

భారతావని, పేరెన్నికగన్న, మహావ్యక్తులు అనేకమందికి జన్మనిచ్చింది. వీరు దేశ చరిత్రతో పాటు, ప్రపంచ చరిత్రను కూడా శాశ్వతంగా ప్రభావితం చేశారు. వీరిలో అతిముఖ్యులైన మహాపురుషులు ఈ ముగ్గురే:
ఒకరు ప్రస్తుత శకం ముందు (క్రీ.పూ.) జన్మించి సనాతన ధర్మంతో విభేదించి, వేరుపడి బౌద్ధ ధర్మాన్ని స్థాపించి బుద్ధుడిగా ప్రపంచానికి పరిచయమైన ‘సిద్దార్ధ గౌతమ’. మరొకరు బౌద్ధ ధర్మంతో పాటు అహింస, మానవీయతలను ప్రపంచ వ్యాప్తికి విశేషంగా కృషి చేసిన ‘అశోక మౌర్య’ చక్రవర్తి.
మూడవ వ్యక్తి ప్రస్తుత శకంలో జన్మించి, బలపడి వ్రేళ్లూనుకున్న ఆంగ్లేయ పాలనను సమూలంగా పెకలించి తన జన్మభూమికి స్వేచ్ఛావాయులు ప్రసాదించిన మకుటంలేని మహారాజు ‘మహాత్మా గాంధి’ గా ప్రపంచ జనులందరికి తెలిసిన ‘మోహన్ దాస్ కరంచంద్ గాంధి’.
ఈ ముగ్గురు భూమి మీద నడయాడిన మధ్య కాలంలో ఎంతో మంది ఘనాపాఠీలు జీవించారు. వీరిలో పాలకులున్నారు, మత పెద్దలున్నారు, శాస్త్రవేత్తలున్నారు, రాజకీయనాయకులున్నారు, సంఘ సంస్కర్తలున్నారు. వీరితో పాటు వేలాది ఏళ్లుగా వర్ధిల్లుచున్న సనాతన ధర్మం (హిందూ మతం) బౌద్ధ ధర్మం ధాటికి తాళలేక విలవిలలాడుచూ మరుగున పడే దశలో దానిని పరిరక్షించి పునర్జీవం పోసిన వారిలో గుప్త రాజులు, ఆది శంకరాచార్యులు కూడా నిస్సందేహంగా ఉన్నారు. కాని వీరి ప్రతిభ, ప్రభావం కేవలం భారత ఉపఖండానికే పరిమితమైంది. బుద్ధుడు, అశోకుడు, గాంధీజీ ప్రపంచ చరిత్రనే మార్చివేశారు. వీరి ప్రభావ ప్రకంపనలు ఈ రోజుకూ ప్రపంచమంతా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని నిష్పక్షపాత వైఖరిని ప్రదర్శించిన దేశ, విదేశ చరిత్రకారులు కూడా ధృవీకరించారు.
ఈ ముగ్గురిలో మోహన్ దాస్ గాంధి ఒక రాజు కాదు, రాజ కుటుంబీకుడు కాదు, స్థితిమంతుడూ కాదు. జన్మనిచ్చిన భూమి మీద స్వేచ్చావాయువులు పీల్చలేదు, చివరి 5 నెలలు మినహా. భౌతికంగా ధీర్ఘకాయుడు కాదు, సుందర రూపుడుకాదు, స్ఫుర ధ్రూపీ కాదు. అర్హత సాధించిన న్యాయవాద వృత్తిలో అంతగా రాణించనూ లేదు. గొప్ప ఉపన్యాసకుడూ కాదు. కేవలం ఒక సామాన్య వ్యక్తి. అందరిలో ఉన్న లోట్లు పాట్లు కొన్ని ఆయనలోనూ ఉన్నాయి. కానీ తేడా ఏమిటంటే తన తప్పులను నిర్భయంగా అంగీకరించగల, వెల్లడించగల వ్యక్తి. ఎదురైన ఒడిదుడుకులు, అనుభవాలనుంచి, పాఠాల నుంచి నేర్చుకుని పరిణతిచెందిన వ్యక్తి. తనతో పాటు నలుగురిని కలిపి ఒక నాయకుడుగా ధైర్యంగా మొక్కవోని విశ్వాసంతో ముందుకు వెళ్లగలిగిన నేర్పరుడు. తాను నమ్మిన విషయాలను, ఆలోచనలను సిద్ధాంతాలను ప్రజల సంక్షేమానికే నిర్భయంగా, నిస్వార్ధంగా వినియోగించి జీవితాంతం శ్రమపడిన మహాత్ముడు. ఆడోల్ఫ్ హిట్లర్ హింసతో ప్రపంచాన్ని జయించాలని చివరకు ఓడిపోతే, కేవలం నిరాయుధుడుగానే ఉండి అహింసతో ఈ జగత్తును జయించవచ్చని నిరూపించిన వ్యక్తి మన బాపూజీ.
