మోహన్ దాస్ ఇంగ్లండ్ ప్రయాణం, అచ్చటి జీవితం: అంతా అయోమయం, భయం, బిడియం, ఆకలి!
సాధారణంగా ఓడ ప్రయాణంలో చాలా మందికి కడుపులో తిప్పుతూ ఉంటుంది. అది మోహన్ దాస్ కు లేదు. రోజులు గడుస్తున్నకొద్దీ అతను స్థిరంగా ఒకేచోట ఉండేవాడు కాదు. ఆంగ్లంలో మాట్లాడే అలవాటు లేదు. రెండవ అంతస్థులో ఉన్న మోహన్ దాస్ తనతో ప్రయాణించే ‘త్రయంబకరాయ్ మజుందార్’ మినహా అందరూ ఆంగ్లేయులే. వారితో మాట్లాడే ధైర్యం లేదు. ఒకవేళ మాట్లాడినా వారు మాట్లాడేది అర్ధం గాక వెంటనే జవాబు ఇచ్చేవాడు కాదు. అర్ధం చేసుకుని జవాబు ఇచ్చే లోపలే వారు మోహన్ దాస్ కు దూరంగా వెళ్ళిపోయేవారు. భోజనం చేసేటప్పుడు చాకులు, ఫోర్కులతో ఎలా తినాలో తెలియదు. ఏ వంటకాలలో మాంసం లేదో అడిగి తెలుసుకునే ధైర్యం లేదు. అందువల్ల మన ‘భవిష్యత్ జాతి పిత’ అందరితో కలిసి ఏనాడూ భోజనం చేయలేదు. బదులుగా, కేవలం ఇంటినుంచి తెచ్చుకున్న పళ్ళు, తీపి, ఇతర తినుభండారాలను తన ‘కాబిన్’ లోనే తినేవాడు.
కాని మజుందార్ కు ఈ సమస్య లేదు. రోజు అంతా కలివిడిగా ఉండేవాడు. మోహన్ దాస్ ను అందరితో మాట్లాడుతూ స్వేచ్ఛగా తిరగమని సలహా ఇచ్చేవాడు. అందరు న్యాయవాదులతో కలివిడిగా మాట్లాడమని చెపుతూ, ఆంగ్లంలో మాట్లాడటానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సలహా ఇచ్చాడు. పరాయి భాష కాబట్టి తప్పులు మాట్లాడిన ఫరవాలేదు. ఇంత చెప్పినా మోహన్ దాస్ కు బిడియం, సంకోచం తగ్గలేదు.
ఓడ ఎర్ర సముద్రం (Red Sea) దగ్గర ఉన్నప్పుడు ఒక ఆంగ్లేయ ప్రయాణీకుడు, పెద్దాయన, మోహన్ దాస్ ను చూసి దగ్గరకు వచ్చి “నీవు ఎవరవు, ఎక్కడకు వెళ్తున్నావు, ఏమి తిన్నావు, ఎందుకు బిడియం (సిగ్గు) పడుతున్నావు.......వగైరా ప్రశ్నలడిగాడు. మోహన్ దాస్ ను అందరితో పాటు టేబుల్ (table) దగ్గరకు వచ్చి భోజనం చేయమని సలహా ఇచ్చాడు. ఈ కుర్రవాడు మాంసాహారి కాదని తెలుసుకుని నవ్వి “ఇది ఇప్పటికి ఫరవాలేదు. కాని, నీవు Bay of Biscay (ఈశాన్య అట్లాంటిక్ సముద్రానికి ఆనుకుని ఉన్న తూర్పు-ఫ్రాన్స్ తీరం) చేరినప్పుడు దానిని గురించి పునరాలోచించుకోవాలి. ఇంగ్లండ్ లో ఎంత చలిగా ఉంటుందంటే దానిని మాంసం తినకుండా తట్టుకోలేరు” అని దానిని తినమని నచ్చ జెప్పాడు. దానికి మోహన్ దాస్ “మాంసం తినకపోయినా అచ్చట జీవించగలరని విన్నాను” అని సమాధానం ఇచ్చాడు
“ఇది శుద్ధ అబద్ధం. నాకు తెలిసినంతవరకు మాంసాహారం తినకుండా ఇంగ్లండ్ లో జీవించిన వారు లేరు. నేను మద్యం (liquor) త్రాగుతున్నా, నేను దానిని త్రాగమని సలహా ఇవ్వను. కాని మాంసం తినకుండా జీవించలేరు కాబట్టి నీవు మాంసాహారిగా మారు” అని ఆ ఆంగ్లేయుడు గట్టిగా చెప్పాడు.
దీనికి మోహన్ దాస్ “నేను నా తల్లికి మాంసం ముట్టనని ప్రతిజ్ఞ చేశాను. దానిని నేను అతిక్రమించలేను. నేను మాంసం తినకుండా జీవించలేనని తెలుసుకున్నప్పుడు భారతదేశం తిరిగి వెళ్ళిపోతాను” అని నిఖచ్చిగా సమాధానం ఇచ్చాడు.
ఓడ Bay of Biscay చేరినప్పుడు మాంసం, మద్యం ముట్టవలసిన ఆవశ్యకత మోహన్ దాస్ కు కనిపించలేదు. ఒకాయన ఇతను మాంసాహారి కాదనే ధ్రువీకరణ పత్రం సిద్ధం చేసుకోమని సలహా ఇవ్వగా ఒక ఆంగ్లేయుడినుంచి దానిని సంపాదించి తన వద్ద ఉంచుకున్నారు. కాని, దాని అవసరం ఆయనకు బోధపడలేదు. “నా మాటల్లో విశ్వసనీయత లోపించినప్పుడు, ఈ ధ్రువీకరణ పత్రానికి విలువ ఏమి ఉంటుంది” అని ఆయన భావించారు.
ఆ తరువాత జరిగిన సంగతులు గాంధీజీ ఇలా వివరించారు.
“ఇది జరిగిన కొన్నాళ్ళకు సెప్టెంబర్ చివరి శనివారం (1888 సెప్టెంబర్ 29 వ తేది) ఓడ ‘సౌతాంఫ్టన్’ (Southampton; నైఋతీ దిక్కులో లండన్ కు 75 మైళ్ళు/120 కి.మీ. దూరం) చేరింది. ఓడ దిగే ముందు నల్లని కోటు, పాంట్ ధరించి, పైన తెల్లని ఉన్ని కంబళి (Shawl) కప్పుకున్నాను. అటువంటి ఆహార్యాన్ని ధరించిన నన్ను రేవు దిగినవారిలో చాలామంది ఎగా దిగా చూశారు! అందరితో పాటే నా సామానులు, వస్తువులన్నీ Grindlays Bank ప్రతినిధికి ఇచ్చి ఓడ దిగాను. నా వెంట ఇంగ్లండ్ లో నివసించే భారతీయులు P.J. Mehata (లండన్ వైద్యులు), Dalpatram Shukla (కథియవార్ వాస్తవ్యుడు); 17 ఏళ్ల కథియవార్ (Kathiawar) రాజకుమారుడు Ranjitsinhji (భవిష్యత్తులో క్రికెట్ ఆటగాడు); దాదాభాయి నౌరోజీ, (Dadabhai Naoroji: బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు:1892 -1895) లను పరిచయం చేస్తూ ఇండియాలో తెలిసినవారు ఇచ్చిన ఉత్తరాలను మాత్రం నా వద్దే ఉంచుకున్నాను. ఓడలో ఒక పెద్దాయన నన్ను లండన్ లోని ‘విక్టోరియా హోటల్’ లో ఉండమని సలహా ఇస్తే, నేను, మజుందార్ అందులో ఒక గది తీసుకుని ఉన్నాం. మరుసటి రోజు ఆదివారం కాబట్టి నా వస్తువులు మరుసటి రోజు సోమవారం వస్తాయని Grindlays ప్రతినిధి చెప్పాడు. దానికి నాకు చాలా కోపం వచ్చింది.”
"ఓడ Southampton చేరినప్పుడు నేను Dr. మెహతా కు టెలిగ్రామ్ పంపించాను. ఆయన నన్ను శనివారం రాత్రి 8 గంటలకు లండన్ లోని హోటల్ కు వస్తే నేను కలిశాను. ఆయన నాకు శుభాకాంక్షలు చెప్పి సాదరంగా మాట్లాడారు. నేను ధరించిన తెల్ల కంబళీ చూసి ఆయన నవ్వారు. మాటల్లో నేను యధాలాపంగా ప్రక్కన ఉన్న ఆయన ‘top hat’ ను నా చేతిలోకి తీసుకుని, దాని మెత్తదనాన్ని స్పర్శిస్తూ, దానికి అంటుకుని ఉన్న ఉన్ని వెంట్రుకలను నిమురుతూ ఉంటే కొన్ని రాలిపోయాయి. దీనికి ఆయన నా వైపు కోపంగా చూసి ‘నీవు ఇతరుల వస్తువులను ముట్టుకోవద్దు; ఇక్కడ ఎవరినయినా మొదటిసారి కలిసినప్పుడు వారిని ప్రశ్నలు అడగవద్దు; వారితో బిగ్గరగా మాట్లాడకు; ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మనదేశంలో లాగా ఎవరిని ‘సర్’ (Sir) అని సంబోధించవద్దు; ఇచ్చట కేవలం సేవకులు, క్రింది ఉద్యోగులు మాత్రమే వారి పై అధికారులను అలా సంబోధిస్తారు....’ అని సలహా ఇచ్చారు. దీనితో ఆయన వద్ద నుంచి యూరోపియనుల ఆచార పద్ధతుల గురించి మొదటి పాఠం నేర్చుకున్నాను.”
“తరువాత ఆయన ‘నీవు ఈ హోటల్ లో ఉండటం ఖర్చుతో కూడిన పని. అందువల్ల నీవు ఒక కుటుంబంతో ఉండు’ అని సలహా ఇచ్చారు.”
“ఈ విషయం గురించి సోమవారం నిర్ణయించుదామని అనుకున్నాను. సోమవారం నేను, మజుందార్ హోటల్ ఖాళీ చేసి, అప్పటికే వచ్చి ఉన్న సామానులను తీసుకుని ఓడలో మాతో ప్రయాణం చేసిన, ‘మాల్టా’ (Malta) లో నివసించే, ఒక ‘సింధీ’ సహాయంతో అతను అద్దెకు తీసుకున్న ఇంట్లో ఒక గదికి మారాము. విక్టోరియా హోటల్ లో నా బిల్లు 3 పౌండ్లు అయింది. రసీదు చూసి చాలా ఆశ్చర్యపోయాను. హోటల్లో నేను ఏమీ తినలేదు. అయినా తినని వాటికి డబ్బు చెల్లించటం బాధ కలిగించింది.”
“నేను ఈ ప్రయాణంలో ఎప్పుడూ మా ఇంటిని, ఊరుని, దేశాన్ని గురించే ఆలోచించే వాడిని. నా తల్లి ప్రేమ నా మనస్సులో ఎల్లప్పుడూ తిరుగాడుతూనే ఉంది. రాత్రి వేళల్లో ఏడుపు వచ్చి కన్నీళ్లు కాల్వలు కట్టేవి. రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. నా బాధ ఎవరితోనూ పంచుకోలేను. అంతా క్రొత్త. ఎవరూ తెలియదు. నేను తినగలిగిన ఆహార పదార్ధాలలో రుచి ఉండదు. చప్పగా ఉండి అవి తినలేను. ఈ బాధను భరించలేక ఒక్కోసారి మన దేశానికి వెళ్లాలనిపించేది. ఇక వచ్చాను కాబట్టి, మూడు ఏళ్ళు ఉండి వెళ్ళమని నా ఆత్మ ప్రభోదించింది.”
తీరని ఆకలి, కలవరం, కష్టాలు
సోమవారం Dr. మెహతా విక్టోరియా హెటల్ కు మోహన్ దాస్ ను కలవటానికి వెళ్లగా అప్పటికే అతను ఒకరి ఇంట్లో ఉంటున్నాడని తెలుసుకుని అక్కడకు వెళ్లారు. ఆ రోజే తనకు ‘రింగ్ వార్మ్’ (Ringworm) అనే చర్మవ్యాధి వచ్చిందని తెలుసుకున్నాడు. ఓడ ప్రయాణంలో ఉప్పు నీటితో స్నానం చేయవలసి వస్తే, సబ్బును ఉపయోగించాడు. సబ్బు ఉప్పు నీటిలో కరగదు. అది తెలిసినా, సబ్బుతో స్నానం చేస్తే అది నాగరికతకు చిహ్నమని భావించి దానిని ఉపయోగించాడు మోహన్ దాస్. దీని వల్ల శరీరం శుభ్రం అవక పోగా శరీరం అంతా జిడ్డుతో నిండిపోయింది. ఇది క్రమేణా చర్మ వ్యాధిగా మారింది. దీనిని Dr. మెహతా కు చూపించగా అయన అసిటిక్ ఆమ్లం (acetic acid) చర్మం అంతా వ్రాయమని సలహా ఇచ్చారు.
తరువాత ఆయన గది అంతా కలయజూసి నచ్చక “ఈ చోటు బాగా లేదు. మనం ఇంగ్లండ్ రావటం, చదువుకోవటంతో పాటు, ఇచ్చటి ఆంగ్లేయులతో కలివిడిగా ఉండి వారి ఆచారాలు, జీవనవిధానాన్ని కూడా తెలుసుకోవాలి. అందువల్ల నీవు ఒక ఆంగ్లేయ కుటుంబంతో ఉండాలి. దీనికిముందు కొన్నాళ్ళు ఒకరివద్ద శిష్యుడిగా (apprentice) ఉండాలి. నేను నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను” అని అన్నారు.
ఈ సలహా ప్రకారం మోహన్ దాస్ వెంటనే Dr. మెహతా స్నేహితుడి ఇంట్లో నివసించసాగాడు. ఆ ఇంట్లోనే నివసించే ఒక ఆంగ్లేయుడు చాలా మంచివాడు, దయగల మనిషి. మోహన్ దాస్ ను స్వంత తమ్ముడిగా ఆదరించి ఆంగ్లేయ పద్ధతులు, ఆచారాలను నేర్పించసాగాడు. మోహన్ దాస్ కు ఆహారం ఒక పెద్ద సమస్యగా తయారయింది. ఇతనికి ఉప్పు, మసాలా లేని ఉడకబెట్టిన కూరగాయలు రుచించ లేదు. ఆ ఇంటి పూటకూళ్ళ యజమానురాలు (land lady) ఇతనికి ఏమి వండిపెట్టాలో తెలియలేదు.
ఉదయం Oat meal జావ కడుపు నిండుగా తీసుకున్నా, మధ్యాహ్నం, రాత్రి ఆకలితో ఉండిపోవలసి వచ్చేది. ఇంగ్లీష్ స్నేహితుడు మాంసాహారం తీసుకోమని ఎంతగా ప్రోత్సహించినా మోహన్ దాస్ తన పరిధి దాటలేదు. కొన్నాళ్ల తరువాత మధ్యాహ్నం, రాత్రి ఉడకబెట్టిన ఆకుకూర, బ్రెడ్ (bread), జాం (jam) తినేవాడు. మూడు ‘ముక్కలు’ (slices) కంటే ఎక్కువ బ్రెడ్ తినాలనిపించినా మొహమాటం అడ్డువచ్చి అడగలేక పోయేవాడు. చివరకు ఆకలి అయినా పాలు కూడా లేని పరిస్థితి.
దీంతో విసుగెత్తిన స్నేహితుడు ఒకసారి కోపంతో ఇలా అన్నాడు: “నీవే నా తమ్ముడవయితే ఇంట్లోనుంచి పంపించేసేవాడిని. ఇచ్చటి పరిస్థితులు తెలియకుండా నిరక్షరాస్యులైన నీ తల్లి ఎదుట చేసిన నీ ప్రమాణానికి విలువ ఏమి ఉంటుంది? అది అసలయిన ప్రమాణం కాదు. ఇటువంటి ప్రమాణానికి కట్టుబడి ఉండటం మూర్ఖత్వం. నీ పట్టు విడకపోతే నీకు మంచిది కాదు. ఇదివరకు ఒకసారి మాంసం తిని బాగుందని నీవే చెప్పావు. నీకు అవసరం లేనప్పుడు మాంసం తిన్నప్పుడు అవసరం అయినప్పుడు తినటానికి నీకేమి అభ్యంతరం? ఇది చాలా దారుణమైన సంగతి.”

తరువాత జరిగిన పరిణామాలను గాంధీజీ మాటల్లోనే తెలుసుకుందాము.
“అతను ఇన్ని చెప్పినా నా అభిప్రాయాన్ని మార్చుకోలేదు. ప్రతిరోజు రాత్రి, పగలు నేను నా మిత్రుడు దీనిని గురించి వాదులాడుకునేవాళ్ళం. అతను ఎంత గట్టిగా వాదిస్తే నేను అంత మొండిగా తయారయ్యాను. నన్ను ఈ సమస్యనుంచి రక్షించమని ప్రతి రోజు దేవుణ్ణి ప్రార్ధించేవాడిని. నాకు దేవుడి గురించి ఒక అభిప్రాయం ఉందని కాదు. నాకు ఒకప్పుడు మా నర్సు ‘రంభ’ నాలో నాటిన ‘రామ నామ’ విత్తనమే మొక్క అయి, ఈనాడు దేవుడిమీద నాకు ఈ కొంచమైనా నమ్మకం ఉంచింది. కానీ ఈ నమ్మకమే నన్ను ముందుకు తీసుకు వెళ్ళింది.”
“ఒక రోజు నా మిత్రుడు, రచయిత ‘జెరేమి బెంతాం’ (Jeremy Bentham) రచించిన ‘Theory of Utility’ అనే ఆంగ్ల నవల చదవటం మొదలుపెట్టాడు. కాని అందులో ఏదీ నా బుర్రకు ఎక్కలేదు. అప్పుడు నా మిత్రునితో ఇలా అన్నాను. ‘నన్ను క్షమించు. ఇచ్చట మాంసాహారం అవసమని నాకు తెలుసు. నేను నా తల్లికి ఇచ్చిన ప్రతిజ్ఞను అతిక్రమించలేను. దీనిని గురించిన నీ వాదనకు సరి అయిన సమాధానం నా దగ్గర లేదు. నీవు నన్ను మూర్ఖుడు, అవివేకుడు అని భావించవద్దు. నీవు నా ఎడల చూపించే శ్రద్ధ, ప్రేమ అమితం. నీవు ఎల్లప్పుడూ నా గురించే ఆలోచిస్తున్నావు. కాని ఈ విషయంలో నేను నిస్సహాయుడిని. ప్రతిజ్ఞ ప్రతిజ్ఞే. దానిని నేను భంగం చేయలేను. ‘అప్పుడు నా మిత్రుడు పుస్తకం మూసేసి ‘సరే ఇక నుంచి దీనిని గురించి నీతో వాదించను’ అని అన్నాడు.”
“ఈ మాట నాకు ఎంతో సంతోషం కలిగించింది. దీనిని గురించి చర్చించుకున్నా, అతను నా గురించి ఆలోచించటం మాత్రం మానలేదు. అతను పొగ త్రాగేవాడు, మద్యం తీసుకునేవాడు. వాటిని అలవాటు చేసుకోమని ఏనాడూ చెప్పలేదు. ఇంకా వీటికి దూరంగా ఉండమని సలహా ఇచ్చేవాడు. కాని మాంసం తిననందువల్ల ఇంగ్లండ్ లో జీవించటం చాలా కష్టమని భావించి నా గురించి అమితంగా కలవరపడేవాడు.”
“ఇలా ఒక నెల రోజులు ఆయన వద్ద శిష్యరికం చేశాను. ఆయన ఇల్లు ‘రిచ్ మండ్’ (Richmond) లండన్ నుంచి 8 మైళ్ళు దూరంలో ఉన్నందువల్ల లండన్ వెళ్ళటానికి వారంలో ఒకటి, రెండు సార్లే వీలయ్యేది. Dr. మెహతా, శ్రీ దలపత్ రాయ్ శుక్లా ఆలోచించి లండన్ కు దగ్గరగా ఉండే ఒకరి ఇంట్లో నన్ను ఉంచటానికి నిర్ణయించారు. అప్పుడు శుక్లా West Kensington (మధ్య లండన్) లో తనకు తెలిసిన ఒక ఆంగ్లో-ఇండియన్ ఇంట్లో నా బస ఏర్పాటు చేశారు. ఆ ఇంటి యజమానురాలు నన్ను బాగా చూస్తానని మాట ఇచ్చింది. కాని ఆమె ఇంట్లో కూడా నేను బాగా ఆకలితోనే ఉండేవాడిని. నేను బొంబాయి నుంచి వచ్చే ముందు స్వీట్స్, తినుబండారాలను లండన్ కు పంపించాను. అవి ఇంకా చేరలేదు. ఆమె వండే ఆహార పదార్ధాలు కూడా చప్పగానే ఉండేవి. ప్రతిరోజూ వంటకం బాగుందా అని అడిగితే, బాగా లేదని చెప్పితే ఆమె ఏమి చేయగలదు? నా సిగ్గు, బిడియం నన్ను వదలలేదు. అందువల్ల ఆమె పెట్టిన దాని కంటే ఎక్కువ అడగటానికి సాహసించలేదు. ఆమెకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వారు నాకు బ్రెడ్ ముక్కలు ఒకటి, రెండు ఎక్కువ పెట్టేవారు. కాని వారికి తెలియదు నా ఆకలికి ఒక బ్రెడ్ లోఫ్ (loaf) కూడా సరిపోదని!”
“క్రమక్రమంగా ఇంగ్లండ్ లో స్థిరపడ్డాను. నా చదువు ఇంకా ప్రారంభించలేదు. శ్రీ శుక్లా సలహా మేరకు ఆంగ్ల దినపత్రికలు చదవటం ప్రారంభించాను. నేను ఏనాడూ ఇండియాలో వార్తాపత్రికలు చదవలేదు. కాని లండన్ లో వాటిని చదవటం ఇష్టమయ్యి నిత్యం క్షుణ్ణంగా చదివేవాడిని. నేను చదివిన వాటిల్లో ముఖ్యమైనవి ‘The Daily News’, ‘The Daily Telegraph’, ‘The Pall Mall Gazette’. రోజులో ఒక గంట సేపు వాటిని చదివేవాడిని. వీటి ద్వారా శాఖాహార restaurants ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని, ఇంటి యజమానురాలి సలహాతో వాటి వద్దకు నడిచి వెళ్ళేవాడిని. ఒక్కోసారి చౌక హోటళ్ల కోసం 10-12 మైళ్లు నడిచి కడుపు పట్టినంత బ్రెడ్ తినేవాడిని. కాని అది ఎంత తిన్నా సంతృప్తి కలిగేది కాదు.”
“ఇలా వీటి కోసం తిరుగుతున్నప్పుడు ఒకసారి ‘Farringdon Street’ లో ఒక ‘పూర్తి శాకాహార’ రెస్టారెంట్ ను చూస్తే ప్రాణం లేచివచ్చింది. పిల్లవాడి లాగా సంతోషంతో ఎగిరి గంతు వేసి అందులో ప్రవేశించాను. అచ్చట కిటికీ ప్రక్కన ‘సాల్ట్' (Henry Stephen Salt) అనే రచయిత వ్రాసిన పుస్తకం ‘A Plea for Vegetarianism’ కనిపిస్తే దానిని ఒక షిల్లింగ్ తో కొని భోజనశాలకు వెళ్లాను. అచ్చట కావలసినంత సంతృప్తితో తినటం ఇంగ్లండ్ వచ్చిన తరువాత ఇదే మొదటిసారి. అప్పుడు దేవుడు నాకు సహాయం చేయటానికి వచ్చాడనిపించింది. సాల్ట్’ వ్రాసిన పుస్తకం మొదటి పేజీనుంచి చివరి పేజీ వరకు క్షుణ్ణంగా చదివాను. ఇది నా మీద చెరగని ముద్ర వేసింది. కావాలనే నేను శాఖాహారినయ్యాను. నా తల్లికి నేను ప్రమాణం చేయటం నా అదృష్టం. నేను ఒకప్పుడు ప్రతి భారతీయుడు మాంసాహారి అయితే బాగుండునని భావించాను. కాని నాకు శాఖాహారమంటే ఎంతో ఇష్టం కాబట్టి, దాని విలువ పూర్తిగా ఆకళింపు చేసుకున్నాను కాబట్టి దీనిని వ్యాప్తి చేయటం నా జీవిత కర్తవ్యం అని ఆనాడే భావించాను.”
ఇంగ్లండ్ లో గాంధీజీ అనుభవాలు, జీవిత విశేషాలు తదుపరి సంచికల ద్వారా తెలుసుకుందాము.