Menu Close
Venkat Nagam
మన ఊరి రచ్చబండ
వెంకట్ నాగం

ప్రయాణం అబద్ధం - ప్రసాదం నిబద్ధం: ప్రయాణం వంక పెట్టి గుడిలో ప్రసాదాలకోసం కాపువేసే వారికోసం బహుశా ఎవరో మహానుభావులు ఈ సామెతను పుట్టించి ఉంటారు అని ఒక మిత్రుడు అన్నట్లు గుర్తు. నాకైతే  ఈ సామెత తెనాలి రామకృష్ణ కవి రాసిన ‘పాండురంగ మహాత్యం’ కావ్యంలో నిగమశర్మ పాత్రకు అతికినట్లు సరిపోతుంది అనిపించింది. సందర్భం వచ్చింది నిగమశర్మ గురించి చెప్పుకుందాం. నిగమశర్మకు లేని చెడు అలవాట్లు లేవు. అతను ఉండేది ఎప్పుడూ ఇంటి బయటే, పెండ్లి అయింది, కానీ ఇల్లు గుర్తుకు వచ్చినప్పుడు మాత్రం ఎప్పడో ఒకసారి ఇంటికి వచ్చిపోతూ ఉంటాడు. ఈయనకు ఒక అక్క ఉంది - ఆమెకు పేరు లేదు - ఈ కావ్యం మొత్తం ఆమె పేరు "నిగమశర్మ అక్క" నే. ఇదిలాఉండగా ఒకరోజు చుక్క తెగిపడ్డట్లు నిగమశర్మ ఇంటికి ఊడిపడ్డాడు. అదే సమయానికి నిగమశర్మ అక్క కూడా పుట్టింటికి వచ్చింది. దొరికితే ప్రసాదం దొరక్కపోతే కనీసం చద్దన్నమో అయినా ఇంట్లో తిని, ఏదో వంకతో వేరే ఊరుకు ప్రయాణం పేరిట అక్కడినుండి బయట పడదామనే అసలు ఉద్దేశ్యం తో నిగమశర్మ ఇంటికి వచ్చాడు. తమ్ముడి సంసారాన్ని ఒక దారిలో పెడదామని నిగమశర్మ అక్క అదే సమయానికి పుట్టింటికి వచ్చింది. నిగమశర్మ విషయంలో "ప్రయాణం అబద్ధం - ప్రసాదం నిబద్ధం" సామెత సరిపోలా? ఇంతకీ "నిగమశర్మ అక్క" కథ ఏడవ తరగతి తెలుగు పాఠ్యాంశం గా ఉన్నట్లు, నా తెలుగు ఉపాధ్యాయురాలు బాలా త్రిపుర సుందరి ఈ కథను మాకు బోధించినట్లు నాకు ఇంకా గుర్తు. ఈ నిగమశర్మ లాంటి వాళ్ళు కూడా ప్రపంచంలో ఉంటారా అని అప్పుడు నేను అనుకునేవాడిని. మనలో మనమాట అప్పట్లో ఉండే ఉండి ఉంటారు, లేకపోతే తెనాలి రామకృష్ణ కవి ఎందుకు రాస్తాడు - చెప్పండి? మిగతా కథ నేను చెప్పడం బాగుండదు - మీరు గూగులు అయ్య వద్దనుండి చదుకోవచ్చు. ఉపోద్ఘాతం అయింది కాబట్టి అసలు విషయానికి వద్దాం. ఇంతకీ ఈ నెల రచ్చబండ చర్చకు అసలు ఈ పేరా మొదటి పదంలోనే ఉంది - అదే "ప్రయాణం", కాకపొతే కాస్త తోక గా "పదనిసలు" జోడించి "ప్రయాణంలో పదనిసలు" గా పేరు ఖాయం చేసి చర్చ మొదలు పెడదాం.

అమెరికా దేశంలో ప్రయాణం-అందులోనూ ముఖ్యంగా కారు - విమాన ప్రయాణాలలో అనేక అనుభవాలూ మనకు పరిచయమవుతాయి. మన ప్రయాణం ను దగ్గరనుండి పరిశీలిస్తే చిన్న చిన్న విషయాలు కూడా ఆసక్తిని కలుగజేస్తాయి. కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బు బిళ్లా కాదేదీ కవితకనర్హం అని శ్రీశ్రీ అన్న తర్వాతనే సాధారణ వస్తువుల గురించీ, సీదా సాదా విషయాలపై, జంతువుల గురించీ, సామాన్య మానవుల గురించీ ఎడా పెడా కవితా రచన మొదలైందనీ, శ్రీశ్రీయే ఆధునిక కవులను తనదైన అభ్యుదయ మార్గంలో నడిపించాడనీ ఒక బలమైన నమ్మకం ఒకటి ప్రజల్లో ఉన్నది. అది కవితైనా కావచ్చు, కథైనా కావచ్చు, లేదా వ్యాసం లేదా రచ్చ బండ చర్చ అయినా ఫరవాలేదు. అన్నట్లు గూగుల్ వాడు "ప్రయాణం" గూర్చి అసలు ఏమి చెబుతాడో అనే ప్రశ్న నన్ను తొలిచింది. ఇంకెందుకు ఆలస్యమని లాప్ టాప్ తీసి "ప్రయాణం" గూర్చి గుగూల్ వాడి శోధన ఫలితాలు చూసాను, "ప్రయాణం ప్రారంభించిన నాటి నుంచి తొమ్మిదో రోజు తిరిగి ఇంటికి రాకూడదని నవమి హెచ్చరిస్తుంది - ప్రయాణం ప్రారంభించిన నాటి నుంచి తొమ్మిదో రోజు తిరిగి ఇంటికి రావచ్చా", "షష్టి నాడు చాకలివాడైనా ప్రయాణం చేయడు", "ప్రయాణాలు ఎప్పుడు చేయాలి, ఏ ప్రయాణానికి ఏ రోజు మంచిది?", "ఏ రోజు ఏ దిక్కుకి ప్రయాణం చేయకూడదో తెలుసా?", "క్లిష్టమైనది ప్రయాణం కాదు, మీరే!" - తదితర గుగూల్ వాడి శోధన ఫలితాలు (గూగుల్ సెర్చ్ రిజల్ట్స్) చూసి నాకు కళ్ళు బైర్లు కమ్మాయంటే నమ్మండి. పైగా నా ప్రయాణం ఇంతకూ ముందు శని, ఆది వారాలలో అయిపొయింది - "అయిపోయిన పెళ్ళికి...మేళం ఎందుకు" నానుడి హఠాత్తుగా గుర్తుకు వచ్చి, ముందా "ప్రయాణం" గూర్చి గుగూల్ వాడి శోధన ఫలితాల కిటికీ (విండో) ని మూసివేసాను, తద్వారా కాస్త మనశ్శాంతి పొందాను. ఇంతలో ఒక మిత్రుడి ఫోను - మిత్రమా నీ కెనడా ప్రయాణం ఎలా జరిగింది అని! ఒక ప్రయాణం విండో ను మూసేశాను, ఈయనేమో మళ్ళీ ప్రయాణం గూర్చి ఫోన్ విండో తీసి అడుగుతున్నాడు ఏంటి చెప్మా అనుకోని, మిత్రమా వెళ్ళేటప్పుడు అంతా సంక్రమమే, కానీ తిరిగి ప్రయాణంలో మాత్రం సినిమా కనిపించింది అని చెప్పాను. "అదేదో మాకు చెప్పచ్చుకదా" అన్నాడు మిత్రుడు. ఇక మొదలు పెడదామా?

