‘అన్నం పెడితే అరిగిపోతది.. చీరె ఇస్తె చినిగిపోతది.. వాత పెడ్తె కలకాలం ఉంటది.. అని మాకు వాతలు బెట్టారు’ - అని ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన ఒక రాజకీయ నాయకుడు వాపొయినట్లు పత్రికల్లో వచ్చిన వార్త (వాత) ఒకటి ఈ మధ్య నా దృష్టికి వచ్చింది. ఐదు సంవత్సరాలు అధికారం కట్టబెడితే అహంకార పూరితంగా వ్యవహరించి - ఆనక జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రజలచే వాతలు పెట్టించుకున్న రాజకీయ నాయకుల్లో బహుశా ఈయన కూడా ఒకడు అయి ఉంటాడు. అన్నట్లు వాతలంటే నాకు తక్షణం గుర్తుకు వచ్చేది - "తెనాలి రామకృష్ణ మామిడి పండ్లు - వాతలు" కథ. విషయం వచ్చింది కాబట్టి క్లుప్తంగా ఆసక్తికరమైన ఈ కథ చెప్పుకుందాం.
కథలోకి వెళ్తే … మంచంలో ఆఖరి క్షణాలలో ఉన్న తల్లి చెంతనున్న శ్రీకృష్ణ దేవరాయలకు వారి తల్లి చివరి కోరిక ఆయనకు అస్పష్టంగా వినపడింది. ఆయన భటుల కేసి చూసి వెంటనే వెళ్ళి ఎక్కడైనా మామిడి పళ్ళు దొరికితే వెంటనే తెమ్మన్నారు. వెళ్ళిన భటుల్లో ఒక భటుడు పరుగెత్తుకుంటూ వచ్చి ఒక మామిడిపండు పట్టుకొచ్చాడు. కాని అప్పటికే ఆమె తుది శ్వాస విడిచారు. అయ్యో తన తల్లి కడసారి కోరిక తీర్చలేకపోయానే అని రాయలవారు తెగ బాధపడిపోసాగారు. సమయం కోసం కాచుకొని కుర్చున్న తాతాచార్యులు వారు “మహారాజా! తమ తల్లి గారి కర్మ పదకొండవ రోజున ప్రజలకు ఒక్కో బంగారు మామిడి పండు దానం చెయ్యండి. అప్పుడు మామిడిపండు కోసం క్షోభించిన తమ తల్లిగారి ఆత్మ సంతోషిస్తుంది” అని ఒక ఉచిత సలహా పడేశారు.. ఈ సలహా రాయలవారికి అమితంగా నచ్చింది. రాజు తలచుకొంటే బంగారు మామిడిపళ్ళకు కొదవా? వెంటనే మంత్రి తిమ్మరుసును పిలిచి ఖజానా నుండి బంగారం బయటకు తీసి వెయ్యి బంగారు మామిడిపళ్ళు తయారుచేయించమని హుకుం జారీచేసారు.
“అబ్బో! వెయ్యి బంగారు మామిడి పళ్ళూ!! అంటే ఎంతో ఖర్చు. ఈ దుబారా ఆపుచేసే మార్గమేలేదా” అని తిమ్మరుసు ఆలోచించి ఇందుకు తగిన వాడు రామకృష్ణుడే అని అనుకొని ఆయన్ను పిలిపించి ఏదన్నా ఒక ఉపాయం పన్నమని కోరారు. రామకృష్ణుడు సరే అని తలవూపి వెళ్ళిపోయాడు.
రాయల వారి తల్లి కర్మ పదకొండవ రోజున బ్రాహ్మణులు వచ్చి దివాణం దగ్గర వేచివున్నారు. ఇంతలో రామకృష్ణుడు వచ్చి “అయ్యలారా! ఈ పక్క గదిలోంచి వరసగా ఒక్కొక్కరే దివాణంలోకి వెళితే రాయలువారు ఒక్కొక్క బంగారు మామిడిపండు ఇస్తారు. అయితే ఒక షరతు. ఆ గదిలో ప్రతివారి వీపు మీద వాత పెట్టబడుతుంది. ఆ వాత చూపిస్తే మీకు బంగారు మామిడిపండు ఇస్తారు” అని ప్రకటించాడు.
వాతలంటే మాటలా - కొలిమిలో ఎర్రగా కాలుతున్న ఇనుప కడ్డీని చూసి కొందరు బ్రాహ్మణులు భయపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. మిగిలినవారు ఒక్కొక్కరే అక్కడికి రాసాగారు. అక్కడ రామకృష్ణుడు వుండి “అయ్యలారా! కొంతమంది వెళ్ళిపోయారు కనుక మీరు ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు మామిడిపళ్ళు ఇస్తారు ఆనక మీ యిష్టం” అన్నాడు. మొదటగా వచ్చిన బ్రాహ్మణుడు ఆశకొద్దీ రెండువాతలు పెట్టించుకున్నాడు. ఆ వాతల మంట భరింపలేక పైకి అరవలేక బాధపడుతూ దివాణంలోకి వెళ్ళాడు. రాయలువారు అతని చేతిలో ఒక బంగారు మామిడిపండు పెట్టారు. “అయ్యా! నేను రెండువాతలు పెట్టించుకున్నాను. మరి తమరు ఒక్కటే ఇచ్చారు” అని తన వీపుమీద రెండు వాతలు చూపించాడా బ్రాహ్మణుడు. రాయలవారు నిర్ఘాంతపోయారు. “ఈ వాతలేమిటి?” అని అడిగారు.
“అక్కడ రామకృష్ణ కవి గారు ఉండి ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు పళ్ళు ఇస్తారని వాతలు పెడుతున్నారు ప్రభూ!” అన్నాడు ఆ బ్రాహ్మణుడు బావురుమంటూ. రాయలవారు కోపంతో రామకృష్ణుడు వున్న గదిలోకి వచ్చి, వాతలు పెట్టించుకోబోయే రెండో బ్రాహ్మణుని ఆగమని గట్టిగా అరిచారు. రామకృష్ణునికేసి చూసి “ఏమిటి కవీశ్వరా! ఈపని? మిమ్మల్ని వాతలు పెట్టమని ఎవరు చెప్పారు?” అని గద్దించి అడిగారు.
“మహాప్రభో! నన్ను మన్నించాలి. తమ తల్లిగారి పరమపదించిన రోజునే మా మేనత్తగారు కూడా వాత రోగంతో మరణించారు. ఆమెకు వాతరోగం వచ్చినప్పుడల్లా వాతలు పెడితే తగ్గిపోయేది. నేను గరిటె కాల్చి వాతపెట్టేలోగా ఆమె కాస్తా గుటుక్కుమంది. ఆమె చివరి కోరిక తీర్చలేకపోయానే అని నేను చింతిస్తూ వుండగా తమరు తమ తల్లి గారి ఆత్మ తృప్తికోసం బంగారుపళ్ళు ఇస్తున్నారని విని, నేను వాతలు పెడతానంటే ఎవరూ వప్పుకోరని, వాతకు తమరు ఒక్కో బంగారు పండు ఇస్తారని చెప్పారు కాబట్టి నేనే కాస్త చొరవచేసి ఈనిర్ణయం తీసుకున్నా, నన్ను క్షమించండి ప్రభూ” అన్నాడు రామకృష్ణుడు.
“వూరుకోవయ్యా! బ్రాహ్మణులకు వాతలుపెడితే ఆమె వాతరోగం పోతుందా?” అన్నారు రాయలవారు కోపంగా.
“చిత్తం. తమ తల్లిగారి కోసం ఎన్నోలక్షలు ఖర్చుపెట్టి తమరు బంగారు పళ్ళు ఇస్తే ఆమె ఆత్మ తృప్తి పడితే, మరి వాతలు పెడితే మా మేనత్తగారి ఆత్మ కూడా తృప్తి పడదా ప్రభూ!” అన్నాడు రామకృష్ణుడు.
