

2. విద్యార్థి దశలో మహాత్మా గాంధికి జరిగిన చేదు అనుభవాలు, చేసిన తప్పులు
మొదటి పతన మార్గం: మాంసాహారం: దీనిని గురించి క్రితం సంచికలో వివరించటం జరిగింది.
రెండవ పతన మార్గం: తప్పుడు మార్గం:
మిత్రుని వలన మోహన్ దాస్ కు జరిగిన అపకారం మాంసాహారంతో ముగియలేదు. అది భార్య కస్తూరి బాయికి ద్రోహం పరిస్థితికి తీసుకువచ్చింది. ఎందుకంటే మిత్రుడు మోహన్ దాస్ ను ఒక వ్యభిచార గృహానికి తీసుకువెళ్లాడు. ఇవ్వవలసిన డబ్బు కూడా స్నేహితుడే ఇచ్చి అంతా సిద్ధం చేసి మోహన్ దాస్ ను వ్యభిచారిణి వద్దకు తీసుకువెళ్లాడు. ఈ విషయం గురించి గాంధీజీ ఇలా వివరించటం జరిగింది:
“గదిలో ఆమె ఉన్న మంచం దగ్గరకు వెళ్లాను. కాని ఆ సమయంలో నా నోటి వెంట మాటలు రావటంలేదు. చాలాసేపు ఆమె దగ్గరే నిలబడి ఉన్నాను. చివరకు ఆమెకు ఓర్పు నశించి, నన్ను తిడుతూ, అనరాని మాటలు అంటూ నన్ను గది విడిచి పొమ్మని ఆజ్ఞాపించింది. ఆ క్షణంలో ఆమె నా పురుషత్వాన్ని అపహాస్యం చేసినట్లుగా భావించి భరించలేనంత సిగ్గు, అవమానం, బాధా నాలో కలిగాయి. కాని ఈ పాప పంకిలం నుంచి నన్ను రక్షించినందుకు దేవుడికి అనేకసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అప్పటి వరకు నా జీవితంలో ఇటువంటి దురదృష్టమైన సంఘటనలు నాలుగు జరిగాయి. ప్రతిసారీ నా ప్రయత్నం కంటే, దేవుని కరుణయే నన్ను రక్షించింది. ఒక వ్యక్తి అంత హేయకరమైన, వినాశకరమైన పరిస్థితులనుంచి తప్పించుకోగలగడమంటే అది కేవలం ఈశ్వరుడి కృప ఉంటేనే సాధ్యమవుతుంది. ఒక వ్యక్తి పూర్తి స్పృహలోకి వచ్చినప్పుడే ఈశ్వరుడి కరుణను అర్ధం చేసుకుని ఆయనకు కృతజ్ఞతా పూర్వకంగా ఉండగలడు. మానవుడు ఒక్కొక్కసారి దుష్కృత్యాల వైపుకు ఆకర్షుడవుతాడు. ఎంత ప్రయత్నించినా దానికి లోనవుతూనే ఉంటాడు. చివరి క్షణంలో దాని బారి నుంచి తప్పించుకోగలిగాడంటే అది అతని ప్రయత్నం కంటే భగవంతుడి కృప వల్లనే సాధ్యమవుతుందని తెలుసు. ఇది ఎలా, ఎప్పుడు జరుగు తుందో ఎవరికీ అంతుబట్టని విషయం.”
ఇంత జరిగినా కూడా నా కళ్ళు పూర్తిగా తెరుచుకోలేదు. నా మిత్రునితో స్నేహం కొనసాగిస్తూనే ఉన్నాను. ఇటువంటి చెడు సంఘటనలు జరిగిన తరువాత గాని నాకు సంపూర్తి జ్ఞానోదయం కలగలేదు. అప్పుడు నాలో అనైతికత్వం ఎంత గూడుకట్టుకుని ఉందో నాకు తెలిసివచ్చింది.”
ఈ దశలో మోహన్ దాస్ కు భార్యతో ఉన్న విభేదాలు కేవలం ఈ మిత్రుడితో చేసిన సహవాసం వల్లనే కలిగాయి. “నేను మంచి భర్తనే గాని, అసూయాపరుడైన భర్తను. ఈ నా బలహీనతను నా మిత్రుడు తెలివిగా ఉపయోగించుకుని, నా భార్య మీద లేనిపోని అనుమానాలు నాలో రేకెత్తించాడు. అతను చెప్పిన వాటిని నేను అనుమానించలేదు. ఈ కారణంగా నేను నా భార్యను అనుమానించటం అమానుషం. ఆ తరువాత నేను ఎంతో బాధపడ్డాను. దీనికి నన్ను నేను క్షమించుకోలేను. బహుశా ఒక హైందవ స్త్రీ మాత్రమే ఇటువంటి కష్టాలను భరించగలదు. అందువల్లనే సహనానికి మారు పేరు ‘స్త్రీ’ అని నేను గాఢంగా నమ్ముతాను.”
“ఒక సేవకుడి మీద తప్పుడు అభియోగం మోపితే అతను ఉద్యోగం త్యజిస్తాడు. కొడుకుకు కోపం వస్తే అతను తల్లిదండ్రుల ఇల్లు వదలి వెళ్ళిపోతాడు. అలాగే స్నేహితుడు అలిగి దూరంగా వెళ్ళిపోతాడు. భార్య భర్తను అనుమానించినా ఇల్లు విడిచి వెళ్ళదు; కాని ఒక భర్త భార్యను అనుమానిస్తే ఆమె జీవితం ఛిద్రమైపోతుంది. అప్పుడు ఈ హైందవ స్త్రీ ఎక్కడకు వెళ్తుంది? న్యాయస్థానం ఆమెకు సరిఅయిన న్యాయం చేయలేదు. అందువల్ల నా భార్యకు ఇటువంటి నిరాశా పరిస్థితిని కల్పించినందుకు నన్ను నేను క్షమించుకోలేను” అని నిస్సంకోశంగా తన ఆత్మ కధ ద్వారా 40 ఏళ్ళ తరువాత లోకానికి వెల్లడించాడు ఈ మహాత్ముడు.
మరొక్క సంగతి కూడా మానవాళికి చాటి చెప్పాడు మన బాపూజీ. అది “నేను అహింసా మార్గాన్ని అనుసరించినప్పుడు నాలో ఈ అనుమానపు పొరలు పూర్తిగా తొలగిపోయాయి. నేను పూర్తి ‘బ్రహ్మ చర్యాన్ని’ అనుసరించినప్పుడే భార్య భర్తకు సంకెళ్లు వేయబడిన బానిస కాదని అతని సహచరి, సహాయకురాలని అర్ధమయింది. సంసారంలో భర్త లాగానే ఆమె సమాన పాత్రధారి అని, అతనివలె ఆమెకూ ఎంచుకునే, ఎంచుకోగల స్వతంత్రురాలని నాకు విశదమైంది. లేనిపోని అనుమానాలు, సందేహాలతో కొట్టుమిట్టాడిన ఆ చీకటి రోజులలో నా స్నేహితుడిని గుడ్డిగా నమ్మి కామంతో కూడిన ప్రవర్తనను ప్రదర్శించాను. అందుకు నేను ఈనాడు గర్హించుచున్నాను, నన్ను నేను దూషించుకుంటున్నాను. చేసిన నేరాన్ని నిర్భయంగా, బహిరంగంగా అంగీకరించి వెల్లడించగలగటమే మహాత్ములకు, సామాన్యులకు మధ్య ఉన్న అతి ముఖ్యమైన తేడా.”
మూడవ పతన మార్గం: పొగ త్రాగటం, ఆత్మహత్యా యత్నం
ఈ ‘మాంసాహార’ కాలంలోనూ, అంతకు ముందు, అంటే వివాహానికి ముందు, ఆ తరువాత గాంధీజీ జీవితంలో మరొక తప్పిదం చోటుచేసుకుంది.
మోహన్ దాస్ కు, అతని బంధువుకు పొగత్రాగాలనే కాంక్ష బలీయంగా ఉండేది. పొగ త్రాగటంలో మెచ్చుకోదగింది ఏదీ లేదని ఈ కుర్రవాళ్ళకు తెలుసు. కాని దాని వాసన అంటే వారికి చాలా ఇష్టం. అంతకంటే నోటినుంచి పొగ రింగు రింగులుగా వదలాలని కాంక్ష బలీయంగా ఉండేది. మోహన్ దాస్ మేనమామ పొగ త్రాగుతూ రింగులు వదలటం చూసి ఉబలాటపడి ఆయనను అనుకరించాలని నిర్ణయించుకున్నారు. కాని సిగరెట్లు కొనటానికి డబ్బులు లేవు. అందువల్ల ఆయన కాల్చిపారవేసిన సిగ రెట్టు పీకలను దొంగిలించటం ప్రారంభించారు. కాని ఈ పీకలు ఎప్పుడూ దొరికేవికావు. వాటిని పీల్చినా పొగ ఎక్కువ వచ్చేది కాదు. అందువల్ల పనివాడి చిల్లర డబ్బులు దొంగిలించి సిగరెట్లు కొనుక్కునేవారు. కాని వీటిని ఎక్కడ దాచుకోవాలో తెలియదు, పెద్దవాళ్ళ వాళ్ళ ఎదుట కాల్చే ధైర్యమూ లేదు. ఎన్నో తంటాలు పడి కొన్ని నెలలపాటు డబ్బులను దొంగిలించి సిగరెట్లు కొని కాల్చేవారు.
కొన్నాళ్ళు డబ్బులు దొరకక బోలుగా ఉన్న పొగాకు మొక్క కాండాలను దొంగిలించి వాటిని ఎండ బెట్టి పొగత్రాగేవారు. కాని దొంగతనంగా జరిపే ఈ చేష్టలు చాలా తప్పని వీరు కాలక్రమేణా తెలుసుకోవటం ప్రారంభించారు. పెద్దవారి అనుమతి లేకుండా ఇటువంటి చెడుపనులు చేయటం అతి హేయమైనదనే భావన రోజు రోజుకూ పెరుగుతూ ఉండటంతో దానిని భరించలేక ఒక రోజు వీరు ఆత్మహత్య చేసుకోటానికి సిద్ధమయ్యారు. దీనిని గురించి 40 ఏళ్ల తరువాత గాంధీజీ వెల్లడించిన మాటలలోనే తెలుసుకుందాం:
“ఆ సమయంలో మా మనస్సులలో అనేక ఆలోచనలు మొదలయ్యాయి. ఆత్మహత్య ఎలా చేసుకోవాలి? విషం ఎక్కడనుంచి తేవాలి? అది తీసుకున్న తరువాత ఎంతసేపటికి మరణిస్తాం? అనే ఆలోచనలు మా మనస్సులను చుట్టుముట్టేశాయి. ఒక రోజు గన్నేరు విత్తనాలలో విషం ఉంటుందని తెలుసుకుని వాటిని దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్లి సంపాదించాం. ఆత్మహత్యకు ముహూర్తం నిర్ణయించుకుని ఆ రోజు సాయంత్రం ‘కేదార్ జీ మందిర్’ కు వెళ్లి, శివుడిని దర్శించుకుని గుడిలోని ఒక మారుమూల ప్రదేశంలో కూర్చున్నాం. కాని గన్నేరు విత్తనాలను తినటానికి భయం వేసింది. వాటిని నోటిలో వేసుకోవటానికి ధైర్యం చాలలేదు. ఒకవేళ వాటిని మేము తిన్న తరువాత మరణించకపోతే? అదీగాక మమ్ములను మేము చంపుకుంటే ఏమి సాధించగలం?
అదే క్షణంలో ఈ స్వేచ్చారహిత జీవితాలను మేము ఎన్నాళ్ళు భరించగలం? కొంతసేపటికి ముసురుకున్న ఈ ఆలోచనలన్నిటినీ దూరంగా నెట్టి, ధైర్యం కూడగట్టుకుని 2, 3 విత్తనాలను నోట్లో వేసుకున్నాం. ఇంకా ఎక్కువ విత్తనాలను తినటానికి ధైర్యం నశించింది. పిరికితనం ఆవహించింది. చావంటే భయం వేసింది. క్రమక్రమంగా ధైర్యం కూడదీసుకుని మరల దేవుడి దర్శనార్ధమై గర్భగుడిలోకి వెళ్ళాం. ఈశ్వరుడి సన్నిధిలో ఆత్మహత్యాయత్నాన్ని మా మనసుల్లోంచి తీసివేశాం.
అప్పుడు నాకు బోధపడింది. ఆత్మహత్య చేసుకోవటం, దానిని గురించి ఆలోచించటం అంత తెలివైనపని కాదని. అప్పటినుంచి ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటానని భయపెట్టినా నేను ఎన్నడూ లెక్క చేయలేదు. ఆ సమయంలో నేను, నా బంధువు సిగరెట్టు పీకలు కాల్చటం కాని, పనివాడి డబ్బులు దొంగిలించి వాటిని కాల్చటం కాని చేయకూడదని, అసలు జీవితంలో ఎన్నడూ పొగ త్రాగకూడదని నిర్ణయించుకున్నాం.”
నాలుగవ పాఠం, దానినుంచి ప్రక్షాళన
మూడవ తప్పు జరిగిన కొంత కాలానికి అంటే మోహన్ దాస్ కు 15 ఏళ్ళు ఉన్నప్పుడు మరొక తప్పు చేశారు. ఈ సారి తన అన్న చేతి బంగారం కడియం నుంచి ఒక చిన్న ముక్కను దొంగిలించటం. అప్పటికి ఇతను ఒకరికి 25 రూపాయలు బాకీ ఉన్నాడు. ఈ అప్పు తీర్చటానికి కడియం నుంచి ఆ చిన్న ముక్కను కత్తిరించి అమ్మి అప్పు తీర్చివేశాడు.
ఈ విషయం గురించి గాంధీజీ ఇలా వివరించారు. “దొంగతనం చేసి అప్పు తీర్చివేశాను. కాని రోజు రోజుకూ ఈ అపరాధం భరించే శక్తి నాలో క్షీణించసాగింది. చివరకు ఇంకెన్నడూ దొంగతనం చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఈ విషయం మా నాన్నగారికి చెప్పి నా నేరం అంగీకరించి, ఇంకా ఎన్నడూ దొంగతనం చేయనని ప్రమాణం చేయదలచుకున్నాను. కాని ఇది చెప్పటానికి ధైర్యం లేదు. ఆయన నన్ను కొడతారని భయంవల్ల కాదు. ఆయన నన్ను ఎప్పుడూ కొట్టలేదు. కాని ఆయనకు కలిగే మనోవేదన గురించే నా భయం. కాని ఈ సాహసం తప్పదు అని నిర్ణయించుకున్నాను. ఆయన ముందు అంగీకరిస్తే నా మనస్సు తేలిక పడుతుంది.”
ఈ విషయాన్ని విపులంగా ఒక లేఖలో వ్రాసి ఆయనకు ఇవ్వదలచుకున్నాను. చివరకు వ్రాసి ఆ లేఖను ఆయన చేతికి ఇచ్చాను. అందులో నా నేరాన్ని క్షమించి, దానికి తగిన శిక్ష వేయమని అర్ధించాను. భవిష్యత్తులో ఎన్నడూ ఇటువంటి చెడు పనులు చేయనని మాట ఇచ్చాను.....
లేఖ ఇచ్చి ఆయన ఎదురుగా ఒక ఎత్తు పీట మీద వణుకుతూ కూర్చున్నాను. ఆ సమయంలో నా తండ్రి ‘నాళ శ్రవణం’ (fistula) తో బాధ పడుతూ ఒక కొయ్య బల్ల మంచం మీద పడుకుని ఉన్నారు. లేఖను చదివిన వెంటనే ఆయన కళ్ళ నుంచి కన్నీరు చెంపల మీదుగా ముత్యాలులాగా జాలువారి కాగితాన్ని తడిపివేశాయి. కొంతసేపు కళ్ళుమూసుకుని దీర్ఘాలోచనలో మునిగి కొంతసేపు తరువాత దానిని చించివేశారు. కొంతసేపటికి చించిన కాగితపు ముక్కలను చూసి, మరల పడుకున్నారు. ఇది చూసి నేను బిగ్గరగా ఏడవసాగాను. ఆయన ముఖంలో బాధ, వేదన స్పష్టంగా కనిపించాయి.
నేను చిత్రకారుడనయితే ఈ దృశ్యాన్ని అంతాఒక చిత్తరువులో చూపించేవాడిని......ఆయన కళ్ళ నుంచి జాలువారిన కన్నీళ్ల ముత్యాలు నా మనస్సును పరిశుభ్రం చేశాయి. దానితో నా పాప ప్రక్షాళన జరిగిపోయింది. ఇటువంటివి అనుభవిస్తేనే ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది.
అహింసా సాధనలో ఇది నాకు మరొక గుణపాఠం. ఆ సమయంలో నా తండ్రి ప్రేమ తప్ప మరేదీ గ్రహించే శక్తి లేకపోయింది. అదే ఈ రోజున నిజమైన అహింస అని అర్ధమయింది. ఈ అహింస అంతటా వ్యాపించినప్పుడు అది తాకిన ప్రతి వ్యక్తినీ మార్చి వేస్తుంది. దీని శక్తికి ఎల్లలు లేవు...నా తండ్రి చూపించిన ఈ ఉత్కృష్టమైన క్షమాపణను నేను ఆయననుంచి ఆశించలేదు. అది ఆయన సహజ స్వభావం కాదు. నేను చేసిన పనికి ఆయన కోపం పట్టలేక తన నుదురు కొట్టుకుంటాడని భావించాను. కాని ఆయన అంత ఉదాత్తమైన ప్రశాంతత చూపించారంటే దానికి ముఖ్య కారణం నేను నిజాయితీగా నా తప్పును ఒప్పుకుని, చేసిన దానికి పశ్చాత్తాపం పడుతూ, ఇక ముందెన్నడూ ఇటువంటి తప్పు చేయనని వాగ్ధానం చేయటం. నా తప్పును ఒప్పుకున్న మరుక్షణమే నా క్షేమం గురించి ఆయనలో నమ్మకం, భరోసా కలిగాయి. ఇదే ఆయనకు నామీద అంతులేని ప్రేమ పెరగటానికి కారణమయింది.”
****సశేషం****
(గాంధీజీ తండ్రి కరంచంద్ గాంధి మరణం, ఆయన దైవావలోకనం గురించి వచ్చే సంచికలో తెలుసుకుందాం)