Menu Close
Venkat Nagam
మన ఊరి రచ్చబండ
-- వెంకట్ నాగం --

గత నెల రచ్చబండ చర్చా కార్యక్రమంలో ప్రముఖ స్వాతంత్ర్య సమయయోధుడు లాలా లజపతిరాయ్‌ పోరాటం గూర్చి కొంత తెలుసుకుందాం. ఈ నెల చర్చలో ఆయన గూర్చి మరిన్ని వివరాలు, ఆయనపై జరిగిన బ్రిటీష్ పోలీసుల దౌర్జన్యం, ఆయన మరణం, ఆ పిదప బ్రిటీష్ పోలీసులపై విప్లవకారుల ప్రతీకార దాడి, అలాగే నేతాజీ గురించి, ఇంకా మరెన్నో విషయాలు ఇప్పుడు మనం చర్చిద్దాం! ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు, కావున తక్షణం విషయం లోకి వెళితే..

1913లో కరాచీలో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సభలలో భారతీయుల దుస్థితిని విదేశాలలో ప్రచారం చేయడానికి ఇద్దరు ప్రతినిధులను ఎన్నుకున్నది. ఆ ఇద్దరు లజపతిరాయ్, మహమ్మదలీ జిన్నా. 1914లో లజపతిరాయ్‌ న్యాయవాద వృత్తికి స్వస్తి పలికి పూర్తిగా స్వాతంత్య్రోద్యమంలోకి దూకారు. ఆ సంవత్సరమే ఇంగ్లండ్‌ వెళ్లి అక్కడ అనేక సభలలో ప్రసంగించారు. అక్కడ నుంచి అమెరికా వెళ్లారు. అక్కడ ఉండగానే మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. ఆరేళ్ల వరకు భారత్‌ తిరిగి రావడానికి అనుమతి దొరకలేదు. అమెరికాలో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ అఫ్ అమెరికా అనే సంస్థను న్యూయార్క్ లో స్థాపించాడు. అమెరికాలో ఉండగానే ఆయన కొన్ని రచనలు చేశారు. రచయితగా కూడా లాలా లజపతిరాయ్‌ కృషి చెప్పుకోదగినది. ఆర్యసమాజ్, యంగ్‌ ఇండియా, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ ఇండియా, అన్‌హ్యాపీ ఇండియా, ది స్టోరీ ఆఫ్‌ మై డిపోర్టేషన్, భారత్‌కు ఇంగ్లండ్‌ రుణం వంటి పుస్తకాలు రాశారాయన. తన అభిమాన హీరోలు జోసెఫ్‌ మ్యాజినీ, గారిబాల్డి, దయానంద సరస్వతిల జీవిత చరిత్రలు కూడా లజపతిరాయ్‌ రాశారు. భారతీయ సంస్కృతి, తత్వశాస్త్రం మరియు సమకాలీన అవసరాలపై అమెరికాలో ఉన్న విస్తృత సమాజానికి సరైన అవగాహన కల్పించడం మరియు భారతదేశానికి స్వయం పాలన విషయంలో అమెరికా మద్దతును పొందడం పై ఆయన కృషి చేసారు. ఈ నేపధ్యంలో అమెరికాలో ఇల్లినాయిస్ రాష్ట్ర సెనేటర్ జోసెఫ్ మెక్‌కార్మిక్ ఆగస్టు 1919లో సెనేట్‌ సభలో ప్రసంగిస్తూ భారతదేశంలో బ్రిటిష్ పాలనను ఖండించిన మొట్ట మొదటి సెనేటర్ అయ్యాడు. 1919లో మొత్తానికి లాల్‌జీ భారతదేశానికి తిరిగి రావడానికి అనుమతి దొరికింది. ఆ మరుసటి సంవత్సరమే ఆయన భారత్ తిరిగి వచ్చారు. అయితే అప్పటికి భారత రాజకీయ వాతావరణం మొత్తం మారిపోయింది. గాంధీ యుగం ఆరంభమైంది. గాంధీజీ ఉద్యమాలన్నింటినీ లజపతిరాయ్‌ సమర్థించలేదు. ఉదాహరణకి శాసనోల్లంఘన. అప్పుడే జరిగిన జలియన్‌వాలా దురంతానికి నిరసనగా లజపతిరాయ్‌ పంజాబ్‌ అంతటా భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కానీ గాంధీకీ, మహమ్మదలీ జిన్నాకీ మధ్య పోటీ పెరిగిపోయింది. అంటే హిందువులు, ముస్లింలు, భారత స్వాతంత్య్రోద్యమం అనే అంశం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్న కాలమ‌ది. నిరసనకారుల చేతిలో చౌరీచౌరా పోలీస్ స్టేషన్ దహన సంఘటన తరువాత గాంధీ ఉద్యమాన్ని అర్ధాంతరంగా నిలిపి వేయాలని ఏకపక్షంగా నిర్ణయించినప్పుడు లజపతిరాయ్ గాంధీతో తీవ్రముగా విభేదించి సొంతంగా కాంగ్రెస్ ఇండిపెండెన్స్ పార్టీని స్థాపించాడు. గాంధీ అహింస పద్దతిలో సాగుతున్న ఉద్యమం ఏదో ఒక చిన్న కారణంతో విఫలం అవుతుందని లాలాజీ ముందే చెప్పారు. అందుకు తగ్గట్టు గాంధీ చర్యలు చౌరీచౌరా సంఘటనతో ప్రస్పుటం అయ్యాయి.

1927లో సైమన్‌ కమిషన్‌ భారతదేశానికి వచ్చింది. సైమన్ కమీషన్ అనగా సర్ జాన్ సైమన్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో భారతదేశ రాజ్యాంగ సంస్కరణ సూచించే బాధ్యత నిర్వహించు నిమిత్తము 1927 సంవత్సరమున ఇంగ్లండులో పురుడుపోసుకున్న ఒక కమిటీ. భారతదేశానికి స్వతంత్ర పరిపాలననిచ్చే అవకాశము లేకుండా చెయ్యడానికి, ఒక విచారణ సంఘం పేరట ఇదో ఉపశమనంతో కూడిన ఒక కంటితుడుపు కార్యక్రమంగా చెయ్యడం అప్పటి బ్రిటిష్ పాలకుల అంతఃరోద్దేశ్యము. 1927 సంవత్సరమున మద్రాసులో జరిగిన కాంగ్రెస్ మహా సభలో సైమన్ విచారణ సంఘమును అనేక విధములుగా బహిష్కరించవలెనన్న తీర్మానము చేయబడినది. పైగా భారతదేశ రాజ్యాంగ సంస్కరణలను సూచించే పనికి ఏర్పడిన సదరు కమీషన్లో ఒక్క భారతీయుడైనా లేనందుకు నిరసనగా ఉద్యమం ఆరంభమైంది. ఇందులోనూ లాలాజీ కీలక పాత్ర వహించారు. సైమన్‌ కమిషన్‌ను బహిష్కరించాలంటూ పంజాబ్‌ అసెంబ్లీలో ఆయన పెట్టిన తీర్మానం నెగ్గింది. ఇది అప్పటి బ్రిటీష్ ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. అక్టోబర్‌ 30, 1928న సైమన్ కమిషన్‌ లాహోర్‌ వచ్చింది. గాంధీజీ ఆశయం మేరకే అయినా లాలాజీ కూడా అహింసతో, మౌనంగా సైమన్‌ వ్యతిరేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలా మౌనంగా ఉద్యమిస్తున్న వారిపైన కూడా లాఠీ చార్జికి ఆదేశించాడు అప్పటి పోలీసు సూపరింటెండెంట్‌ జేమ్స్‌ ఏ స్కాట్‌. ఆయన స్వయంగా లాలాజీ మీద దాడి చేశాడు. లాలాజీ ఛాతీ మీద స్కాట్‌ కొట్టిన లాఠీ దెబ్బలు చాలా తీవ్రమైనవి. లాలాజీ తన గాయాల నుండి పూర్తిగా కోలుకోలేక, 17 నవంబర్ 1928న మరణించాడు. జేమ్స్ స్కాట్ కొట్టిన దెబ్బలు అతని మరణాన్ని వేగవంతం చేశాయని వైద్యులు భావించారు. రక్తపు మడుగులో స్పృహ కోల్పోయేంత వరకు ఆయనను లాఠీతో కొడుతూనే ఉన్నారు - అని బీ బీ సీ మీడియాలో ఒక కధనం కూడా వచ్చింది. అయితే, ఈ విషయం బ్రిటిష్ పార్లమెంట్‌లో లేవనెత్తినప్పుడు, లాలాజీ మరణంలో తమకు ఎలాంటి పాత్ర లేదని బ్రిటిష్ ప్రభుత్వం తిరస్కరించి చేతులు దులుపుకుంది. ఇందుకు రగిలిపోయిన ఉద్యమకారులు - చంద్రశేఖర్‌ ఆజాద్‌ నాయకత్వంలో ముఖ్యంగా భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌ తదితరులు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతిన పూనారు. 1928 డిసెంబర్ 10న దేశంలోని ఉద్యమకారులందరూ లాహోర్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి భగవతీచరణ్ వోహ్రా భార్య దుర్గాదేవీ నాయకత్వం వహించారు. లాలా లజపతి రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఈ సమావేశంలోనే నిర్ణయించారు. లాలాజీ మరణాన్ని భారత్ మౌనంగా సహించబోదని ప్రపంచానికి చాటి చెప్పాలన్నదే భగత్ సింగ్, ఆయన స్నేహితుల ఉద్దేశం. ముఖ్యంగా భగత్ సింగ్, ఈ సంఘటనకు ప్రత్యక్ష్య సాక్షిగా ఉండి, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ముఖ్యమైన నాయకుడు అయిన లాలాజీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని ఆనాడు ప్రమాణం చేశాడు. కానీ స్కాట్‌ని చంపాలని అనుకుని వారు, చివరికి జాన్‌ పి. సాండర్స్‌ అనే మరొక పోలీసు అధికారిని కాల్చి చంపారు.

అయితే సాండర్స్‌ అమాయకుడేమీ కాదు, ఆయన కూడా లాలాజీ పై లాఠీ చార్జీ జరిగిన సమయంలో అక్కడ ఉన్నాడు. విప్లకారులు స్కాట్ కు ముహుర్తం పెట్టిన ఆరోజు స్కాట్‌ శెలవులో ఉన్నాడు - అయితే పోలీస్ స్టేషన్ నుంచి అసిస్టెంట్ పోలీసు సూపరింటెండెంట్‌ జేపీ సాండర్స్ బయటకు రావడంతో అతన్ని చూసి అతనే స్కాట్‌గా ఉద్యమకారుడు జై గోపాల్ పొరబడ్డాడు. ఈ సమాచారాన్ని అక్కద వేచిఉన్న భగత్ సింగ్, రాజ్‌గురూలకు పంపించారు. పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన సాండర్స్ తన మోటార్ సైకిల్‌ పై బయలుదేరుతుండగా రాజ్‌గురు తన జర్మన్ మౌజర్ పిస్టల్‌తో కాల్పులు జరిపారు. "వద్దు, వద్దు, అతను స్కాట్ కాదు" అని భగత్ సింగ్ అరుస్తూనే ఉన్నారు. కానీ, అప్పటికే అలస్యం అయింది రాజ్‌గురు తుపాకీతో కాల్పులు జరిపారు. కిందపడిపోయిన సాండర్స్‌పై భగత్ సింగ్ కూడా కాల్పులు జరిపారు. మరుసటి రోజు ఉదయం పోలీసులు గోడలపై అతికించబడిన అనేక పోస్టర్లను కనుగొన్నారు, ఎరుపు రంగులో బోల్డ్ ప్రింట్ చేయబడిన శీర్షికతో: "హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ", దాని క్రింద మందపాటి అక్షరాలతో వ్రాయబడింది: "సాండర్స్ చనిపోయాడు, లాలాజీ ప్రతీకారం తీర్చుకున్నాడు".

పిదప జాతీయోద్యమ పోరాటాల అణచివేతకు బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పబ్లిక్ సేఫ్టీ బిల్లు, కార్మిక వివాదాల బిల్లులను నిరసిస్తూ 1929 ఏప్రిల్ 8న భగత్ సింగ్, భటుకేశ్వర్ దత్‌లు సెంట్రల్ అసెంబ్లీలో రెండు పొగ బాంబులను ఎవరూ లేని నిరపాయకరమైన చోటు చూసి విసిరారు. కేవలం హెచ్చరికగానే తాము పొగ బాంబులను వేశామని ఆ తర్వాత వారు ప్రకటించారు. ఈ బాంబులు వేసి వారు పారిపోక, స్వచ్ఛందంగా అక్కడే అరెస్టయ్యారు. కేసు విచారణనే వేదికగా చేసుకుని తమ హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌ఆర్‌ఎ) లక్ష్యాలను దేశానికి చాటాలని వారు ముందే నిర్ణయించుకున్నారు. కేసు విచారణ తదుపరి 1929 జూన్ 12న భగత్‌సింగ్. భటుకేశ్వర్ దత్‌లకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ, అండమాన్ జైలుకు పంపాలని కోర్టు తీర్పు చెప్పింది. అయితే సాండర్స్ హత్య కేసులో భగత్ సింగ్ నిందితుడంటూ పోలీసులు ఆ కేసును తిరగదోడారు. ఈ కేసులో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లకు 1930లో ఉరిశిక్ష విధించారు. పిదప బ్రిటీష్ ప్రభుత్వం ముగ్గురు స్వాతంత్ర్య సమరయోధులను 1931 మార్చి 23న ఉరితీసింది. లాలాజీతో పాటు పలువురు కీలక విప్లవ వీరుల వీర మరణాల నేపధ్యంలో 1933 తర్వాత విప్లవోద్యమం బలహీన పడింది. విప్లవ భావాలు ఉన్న మిగిలిన చిన్నా చితక విప్లవకారులు క్రమంగా అప్పటికే నిలదొక్కుకున్న పలు వామపక్ష పార్టీల్లో చేరిపోయారు.

విప్లవకారుల గురించి ప్రస్తావించినప్పుడు నేతాజీ సుభాస్ చంద్ర బోస్ గుర్చి రెండు మాటలు చెప్పుకోందే చర్చ పూర్తికాదు. 1938 లో మొదటి సారి కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల్లో గెలిచిన పిదప తిరిగి 1939న ఎన్నికల్లో బి. పట్టాభి సీతారామయ్యను రాజీ అభ్యర్థిగా గాంధీ పట్టుబట్టినప్పటికీ యువకుడైన సుభాస్ చంద్ర బోస్ మరో సారి పోటీ చేసి విజయం సాధించారు. అప్పటికే గాంధీ అహింసావాదం పద్దతిలో స్వాతంత్ర్యం తెచ్చుకోవాలనే పధంలో ఉన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులకు - వీధుల్లో పోరాడాలనే బోస్ పద్దతికి పొంతన కుదరలేదు. పిదప కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులలో ఎక్కువ మంది బోస్ కు నిరసనగా రాజీనామా చేసిన తర్వాత, బోస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి చివరికి పార్టీ నుండి తొలగించబడ్డాడు. తద్వారా బోస్ ను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నుకున్న విస్తృత కాంగ్రెస్ సాధారణ కార్యకర్తలను పిచ్చివాళ్ళ కింద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు జమకట్టినట్లు తెలుస్తుంది. బోస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎంపిక అయినప్పుడే జాతి అభిమతాన్ని ముఖ్యంగా యువత ఆకాంక్షలను గుర్తించి సదరు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు కాడి పారేసి తప్పుకొని, కొత్త నీరుకు స్థానం కల్పించి ఉన్నట్లయితే మరింత హుందా ఉండేది - కానీ వారు వారి స్థానాల్లో ఉండి గాంధి - నెహ్రు పధకాన్ని విజయవంతంగా అమలుచేసినట్లు తెలుస్తుంది. ‘పొమ్మనలేక పొగ పెట్టినట్లు’ సామెత గుర్తుకు రావట్లా?

లాలాజీ గూర్చి ఇంకా చెప్పుకోవల్సింది కొంత ఉంది. ఆర్ధిక రంగములో కూడా లాలాజీ ప్రవేశించి అప్పుడు ఒక బ్యాంక్ ను స్థాపించాడు. ఆయన స్థాపించిన బ్యాంక్ తరువాతి రోజుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ పేరుతో నేటికీ సేవలనందిస్తున్నది. ఆ స్ఫూర్తితోనే కీ.శే. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మన తెలుగు నాట ఆంధ్ర బ్యాంక్ ను స్థాపించారు. లాలాజీ తన తల్లి గారైన గులాబీ దేవి పేరిట 1927లో మహిళలకు వైద్య సేవలందించటానికి గులాబీ దేవి చెస్ట్ హాస్పిటల్ ను ప్రారంభించాడు. ఈ  విధముగా లాలా లజపతిరాయ్ ఒక్క స్వాతంత్ర  పోరాటంలోనే కాకుండా విద్యా, బ్యాంకింగ్, వైద్యము వంటి రంగాల ద్వారా ప్రజా సేవ చేసి భారతీయుల మనస్సుల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకొని అమరుడైనాడు. లజపతిరాయ్‌ ఆలోచనా విధానంలో మార్పులు ఎలా ఉన్నా ఆయన ప్రధానంగా మానవతావాది. అందుకు సాక్ష్యం ఆయన ఒక సందర్భంలో వ్యక్తీకరించిన భావన - ‘భారతీయ పత్రికలని శాసించే అధికారమే నాకు ఉంటే, ఈ మూడు శీర్షికలు మొదటి పేజీలో ఉండాలని చెబుతాను. పసివాళ్లకి పాలు, తినడానికి పెద్దలకు తిండి, అందరికీ విద్య.’ దురదృష్టవశాత్తు స్వతంత్రం సిద్దించి 77 ఏండ్లు దాటినా ఈ మూడు సమస్యలు మనల్ని ఇంకా వేధిస్తున్నాయి. ముఖ్యంగా జనాభా విపరీతంగా పెరిగిపోతున్న ఉత్తర భారత దేశ రాష్ట్రాలలో అయితే మరీను. అయితే జనాభా పెరుగుదలను అరికట్టడంలో గణనీయమైన పురోగతి సాధించిన దక్షిణ భారత్ లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది అనే చెప్పాలి.

గత జనవరి నెలలో భారత్ రిపబ్లిక్ దినోత్సవం, లాలాజీ జన్మదినం నేపధ్యంలో ముక్తాయింపుగా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకోవాలి - ప్రపంచవ్యాప్తంగా వ్రాతపూర్వక రాజ్యాంగం యొక్క సగటు జీవితకాలం సుమారుగా 17 సంవత్సరాలు - అంటే ప్రతి 17 ఏండ్లకు రాజ్యాంగం కొంతమేర లేదా పూర్తిగా మారుతుంది అన్నమాట. ఈ విషయాన్ని భారత కుహానా వామపక్ష వాదులు కూడా బల్ల గుద్ది చెబుతారు - కానీ భారతదేశ రాజ్యాంగ సంస్కరణల నిమిత్తము కమిటీ వేస్తాము అంటే అడ్డం కొడతారు - ఏదో ఘోరం జరిగిపోతుందని గుండెలు బాదుకుంటారు - అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా రాజ్యాంగం యొక్క సగటు జీవితకాలం సుమారుగా 17 సంవత్సరాలు ఉందనే వాస్తవాన్ని వారు ఉద్దేశ్యపూర్వకంగా విస్మరిస్తారు. ఎందుకనో! ఈ విషయంలో వీరి డ్రామాలతో కూడిన నిరసన కార్యక్రమాలు, రెచ్చగొట్టుడు ప్రకటనలు తదితర వార్తావిశేషాలతో మీడియా మొదటి పేజీలు సహజంగా కిక్కిరిసిపోతాయి. దాంతో సాంప్రదాయ వాదులు రంగప్రవేశం చేసి – అబ్బాయిలూ, గొడవెందుకు ఈ వివాదాస్పద విషయాన్ని పక్కన పెట్టి దేశాన్ని పట్టి పీడిస్తున్న ఇతర సమస్యలపై దృష్టి పెట్టండి అని హితబోధలు చేస్తారు. దాంతో భారతదేశ రాజ్యాంగ సంస్కరణల నిమిత్తము కమిటీ ప్రతిపాదన మూలన పడుతుంది, లేదా సదరు కమిటీ సభ్యులకు పనిలేకుండా చేస్తారు. గత 25 ఏండ్ల నుండి జరుగుతున్న తంతు ఇది. మొదటి రాజ్యాంగ కమిటీకి నేతృత్వం వహించిన అంబేద్కర్ ఇప్పుడు బతికి ఉంటే, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా 77 ఏండ్ల క్రితం తన నేతృత్వంలో రూపు దిద్దుకున్న భారత రాజ్యాంగాన్ని తు.చ తప్పకుండా ఇప్పటికీ అనుసరిస్తున్నందుకు మనల్ని అభినందించేవారా? లేదా వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్పు చేసుకోలేని దుస్థితిలో మనం ఉన్నందుకు అంబేద్కర్ చింతించేవారా? ఈ పంచాయితీ తేల్చాలంటే ఆయనే ఒకసారి వచ్చిపోతే పోలా?

గత నెల జనవరి 26, 2025న భారత్ 76వ రిపబ్లిక్ దినోత్సవం, ఆ పిదప జనవరి 28న లాలాజీ జన్మదినం సందర్భంగా నిఖార్సైన స్వాతంత్య్ర విప్లవకారుడు లాలాజీ ని సిరిమల్లె పాఠకులకు పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది. ఎప్పటిలాగే సిరిమల్లె పాఠకులకు సాహిత్యాభినందనలు అందజేస్తూ...అలాగే పాఠకులందరూ యధావిధిగా క్రింద నున్న కామెంట్ బాక్స్ లో మీ స్పందనను తప్పక తెలియజేయాలని వారిని అభ్యర్థిస్తూ.. ఈ నెల చర్చ ముగిద్దాం, వచ్చే నెలలో మరో ఆసక్తికరమైన రచ్చబండ చర్చకు తెర తీద్దాం! అంతవరకూ సెలవు. -- నమస్కారములతో, మీ వెంకట్ నాగం.

********

Posted in February 2025, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!