కెనడా వాంకూవర్ ప్రయాణం ఇది రెండవసారి, మొదటిసారి 2016లో సియాటెల్ వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో తులిప్స్ పూల తోటలు, కెనడాలో విక్టోరియా ద్వీపం, కేటలీన్ బ్రిడ్జ్, తదితర ప్రాంతాలకు విహారయాత్రగా వెళ్ళివచ్చాము. అయితే గత వారం ప్రయాణం లక్ష్యం స్నేహితుడి ఇంట్లో వద్ద పెండ్లి కార్యక్రమం, ఇంకా ఇతరత్రా కారణాల వల్ల కేవలం రెండు రోజులకే ప్రయాణం కుదించుకోవడం జరిగింది. శాక్రమెంటో - కాలిఫోర్నియా రాష్ట్రం నుండి కెనడా వాంకూవర్ అంటే దాదాపు 1500 కి.మీ ఒకవైపు ప్రయాణం, అయితే సింహభాగం ప్రయాణం ఎర్ర బస్సులో. ఎర్ర బస్సులో అంటే అమెరికాలో సౌత్ వెస్ట్ విమానం లో, ఆ విమానానికి ఉన్న ఎర్ర రంగు, కాస్త అందుబాటులో ఉండే విధంగా విమానం టిక్కెట్టు ధరలు, అలాగే నగరాల మధ్య తిరిగే సంఖ్యా పరంగా గణనీయంగా అందుబాటులో ఉన్న విమానాల వెసులుబాటు దష్ట్యా మన తెలుగు వారు సౌత్ వెస్ట్ విమానానికి "ఎర్ర బస్సు" అని పేరు పెట్టారు - మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఎర్ర ఆర్టీసీ బస్సు లాగా అనుకోండి. శనివారం అమెరికా శాక్రమెంటో లో ఎర్ర బస్సు ఎక్కి రెండు గంటల్లో సియాటెల్ చేరాము. అక్కడ ఎయిర్ పోర్టులో అద్దె కారు కౌంటర్ వద్దకు వెళ్లి కారు ఇమ్మని అడిగితే - మీరు మేనేజర్ స్పెషల్ కారు బుక్ చేశారు - ఏం కావాలో కోరుకోండి అన్నాడు అక్కడ కౌంటర్ లోని వ్యక్తి. ఇదేదో బాగానేవుంది, కారు బుక్ చేసేటప్పుడు కారుకు ముసుగు వేసి ఉన్న బొమ్మ పెట్టారు, సర్లే చూద్దాం అని ఆ ముసుగు వేసిఉన్న కారును బుక్ చేసాను, ఇప్పుడు తంతే వెళ్లి గారెల బుట్టలో పడ్డట్లు ఉంది వ్యవహారం అనుకోని, సర్లెవయ్యా వీలైతే ఒక వ్యాన్ వస్తుందేమో చూడు మేనేజర్ స్పెషల్ కోటా కింద అని చెప్పాను. అలాగే సార్ - అని టయోటా వ్యాన్ బుక్ చేసి నాకో కాగితం ఇచ్చి, క్రింద అంతస్తులో ఇంకో కౌంటర్ ఉంటుంది, అక్కడకు వెళ్లి ఈ పేపర్ చూపించి కారు తీసుకోండి అని చెప్పాడు.

తీరా అక్కడకి వెళ్లి కాగితం చూపిస్తే అక్కడి వారు సదరు వ్యాన్ కు బ్యాటరీ సమస్య ఉంది, ఎక్కడైనా ఆగిపోవచ్చు కావున - మీ క్షేమం దృష్ట్యా మీకు డాడ్జ్ కారు ఇస్తున్నాము ఓకే నా అని అన్నారు. అసలే సమయం సాయంత్రం 4 గం అయింది, ముందు అర్జంటుగా అదేదో తులిప్ తోటలకు వెళ్లి నాలుగు ఫోటోలు దిగాలి, ఏదో ఒకటి ఇవ్వవమ్మా అని దాదాపు కారు తాళాలు ఊడబెరుక్కున్నంత పనిచేసి అక్కడనుండి బయట పడ్డాము. తీరా గేటు వద్దకు వెళ్లేసరికి కాపలావాడు, ససేమిరా గేటు తియ్యనని మొండికేసాడు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కాగితం పై ఇంకా టయోటా వ్యాన్ అని ఉంది, నాకేమో డాడ్జ్ కారు తాళాలు ఇచ్చారు కదా మరి, అది కాపలావాడి సమస్య. దేవుడు అనుగ్రహించినా పూజారి అనుగ్రహించాలి కదా - సామెత గుర్తుచేసినట్లు అయింది. గేటు కీపరే గెలిచాడు, ఉసూరుమని తిరిగి టపాలో కౌంటర్ వద్దకు వెళ్లి సమస్య విన్నవించాము. తప్పు వారిది కనుక కిమ్మనకుండా ఇంతకీ మీకే కారు కావాలి అని అడిగారు, అదిగో అక్కడ ఉన్న తెల్ల జీప్ గ్రాండ్ చెరోకీ కావాలని చెప్పాను. కిక్కురుమనకుండా సదరు జీప్ కారు తాళాలు నా చేతిలో పెట్టారు. వ్యాను పోయి, డాడ్జ్ వచ్చే ఢాం ఢాం ఢాం, డాడ్జ్ పోయి, జీపు వచ్చే ఢాం ఢాం ఢాం అనుకొంటూ ఈ సారి కాగితం పైనుండి కిందకి, కిందనుండి పైకి రెండు సార్లు సరి చూసుకొని కాలర్ ఎగరేసుకునే విధంగా గీటు కీపర్ వద్దకు వెళ్లాను, అంతా సక్రమంగా ఉండడంతో పూజారి అనుగ్రహించాడు - అక్కడనుండి నిష్క్రమించి పరుగున తులిప్ తోటల వద్దకు చేరాము. సాయింత్రం 5 అయింది కాబట్టి మేము వెళ్ళాలి అనుకున్న తులిప్ తోట మూసివేయబడింది, అయితే గూగుల్ వాడి సాయంతో సాయంత్రం 7 వరకు తెరచి ఉండే తోటను ఒకదాన్ని ఎంపిక చేసి రాజు వెడలె రీతిలో ఆ తోటలో ఎంట్రీ ఇచ్చాము. ఇంతాచేసి ఇప్పుడు మేము వెళ్లిన తోట ఇంతకు మునుపు 2016 లో వెళ్లిన తోటలే. అయితే కనువిందు కలిగించే రీతిలో తులిప్ పూలు చెట్లు నాటి తోట మాలి తోటను అందంగా ముస్తాబు చేశారు. తోట చూస్తే మాత్రం కొత్తగా ఉంది, కారు పార్కింగ్ - అక్కడ ఉన్న షెడ్డు తదితర సరంజామా మాత్రం 2016ని తలపిస్తుంది. ఇంతకీ తులిప్ గురించి చెప్పుకుందాం - వివిధ రంగులు గల గంటవంటి ఆకారం గల పూలు పూచే మొక్క, చిత్రవర్ణములు గల వొక పుష్పము. మేము వెళ్లిన తులిప్ టౌన్ దాదాపు 10-15 ఎకరాల తోట అని నా అంచనా. కాస్త నడవడం ఇబ్బంది ఉన్నవారికి తోట చుట్టూ తిరగడానికి అనువుగా రెండు ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. మన అట్లతద్ది పండుగకు వేసే ఉయ్యాల రీతిలో తోటల మధ్యలో రెండు పూల ఉయ్యాలలు దర్శనం ఇచ్చాయి. ఈ లోపు సన్న వర్షం మొదలు అయింది. మొత్తానికి వర్షం ముందు, వర్షంలో, వర్షం తరువాత మొత్తం మూడు సీజన్లు కవర్ చేసేవిధంగా 20-30 ఫోటోలు లాగించి అక్కడనుండి బయటపడ్డాం. అన్నట్లు మన కాశ్మీర్ లో కూడా తులిప్ తోటలో తెలుగు సినిమాల పాటల చిత్రీకరణ మనం చూసాం. తులిప్ తోటల పిదప మా తరువాతి ప్రయాణం వాంకువర్ - కెనడాకు.

సియాటెల్ నుండి దాదాపు గంట ప్రయాణం చేసి తులిప్ తోటలకు వెళ్లి, అక్కడ నుండి మరో గంట ప్రయాణం తరువాత అమెరికా - కెనడా బోర్డర్ చేరాము. మా ముందు లైనులో కేవలం రెండంటే రెండే కార్లు ఉన్నాయి. అక్కడ కౌంటర్లో ఉన్న కెనడియన్ ఆఫీసర్ - ఒకే ప్రశ్న అడిగాడు, "ఎన్ని రోజులకు" అని. "రేపీపాటికి తిరిగి ప్రయాణంలో ఉంటాము" అని చెప్పాము, కాసింత అయోమయంగా, ఒకింత నిరాశగా మా వంక చూసాడు. బహుశా కెనడాలో మేము రెండు వారాలు తిష్ట వేసి పదివేల డాలర్లు ఖర్చు పెడితే అతనికి సంతోషంగా ఉండేదేమో! ఆయనకు జీతం ఇచ్చే ప్రభుత్వానికి డబ్బులు వెళ్ళితే ఆయన ఉద్యోగం నాలుగు కాలాలు పాటు ఉంటుంది, ఎంతైనా స్వామి భక్తి కదా! మేము వెళ్ళింది పెళ్ళికి, పని ముగించుకొని తిరిగి తావాలని మా ప్రయత్నం - పీత కష్టాలు పీతవి అంటారు కదా!

కెనడా ప్రవేశ ద్వారం దాటి, వాంకూవర్ లో ప్రవేశిస్తున్నప్పుడు ఈ బన్నులు - బ్రెడ్లు నాకొద్దు - రాత్రి భోజనం కింద ఏదైనా వేడి వేడిగా తింటే బాగుంటుంది అని నా భార్యామణి సలహా ఇచ్చింది, అలాగే అని గూగుల్ సాయంతో ఒక ఇటాలియన్ పిజ్జా రెస్టారెంట్ కు వెళ్ళాము. తీరా రెస్టారెంట్ తలుపు తోసుకొని లోపలకు వెళ్ళితే - ఒక పంజాబీ యువతి స్వాగతం చెప్పి, కూర్చోమని చెప్పిన - రెస్టారెంట్ మెనూ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఈ ఇటాలియన్ పిజ్జా రెస్టారెంట్ లో ఈమె ఉంది ఏమబ్బా అనుకొంటూ ఉండగా, "బ్రహ్మాండమైన స్వాగతం, కొత్త యజమాని ఆధ్వర్యంలో" అని ఒక బోర్డు లోపల కనిపించింది. విషయం అర్ధం అయింది. వేరే వారి వద్ద ఒక సిక్కోడు ఈ రెస్టారెంట్ కొత్తగా కొనుక్కున్నాడు అని. రెస్టారెంట్లో అడుగు పెట్టేముందు, నా భార్యామణి ముందుగానే చెప్పింది - ఈ రెస్టారెంట్ లో ఇండియన్ వంటలు తినవద్దు - ఎందుకంటే వెళ్ళేది పెళ్ళికి - రేపు ఎటూ అల్పాహారం, మధ్యాన్న భోజనం కింద ఇండియన్ వంటలే పెడతారుకదా అని. ఇదేదో సూచనా బాగానే ఉంది అని మెనూ లో తల పెట్టి చదువుకుంటూ పోయాను. ఈ లోపు సదరు పంజాబీ యువతి వచ్చి - ఆర్డర్ ఇవ్వడానికి సిద్ధమా అని అడిగింది. ఒక గార్లిక్ బ్రెడ్ ఆర్డర్, ఒక వెజ్ పిజ్జా అని చెప్పాము. 'పన్నీర్ వెజ్ పిజ్జా - ఇండియన్ స్టైల్" అయితే బాగుంటుంది అని ఉచిత సలహా ఒకటి పడేసింది ఆమె. ఆమె అంత గట్టిగా రికమెండ్ చేసేసరికి... మేము కాస్త మెత్తబడ్డాము. దాంతో "ఈ రెస్టారెంట్ లో ఇండియన్ వంటలు తినవద్దు" ఒట్టు తీసి గట్టున పెట్టి ఆమె సూచించిందే ఆర్డర్ చేసాము. ఎందుకన్నా మంచిదని "ఇంతకీ గార్లిక్ బ్రెడ్ ఆర్డర్" లో ఎన్ని బ్రెడ్ ముక్కలు వస్తాయి అని అనుమానంగా నేను ఆమెను అడిగాను. "ఒక్కటి" అని చెప్పింది ఆమె. అంటే 2008 లో వచ్చిన త్రివిక్రమ్ జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్, బ్రహ్మానందం పాల పాకెట్లు చించి ఇద్దరు పంచుకున్నట్లు రీతిలో మేము ఇద్దరం ఒక్క బ్రెడ్ ముక్కను పంచుకోవాలంట! కదా! ఎందుకులే గొడవ అని, అమ్మా తల్లి "ఒక గార్లిక్ బ్రెడ్ ఆర్డర్" బదులు "రెండు గార్లిక్ బ్రెడ్ ఆర్డర్" రాసుకో అని చెప్పాను. మరీ, ఇద్దరికి ఆర్డర్ చేసినప్పుడు అసలు ఆమె "ఒక గార్లిక్ బ్రెడ్ ఆర్డర్" మొదట ఎందుకు రాసుకుందో నాకిప్పటికీ అర్ధం కాలేదు, ఈ సారి వెళ్ళినప్పుడు ఆమె అక్కడ ఉంటే నేను తప్పక అడిగే ప్రశ్న అది.

వేడి వేడి గార్లిక్ బ్రెడ్తో, పిజ్జాతో కూడిన రాత్రి భోజనం కానిచ్చి హోటల్ కు వచ్చి పడుకుని మర్నాడు పొద్దునే లేచి పెళ్లి మండపానికి ఛలో! ఎంత అందంగా ఉంది ఆ ప్రయాణం అంటే! మాటల్లో చెప్పడం సాధ్యం కాదు, ఘాట్ రోడ్, కొండల మధ్య, నదుల మీదుగా వేసిన బ్రిడ్జ్ మీదుగా, సముద్ర పాయల వెంబడి వెళ్లడం అద్భుతం. పెళ్లి వేదిక వద్ద ఒక గోల్ఫ్ కోర్స్ లో ఏర్పాటు చేసిన భోజనశాలలో అల్పాహారం కావించి, పెళ్లి మండపం వద్దకు వెళ్లాం. గోల్ఫ్ కోర్స్ చిన్న కొండ మీద ఆరు బయట పచ్చికలో పూల పందిరి వేసి దాని కింద తెలుగు పూజారి వేద మంత్రాలు చదువుతూ స్నేహితుని కుమార్తె పెళ్లి కార్యక్రమం జరిపిస్తుంటే అద్భుతం అనిపించింది. పెండ్లి తలంబ్రాల కార్యక్రమం అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించి అక్కడనుండి మళ్ళీ భోజనశాల వద్దకు వెళ్లి మధ్యాన్న భోజనం కావించి తిరుగు ప్రయాణం మొదలు పెట్టాం... ఇక ఇక్కడితో "ప్రయాణంలో పదనిసలు" మొదటి భాగం కు కామా పెట్టి వచ్చే నెలలో అనేక మలుపులతో కూడిన రెండవ భాగంకు వెళదాం! అప్పటి వరకు నెల రోజుల ఇంటర్వెల్ అన్నమాట! ఎప్పటిలాగే సిరిమల్లె పాఠకులకు సాహిత్యాభినందనలు అందజేస్తూ...అలాగే పాఠకులందరూ యధావిధిగా క్రింద కామెంట్ బాక్స్ లో "ప్రయాణంలో పదనిసలు" మొదటి భాగం స్పందనను తప్పక తెలియజేయాలని వారిని అభ్యర్థిస్తూ.. ఈ నెల చర్చ ముగిద్దాం, వచ్చే నెలలో మరో ఆసక్తికరమైన రచ్చబండ చర్చకు తెర తీద్దాం! అంతవరకూ సెలవు.

-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం

********

Posted in May 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!