి  చుక్కలు కనపడటం ఖాయం అని అనిపించిందండి. ఇక్కడ స్థలం అమ్మకం అర్జెంటు కాదు కాబట్టి నా మిత్రుడు రెండేళ్లు వేచి చూసాడు. కానీ తక్షణ అవసరాస్ధం అమ్మే యోచనలో ఉన్న ప్రవాసాంధ్రులు ఇబ్బంది పడే అవకాశం ఉంది, కావున బెంగుళూరు స్థానికులు కానివారు తమ స్థలం అమ్ముకోవాలంటే ఒకటి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్తగా ముందు అడుగులు వేయాలని మనకు అర్థం అవుతుంది కదా! బెంగళూరులో నివసిస్తున్నవారికి  నేను ప్రస్తావించిన విషయాలన్నీ బహుశా కొట్టిన పిండి కింద లెక్క అయ్యిఉంటుంది.

మిత్రమా! ఏతావాతా అనేక మలుపులు తిరిగిన నీ బెంగళూరు స్థలం అమ్మకంలో ఇంతకూ నీకు పైకం ఎంత జమపడింది అని నా మిత్రుడిని ఆసక్తిగా అడిగాను. మొత్తం పది లక్షలు ఖర్చులు, మూడో కృష్ణుడి ఏజెంట్ కమీషన్ 5 లక్షలు, పన్నుల నిమిత్తం 30 లక్షలు పోగా మిగతా పైకం మొత్తం అందింది అన్నాడు నా మిత్రుడు. ఈ అగ్రిమెంట్, అడ్వాన్స్ గొడవలతో చేతులు కాల్చుకున్న మరో మిత్రుడు తన బయ్యర్ తో  ఇలా అన్నాడట  "అయ్యా నీకు నీ అడ్వాన్స్ కు ఒక దండం, నాకు రూపాయి అడ్వాన్స్ వద్దు, మొత్తం సొమ్ము తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ రోజు కలువు, ఆరోజే అంతా…". కావున బెంగళూరులో స్థిరాస్తి అమ్మే ఉద్దేశ్యంలో ఉండి, అందుకు సంసిద్ధులవుతున్న ప్రవాసాంధ్రులారా తస్మాత్ జాగ్రత్త! అన్నట్లు చెప్పడం  మరిచేపోయా... ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. నానుడికి జతగా.. "ఇల్లు అమ్మి చూడు..బయ్యర్ వద్ద అడ్వాన్స్ తీసుకొని చూడు"... ఆనక “లాయర్ నోటీసు చదివి చూడు, కేవియట్ పిటిషన్ వేసి చూడు”, వాక్యాలను జతచేయాలేమో?

ఎప్పటిలాగే సిరిమల్లె పాఠకులకు సాహిత్యాభినందనలు అందజేస్తూ...అలాగే పాఠకులందరూ యధావిధిగా క్రింద నున్న కామెంట్ బాక్స్ లో మీ స్పందనను తప్పక తెలియజేయాలని వారిని అభ్యర్థిస్తూ.. ఈ నెల చర్చ ముగిద్దాం, వచ్చే నెలలో మరో ఆసక్తికరమైన రచ్చబండ చర్చ కు తెర తీద్దాం! అంతవరకూ సెలవు.

-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం

********

Posted in May 2025, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *