
'ఇల్లు కట్టి చూడు-పెళ్ళి చేసి చూడు' అంటుంటారు పెద్దలు. కానీ 'ఎన్నికల్లో పోటీ చేసి చూడు, ఆనక గెలిచి కోట్లు కొట్టేసి చూడు' - చిటికెలో పని అని వర్తమాన రాజకీయనాయకులు అనేక మంది చేసి చూపించారు. పది ఇరవై లక్షల అవినీతి ఆరోపణలు వారిపై వస్తే, వారు తీవ్ర అసహనంతో "వార్డు కౌన్సిలర్" పై కనీసం ఒక కోటీ, రెండు కోటి పైచిలుకు అవినీతి ఆరోపణలు వస్తున్న ఈరోజుల్లో మరీ మమ్మల్ని పది ఇరవై లక్షల అవినీతి ఆరోపణలకు పరిమితం చెయ్యడం అన్యాయం అని వారు ఈసడించుకునే రోజులు ఇవి. ఏంచేస్తాం కలికాలం. అయినా ఈ నెల చర్చ వర్తమాన రాజకీయనాయకుల పైన కాదండీ, ఎందుకంటే సోషల్ మీడియా, వాట్స్ ఆప్ యూనివర్సిటీలలో వారి గూర్చి నిత్యం వండి వార్చే వార్తలు వస్తుంటాయి. ఇక్కడ కూడా ఆ డోస్ ఎందుకులేండి. ఇంతకీ అసలు విషయానికి వస్తే 'ఇల్లు కట్టి చూడు-పెళ్ళి చేసి చూడు' సామెతకు బదులుగా 'ఇల్లు అమ్మి చూడు - పెండ్లి చేసి చూడు" అని నేను ప్రతిపాదిస్తాను, ఎందుకంటే ఇప్పుడు చక్కగా ఇల్లు కట్టి పెట్టే కాంట్రాక్టర్లు ఊరూరా ఉన్నారు - కాకపోతే తైలం ఖర్చు అవుతుంది మరి. ఇంక గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న అపార్ట్ మెంట్లు, విల్లాల గూర్చి చెప్పనవసరంలేదు. ప్రస్తుత స్పీడ్ యుగంలో ఇటుక ఇటుక పేర్చి పాత రోజుల్లో ఇల్లు కట్టినట్లు లేదా కట్టించుకున్నట్లు ఇప్పుడు కట్టించుకోవడాని/కట్టుకోవడానికి ఇప్పుడు ఎవరికి తీరిక ఉంది చెప్పండి? అయితే వర్తమాన యుగంలో 'ఇల్లు అమ్మి చూడు - పెండ్లి చేసి చూడు" రెండూ మాత్రం సవాళ్ళే మరి. పెండ్లి సంగతి మరో సందర్భంలో చర్చిదాం, 'ఇల్లు అమ్మి చూడడం’ మాత్రం సుదీర్ఘ చర్చకు దారి తీస్తుంది - తీసింది అంటే బాగుంటుందెమో! నా స్నేహితుడు ఎన్నారై నాతో పంచుకున్న 'ఇల్లు అమ్మి చూడు' కష్టాలు, అనుభవాలు ఇప్పుడు మీతో టూకీగా పంచుకుంటాను.
అన్నట్టూ "కుక్కపిల్లా.. సబ్బుబిళ్ళా.. అగ్గిపుల్లా.. కాదేదీ కవితకనర్హం" అని శ్రీశ్రీ చెప్పినట్లు, రచ్చబండ చర్చకు మన స్వంత అనుభవాలే అవసరంలేదు, ఎదుటి వారి అనుభవాలతో కూడా రచ్చబండ చర్చా కార్యక్రమం నిర్విఘ్నంగా నడిపించవచ్చు. ఎదుటి వారి బోడి అనుభవాలు మాకెందుకులేవోయ్ అంటారా? తనదాక వస్తే గానీ తత్వం బోధపడదు (లేదా నొప్పి తెలియదు) అంటారుగా పెద్దలు. ఆపై ఇక మీ ఇష్టం.
భారత్ లో తనకు ఉన్న ఆస్తుల అమ్మకాల గురించి నా స్నేహితుడు చెప్పినదాన్ని బట్టి ఏకంగా ఒక పుస్తకమే రాయవచ్చు. ఆన్ని అనుభవాలు పోగుచేసుకున్నాడు నా మిత్రుడు. క్లుప్తంగా చెప్పుకుంటే, ఆంధ్ర రాష్ట్రంలో నా మిత్రుడికి వారసత్వంగా వచ్చిన ఆస్థి అమ్మకంలో, ఆపై బెంగుళూరు లొ ఉన్న స్థిరాస్తి అమ్మకంలో అనేక సినిమా కష్టాలు దాగున్నాయి. పేరు చెప్పడం బాగుండదు కావున ఆసాంతం "నా మిత్రుడు" అనే ప్రస్తావిస్తాను.
‘అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి’ చందాన సామెతలో ద్వితీయ భాగం పెద్ద సమస్యకాదు ఈరోజుల్లో. ఐదు వేల రూపాయల రుసుముతో స్థిరాస్తి తాలూకు డాక్యుమెంట్లు అన్నీ శోధించి, ఇంకా కావాల్సిన డాక్యుమెంట్ల లిస్టు తో పాటూ, న్యాయపరమైన సలహా చెప్పడానికి సిద్ధంగా ఉన్న న్యాయవాదులు కోకొల్లలు. అమ్మబోతే అడివి పరిస్థితి మాత్రం వర్తమాన కాలంలో దాదాపు ప్రతి ప్రవాసాంధ్రుడికి ఎదురవ్వడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. ఉదాహరణకు నా మిత్రుడు చెప్పినదాని ప్రకారం వారసత్వంగా వచ్చిన ఆస్థి (ఇల్లు) అమ్మకం విషయానికొస్తే, బేరం కుదుర్చుకున్న తరువాత పదివేలు బయాన ఇచ్చి కొనేవారు పెట్టిన షరతులు - ప్రభుత్వం నుండి కుటుంబ ధ్రువీకరణ పత్రం, సర్వే రిపోర్టు, వీలునామా ప్రతి, ఇతర కాగితాల ప్రతులు ఇవ్వాలని, లేనిదే ఇంకా ఒక్క రూపాయి అడ్వాన్స్ అదనంగా ఇవ్వనని వారు భీష్మించుకు కూర్చుంటారు. తప్పుతుందామరి. నామిత్రుడు నానా అగచాట్లు పడి కుటుంబ ధ్రువీకరణ పత్రం, సర్వే రిపోర్టు పట్టుకొచ్చాడు. ఒక ముప్పైవేల వరకు తైలం అయ్యిందని వినికిడి. పిదప తాతల కాలం నాటి చేతిరాతతో కూడిన ఆయన తాతగారి వీలునామ పత్రం చదవడం దాదాపు ఎవరి తరం కాలేదు. దీన్ని చేతిరాత అనాలో బ్రహ్మ రాత అనాలో అర్ధం కాని పరిస్థితి. అడిగి తెలుసుకుందామని అంటే, సదరు వీలునామా రాసిన డాక్యుమెంటు రైటర్, రాయించుకున్నవారు, సాక్షులతో సహా అదరూ ఎప్పుడో కాలం చేసారు. ఇండియాలో డాక్టర్ రాసిన మందుల చీటిలో రాత ఎవరికి అర్ధం అవుతుంది? ఒక్క మందుల షాపువాడికే కదా! ఈ ఒక్క క్లూ పట్టుకొని నా మిత్రుడు తాతల కాలం నాటి వీలునామా పట్టుకొని ఊర్లో ఉన్న డాక్యుమెంటు రైటర్లలో భీష్మాచార్యుడు వంటి ఒక ఆయన్ని పట్టుకొని ఆయన ద్వారా ఆ వీలునామా మొత్తం అచ్చ తెలుగులో రాయించి టైపు చేయించాడు.
దూకుడు సినిమాలో "మన హీరో దొరికేసాడు" అని ఏవీయెస్ ను ఉద్దేశించి మహేష్ బాబు అన్నట్లు, ఇక్కడ స్థిరాస్తి కొనేవాడికి కూడా "మనకు ఒక ఎన్నారై దొరికేసాడు" అన్న పరిస్థితి ఉంది. ఏమాటకామాట వాస్తవం చెప్పుకోవాలికదా! ఎన్నారై అంటే అంత అలుసు మరి. దాంతో కొనేవాడు నా ఎన్నారై మిత్రుడిపై ముందుగా కుదుర్చున్న ఒప్పందం మార్చి ధర తగ్గించే ప్రయోగాలు మొదలుపెట్టాడు. ‘చూరు నీరు పోవడానికి తూర్పు దిక్కు స్థలం కావాలి, పైగా మీరు ఇంతకు ముందు అమ్మిన పక్క నున్న స్థలం వైశాల్యం ఎక్కువ ఉంది. వాడికి ఎక్కువ స్థలం వచ్చింది కావున ఆ స్థలంలో నాకు భాగం కావాలి (చూరు నీళ్ళు పోవడానికి), లేదా నాకు 3 లక్షలు ధర తగ్గించి అమ్ము!’ ఇదండి కొనేవాడి డిమాండ్. చిర్రెత్తు కొచ్చిన నా మిత్రుడు, నీతో కుదరదు "డీల్ కాన్సిల్" నీ బోడి అడ్వాన్స్ 10 వేలు నువ్వే తీసుకో అని తిరిగిచ్చేసాడు. ఈ లోగా కాచుకొని కూర్చున్న రెండో కృష్ణుడు అదేనండి రెండో కొనుగోలుదారు ముందుకు వచ్చి ఒక యాభై వేలు తక్కువ చేసుకోని నాకే ఇప్పించండి అని నా మిత్రుడిని అడగడం, నా మిత్రుడు సమ్మతించి ఆనక తాతల స్థిరాస్తి అమ్మకం చకచకా జరిగిపోయాయి. అన్నట్లు చెప్పడం మరచి పోయాను...సర్వే పత్రం తయారు చేసేవాడు మీ తాత, ఒక్క కుమారుడు మీ నాన్న ఇద్దరూ ఎటూ చనిపోయారు, కానీ మీ తాతకు ఉన్న ఇద్దరు కుమార్తెలు కూడా వస్తే కానీ సర్వే చెయ్యనని పేచీ పెట్టాడంట. వాళ్ళు ఎక్కడ దొరుకుతారు నా మిత్రుడికి? వాళ్ళల్లో ఒక మేనత్త ఎప్పుడో టపా కట్టేసింది. రెండో ఆమె మంచంలో ఉంది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు...కాదు "ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే సర్వే చేసేవాడు" అని నా మిత్రుడికి అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. మరి సరి పత్రం లేనిదే ఆస్థి అమ్మడం గూర్చి మర్చిపోవలసినదే! పోలిక చెప్పుకుంటే - ఈ సర్వేరాయుళ్ళు - అవధానంలో అప్రస్తుత ప్రసంగీకులకు ఏమాత్రం తగ్గరు అని అనిపించింది. అక్కడ అవధానిని తికమక పెట్టి పరీక్షించడం అప్రస్తుత ప్రసంగీకుల లక్ష్యం, ఇక్కడ బహుశ తైలం కోసమేమో ఈ సర్వేరాయుళ్ళు లేవనెత్తిన అంశాలు కొద్ది దిగ్భ్రాంతిని కలగజేస్తాయి.
రెండో కృష్ణుడు అదేనండి రెండో కొనుగోలుదారు మీ స్థిరాస్తి ఇంటిలో ఉన్న 45 ఏండ్ల పాత ఇల్లు పడగొట్టి ఆనక రెండు నెలలు ఎండబెట్టి ఆ తరువాత మేము తీరిగ్గా ఇల్లు కట్టుకుంటాము, కావున మీ స్థిరాస్తి ఇంటికి డబ్బు చెల్లించం, కేవలం స్థలానికి మాత్రమే రేటు కడతాము అని నా మిత్రుడితో వాదించి, స్థిరాస్తి విలువ తక్కువ జేసి ఆనక రిజిస్ట్రేషన్ పిదప, స్థిరాస్తిలో ఉన్న అదే పాత ఇంటిపై మరో అంతస్తు వేసాడని తెలిసి నా మిత్రుడికి నోట మాట రాలేదు అంటే నమ్మండి. నమ్మకు నమ్మకు ఏ బయ్యర్ను - అని పాడుకోవాలేమో?
మిత్రమా! ఏతావాతా అనేక మలుపులు తిరిగిన ఈ స్థిరాస్తి అమ్మకంలో ఇంతకూ నీకు పైకం ఎంత జమపడింది అని నా మిత్రుడిని ఆసక్తిగా అడిగాను. నా బొంద, ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు, నా వాటా మొత్తం 10 లక్షలు కూడా నా తోబుట్టువులకు ఇచ్చేసి వచ్చాను. చిన్న మొత్తం కదా తీసుకోవాలని అనిపించలేదు అని నిట్టూర్చాడు నా మిత్రుడు. ఆ దీర్ఘ నిట్టుర్పులో తన వాటా డబ్బు వదులుకున్న విషయం కంటే - స్థిరాస్తి అమ్మకంలో మిత్రుడు అనుభవించిన కష్టాలు నాకు కనిపించాయి. అమ్మబోతే అడివి ... సామెత సరిగ్గా సరిపోలా? కావున స్థిరాస్తి అమ్మే ఉద్దేశ్యంలో ఉండి, అందుకు సంసిద్ధులవుతున్న ప్రవాసాంధ్రులారా తస్మత్ జాగ్రత్త! అన్నట్లు చెప్పడం మరిచాను. ఇది నా స్నేహితుడి కి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆస్థి అమ్మకం అనుభవాలలో మొదటి భాగమేనండి, రెండో భాగం - బెంగుళూరులో ఆస్తుల అమ్మకం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. రెండో భాగంలో లాయర్లు, కోర్టు కేసులు, పోలీసు కేసులు, పంచాయితీ పెద్దల రంగప్రవేశం...వగైరా మసాలాలతో అనేక మలుపులు తిరుగుతుంది.
ఎప్పటిలాగే సిరిమల్లె పాఠకులకు సాహిత్యాభినందనలు అందజేస్తూ...అలాగే పాఠకులందరూ యధావిధిగా క్రింద నున్న కామెంట్ బాక్స్ లో మీ స్పందనను తప్పక తెలియజేయాలని వారిని అభ్యర్థిస్తూ.. ఈ నెల చర్చ ముగిద్దాం, వచ్చే నెలలో ఆసక్తికరమైన రచ్చబండ చర్చ రెండవ భాగం కు తెర తీద్దాం! అంతవరకూ సెలవు.
అన్నట్లు, అందరికీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు.
-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం