"ప్రయాణంలో పదనిసలు" మొదటి భాగం పిదప రెండవ భాగం చదవాలనే ఆతృతలో ఉన్న పాఠక మహాశయులకు ఉపోద్ఘాతం వివరాలు పోయిన నెలలోనే అయిపోయాయి కాబట్టి నేరుగా రెండవ భాగంకు వెళదాం.
పెండ్లి తలంబ్రాల కార్యక్రమం అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించి అక్కడనుండి మళ్ళీ భోజనశాల వద్దకు వెళ్లి మధ్యాన్న భోజనం కావించి తిరుగు ప్రయాణం మొదలు పెట్టాం... అక్కడితో "ప్రయాణంలో పదనిసలు" మొదటి భాగం కు పోయిన నెలలో కామా పెట్టాం కాబట్టి, అప్పటి నుండి నెల రోజుల విరామం పిదప ఈ నెలలో అనేక మలుపులతో కూడిన రెండవ భాగంకు వెళదాం!
తిరుగు ప్రయాణంలో మా "ఎర్రబస్సు" అదేనండి సౌత్ వెస్ట్ విమానం ను సియాటెల్ లో రాత్రి 8 గంటలకు అందుకోవాలనే లక్ష్యంతో వాంకూవర్ నుండి 3 గంటలను బయలు దేరాం. హోటల్ నుండి బయటపడాలనే ఉద్దేశంతో బయటకు వచ్చి కారులో కూర్చున్న తరువాత సిగ్నల్ సమస్య మూలంగా మ్యాప్ మార్గము వెతికే సమయంలో చరవాణి అదేనండి సెల్ ఫోన్ పనిచెయ్యలేదు. మళ్ళీ హోటల్ కు వెళ్లి అక్కడ వై ఫై కు చరవాణి ని అనుసంధానం చేసి ఎలాగోలా మ్యాప్ మార్గమును వెతుక్కొని బయలు దేరాము. ఇది మొదటి అవాంతరం. ముందుంది ముసళ్ళ పండుగ అంటారుగా! ఆ పండుగ ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఇక చదవండి మరి!
తీరా కెనడా లో ఒక గంట ప్రయాణం తరువాత అమెరికా సరిహద్దు వద్దకు వచ్చే సరికి కొండవీటి చేంతాడు అంత బారు కార్లు బారులు తీరి ఉండేసరికి నీరసం వచ్చింది. సరిహద్దు దాటి వచ్చే సమయంలో మరి సమయం వచ్చింది కాబట్టి "కొండవీటి చాంతాడు" గూర్చి చెప్పుకుందాం.
పూర్వం తెలుగు నేల పల్నాటి ప్రాంతంలో నీటి కొరత ఎక్కువగా ఉండేదట. కొండవీడు ఈ ప్రాంతానికి సమీపంలోనే ఉంటుంది. శ్రీనాథ కవి ఒక సారి ఏదోపని ఉండి పల్నాడుకి వచ్చి నీటికి ఇబ్బంది పడుతూ దాహార్తితో ఒక చాటు పద్యం ఇలా చెప్పాడట:
సిరిగలవానికిఁ జెల్లును
దరుణులఁ బదియారువేలఁ దగఁ బెండ్లాడన్,
దిరిపెమున కిద్దరాండ్రా?
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్
దీని అర్ధం- లక్ష్మీ వల్లభుడైనందున శ్రీనివాసుడు 16వేలమందిని పెళ్ళాడాడు. ఊరూరా తిరిగి భిక్ష స్వీకరించే నీకు ఇద్దరు భార్యలెందుకయ్యా! ఒక్క పార్వతిని నీవుంచుకొని గంగమ్మను మాకు ప్రసాదించు పరమేశ్వరా! అని.
సాధారణంగా గోదావరి కృష్ణా నదీ పరీవాహప్రాంతంలో ఎక్కువ శాతం పదిహేను - ఇరవై అడుగులలోపే నీటి బావులు పడతాయి, నదులకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని సార్లు యాభై - వంద అడుగుల లోతుకు వెళ్లినా కూడా నీళ్ళు పడవు. కొండమీద ఉన్న కొండవీటి కోట వద్ద బావులు తవ్వకానికి ఎంత శ్రమ పడతారో అంతే శ్రమ నీళ్ళని తోడుకోవటానికి కూడా పడవలసి వస్తుందట. ఎందుకంటే ఈ కొండవీటి కోట బావులు చాలా లోతుగా ఉండేవి. ఆ బావుల్లో నీటిని తోడటం కోసం చేదలకి పొడవైన తాళ్ళు కట్టేవారు. అందుకనే ఏదైనా పొడవాటి వస్తువుని కానీ "సాగబీకుడు విషయం" కానీ ఉదహరించేటప్పుడు 'కొండవీటి చాంతాడు'తో పోలుస్తారు. ఈ విధంగానే ఈ జాతీయం తెలుగు జనబాహుళ్యంలోకి విసృతంగా వచ్చింది.
సరే చీమల బారు తలపించిన కార్ల మధ్య ఎలాగో అమెరికా సరిహద్దు దాటి బయటపడ్డాము. సియాటెల్ విమానాశ్రయం చేరే సరికి అద్దె కారు తిరిగి ఇచ్చివేయవలసిన చోటు దగ్గర్లోనే ఒక పెట్రోల్ బ్యాంకులో ట్యాంక్ నిండా పెట్రోల్ పోయించి, ఆనక ఫాక్స్ అద్దె కారు యజమానికి కారును అప్పజెప్పి, అక్కడనుండి బయటపడి, విమానాశ్రయ టెర్మినల్ కు పరుగున చేరుకున్నాము. అక్కడ సెక్యూరిటీ చెక్ ప్రాంతంలో ఉన్న మరో "కొండవీటి చాంతాడు" వంటి బారులు తీరిన ప్రయాణీకుల వరుసను చూసి మరోసారి నీరసం వచ్చింది, ఈ లైను దాటి ఎక్స్ రే మిషను ద్వారా బ్యాగేజి చెక్ చేయించుకొని బయట పడితే అదే పదివేలు అనుకోని లైనులో నిల్చున్నాము. ఇంతలో అదే వాంకూవర్ పెండ్లి కి వచ్చిన అతిధుల్లో ఇద్దరు ముగ్గురు మా ముందు లైనులో ఉండడం చూసాం, కానీ మాకు వారికీ మధ్య దాదాపు వంద మంది ఉండి ఉంటారు, ఇప్పుడు అర్థం అయింది అనుకుంటాను - పెండ్లి వేదిక వద్ద సెల్ ఫోన్ సిగ్నల్ మొరాయించడం మూలంగా ఆలస్యం అయిన ఆ పది నిముషాల సమయం మాతో పాటు ప్రయాణం చేస్తూ మమ్ములను ఇలా ఇక్కడ 100 మంది వెనుక ఉండవలసి వచ్చేవిధంగా చేసింది అన్నమాట.
హతవిధీ అనుకొని - దేవునిపై భారం వేసి లైనులో వేచివుండి చివరికి ఎక్స్ రే మిషను వద్దకు వచ్చాము. ఇంతలో హఠాత్తుగా మా లైనులో ఉన్న ఎక్స్ రే మిషను ఒక్క సారిగా పనిచెయ్యడం మానివేసింది. దాంతో అక్కడ ఉన్న టీ ఎస్ ఏ సెక్యూరిటీ వారు మరో ఎక్స్ రే మిషను లైను వద్దకు వెళ్ళమని చెప్పారు, పక్కనే ఉన్న మరో ఎక్స్ రే మిషను లైను వద్దకు పరుగున వెళ్లి అక్కడ సెక్యూరిటీ ద్వారం వద్దకు వెళ్లేసరికి ఒక్కసారిగా అలారం మ్రోగడం మొదలు అయ్యింది, దాంతో ప్రయాణీకులను ఎక్కడి వారిని అక్కడ ఆపివేసి - నిమిషంలో పోలీసులు అక్కడ జాగిలాలతో సహా ప్రత్యక్షం అయ్యారు. ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితికి "రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదల్లేదు" సామెత సరిగ్గా సరిపోలా?
సెక్యూరిటీ చెక్ దాటి వెళ్లిన వారిలో ఎవరో ఏదో సాహసం లేదా అసాధారణ పని ఏదో చేసిఉంటారని నా అంచనా. ఈలోపు నా ముందు ఉన్న ముగ్గురు ప్రయాణీకుల్లో ఒక 7 ఏండ్ల బాలుడికి లఘు శంక సమస్య ఎదురయ్యింది. అటు లఘు శంక తీర్చుకోవడానికి అతడు ముందుకు పోలేడు - ఎందుకంటే ముందు జాగిలాలతో పోలీసులు దేని కోసమో వెతుకుతున్నారు - వెనక్కి పోలేడు - ఎందుకంటే ఆ బాలుడు ఉన్న చోటు సరిగా సెక్యూరిటీ చెక్, ఎక్స్ రే మిషను మధ్యలో ఉంది. ఇంతలో ఆ బాలుడి మాతృమూర్తికి దివ్యమైన ఆలోచన వచ్చింది. ఇంతకు మునుపు చెప్పానే మొరాయించి మూల పడిన ఎక్స్ రే మిషను పక్కనే ఉంది అని, దాని వద్ద రెండు స్థంభాల మధ్య ఉన్న చిన్న చోటుకు ఆ బాలుడిని ఆమె తీసుకు వెళ్ళింది, రెండు నిమిషాల తరువాత వాడు చాలా ప్రశాంతంగా వచ్చి మళ్ళీ లైనులో నా ముందు నిల్చున్నాడు. అమ్మయ్య వీడి లఘుశంక కార్యక్రమం అయిపొయింది అని అనిపించింది. ఈ లోగా ఎక్కడినుండో వాడి నాన్న ఊడిపడ్డాడు. బహుశా వాడి లఘుశంక కార్యక్రమం నిమిత్తం సెక్యూరిటీ వాడిని బ్రతిమాలాడటానికి వెళ్లిఉంటాడేమో! నేనైతే ఆ బాలుడిని ఒకటే అడిగాను, నీకు డైరీ రాసే అలవాటు ఉందా అని, "ఓ ఎస్" అన్నాడు వాడు, అయితే "ఈరోజు సంఘటన నీ డైరీలో అయితే మాత్రం రాయడం మరచిపోవద్దు" అని వాడికి చెప్పాను. నావైపు ఒక చిరునవ్వు చిందించి అతడు పాంట్ జేబులో చేతులు పెట్టుకున్నాడు.
ఈ లోగా అలారం మ్రోగడం ఆగిపోయింది, దాంతో అక్కడి నుండి పోలీసులు వారి జాగిలాలతో సహా నిష్క్రమించారు. నా క్యాబిన్ సూటుకేసులో ఏదో సమస్యతో సెక్యూరిటీ వారు మళ్లీ ఎక్స్ రే మిషనులో స్కాన్ చెయ్యాలి అని చెప్పారు, మరో అవాంతరం - సరే నా భార్యామణి క్యాబిన్ సూటుకేసు స్కాన్ అయిపొయింది కాబట్టి, ముందు ఆమెను విమానం గేటు వద్దకు వెళ్ళమని చెప్పాను. తాను ముందు వెళ్లి అక్కడ విమానం లోపల ఒక సీటుపై నాకోసం ఒక కర్చీఫ్ వేసి ఉంచుతుందనే ఒక బలమైన నమ్మకం. సరే అని ఆమె తన క్యాబిన్ సూటుకేసు తీసుకొని గేట్ వద్దకు బయలు దేరింది. అక్కడ సెక్యూరిటీ వారు నా క్యాబిన్ సూటుకేసు రెండోసారి స్కాన్ చేసి అంతా క్లియర్ చేసిన పిదప, నా క్యాబిన్ సూటుకేసు లంకించుకుని పరుగో పరుగు గేట్ వద్దకు. తీరా ఇంకో మరో నిమిషంలో గేట్ వస్తుంది అనగా, ఎవరో ఒక ప్రయాణీకుడు విరుచుకొని దారిలో పడిపోయి ఉన్నాడు. అతడి కోసం గేట్ రెండు వైపులా రాకపోకలు ఆపివేసింది సెక్యూరిటీ పోలీసమ్మ. చాలా దారుణం కదండీ? దారి దాదాపు 50 అడుగులు ఉంటుంది, ఒక పది అడుగులు పోనీ ఇరవై అడుగులు బ్లాక్ చేసి మిగతా 30 - 40 అడుగులు వచ్చే పోయే వారికి వదిలి వేయవచ్చు కదా! అప్పుడు గుర్తుకు వచ్చింది ఈ పద్యం...
ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము
అకటా దయలేని వారు మీ ఆడవారు
కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి చే విరచింపబడిన "పుష్పవిలాపం" ఆలపించిన ఘంటసాల గొంతునుండి జాలువారిని పద్యం ఇది...
ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే.. "అకటా దయలేని వారు మీ ఆడవారు" కాదు - ఈ సంఘటనకు "అకటా దయలేని వారు మీ సెక్యూరిటీ వారు" ఇది సరిపోలా? వాడెవడో సైంధవుడిలా గేట్ వద్ద అడ్డంగా పడిపోవడం ఏమిటీ - ఈ సెక్యూరిటీ పోలీసమ్మ ఆమె బృందం వారు మొత్తం ట్రాఫిక్ నే ఆపివేయడం ఏమిటీ ... మరీ సెక్యూరిటీ వారు ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపించింది. అవతల దాదాపు 10-15 విమానాల నుండి దిగిన వారిని ఆపివేశారు, మరో వైపు ఆ 10-15 విమానాలలో ఎక్కేవారిని (మాతో సహా) కుడా ఆపివేశారు. ఈ లోపు సియాటెల్ నుండి మేము వెళ్లాల్సిన శాక్రమెంటో - అదే విమానంలో ముందే చెక్ ఇన్ అయిన మిత్రుడి నుండి ఒకటే ఫోన్లు--- వెంకట్ ఎక్కడ ఉన్నారు -వెంకట్ ఇప్పుడే మేము విమానం లో ఎంటర్ అయ్యాము - వెంకట్ ఇప్పుడే విమానం ఎయిర్ హోస్టెస్ మీ పేర్లు చదివింది - చివరిగా - వెంకట్ ఇక విమానం రన్ వే కు బయలు దేరింది కావున మీరు శుభ్రంగా ఒక హోటల్ చూసుకొని అక్కడ పడుకొని, మళ్ళీ మరుసటి రోజు ఎయిర్ పోర్టుకు రండి - ఎందుకంటే ఈరోజుకు ఇదే చివరి విమానం - బై బై అని ఫోన్ పెట్టేసాడు. పాపం ఆయన ప్రయత్నం ఆయన చేసాడు. అదే సమయానికి ఇక్కడ సెక్యూరిటీ వారు తమ ఓవర్ యాక్షన్ కు చిన్న విరామం ఇచ్చి ప్రయాణీకులకు త్రోవ ఇచ్చారు. బ్రతుకు జీవుడా అని బయటపడి గేట్ 10 వద్దకు పరుగెత్తుకొంటూ వచ్చాము, ఏదో ఆశ... ఇంకా మేము ఎక్కాల్సిన చివరి విమానం ఇంకా అక్కడ ఉంటుందేమోనని.
అయితే మా ఆశలను వమ్ము చేస్తూ మేము సియాటెల్ నుండి శాక్రమెంటో కు వెళ్లాల్సిన విమానం వెళ్ళిపోయింది. మరోసారి హతవిధీ అనుకోని ఏంచేయ్యాలా అని ఆలోచిస్తుండగా... ఓక్లాండ్ కు వెళ్లాల్సిన ప్రయాణీకులకు ఇదే ఆఖరి విజ్ఞప్తి, దయచేసి మీరు గేట్ 9 వద్దకు రండి అని ఒక అనౌన్సుమెంట్ వినిపించింది. మేము ఉంది పక్కనే ఉన్న గేట్ 10 వద్ద. ఓక్లాండ్ నగరం - శాక్రమెంటో నగరానికి దాదాపు రెండు గంటల కారు ప్రయాణం ఉంటుంది. ఏదో ఒకరకంగా ఓక్లాండ్ చేరితే అక్కడి నుండి శాక్రమెంటో నగరానికి ఏదో ఒక టాక్సీ దొరక్కపోదా, అర్ధరాత్రి అయినా ఇంటికి చేరతామనే బలమైన ఆశతో గేట్ 9 వద్ద "ఎర్ర బస్సు" అదే నండి సౌత్ వెస్ట్ విమానం కౌంటర్ వద్దకు చేరాం. "చేరాం" అనటం కంటే "ముట్టడించడం" సరైన పదమేమో! ఎందుకంటే అక్కడ గేట్ వద్ద నేలపై విరుచుకు పడిపోయిన ప్రయాణీకుడి మూలంగా ట్రాఫిక్ ను స్తంభింపజేసిన సెక్యూరిటీ వారు - కాస్త ఆగండి - ఈ పడిపోయిన వాడి సంగతి చూసిన తరువాత ఇరు వైపులా ట్రాఫిక్ ను వదులుతాం - ఈ లోపు మీ విమానాలు ఎక్కడకు వెళ్లవు - పూచీ మాది అని నమ్మబలికారు. వారి మాటలు నమ్మి తీరా గేట్ 10 వద్దకు వస్తే మేము ఎక్కాల్సిన విమానం వెళ్ళిపోయింది. సైంధవుడిలా గేట్ వద్ద దాదాపు 200 వందలమంది ప్రయాణీకులకు అడ్డుపడిన సెక్యూరిటీ వాడిని తిట్టుకుంటూ గేట్ 9 కౌంటర్ వద్దకు చేరాం. ఈ కౌంటర్ వద్ద ఉంది "ఎర్ర బస్సు" విమానం తాలూకు "ఆడ కండక్టర్" - "ఆడ కండక్టర్" అని ఎందుకన్నానంటే మరి టిక్కెట్టు ఇచ్చేది ఈమే కదా! ఇందాక పేర్కొన్న "అకటా దయలేని వారు మీ ఆడవారు" తిప్పి చదువుకోవాలి - ఎందుకంటే మా గోడు విని ఆమె చివరి రెండు టిక్కెట్లు మాకు ఇచ్చింది.
"ఆడ కండక్టర్" కి జై అనుకొంటూ, విజయగర్వంతో ... శాక్రమెంటో విమానం పోయి ఓక్లాండ్ విమానం వచ్చే ఢాం ఢాం ఢాం ... అనుకొంటూ విమానం లో ఎందుకన్నా మంచిది అని కుడి కాలు పెట్టి లోపలి అడుగు పెట్టాం. ఆపై ఎటువంటి అసాధారణ సమస్యలు ఎదురవ్వలేదు - దేవుడి దయ వల్ల. ఇప్పటి వరకు ఎదురైన "అసాధారణ అవాంతరాలు" చాలు అనిపించింది. మొత్తానికి ఆ విమానం బయలు దేరి ఓక్లాండ్ వచ్చే సరికి నా మిత్రుడు సరిగ్గా ఆయన ఇంటికి చేరుకున్నాడు. ఆ మిత్రుడికి వాట్స్ ఆప్ ఛాట్ లో గుడ్ నైట్ చెప్పి, ఓక్లాండ్ విమానాశ్రయం ప్రాంగణంలో ఒక లిఫ్ట్ టాక్సీ ని దొరబుచ్చుకొని పడుతూ లేస్తూ చివరికి శాక్రమెంటో నగరం విమానాశ్రయం చేరాం. నేరుగా శాక్రమెంటో లో ఇంటికి పోకుండా మళ్ళీ విమానాశ్రయం కు ఎందుకంటారా? ఎందుకంటే శాక్రమెంటో విమానాశ్రయం ఆవరణలో మేము కారు పార్కు చేసాం కాబట్టి. ఓక్లాండ్ నుండి శాక్రమెంటో విమానాశ్రయం కు మమ్మల్ని చేర్చిన టాక్సీ చోదకుడి గూర్చి రెండు మాటలు చెప్పుకోవాలి. ఈ వ్యక్తి ఆఫ్గనిస్తాన్ నుండి అక్కడ అమెరికా దౌత్య కార్యాలయంలో ఏదో ఉద్యోగం చేసి అక్కడ నుండి బిచాణా ఎత్తివేసి ఇక్కడ కుటుంబంతో ప్రత్యక్షం అయ్యాడు. బ్రతకడానికి ఏదో ఒక పని చేయాలి కాబట్టి టాక్సీ చోదకుడిగా అవతారం ఎత్తాడు. ఎత్తితే ఎత్తాడు కానీ అండీ, భారత దేశాన్ని భలేగా పొగిడాడు, వారి దేశంకు మన దేశం చాలా సాయం చేసింది అని అతడు చెప్పాడు. పనిలో పనిగా పాకిస్తాన్ ని నిందిస్తూ పాక్ మూలంగా తమ దేశానికి చాలా కష్టాలు దాపురించాయని వాపోయాడు. అతనితో మేము సియాటెల్ విమానాశ్రయంలో పడ్డ కష్టాలు టూకీ గా చెప్పాను, ముక్తాయింపుగా ... "నేను బే ఏరియా లో ఉన్న మూడు ఎయిర్ పోర్టులలో" గత ఇరవై ఐదు ఏండ్లలో రెండు ఎయిర్ పోర్టుల ద్వారా రాకపోకలు జరిపాను, మూడోది "ఓక్లాండ్" ఎయిర్ పోర్ట్ ఇంతవరకు కవర్ అవ్వలేదు, కానీ సియాటెల్ సెక్యూరిటీ పోలీసుల "అతి" మూలంగా ఈరోజు కవర్ అయ్యింది .. అని ఆ టాక్సీ చోదకుడితో చెప్పాను.
శాక్రమెంటో విమానాశ్రయం లో మేము కారు పార్కు చేసిన చోటుకు వచ్చిన పిదప అతనికి కృతజ్ఞతలు చెప్పి, మా కారులో బయలు దేరి ఇంటికి వచ్చేసరికి సరిగా పొద్దున్నే 3:30 అయ్యింది. అనేక అసాధారణ అవాంతరాలతో సియాటెల్ - శాక్రమెంటో విమానం మిస్ అవ్వాలని రాసిపెట్టి ఉంది, కానీ ఈ అవాంఛనీయమైన అసాధారణ అవాంతరాలను తప్పించుకొని బయటపడి విజయవంతంగా ఇంటికి చేరామే - అది కధకు అందమైన ముగింపు. ముఖ్యంగా టాక్సీ చోదకుడి నోటినుండి స్వచ్ఛందంగా భారత దేశంను అతను ప్రశంసించడం! - ఒక అద్భుతమైన ముగింపు అనిపించింది నాకు. సర్వేజనా సుజనా భవంతు! ఒక దేశంగా మనం పొరుగు వారికి మంచి చేస్తే అది తిరిగి అమృత వాఖ్యలవలె మనల్ని తాకుతుంటే ఒక్క క్షణం నేను తిరుగు ప్రయాణంలో ఎదుర్కొన్న "అవాంఛనీయమైన అసాధారణ అవాంతరాలు" నాకు చాలా చిన్నవిగా అనిపించాయి.
ఒక ట్రావెల్ లాగ్ లాగా కాకుండా, ప్రయాణ అనుభూతులను స్వంత కధనంతో చెప్పడం ఇది రెండోసారి, ఒక సారి సూర్య దిన పత్రికకు పాయింట్ రేస్ ప్రయాణం గూర్చి రాసాను - పాయింట్ రేస్ అంటే ఓడలకు దిక్కు తెలియుటకై రేవున ఉండే పెద్ద దీపస్తంభ కట్టడం - ఇది శాన్ ఫ్రాన్సిస్కో నగరం సమీపాన ఉంటుంది- అయితే సియాటెల్ - శాక్రమెంటో ప్రయాణంతో పోలిస్తే అది పంటి కింద బఠాణి వంటిది. కదా!
సియాటెల్ - శాక్రమెంటో కాస్త "సియాటెల్ - ఓక్లాండ్ - శాక్రమెంటో" అవ్వడం, తీరిగా ఇంటికి చేసిన మరుసటి రోజు ఒక మిత్రుడి ఫోను - మిత్రమా నీ కెనడా ప్రయాణం ఎలా జరిగింది అని! ఒక ప్రయాణం విండో ను మూసేశాను, ఈయనేమో మళ్ళీ ప్రయాణం గూర్చి ఫోన్ విండో తీసి అడుగుతున్నాడు చెప్మా అనుకొని, మిత్రమా వెళ్ళేటప్పుడు అంతా సక్రమమే, కానీ తిరిగి ప్రయాణంలో మాత్రం సినిమా కనిపించింది అని చెప్పాను. "అదేదో మాకు చెప్పచ్చుకదా" అన్నాడు ఆ మిత్రుడు. ఇది మీకు మే 2024 సిరిమల్లె పత్రికలో "ప్రయాణంలో పదనిసలు" మొదటి భాగంలో వివరించాను. మరో మారు నా ప్రయాణ అనుభూతులను సిరిమల్లె పత్రికలో రాయమని ప్రోత్సహించిన ఆ మిత్రుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ... ఎప్పటిలాగే సిరిమల్లె పాఠకులకు సాహిత్యాభినందనలు అందజేస్తూ...అలాగే పాఠకులందరూ యధావిధిగా క్రింద కామెంట్ బాక్స్ లో "ప్రయాణంలో పదనిసలు" రెండవ భాగం స్పందనను తప్పక తెలియజేయాలని వారిని అభ్యర్థిస్తూ.. ఈ నెల చర్చ ముగిద్దాం, వచ్చే నెలలో మరో ఆసక్తికరమైన రచ్చబండ చర్చకు తెర తీద్దాం! అంతవరకూ సెలవు. -- నమస్కారములతో, మీ వెంకట్ నాగం.
Dear Venkat,
Your travelogue is very interesting to read, thank you & waiting to read next time,