మానవాళి కొరకు కఠోర నిర్ణయాలను తీసుకోగల ధైర్యశాలి ఈయన. అన్నిటినీ మించి తన జీవితాన్ని తన కుటుంబానికి గాక ప్రజాశ్రేయస్సుకే అంకితం చేసిన మహోన్నతమైన అసమానుడు. మానవ సేవయే ‘మాధవ సేవ’ అని నిరూపించిన భారతావని ముద్దుబిడ్డ. జీవితం చివరి క్షణంలో కూడా దేవుని పేరే ఉచ్చరిస్తూ ప్రాణాలు వదలిన దైవాంశ సంభూతుడు!!
ఈయన జీవించిన కాలంలో కొద్ది కాలమయినా జీవించటం నాతో పాటు 1948 జనవరి 30 ముందు జన్మించిన వారందరూ ఎంత పుణ్యం చేసుకున్నారో అనే భావన కలుగక మానదు అంటే అది అతిశయోక్తి కాదనుకుంటాను! ఇటువంటి జీవితాన్ని మరొక్కసారి మననం చేసుకుందాం. ఆయన జీవిత విశేషాలు సమగ్రంగా తెలియనివారికి ఈ వ్యాసం ఉపయోగపడుతుందని నా విశ్వాసం.

అమెరికా సంయుక్త రాష్ట్రాల (USA) ప్రభుత్వం 1961 లో మహాత్మా గాంధి గౌరవార్ధం విడుదల చేసిన రెండు స్మారక స్టాంపులు
గాంధీజీ తల్లిదండ్రులు, జననం, బాల్యం
వైశ్య బనియా (Bania) జాతికి చెందిన గాంధీజీ వంశజులు వృత్తిరీత్యా కిరాణా వ్యాపారులు, ఆధ్యాత్మికంగా వైష్ణవులు. వీరి తాతగారు, తండ్రి గుజరాత్ లోని సౌరాష్ట్ర లోని కథియవార్ (Kathiyawad) పలు రాజ సంస్థానాలలో ప్రధాన మంత్రి (దివాన్) పదవులనలంకరించారు. నీతి, నియమాలకు పేరొందిన
గాంధీజీ పితామహులు ‘ఉత్తంచంద్ గాంధి’ (1758-1818) అరేబియా సముద్ర తీరాన ఉన్న ‘పోర్ బందర్’ (Porbandar) లో జరిగే కుతంత్రాలను తాళలేక తన పదవిని వదలి కుటుంబంతో ‘జునాఘర్’ (Juna gadh) లో స్థిరబడ్డారు. ఒకసారి జునాఘర్ నవాబుకు ఎడమ చేతితో వందనం చేస్తే, ఈ అగౌరవానికి కారణమేమని నవాబ్ అడిగితే “నా కుడిచేయి ఇదివరకే పోర్ బందర్ కు అంకితమైపోయింది” అని ఉత్తం చంద్ గాంధి నిర్భయంగా జవాబిచ్చాడు.
ఉత్తంచంద్ గాంధికి ఇరువురు భార్యలు. మొదటి భార్య ద్వారా నలుగురు మగపిల్లలు జన్మించారు. ఆమె మరణం తరువాత వివాహం చేసుకున్న భార్య ద్వారా ఇద్దరు కుమారులు కలిగారు. వీరు ‘కరంచంద్ గాంధి’, ‘తులసీదాస్ గాంధి’. కరంచంద్ గాంధిని ‘కాబా గాంధి’ (1822-1885) అని పిలుస్తారు. ఈ అన్నదమ్ములిరువురు ఒకరి తరువాత ఒకరు పోర్ బందర్ రాజుకు ప్రధానమంత్రులుగా పని చేశారు.
కాబా గాంధి కొంతకాలం రాజ్ కోటలో బ్రిటిష్ అధికారులు ఏర్పాటు చేసిన భూస్వాములు, వ్యవసాయదారుల మధ్య జరిగే పన్ను రాబడి విషయాలలోని వివాదాలను పరిష్కరించటానికి ఏర్పాటు చేసిన ‘రాజస్థానిక్ న్యాయస్థానం’ (Rajasthanik Court) లో ఒక ప్రముఖ సభ్యుడుగా ఉన్న సమయంలో అనేక క్లిష్టమైన వివాదాలను అతి సునాయాసంగా పరిష్కరించటంలో ప్రముఖ పాత్ర వహించారు. ఈయన పోర్బందర్ తో పాటు ‘రాజ్ కోట’, ‘బికనీర్’ (Bikaner) ప్రధానమంత్రి బాధ్యతలను నిర్వహించారు.
మూడు సంస్థానాలలో ప్రధాన మంత్రిగా పనిచేసిన కాబా గాంధి అత్యంత నిజాయితీపరుడు, సత్యాన్వేషి, నిస్పక్షపాతి, నీతిమంతుడుగా పేరుగాంచారు. అధికార దుర్వినియోగం చేసి సంపద కూడబెట్టుకోని వ్యక్తి. తన కుటుంబాన్ని ఎంతో ప్రేమించే కాబా గాందికి అక్రమార్జన ఆయన స్వభావానికి విరుద్ధం. ఆయన జీవితంలో సంపాదించింది తక్కువ, కుటుంబానికి ఇచ్చింది అతి తక్కువ. తాను రాజ్ కోట సంస్థానానికి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి అప్పటి బ్రిటిష్ ఏజెంట్ తన రాజు గురించి అవమానకరంగా మాట్లాడితే, దీనిని కాబా గాంధి తీవ్రంగా వ్యతిరేకించాడు. బ్రిటిష్ అధికారి తనకు వెంటనే క్షమాపణ చెప్పమని ఆదేశిస్తే, నిస్పక్షపాతానికి మారుపేరైన ఈ భారతీయుడు తృణీకరించారు. వెనువెంటనే ఈ ఆంగ్లేయుడు కాబా గాంధిని కొన్ని గంటల పాటు బంధించినా ఫలితం లేనప్పుడు, గత్యంతరం లేక ఆయనను చెరనుంచి విముక్తి చేయవలసి వచ్చింది.
గుజరాతీలో కేవలం 5 వ తరగతి వరకే విద్యనభ్యసించినా, ఈయన లోకజ్ఞానం, రాజకీయ వ్యవహారాలలో మాత్రం దిట్ట. తాను నిర్వహించిన పదవులలో ఎదురైన అనేక క్లిష్ట సమస్యలను సునాయాసంగా పరిష్కరించగల దక్షత, నేర్పు, ధైర్యం స్పష్టంగా కనిపించాయి. తద్వారా వేలాది వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేయటం జరిగింది. నిండు దైవభక్తి గల కరంచంద్ గాంధి తన కుటుంబానికి దగ్గరలో ఉన్న బ్రాహ్మణ పెద్ద సలహా అనుసరించి నిత్యం గీతా పారాయణం చేసేవారు.
వివాహం అయిన తరువాత వెనువెంటనే ఒక భార్య మరణిస్తే మరో వివాహం చేసుకోవలసి వచ్చినందువల్ల కరంచంద్ గాందికి నాలుగు సార్లు వివాహం జరిగింది. మొదటి భార్య ద్వారా ఒక కుమార్తె, రెండవ భార్య ద్వారా మరో కుమార్తె కలిగారు. కుటుంబ భారాన్ని చూసుకోటానికి 41 ఏళ్ళ కాబా గాంధి 19 ఏళ్ల 'పుత్లీబాయి' ని వివాహం చేసుకోవలసి వచ్చింది. ఈ నాలుగవ భార్య ద్వారా ఒక పుత్రిక (రలియత్బెహన్: Raliatbehn), ముగ్గురు పుత్రులు (లక్ష్మీదాస్, కర్సన్ దాస్, మోహన్ దాస్) జన్మించారు. వీరిలో చివరి సంతానం ‘మోహన్ దాస్ కరంచంద్ గాంధి’ (గాంధీజీ).
ఈ ముసలి భర్త- పడుచు భార్య సాంప్రదాయం గాంధికి ఏనాడూ నచ్చలేదు. భర్త కన్నా 22 ఏళ్ళు చిన్నదైన తన తల్లిని చూసి ఎంతగా జాలిపడి ప్రేమించాడో, అంతగా తండ్రిని ఈ విషయంలో ద్వేషించాడు. నిస్వార్ధపరురాలయిన, పవిత్రత మూర్తీభవించిన తన తల్లికి స్వార్ధపరుడయిన తండ్రి తగిన భర్త కాదని ఆయన అభిప్రాయం. అనేక విషయాలలో తండ్రిని అమితంగా ఆరాధించిననూ ఈ ఒక్క విషయంలో మాత్రం ఆయనను అమితంగా ద్వేషించాడు మోహన్ దాస్ గాంధి.
పుత్లీబాయికి దైవ భక్తి మెండు. ప్రతి రోజు దైవ ప్రార్ధన చేయకుండా భోజనం చేసేవారు కాదు. వైష్ణవాలయానికి వెళ్ళటం ఆమె దైనందిన చర్య. ఆమె ఎన్నో వ్రతాలు చేసింది. వర్ష ఋతువులో వచ్చే ‘చాతుర్మాస్యం’లో రోజు విడిచి రోజు ఉపవాసం ఉండటం తప్పనిసరి. సూర్యదేవుడిని చూడకుండా భోజనం చేసేది కాదు ఆ మహా తల్లి. సూర్యుడు కనపడక పోతే ఇక ఆ రోజు పస్తే. “పిల్లలయిన మేము బయట నిలబడి సూర్యుడు కనపడగానే లోపలి వెళ్లి అమ్మకు చెప్పితే, ఆమె పరిగెత్తుకుంటూ ఆయనను చూస్తేనే భోజనం చేసేది" అని మోహన్ దాస్ వెల్లడించాడు. ఒక్కొక్కసారి తాను బయటకు వచ్చేటప్పటికి సూర్యుడు మబ్బులవెనక దాగియుంటే ఇక ఆ రోజు భోజనం లేదు!! ఈ రోజున దేవుడు తనను భోజనం చేయవద్దని ఆజ్ఞాపించాడని భావించి సమాధానపడేది. ఆమె దైనందిన కార్యక్రమంలో మార్పులు ఉండేవి కావు.
పవిత్రతకు మారుపేరైన పుత్లీబాయికి లోక జ్ఞానం అపరిమితం. ఆమె మేధస్సు ఎడల తోటి స్త్రీలకు అమితమైన గౌరవం ఉండేది. ఈమె విషయం పరిజ్ఞానం ‘ఠాకూర్’ (రాజు)భార్య కూడా చాలా మెచ్చుకునేది. పిల్లలలో చిన్నవాడయిన మోహన్ దాస్ గాంధి ఇంట్లో అతి ఇష్టమైన గారాబంగా పెరిగిన బిడ్డ. ఈతనిని తల్లి దండ్రులు, దగ్గరి స్నేహితులు ‘మోనియా’ (Monia) అని ముద్దుగా పిలువబడేవాడు. మోనియా ఎప్పుడూ ఆడుకుంటూ బయట తిరుగుతూ ఉండేవాడు. ఇతనికి 7 ఏళ్ళు వయస్సు ఉన్నప్పు డు తండ్రి పోరు బందర్ నుంచి రాజ్ కోటకు దివాన్ గా వెళ్ళినప్పుడు పోర్ బందర్ సముద్ర తీరం, నీలి ఆకాశం మబ్బులు, హార్బర్ లోని ఓడలు పోగొట్టుకున్నాననే బాధ చాలా నాళ్ళు ఉండేది.
గాంధీజీ బాల్యం
మోహన్ దాస్ గాంధి 1869లో అక్టోబర్ 2 వ తేదీన జన్మించాడు. ఈయన బాల్యమంతా పోర్ బందర్ లో గడిచింది. అతనికి ఎక్కాలు బట్టీపట్టటం అతి క్లిష్టమైన సమస్య. ఇతర పిల్లలతో కలిసి ఉపాధ్యాయులకు పేర్లు పెట్టి సరదా పడుతూ అనేక కొంటి పనులు చేసేవాడు. “చదువులో నేను మంద కొండిని. జ్ఞాపకశక్తి అంతంత మాత్రమే” అని ఆయనే అంగీకరించాడు. తండ్రి రాజ్ కోటకు బదిలీ అయినప్పుడు అక్కడ ఒక ప్రాధమిక పాఠశాలలో చదువు ప్రారంభించాడు. చదువులో సగటు విద్యార్థి మాత్రమే. ఆ తరువాత మాధ్యమిక పాఠశాల చదువు. 12 వ ఏట ఉన్నత పాఠశాలలో చదువు ప్రారంభం.
విద్యార్థి దశలో “నేను ఎన్నడూ ఉపాధ్యాయులతో గాని, సహ విద్యార్థులతో గాని అబద్ధమాడినట్లు గుర్తు లేదు. నాకు అపరితమైన బిడియం. అందువల్ల ఎక్కువమందితో సహవాసం చేసేవాడిని కాను. బడి మొదటి బెల్లు కొట్టేటప్పటికి తరగతి గదిలో ఉండేవాడిని. చివరి బెల్లు కొట్టగానే ఇంటికి పరుగెత్తేవాడిని. ఇదే నా దినచర్య. ఇతరులతో మాట్లాడటం ఇష్టం లేకనే ఇంటికి పరుగెత్తుకుని వెళ్ళేవాడిని. దీనికి కారణం వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తారేమోనని భయం” అని గాంధీజీ స్వీయ చరిత్రలో వ్రాసుకున్నారు.
ఒకసారి ఆయన చదువుకుంటున్న పాఠశాలకు 'Mr. Giles' అనీ స్కూళ్ళ ఇన్స్పెక్టర్ వచ్చి 5 ఆంగ్ల పదాలకు spelling వ్రాయమని ఆదేశించగా మోహన్ దాస్ 'Kettle' అనే పదానికి తప్పు వ్రాశాడు. దీనిని పర్యవేక్షించే ఉపాధ్యాయుడు రహస్యంగా చూసి తన కాలి జోళ్ళతో సరి అయిన spelling సంజ్ఞలు చేసినా మోహన్ దాస్ పట్టించుకోలేదు. ప్రక్కవాడినుండి చూసి వ్రాసే మనస్తత్వం కూడా లేదు. ఎందుకంటే ఎవరూ చూసి వ్రాయకుండా చేయటం, ఎవరైనా చూసి వ్రాస్తూ ఉంటే దానిని నివారించటం ఉపాధ్యాయుడి కర్తవ్యం అని ఈ ‘బాల గాంధి’ అభిప్రాయం. ఫలితంగా క్లాసులో మోహన్ దాస్ మినహా అందరు అన్ని ప్రశ్నలకు సరిఅయిన సమాధానాలు వ్రాశారు. ఫలితంగా అందరు విదార్థులకంటే అతనే తెలివి తక్కువవాడని తెలిసింది. “ఈ ఉపాధ్యాయుడు నా అజ్ఞానాన్ని ఎత్తి చూపినా నాలో మార్పేమీ రాలేదు. అసలు copy కొట్టి విద్యను నేర్చుకోవట్టం నాకు మనస్కరించలేదు.” అని గాంధీజీ వెల్లడించారు.
