Menu Close
sravanthi_plain
Miluraayi Vatsaram

పంచచామరము

ద్విరుక్తవింశతి(1)ప్రభాతదీధితుల్ ప్రసారమై
పురోగమింప దారిఁ జూపి పుణ్యభూమి భారత
స్థిరత్వసత్వసంపదల్ విశేషశాంతిసౌఖ్యముల్
విరించియే రచించుఁ గాత విశ్వమంత మెచ్చఁగన్
(1) రెండు సార్లు చెప్పబడిన 20 అంటే 2020

చం. ఇదియొక మైలురాయియని యెందఱొ విజ్ఞులు కన్న స్వప్నముల్
ముద మొదవంగ సత్యమయి ముఖ్యులుఁ బౌరులు సఖ్యకాములై
పదపద మందు సాగి నవభారతభాగ్యపథాన మగ్నులై
కదలఁగ నిన్ని కోట్ల జనకామితసిద్ధికి హద్దు గల్గునే?

ఉ. ఎన్నియొ చాలకాలమయి వృద్ధికి సంకెలలౌచు నిల్వ నేఁ
డన్నియు నొక్క టొక్కటిగ నాయమ భారతమాత కూఁతమై(1)
ఎన్నఁడొ వాసికెక్కిన యహీనయశోవిభవంబు లబ్బి తా
మన్నన లొందు భాగ్యము సమానముగాఁ గలిగింపఁ గోరెదన్
(1) ఊఁతము (అవలంబము) అయి

నందివర్ధనము

దేశవృద్ధికరదీపికానివహదివ్యనిర్ణయములే
ఆశలెన్నొ చిగురించి మొక్కలయి యాపయిన్ దరువులై(1)
పాశురంబులన విష్ణుచిత్తమున భాగ్యలక్ష్మికరుణన్
దేశ మెల్లెడలఁ జిందు భావనలఁ దెచ్చి యిచ్చుఁ బ్రగతిన్
(1) వృక్షాలై

కం. స్వచ్ఛత పచ్చదనంబును
స్వేచ్ఛకు సరియైన కాన్కలే యయి దేశం
బుచ్ఛస్థితి నందుకొనన్
కచ్ఛపగతి(1) విడిచి చనదె ఖగరాట్గతితో(2) ?
(1) తాబేలు నడక (2) గరుత్మంతుని చలనము

Posted in January 2020, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!