అమెరికాలో జూన్, జూలై, ఆగస్టు నెలలలో సాంప్రదాయ సంగీత, నృత్య కళలలో రంగప్రవేశం ఆహ్వానం అందుకొని తెలుగు కుటుంబాలు దాదాపుగా ఉండరు - అంతగా ప్రాచుర్యం పొందింది రంగప్రవేశం ఈ మధ్య కాలంలో. 2008 లో కాలిఫోర్నియా రాజధాని నగరమైన శాక్రమెంటో లో మొట్టమొదటి రంగప్రవేశం కార్యక్రమంకు నేను హాజరు అయ్యాను. అప్పుడు సంవత్సరానికి మహా అయితే ఒకటి - రెండు ప్రదర్శనలు ఉండేవి. ఇప్పుడు దాదాపు నాలుగు - అయిదు రంగప్రవేశం కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతున్నాయి. స్థానిక సగటు తెలుగు కుటుంబాలకు కూడా ఇదే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఉంది. రంగప్రవేశం కథ ఏమిటో కొంత తెలుగుకుందాం. రంగప్రవేశం పదం వేదికపైకి మొదటిసారి వచ్చిన వారికి అతికినట్లు సరిపోతుంది, వారెవరైనా సరే! అయితే వాడుక భాషలో మనవాళ్ళు వేరే సందర్భాలలో కూడా ఈ పదాన్ని బాగానే వాడేస్తున్నారు... ఉదాహరణకు.. "వాట్సాప్‌లోకి AI రంగప్రవేశం" (AI కి మేము సిద్ధం అని ప్రజలు ఎటూ అంటున్నారు కదా), "నెహ్రూ-గాంధీల కుటుంబం నుంచి మరోకరి రాజకీయ రంగప్రవేశానికి సిద్ధమయ్యినట్లు" వార్త - అందరూ వచ్చేసారుగా, ఇంకెవరు మిగిలారు అబ్బా అని ఆలోచిస్తుంటే.. ప్రియాంక గాంధీ భర్త - రాబర్ట్ వాద్రా జ్ఞాపకం వచ్చాడు, బహుశా ఆయనే రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్టు తెలుస్తున్నది. ఇంకో ఉదాహరణ.. "పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో అమెరికా, కెనడాకు చెందిన అంతర్జాతీయ జలవనరుల నిపుణులు రంగప్రవేశం" - పోలవరం ప్రాజెక్టు పట్ల కొన్ని సందేహాలు, ఆందోళనలు ఉన్ననేపథ్యంలో కొంచెం ఉపశమనం కలిగించే వార్త ఇది.
ఇకపోతే ఫలానా చోట ప్రజా నిరసన సందర్భంగా స్థానిక రాజకీయనాయకుడి అనుచరులు నిరసన తెలిపారు - ఈ నేపథ్యంలో, పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులపై లాఠీచార్జి చేసి, చెదరగొట్టి వారిని అక్కడ్నించి పంపించివేశారు అన్న వార్త తరచు వార్తాపత్రికల్లో, టీవీల్లో వస్తూ ఉంటుంది. మరి పోలీసులు వచ్చాక వాళ్ళు చోద్యం చూస్తూ ఊరుకుంటారా? పరిస్థితి చేజారిపోకమునుపే వారు లాఠీలకు పనిచెప్పడం కద్దు! ఇక కృష్ణ రాయబారం నాటకంలో ఒకటో కృష్ణుడు, ఇదిగో రెండో కృష్ణుడు, అదిగో మూడో కృష్ణుడు రంగప్రవేశం అంటూ మైకుల్లో ప్రకటనల హోరు నాటకాల ప్రియులకు సుపరిచితమే.
ఇకపోతే, సాంప్రదాయ కళలలో రంగప్రవేశం కు పర్యాయపదం అయిన "అరంగేట్రం" గూర్చి క్లుప్తంగా చెప్పుకుందాం. అరంగేట్రం అనగా ఒక వ్యక్తి బహిర్గతంగా ఒక రంగంలో మొదటిసారి ప్రవేశించడం. ఉదాహరణకు అరంగేట్రం అనే పదాన్ని నాట్యం నేర్చుకొని రంగస్థలంపై మొదటి ప్రదర్శన ఇచ్చు సమయంలో ఫలానా నర్తకి అరంగేట్రం చేస్తుందని చెబుతారు. అయితే కేవలం నాట్యం కు పరిమితం కాకుండా, అరంగేట్రంను ఇతర సాంప్రదాయ కళలు అంటే కర్ణాటక సంగీతం, సంగీత వాయిద్యాలతో కూడా ఎవరైనా అరంగేట్రం చెయ్యవచ్చు, అనేకమంది చేశారు కూడా! దక్షిణ భారతంలో ప్రాచుర్యంలో ఉన్న "అరంగేట్రం" పదానికి సరైన తెలుగు పదం "రంగప్రవేశం". అలా ఘనత వహించిన తెలుగు సంస్కృతిలో అరంగేట్రం "రంగప్రవేశం" అలా జరిగిపోయింది. రచ్చబండ చర్చ కాబట్టి మనకు చర్చా విషయంపై కాస్త వెసులుబాటు సహజంగా ఉంటుంది - ఈ నెల చర్చ "రంగప్రవేశం" పై మొదలుపెడితే బాగుంటుంది, అలాగే నా పుత్రిక భరతనాట్య రంగప్రవేశ ఘట్టాన్ని, ఈ విషయంలో ఒక తండ్రిగా నా అనుభవాన్ని పాఠకులతో పంచుకోవాలని అనిపించి "అరంగేట్రం" - "రంగప్రవేశం" గూర్చి కొంత ఉపోద్ఘాతం చెప్పడం జరిగింది. ఇక భరతనాట్యం గూర్చి క్లుప్తంగా చర్చించి ఆనక అసలు విషయం రంగప్రవేశం కు వెళదాం.
దక్షిణ భారతదేశంలో నాట్య శాస్త్రం రచించిన భరతముని పేరుతో పుట్టి, ప్రసిద్ధి గాంచిన ఒక శాస్త్రీయ నృత్య విధానం – భరతనాట్యం. దక్షిణ భారతదేశం లోని పురాతన దేవాలయాలలో శిల్పాలు భరతనాట్య భంగిమలలో అప్పరసలు నాట్యం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దబడి ఉంటాయి. పూర్వకాలంలో దేవదాసీలు దేవాలయాలలో భరతనాట్యాన్ని ప్రదర్శించేవారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోని 'తంజావూరు'లో 'నట్టువన్నులు”, దేవదాసీలు ఈ కళకు పోషకులు. భావం, రాగం, తాళం - ఈ మూడు ప్రాథమిక నృత్య కళాంశాలతో భరతనాట్యం చక్కగా మేళవిస్తుంది. ఇందులో పలు నృత్య భంగిమలతో పాటు 64 ముఖ, హస్త, పాద కదలికలు ఉన్నాయి. భారతీయ నాట్య విధానాలన్నింటిలోనూ భరతనాట్యం ఎక్కువ ప్రాధాన్యతను ప్రాముఖ్యతనూ సంతరించుకుంది. దానికి ప్రధాన కారణం దాని మూలాలు సనాతన ధర్మ ప్రాధాన్యతను కలిగి ఉండటమే. అంతే కాక భరతనాట్యమును అభిమానించే దక్షిణ భారత వాసుల చొరవ, ఆ శాస్త్రాన్ని తమ సొంతంగా వారు భావించటం కూడా భరతనాట్య ప్రాభవానికి ముఖ్య కారణాలు. ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం పొందిన భరత నాట్యం తర్వాత ఆదరణ కోల్పోయింది. మళ్లీ ఇప్పుడిప్పుడే తిరిగి ఆదరణ దక్కుతోంది. విదేశీయులు కూడా ఈ నాట్యంపై మక్కువ చూపుతున్నారు. ఉదాహరణకు ఈ ఏడు ఆగస్టు 14న వార్తాపత్రికల్లో వచ్చిన ఒక వార్తను ప్రస్తావిస్తాను. చైనాలో పుట్టిపెరిగిన చిన్నది, అక్కడే గజ్జెకట్టి, భరతనాట్యంలో పట్టు సాధించి.. చైనా గడ్డపై అరంగేట్రం చేసిన తొలి నర్తకిగా కీర్తి గడించింది. తన పేరు లీ ముజి. ఈ పదమూడేండ్ల చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియా సెలెబ్రిటీ. రాత్రికి రాత్రి ఇండో చైనా సంస్కృతులకు వారధి అయ్యింది. లీ ముజి గురువు "జిన్ షాన్‌షాన్" 34 ఏండ్ల కిందట 1990లో భారత్‌లో అడుగుపెట్టింది. భరతనాట్య కళాకారిణి, నాట్యగురువు లీలా శాంసన్ ఆధ్వర్యంలో 1999లో దిల్లీలో అరంగేట్రం చేసింది జిన్. ఓ చైనా అమ్మాయి భరతనాట్య ప్రదర్శన అప్పట్లో అద్భుతం. ఇప్పుడు తన శిష్యురాలు అయిన లీ ముజి చేత చైనాలో అరంగేట్రం చేయించడం మరో అద్భుతం. లీ ముజి గురువు జిన్ షాన్ మరో గురువు చైనాలో లబ్ధప్రతిష్ఠురాలైన నాట్యకారిణి ఝాంగ్ జున్. 1950 ప్రాంతంలో భారత్‌కు వచ్చిన ఝాంగ్.. ఇక్కడి శాస్త్రీయ నాట్యాన్ని చూసి ముగ్ధురాలైంది. ఏడు పర్యాయాలు ఆమె భారత్‌కు వచ్చి.. రకరకాల నృత్యరీతులను ఆకళింపు చేసుకున్నది. చైనా వారు భరతనాట్య కళను అభ్యసించగాలేనిది - ఆధునికత పేరిట దిక్కుతోచకుండా కొట్టుకుపోతున్న మనం వారసత్యంగా వచ్చిన ఈ కళను ఎందుకు దూరం చేసుకోవాలి? పాఠకులారా ఆలోచించండి!
అమెరికాలో "రంగప్రవేశం" అంటే ముఖ్యంగా చెప్పుకోవలసినది భరతనాట్య, కూచిపూడి రంగప్రవేశాల గురించి. మిగతావి విస్మరిస్తున్నానని అనుకోవద్దు, చర్చ కొనసాగింపుగా మరిన్ని ఇతర విభాగాలలో "రంగప్రవేశం" మనం మాట్లాడుకోవచ్చు. భరతనాట్య, కూచిపూడి గురువులు అమెరికాలో నలుమూలలా వ్యాపించి ఉన్నారు - ఇది ఒకరకంగా సనాతన సాంప్రదాయ కళలు వెల్లివిరియడానికి ఒక మంచి అవకాశం అనుకోవాలి. ముందు చెట్టు ఉంటేనే కదా పక్షులు ఆసక్తిగా అక్కడికి వచ్చేది. సహజంగా తమ పిల్లలకు దాదాపు 5-6 ఏండ్ల వయస్సు వచ్చినప్పుడు - సాంప్రదాయ కళలంటే ఆసక్తి ఉన్న ప్రవాస భారతీయులు తమ పిల్లలకు ఏదైనా సాంప్రదాయ కళలో ప్రవేశం ఉంటే బాగుంటుంది అని ఆలోచించడం మొదలు పెడతారు. ఈ వెతుకులాటలో వారికి దొరికిన మంచి గురువు దగ్గర వారి పిల్లల శిష్యరికంకు శ్రీకారం చుడతారు. అయితే ఇక్కడే అసలు విషయం చెప్పుకోవాలి. పది మంది పిల్లలు ఒక గురువు వద్ద శిష్యరికం మొదలు పెడితే, నృత్యం అయితే దాదాపు 3-4 మంది పిల్లలు "రంగప్రవేశం" వరకు వస్తారు. ఇక కర్ణాటక సంగీతం అయితే పది మందికి ఒక్కళ్ళు - ఇద్దరు పిల్లలు "రంగప్రవేశం" వరకు వస్తే గొప్పని చెప్పుకోక తప్పదు. ఇందులో గురువుల తప్పు ఎంతమాత్రం లేదు, సింహభాగం కేవలం శిష్యుల తల్లిద్రండ్రుల సమస్యేనని దాదాపుగా అందరూ అంగీకరించే విషయమే. ఎందుకంటే పిల్లలు "రంగప్రవేశం" కు వచ్చే సరికి వారు 9-10 తరగతుల్లో హైస్కూల్ కు వెళతారు. మరి హైస్కూల్ అంటే, పిల్లల సంగతి తరువాత, ముందు వారి తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయి లేదా అమ్మాయికి ఏ కాలేజీలో సీటు వస్తుందో అనే సందేహంతో కూడిన ఉత్కంఠ తో మునివేళ్లపై నిలుచుంటారు. ఈ సందేహం, ఉత్కంఠ, మునివేళ్లపై నిలుచునే క్రమంలో కాలేజీకి సంబంధించిన విషయాలు, దానికి హైస్కూలు లో పిల్లల నేర్చుకోవలసిన పాఠ్యాంశాలు, వగైరా ముందుకు వచ్చి, సాంప్రదాయ కళలు నేర్చుకునే లేదా కొనసాగించే విషయం వెనక్కి పోతుంది - చాలా మంది విషయంలో ఇదే జరుగుతుంది అని చెప్పాలి. ఈ గండాలు దాటుకొని, కొద్దిమంది మొండి పిల్లలు, మొండి తల్లిదండ్రులు "రంగప్రవేశం" వరకు వస్తారు. అలా వచ్చిన ఒక మొండి పిల్ల, మొండి తల్లిదండ్రుల గూర్చి, సదరు నృత్య రంగప్రవేశం గూర్చే ఈ నెల చర్చ. పనిలో పని ముసుగులో గుద్దులాట ఎందుకు సుమా, ఆ మొండి పిల్ల పేరు వర్షిణి, ఆ మొండి తల్లిదండ్రులలో నేను కూడా ఉన్నానండోయ్! మొండి పిల్ల కంటే జగమొండి పిల్ల అనాలేమో! ఎందుకో మున్ముందు మీకే తెలుస్తుంది. ఇక నృత్య రంగప్రవేశం గూర్చి చెప్పుకుందామా?
అమెరికా - కాలిఫోర్నియా రాష్టంలో ఘనంగా జరిగిన తెలుగు తేజం చిరంజీవి. వర్షిణి నాగం భరతనాట్య రంగప్రవేశం: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరమైన శాక్రమెంటో లో హారిస్ సెంటర్ థియేటర్లో ఆగస్టు 18, 2024 న ప్రవాసాంధ్ర చిరంజీవి. వర్షిణి నాగం భరతనాట్య రంగప్రవేశం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాల్యం నుంచే నాట్యంపై ఆసక్తి కలిగిన చిరంజీవి. వర్షిణికి 6వ ఏట నుంచే ఆమె తల్లిదండ్రులు భరతనాట్య శిక్షణ ఇప్పించారు. గురువు శ్రీమతి హేమ సత్యనారాయణన్ శిక్షణలో తన 16వ ఏట చిరంజీవి వర్షిణి భరతనాట్య రంగప్రవేశం కార్యక్రమంకు ఉపక్రమించింది. ప్రాచీన నాట్య కళలకు అంతంత మాత్రంగా ప్రోత్సాహం ఉన్న ఈ రోజుల్లో, ఈ తెలుగు తేజం భరతనాట్యం ప్రదర్శించిన తీరు ఆద్యంతం అలరించింది. తన హావభావాలతో, నాట్య భంగిమలతో వర్షిణి దాదాపు మూడు గంటలపాటు ప్రేక్షకులను మంత్ర ముగ్గులను చేసింది.
ఈ సందర్భంగా వేదికపై పలువురు ఆత్మీయ అతిధులు: ఫాల్సం నగర కౌన్సిలర్ శ్రీ చలంచర్ల ఏడుకొండలు మాట్లాడుతూ భారత సాంప్రదాయంలో భాగమైన నాట్యం వారసత్వాన్ని కొనసాగించడం యువతకు అత్యంత అవసరమని చెప్పారు. రాంచో కార్డోవా నగర ప్రణాళికా కమీషనర్ శ్రీ సురేందర్ దేవరపల్లి నాట్యం వల్ల జీవితంతో సమతుల్యం ఏర్పడుతుందని, భావోద్వేగాలను మరింత మెరుగ్గా సమన్వయము చేసుకునే శక్తి భరతనాట్యం వల్ల పొందవచ్చునని తెలిపారు. సువిధా ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకుడు భాస్కర్ వెంపటి మాట్లాడుతూ ఈ తరం యువతకు ఏదో ఒక కళలో ప్రవేశం ఉండాలనన్నారు. అది వారి వ్యక్తిత్వంలో నిర్ణయాత్మకమైన మంచి మార్పులకు కారణమవుతుందని వారు చెప్పారు. ఈ సందర్భంగా భరతనాట్యం రంగప్రవేశం గావించిన చిరంజీవి. వర్షిణి నాగం ను అభినందిస్తూ వారు ఆమెకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. కాలిఫోర్నియా రాష్ట్ర స్థానిక శాసనసభ్యుడు జాష్ హూవర్, మరియూ అమెరికా జాతీయ కాంగ్రెస్ చట్ట సభ సభ్యుడు కెవిన్ కైలీ కార్యాలయం నుండి వర్షిణి నాగం కు ప్రశంసా పత్రం ను ప్రదానం చేశారు. చిరంజీవి. వర్షిణి నాగం భరతనాట్య రంగప్రవేశం సందర్భంగా ఆమెను అభినందిస్తూ అలాగే "సిలికానాంధ్ర సంపద" కార్యక్రమంలో జూనియర్ సర్టిఫికెట్ సాధించిన ఆమెను ప్రశంసిస్తూ సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు, మరియూ చైర్మన్ శ్రీ ఆనంద్ కూచిభోట్ల గారు విడుదల అభినందనాపత్రాన్ని "సంపద" అనుసంధానకర్త శ్రీమతి శాంతి కొండా తరపున నిర్వాహకులు వర్షిణి కి అందజేశారు. ఈ కార్యక్రమంతో స్థానిక కళాశ్రేయ నృత్య పాఠశాల ఆధ్వర్యంలో ప్రముఖ గురువు శ్రీమతి హేమ సత్యనారాయణన్ పది రంగప్రవేశాలు పూర్తిచేసినందున ఆమెను అభినందిస్తూ నిర్వాహకులు వేదికపై ఆహుతుల, ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గురువు శ్రీమతి హేమ భరతనాట్య శిక్షణా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ ఫాల్సం నగర కౌన్సిలర్ శ్రీ చలంచర్ల ఏడుకొండలు, కాలిఫోర్నియా రాష్ట్ర స్థానిక శాసనసభ్యుడు జాష్ హూవర్, మరియూ అమెరికా జాతీయ కాంగ్రెస్ చట్ట సభ సభ్యుడు కెవిన్ కైలీ కార్యాలయం నుండి విడుదల అయిన ప్రశంసా పత్రాలను ఆమెకు వేదికపై ఆహుతుల హర్షధ్వానాల మధ్య ప్రదానం చేశారు.