రాయలవారికి కనువిప్పు కలిగింది. అంతటితో బంగారు పళ్ళ పంపిణీని ఆపి, వచ్చిన బ్రాహ్మణులకు సంభావనలు ఇచ్చి పంపేసి రామకృష్ణునికేసి చూడడానికి సిగ్గుపడి లోపలకి వెళ్ళిపోయారు రాయలవారు. ఇక తిమ్మరసు అయితే పట్టరాని ఆనందంతో రామకృష్ణుని కౌగలించుకున్నాడు. వెయ్యి బంగారు మామిడి పళ్ళకు గాను, 999 బంగారు పళ్ళను ఆదా చేసిన రామకృష్ణుడు ఘనుడు కదా! అంతకు మించిన ఘనులు ఇప్పుడు ఈ కాలంలో కూడా ఉన్నారు. బహుశా వారే సదరు రాజకీయ నాయకుడికి ఓటు రూపంలో వాత పెట్టి ఉంటారు, కదా!
వాత సంగతి తరువాత, మంచి కథను గుర్తు చేసుకున్నాననే అనుభూతి నాకు కలిగింది. అసలు విషయానికి వస్తే... పురాణ, ఇతిహాసాలపై ప్రపంచ తెలుగు సమితి - వరల్డ్ తెలుగు కన్నార్దియం 2వ అంతర్జాతీయ సమావేశం ఈ మధ్య ఒకటి జరిగింది. ఆదివారం సెప్టెంబర్ 22, 2024న ఈ సమావేశం అంతర్జాలంలో జరిగిందని ప్రపంచ తెలుగు సమితి వ్యవస్థాపకురాలు లలిత రాం తెలిపారు. ఏడు దేశాల నుండి ప్రముఖులు, తెలుగు పండితులు, వక్తలు పాల్గొన్నారన్నారు. ముఖ్య అతిథి గా సమవేశంలో పాలొన్న శ్రీ వంగూరి చిట్టెం రాజు గారు తన ప్రసంగంలో భారతీయ సంప్రదాయం, చరిత్ర ప్రాముఖ్యాన్ని వివరించారు. సాహిత్యంపై కాల ప్రభావం గణనీయంగా ఉంటుందని ఆయన వివరించారు. వేగేష్న ఫౌండేషన్ - హైదరాబాదు సంస్థాపకులు శ్రీ వంశీ రామరాజు, భువనచంద్ర, శ్రీహవిష, రాధిక మంగిపూడి, రచయిత్రి షామీర్ జానకీదేవి పాల్గొన్నారు. ఈ సభలో భారతదేశం, అమెరికా, న్యూజిలాండ్ మొదలగు ఏడు దేశాల నుంచి ప్రముఖులు, పండితులు, వక్తలు పాల్గొన్నారు. వీరందరూ భారత పురాణ, ఇతిహాసాల్లో నుంచి కొన్ని ముఖ్యాంశాలపై ఆసక్తికరమైన ప్రసంగాలు, చర్చలు చేశారు. ప్రపంచ తెలుగు సమితి వ్యవస్థాపకురాలు శ్రీమతి లలిత రామ్ ఈ సమితి ప్రధాన ధ్యేయం - తెలుగు సాహితీ సేవ, అంతర్జాతీయ సాహితీ వేత్తలచే పరిశోధనాత్మక ప్రసంగాలు, భారతీయ సంస్కృతి, ప్రపంచ సాహిత్యాల వ్యాపనంపై విశేషంగా కృషి చేయడం అని నొక్కి చెప్పారు. డాక్టర్ శ్రీ రామ రాజు ప్రపంచ తెలుగు సభలతో, పుస్తక ప్రచురణలతో తెలుగును వెలుగుగా వ్యాపించాలి అని తెలిపారు. శ్రీహవిష, రాధిక మంగిపూడి సమన్వయ కర్తలుగా, రచయిత్రి షామీర్ జానకీ దేవి సహాయంతో ఈ సభను దిగ్విజయంగా నిర్వహించారు. సభలో పాల్గొన్న వక్తలు భారత పురాణ, ఇతిహాసాలలో నుండి ఆధ్యాత్మికత, సమాజశాస్త్రం, భగవద్గీత ప్రశస్తి, ఆదికావ్యం శ్రీరామాయణ మహత్యం, శ్రీరాముని పరబ్రహ్మతత్వం, మానవుడే కేంద్రం, జ్ఞానమే మోక్షం అన్న అంశాలు, ఉత్తర గీత, యోగశాస్త్రం, అయోధ్య