క్రీస్తుశకం పధ్నాలుగు, పదిహేను శతాబ్దుల నడిమి కాలంలో కాకతీయ మహాసామ్రాజ్యం ఉత్థాన పతనవేళలలో ఆంధ్రదేశచరిత్రలోనూ, ఆంధ్రసాహిత్యచరిత్రలోనూ ఎన్నడూ లేని విధంగా రెండు మరపురాని దురంత దుర్ఘటనలు సంఘటిల్లాయి. శిల్పశాస్త్రంలో చెప్పబడే వాస్తుపురుషమండలదోషం వంటిదేదో సంభవించి సిద్ధసాధనులైన మహాత్ములు ప్రతిష్ఠించిన రెండు మహాద్భుతాలైన దేవాలయాలలో ఒకటి గుంటూరు మండలంలోనూ, ఒకటి ఓరుగల్లు పట్టణంలోనూ విధివైపరీత్యాలకు లోనై కూలిపోవటం జరిగింది. గుంటూరు మండలంలో కూలిపోయినది శుద్ధసత్త్వాత్మకమై సాక్షాద్బ్రహ్మప్రకాశకమైన శ్రీరామావతార దివ్యలీలను జగద్వ్యాప్తం చేసి శరణాగతులకు పురుషార్థలబ్ధిని, పరమార్థసిద్ధిని ప్రసాదింపబూనిన శ్రీరామాలయం. భాస్కర మంత్రి ప్రణీతమైన శ్రీమద్రామాయణ మహాకావ్యం అది. ఓరుగల్లులో నేలకొరిగినది కర్మజ్ఞానశాస్త్రానుష్ఠానాలతో సాధింపరాని మోక్షఫలాన్ని హరినామసంకీర్తనతో అవలీలగా సాధింపవచ్చునని చాటిచెప్పి, వాసుదేవ కథా కలశరత్నాకరమై విభాసించిన శ్రీకృష్ణాలయం. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమహాభాగవతం అది. ఆశ్రితకోటి గుండెలలో శ్రీరామచంద్ర పరబ్రహ్మాన్ని, శ్రీకృష్ణ పరమాత్మను శ్రీకైవల్యపదస్వరూపులనుగా కొలువుతీర్చిన ఆ కోవెలలు రెండూ కూలిపోయి కాలగర్భంలో కలిసిపోకుండా శిథిల జీర్ణోద్ధారం చేసి, శేషించి ఉన్న భాగాలకు చిన్నెలు పెట్టి, చిత్రికలు పట్టి, గోపురాలు కట్టి, ప్రాకారాలు చుట్టి ఆ మందిరాలను ప్రధ్వంసాభావ వ్యాకులీభావం లేకుండా పరిపూర్ణించి పూజలకు సిద్ధంచేసిన పుణ్యాత్ములూ ఆ కాలంలో ఉన్నారు. భాస్కర రామాయణ దేవాయతనాన్ని సరిచేయబూని మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుడు, హుళక్కి భాస్కరుడు, అయ్యలార్యుడు శక్తివంచన లేకుండా నిర్మాణాన్ని పూర్తిచేసి లోకానికి సమర్పించారు. భాగవత దేవాలయ జీర్ణోద్ధారాన్ని వెలిగందల నారాయణామాత్యుడు మొదలుపెట్టిన తర్వాత బొప్పన గంగనామాత్యుడు కొనసాగింపగా ఆ మహత్కార్యాన్ని పూర్తిచేసి పునీతజనాశ్రయం కల్పించిన పుణ్యచరిత్రుడు మహాకవి ఏర్చూరి సింగనామాత్యుడు.
భాస్కర రామాయణం కాకతీయ మహాసామ్రాజ్యం సముజ్జ్వలంగా పరిఢవిల్లుతుండిన కాలాన క్రీస్తుశకం 14-వ శతాబ్దంలో మొదలై, 15-వ శతాబ్ది చివరి నాటికి పూర్తయింది. బాలారిష్టాలు దాటి బ్రతికి బట్టకట్టేనాటికి అనిర్వచనీయమైన విధివిలాసం వల్ల ఎక్కడెక్కడివో, ఎవరెవరివో రచనలు దానిలోకి వచ్చి కలిసిపోయాయి. ఏ కాండంలో ఎంత భాగం ఎవరు వ్రాశారో వింగడించి విస్పష్టంగా వివరించటం సులభమేమీ కాదు. ఆయా కాండల ఆశ్వాసాంత గద్యలలోని సమాచారం కొంతవరకు మాత్రమే ఉపకరిస్తుంది. ఏ దుర్విలంఘ్యకర్మపరిణామం వల్లనో అప్పటికే అంతరించిపోతున్న ఎర్రాప్రెగ్గడ గారి రామాయణంలో నుంచి ఎంత భాగం వచ్చి అందులో అంతర్హితమయిందో చెప్పలేము. వ్రాతప్రతులు పరిపరివిధాలుగా ఉన్నాయి. ఏదో ఒక తీరున అచ్చయిన గ్రంథం అందుబాటులో ఉన్నదన్న సంతోషమే తప్పించి, దాని కలరూపును ఇదమిత్థంగా నిర్ణయించి - నెల్లూ పొల్లూ ఏరివేసి, ప్రాథమిక రూపధేయాన్ని ప్రామాణికంగా పరిష్కరించటం పండితులకైనా సాధ్యం కాదు.
భాగవత రచన విషయమూ అంతే. కాకతీయ మహాసామ్రాజ్యం అస్తమించినప్పుడు ఓరుగల్లు పట్టణం ఒక విశ్వసనీయమైన రక్షణ కవచాన్ని కోల్పోయింది. బలి చక్రవర్తి దాడిచేసినప్పుడు అమరావతి అల్లకల్లోలమైనట్లు శత్రువుల దండయాత్రలతో సమస్తం అతలాకుతలమైంది. ప్రజాసంక్షేమం అతీతకాలపు స్మృతివిశేషంగా పరిణమించింది. క్రీస్తుశకం 1475 నాటికి జగత్ప్రసిద్ధమైన స్వయంభూ దేవాలయంతో సహా ఎన్నెన్నో గుడిగోపురాలు సపాటంగా సర్వనాశనమయ్యాయి. స్వధర్మరక్షాదీక్షితుల శ్రౌతస్మార్తకర్మలకు ముప్పువాటిల్లింది. పోతన్న గారు 1470-1475 దరిదాపుల భాగవతానువాదానికి శ్రీకారం చుట్టి, 1480–1485 ప్రాంతాల ఇతిశ్రీని వ్రాయించే నాటికి దండయాత్రల ఘోరకలి ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లున్నది. భాగవతంలోని ఎంత భాగం పోతన గారిచే రచితమై, ఎంత భాగం ధ్వంసమైపోయిందో స్థూలంగానే తప్ప సూక్ష్మంగా ఇప్పుడు మనము నిర్ణయింపలేము. ఏ కారణం వల్ల విధ్వస్తమైపోయిందో కూడా వివాదగ్రస్తమే. ఏదో ఒక తీరున అచ్చయిన గ్రంథం అందుబాటులో ఉన్నదన్న సంతోషమే తప్పించి, దాని కలరూపును గుర్తుపట్టి – చితుకూ మతుకూ తీసివేసి, మూలానుగుణమైన కవిత్వ భాగధేయాన్ని ప్రామాణికంగా పరిష్కరించటం పండితులకైనా సాధ్యం కాని పరిస్థితి.
భాగవతంలో మొత్తం పన్నెండు స్కంధాలున్నాయి. ఈనాటి పరిమాణాన్ని బట్టి అది రమారమి తొమ్మిదివేల ఇరవైరెండు పద్యగద్యాల బృహన్నిర్మాణం. మొదటి ఆరు స్కంధాలూ మూడువేల ఏడువందల ముప్ఫైనాలుగు పద్యాలు. సప్తమ స్కంధం మొదలుకొని దశమ స్కంధ పూర్వభాగ పర్యంతం మూడువేల ఏడువందల అరవైనాలుగు పద్యాలు. దశమ స్కంధం ఉత్తర భాగం నుంచి ఏకాదశ, ద్వాదశ స్కంధాల భాగం పదిహేను వందల ఇరవైనాలుగు పద్యాలు. వ్రాతలో అవి మూడు తాళపత్ర సంపుటాలవుతాయి. తాళపత్ర ప్రతులలోనూ, ఈనాటి ముద్రిత ప్రతులలోనూ ఈ పద్యాల సంఖ్యలు ఒక్కొక్క ప్రతిలో ఒక్కొక్క తీరున ఉంటాయి. నేను ప్రస్తుతానికి 1855లో శ్రీమాన్ మా. వెంకటకృష్ణశాస్త్రుల వారు అద్భుతావహంగా పరిష్కరింపగా కేశవ ముదలారి గారు చెన్నపట్టణంలో అచ్చువేసిన ఎంతో అపురూపమైన ఒక ప్రతిని బట్టి లెక్కచూపాను. 1925లో శ్రీ బుక్కపట్టణము రామానుజయ్య గారు సరిచూడగా ఎ. కణ్ణన్ శెట్టి అండ్ కంపెనీ వారు మద్రాసులో అచ్చువేసిన మరొక అరుదైన ప్రతితో ఈ పద్యసంఖ్య దాదాపుగా సంవదిస్తున్నది.
తాళపత్ర సంపుటాలను ఆ రోజులలో ఈ ప్రకారం కట్టి ఉంటారని ఊహించటమే కాని, కవి జీవించి ఉన్న కాలంలో మొదటిసారి నిజంగా ఎట్లా కట్టారో మనకు తెలియదు. ఈనాటి లిఖిత గ్రంథ భాండాగారాలలో లభిస్తున్న వివిధ స్కంధాల సంపుటీకరణ వివరాలు గాని, వ్యక్తిగతసంచయాలలో లభిస్తున్న వివిధ తాళపత్ర సంపుటాల సంపుటీకరణ విశేషాలు గాని ఈ విషయాన్ని ఐకకంఠ్యంతో నిర్ధారించేందుకు ఉపకరింపవు. మొదటి ఆరు స్కంధాలను ఒక కట్టగాను, చివరి ఆరు స్కంధాలను ఒక కట్టగాను కట్టారని కొందరు విమర్శకులు ఊహించారు. అందువల్ల స్కంధాల అడుగు భాగాలు దెబ్బతిని, మొదటి కట్టలో అడుగున ఉన్న పంచమ, షష్ఠ స్కంధాలు; రెండవ కట్టలో అడుగున ఉన్న ఏకాదశ, ద్వాదశ స్కంధాలు లోపించినట్లు భావింపబడుతున్నది. జాగ్రత్తగా పరిశీలించితే అది సరికాదని తెలుస్తుంది. ప్రథమ స్కంధంలో అవతారిక పూర్తిగా దెబ్బతిన్నది. దానిని యథాయోగ్యంగా సరిచేయవలసి ఉన్నది. ద్వితీయ స్కంధంలో “అట్టి యనంతశక్తి జగదాత్ముని నాభిసరోజమందు” అని ఉన్న 93-వ పద్యం నుంచి తాళపత్ర ప్రతులలో “ఇక్కడ నుండి వెలిగందల నారయ కవిత్వప్రారంభము” అని ఉన్నది. 1855 నాటి వెంకటకృష్ణశాస్త్రులవారి ప్రతిలో “ఈ ఘట్టము మొదలుకొని వెలిగందల నారయ చెప్పిన కవిత్వప్రారంభము” అని ఉన్నది. ఆ మాట ఆ స్కంధాంతం వరకు వర్తిస్తుందని అనుకొంటే, ఆ భాగమంతా సరిక్రొత్తగా రచింపవలసినంత దెబ్బతిన్నదన్నమాట. మొదటి రెండు స్కంధాలను ఒక కట్టగా కట్టివుంటే, ముందు-వెనుకలు శిథిలమైనాయని ఊహించాలి. ఆ తర్వాతి రెండు స్కంధాలూ ఒక కట్ట. అందులోనూ లోపాలు లెక్కలేనన్ని కనుపిస్తున్నాయి. ఆపై ఇతరులు పూర్తిచేశారు కాబట్టి పంచమ, షష్ఠ స్కంధాలు; చిట్టచివరి ఏకాదశ, ద్వాదశ స్కంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్న సంగతి ఎలాగూ స్పష్టమే. సప్తమ స్కంధం ఒక్కటే - అక్కడక్కడ కనుపించే కొన్ని లోపాలు తప్పించి, కొంత సురక్షితంగా వీనుమిగిలినట్లు కనబడుతుంది. అష్టమ, నవమ స్కంధాలలో చాలా చోట్లు దెబ్బతిన్న జాడలున్నాయి. పాఠక్రమంలో జారుపాటులు, పద్యక్రమంలో తారుమారులు కనబడుతున్నాయి. దశమ స్కంధం ఉత్తర భాగంలో పదమూడు వందల నలభైమూడు పద్యగద్యాలున్నాయి. అవన్నీ పోతన గారివి కావని, ఆ ఉత్తర భాగంలో 235-వ సంఖ్య గల “సాల్వ జరాసంధ చైద్యాదిరాజులు” అని ఉన్న సీసపద్యంలోని నాల్గవ పాదమైన “కాంతా తనూ జార్థకాముకులము గాము” అని ఉన్న చోటు నుంచి “ఇక్కడ నుండి వెలిగందల నారపరాజు గారి కవిత్వప్రారంభము” అంటూ - అది వెలిగందల నారయ గారి రచనమని వ్రాతప్రతులలో స్పష్టంగా వ్రాయబడినప్పటికీ, చాలామంది పరిష్కర్తలు ఆ శీర్షికను తొలగించి, మొత్తం పోతన గారి రచన గానే ముద్రిస్తున్నారు. తృతీయ స్కంధం ఆశ్వాసాంత గద్యలో అది పోతన గారి రచనమని ఉన్న ప్రమాణాన్ని పురస్కరించికొని పూర్తిగా పోతన గారి పేరిటనే అచ్చై ఉన్నది కాని, అది కూడా ఆసాంతం పోతన గారి రచన కాదేమోనన్న కర్తృత్వవిషయసందేహం చిరకాలంగా విమర్శకులను వేధిస్తున్నది. అదొక చర్చనీయాంశం. చతుర్థ స్కంధం పోతన గారిది కాకపోవచ్చునన్న నమ్మకం క్రీస్తు శకం 17-18 శతాబ్దుల నాటి కూచిమంచి తిమ్మన గారి కాలం నుంచే ఉన్నది. అదికూడా చర్చనీయాంశమే. ఆ లెక్క ప్రకారం మొదటి మూడు స్కంధాలు ఒక సంపుటం అయితే - ముందున్న అవతారిక, ద్వితీయ స్కంధంలో చివరి సగభాగం, తృతీయ స్కంధం పూర్తిగాను ధ్వంసమై ఉండాలి. పైని పేర్కొన్న ముద్రిత ప్రతిలోని పద్దెనిమిది వందల డెబ్భైనాలుగు పద్యగద్యాల భాగంలో తాళపత్ర ప్రతి చాలా వంతు దెబ్బతిన్నదన్నమాట. రెండవ కట్టలో చతుర్థ స్కంధం మాత్రం మిగిలి – పంచమ, షష్ఠ స్కంధాలు శిథిలమయ్యాయి. చతుర్థ స్కంధం కూడా పోతన గారి రచన కాకపోతే మాత్రం ఆ రెండవ కట్ట పూర్తిగా ధ్వంసమయిందని నమ్మాలి. ముద్రిత ప్రతిలో అది పద్దెనిమిది వందల అరవై పద్యగద్యాల భాగం అవుతుంది. సప్తమ, అష్టమ, నవమ స్కంధాల మూడవ కట్టలో అక్కడక్కడ ఛిద్రాలేర్పడినా, ఎన్నో అపపాఠాల చిక్కుముడులున్నా – దక్కినంత మేరకు ఆ మాత్రమైనా పోతన గారి రచనగా మనకు దక్కింది. ముద్రిత ప్రతిలో అది పంధొమ్మిది వందల అరవైతొమ్మిది పద్యగద్యాల భాగం. దశమ స్కంధాన్ని ఎట్లా కట్టారో చెప్పలేము. పదిహేడు వందల తొంభైఅయిదు పద్యగద్యాల పూర్వభాగం రక్షితమై, ఉపలబ్ధమైన పదమూడు వందల నలభైమూడు పద్యగద్యాల ఉత్తర భాగంలో కనుపిస్తున్నది కాక ఇంకా మరికొంత శాతం నశించిపోయి ఉండాలి. ప్రస్తుతానికి ఉపలబ్ధమైనంత మేరకు - పైని పేర్కొన్నట్లుగా - 235-వ పద్యం నడిమి నుంచి అది వెలిగందల నారయ గారి రచనమని వ్రాతప్రతులలో ఉన్నది.

