"కర్ణుడు లేని భారతం - శొంఠి లేని కషాయం ఒక్కటే" - ఈ నవంబర్ 5, 2024న అమెరికా అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల నేపధ్యంలో - సిరిమల్లె పత్రికలో సదరు ఎన్నికల ప్రస్తావన లేకుండా ఒక వేళ పత్రిక విడుదల అయితే...ఈ సందర్భాన నాకు గుర్తుకు వచ్చిన సామెత ఇది. భారత్ నేపధ్యం ఉన్న కమలా హారిస్ డెమొక్రాట్ పార్టీ వైపునుండి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతుండగా, మరో వైపు ఈ పార్టీ బద్ద శత్రువు అయిన రిపబ్లికన్ పార్టీ నుండి తెలుగు తేజం ఉషా వేన్స్ (ఉషా చిలుకూరి) భర్త జే డీ వేన్స్ ఉపాధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నాడు. రిపబ్లికన్ పార్టీ నుండి అధ్యక్ష పదవికి పాత కాపు ట్రంప్ ఎటూ రంగంలో ఉండనే ఉన్నాడు కదా! భారత నేపధ్యం ఉన్న వీరిద్దరిలో ఎవరు గెలిచినా భారతీయుల పని - రచ్చ గెలిచినట్లే - అంతే కాదు సుమా -"రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే"- కూడా! కాదంటారా?
80వ దశాంకంలో నేను తెలుగు దినపత్రిక ఈనాడు చదువుతున్నప్పుడు, అప్పటి ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు తెలుగువాడు అమెరికా అధ్యక్షుడు కావాలని ఆయన బలంగా ఆకాంక్షించినట్లు నాకు గుర్తు. ఆయన కల ఇప్పటికిప్పుడు ఫలించే అవకాశంలేదు కానీ, ప్రస్తుత అమెరికా అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల నేపధ్యంలో చూస్తుంటే ఎప్పటికైనా తెలుగు వాడు అమెరికా అధ్యక్షుడు అయి తీరతాడు అని అనిపిస్తుంది. నేరుగా తెలుగు వాడు అమెరికా అధ్యక్షుడు కాలేడు సుమా, ఎందుకంటే అందుకు అమెరికా చట్టాలు ఒప్పుకోవు. అమెరికా అధ్యక్షుడు తప్పనిసరిగా పుట్టుకతో అమెరికన్ పౌరసత్వం కలిగి ఉండాలి. భారత దేశం విషయానికి వస్తే విదేశాలలో జన్మించిన వ్యక్తి కూడా భారతదేశానికి ప్రధాన మంత్రి కావచ్చు - కానీ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో మాత్రం సదరు వ్యక్తి భారతీయ పౌరుడిగా ఉండాలి - పేర్లు ఎందుకులే కానీ, ఘనత వహించిన భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ సడలింపును ఎందుకు ఇచ్చారో - అలా ఎందుకు రాసారో మహానుభావులు! అసలు విషయానికి వస్తే అనేకమంది ప్రవాసాంధ్రులు పలు స్థానిక ఎన్నికల్లో పోటీ పడుతున్న వార్తలు వస్తున్న నేపధ్యంలో ఎన్.టి. రామారావు కల నిజం అయ్యే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పాలి.
సరే ముందు ప్రస్తుత అమెరికా అధ్యక్ష డెమోక్రాట్ పార్టీ అభ్యర్ధి కమలా హారిస్ గూర్చి చెప్పుకుందాం. అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ చివరి క్షణంలో కాడి పారేసి రేసు నుంచి తప్పుకోవడంతో - ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్ పంట పండింది అని చెప్పాలి - బైడెన్ స్థానంలో ఆమె అధ్యక్ష పదవి రేసులో ఏకైక అభ్యర్ధిగా ముందుకొచ్చారు. అభ్యర్థిత్వాన్ని వదులుకున్న బైడెన్ కూడా హారిస్‌కే తన సంపుర్ణ మద్దతు తెలిపారు - వేరే దారి లేదు ఆయనకు మరి! భారత సంతతికి చెందిన 59 ఏళ్ల కమలా హారిస్ 2020 ఎన్నికల సమయంలోనూ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించారు, కానీ అప్పుడు ఆమెకు తగిన మద్దతు లభించలేదు. కమలా హారిస్ ఎవరు? ఆమె భారతీయ మూలాలు ఏమిటి? ఆమె ఎప్పుడైనా భారత్ వచ్చారా? ఆమె బాల్యం ఎలా సాగిందనేది ఆసక్తికరం. కమలా ఆత్మకథ ‘ద ట్రూత్స్ వి హోల్డ్’ పుస్తకం 2018లో విడుదలైంది. అందులో ఆమె.. ‘నా పేరును కమలా అని పిలవాలి. పంక్చుయేషన్ కోసం ఉపయోగించే కామా (,) పలికినట్లు పలకాలి’ అని రాశారు. అంటే కమల అని కాదు, "ల" కు దీర్ఘం ఇవ్వాలి అని ఆమె చెప్పారు. కమలా హారిస్ తల్లి తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. తండ్రి జమైకాలో పుట్టారు. ఆయన అఫ్రికన్ అమెరికన్. కమలా హారిస్ తండ్రి డోనల్డ్ హారిస్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్. తల్లి శ్యామల గోపాలన్ తమిళనాడు నుండి అమెరికాకు వలస వెళ్ళిన క్యాన్సర్ పరిశోధకురాలు, పౌర హక్కుల కార్యకర్త. కమలా హారిస్‌కు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడే, ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. కమలా హారిస్, ఆమె చెల్లెలు మాయాలను వారి తల్లి ఒంటరిగానే పెంచారు. ఆ ముగ్గురినీ కలిపి... వారికి తెలిసినవాళ్లు ‘శ్యామల అండ్ ద గర్ల్స్’ అని పిలిచేవాళ్లట. ఆఫ్రికాకు చెందిన నల్ల జాతి తండ్రి పోలికలతో పుట్టిన తన ఇద్దరు ఆడపిల్లలను అమెరికా సమాజం నల్ల జాతి అమ్మాయిలుగానే గుర్తిస్తుందని శ్యామలకు బాగా తెలుసు. అందుకే, చిన్నప్పటినుండే ఇద్దరి పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని ఆమె నూరిపోశారు.
చిన్నప్పుడు దక్షిణాది వంటకాలు తిన్నారా అని కమలా హారిస్‌ను భారత సంతతి కమెడియన్ మిండీ కలింగ్ ప్రశ్నించగా, ఆమె ‘అన్నం, పెరుగు, ఆలుగడ్డ కూర, పప్పు, ఇడ్లీ’ తిన్నాను అంటూ చిన్నప్పుడు తాను ఇంట్లో తిన్న వంటల జాబితాను ఏకరువు పెట్టారు కమలా హారిస్. కమలా హారిస్ 2014లో డగ్లస్ ఎమ్హోఫ్ అనే న్యాయవాదిని పెళ్లాడారు. డగ్లస్ ఒక యూదుడు. భారతీయ, యూదు సంప్రదాయలను అనుసరిస్తూ తమ వివాహం జరిగిందని కమలా హారిస్ తన పుస్తకంలో రాశారు. ఇక్కడ ఈ విషయంలో ఆమె తన తండ్రి ఆఫ్రికా నేపధ్యాన్ని పట్టించుకోలేదు అనుకోవాలి. ఇకపోతే కమలా హారిస్‌ను ఎక్కువగా నల్లజాతి అమెరికన్ రాజకీయ నేతగానే అమెరికా ప్రజలు చూస్తుంటారు. మరోవైపు భారతీయ అమెరికన్లు కూడా ఆమె తల్లి శ్యామలా భారత్ నేపధ్యం మూలంగా కమలా హారిస్‌ను తమలో ఒకరిగా చూసుకుంటున్నారు. కమలా హారిస్ - డగ్లస్ ఎమ్హోఫ్ కు పిల్లలు లేరు, అయితే డగ్లస్ ఎమ్హోఫ్‌కు ఇంతకు మునుపు జరిగిన పెండ్లి మూలంగా జన్మించిన కొడుకు, కూతురును తమ బిడ్డలుగానే కమలా హారిస్ - డగ్లస్ ఎమ్హోఫ్ భావిస్తారు.
‘చదువు పూర్తైపోగానే, భారత్‌కు తిరిగివచ్చి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానని మా అమ్మ తన తల్లిదండ్రులకు మాట ఇచ్చింది. కానీ, ఆమె తలరాత మరోలా ఉంది’ అని కమలా హారిస్ తన పుస్తంలో వివరించారు. అయితే కమలా హారిస్ తన పుస్తకంలో తన వ్యక్తిగత భారత పర్యటనల గురించి ఎక్కువగా ప్రస్తావించలేదు.
ఇక ఉషా చిలుకూరి - అమెరికా రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ భార్య నేపధ్యం గూర్చి క్లుప్తంగా తెలుసుకుందాం. ఉషా చిలుకూరి తెలుగువారు. ఉషా చిలుకూరి పూర్వీకుల గ్రామం గోదావరి కాలువను ఆనుకుని ఉండే వడ్లూరు గ్రామం. ఈ గ్రామం విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్తూంటే తణుకు పట్టణం వద్ద ఉంది. ఆమె బంధువులు పలువురు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు. ఆమెకు నాన్నమ్మ వరుసయ్యే ప్రొఫెసర్ శాంతమ్మ విశాఖపట్నంలో నివసిస్తున్నారు. తన భర్త సోదరుడి మనవరాలు ఉషా అని శాంతమ్మ చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం - 2013లో ఉషా, వేన్స్ వీరిద్దరూ యేల్ లా స్కూల్‌లో తొలిసారి కలుసుకున్నారు. ‘సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా’ అనే అంశంపై జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో వీరిద్దరూ కలసి పాల్గొన్నారు. పరస్పరం ఇష్టపడ్డ తదుపరి 2014లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఉషా, జేడీ వాన్స్ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇవాన్, వివేక్, మీరాబెల్ వారి పేర్లు. ఉషా తల్లిదండ్రులు భారత దేశం నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. ఉషా చిన్నప్పటి నుంచి కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ డియాగో నగరం లో పెరిగారు. ఉషా హిందూ సంప్రదాయంలో పెరగగా, జేడీ వాన్స్ క్యాథలిక్ మతాన్ని అనుసరిస్తారు. ఉషా ప్రస్తుతం లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఉషా గూర్చి చెబుతూ - ‘ఆమె జ్ఞానం గురించి చాలామందికి తెలియదు. వెయ్యి పేజీల పుస్తకాన్ని కూడా కొన్ని గంటల్లోనే చదివేయగలదు’ అన్నారు జేడీ వాన్స్. ‘నేను మరీ ఊహల్లో విహరిస్తూ గాలిలో తేలుతుంటే ఉషా నన్ను అప్పుడప్పుడు భూమి మీదకు వాస్తవ ప్రపంచంలోకి దింపుతుంటారు’ అని 2020లో మేగిన్ కెల్లీ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు జేడీ వాన్స్. ఇలా జేడీ వాన్స్ తరచూ భార్యను పొగుడుతుంటారు. అంతే కాదు ఆమెను తన యేల్ యూనివర్సిటీ ‘ఆధ్యాత్మిక గురువు’గా ఆయన పలుమార్లు అభివర్ణించారు. అమెరికా రెండవ పౌరుడి పదవికి (ఉపాధ్యక్షుడు) పోటీ పడుతున్న జేడీ వాన్స్ వెనుక మూల స్థంభంగా నిలబడ్డ మహిళ ఒక భారత నేపధ్యం ఉన్న మహిళ, అదీ మన తెలుగు మూలాలు ఉన్న మహిళ "ఉషా చిలుకూరి" కావడం మనకు గర్వకారణం.
ఏతా వాతా రెండు భిన్న పార్టీల మధ్య జరుగుతున్న అధ్యక్ష్య - ఉపాధ్యక్ష్య సమరంలో ఉన్న ఇద్దరు మహిళలకు భారత నేపధ్యం ఉండడం, వారిలో ఒకరు మన తెలుగు మూలాలు ఉన్న మహిళ కావడం ఆసక్తికరం. డెమోక్రాట్ పార్టీ తరపున పోటీలో ఉన్న కమలా హారిస్ నెగ్గితే నేరుగా ఆమె అమెరికా ప్రధమ మహిళా అధ్యక్షురాలు అవుతారు, ఆమె ఓటమి అంటే ట్రంప్ గెలుపే కాబట్టి ఆయన అధ్యక్షుడు అవ్వడం - ఆయనతో పాటు "ఉషా చిలుకూరి" భర్త జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడు అవ్వడం ఖాయం. అసలే మూడు మార్లు హత్యాయత్నం ప్రయత్నాలనుండి బయటపడ్డ ట్రంప్ పై అమెరికా సమాజంలో పెల్లుబికిన సానుభూతి రీత్యా కమలా హారిస్ విజయం విషయంలో చాలమందికి సందేహాలు ఉన్నాయి. అసలు విషయాని వస్తే - కమలా హారిస్ అభ్యర్దిత్వంపై అమెరికా సమాజంలో తగినంత చర్చ జరగలేదన్నది వాస్తవం. ఎందుకంటే ఆమె డెమోక్రాట్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేసి, తోటి డెమోక్రాట్ అధ్యక్ష్య పదవికి పోటీపడుతున్న ప్రత్యర్ధులను మట్టికరపించి - మెజారిటీ రాష్ట్రాలలో జయకేతనం ఎగురవేసి ఉన్నట్లయితే - ఆమె పట్ల విశృత సానుకూల పవనాలు ఈ పాటికి వీచిఉండేవి. మొదటి నుండి పోటీలో ఉండి ఆనక అర్ధాంతరంగా బైడెన్ కాడి పారేసిన ఫలితంగా ఆమె తెరపైకి రావడంతో ముఖ్యంగా అమెరికా తటస్థ రాష్ట్రాలలో ఆమె గెలుపుపై కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆమాటకొస్తే మొత్తం 50 రాష్ట్రాలకు గాను 7 తటస్థ రాష్ట్రాలు 2024 అధ్యక్ష ఎన్నికలను గణనీయంగా ప్రభావితం చేయగలవు అని ఎన్నికల పరిశీలకులు బల్ల గుద్ది చెబుతున్నారు. అవి: అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, ఉత్తర కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ మొత్తం ఏడు రాష్ట్రాలు. ఈ ఎన్నికల్లో ఈ 7 రాష్ట్రాలలో అటు డెమొక్రాట్లకు, ఇటు రిపబ్లికన్ల మధ్య విజయం దోబూచులాడుతూ ఉంటుంది అని పరిశీలకుల అంచనా. 2016 ఎన్నికల్లో ఈ ఏడు రాష్ట్రాలు ట్రంప్ కు జై కొట్టాయి, 2020 ఎన్నికల్లో ఈ ఏడింటిలో ఆరు రాష్ట్రాలు ప్లేటు మార్చి బైడెన్ కు సరే అన్నాయి, తాజాగా ఇప్పుడు 2024లో కథ ఏమిటో తెలియాలంటే నవంబర్ 5 వరకు ఆగాల్సిందే మరి. అసలు విషయానికి వెళ్ళితే - స్థానిక నిరుద్యోగ సమస్య, అమెరికా కు ఎడతెరిపి లేకుండా వస్తున్న అక్రమ వలసల సమస్య, అరకొర ఆరోగ్య సౌకర్యాలు, ధరలు – ద్రవ్యోల్బణం, మరియూ ఇతర స్థానిక సమస్యలు - తదితర విషయాలు తరచుగా అమెరికా ఎన్నికల్లో ప్రధానాంశాలుగా నిలుస్తుంటాయి. అందుకే ఎందుకన్నా మంచిదని కమలా హారిస్ మరియు ట్రంప్ ఇద్దరూ తమ ప్రచారాలలో గెలుపు ఖాయంగా లేని ఈ ఏడు తటస్థ రాష్ట్రాలను తమ ప్రాధాన్యతగా మార్చుకున్నారు. ఎన్నికల సీజన్ ప్రచారం ఈ నవంబర్ 3కి ముగియనున్న సందర్భంగా అటు ట్రంప్, ఇటు కమలా హారిస్ ఇద్దరూ ఈ తటస్థ రాష్టాల ప్రజలను ఎన్నికల సభలు, సందర్శనలు మరియు ర్యాలీలతో - ఒకింత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు అని చెప్పాలి.
ఈ సంవత్సరం సెప్టెంబర్ లో అమెరికాకు అధికార పర్యటన నిమిత్తం వచ్చిన ప్రధాని మోదీ అటు ట్రంప్, ఇటు కమలా హారిస్‌లను కలవకుండా "మధ్యే మార్గం శరణ్యామి" అనుకుంటూ భారత్ కు తిరిగొచ్చారు. 2019 లో ట్రంప్ కు పరోక్ష మద్దతు నిచ్చి, తీరా తదుపరి బైడెన్ ఎన్నికైన గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, "షెడ్యూలింగ్ ఇబ్బందులు" అనే సాకుతో, రాష్ట్రపతి అభ్యర్ధులను కలవకుండా ఉండాలని ప్రధాని మోడీ సలహాదారులు నిర్ణయించుకున్నట్లు పలు పత్రికలు ఘోషించాయి. "తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి" - సామెత సరిగ్గా సరిపోలా? ఇతర దేశాల ఎన్నికల్లో వేలు పెట్టేకంటే, సదరు ఎన్నికలు అయ్యేంతవరకు ఆగి - గెలిచిన అభ్యర్ధితో పనిచేస్తే మెరుగనే అభిప్రాయానికి బహుశా ప్రధాని మోడీ సలహాదారులు వచ్చి ఉంటారు. ఈ మధ్యనే సంకీర్ణ ప్రభుత్వం భారత్ లో తాజాగా కొలువుతీరిన వేళ భారత్ కు అమెరికా ప్రజలచేత ఎన్నికైన సర్కారు మద్దతు కీలకం కదా!
చివరగా, భారత నేపధ్యం ఉన్న ఇద్దరు నారీమణులు విభిన్న పార్టీల నుండి ఒకరు ప్రత్యక్ష్యంగా, మరొకరు పరోక్షంగా పోటీకి దిగడం - వీరిద్దరిలో ఒకరు నెగ్గడం ఖాయం కనుక, భవిష్యత్తులో అమెరికా - భారత్ సంబంధాలకు ఇటు కమలా హారిస్, అటు ఉషా చిలుకూరి భారతీయ నేపధ్యం ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ ఇద్దరు నారీమణులకు సిరిమల్లె పత్రికా ముఖంగా ముందస్తు అభినందనలు తెలుపుతూ...ఈ రచ్చబండ చర్చ రాసే నాటికి, అమెరికా అధ్యక్ష పదవికి, ఇతర కాంగ్రెస్ పదవి ఎన్నికలు, పలు రాష్ట్ర శాసన సభల ఎన్నికలు మొత్తం జమిలి ఎన్నికలు జరగడానికి కేవలం ఒక వారం సమయం మాత్రమే ఉంది - ఈ సందర్భంగా సదరు ఎన్నికల్లో పోటీలో ఉన్న భారత నేపధ్యం ఉన్న అభ్యర్ధులందరికీ పార్టీల కతీతంగా మద్దతు తెలపడం మన ధర్మం. ఎప్పటిలాగే సిరిమల్లె పాఠకులకు సాహిత్యాభినందనలు అందజేస్తూ...అలాగే పాఠకులందరూ యధావిధిగా క్రింద నున్న కామెంట్ బాక్స్ లో మీ స్పందనను తప్పక తెలియజేయాలని వారిని అభ్యర్థిస్తూ.. ఈ నెల చర్చ ముగిద్దాం, వచ్చే నెలలో మరో ఆసక్తికరమైన రచ్చబండ చర్చకు తెర తీద్దాం! అంతవరకూ సెలవు.
-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం
డా. నెల్లుట్ల నవీన చంద్ర గారు, రచ్చబండకు స్వాగతం. మీ అంచనాలు ఫలవంతమయ్యాయి, మీ ఊహ నిజమయ్యింది. మీ స్పందనకు ధన్యవాదాలు.
మీ వ్యాసం కొంత హాస్యం తో చదవడానికి సులభంగావున్నది. ముఖ్యంగా భారతప్రభుత్వం ఎటు వారూ మొగ్గకుండా తప్పించుకోవడం లో నవ్వకుండా వుండలేము. సదరు 7 రాష్ట్రాల లో 4 ఈ సారి రిపబ్లికన్ పార్టీ వైపు వోటు చేస్తాయని నా అభిప్రాయం. ఉత్తర కారొలానా, జార్జియా, అరిజోనా, పెనిసిల్వేనియా ట్రంపుకు వోటు చేస్తాయని నా ఆలోచన. నెవాడా, మిషిగన్ చెప్పడానికి వీలు లేదు. విస్కాన్సిన్ డెమోకుపోతుంది. ఆవిధంగా రిపబ్ లే గెలుస్తారని నా ఊహ.