అమెరికా ఎన్నికలు కథా కమానీషు మొదటి భాగం గత నెల రచ్చబండ కార్యక్రమంలో చర్చించాం. ఎన్నికల ముందు భారత నేపధ్యం ఉన్న అటు డెమొక్రాట్ పార్టీ అధ్యక్ష్య అభ్యర్ధి కమలా హారిస్, ఇటు రిపబ్లికన్ ఉపాధ్యక్ష్య అభ్యర్ధి భార్య తెలుగు తేజం ఉషా చిలుకూరి గూర్చి చర్చించి వారిద్దరికీ ముందస్తు శుభాకాంక్షలు చెప్పుకోవడం జరిగింది. రాయబారానికి బయలుదేరే ముందు.. కృష్ణుడు "అయినను పోయి రావలె హస్తినకు" అని చెప్పి వెళ్ళినట్లు - మరి కృష్ణుడు రాయబారానికి వెళ్ళాలి - అది విఫలం అవ్వాలి, అప్పుడే కదా, యుద్ధం మొదలయ్యి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరిగి, శుభం కార్డు పడేది. అలాగే సదరు ఎన్నికల ఫలితాలు వచ్చిన వేళ, ఆ పిదప జరిగిన ముచ్చటను చర్చించినప్పుడే కదా - మన ఈ అమెరికా ఎన్నికల రచ్చబండ చర్చకు శుభం కార్డు పడేది. ఉపోద్ఘాతము అయింది కాబట్టి నేరుగా రెండవ భాగం చర్చలోకి వెళ్ళదాం.
ఎలక్ట్రోరల్ కాలేజీలోని మొత్తం 540 ఓట్లలో సగం తెచ్చుకున్న అభ్యర్థి అధ్యక్షుడవుతారు. ఈ లెక్కన 270 ఓట్లను తెచ్చుకున్న అభ్యర్ధి అమెరికా అధ్యక్ష్య పదవి చేపడతారు. పోటీ హోరాహోరిగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి అని పలు అమెరికా మీడియా సంస్థలు చేసిన ప్రచారం, చేసిన సర్వేలు రెండూ కూడా తప్పని ఏడు తటస్థ రాష్టాల ఫలితాలు తేల్చేసాయి. ఈ దఫా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఏకంగా 312 ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లతో ఆయన సంచలనం సృష్టించారు.
అమెరికా ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తున్నాయని భావిస్తున్న ఏడు స్వింగ్ రాష్ట్రాలను ‘రణక్షేత్ర రాష్ట్రాలు’గా పలువురు రాజకీయ విశ్లేషకులు ఇంతకు మునుపే వర్ణించారు. అధ్యక్షుడిని నిర్ణయించడంలో ఈ రాష్ట్రాల్లో గెలుపు ముఖ్యమని వారు బల్ల గుద్ది పలుమార్లు చెప్పారు. ఈ రాష్ట్రాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయో ముందే ఊహించడం ఒక సంక్లిష్టమైన విషయం. ఈ మధ్య ప్రతి నాలుగు ఏండ్లకు జరిగే అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో దాదాపు ఇదే తంతు. ఈ ఏడు రాష్ట్రాలలో అటు డెమోక్రాట్, ఇటు రిపబ్లికన్‌లకు దాదాపు సమాన స్థాయి మద్దతు ఉంటుంది. అందుకే ఎవరు గెలుస్తారనేది ఫలితాలు వచ్చే వరకు చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంటుంది. అత్యధికంగా పెన్సిల్వేనియా 19 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. మిచిగాన్‌లో 10, జార్జియాలో 16, విస్కాన్సిన్‌లో 10, నార్త్ కరోలినాలో 16, నెవాడాలో 6, అరిజోనాలో 11 ఎలక్టోరల్ సీట్లు ఉన్నాయి. అయితే ఈ నెల నవంబర్ 5న జరిగిన ఎన్నికల్లో ఈ ఏడు రాష్ట్రాలలో ఉన్న మొత్తం ఎలక్టోరల్ ఓట్లు గంపగుత్తగా ట్రంప్ సంచిలో పడ్డాయి. దాంతో ట్రంప్ గెలుపు నల్లేరు బండిపై నడక మాదిరి అయిపోయింది. పైగా మొత్తం అమెరికాలో ఉన్న అన్ని 50 రాష్ట్రాలలో పోల్ అయ్యిన ఓట్లు కలిపి లెక్కించితే ట్రంప్ కు కమలా హారిస్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంతే కాదు ఇటు ప్రతినిధుల సభ, అటు సెనెట్ లో కూడా ట్రంప్ పార్టీ మెజారిటీ స్థానాలు కైవశం చేసుకుంది. దాంతో ఈ ఎన్నికల్లో ట్రంప్ విజయం సంపూర్ణం అయ్యింది అనే చెప్పాలి.
ఇటు భారత్ లో, ‘ఉపాధ్యక్ష్య అభ్యర్ధి వాన్స్ భార్య ఉషా వాన్స్ అమెరికాకు ద్వితీయ మహిళ కావడం పట్ల ఆమె పూర్వీకుల నివాసం ఆంధ్రప్రదేశ్ కు చెందిన వడ్లూరు గ్రామ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆమె విజయాలను చూసి వారు గర్వపడుతున్నారు’ అని తెలుగు మీడియాలో వార్తలు వచ్చాయి. ఉష తాత రామశాస్త్రి మేనకోడళ్లయిన పారిపూడి నాగమణి, దువ్వూరి విజయలక్ష్మి తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరులో నివసిస్తున్నారు. వాన్స్ గెలుపుతో అక్కడి స్థానికులు మిఠాయిలు పంచి, బాణసంచా కాల్చారు. వడ్లూరులోని 20 సెంట్ల స్థలాన్ని చిలుకూరి కుటుంబ సభ్యులు గ్రామానికి దానమిచ్చారని మాజీ సర్పంచ పెనమత్స శ్రీనివాసరాజు పేర్కొన్నారు. అందులో సాయిబాబా ఆలయం, కల్యాణ మండపం నిర్మించామని చెప్పారు. ఉష కుటుంబం మూలాలు ఇక్కడ ఉండటం మా ఊరికి గర్వకారణం అని ఆయన చెప్పారు. తన మనువరాలి భర్త జేడీ వాన్స్ అమెరికాకు ఉపాధ్యక్షుడు కావడం పట్ల విశాఖపట్నంలో ఉండే ఉష సమీప బంధువు విశ్రాంత ప్రొఫెసర్ శాంతమ్మ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన విజయాన్ని ముందే ఊహించానని ఆమె చెప్పారు. "ఉదయం నుంచి గెలుపు ఖరారయ్యే వరకు టీవీ చూస్తూనే ఉన్నాను. ఇప్పటివరకూ ఉషతో, ఆమె భర్తతో మాట్లాడలేదు. విజయోత్సవాలు ముగిసిన తర్వాత మాట్లాడతాను భారత్, అమెరికా మధ్య సత్సంబంధాలు బలోపేతం చేసేలా చూడాలని వాన్స్‌ను కోరతాను" - అని ఆమె అన్నారు.
ఈ ఎన్నికల విజయం అమెరికా విదేశాంగ విధానం మరియు అంతర్జాతీయ సంబంధాలను మార్చే విధంగా గణనీయమైన ప్రభావం కలిగి ఉంటుందని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రజల మధ్య గత నాలుగు ఏండ్లుగా పేరుకుపోయిన ఆర్థిక ఆందోళనల మొదలు సామాజిక విధానాల వరకు వివిధ సమస్యలపై ఓటర్లు చీలిపోయిన నేపధ్యలో జరిగిన ఈ ఎన్నికలు విశిష్టమైనవి అని చెప్పాలి. అమెరికా ఆయుధ లాబీ కోసమే జో బైడెన్ ఈ యుద్ధాలు చేయిస్తున్నాడు, అమెరికాకు అక్రమంగా వచ్చిన వారిపై బైడెన్ శీతకన్ను వేస్తున్నాడు అనే ప్రతిపక్షాల ఆరోపణలున్నాయి. మరోవైపు ట్రంప్ వస్తే.. రష్యా - ఉక్రెయిన్, ఇజ్రాయిల్ - పాలస్తీనా యుద్ధాలకు ఓ ముగింపు దొరుకుతుందనే వాదనలు వినిపించాయి. ఎన్నికల ఫలితాలు చూసిన పిదప - ట్రంప్ పై జరిగిన మూడు హత్యాయత్నాలపై సానుభూతి కంటే - అమెరికా ఎకనామీ కి పూర్వ వైభవం రావాలంటే అందుకు సరైన వ్యక్తి ట్రంప్ అని ప్రజలు భావించినట్లు అందుకే ఆయనకు వారు పెద్ద ఎత్తున ఓట్లు వేసినట్లు - పలువురు డెమోక్రాట్ సానుభూతిపరులు అనుకోవడం నేను ప్రత్యక్ష్యంగా విన్నాను.
ట్రంప్ ఎన్నిక పట్ల భారత్ లో భయాందోళనలు కొన్ని ఉన్నాయి. అమెరికా ఫస్ట్ అన్న డొనాల్డ్ ట్రంప్ నినాదం భారతీయ ఉద్యోగులకు శరాఘాతంగా పరిణమించబోవచ్చు. అయితే అమెరికా ఎకనమీకు హాని చేసే నిర్ణయాలకు ట్రంప్ గుడ్డిగా ఉపక్రమించకపోవచ్చు. ఉదాహరణకు అప్ఘనిస్తాన్ ను తాలిబాన్ల పరం చేయడం పట్ల ట్రంప్ ను విమర్శించినవారు ఇప్పుడు కాస్త తగ్గిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మారిన తాలిబాన్లు అప్ఘనిస్తాన్ కు మెరుగైన పాలనను అందిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య నాతో మాట్లాడిన అప్ఘనిస్తాన్ అమెరికన్ డాక్టర్ ఈ విషయాన్ని బల్ల గుద్ది చెప్పిన విషయం నాకు గుర్తు ఉంది. తాలిబాన్ 2.0 పాలనలో గణనీయంగా అవినీతి కట్టడి అయ్యిందని, యూరోప్ కు వలసవెళ్ళిన అనేకమంది అప్ఘనిస్తాన్ కు తిరిగి వస్తున్నారని ఆయన చెప్పడం నాకు గుర్తుకు వచ్చింది. ఈ విషయంలో ఆయన అబద్దం చెప్పవచ్చు, కానీ సంతోషంతో వెలుగుతున్న ఆయన ముఖం అబద్దం చెప్పదు కదా! ఏది ఏమైనా ఈ విషయంలో ట్రంప్ ముందుచూపుతో వ్యవహరించి అమెరికా సైనికులను అప్ఘనిస్తాన్ నుండి వెనక్కి పిలవడంతో అటు అమెరికాలో పన్నులు కట్టే ప్రజల బోలెడంత డబ్బు ఆదా అవ్వడమే కాకుండా, ఇటు అప్ఘనిస్తాన్ కు కూడా మంచి రోజులు వచ్చాయి అని అనుకోవాలి.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో ఒకసారి గెలిచి, తర్వాత ఓడిపోయి ఇప్పుడు మరోసారి బరిలోకి దిగిన డోనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించిన నేపధ్యంలో - అమెరికా ఎన్నికలు మన భారత్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయని దేశ వ్యాప్తంగా చర్చ ఇప్పుడు నడుస్తోంది. జనాభా పరంగా అమెరికాకు భారత్ అతిపెద్ద మార్కెట్. అంతేకాదు అమెరికా దేశ ఉన్నతిలో మన భారతీయలు పాత్రను కాదనలేము. కెనడాలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న కారణంగా, అక్కడి విశ్వవిద్యాలయాలలో విదేశీ విద్యార్ధులకు ప్రవేశం ప్రశ్నార్ధకం అయిన నేపధ్యంలో భారత విద్యార్ధుల చూపు ఇప్పుడు ప్రధానంగా అమెరికా పై ఉంది. ఈ కెనడా గొడవ అటుంచితే, అమెరికా సమాజానికి ఈ ఎన్నికల నేపధ్యంలో ట్రంప్ అనేక వాగ్దానాలు చేసారు కనుక ఇప్పుడు కార్యాచరణకు ట్రంప్ ఉపక్రమించక తప్పదు. ఏతా వాతా అమెరికాకు మేలు చేసే విధంగా ట్రంప్ చేసే నిర్ణయాలు, భారత్ కు కూడా అనుకూలంగా ఉంటాయని ఆశిస్తూ, ఈ అమెరికా ఎన్నికల రచ్చబండ చర్చను ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఎప్పటిలాగే సిరిమల్లె పాఠకులకు సాహిత్యాభినందనలు అందజేస్తూ...అలాగే పాఠకులందరూ యధావిధిగా క్రింద నున్న కామెంట్ బాక్స్ లో మీ స్పందనను తప్పక తెలియజేయాలని వారిని అభ్యర్థిస్తూ.. ఈ నెల చర్చ ముగిద్దాం, వచ్చే నెలలో మరో ఆసక్తికరమైన రచ్చబండ చర్చకు తెర తీద్దాం! అంతవరకూ సెలవు.
-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం
ధన్యవాదాలు గురువు గారు!
చాలా మంచి విశ్లేషణ, మిత్రమా