ద్వితీయ స్కంధంలోనూ, దశమ స్కంధం ఉత్తర భాగంలోనూ బాగా దెబ్బతిన్న పోతన గారి రచనను తనకు చేతనైనంతలో సంస్కరించి, ఆయా చోట్లలో సరిక్రొత్తగా తన రచనను చేర్చి - ఆ ద్వితీయ స్కంధాన్ని, దశమ స్కంధం ఉత్తర భాగాన్ని పోతనగారి రచన గానే కొనసాగించి, ఏకాదశ ద్వాదశ స్కంధాలను మాత్రం తన పేరిట వెలయించిన వెలిగందల నారాయణామాత్యుడు “పోతనామాత్య ప్రియశిష్య వెలిగందల నారాయణామాత్య ప్రణీతం బైన” అని ఏకాదశ స్కంధ గద్యలోనూ, ద్వాదశ స్కంధ గద్యలోనూ చెప్పుకొన్నాడు కాబట్టి ఆయన పోతన్న గారికి సర్వవిధాల అత్యంత సన్నిహితు డన్నమాట. భాగవతం తొలినాటి ప్రతి ధ్వంసమైనదని తెలిసిన వెంటనే ఆచార్య ఋణాపనోదరూపమైన తన కర్తవ్యాన్ని గుర్తించి, శేషపూరణకు ఉపక్రమించాడని విశ్వసించాలి. శత్రురాజుల దండయాత్రలు జరుగుతున్న రోజులలో ఉన్నవాడు కనుక ఆయన యథోచితంగా పూర్తిచేసిన భాగం కూడా ఛిన్నాభిన్నమైపోయింది. ద్వితీయ స్కంధంలో ఆయన పరిష్కరించిన భాగం బాగా దెబ్బతిన్నది. ఆయన తన పేరిటనే వెలయించిన ఏకాదశ స్కంధం మరీ ఎక్కువగా దెబ్బతిన్నది. అందులో మూలంలోని కొన్ని సన్నివేశాలు పూర్తిగా తొలగిపోయాయి. ఉన్నవాటిలో ఒక ఘట్టానికీ, దాని తర్వాతి ఘట్టానికీ పొంతన లేదు. చాలా చోట్ల కథాశ్రోత అడిగిన ప్రశ్న వేరు; కథకుడు చెప్పిన సమాధానం వేరు. ఎంత ఆలోచించినా, రెండింటికీ సమన్వయం కుదరదు. పద్యాల వరుస తారుమారయింది. ఏ కథలో నుంచి ఏ కథలోకి అడుగుపెట్టామో సరిగా ఒక పట్టాన అర్థం కాదు. దానినిప్పుడు సరిచేయాలంటే కష్టం. ఎక్కడికక్కడ సరికొత్త లంకెలను ఎవరు తెచ్చి అతికించారో తెలియదు. వాటిలో అపపాఠాలు హెచ్చు. పార్యంతికమైన ద్వాదశ స్కంధంలోనూ కొంత భాగం లుప్తమైపోయింది. ఆ రెండు స్కంధాలలోనూ ఒక్కొక్క పంక్తికీ తాళపత్ర ప్రతులలో పాఠాంతరాలు లెక్కలేనన్ని కనబడుతున్నాయి. మూడు స్కంధాలలోనూ నారాయణామాత్యుని దేశకాలాలతో ఏ మాత్రమూ సంబంధం లేని ఇతరుల రచన వచ్చి చేరింది. ఇప్పుడు దానిని పరిష్కరించాలంటే మళ్ళీ ఆయనే దివినుంచి భువికి దిగిరావాలి.
భాగవతం దుష్కర్మవశాన విధ్వస్తమైన సంగతి జ్ఞాతపూర్వమైన వెంటనే శేషపూరణోద్యమాన్ని సంకల్పించిన నారాయణామాత్యుడు ఏ కారణం చేత పంచమ, షష్ఠ స్కంధాలను ఏ మాత్రం స్పృశింపక కేవలం అన్యతమస్కంధాల పూరణకు మాత్రమే ఉపక్రమింపవలసివచ్చిందో మనకిప్పుడు తెలియదు. తన యెదుటనున్న శ్రీమహాభాగవతం తొలినాటి ప్రతిలోని ఒక్కొక్క స్కంధంలోనూ పాక్షికంగా లోపించిన భాగాలను మాత్రమే సంస్కరించేందుకు పూనుకొన్నాడని విశ్వసింపవలసి ఉంటుంది. లేకుంటే, ద్వితీయ స్కంధాన్ని సంస్కరింపబూనినవాడు ఆ తర్వాత ఉన్న పంచమ, షష్ఠ స్కంధాలను విడిచివేసి ఎక్కడో ఉన్న దశమ స్కంధం ఉత్తర భాగానికి వెళ్ళవలసిన కారణం వేరొకటి అగపడదు. తానై బాధ్యతను వహించి పంచమ స్కంధాన్ని గంగనామాత్యునికీ, షష్ఠ స్కంధాన్ని ఏర్చూరి సింగనామాత్యునికీ స్వయంగా అప్పజెప్పాడా? అంటే, అందుకు కాలైక్యం గాని, జనశ్రుతులు గాని, గ్రంథాస్థాధారాలు గాని అనువైన సాక్ష్యాలేవీ లేవు. వారే వయసులో ఈయన కంటె పెద్దవారై, పోతన గారికి ప్రియశిష్యుడైన ఈయనే వారికంటె ఒక తరం చిన్నవాడేమో అని నిశ్చయించేందుకూ వీలులేకుండా ఉన్నది.
చిత్రమేమంటే, వెలిగందల నారాయణామాత్యుడు పోతన గారి ప్రియశిష్యుడు కాబట్టీ, నన్నయ గారి ఆరణ్య పర్వానికి ఎర్రాప్రెగ్గడ వలె శేషపూరణను మాత్రమే చేశాడు కాబట్టీ, తాను చేపట్టిన శేషపూరణ భాగానికి ప్రత్యేకంగా ఒక అవతారికను గాని, ప్రత్యేకంగా తానై స్కంధాంత పద్యాలను గాని వ్రాయలేదు. తాళపత్ర ప్రతులలో “ఇక్కడ నుండి వెలిగందల నారయ కవిత్వప్రారంభము” అని ఉన్న రెండు అవాంతర శీర్షికలే లేకపోతే, భాగవత శేషపూరణోద్యమంలో ఆయన నామధేయానికి అంతటి విశిష్టమైన స్థానం సమకూడి ఉండేది కాదు. ఆ రెండు శీర్షికలూ ఆయన జీవిత కాలంలోనే వెలసి ఉంటాయి. అంటే, ఆయన పొరటలు విచ్చిపోయిన భాగాన్ని గుర్తించి, అక్కడక్కడి పద్యాలను చెప్పటం మొదలుపెట్టాక - గుర్తుకోసం లేఖకులు ఆ విషయాన్ని వ్రాసి ఉంటారు. ఆ స్కంధం చివరనున్న గద్యను మాత్రం పోతనగారి పేరనే నిలిపాడు. తన పేరును చెప్పుకోలేదు. శేషపూరణను మొదలుపెట్టిన తొలిరోజులలో స్వతంత్రించి తానై తన పేరిట స్కంధాంత గద్యను నిలిపే సాహసం లేకపోయిందో, లేక వ్రాతప్రతిలో పోతన గారి గద్య మిగిలి ఉన్నందువల్ల దానిని అట్లాగే ఉంచివేశాడో చెప్పలేము. దశమ స్కంధం ఉత్తర భాగం చివరనున్న గద్యలోనూ తన పేరును చెప్పుకోలేదు. అక్కడా మధ్యలో మొదలుపెట్టాడు కాబట్టి స్వతంత్రించి తానై తన పేరిట స్కంధాంత గద్యను నిలిపే ఉద్దేశం లేకపోయిందో, లేక వ్రాతప్రతిలో పోతనగారి గద్య మిగిలి ఉన్నందువల్ల దానిని అట్లాగే ఉంచివేశాడో తెలియదు. ఏకాదశ - ద్వాదశ స్కంధాల ముమ్మొదటను ఉన్న నాందీ పద్యాలు మాత్రం ఆయనవే అయివుంటాయి. అవైనా స్వతంత్రించి తానై వ్రాసినట్లుగా లేవు. ఇతర స్కంధాలలోని పోతన గారి పద్యాల పునరుక్తులతో నిండి ఉన్నాయి. ఎక్కడా స్కంధాంత పద్యాలను కూడా తానై పూనుకొని వ్రాయలేదని ఇప్పుడే అనుకొన్నాము. ఏకాదశ స్కంధం చివర ఉన్న రెండు పద్యాలలో 124-వది అయిన “రాజీవసదృశనయన! వి, రాజిత శుభదాభిధేయ!” అన్న పద్యం సప్తమ స్కంధం చివర ఉన్న “రాజీవసదృశనయన! వి, రాజిత శుభదాభిధేయ!” అన్న పోతన్న గారి 480-వ పద్యమే; నారాయణామాత్యునిది కాదు. ఆ పద్యానికి తర్వాత ఉన్న “ధరణిదుహితృరంతా! ధర్మమార్గావగంతా” అన్న 125-వ పద్యం సప్తమ స్కంధంలోని “ధరణిదుహితృరంతా! ధర్మమార్గావగంతా” అన్న పోతన్న గారి 481-వ పద్యమే; నారాయణామాత్యుని సొంత పద్యం కాదు. ద్వాదశ స్కంధం చివర “జనకసుతాహృచ్చోరా!, జనకవచఃపాలనాత్తశైలవిహారా!” అని ఉన్న 52-వ పద్యం కూడా పోతన గారిదే; నారాయణామాత్యునిది కాదు. అది నవమ స్కంధం చివర “జనకసుతాహృచ్చోరా!, జనకవచఃపాలనాత్తశైలవిహారా!” అన్న 734-వ పద్యసంఖ్యతో ఉన్నది. దాని తర్వాత ద్వాదశ స్కంధం చివరిదిగా ఉన్న “జగదవనవిహారీ! శత్రులోకప్రహారీ!” అన్న 53-వ పద్యం కూడా పోతన గారిదే; నారాయణామాత్యునిది కాదు. అది నవమ స్కంధం చివర “జగదవనవిహారీ! శత్రులోకప్రహారీ!” అని 735-వ పద్యసంఖ్యతో ఉన్నది. ఇక, ద్వితీయ స్కంధం చివర ఉన్న 288-వ పద్యంలో “నిరుపమగుణజాలా! నిర్మలానందలోలా!” అన్న పంక్తి దశమ స్కంధం పూర్వభాగంలోని 1787-వ పద్యమైన “నిరుపమశుభమూర్తీ! నిర్మలారూఢకీర్తీ!” అన్న పోతన గారి పంక్తికి అనుకరణమే. అందులోని “శరధిమదవిశోషా! చారుసద్భక్తపోషా!” అన్నది పోతన గారి “గురుబుధజనపోషీ! ఘోరదైతేయశోషీ”అన్న (10-1-1787) పంక్తిని స్మరింపజేస్తుంది. అదే పద్యంలోని “దురితఘనసమీరా! దుష్టదైత్యప్రహారా!” అన్న పంక్తి ప్రథమ స్కంధం చివర 525-వ పద్యంలోని “దనుజఘనసమీరా! దానవశ్రీవిదారా!” అన్న పోతనగారి రచనకు సంస్మారకం. ఇన్ని జ్ఞాపకాలను వట్టి అనుకరణలుగా ఎందుకు సమకూర్చుకొన్నాడో తెలియదు. దశమ స్కంధం ఉత్తర భాగం చివర ఉన్న పద్యాలు కూడా పోతన గారి పద్యాల వలె లేవు. వాటికి మూలాలు భాగవతంలోని వివిధ స్థలాలలో కనబడుతున్నాయి. ఆయన అసలు వ్రాయనే లేదో, లేక - ఆయన వాటిని వ్రాసిన తర్వాత వ్రాతప్రతులలో పాడైపోతే లేఖకులు ఇక్కడి నుంచీ, అక్కడి నుంచీ పోతన గారి పద్యాలను తెచ్చి తీర్చిదిద్దారో తేల్చిచెప్పటం కష్టం. ఏకాదశ స్కంధంలోని మొదటి పద్యం - దశమ స్కంధం పూర్వభాగంలోని పోతన గారి సుప్రసిద్ధమైన మొదటి పద్యానికి అనుకరణమే. ద్వాదశ స్కంధంలోని మొదటి పద్యాన్ని, అదే స్కంధంలోని “ఏను మృతుండ నౌదు నని యింత భయంబు మనంబు లోపలన్, మానుము” అన్న 25-వ పద్యాన్ని; “మృతియును జీవనంబు నివి మేదిని లోపల జీవకోటికిన్, సతతము సంభవించు” అన్న 27-వ పద్యాన్ని చెప్పిన కవి ఒక్కరే అంటే నమ్మటం కష్టం. అవి వేరొక చోటినుంచి వచ్చి నారాయణామాత్యుని రచనలో అంతర్లీనమై ఉంటాయని ఊహించటం పెద్ద బ్రహ్మవిద్యేమీ కాదు. షష్ఠ స్కంధంలో ఏర్చూరి సింగనామాత్యుడు వ్రాసిన పద్యభాగాలు సైతం ఈయన రచనలోకి వచ్చి కలిసిపోయాయి. సింగనామాత్యుడు తన కథా ప్రారంభంలో కూర్చిన -
శ్రీరమణీరమణ కథా
అని కనబడుతుంది. అంత మాత్రాన ఏర్చూరి సింగన వెలిగందల నారాయణామాత్యునికి పూర్వుడనీ, నారాయణామాత్యుడు సింగనను వెన్నంటి నడిచాడనీ అనుకోకూడదు. పోతన గారి రచనతోపాటు నారాయణామాత్యుని అనువాదం కూడా చాలవరకు దెబ్బతిన్నదనటానికి పైని చెప్పినవి గాక, ఇవి మరికొన్ని హేతువులు.

పారాయణచిత్తుఁ డగుచుఁ బలికెఁ బరీక్షి
ద్భూరమణుఁ డాదరంబున
సూరిజనానందసాంద్రు శుకయోగీంద్రున్. (6-38)
అన్నదే, ద్వాదశ స్కంధాంతంలో –
శ్రీరమణీరమణ కథా
పారాయణచిత్తునకును బతికిఁ బరీక్షి
ద్భూరమణున కెఱిఁగించెను
సారమతిన్ శుకుఁడు ద్వాదశ స్కంధములన్. (12-47)
అని కనబడుతుంది. అంత మాత్రాన ఏర్చూరి సింగన వెలిగందల నారాయణామాత్యునికి పూర్వుడనీ, నారాయణామాత్యుడు సింగనను వెన్నంటి నడిచాడనీ అనుకోకూడదు. పోతన గారి రచనతోపాటు నారాయణామాత్యుని అనువాదం కూడా చాలవరకు దెబ్బతిన్నదనటానికి పైని చెప్పినవి గాక, ఇవి మరికొన్ని హేతువులు.
నారాయణామాత్యుడు ఏకాదశ - ద్వాదశ స్కంధాలను కూడా మునుపటి స్కంధాలకు వలెనే సరిచేసి ఉంచగా, ఆ తర్వాతి కాలంలో ఆయన గ్రంథం సైతం నశించినప్పుడు ప్రతి విలేఖకులు అక్కడి నుంచీ ఇక్కడి నుంచీ తాము సేకరించి తెచ్చిన పద్యాలను చేర్చి, మొత్తానికి ఏదో ఒక సంపుటాన్ని రూపొందించి, తొలినాటి ఆయన కృషి సంగతి తెలిసినవారు కాబట్టి కృతజ్ఞతతో ఆయన పేరును స్మరిస్తూ, ఆ చివరి రెండు గద్యలలో “పోతనామాత్య ప్రణీతం బైన” అని ఉండినచోట “పోతనామాత్య ప్రియశిష్య వెలిగందల నారాయణామాత్య ప్రణీతం బైన” అన్న దళాన్ని చేర్చారేమో అని కూడా అనిపిస్తున్నది. నారాయణామాత్యుని చరిత్ర చర్చను చేసినప్పుడు ఆ సంగతిని ఆలోచింపవలసి ఉంటుంది. లేకుంటే - అక్కడ తన తల్లిదండ్రులు, తన విద్యాగురువులు మొదలైన విశేషాలను స్మరణోత్సవంగా స్మరింపక, “ఇది శ్రీ పరమేశ్వరకరుణాకలితకవితావిచిత్ర కేసన మంత్రి పుత్త్ర సహజపాండిత్య పోతనామాత్య ì ప్రియశిష్య వెలిగందల నారాయణామాత్య ì ప్రణీతం బైన శ్రీమహాభాగవతం బను మహాపురాణంబునందు ...” అని అర్ధాంతరంగా వ్రాసినందుకు వేరొక కారణం అగపడదు. నిర్ణయించేందుకు తగినన్ని సాధనాలు లేకపోయినా, “ఇక్కడ నుండి వెలిగందల నారయ కవిత్వప్రారంభము” అని ద్వితీయ స్కంధంలో ఉన్న శీర్షిక ఎక్కడి వరకు వర్తిస్తుందో మన విమర్శకులు ఏనాడూ చర్చింపలేదు. ఆ శీర్షిక తృతీయ చతుర్థ స్కంధాల కొసదాకా అన్వయిస్తుందని అంటే - అక్కడ కూడా పోతన్న గారి రచన దెబ్బతిన్నదని, అంతవరకు ఉన్నది నారాయణామాత్యుని రచనమేనని మనము నిశ్చయించాలి. అది ఆ విధంగా జరిగి ఉండక, ఆ తృతీయ, చతుర్థ స్కంధములు రెండూ తనకాలం నాటికే పూర్తిగా లుప్తములైనాయి కాబట్టి - నారాయణామాత్యుడు వాటిని సైతం సంస్కరింపక విడిచివేశాడని గాని, అవి ఆయన కాలం నాటికి లుప్తములై ఉండకపోతే - ఆ తర్వాత సంభవించిన దుర్ఘటనాక్రమంలో అవీ ఆయన రచనతోపాటు కాలాంతరంలో నశించాయని, అందువల్లనే తృతీయ - చతుర్థ స్కంధాల కర్తృత్వవైషయికమైన తీరని సందేహమొకటి చిరకాలంగా విమర్శకలోకంలో మిగిలే ఉన్నదని మనము ఊహించాలి.
ఈ కథంతా నిజంగా ఈ విధంగానే జరిగి ఉంటే, ‘సోనా కిత్నా సోనా హై’ అన్నట్లు, “పోతన గారి భాగవతంలో అసలు పోతన గారి రచన ఎంత?” అన్న ప్రశ్నకు సైతం మనము సమాధేయాన్ని ఊహింపవలసి వస్తుంది.
ఈ గతజలసేతుబంధనాల సంగతి మాట అటుంచి, అసలు సంగతేమిటంటే - మొత్తంమీద ఏదో ఒక విధంగా ఈ కథంతా జరిగిన కొన్నాళ్ళ తర్వాత పోతన గారితోనూ, వెలిగందల నారాయణామాత్యునితోనూ ఏపాటి పరిచయమైనా ఉన్నవాడో, లేనివాడో తెలియదు కాని, శ్రీమహాభాగవతం వ్రాతప్రతి తాను చూచినది గాక లోకంలో వేరేదీ లేదని నిశ్చయించుకొన్నాక - బొప్పన గంగనామాత్యుడు ఆ ఉద్యమాన్ని కొనసాగించి, తన పంచమ స్కంధం అనువాదాన్ని చేపట్టి ఉంటాడని మనము ఊహింపవచ్చును. అనువాదం తీరుతెన్నులను బట్టి అది పోతనగారి పర్యవేక్షణలో గాని, కనీసం వెలిగందల నారాయణామాత్యుని పర్యవేక్షణలో గాని జరిగినది కాదని అనిపిస్తుంది. పంచమ స్కంధాన్ని పరిపూర్ణించాలని అనుకొన్నవాడు షష్ఠ స్కంధాన్ని కూడా పూర్తిచేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఎందుకనుకొనలేదో మనకు తెలియదు. ఉపలబ్ధమైన పాఠక్రమాన్ని బట్టి ఆయన కంబము మెట్టు ప్రాంతవాసి అయిన మహాకవి హరిభట్టుకూ, ఏర్చూరు ప్రాంతవాసి అయిన సింగనామాత్యునికీ కొంత ముందున్నవాడని మాత్రం స్పష్టం.
అది క్రీస్తు శకం 1480–1490 సంవత్సరాల నడిమి కాలం. ఆ తర్వాత కొంత కాలానికి సింగనామాత్యుడు తన షష్ఠ స్కంధాన్ని పూరించి ఉంటాడు.
పోతన గారి గృహనామమైన ‘బమ్మెర’ అన్న పేరుతో ఇప్పుడు వ్యవహరింపబడుతున్న గ్రామాన్ని తెలంగాణంలో గడిచిన రెండు శతాబ్దాలుగా ‘బొమ్మెర’ అనేవారు. నేటి ‘బమ్మెర’కు సమీపంలో కానవచ్చిన గుముడూరు శాసనంలో ‘బమ్మరిగ’ అన్న వ్యవహారం కూడా ఉన్నది కాని, అంతకు మునుపు దానికి ఎక్కడైనా కావ్యములలో గాని, శాసనములలో గాని ‘బమ్మెర’ అన్న పేరు ప్రయుక్తమై ఉండినదేమో స్పష్టంగా తెలియటం లేదు. పోతన గారి స్వస్థలం తెలంగాణమా? దత్తమండలమా? అన్న విషయం వివాదగ్రస్తమైన రోజులలో ఈ విషయం కొంత చర్చకు వచ్చింది. ఈ ‘బమ్మెర’ వరంగల్లుకు సమీపాన ఉన్న పాలకుర్తి మండలంలోనిది. పాలకుర్తి నుంచి రెండు కిలోమీటర్ల కాలినడక. వరంగల్లు నుంచి బయలుదేరితే సుమారు ముప్ఫైరెండు కిలోమీటర్ల నడక. ఏర్చూరు ఒకనాటి గోలకొండ దేశంలోని నల్లగొండ మండలంలో ఉన్నది. వరంగల్లు నుంచి పెద్ద దూరమేమీ కాదు. గంగనామాత్యుని స్వస్థలావాసాది విశేషాలేవీ మనకు తెలియవు. వెలిగందల కరీంనగరానికి సమీపంలో ఉన్న నేటి ఎలిగండ్ల. ఇవన్నీ పరిసర ప్రాంతాలన్నది స్పష్టం.

ప్రసక్తి అంటూ వచ్చింది కనుక, గంగనామాత్య - సింగనామాత్యులకు మునుపు శేషపూరణకు దారి చూపినవాడు కనుక, నారాయణామాత్యుని అనువాదవిధానం గురించి కూడా రెండు మాటలు చెప్పుకోవాలి. పోతన గారి నిరుపమానమైన మహాపాండిత్యం, ఒక్కొక్క శ్లోకానికీ మతత్రయవ్యాఖ్యానాలలో చెప్పబడిన విశేషార్థాలకు దీటుగా పద్యాన్ని తీర్చిదిద్దగల అసాధారణమైన వైదుష్యం, ఎక్కడికక్కడ శిక్షా వ్యాకరణ చ్ఛందో జ్యౌతిష మీమాంసా న్యాయ వేదాంతాదులలోని విశిష్ట శాస్త్రపరిభాషాపదాలు వచ్చినప్పుడు స్వానుభవంతో తనదైన శైలిలో అర్థపుష్టిని కూర్పగల నేర్పు, సుప్రతిష్ఠితమైన కావ్యక్రియాకల్ప సర్వాంగీణపరిజ్ఞానం, సృష్టికి ప్రతిసృష్టిగా పోతన గారి వలె మాటిమాటికీ తన మాట ప్రజల నోట గాటంగా నాటుకోగల వినూత్నపదబంధాలను కల్పింపగల సత్త్వనియుక్తి మొదలైన గుణపరంపరతోడి జన్మాంతర సంస్కారాగతమైన వైచిత్రీ ప్రాణశక్తి లేకపోయినా, నిరాఘాటమైన ప్రవాహగతిని సాగిపోయే చక్కటి ధారాశుద్ధితో ద్వితీయ-తృతీయ స్కంధాలకు నడుమ అందమైన పూలవంతెనను నిర్మించే ప్రయత్నం చేశాడు. తనకు ప్రత్యక్ష భగవత్స్వరూపులైన పోతనామాత్యులవారు ప్రారంభించిన భాగవతం అసంపూర్ణంగా ఉండిపోకూడదని నమ్మి, శేషపూరణకు పూనుకొని, ఆ మహాగ్రంథవ్యాప్తికి చేతనైనంత కృషి చేశాడు. అయితే, పోతన గారి భాగంతోపాటు ఈయన పూర్తిచేసిన భాగమూ ఘోరంగా దెబ్బతిన్నదని అనుకొన్నాము. ఆయా చోట్ల అనువాదంలో కానవచ్చే అవకతవకలన్నీ ఈయనవే అని ప్రత్యక్షసాక్ష్యాలు లేకుండా లేనిపోని నేరం అంటగట్టలేము. అందులో ప్రక్షిప్తాలు అనేకం. ఈయన రచనను గురించి కూలంకషంగా వివరించటానికి ఇది సమయం కాదు. ద్వితీయ స్కంధంలో ఈయన పూనుకొని ఎంతో కొంత సరిచేయాలని ప్రయత్నించిన ఆ భాగం కూడా ధ్వంసం అయిపోయినట్లు తెలుస్తూనే ఉన్నది. దశమ స్కంధంలో ఉత్తర భాగం మరీ పాడయింది. పాపం, ఏకాదశ – ద్వాదశ స్కంధాలైనా పూర్తిగా బ్రతికి బట్టకట్టలేదు. అవి ఆ విధంగా నాశనం కావటం మన దురదృష్టమే. భాగవతమంతటా యతిప్రాసలలో లాక్షణిక సమ్మతి లేని రేఫ – శకటరేఫల సాంకర్యం కనబడుతున్న చోట్లన్నీ ఈయన చేతివాటమే అన్న విమర్శకుల భావం కూడా సమంజసం కాదు. మనకు స్పష్టంగా కనబడుతున్న ఈయన అనువాద భాగంలో నిజానికి రేఫ – శకటరేఫల సాంకర్యం కనీసం ఒక్కచోటంటే ఒక్కచోట కూడా జరగలేదు. కవిత్వరచనలో పరిణతప్రజ్ఞుడే కాని, సామాన్య కవుల కోవలో మిగిలేవాడు కాడు. తనకు భగవంతుడిచ్చిన ప్రతిభావిశేషాన్ని శాస్త్రాధ్యయననిరూఢమై, కావ్యార్థపరిజ్ఞానాదులచేత సంపాద్యమానమైన సంస్కారంతోనూ, నిరంతరాయితమైన రచనాభ్యాసబలంతోనూ సముచితంగా మెరుగుపరుచుకొన్న మహనీయుడు. పోతనగారు అద్వైతి అని, ఈయన విశిష్టాద్వైతి అని కొంతమంది పెద్దలన్నది కూడా అర్థంలేని మాట. అయితే ఈయన రచనలో అక్కడక్కడ ప్రాచీనులైన శ్రుతప్రకాశికాచార్యుల వారి శ్రీమద్భాగవత శుకపక్షీయ విశిష్టాద్వైత వ్యాఖ్య నుంచి, పోతన గారికి అనంతర కాలంలో సంస్కృత భాగవతానికి వెలసిన వీరరాఘవాచార్యుల వారి భాగవత చంద్ర చంద్రికా విశిష్టాద్వైత వ్యాఖ్య నుంచి వాక్యశకలాలు అక్కడక్కడ వచ్చి చేరాయి. పోతనగారే విశిష్టాద్వైత మతాభినివిష్టులని, ఆయన అనుయాయిగా ఈయన సైతం విశిష్టాద్వైతి అని నమ్మేవారున్నారు. అది భాగవత గ్రంథ పరిష్కరణం ఎన్నెన్ని తీరుల రూపురేకల పరిణామాలను పొంది ఈనాటి ప్రాప్యవిశేషాన్ని సంతరించికొన్నదో చెప్పకనే చెబుతుంది. పోతన గారు ప్రధానంగా అద్వైతపరకమైన శ్రీధరీయ భావదీపికా వ్యాఖ్యానాన్ని అనుసరించినా, తనకు నచ్చినప్పుడు అన్యమతవ్యాఖ్యలలోని అన్వయాలను కూడా తత్తదుచితస్థలాలలో అనువదించుకొన్నారని నిరూపించేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయి. నారాయణామాత్యుని అనువాదంలోనూ అద్వైతపరకములైన ప్రకరణాలున్నాయి. అందువల్ల పోతనగారు అద్వైతి అని, నారాయణమాత్యుడు విశిష్టాద్వైతి అని ఉన్న నిగమనం కూడా ఆపాతరమణీయం కావచ్చును కాని, అది సాధ్యనిర్దేశానికి, విద్వన్నిష్కర్షకు ప్రవర్తకమైన ఆలోచనామృతం కాదు.
నారాయణామాత్యుడు విశిష్టాద్వైతి కాబట్టి పోతన గారి పేర ప్రసిద్ధమైన నారాయణ శతకం ఈయనదే అయివుండవచ్చునని ఇటీవలి కాలంలో మరొక వాదం పొడచూపింది. నారాయణ శతకం పోతన గారిదో, ఈయనదో అయినా, కాకపోయినా అది పోతన గారికి అత్యంత సమీప కాలపు కృతి అన్న మాట మాత్రం నిజం. క్రీస్తు శకం 1502 (±) లో వెల్లంకి తాతంభట్టు వంటి మహావిద్వాంసుడు తన కవిచింతామణిలో ఈ నారాయణ శతకంలోని ఒక పద్యపాదాన్ని ప్రమాణీకరించుకొన్నాడు. నారాయణామాత్యుడు కాకపోయినా, పోతన గారి పద్యరచనతో ప్రభావితుడైన ఎవరో విశిష్టాద్వైతి ఆ శతకాన్ని కూర్చి ఉండవచ్చునని అనిపిస్తుంది.
‘వెలిగందల’ అని ఇంటిపేరు ఉన్నంత మాత్రాన నారాయణామాత్యుడు వెలిగందల ప్రాంతీయుడు కాడని, నేటి బమ్మెరకు సమీపవర్తి అయిన ధర్మపురిలో నివసించినవాడని నారాయణ శతక రచనను బట్టి కొందరు విశ్వసిస్తున్నారు. అది ఆ ప్రకారం అవునో, కాదో - ఏ సంగతీ నికరంగా నిర్ధారించేందుకు అనువైన ఆధారాలు భాగవతంలో లేవు.
ఏర్చూరి సింగనామాత్యుని దేశ-కాలాల నిర్ధారణకు ఉపరి ప్రమాణాలేమైనా పరికరిస్తాయేమో పరిశీలించేందుకు ఈ విద్యారణ్యంలో కుంజకోటరకుటీక్రోడవీథుల వెంబడిని ఇంతదూరం నడవక తప్పలేదు.
నారాయణామాత్యుని తర్వాత ఏర్చూరి సింగనామాత్యుడు షష్ఠ స్కంధాన్ని చేపట్టక మునుపు బొప్పన గంగనామాత్యుడు భాగవత పంచమ స్కంధాన్ని అనువదించి ఉండవచ్చునని అనుకొన్నాము. ఆయన చేసినది కూడా శేషపూరణమే గాని స్వతంత్రానువాదం కాదని చాగంటి శేషయ్య గారి వంటి విమర్శకులు కొందరు ఊహించారు. అందుకు అనువైన ఆధారాలేవీ విశదరూపంలో లేవు. పోతన గారి పద్యాలు కొన్ని మిగిలి ఉండగా తత్పూర్వోత్తరాలలోని ఘట్టాలను పూరిస్తూ గంగనామాత్యుడు లంకెలను మాత్రం బిగించాడని అనుకోవటం సరికాదు. రచన స్వతంత్రంగా సాగినట్లే కనబడుతున్నది. పైగా ఈయన పోతన గారితో సన్నిహిత పరిచయం లేనివాడు కనుక, శ్రీమహాభాగవతం వంటి ఉదాత్త రచనావకాశరూపమైన యజ్ఞనిర్వహణ కార్యక్రమంలో తనదైన వ్యక్తిత్వాన్ని నిలుపుకోదలచినవాడు కనుక - రజోగుణప్రవృత్తమైన ఆత్మీయ కర్తృత్వాహంతను చంపుకోలేకపోయాడు. చేస్తున్నది భాగవత శేషపూరణమే అయినా, స్వేచ్ఛవహించి తన అనువాద భాగాన్ని పోతన గారిని అనుగ్రహించిన శ్రీరామచంద్ర పరబ్రహ్మానికి గాక, తనకు ఆరాధ్య దైవతమైన శ్రీకృష్ణ పరమాత్మకు అంకితం చేశాడు. ఈయన మొత్తం స్కంధాన్ని మూలానుసారం ఒకటిగానే అనువదించితే - ఏ కుటుంబసభ్యులో, ఏ శిష్యుడో, ఏ లేఖకుడో దానిని రెండు ఆశ్వాసాలుగా విభజించి, రెండు గద్యలను ప్రవేశపెట్టి ఆయన పేరును మరింత ప్రచారంలో ఉంచాలని ప్రయత్నించారేమో అనికూడా భావింపవచ్చును. ఆ చిన్ని స్కంధాన్ని రెండు ఆశ్వాసాలుగా విభజించటం కృతకమని అనిపిస్తుంది. లేక, ఆ ఆలోచన స్వయంగా ఆయనకే వచ్చిందో. పోతన గారి ఆశ్వాసాంత గద్యల సరణిలో “శ్రీ మహాభాగవతం బను మహాపురాణంబునందు” అని వ్రాయక, స్వతంత్రించి, “శ్రీమద్భాగవత పురాణంబునందు” అని అన్యవిధంగా వ్రాశాడు. అనువాదపద్ధతిని బట్టి చూస్తే ఈయనకు ప్రసన్నమైన తన కథాకథననైపుణిని, కావ్యగుణశోభాయమానమైన నిర్మాణకౌశలాన్ని ప్రదర్శించటం కంటె సన్నివేశాన్ని సుభగప్రతీతితో నడుపుకొని పోవడమే ముఖ్యమని అనిపిస్తుంది. పోతన గారి వలె సంస్కృతానికి సమసంస్కృతంగా, మహావ్యాఖ్యాతల వ్యాఖ్యలను మించిన వ్యాఖ్యగా, పద్యాన్ని పంచకల్యాణిలా పరుగులు తీయించాలనే అభినివేశం ఉన్నవాడు కాదు. అందువల్ల సాత్త్వికమైన మార్గాన్ని ఆశ్రయించి ధారాళమైన ధారాగతిలో కథను మాత్రం సరసంగా సంక్షేపించాడు. వేదాంతఘట్టాలను స్వతంత్రంగా అన్వయించుకోవటంలో కొంత తొట్రుపాటున్నప్పటికీ శృంగార సన్నివేశాలలో ఆయన కూర్పు సరసంగానే కొలువుతీరింది. విద్వద్విచార్యమాణరమణీయములైన ప్రౌఢప్రయోగాలను చేయటం కంటె ఎగుడుదిగుళ్ళు లేని శైలిలో మూలార్థాన్ని వీలైనంత సరళంగా తెలుగు చేయటమే ఆయనకు ఇష్టం. అనువాద కళలో మార్కండేయ పురాణ కర్త మారన, విష్ణుపురాణ కర్త వెన్నెలకంటి సూరనల వంటి పౌరాణిక కవుల కోవకు చెందినవాడు. పోతన గారి శబ్దసంవిధానం, అర్థస్ఫూర్తి అననుకరణీయములు కాబట్టి తనదైన ధోరణిలో రసకందాయమైన ప్రసాదగుణాన్ని అభిమానించాడు. ఏర్చూరి సింగనామాత్యుడు ఈయన అనువాదశిల్పాన్ని అనుసరింపక పోతన గారు చూపిన మార్గంలో ప్రయాణించాలని భావించినట్లు కనబడుతుంది.
ఏమైతేనేమి, ఎంత రచింపబడి ఎంత మిగిలితేనేమి, ఆసమంతాత్పరివ్యాప్తమైన పోతన గారి కవిత్వ మహాప్రభావం వల్ల శ్రీమహాభాగవతం ప్రశస్తి అల్లనల్లన మల్లెతీగెలా దేశమంతటా అల్లుకొనిపోయింది. శ్రీకృష్ణభక్తుల ధ్యాననిష్ఠకు, సాహిత్యాధ్యేతల సమ్యగ్ జ్ఞానానికి పోతన గారి భాగవతమే ఆధారభూమికగా నిలిచింది. భాగవత పఠనం విద్యార్థులు, విద్యాధికులు తమ హృదయసద్మంలో దైవీసంపదను పెంపొందించుకొనటానికి మౌలికాశ్రయం అయింది. భారతీజగన్మాతృకరుణాప్రసారం మూలాన బాహిరిల్లిన ఆ సాహిత్యజగత్తులోనికి ప్రవేశించి భక్తజనులు వ్యక్తావ్యక్తాత్మకమైన పరబ్రహ్మతత్త్వాన్ని ఆత్మానుభవగోచరం చేసికొని విష్ణుచింతనరూపమైన మానసికస్నానంతో పునీతులయ్యారు. ఆ మహానుభావుడు కన్నులకు కట్టిన శ్రీకృష్ణపరమాత్మ జీవితం తెలుగుదేశంలో ఆధ్యాత్మికసత్యమై విరాజిల్లి, భక్తమండలి యొక్క స్వస్వరూపానుసంధానానికి ఎనలేని దోహదం చేసింది. ఆయన జన్మజన్మాంతరాల నుంచి మూటగట్టి తెచ్చుకొన్న పుణ్యవిశేషంతో తనలోని దివ్యశక్తులను ఉద్దీపింపజేసి, శ్రీకైవల్యపదాన్ని చేరుకొనటానికి శ్రీమహావిష్ణ్వారాధనమే పరమసాధనమని ప్రబోధించాడు. ఆ చైత్యచోదన తెలుగువారి గుండెలకు హత్తుకొనిపోయింది. శ్రీకృష్ణలీలాభివర్ణనముఖంగా, శ్రీకృష్ణకథాకథనమూలంగా, శ్రీకృష్ణభగవన్నుతిరూపంగా, శ్రీకృష్ణాతిమానుషతత్త్వవివేచన ద్వారా పాఠకుల మనస్సులలో భాగవతధర్మం పట్ల పూర్ణవిశ్వాసం కలిగింది. ఆ మహాత్ముని అవతారఫలంగా శ్రీకృష్ణనామధేయకమైన భూలోక కల్పవృక్షానికి పెనవేసికొనిపోయిన భక్తిలతికకు ఎన్నడూ లేని దివ్యపరిమళాలతో, ఏనాడూ విరిసి యెరుగని నవ్యకిర్మీరాలతో భవ్యప్రసూనాలు పూచే కొత్త ఋతువొకటి తెలుగు తోటలోకి అడుగుపెట్టింది. క్రీస్తుశకం 1480కి తర్వాత ఆ సమ్మోహన మంత్రశక్తికి లోగని కవులు, పారవశ్యాన్ని చెందని పాఠకులు లేరంటే అతిశయోక్తి కాదు.

చాలా బావుంది సార్!
తెలియని విషయాలు, అదీ మీలాటి వారి అమృతమైన వాక్కుల్లో చదవటం మరింత జ్ఞానం కలగజేస్తుంది
మీ రచనలన్నీ ఒక పుస్తకంగా తీసుకువస్తే మరింత ఇదిగా ఉంటుందని అభిప్రాయం సార్! ఆ దిశగా ఆలోచించండి
భవదీయుడు
వంశీ
పోతన భాగవతం చదువుతున్నాను. అందులో కొన్నిభాగాల్లో ఇతర కవులు పూరించిన విషయం ఉంది గానీ ఈ తెలుగువారి మధురగ్రంథం వెనక ఇంత కథ ఉందని శ్రీ మురళీధర రావుగారి ఈ వ్యాసం మూలానే తెలిసింది. ధన్యుడిని.
-వాసు-
శ్రీమాన్ వాసు గారికి
నమస్కారములతో,
శ్రీమహాభాగవతము యొక్క ఈనాటి ముద్రిత ప్రతి ఏ తీరున రూపుదిద్దుకొన్నదో అన్న ప్రచురణ ప్రకాశన కథానకం నిజంగానే చాలా ఆశ్చర్యజనకంగా ఉంటుంది. కారణజన్ములైన శ్రీ బమ్మెర పోతన గారి మహారచనోద్యమంలో సహపంక్తికి నోచికొని తెలుగు జాతిని ధన్యతములను కావించిన ఏర్చూరి సింగనామాత్యుని గూర్చిన ఈ వ్యాసప్రస్తావిక మీకు నచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నది.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
ఇంతచక్కటి విశ్లేషాత్మక వ్యాసం అందించిన సిరిమల్లెవారికి . . . రచయితకు . . . ధన్యవాద పూర్వక నమస్కృతులు . .
– భాగవత గణనాధ్యాయి.
శ్రీ భాగవత గణనాధ్యాయి
శ్రీమాన్ సాంబశివరావు గారికి నమస్కారములతో,
శ్రీమహాభాగవత సర్వ విశేష పరిజ్ఞాతలైన మీ అనుమోదానికి నోచికొన్నందుకు ధన్యవాదాలు!
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతము తెలుగువారి పుణ్యఫలము. భక్తిపరముగా గాని , సాహిత్యపరముగా గాని యీ గ్రంథమును పఠించగలిగిన వారు ధన్యులు. దీనిని పఠించెడు వారలకు పద్యసాహిత్యాభిలాష యినుమడిస్తుంది. పోతన విశిష్టాద్వైతియో కాదో తెలియదు కాని భాగవతములో అద్వైత పోకడలు బాగానే కనిపిస్తాయి.
మాన్యులు ,ఉభయభాషాకోవిదులు, సత్కవులు , విశిష్ఠ పరిశోధకులు , చక్కని సమీక్షకులు శ్రీ ఏల్చూరి మురళీమోహనరావు గారు యీ తరపు సాహితీప్రియుల కందుబాటులో నుండుట అదృష్టము. వీరి వ్యాసములైనా , పద్యములనైనా తగినంత తీరిక చేసుకొనే నేను చదువుతాను. ఆ సమయము లేకపోతే వ్యాసాంశములైనా , భాషాపటిమనైనా ఆకళింపు జేసుకొనుట , ఆనందించుట నాకు సాధ్యము కాదు. ఇప్పటి సమీక్ష వీరి యితర వ్యాసావళికి యే మాత్రము భిన్నము కాదు.
పోతనామాత్యులు భాగవతము గురించి ,
లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జులతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.
అని అది కల్పతరువని ఉర్విలో అనశ్వరమై వర్ధిల్లుతుందని చెప్పారు. ఆ మాటను శ్రీ మురళీధరరావు గారు మరల వక్కాణించారు. పోతన ప్రణీతమైన భాగవతాలయములో కొంత భాగము జీర్ణమయినా మహానుభావులు శ్రీ వెలిగందల నారాయణామాత్యులు , శ్రీ ఏర్చూరి సింగనామాత్యులు , శ్రీ బొప్పన గంగనామాత్యులు తమ తమ ప్రతిభానైపుణ్యములతో భాగవతమునకు పునః సంపూర్ణతను సమకూర్చారు.
నిజమే ! పోతన గారి శబ్దసంవిధానము , అర్థస్ఫూర్తి అననుకరణీయములు. పరిమిత భాషాసంపత్తి , విమర్శనాత్మక దృష్టి గల నా చక్షువులకే అది సుస్పష్టము. శ్రీ వెలిగందల నారాయణామాత్యులు పోతన అడుగుజాడలలో నడిచినా శ్రీ బొప్పన గంగనామాత్యులు స్వతంత్ర మార్గములో నడచుటయే కాక , నందగోపకుమారా ! అని పద్యావళిని ద్వాపరయుగ పురుషునికి అంకితమిచ్చారు. సింగనామాత్యులు షష్ఠస్కంధమును అచ్యుతుని , కృపావాసుని ప్రశంసిస్తూ విభిన్న మార్గములో ప్రారంభించారు . వారి గురించి శ్రీ ఏల్చూరి వారింకా విపులంగా సమీక్షిస్తారని భావిస్తున్నాను..
శ్రీకైవల్య పదంబుకై భాగవతాంధ్రీకరణకు పూనుకొన్న సాత్విక మహర్షి పోతనామాత్యులే తన పుట్టుపూర్వముల గురించి యెఱుకపఱచి నప్పుడు శ్రీ బొప్పన గంగనామాత్యులు వారు ఆత్మీయకర్తృత్వాహంతను విస్మరించజాలకపోవుటను తప్పుపట్టలేమేమో . నిజానికి అది చాలా మంచిది. లేని సందర్భములో ఆ పద్యముల నింకెవరో చొప్పించినారనే సందిఘ్నము కలుగక పోదు.
శ్రీ ఏల్చూరి మురళీమోహనరావు గారి వ్యాసము విజ్ఞానదాయకము. చాలా మనోహరముగా నున్నది. పలుమారులు పఠించదగినది. వారిని తలచుకున్నపుడల్లా , వారి పాండిత్యమునకు హృదయము పులకరిస్తుంది. వారికి నమోవాకములు.
సిరిమల్లె సంపాదకవర్గమునకుహృదయపూర్వకాభినందనలు.
పూజ్యులైన శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి
ప్రణామములతో,
పరమ పావన భాగవతాగ్రేసరులైన మీ యొక్క ఔదార్యపూర్ణ స్పందనకు, సదయానుమోదానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరన్నట్లు కావ్యకర్తలకు ఎంతో కొంత కర్తృత్వాహంత ఉండటం వల్లనే సాహిత్యచరిత్రకు పరికరించే ప్రామాణిక సాధనసామగ్రి లభించింది. ఇప్పటి వరకు దొరికిన సరిక్రొత్త ఆధారాలతో తెలుగు సాహిత్యచరిత్రను అభినవంగా నిర్మింపవలసిన అవసరం ఉన్నది.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు