Menu Close
VSRao
మహాత్మా గాంధి
డా. వల్లూరుపల్లి శివాజీరావు
Mahatma-Gandhi
Image by WikiImages from Pixabay

గాంధీజీ వివాహం

ఆ కాలంలో కథియవార్ (Kathiawar) లో రెండు రకాల బాల్య వివాహాలు జరిగేవి. ఒకటి పెండ్లి సంబంధం కుదుర్చుకుని, నిశ్చయ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుని, ఆ తరువాత వివాహం జరపటం. ఇందులో పిల్లలైన వధూవరుల ప్రమేయం ఉండదు. వివాహం జరిగే లోపల వధూవరులలో ఎవరు మరణించినా, వైధవ్యం ఉండదు. రెండవ రకపు వివాహంలో పిల్లలకు ముందు చెప్పకుండా ఏకంగా వివాహం జరపటం. మరో కారణం పురుషుల కామవాంఛలనుంచి బాలికలను రక్షించటం.

మోహన్ దాస్ విషయంలో రెండూ జరిగాయి. మూడు సార్లు నిశ్చయ తాంబూలాల తంతు జరిగితే ఇద్దరు అమ్మాయిలు వివాహం జరిగే లోపలే మరణించారు. మూడవ సారి 1876 లో ప్రధానం 7 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆయనకంటే 6 నెలల 21 రోజులు పెద్దదయిన కస్తూరి బాయి (జననం: 11 ఏప్రిల్ 1869) తో జరిగింది. ఈ సంగతి మోహన్ దాస్, కస్తూరి బాయిలకు తెలియదు. తరువాత 6 ఏళ్లకు, అంటే వీరిద్దరకి 13 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు, 1882 లో వివాహం జరిగింది. కస్తూరి బాయి తండ్రి ‘గోకు ల్ దాస్ మెకంజీ కపాడియా’ (Gokuldas Makanji Kapadia) పోర్బందర్ వాసి. ఈ సంపన్న వ్యాపారి మోహన్ దాస్ తండ్రి కరంచంద్ (కాబా) గాంధీకి ఆప్తమిత్రుడు. వీరిద్దరు 1876లో నిశ్చయ తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నారు. కస్తూరి బాయికి ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు.

ఆ రోజులలో హైందవ కుటుంబాలలో వివాహాలు చాలా ఆడంబరంగా జరిగేవి. ఇటువంటి వేడుకలే ఇరు కుటుంబాల ఆర్ధికస్థితి క్షీణించటానికి కారణం అయ్యేవని గాంధీజీ వాపోయారు. ఒకసారి మోహన్ దాస్ పెద్దన్న ‘లక్ష్మీదాస్’ కు చాలా ఏళ్లకు ముందే వివాహం జరిగింది. రెండవ అన్న ‘కర్సన్ గాంధి’ (Karsan Gandhi), మోహన్ దాస్ లకు ఒకేసారి వివాహాలు జరిగాయి. 1882లో వివాహాలు చాలా ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి ఘనంగా ఒకేసారి జరిపించదలచాడు తండ్రి కరంచంద్ గాంధి.

13 ఏళ్ల మోహన్ దాస్ కు వివాహం అంటే ఖరీదైన కొత్త బట్టలు, వాటికి తోడు నాదస్వరం, సన్నాయి, డోలు వాయిద్యాల హంగామా, పల్లకిలో ఊరేగింపులు రుచికరమైన భోజనాలు మొదలగు వాటితో పాటు తనతో ఆడుకునే ఒక అమ్మాయి లభిస్తుందనే ఉత్సాహంలో తలమునకలైన, భార్య వచ్చిన తరువాత గాని భర్తగా తనకు పెరిగిన బరువు బాధ్యతలు తెలిసిరాలేదు.

తన వివాహం గురించి గాంధీజీ ఇలా పేర్కొన్నారు: “మా రెండు కుటుంబాల్లో మేమే చిన్నవాళ్ళం కాబట్టి మా నాన్నగారికి, మామగారికి ఈ వివాహం చాలా ఘనంగా చేయాలనుకున్నారు. అంతకు ముందు మా తండ్రి పోర్బందర్ కు దివాన్ గా ఉన్నందువల్ల ఆ ప్రేమతో అచ్చటి ఠాకూర్ సాహెబ్ మేము ఉన్నరాజ్ కోట నుంచి 120 మైళ్ళ దూరంలో ఉన్న పోర్ బందర్ త్వరగా చేరుకోటానికి వేగంగా వెళ్లే ప్రత్యేక బళ్లను ఏర్పరచాడు. ఇంత దూరం ప్రయాణించటానికి మాములుగా అయితే 5 రోజులు పడుతుంది. కాని ఠాకూర్ గారి బళ్ళమీద అయితే 2 రోజులు పడుతుంది. కాని మా తండ్రికి 3 రోజులు పట్టింది. ఎందుకంటే, మార్గం మధ్యలో అతివేగంగా వెళ్లాలనే కాంక్షవల్ల మా బండి తలక్రిందులయ్యింది. దీని ఫలితంగా మా నాన్నకు చాలా గాయాలయ్యాయి. చివరికి పోర్బందర్ వెళ్లేసరికి ఆయన శరీరమంతా కట్లతో నిండివుంది. అందువల్ల ఇరువైపులా అందరిలో సగం ఉత్సాహం నశించి పోయింది. కాని వివాహతంతులు ఏదో విధంగా ముగించబడ్డాయి. వివాహ ముహూర్తం అంత దగ్గరగా ఉన్నప్పుడు దానిని నిర్వర్తించటం మినహా వేరే మార్గం కూడా లేదు. కానీ పెండ్లి ఉత్సాహంలో మునిగిపోయిన నేను ఈ విషయాన్ని అసలు పట్టించుకోలేదు.”

కరంచంద్ గాంధికి చాలా గాయాలు తగిలినా, బాధను భరించి వివాహ వేడుకలను నిర్విఘ్నంగా నిర్వర్తించారు. మోహన్ దాస్ కు మొదట పెండ్లి ఉత్సాహంలో మునిగిపోయినా తన తండ్రి తనకు బాల్య వివాహం చేసినందుకు తరువాత విమర్శించటం జరిగింది. అమాయకులైన ఇద్దరు పిల్లలుకు వారి ప్రమేయం లేకుండా వివాహం జరపటం ఆయనకు నచ్చలేదు. దీనిని గురించి గాంధీజీ ఇలా పేర్కొన్నారు:

“నా శోభనం రాత్రి ఎలా ప్రవర్తించాలనే విషయం గురించి మా పెద్ద వదిన నాకు తర్ఫీదు ఇచ్చింది. నా భార్యకు ఎవరు తర్ఫీదు ఇచ్చారో తెలియదు. ఆమెను నేను ఎన్నడూ అడగలేదు. అసలు అడగటానికి ఇష్టపడనూ లేదు. నిజానికి మా ఇద్దరికీ సిగ్గు, బిడియం. భయం ఉండటంవల్ల ఆమెను ఎలా అడుగ గలను? యదార్ధానికి మా వదిన తర్ఫీదు నాకు అంతగా ఉపయోగపడలేదు. అసలు ఇటువంటి విషయాలలో తర్ఫీదు అనవసరం. కాలక్రమేణా నా భార్య, నేను ఒకరినొకరు అర్ధం చేసుకోవటం ప్రారంభించాము. ఆ తరువాత స్వేచ్ఛగా మాట్లాడుకోవటం ప్రారంభించాం. నేను భర్తను కాబట్టి ఆమెమీద అధికారం చెలాయించటం త్వరగానే ప్రారంభించాను.”

గాంధీజీ భర్త పాత్ర

మోహన్ దాస్ గాంధి వివాహానికి ఆయన తండ్రి వేయించిన శుభలేఖ ఒక్కొక్కటి ఒక ‘పైసా’ ఖర్చు అయింది. ఆ రోజులలో ఒక పైసా ఒక ‘అణా’లో 8 వ వంతు; 16 అణాలు ఒక రూపాయి. అంటే ఇప్పటి రూపాయిలో 128 వ వంతు. ఈ చిన్నపాటి పుస్తక పరిమాణంలో ఉన్న ఈ శుభలేఖలో వైవాహిక దాంపత్యం, ప్రేమ, బాల్య వివాహాలు, వాటిల్లో ఉన్న మంచి, తదితర విషయాలను గురించిన వివరాలు ఉన్నాయి.

వివాహం అయిన తరువాత “ఒకసారి ఈ పెండ్లి పుస్తకం చదివితే అందులో అనేక విషయాలు ఉన్నాయి. వాటిల్లో ఒక ముఖ్యమైనది, నా గుండెలో శాశ్వతంగా ముద్రించబడినది, నేను జ్ఞాపకం ఉంచుకున్నది, ఒకటి ఉంది. అది భర్త ముఖ్య ధర్మం భార్యకు జీవితాంతం విశ్వసనీయంగా ఉండటం. కాని సత్యమే పరమావధిగా భావించే నాకు అసత్యం, ద్రోహం చాలా దూరం. అందువల్ల అతి చిన్న వయస్సు లో కూడా నేను అవిశ్వసనీయత ప్రదర్శించటం అనేది అసంభవం” అని గాంధీజీ వెల్లడించారు.

కాని ఈ విశ్వసనీయత పాఠంలో ఒక అనుచితమైన విషయంకూడా చోటుచేసుకుంది. దీనిని గురించి 40 ఏళ్ల తరువాత ఆయన వ్రాసిన ‘ఆత్మకథ’లో ఇలా తెలియజేసారు నిర్భయంగా.

“నేను నా భార్యకు విశ్వసనీయత ప్రతిజ్ఞ చేసినప్పుడు ఆమె కూడా నా యెడల విశ్వసనీయత ప్రమాణం చేయాలి అనే ఆలోచన నాకు వచ్చింది. ఈ ఆలోచనే నన్ను ఒక అసూయాపరుడైన భర్తగా మార్చివేసింది. నాకు నా భార్య విశ్వసనీయతలో అనుమానించటానికి తగిన కారణం లేకపోయినా, నాలో అంకురించిన ‘అసూయ’ ఎప్పుడూ కారణాలను అన్వేషించటానికి తగిన వ్యవధి ఇవ్వదు, హేతువు చూపించదు. అందువల్ల నేను ఎల్లప్పుడూ ఆమె కదలికలను పరిశీలనగా చూసేవాడిని. నా అనుమతి లేకుండా ఆమెను ఎక్కడకు వెళ్లనిచ్చేవాడిని కాదు. అందువల్ల ఆమె కూడా వెళ్ళేది కాదు. ఈ నా అనుచిత ప్రవర్తన మా ఇద్దరి మధ్య కలహాల విత్తనాలు నాటింది. దీనిని కస్తురిబాయి సహించే వ్యక్తి కాదు. ఫలితంగా ఆమె తనకు ఇష్టమైన చోటికి వెళ్లాలనే పట్టుదలతో ఉండేది. ఈ నిర్బంధం ఎంత ఎక్కువ అయితే ఆమె అంత స్వేచ్ఛ తీసుకునేది. ఇది మా ఇద్దరి మధ్య ప్రతికూలమైన వాతావరణం నెలకొల్పింది. అందువల్ల వివాహితులమైన మేమిద్దరం మాట్లాడుకోకపోవటం దినచర్యగా మారింది. కాని కపటంలేని కస్తూరిబాయి గుడికి వెళ్ళటానికి, స్నేహితులను కలవటానికి కూడా నా అనుమతి అవసరమా అని నాలో స్ఫురించేది. నేను ఆమెకు పరిమితులు విధించినప్పుడు, నా విషయంలో ఆమెకు కూడా అటువంటి హక్కు ఉండకూడదా అని నేను ప్రశ్నించుకునేవాడిని. కాని ఈ విషయం ఆ తరువాత కాలంలోనే నాకు పూర్తిగా విశదమైంది. ఆ కాలంలో మాత్రం నాకు ‘భర్తాధిపత్యం’ చెలాయించటమే నా ప్రధమ కర్తవ్యం అని నేను భావించేవాడిని.”

మోహన్ దాస్-కస్తూరిబాయి ల మధ్య ‘ఆధిపత్య పోరు’ ఉన్నా, ఇరువురి మధ్య అలవిగాని, అశాంతిని రగిల్చే పగ, శత్రుత్వం మాత్రం ఎన్నడూ లేవు. ఈయన కఠినతరమైన ప్రవర్తన భార్య మీద ఉన్న ప్రేమతోనే. ఆమెను ఒక ఆదర్శప్రాయమైన భార్యగా మార్చి, తనకు అనుగుణంగా ఒక పవిత్రమైన జీవితాన్ని గడిపే వ్యక్తిగా తీర్చిదిద్దాలనే కాంక్ష గాంధీజీలో బలీయంగా ఉండేది. తన నేర్చుకున్నది ఆమె కూడా నేర్చుకుని ఆమె జీవితం, ఆలోచనలు తన వాటితో సమీకరణం చేసి ఆమెను తన మార్గంలో పయనింప చేయటమే ఆయన ముఖ్యోద్ధేశం.

భర్తలో ఉన్న కోరికలు, ఆలోచనలు కస్తూరిబాయిలో కొరవడినా, నిరక్షరాస్యులైన ఆమె నిరాడంబరమైన వ్యక్తి. స్వతంత్రంగా ఆలోచించగల, పట్టుదలగల స్త్రీ. భర్తతో మితభాషి. కాని బాలుడైన గాంధీజీ మనోభావం కేవలం భార్య చుట్టూనే తిరుగుతూ ఉండేది. తన యెడల ఆమెకూడా అలాగే ఉండాలనే కాంక్ష ఆయనలో ప్రఘాఢంగా నాటుకుపోయింది. ఈ కారణం వల్లనే బడికి వెళ్లినా ఆమె మీద ఉన్న అమిత ప్రేమతోనే భార్య గురించి ఆలోచించేవాడు మోహన్ దాస్. భార్య నిరక్షరాస్యురాలైనందువల్ల, ఆమెకు చదువు చెప్పాలనే కోరిక ఉన్నా ఆమె మీద ఆయనకు ఉన్న మోహం, వాంఛ పైచేయి సాధించేవి. ఎందుకంటే ఈ చదువు ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా చెప్పాలి. పైగా అది కూడా రాత్రి వేళల్లోనే.

పెద్దల ఎదుట మాట్లాడే ధైర్యం మోహన్ దాస్ కు లేదు. ఆ కాలంలో కథియవార్ లో స్త్రీలు ‘పర్ధా’ (Purdah) ల లోనే ఉండేవారు. అందువల్ల పగటిపూట భార్యలతో నిషిద్ధం. ఈ కారణంగా ఆయన కస్తూరిబాయికి పగలు చదువు చెప్పటం సాధ్యమయ్యేది కాలేదు. అదీగాక, ఆకాలంలో బాల్యంలో ఉన్న భార్య ఎక్కువ కాలం కన్నవారి ఇంట్లోనే గడపవలసి వచ్చేది. కస్తూరిబాయి విషయంలో కూడా అదే జరిగింది. ఫలితంగా ఈ ఇరువురి వివాహం జరిగిన తరువాత 5 ఏళ్ళు (అంటే 13-18 ఏళ్ల మధ్య వయస్సు కాలంలో) 3 ఏళ్ళు మాత్రమే కలిసియున్నారు.

“మేము 6 నెలలు కలిసి ఉంటే ఆమె తల్లిదండ్రులనుంచి కబురు వచ్చేది నా భార్యను పంపించమని..... ఇటువంటి దీర్ఘకాలిక ఎడబాట్లు అప్పుడు బాధాకరమయినా, నాకు అయిష్టమయినా, తరువాతి కాలంలో 18 ఏళ్ళ వయస్సులో నేను ఇంగ్లండ్ వెళ్ళినప్పుడు సంభవించిన దీర్ఘకాలిక ఎడబాటును తట్టుకోవటం సులభమయింది. నేను ఇంగ్లండ్ నుంచి తిరిగి వచ్చినప్పుడు కూడా మేము ఎప్పుడు ఒకేసారి 6 నెలలకంటే ఎక్కువ కాలం కలిసి ఉండలేదు. ఎందుకంటే నేను ఉద్యోగాన్వేషణ నిమిత్తం మొదట రాజ్ కోట, బొంబాయి, తరువాత దక్షిణ ఆఫ్రికా వెళ్ళవలసి వచ్చింది. అందుకే ఎడబాటు అలవాటైంది కాబట్టి శారీరిక వాంఛ నుండి దూరం అవటం సులభం అయింది” అని గాంధీజీ వెల్లడించారు.

గాంధీజీ ఉన్నత పాఠశాల (High School) విద్య

మోహన్ దాస్ హైస్కూల్ లో చదువుతున్నప్పుడు అతని ఇద్దరు అన్నలు కూడా చదువుతూ ఉండేవారు. పెద్దన్న లక్ష్మీదాస్ పైతరగతిలో ఉంటే, తన కంటే ఒక సంవత్సరం పెద్దవాడైన చిన్నన్న కార్సన్ దాస్ తన కంటే ఒక తరగతి ముందు ఉండేవాడు. కాని వీరిద్దరికి ఒకేసారి వివాహం జరిగింది. ఫలితంగా చిన్నన్నకు ఒక సంవత్సరం వృధా అయింది. ఈ కారణంగా చదువంటే అయిష్టం కలిగి ఇక బడికి వెళ్ళటం మానివేశాడు. బాల్య వివాహాలు విరివిగా జరిగే ఆ కాలంలో ఎంతోమంది బాలుర విద్య మధ్యలోనే ఆగిపోయేది. కానీ అదృష్టవశాత్తూ మోహన్ దాస్ విషయంలో చదువాగలేదు. అతను చదువు విషయంలో మొద్దు కాకపోగా ఉపాధ్యాయులకు ప్రియ శిష్యుడు. తల్లితండ్రులకు పంపించిన Progress Report లో అతని అభివృద్ధి, గుణగణాలు ప్రోత్సాహకరంగానే ఉండేవి. 5వ, 6వ తరగతులలో విద్యార్థి వేతనం (scholarship) కూడా లభించింది. కానీ ఈ విద్యావేతనాలు కథియవార్ సంస్థానంలో ఉన్న ‘సూరత్’ (Surat) విభాగంలో నివసించే మంచి విద్యార్థులకు కేటాయించేవారు. ఆ రోజులలో సూరత్ కు చెందిన విద్యార్థులు ఎక్కువమంది ఉండేవారు కాదు.

తన చదువు, పాఠశాలలో తన అనుభవాల గురించి గాంధీజీ తన ‘ఆత్మకథ’ పుస్తకంలో ఇలా వ్రాసుకున్నారు. “చదువులో నా ప్రతిభను గురించి నేను ఎప్పుడూ గొప్పగా తలంచలేదు. కాని, విద్యార్థి వేతనాలు, బహుమానాలు ఇచ్చినప్పుడు ఆశ్చర్యపోయేవాడిని. నా గుణం, స్వభావం, ప్రవృత్తి ఇతరులకు తెలియనిచ్చేవాడిని కాదు. ఒక్క చిన్న తప్పు జరిగినా నా కళ్లల్లో నీళ్లు తిరిగేవి. మాస్టారు నన్ను మందలిస్తే సహించేవాడిని కాదు. నేను రెండవ తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి మాస్టారు కొడితే చాలా సేపు దయనీయంగా ఏడవటం జరిగింది. అప్పుడు ప్రధానోపాద్యాయుడు ‘Dorabji Edulji Gimi’. ఆయనకు విద్యార్థులలో మంచి ఆదరణ ఉన్నా, చాలా క్రమశిక్షణ గల వ్యక్తి, మంచి ఉపాధ్యాయుడు. ఆయన విద్యార్థులకు నిర్బంధ క్రికెట్, ఫుట్ బాల్, వ్యాయామం ప్రవేశపెట్టాడు. నాకు ఈ ఆటలంటే అయిష్టం. నేను ఎన్నడూ వీటిల్లో పాల్గొనలేదు. నాకు ఉన్న అమితమైన భయం, బిడియం దీనికి కారణం. అదీగాక ఈ క్రీడలకు, చదువుకు సంబంధంలేదని నమ్మేవాడిని.

నిజానికి కసరత్తు, వ్యాయామానికి నేను వ్యతిరేకిని కాదు. ఆరోగ్యానికి ఎక్కువ దూరం నడవటం చాలా మంచిదని పుస్తకాలలో చదివాను. అప్పటినుంచి ప్రతిరోజూ కొన్ని మైళ్ళపాటు నడవటం అలవాటు చేసుకున్నాను. ఈ అలవాటే నేను ఎల్లప్పుడూ శారీరంగా ధృఢంగా ఉండటానికి వీలయింది. ఆటలు, వ్యాయామం చేయకపోటానికి అసలు కారణం మా నాన్నకు సేవచేయాలనే కాంక్ష. స్కూల్ వదలగానే నేరుగా ఇంటికి వెళ్లి ఆయనకు పనులు చేసేవాడిని. Mr. Gimi`ఆదేశం పాటిస్తే ఇది వీలుకాదు. అందుకని నాకు మినహాయింపు కోరితే ఆయన నిరాకరించాడు.

ఒక శనివారం రోజు ఉదయమే స్కూలుకు వెళ్లి 12 గంటలకు తిరిగి వచ్చి మరల మధ్యాహ్నం 4 గంటలకల్లా స్కూలుకు ఆటలు ఆడటానికి, కసరత్తు చేయటానికి వెళ్ళాలి. ఆ రోజు మబ్బులు దట్టంగా ఉండటంవల్ల టైము తెలియక స్కూలుకు చాలా ఆలస్యంగా వెళ్ళాను. అప్పటికే పిల్లలు, మాస్టారు వెళ్లి పోయారు. మరుసటి రోజు ఆయన నాకు గైరుహాజరు మార్కు వేశారు. అప్పుడు నేను మాస్టారుకు జరిగిన సంగతి చెప్పితే, ఆయన నమ్మకపోగా ఒక ‘అణా’ జరిమానా వేశారు. నేను అబద్ధం చెప్పానని మాస్టారు భావించటం నన్ను చాలా బాధించింది. నాకు వేరే దారి లేక అప్పుడు చాలా సేపు ఏడ్చాను.

ఆ సమయంలో నాకు ఒకటి బోధపడింది. అది: ‘ఒక సత్యాన్వేషి ఎల్లప్పుడూ నిజం మాట్లాడటమే కాదు, దానిని ధృవపరచుకోగలిగే జాగ్రత్త కూడా అవసరం. ఈ తప్పే నామొదటిది, చివరిది కూడా. ఈ సంఘటన జరిగిన తరువాత కొన్నాళ్ళకు నా అపరాధంతో పాటు రుసుం (అణా) కూడా ఉపసంహరణ చేయించుకోగలిగాను.”

****సశేషం****

తదుపరి సంచికలో గాంధీజీ విద్యార్థి దశలో జరిగిన చేదు అనుభవాలు, చేసిన తప్పులు; పతన మార్గం, తదితర విషయాల గురించి తెలుసుకుందాము.

Posted in February 2025, వ్యాసాలు

1 Comment

  1. విద్యుల్లత bandaru

    గాంధీ పై చెడు ప్రచారాలు ఎక్కువగా ఉన్న ఈ తరుణంలో ఆయన జీవితాన్ని పది మందికి తెలిపే ఈ రచన అభినందనీయం.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!