అంతకు మునుపు స్థానిక హారిస్ సెంటర్ థియేటర్లో వైవిద్యభరితమైన భరత నాట్యాంశాలను జనరంజకంగా ప్రదర్శించి చిరంజీవి. వర్షిణి ప్రేక్షకులకు కనువిందు చేసింది. స్థానిక కళాశ్రేయ నృత్య పాఠశాల ఆధ్వర్యంలో ప్రముఖ గురువు శ్రీమతి హేమ సత్యనారాయణన్ శిష్యురాలైన చిరంజీవి వర్షిణి భరతనాట్యంలో రంగప్రవేశం ప్రదర్శన చేసింది. పుష్పాంజలి, అలరిప్పు, జతిస్వరం, వర్ణం, శివస్తుతి, తిల్లానా అంశాల్లో నర్తించి ఆమె భళా అనిపించింది. ఈ కార్యక్రమంకు ఐదు వందలకు పైగా స్థానిక శాక్రమెంటో ప్రవాసాంధ్రులు, మిత్రులు హాజరై చిరంజీవి. వర్షిణి ని అభినందించారు. విశ్రుత్ నాగం ఆలపించిన వినాయకుడి ప్రార్ధనాగీతంతో కార్యక్రమం ప్రారంభం అయింది. వర్షిణి తల్లిదండ్రులు వాణి - వెంకట్ నాగం ఆధ్యర్యంలో ఆత్మీయ అతిధులకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గురు శ్రీమతి. హేమ సత్యనారాయణన్ కు సత్కారం చేశారు. చిరంజీవి. వర్షిణి నాగం సోదరుడు చిరంజీవి. విశ్రుత్ నాగం ఈ సందర్భంగా వేదికపై ఏకదంతాయ వక్రతుండాయ, ఆనందామృతకర్షిణి, అన్నమయ్య కీర్తన "శ్రీమన్నారాయణ" మూడింటినీ భావయుక్తంగా ఆలపించాడు. చిరంజీవి. విశ్రుత్ నాగం 15 ఏండ్ల వయస్సులో 2018లో విజయవాడలో కర్ణాటక సంగీతంలో రంగప్రవేశం చేసిన విషయాన్ని ఆహుతులు గుర్తుచేసుకున్నారు. ఒకే ప్రవాసాంధ్ర కుటుంబం నుండి ఇద్దరు పిల్లలు వేర్వేరు విభాగాలలో ఆరు ఏండ్ల సమయంలో రంగప్రవేశం చేయడం అరుదైన విషయమని, ఈ స్పూర్తితో ప్రవాసాంధ్రులు తమ పిల్లలకు సాంప్రదాయ భారతీయ కళలను పరిచయం చేయాలని, అప్పుడే ఘనత వహించిన భారతీయ కళా సాంప్రదాయం దేశం దాటి విదేశాలలో కూడా విరాజిల్లుతుంది అని పలువురు ఆహుతులు సూచించారు.
ఈ భరతనాట్యం రంగప్రవేశం ప్రదర్శనకు శ్రీ సాయి రాతిన సభాపతి గాత్రం, శ్రీ గజేంద్రన్ గణేశన్ మృదంగం, శ్రీ రాధాకృష్ణన్ సెల్వప్రసాద్ వయోలిన్, శ్రీ కడప రాఘవేంద్రన్ వేణువు, చిరంజీవి. విశాల్ వెంకటేశ్వరన్ కంజీర వాద్య సహకారం అందించారు. చిరంజీవి వర్షిణి నాగం మాట్లాడుతూ తనకు ప్రేమతో భరతనాట్యం విద్యను నేర్పించిన గురువు శ్రీమతి. హేమ సత్యనారాయణన్ కు ధన్యవాదాలు తెలియజేసింది. తన తల్లిదండ్రులకు, సోదరునికి, ఆత్మీయ అతిధులకు, భరతనాట్యం రంగప్రవేశం ప్రదర్శన ఆసాంతం తిలకించిన వీక్షకులకు, సహకారం అందించిన వాద్య బృందానికి వినమ్ర పూర్వకమైన కృతజ్ణతలు తెలియజేసుకుంటున్నాను అని చిరంజీవి వర్షిణి చెప్పింది. ఈ సందర్భంగా హారిస్ సెంటర్ థియేటర్ లాబీలో ప్రదర్శనకు ఉంచిన భరతనాట్య ఔన్నత్యాన్ని తెలిపే పలు కళాఖండాలు, చిత్రాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. స్థానిక ఫాల్సం రుచి రెస్టారెంట్ వారు వండిన పసందైన తెలుగు భోజనంతో భరతనాట్యం రంగప్రవేశం కార్యక్రమం విజయవంతంగా పూర్తిఅయింది. అంతేకదా, కార్యక్రమం ఎంత బాగా జరిగినా, సహజంగా భోజనప్రియులైన ప్రవాసాంధ్రులకు మాంచి తెలుగు భోజనం తగిలితేనే కార్యక్రమం ఘనంగా పూర్తి అయినట్లు లెక్క - లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది, కదా!
తింటే గాని రుచి తెలియదు, దిగితే గాని లోతు తెలియదు - సామెత లెక్క రంగప్రవేశం కార్యక్రమం ఆసాంతం తల్లిదండ్రులకు జీవిత కాల పాఠాలు పరిస్థితుల చేత నేర్పించబడతాయి. అలాగే రంగప్రవేశం కు సిద్ధమైన వారి తల్లిద్రండ్రులు తమ పర్సును గట్టిగానే సిద్ధం చేసుకోవాలి, ఎందుకంటే కొన్ని సందర్భాలలో డబ్బును మంచినీళ్లలాగా ఖర్చు చేయవలసిన అవసరం పడుతుంది. ఎక్కడైనా మీరు సంకోచించారో ... మీకు ఉపదేశం చేయడానికి 5-10 మంది సిద్ధంగా ఉంటారు, వారందరి ఉపదేశ సారాశం దాదాపు ఒక్కటే ..."ఏవండీ, మీరు మీ అబ్బాయి లేదా అమ్మాయి పెళ్లి కోసం డబ్బు దాచుకుంటే సరిపోతుంది, ఈ రంగప్రవేశం కు ఖర్చు దండగ అనుకుంటున్నారేమో! మీకో విషయం చెప్పాలి... మీ అబ్బాయి లేదా అమ్మాయి పెళ్లి మీ చేతుల్లో ఉండనే ఉండదు, కనీసం ఈ రంగప్రవేశం కార్యక్రమం అయినా మీ చేతులమీదుగా చేయించండి - జీవితంలో ఒక్కసారే అవకాశం వచ్చేది...". అనుభవజ్ఞుల ఈ ఉపదేశాన్ని విస్మరించడం చాలా కష్టం. ఎందుకంటే వారిలో కొంత మంది అనుభవంతో చెప్పిన విషయం అది. కాబట్టి అనుభవజ్ఞుల నుండి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళితే బాగుంటుంది అని నాకు అనిపించింది - వాదోపవాదాలు కట్టి పెట్టి వారు చెప్పిన విషయాలను మా విషయంలో తు చ తప్పకుండా పాటించడం జరిగింది. కుమార్తె భరతనాట్యం రంగప్రవేశం కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయిన పిదప నాకు ఎవరెస్టు శిఖరం ఎక్కిన ఆనందంతో సమానంగా ఉందంటే నమ్మండి.
ముక్తాయింపుగా ఈ వ్యాసం రాసే సమయానికి ఈ ఆగస్ట్ నెలాఖరులో చైనా బాల కళాకారిణి లీ ముజీ మన దేశంలో కూడా ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ నెలాఖరులో చెన్నెలో లీ ముజీ భరత నాట్య ప్రదర్శన ఉండబోతున్నట్లు సమాచారం. భారతీయ నృత్యరూపాల్లో భరత నాట్యానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. విస్తృత భంగిమలతో హావ, భావాలను వ్యక్తపరుస్తూ శాస్త్రీయ నృత్య విధానంతో అందరినీ ఆకట్టుకునే భరత నాట్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. కావున ఈ కళతో పాటు మన తెలుగు రాష్ట్రాలలో పుట్టిన కూచిపూడి, ఆంధ్రనాట్యం, పేరిణి నృత్య కళలను మనం ముందుకు తీసుకువెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవస్థాపకత (Entrepreneurship) అనేది అనిశ్చిత సమయాలను ఎదురుకొంటూ సొంతంగా పట్టుదలతో ముందుకు సాగే సంస్థల స్థాపన ప్రక్రియ - క్లిష్టమైన ఈ ప్రకియ విషయంలో తెలుగువారు ముందు ఉంటారు. అలాగే సాంప్రదాయ కళలను ఆదరించడంలో కూడా మన తెలుగువారు ముందు ఉండి తోటి భారతీయులకు ఆదర్శప్రాయంగా ఉంటారని ఆశిస్తూ ... ఎప్పటిలాగే సిరిమల్లె పాఠకులకు సాహిత్యాభినందనలు అందజేస్తూ...అలాగే పాఠకులందరూ యధావిధిగా క్రింద నున్న కామెంట్ బాక్స్ లో మీ స్పందనను తప్పక తెలియజేయాలని వారిని అభ్యర్థిస్తూ.. ఈ నెల చర్చ ముగిద్దాం, వచ్చే నెలలో మరో ఆసక్తికరమైన రచ్చబండ చర్చకు తెర తీద్దాం! అంతవరకూ సెలవు.
-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం