Menu Close
Venkat Nagam
మన ఊరి రచ్చబండ
వెంకట్ నాగం

తాతయ్య చెప్పిన కమ్మని కధలు విన్న తరువాత, దేశం కాని దేశం వచ్చిన పిదప ఎవరైనా ఆ స్థాయిలో కమ్మని కథలు చెబితే బాగుండు అని ఎవరికైనా అనిపిస్తుంది కదా! ఈ మధ్య ఒక కథ చెప్పడం పోటీ కార్యక్రమంకు న్యాయనిర్ణేతగా నేను వెళ్లిన తరువాత "ఉయ్యాల్లొ పిల్ల పెట్టుకుని ఊరంతా వెతికినట్టు" సామెత నాకు అనుభవంలోకి వచ్చింది. అసలు ఈ కథల పోటీ కార్యక్రమం సంగతేంటి, ఈ కథా కమామీషు గురించే ఈ నెల రచ్చబండ చర్చ.

కథ చెప్పడం పోటీ కార్యక్రమం:

“కుండలో కూడు కుండలోనుండవలె, పిల్లలు చూడ గుండులవలె నుండవలె” - మన పిల్లలు మాత్రం ఎంచక్కా అమెరికా తదితర దేశాలలో ప్రపంచ స్థాయి ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవాలి - కానీ వారికి తెలుగు రావాలి - ఇది ఇప్పుడే తాజాగా రెండు సూటుకేసులతో మొట్టమొదటి సారిగా అమెరికాలో ఎయిర్ పోర్టులో దిగిన సామాన్య ప్రవాసాంధ్రుల కోరిక. “గొంతెమ్మ కోరిక” అంటే బాగుంటుందేమో! ఇట్లా అన్నానని ఈ మధ్యే స్వదేశం విడిచి వచ్చిన యువ ప్రవాసాంధ్రులకు నా మీద కోపం రావచ్చు, అయితే అక్కడే వారు కాస్త ఆగి, ఇదే ప్రవాస దేశంలో పుట్టి పెరిగిన తెలుగు వారి తెలుగు పనితనం వింటే నా మీద కోపగించుకున్న వారు కాస్త ఏంటి ఖర్మ పూర్తిగా వెనక్కి తగ్గడం ఖాయం! అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలు చాలామందికి ఎదుటివారు తెలుగు మాట్లాడితే అర్ధం అవుతుంది, కానీ వారు తిరిగి తెలుగులో జవాబు చెప్పలేరు. నేనే కాదు ఇక్కడ ఉన్నవారు దాదాపు అందరూ బల్ల గుద్ది చెప్పే విషయమే అది. అయితే ఈ మధ్య ఒక కథ చెప్పడం పోటీ కార్యక్రమంకు నేను వెళ్లాను అని చెప్పాను కదా! ఆ కార్యక్రమంలో పిల్లలు చెప్పిన కథలు విన్న తరువాత ఆ "గొంతెమ్మ కోరిక" కొంత మేర ఫలించిందనే బలమైన నమ్మకం నాకు కలిగింది.

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాక్రమెంటో(టీఏజీఎస్), సువిధ ఇంటర్నేషనల్ సంస్థ, మరియు శాక్రమెంటో తెలంగాణా సంఘం సౌజన్యం తో కాలిఫోర్నియా శాక్రమెంటో శివారు నగరం ఫాల్సం లో స్థానిక ఫాల్సం గ్రంధాలయం ఆధ్వర్యంలో మే 11, 2024 న బాల బాలికలకు తెలుగు స్పెల్ బీ, పద్యాలు, కథ చెప్పడం, బాలలు -పెద్దలచే లఘు నాటక ప్రదర్శన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. స్థానిక తెలుగు కుటుంబాలకు చెందిన బాలబాలికలు పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యక్రమానికి ఫాల్సం నగర గ్రంధాలయం డైరెక్టర్ శ్రీ థామస్ విచ్చేసి పోటీలలో గెలుపొందిన చిన్నారులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమానికి ఫాల్సం నగర గ్రంధాలయం కమీషనర్ శ్రీ భాస్కర్ జొన్నలగడ్డ, శ్రీ మధు బుడమగుంట, శ్రీమతి శ్రీదేవి ఆళ్ళ మరియు శ్రీ సంతోష్ సంగ్రాస్ తదితరులు సహాయ సహకారాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు స్థానిక తెలుగు వారిని ఫాల్సం నగర గ్రంధాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలుగు విభాగంలో అందుబాటులో ఉన్న తెలుగు పుస్తకాలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినటం నేర్పాలా?

ఈ సందర్భంగా సదరు కార్యక్రమంలో కథలు చెప్పడం పోటీకి ఒక న్యాయ నిర్ణేతగా నన్ను ఉండమని నిర్వాహకులు అభ్యర్ధించడం నేను ఆనందంగా అంగీకరించడం జరిగింది. పలువురు చిన్నారులు చెప్పిన చిన్ని కథలు నన్ను ముగ్ధుడిని చేశాయి. కొంతమంది వేసవి సెలవులకు వచ్చిన వారి అమ్మమ్మ - నాయనమ్మ - తాతయ్యలు కథలకు వీరిని సిద్ధం చేశారని చెప్పగా, మరికొందరు వారి తల్లిదండ్రులే ఈ కథలు వీరికి బోధించారు అని చెప్పారు. ఏతా వాతా నాకు అర్థం అయిందేమని అంటే - గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినటం నేర్పాలా అని! అంతే కదా! గుగ్గిళ్ళు సిద్ధం చేసి గుర్రపు పిల్ల ముందు పెడితే మిగతా పని అదే చేసుకుంటుంది. అలాగే మన పిల్లలకు చక్కని కథలు మనం సిద్ధం చేస్తే దాన్ని ఉపయోగించుకునే పని వారు సమర్ధవంతంగా చేస్తారని, ఈ కథలు చెప్పడం పోటీలో అది బ్రహ్మాండంగా జరిగిందని మాత్రం నేను బల్లగుద్ది చెప్పగలను.

ఈ కార్యక్రమంలో ఫాల్సం నగర గ్రంధాలయం కమీషనర్ శ్రీ భాస్కర్ జొన్నలగడ్డ  మాట్లాడుతూ, కాలిఫోర్నియా శాక్రమెంటో శివారు నగరమైన ఫాల్సం లో ఉన్న గ్రంధాలయం లో తెలుగు విభాగాన్ని ప్రారంభించాలన్న చిరకాల కోరిక నెరవేరింది అన్నారు. పిల్లలతో ఎటువంటి సమస్యలేదని, వారు త్వరగా తెలుగు నేర్చుకొంటారు అని, అయితే వారి కృషికి తల్లిదండ్రులు కూడా తోడ్పడాలని భాస్కర్ విజ్ఞప్తి చేసారు.

ఫాల్సం నగర గ్రంధాలయం డైరెక్టర్ శ్రీ థామస్ ఈ సందర్భం గా మాట్లాడుతూ కాలిఫోర్నియా శాక్రమెంటో లో నివాసం ఉంటున్న తెలుగు కుటుంబాలకు ఉపయోగపడే విధంగా తెలుగు పుస్తకాలు అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో ఫాల్సం నగర గ్రంధాలయంలో తెలుగు పుస్తక విభాగం ప్రారంభించడం జరిగింది అని అన్నారు. ఈ సందర్భంగా తెలుగు పుస్తకాలను వినియోగించుకొని ఈ చిన్న ప్రయత్నానికి ప్రోత్సాహం ఇవ్వాలని శాక్రమెంటో స్థానిక తెలుగు వారందరికీ విజ్ఞప్తి చేసారు.

ఈ సందర్భంగా శ్రీ మధు బుడమగుంట గారి రచన, దర్శకత్వం లో సమర్పించబడిన "నిరుపమానమైన తెలుగు భాష- అక్షర నీరాజనం" లఘు నాటిక గురించి ప్రస్తావించందే ఈ రచ్చ బండ చర్చ పూర్తికాదు అని నేను ముందుగానే తీర్మానించుకున్నాను. ఎందుకంటే తెలుగు భాష కు ఎనలేని సేవ చేసిన మహానీయులను స్మరించుకోవడం ఈ నాటిక ఉద్దేశ్యం. ఈ నాటిక సదరు వేదిక సాక్షిగా చివరి కార్యక్రమంగా ప్రదర్శింపబడి, ఆహుతుల మన్ననలను అందుకొంది. ఈ నాటిక గూర్చి కొంత చెప్పుకుందాం!

నాటిక గురించి చెప్పుకుంటే, ముందుమాటగా నాటిక దర్శకుడు మధు గారు వేదికమీదికి వచ్చి, ఇలా అన్నారు "అమ్మ నుడి అంటే అది ఆనందహేల ఒరవడి, తెలుగు భాషా సాహిత్యం అంటే తేనెలొలుకు తన్మయత్వం. అమెరికా అయినా, అంటార్కిటికా అయినా, అంగారక గ్రహం అయినా అమ్మ ఒడిని మించిన హాయి లేదు, అమ్మ నుడిని మించిన అమృతం లేదు. మాతృభాష ను మించిన మమకారం మరోచోట లేదు.  తెలుగు పలుకు ఒక మాధుర్యం, తెలుగు సాహిత్యం ఒక సుఖజీవన సాన్నిత్యం. మన తెలుగు వెలుగు భాష, భావి తరాలకు సంస్కృతి, సంప్రదాయాలను అందించే చక్కటి సునిశిత మాధ్యమం. ఆదికవి నన్నయ్య నుండి అభ్యుదయ భావజాల కవుల వరకు అత్యంత సనాతనమైన మన మాతృభాష తెలుగు యొక్క ప్రాభవం అనిర్వచనీయం. సామాజిక జీవన శైలికి తగిన విధంగా ఎన్నో మార్పులు చేర్పులతో వివిధ రూపాంతరాలను సంతరించుకున్న మన తెలుగు, నేటికీ ఒక సజీవ జీవన స్రవంతి. వ్యావహారిక తెలుగు, జానపద మిళిత తెలుగు సౌరభాల సువాసనలు అత్యంత ఆసక్తికరం. అణువణువున మదిని పులకింపజేసే మధుర భావనల భావోద్వేగం. అనిర్వచనీయ ఘనత కలిగిన మన మాతృభాషను గుర్తుచేసుకుంటూ, ఆశాపూరిత స్ఫూర్తితో భావితరాల మధ్యన తెలుగు భవితవ్యాన్ని పదిలంగా ఉంచాలనే భావన కూడా తోడై, తెలుగు భాష ప్రాశస్త్యాన్ని ప్రస్తావిస్తూ సంస్కృతీ సంప్రదాయాల మేళవింపుతో, అమెరికాలో వయోజన తెలుగు బడిని వేదికగా మలిచి ఒక చక్కటి నాటకాన్ని ప్రదర్శిస్తున్నాము. మీ చప్పట్లతో ఆశీర్వదించ మనవి."

ఆహుతుల హర్షధ్వానాల మధ్య తదనంతరం పాత్రల రంగప్రవేశం జరిగింది. అన్నట్లు మరిచిపోయాను, ఈ నాటికలో పాత్రలు - వారి ప్రాధాన్యత ప్రస్తావించ తప్పదు. ప్రతి పాత్రధారుడు/పాత్రధారిణి తమ పాత్రలో జీవించారు అని అనడం కన్నా నాటిక దర్శకుడు మధు గారు వారిని జీవింపజేశారు అనడం బాగుంటుందేమో! ఎందుకంటే వారి కష్టానికి ప్రత్యక్ష సాక్షిని నేనే కాబట్టి!

ఈ నాటిక లో పాత్రలు:

నాగం వెంకట్: తెలుగు అధ్యాపకుడు, శతాధిక పద్య కర్తల శ్రేయోభిలాషి మరియు వీరాభిమాని.

జొన్నలగడ్డ విజయభాస్కర్:  జనజీవనాన్ని జాగృతి చేసే జానపదాల అభిమాని.

మందడి మనోహర్: సామాజిక స్రవంతిలో చైతన్యాన్ని నింపే సాహిత్యాభిలాషి, దాశరథి గారి వీరాభిమాని.

ఆళ్ళ శ్రీదేవి:  అభ్యదయ కవితా అభిమాని, లలితగేయ అభిలాషి

యనమండ్ర నారాయణ శ్రీకాంత్: సనాతన కవుల రచనల అభిమాని. పద్య గద్య రచనల సాహిత్య పిపాసి.

బొబ్బల జితేందర్ : రంగస్థల నాటక అభిలాషి, ఏకపాత్రాభినయ పిపాసి.

నామాల శివ శ్రీరామ కిషోర్: సంఘ సంస్కర్తల భాషాప్రయుక్త చదువరి. సామాజిక మార్పు అనుకరి.

రామాయణం సుదర్శన్ : చలన చిత్ర గేయ రచయితల సాహిత్యాభిమాని.

ఉదయగిరి భాను దీప్తి : అభ్యుదయ భావాల విప్లవాత్మక రచనాభిలాషి, శ్రీ శ్రీ అభిమాని.

ఒక్కో పాత్ర వచ్చి ఆసీనులు అయి ఒక్కో తెలుగు మహనీయుడి గురించి చెబుతుంటే అక్కడ ఉన్న తెలుగు భాషాభిమానులకు చెవిలో అమృతం పోసినట్లు అనిపించింది అంటే అది అతిశయోక్తి కాదు సుమా!

ఇక చివరలో ముక్తాయింపుగా అధ్యాపకుని పాత్రలో నేను చెప్పిన కొన్ని మధుర తేనీయ వాక్యాలను మీతో పంచుకుంటున్నాను.

"తెలుగు నేలపై జన్మించి, సాహిత్య పిపాసినై
తెలుగు భాషామతల్లి సేవలో తరిస్తూ
నేడు ఒక తెలుగు అధ్యాపకునిగా
ఇంతటి వైభోవోపేత వాతావరణం చూసి
ఆనందంతో తన్మయత్వం చెందుతూ గర్వపడుతున్నాను.

అలాగే చివరగా, మీరందరూ కూడా తెలుగు ప్రాభవాన్ని ఇనుమడించే ఒక మంచి వాక్యాన్ని తెలుపవలసింది గా నేను హ్రదయపూర్వకంగా కోరుతున్నాను." అని మిగిలిన పాత్రలను సంభోదిస్తూ నేను ముగించాను.

అనంతరం భావోద్వేగానికి పులకించిపోయి విద్యార్థులు (పాత్రలు) కూడా ఒక విధమైన తన్మయత్వంతో అధ్యాపకుల వారి మాటను గౌరవించి ఒకరి తరువాత ఒకరు క్రింది వాక్యాలను ప్రేక్షకులను చూస్తూ ఈ విధంగా చెబుతారు...

జొన్నలగడ్డ విజయభాస్కర్:  తెలుగు భాష పండితులకి, పామరులకి కూడా ఇష్టమైన భాష!

మందడి మనోహర్: మనసెరిగిన మన భాష, మన మెరిగిన జన భాష, మనకు జన్మనిచ్చిన భాష, మన తెలుగు భాష, నా తెలుగు కమ్మన ....నానుడులు తీయన

ఆళ్ళ శ్రీదేవి:

జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?
తెలుగు పలుకు తేనెలొలుకు

యనమండ్ర నారాయణ శ్రీకాంత్:  మాతృత్వ మాధుర్యంతో అలరారే జీవ చైతన్య భాష తెలుగు!

బొబ్బల జితేందర్: నాటి, నేటి, రేపటి సాహితీ ప్రక్రియల సంధానకర్తలం. సామాజిక భాషాసేవ కార్యకర్తలం.

నామాల కిషోర్: అమ్మ నుడి, అన్నివేళలా ఆనందాన్ని పంచే ఒక భావసిరి.

రామాయణం సుదర్శన్: మన తెలుగువారందరికీ ముఖ్యంగా భావితరాలకు బహుచక్కనైన అమ్మనుడి  మాధుర్యాన్ని అందించి, ఆదరింపచేద్దాం.

ఉదయగిరి భాను దీప్తి: అజరామరమైన మన తెలుగు, అమృతం ఓలే నిత్యం స్రవించే ఒక తీయని జీవధార.

ఇక  ముక్తాయింపుగా దర్శకుడు మధు బుడమగుంట గారు రంగప్రవేశం చేసి ఇలా అన్నారు...

"మన తెలుగును నిత్యం పఠిస్తూ అక్షరమాలతో ఆరాదిద్దాం.
అందరం తెలుగులోనే మాట్లాడుకుందాం. మాతృభాష లో ముచ్చడించుకుంటూ ముందుకు సాగుదాం".

అందరూ: జై తెలుగు తల్లి,  జై తెలుగు తల్లి అని జేజేలు పలకడంతో, ఆహుతుల హర్షధ్వానాల మధ్య నాటిక సమాప్తం అయింది.

ముఖ్యంగా ఈ నాటిక కు కర్త-కర్మ-క్రియ అన్నీ తానే అయి నడిపించిన శ్రీ మధు బుడమగుంట గారు ధన్యులు. ఈ నాటిక రచన, డైలాగులు, వివరణ తదితర విషయాలు కూడా పూర్తిగా వారి కలం నుండి జాలువారిందే!  కావున మీరు క్రింద నున్న కామెంట్ బాక్స్ లో మీ స్పందన తెలియజేసినప్పుడు వారి పేరును ప్రస్తావించాలని నా మనవి.

అంతకు మునుపు ఆళ్ళ శ్రీదేవి వారి నేతృత్వాన స్థానిక బాల బాలికలు లఘు నాటక ప్రదర్శన చేసి ఆహుతులను ఆకట్టుకున్నారు. పద్యాలు చెప్పడం పోటీలో కుడా పిల్లలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి దణ్ణం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్వాలేదు - సామెత ను గుర్తు చేస్తూ నిర్వాహకులు దగ్గరుండి స్థానిక బేకరీ బైట్స్ రెస్టారెంట్ వారిచే పసందైన అల్పాహారం ఆహూతులకు సమకూర్చి అందరి మన్ననలను చూరగొన్నారు.

ఈ రచ్చబండ చర్చ రాసే నాటికి, నాటిక ప్రదర్శన అయి దాదాపు రెండున్నర నెలలు అయింది, అయితే ఈ సందర్భంగా తాజాగా మరోసారి "నిరుపమానమైన తెలుగు భాష- అక్షర నీరాజనం" లఘు నాటిక మధురానుభూతులు గుర్తుచేసుకుంటూ, ఈ నాటిక రచయిత - దర్శకులు శ్రీ మధు బుడమగుంట గారికి  మరోసారి నా వంతు మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎప్పటిలాగే సిరిమల్లె పాఠకులకు సాహిత్యాభినందనలు అందజేస్తూ...అలాగే పాఠకులందరూ యధావిధిగా క్రింద నున్న కామెంట్ బాక్స్ లో మీ స్పందనను తప్పక తెలియజేయాలని వారిని అభ్యర్థిస్తూ.. ఈ నెల చర్చ ముగిద్దాం, వచ్చే నెలలో మరో ఆసక్తికరమైన రచ్చబండ చర్చకు తెర తీద్దాం! అంతవరకూ సెలవు.

అన్నట్లు చెప్పడం మరిచాను. నేను పైన చెప్పిన లఘునాటిక పూర్తి ప్రతిని మధు గారు మన సిరిమల్లె ఈ ఆగష్టు నెల సంచికలో ప్రచురిస్తున్నారు. కనుక ఈ రచ్చబండ శీర్షిక నుండి ఆ నాటిక లోకి జంప్ అయి మేము ప్రదర్శించిన సన్నివేశాలను మీరు చదువుతూ అనుభూతిని చెందండి.

-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం.

********

Posted in August 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!