ఇంత జరిగినా మోహన్ దాస్ కు తన ఉపాధ్యాయునిపట్ల గౌరవం తగ్గలేదు సరికదా మాష్టారు లోనే కొంత మార్పు కనిపించింది నిజానికి గాంధీజీకి పెద్దల తప్పును పరిశీలనగా చూసే అలవాటు లేదు. తరువాత ఉపాధ్యాయుడిలో మరికొన్ని తప్పులు కనిపించినా ఆయన యెడల గౌరవం మాత్రం తగ్గలేదు. పెద్దలిచ్చిన ఆదేశాలను నిర్వర్తించటమే అయన నైజం; అంతే కాని వారి తప్పులెన్నటం కాదు. ఈ సద్గుణం జీవితాంతం ఆయనలో ఉండిపోయింది.
మోహన్ దాస్ కి బడి పుస్తకాలు తప్ప మిగతావి చదవటం అయిష్టం. ప్రతిరోజూ పాఠాలు క్షుణ్ణంగా చదవటమే నిత్యకార్యక్రమం. ఎందుకంటే మాస్టారితో తిట్టించుకోవటం ఆయనకు ఇష్టం లేదు.
ఒకసారి మోహన్ దాస్ కళ్ళు ‘శ్రవణ పితృభక్తి నాటకం’ అనే పుస్తకం మీద పడింది. అందులో శ్రవణుడికి తల్లిదండ్రుల యెడల భక్తి గురించిన కథ. ఈ పుస్తకంలో శ్రవణుడు వృద్ధులు, అంధులు అయినా వీరిని కావడి తట్టలలో ఉంచి తీసుకువెళ్లే చిత్రం ఉంది. “ఈ దృశ్యం, కథ నా మదిలో జీవితాం తం చెరిగిపోనిది……. దీనిని నీవు జీవితాంతం అనుసరించు” అని గాంధీజీ ఆత్మ ప్రబోదించింది. ఈ విషయం ఆయనలో జీవితమంతా ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. (ఈ కాలపు పిల్లలు దీనిని అనుసరిస్తే వృద్ధాశ్రమాలు ఉండవు కదా!).
మోహన్ దాస్ ను అమితంగా ప్రభావితం చేసిన మరొక దృశ్యం తన ఊరిలో ప్రదర్శించబడిన ‘హరిశ్చంద్ర’ నాటకం. ఇది ఎన్ని సారులు చూసినా ఆయనకు తనివి తీరలేదు. అసలు ఈ నాటకంలో తాను కూడా నటించాననే భావన లెక్కనేనన్ని సార్లు కలిగింది. ప్రజలందరు హరిశ్చద్రుడిలా సత్యవాదులు ఎందుకు కారు అనే ప్రశ్న ఆయనలో కలిగేది. దీనిని గురించి రాత్రింబవళ్లు తనకు తానే ప్రశ్నించుకునేవాడు. సత్యాన్వేషణ, సత్యవాది తత్వాన్ని అనుసరించాలంటే హరిశ్చంద్రుడిలా కష్టపడాలి అనే విషయం ఆయనను చాలా ప్రభావితం చేసింది. శ్రీరాముడి పూర్వీకుడయిన హరిశ్చంద్రుడు పడిన కష్టాల గురించి ఆలోచిస్తూ అనేకసార్లు గాంధీజీ ఏడవటం కూడా జరిగింది. శ్రవణుడు, హరిశ్చంద్రుడి జీవితాల కధలు మోహన్ దాసులో ఎంతగా ప్రవేశించాయంటే ఈ ఇద్దరు ప్రాచీన కాలపు మహావ్యక్తులు వాస్తవంగా తన చుట్టూ ఉన్నారనే అనుభూతి పొందేవాడు.
****సశేషం****
తదుపరి సంచికలో గాంధీజీ వివాహం, భర్తగా ఆయన పాత్ర, ఉన్నత పాఠశాల విద్య గురించి గురించి తెలుసుకుందాము.