రామ మందిర చరిత్ర, శ్రీ కాళహస్తి మహత్యం, మీనాక్షి శక్తి పీఠంతో ఒక సృజనాత్మక రచన, బసవ, మార్కండేయ, విష్ణు పురాణం, అభిజ్ఞాన శాకుంతలము, ఆముక్త మాల్యద మొదలైన అంశాలపై అమితోత్సాహంగా, విజ్ఞానాత్మకంగా ప్రసంగించి అందరికీ నూతన ఉత్సాహాన్ని కలిగించారు. ప్రముఖ రచయిత భువనచంద్ర ఆత్మీయ అతిధిగా విచ్చేసి భారతీయ సాంప్రదాయం, చరిత్ర యొక్క ప్రాముఖ్యత గురించి ఆహుతులకు సోదాహరణంగా వివరించారు.
నాకైతే మాత్రం ప్రపంచ తెలుగు సమితి - వరల్డ్ తెలుగు కన్నార్దియం 2వ అంతర్జాతీయ సమావేశం దేశ విదేశాలలోని తెలుగు భాష ప్రజల సాహితీ ప్రతినిధులను ఒకే వేదికమీద కలిపే సమావేశంగా, ఒక మంచి ప్రయత్నంగా తలపించింది. పైన పేర్కొన్న అంశాలలో అయోధ్య రామ మందిర చరిత్ర గూర్చి మాట్లాడే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. సమయం వచ్చింది కాబట్టి క్లుప్తంగా నా ప్రసంగ సారాంశాన్ని మీకు విన్నవిస్తాను. ఐదు వందల ఏండ్ల అయోధ్య రామ మందిర చరిత్ర కు బీజం పడింది, అంతకు మునుపు లవుడు తన తండ్రిగారైన శ్రీ రాముడి అవతార సమాప్తి తరువాత ఆయనకు కట్టించిన గుడి మూలంగానే. ఆ పిదప ఉజ్జయినీ సామ్రాజ్యానికి రారాజు విక్రమాదిత్యుడు (102 బి.సి నుండి 15 బి.సి వరకు) అయోధ్యను సందర్శించి శిధిలావస్థలో ఉన్న రామ జన్మస్థలంలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించాడు అని చరిత్రకారుల అంచనా. 500 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి తెరదించుతూ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతులమీదిగా సోమవారం, జనవరి 22, 2024 న అయోధ్యలో రామజన్మభూమిలో ఐదు ఏండ్ల వయస్సు తో ఉన్న సుందర బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట పవిత్ర కార్యక్రమంతో, ఐదు వందల ఏండ్ల నిరీక్షణకు తెరపడింది. ఈ విషయాన్ని సమగ్ర పరిశీలనతో ఇంతకు మునుపు అయోధ్య రామ మందిర చరిత్ర - రచ్చ బండ చర్చలో పేర్కొనడం జరిగింది. సదరు చర్చలో కీలకమైన సంఘటనలు క్లుప్తంగా ప్రస్తావిస్తూ, ముఖ్యంగా 1949-1952 మధ్య నెహ్రూ - సాధువు అభిరామ్ దాస్ - ఉన్న ఫైజాబాద్‌లోని సిటీ మేజిస్ట్రేట్ గురుదత్ సింగ్ - ఫైజాబాద్‌లోని జిల్లా మేజిస్ట్రేట్ కెకె నాయర్, రాష్ట్ర ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్, అయోధ్య ఎమ్మెల్యే బాబా రాఘవ్ దాస్ ల మధ్య చాలా పంచాయితీ నడిచింది. ముఖ్యంగా ఫైజాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ కెకె నాయర్ ని కీలకమైన కధానాయకుడిగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఆయన ఇటు ప్రజలను, అటు కోర్టులను కూడా ఒప్పించారు. అప్పటి దేశ ప్రధాని నెహ్రూ ని ఢీకొట్టిన చరిత్ర ఆయనది. 1949 లో సాధువు అభిరామ్ దాస్ తన బృందంతో అయోధ్య రామ జన్మభూమి స్థలంలో ఉన్న వివాదాస్పద కట్టదం కింద రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించిన నాటినుండి, 2024 జనవరిలో ప్రధాని మోదీ బాలరాముడి కృష్ణ శిల విగహానికి ప్రాణ ప్రతిష్ట చేసే నాటి వరకు అప్పటి ఫైజాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ కెకె నాయర్ ఆదేశాలే అమలులో ఉన్నాయి. ప్రపంచ తెలుగు సమితి - వరల్డ్ తెలుగు కన్నార్దియం 2వ అంతర్జాతీయ సమావేశంకు నేను సమర్పించిన అయోధ్య రామ మందిర చరిత్ర పరిశోధనాత్మక పత్రం మొత్తం చదవడానికి సమయం లేకపోయినప్పటికీ, నాకు కేటాయించిన 12 నిమిషాలలో కొన్ని కీలక అంశాలు చెప్పే అవకాశం నాకు కలిగింది. నిర్వాహకులు ప్రపంచ తెలుగు సమితి - వరల్డ్ తెలుగు కన్నార్దియం 2వ అంతర్జాతీయ సమావేశంలో సమర్పించిన పత్రాలతో కూడిన ఒక పుస్తకాన్ని విడుదల చేస్తారని, ఆసక్తిగల పాఠకులు నా పూర్తి ప్రసంగాన్ని సదరు పుస్తకంలో చదువుకోగలరని భావిస్తున్నాను. ప్రసంగ పాఠంలో రాసిన నేను రాసిన వ్యాసంలో నున్న "వాక్యాల మధ్యనున్న భావం" చెప్పేందుకే నేను ప్రయత్నించాను. ఎందుకంటే సమావేశంలో సమర్పించిన పత్రాలతో కూడిన ఒక పుస్తకాన్ని విడుదల చేసినప్పుడు పాఠకులకు సదరు పుస్తకంలో నా వ్యాసం పూర్తి పాఠం ఎటూ అందుబాటులో ఉంటుంది కదా!
ఈ రచ్చబండ చర్చ రాసే నాటికి, ప్రపంచ తెలుగు సమితి - వరల్డ్ తెలుగు కన్నార్దియం 2వ అంతర్జాతీయ సమావేశం అయి దాదాపు వారం కావస్తున్నది, అయితే ఈ సందర్భంగా తాజాగా మరో సారి సదరు సమావేశం మధురానుభూతులు గుర్తుచేసుకుంటూ, ఈ సమావేశం సంధానకర్త శ్రీమతి లలితా రాం గారికి మరోసారి నా వంతు మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎప్పటిలాగే సిరిమల్లె పాఠకులకు సాహిత్యాభినందనలు అందజేస్తూ...అలాగే పాఠకులందరూ యధావిధిగా క్రింద నున్న కామెంట్ బాక్స్ లో మీ స్పందనను తప్పక తెలియజేయాలని వారిని అభ్యర్థిస్తూ.. ఈ నెల చర్చ ముగిద్దాం, వచ్చే నెలలో మరో ఆసక్తికరమైన రచ్చబండ చర్చకు తెర తీద్దాం! అంతవరకూ సెలవు.
-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం
పరిశోధనాత్మక వ్యాసాన్ని క్లప్తంగా చెప్పడం క్లిష్టమే, ఇందు మీ కృషి అభినందనీయం! ప్రతి రామ భక్తుడు చదివి తెలుకోవలసిన విషయాలు తెలియచేసినందుకు కృతజ్ఞతలు 🙏