Menu Close
Kadambam Page Title
మన సీతారాముడు!
-- ఆదిత్య కావుటూరు --

సవిత ప్రజ్వలనము సూచించును రవి కిరణాల వేడి
కవిత అంతస్సారము తెలుపును కవి కలము వాడి
ఆ రామచంద్రుడొక్కడు చాలు రఘుకులమునకు
మన సీతారాముడొక్కడే పదివేలు కవికులమునకు!

కృష్ణుని శ్వాస పంచుకుని గాలి గాంధర్వమయినదనినా
మాధవుని మోవిపై వాలి మౌనమే మంత్రమైనదనినా
ఈ సూరి కలము ఓ తూరి రాధాలోలుని మురళిగా మారి
ఆ మధురానుభూతులు మనతో పంచుకొన్నదేమో మరి!

ఆదిభిక్షువునేమి అడిగేది బూడిదిచ్చేవాడినేమి కోరేదని
అనుయోగిగా మారి ఆదియోగినే నిందాస్తుతితో నిలదీసినా,
పుట్టిన శిశువు గళమున పలికేది జీవననాద తరంగమని
మైమరిపించినా, అన్నీ ఈ కవిరాజు మస్తిష్క భావతరంగాలే!

ఓటమి ఒప్పుకోవద్దు ఓరిమి వదలవద్దనే సందేశమాలికలు
ఒకటారెండా ఆ కలం జాలువార్చిన స్ఫూర్తిదాయక గీతికలు
మూడున్నర దశాబ్దాలవధిలో మూడువేల రసరమ్య గేయాలు
భావకవి కలము ఆగినా, కలకాలముండు ఆ భావామృతాలు

విరించి ఇంతి చేతి పొత్తము మానవునిగా అవతరించి
ఎన్నెన్నో అపురూప కవనాలు, భావగీతాలు విరచించి
జిగిబిగి పదాలల్లికలతో తెలుగుజాబిల్లి ‘సిరివెన్నెల’ పంచి
కైవల్యబాట పట్టెనేమో తానొచ్చిన పని ముగిసెనని తలంచి!

Posted in August 2025, కవితలు

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *