Menu Close
VSRao
మహాత్మా గాంధి
డా. వల్లూరుపల్లి శివాజీరావు
Mahatma-Gandhi
Image by WikiImages from Pixabay

గాంధీజీ విద్య

1. దస్తూరి, ప్రాధమిక పాఠశాల విద్య

వ్యాయామం చేయటం, ఆటలు ఆడటంతో చూపిన అశ్రద్ధ గాంధీజీకి భవిష్యత్తులో అంతగా నష్టం కలి గించక పోయినా, దస్తూరి విషయంలో చూపిన అశ్రద్ధ ఆయన జీవితాంతం వెంటాడింది. చదువుకి, దస్తూరి అంత ముఖ్యం కాదనే అభిప్రాయం ఆయనకు ఎప్పుడు, ఎలా జనించిందో ఆయనకు తెలియదు గానీ, అది ఆయన ఇంగ్లండ్ వెళ్లేవరకు మనస్సులో ఉండిపోయింది. కానీ  ఆ తరువాత అయన దక్షిణ-ఆఫ్రికా వెళ్లిన తరువాత అచ్చటే పుట్టి, చదువుకున్న యువకులు, న్యాయవాదుల దస్తూరి చూసి నప్పుడు తాను చేసిన తప్పు తెలిసివచ్చింది. ఆయన దస్తూరి నమూనా క్రింద జవహర్లాల్ నెహ్రు కు వ్రాసినది చూడవచ్చు.

Gandhi-handwriting
Picture Credit: Wikimedia Commons
గాంధీజీ దస్తూరి నమూనా

దీని గురించి గాంధీజీ ఇలా వివరించారు. “అప్పుడు దస్తూరి మెరుగుపరచుకోటానికి ప్రయత్నిస్తే అది సాధ్యం కాలేదు. విదార్థి దశలో ఎంత ప్రయత్నించినా దానిని మరమత్తు చేయలేము. నా ఉదాహరణను ప్రతి బాలుడు, బాలిక దృష్టిలో పెట్టుకుని చిన్నతనం నుంచి దస్తూరి చదువులో ఒక ముఖ్య భాగంగా చేసుకుని మంచి దస్తూరిని అలవరచుకోవాలని సలహా ఇస్తున్నాను. అలాగే పాఠశాలలో పిల్లలకు బొమ్మలు వేయటం నేర్పాలి. వీరు చదువుకు ముందు పువ్వులు, పక్షులు మొదలగువాటి బొమ్మలు వేయటం నేర్చుకుంటే తరువాత మంచి దస్తూరితో వ్రాసే నైపుణ్యం అలవడుతుంది.”

తన విద్యార్థి దశలో జరిగిన రెండు విషయాలు ఆయన స్మృతిపధంలో మెదులుతూ ఉండేవి. వివాహం జరిగిన తరువాత ఒక సంవత్సరం చదువు నష్టపోయినందువల్ల మాస్టారు ఆయనను 3 వ తరగతి పూర్తిచేయక ముందే 4వ తరగతిలోకి పంపించారు. 4వ తరగతి నుంచి బోధన ఇంగ్లీషులో జరిగినందువల్ల మోహన్ దాస్ కు పాఠాలు అర్ధంచేసుకోవటం చాలా కష్టతరమయింది. దీనివల్ల రేఖాగణితం (Geometry) మాస్టారు ఎంత బాగా బోధించినా అర్ధమయ్యేది కాదు.

అప్పుడప్పుడు అతనికి నిస్పృహతో 3వ తరగతిలోకి వెళ్లాలనిపించేది. కాని తరువాత ధైర్యంతో మాస్టారు సహకారంతో చాలా సాధన చేస్తే కాని ఈ గణితశాస్త్రం అర్ధం కాలేదు. ఒక్కసారి దానిలోని సూత్రాలు అర్ధమయితే, తరువాత రేఖాగణితం సులభంగా బోధపడి, అది ఆయనకు చాలా ఇష్టమయిన subject అయింది. కాని మోహన్ దాస్ కు సంస్కృతం నేర్చుకోకపోవటం చాలా క్లిష్టమైన అంశం అయింది. రేఖా గణితంలో కంఠస్థం చేయవలసింది ఏదీ ఉండదు. కానీ సంస్కృత భాషలో ప్రతి చిన్న విషయాన్ని కంఠస్తం చేస్తేగాని జ్ఞాపకం ఉండదు. దీని బోధన 4వ తరగతిలో ప్రారంభమయినా, 6వ తరగతిలో ప్రవేశించినప్పుడు ఆయన చాలా నిరాశ, నిస్పృహలకు లోనయ్యాడు. దీనికి తోడు మాస్టారు చాలా నిఖచ్చిగా ఉండేవారు.

ఆ కాలంలో సంస్కృతం, పర్షియన్ భాషలు బోధించే ఉపాధ్యాయుల మధ్య పోటీ ఉండేది. పర్షియన్ భాష నేర్పేవారు చాలా కనికరం చూపిస్తే, సంస్కృత ఉపాధ్యాయులు కఠినంగా ఉండేవారు. అందువల్ల మోహన్ దాస్ కు సంసృతం కంటే పర్షియన్ నేర్చుకోవాలనే ఉత్సుకత ఉండి సంస్కృతం నేర్చుకోటానికి స్వస్తి పలికాడు. దీనిని గమనించి, విచారపడిన సంస్కృతం మాష్టారు కృష్ణశంకర్ పాండ్య ఇతనిని పిలిచి “నీవు ఒక వైష్ణవ తండ్రి పుత్రుడవని ఎలా మరచి పోతావు? నీ మతానికి సంబంధించిన భాషను ఎందుకు నేర్చుకోవు? నీకు ఏమైనా కష్టంగా ఉంటే నా వద్దకు రావచ్చుకదా? నా శక్తి మేరకు నా విద్యార్థులకు సంస్కృతం బోధిస్తాను. నేర్చుకొనేటప్పుడు ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళినకొద్దీ ఈ భాష చాలా ఆ సక్తిదాయకంగానూ, మనస్సుకు హత్తుకునేటట్లుగానూ, ఇంకా చాలా నేర్చుకోవాలనే తపన ప్రేరేపిస్తుంది. నీవు నిరాశ చెందవద్దు. నీవు తిరిగి సంస్కృతం తరగతిలోకి వచ్చి కూర్చో” అని సలహా ఇచ్చారు. మాస్టారు చూపించిన ఈ దయ మోహన్ దాస్ ను సిగ్గుపడేటట్లు చేసింది.

దీనిని గురించి గాంధీజీ 40 ఏళ్ల తరువాత ఇలా పేర్కొన్నారు: “ఈ రోజున కృష్ణశంకర్ పాండ్య కు నేను చాలా ఋణపడి ఉన్నాను. అప్పుడు నేను సంస్కృతం నేర్చుకోక పోయిఉంటే నాకు హిందూ పవిత్ర గ్రంధాలను చదవటం చాలా కష్టమయ్యేది. ఈ రాజభాషను ఆ రోజుల్లో ఎందుకు ఇంకా క్షుణ్ణంగా నేర్చుకోలేదనే బాధ నాకు ఎప్పుడు ఉండేది. ప్రతి హైందవ బాలుడు, బాలిక సంస్కృతం తప్పక నేర్చుకోవాలనే విషయం బోధపడింది.”

గాంధీజీ అభిప్రాయం ప్రకారం భారతీయ విద్యార్థుల బోధనాంశాలలో సంస్కృతం, ఇంగ్లీష్ భాషలతో పాటు పర్షియన్, ఆరబిక్ భాషలకు కూడా చోటు ఉండాలి. ఇన్ని భాషల జాబితాను చూసి విద్యార్థులు భయపడనవసరం లేదు. ఈ పద్ధతిలో పిల్లలకు విద్య నేర్పితే పరభాషా మాంధ్యంలోనే ప్రతి పాఠ్యాంశం (lesson) నేర్చుకోవాలనే ఆంక్షను తొలగించి, స్వేచ్ఛనిస్తే వారు ఏ భాషనైనా ఎంతో ఉత్సాహంతో, సంతోషంతో నేర్చుకోటానికి ముందుకు వస్తారు.

2. విద్యార్థిదశలో జరిగిన చేదు అనుభవాలు, చేసిన తప్పులు

విద్యార్థి దశలో మోహన్ దాస్ కు ఎంతోమంది మిత్రులున్నా, వారిలో ఇద్దరు మాత్రం ఇతనితో చాలా సన్నిహితంగా ఉండేవారు. కాలక్రమంలో ఈ ఇరువురులో ఒకరి మాత్రం అత్యంత సన్నిహితంగా ఉండే వాడు. అది ఓర్వలేని ఒక మిత్రుడు మోహన్ దాస్ ను వదలి వెళ్ళిపోయాడు. ఇక మిగిలిన ఒక మిత్రుడు యదార్ధానికి మోహన్ దాస్ పెద్దన్నకు మిత్రుడు. ఈతనితో సాంగత్యం కొద్దికాలమే నిలబడినా తరువాత జరిగిన విషాదం ఈ చిన్న గాంధి ఒక చిన్న సంస్కర్తగా పరిణితి చెందటానికి పునాది వేసింది.

ఇతనిని గురించి గాంధీజీ ఇలా వివరించారు. “ఇతను నా పెద్దన్న సహాధ్యాయుడు, స్నేహితుడు. అయితే అతను వెంటవెంటనే పై తరగతులకు ఉత్తీర్ణుడు కాలేక నా సహాధ్యాయుడు, మిత్రుడు అయ్యాడు. అతని బలహీనతలను గురించి నాకు తెలిసినా ఒక విశ్వసనీయుడయిన స్నేహితుడుగానే భావించాను. పెద్దన్న, వదిన అతనితో స్నేహం మంచిది కాదని హెచ్చరించారు, మందలించారు. నా భార్య హెచ్చరికను భర్త అనే అహంకారంతో లక్ష్యపెట్టలేదు. కాని అమ్మ, అన్నయ్య, హెచ్చరికలను అలక్ష్యం చేసే ధైర్యం లేదు. అందుకని ‘మీరు అతనికి ఆపాదించిన బలహీనతలు గురించి తెలుసు. కాని అతనిలో ఉన్న సద్గుణాలను గురించి మీకు తెలియవు. అతడు నన్ను తప్పుడు మార్గంలో నడిపించలేడు. అదీగాక, నా సాన్నిహిత్యం ద్వారా అతనిని మార్చివేయగలను. నా ద్వారా అతను సంస్కరించుకుంటే ఒక ఉన్నతమైన వ్యక్తిగా రూపొందగలడు. అందువల్ల మీరు నా గురించి ఆందోళనపడవద్దని మిమ్ములను వేడుకొనుచున్నాను’ అని వారికి నచ్చజెప్పాను. ఈ నా వాదనతో వారు సంతృప్తిపడక పోయినా నా దారిలో నేను నడవటానికి ఎట్టకేలకు సమ్మతించారు అని నేను ఈ మిత్రుని తరఫున మాట్లాడాను.”

తన స్నేహితుడు గురించి మోహన్ దాస్ చేసిన ఆలోచన చివరకు బెడిసికొట్టి తన పతనానికి దారి తీసింది. ఈ చిన్న గాంధి అభిప్రాయం ప్రకారం ఒక సంస్కర్త తాను సంస్కరించదలచుకున్న వ్యక్తి తో అతి సన్నిహితంగా ఉండకూడదు. నిజమైన స్నేహంలో ఇరువురి మిత్రుల ఆత్మలలో దగ్గరి పోలికలుండాలి. ఒకరి స్వభావం మరొకరి స్వభావంతో అతి దగ్గరగా ఉంటేనే స్నేహం కలకాలం నిలబడుతుంది. కేవలం ఒక్క విషయాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని, లేదా కేవలం లబ్ది పొందటానికి మాత్రమే చేసే స్నేహంలో కేవలం స్వార్ధం మాత్రమే ఉంటుంది. నిజానికి సద్గుణం కంటే దుర్గుణం నేర్చుకోవటం చాలా సులువు. దేవుని సాన్నిహిత్యం కోరేవారు ఒంటరిగానే ఉండాలి, లేదా సమస్త ప్రపంచాన్ని తన మిత్రుడు గా భావించగలిగే విశాల దృక్పధం కలవాడై ఉండాలి. కాలక్రమేణా ఈ వ్యక్తితో జరిపిన స్నేహం మోహన్ దాస్ ను వైఫల్యాల వైపుకు నెట్టింది.

మొదటి పతన మార్గం: మాంసాహారం

తన స్నేహితుడి గురించి మోహన్ దాస్ ఆలోచన బెడిసికొట్టి చివరకు తన పతనానికే దారితీసింది. ఈ చిన్న గాంధి అభిప్రాయం ప్రకారం ఒక సంస్కర్త తాను సంస్కరించదలచుకున్న వ్యక్తితో అతి సన్నిహితం గా ఉండకూడదు. నిజమైన స్నేహంలో ఇరువురి ఆత్మలలో దగ్గరి పోలికలు ఉండాలి. ఒకరి స్వభావం మరొకరి స్వభావానికి అతి దగ్గరగా ఉంటేనే స్నేహం కలకాలం నిలబడుతుంది. కేవలం ఒక్క విషయాన్నిదృష్టిలో పెట్టుకుని, లేదా కేవలం లబ్ది పొందటానికి మాత్రమే చేసిన స్నేహంలో కేవలం స్వార్ధం మాత్రమే ఉంటుంది. ఇటువంటి అవకాశ స్నేహం ఎక్కువ కాలం నిలబడదు. నిజానికి సద్గుణం కంటే దుర్గుణం నేర్చుకోవటం చాలా సులువు. దేవుని సాన్నిహిత్యం కోరువారు ఒంటరిగానే ఉండాలి. లేదా సమస్త ప్రపంచాన్ని తన మిత్రుడుగా భావించ గలిగే విశాల దృక్పధం కలవాడై ఉండాలి. కాలక్రమేణా ఈ వ్యక్తితో జరిపిన స్నేహం మోహన్ దాస్ ను వైఫల్యాల వైపుకు నెట్టింది. దీనిని గురించి గాంధీజీ ఏమన్నారో చూద్దాం:

“నేను ఇతనితో స్నేహం చేసినప్పుడు రాజ్ కోట లో ఒక విధమైన సంస్కరణ గాలులు వీస్తూ ఉండేవి. అప్పుడు ఈ మిత్రుడు నాతో, మా ఉపాధ్యాయులలో చాలామంది రహస్యంగా మాంసం, ద్రాక్ష సారాయి తీసుకుంటున్నారని వీరిలో చాలామంది రాజ్ కోట వాసుల పేర్లు చెప్పి, వీరే గాక నాకు తెలిసిన విద్యార్థుల గురించి కూడా అతి నమ్మకంగా నాతో చెప్పాడు. ఈ వార్త నాకు ఆశ్చర్యంతో పాటు బాధను కలుగజేసింది. అప్పుడు ఇతనిని నేను మార్చటానికి ప్రయత్నిస్తే అతను మాంసాహారం ఈవిధంగా నాకు విశదపరచాడు ‘మనం మాంసం తినం కాబట్టి శారీరకంగా బలహీనులుగా ఉన్నాం. ఆంగ్లేయులు మాంసాహారులు కాబట్టే ధృడంగా, బలంగా ఉండి మనలను పరిపాలించ గలుగుచున్నారు. నేను ఎందుకు ఇంత బలంగా ఉన్నానో, ఎంత దూరమైనా పరుగెత్తగలనో తెలుసా? అది నేను మాంసం తింటున్నాను కాబట్టే.’

“మాంసాహారులలో అత్యధికులకు శగగడ్డలు (boils), కాయలు (tumors), వాపులు ఉండవు. ఒకవేళ అవి వచ్చినా వెంటనే మానిపోతాయి. మాంసాహారులైన ఆంగ్లేయులు వివేకవంతులే గాని అవివేకులు కారు. వారికి మాంసాహారంలో ఉన్న మంచి గుణాల గురించి తెలుసు కాబట్టే వారు అంత గొప్పవారయ్యారు. నీవు కూడా వారిలాగా గొప్పవాడివి అవటానికి మాంసం తినటం ప్రారంభించు. ఒక్కసారి మాంసం తింటే దాని విలువ, అది ఇచ్చే బలం, శక్తి నీకు తెలుస్తుంది. దీనిని గురించి నామిత్రుడు అనేక సార్లు అనేక విధాలుగా చెప్పాడు. నా పెద్దన్న అప్పటికే అతని ప్రోద్బలంతో మాంసాహారిగా మారాడు. అన్నయ్య కూడా నా మిత్రుని వాదనలో ఉన్న నిజాన్ని నమ్మి నన్ను మాంసాహారిగా మారమని సలహా ఇచ్చాడు.”

“యదార్ధానికి మా అన్నతో పోల్చుకుంటే నేను చాలా దుర్భలుడను. వారిద్దరూ శారీరకంగా నా కంటే దీర్ఘకాయులు, బలవంతులు. నా మిత్రుడు చెప్పినట్లుగా అతను నిజంగా వేగంగా చాలాసేపు అలుపులేకుండా పరుగెత్తగలడు. వాడు చాలా ధైర్యవంతుడు. ఎటువంటి శారీరక శిక్షనైనా సునాయాసంగా భరించటంలో సిద్ధహస్తుడు. నన్ను మార్చటానికి అనేక శారీరక సాహసాలు కూడా చేశాడు. వాటిని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను పరుగెత్తలేను, దూకలేను. అందువల్ల నేను కూడా అతని లాగా మాంసాహారిని అవటానికి నిర్ణయించుకున్నాను.”

(అదీగాక మోహన్ దాస్ స్వతహాగా పిరికివాడు. అతనికి దొంగలు, దెయ్యాలు, పాములంటే అతి భయం. రాత్రిళ్ళు ఒంటరిగా బయటకు వెళ్లే ధైర్యం లేదు. చీకటి అంటే అతి భయం. చీకట్లో నిదురపోతే ఒక వైపు నుంచి దొంగలు, మరొక వైపు నుంచి దెయ్యాలు, మూడవ వైపు నుంచి పాములు వస్తున్నాయని ఊహించుకుని నిదురపోయేవాడు కాదు. అందువల్ల దీపం లేకపోతే రాత్రిళ్ళు నిదురపోలేడు.)

కాని ఇవన్నీ మోహన్ దాస్ భార్యకు చెప్పుకోలేడు. చెప్పుకుంటే చిన్నతనమని భావించేవాడు; ముఖ్యంగా ఆమె తన ప్రక్కన నిదురపోతున్న వయస్సులో. కాని ఆమె రాత్రిళ్ళు ఎక్కడికైనా ధైర్యంగా వెళ్లగలదు. మోహన్ దాస్ కంటే కస్తూరి బాయి చాలా ధైర్యవంతురాలు. మోహన్ దాస్ కు ఉన్న బలహీనతల గురించి మిత్రునికి తెలుసు. అతను మాంసాహారి కాబట్టే పాములను ధైర్యంగా చేతితో పట్టుకోగలడు, దొంగలను ఎదిరించగలడు, దెయ్యాలంటే భయంలేదు అని అతనిని మోహన్ దాస్ పూర్తిగా నమ్మాడు.

దీనికి తోడు గుజరాతీ కవి ‘నర్మద్’ (నర్మదాశంకర్ లాల్ శంకర్ దవే) వ్రాసిన ఈ క్రింది పద్యం ఆ కాలపు విద్యార్థులలో చాలా ప్రచారంలో ఉండేది. అది:

“అదుగో చూడండి బలవంతుడైన ఆంగ్లేయుడిని,
ఈతను ఎంతో చిన్నగా ఉండే భారతీయుడి మీద
అధికారం చెలాయిస్తున్నాడు. ఎలాగంటే వాడు
మాంసాహారి అయిన అయిదు మూరల ఎత్తున్నాడు కాబట్టే"

ఇటువంటి పద్యాల ప్రభావం మోహన్ దాస్ మీద బాగానే పడింది. ఇతనిలో మాంసం తింటే తాను కూడా బలవంతుడు, ధైర్యవంతుడు కాగలననే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. భారతీయులందరూ మాంసాహారులయితే ఆంగ్లేయులను జయించవచ్చనే నమ్మకం ఆయనలో మొగ్గ తొడిగింది. ఆ తరువాత జరిగిన సంగతి ఆయన మాటల్లోనే తెలుసుకుందాము:

“మాంసం తినటానికి ఒక రోజు నిర్ణయించాను. కాని ఇది చాలా రహస్యంగా జరగాలి. ఎందుకంటే మా గాంధి వంశస్థులు వైష్ణవులు. అందులోనూ నా తల్లిదండ్రులు అసలైన చాందస వైష్ణవులు. మా కుటుంబానికి స్వంత దేవాలయాలు కూడా ఉన్నాయి. జైన మతం గుజరాత్ లో చాలా బలంగా ఉన్నందువల్ల దాని ప్రభావం అందరి మీదా బలంగా ముద్ర వేసింది. వైష్ణవులు, జైనులు మాంసాహారాన్ని అసహ్యించుకుంటారు. ఈ ఆచార వ్యవస్థలో నేను జన్మించాను, పెరిగాను. నేను మాంసం తిన్నానని తెలిసిన మరుక్షణం నా తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి లోనయ్యి, తమ ప్రాణాలు కూడా తీసుకునే స్థితికి రావచ్చు. అందువల్ల సర్వదా సత్యాన్ని పాటించే నేను ఈ విషయాన్ని అతి గోప్యంగా ఉంచటం తప్పని సరి.”

“నేను మాంసం తింటే వారిని మోసగిస్తున్నానని పూర్తిగా తెలుసు. కాని మాంసాహారం రుచి లేకపోయినా దానిని భుజించాలనే కోరిక, కాంక్ష రోజురోజుకూ బలంగా నాటుకు పోతోంది. నేను, నాతో పాటు నా దేశస్తులందరు మాంసాహారులైతే ఈ ఆంగ్లేయులను తరిమివేసి దేశానికి విముక్తిని సాధించవచ్చని గట్టిగా నమ్మాను. స్వేచ్ఛ, స్వాత్రంత్రం నాకు బాగా అవగతమే. అప్పటికి “స్వరాజ్” నినాదం లేదు గాని, నన్ను నేను సంస్కరించుకోవచ్చనే ఆలోచనా మత్తులో, ఆవేశంలో నా కళ్ళు మూసుకుపోయాయి. దీనిని కాలక్రమేణా నా తల్లిదండ్రులకు నేను నచ్చజెప్పుకోవచ్చనే ప్రక్రియలో నేను సత్యానికి దూరమవుతానని భావించలేదు.”

నిర్ణయించుకున్న రోజు రానే వచ్చింది. అప్పుడు మోహన్ దాస్ లో రెండు రకాల సంఘర్షణలు బయలు దేరాయి. ఒకటి జీవితంలో ఈ ముఖ్యమైన పరిణామం తనను తాను సంస్కరించుకోటానికా? రెండవది, ఇది తాను ఒక దొంగలాగా మారటానికి దారితీస్తుందా? ఏది ఏమైనా మాంసాహారం తినాలనే కోరిక అతని మానసిక సంఘర్షణను పక్కకు నెట్టింది. సాయంత్రం ఆతని మిత్రుడు బేకరీ నుంచి ఒక బ్రెడ్డు (Bread), మాంసం కూర తీసుకురాగానే ఈ గాంధి తినటం ప్రారంభించాడు. కాని వాటిని తింటుంటే తోలు (rubber) ముక్కలను తిన్నట్లుగా ఉంది. ఇంకా తింటుంటే, వాంతి వచ్చేటట్లుగా ఉంటే మధ్యలోనే తినటం ఆపివేశాడు. ఆ రోజు రాత్రి మోహన్ దాస్ కు భయంకరమైన కలలొచ్చాయి. మేకలు తన పొట్టలో బేలగా అరుస్తున్నట్లు, తాను దుఃఖిస్తున్నట్లు అనుభూతికి లోనయ్యి, ఆ రాత్రంతా అమితంగా దుఃఖిస్తున్నట్లు అనుభూతికి లోనయ్యి, రాత్రంతా నిద్రలేమి అనుభవించాడు.

కాని మిత్రుడు మోహన్ దాస్ ను అంట తేలికగా వదిలిపెట్టే రకం కాదు. అతను ఒకరోజు మాంసంతో కమ్మనైన రకరకాల వంటకాలను తయారుచేయించి సాయంత్రం ప్రభుత్వ గృహంలో దొంగచాటుగా కలిశారు. అంతకు ముందే వంట మనిషితో కలిసి భోజనాలు గదిని అలంకరించాడు. అతని యుక్తి మన గాంధి మీద బాగా పనిచేసింది. తద్వారా మోహన్ దాస్ కు మాంసం చాలా ప్రియమైన వంటకం అయింది ఒక సంవత్సరంలో 10,12 సార్లు మాంసాహార విందు భోజనం తినటం జరిగింది. మోహన్ దాస్ దీని ఖర్చు భరించే స్థోమత లేనందువల్ల, అంతా మిత్రుడే భరించాడు.

ఇది జరిగిన రోజు ఇంట్లో భోజనం చేయమని అడిగితే “నాకు ఆకలి లేదు” అని చెప్పి తప్పించుకునేవాడు. ఒక తప్పు చేస్తే, దానిని కప్పిపుచ్చుకోటానికి తప్పనిసరిగా అబద్ధమాడాలి అనే అంతర్మధనం ఆనాడే ప్రారంభమయింది. దీనిని గురించి గాంధీజీ ఇలా పేర్కొన్నారు:

“మాంసాహారం తినడంద్వారా నన్ను, నాతోపాటు ఇతరులను సంస్కరించుకోవటం నాకు ముఖ్యమైనా, దాని కోసం నా తల్లిదండ్రులతో అబద్ధమాడి వారిని మోసగించటం, మాంసం తినే దానికంటే హీనమైన పని అని నాకు స్పురించింది. వారు జీవించి ఉన్నంత కాలం నేను పూర్తి మాంసాహారి అవటం అసంభవం. వారు పై లోకాలకు వెళ్ళినప్పుడే నాకు స్వేచ్ఛ లభిస్తుంది కాబట్టి నేను అప్పుడు తినవచ్చు. ఈ నా నిర్ణయాన్ని స్నేహితుడికి చెప్పాను. నేను మాంసాహారం తిననని శపధం చేసినా, నా మిత్రుని సాంగత్యం నన్ను వదలలేదు. అతనిని నేను సంస్కరిద్దామనే నా సదుద్దేశం నన్ను మరో తప్పుడు దారిలో నడిపించటానికి కారణమయింది.”

****సశేషం****

(వచ్చే సంచికలో మోహన్ దాస్ విటుడిగా మారిన అనుభవం గురించి తెలుసుకుందాము)

Posted in March 2025, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!