Menu Close
“మహాశివరాత్రి పర్వం”
- డా. మల్లాది సావిత్రి
Lord Shiva picture

మన భారతీయులందరికీ అత్యంత ప్రీతిపాత్రమైన విశిష్ట పండుగ “మహాశివరాత్రి”. అజ్ఞానపు చీకటి నుండి జ్ఞాన మార్గం వైపు పయనింప చేసే పండుగ. తెలియని తనం నుంచి తెలివి తనం వైపు నడిపించే ఉత్సవం. ఉపవాసాన్ని, శివప్రార్థనల్ని చేసే అత్యంత పవిత్రమైన రోజు. మాఘమాసంలో వస్తుంది. హైందవులందరూ రాత్రి అంతా జాగరణ చేస్తూ శివస్తోత్రాన్ని పఠిస్తూ శివ మహత్యాన్ని కొనియాడుతూ అభిషేకాల్ని చేస్తారు. మన దేశంలోని జ్యోతిర్లింగాలు శివరాత్రి నాడు ఎంతో వైభవంగా వెలుగుతుంటాయి. శ్రద్ధాభక్తులతో భక్తులు శివసాన్నిధ్యాన్ని, శివదర్శనాన్ని, శివాభిషేక వైభవాన్ని పొందగల్గుతారు. కాశ్మీరులో ఈ వైభవాన్ని ‘హర రాత్రి’ గా వ్యవహరిస్తారు.

ఋషుల ప్రోక్తంగా సాంబశివుడు నేడు ప్రపంచ క్షేమాన్ని కాంక్షించి, విషాన్ని మింగి సమస్త జీవరాశిని రక్షించాడు. పార్వతీ దేవి శక్తిస్వరూపిణి, లోకరక్షిణి. అందుకే తన విభుడు విషాన్ని మింగుతుంటే జీవకోటి క్షేమం కోసం తన మంగళసూత్రాన్ని ఎంతో భక్తితో నమ్మింది మదిలో.

“మింగెడిది విషంబని
మింగెడి వాడు విభుండని
మింగుమనె సర్వమంగళ
మంగళ సూత్రమును మదినెంత నమ్మినదో!!”

అమ్మ మాటను విని గరళాన్ని మింగి లోక రక్షకుడైనాడు కాబట్టి ఈ రోజు మహాశివరాత్రి.

మహాశివరాత్రి ప్రస్తావన స్కాంద పురాణం, లింగ  పురాణం, పద్మ పురాణం మొదలైన వాటిల్లో ఉంది. ఈ రాత్రి శివుడు విశేషంగా నృత్యం చేస్తాడని జనుల ప్రగాఢ విశ్వాసం.ఈ నమ్మకంతో ప్రజలు రాత్రి పూట నృత్యం చేస్తూ భజన చేస్తూ, శివస్తోత్ర మాలికల్ని పఠిస్తూ, లింగానికి భక్తిశ్రద్ధలతో అభిషేకం చేస్తూ పారవశ్యంలో మునిగిపోతారు.

కొందరు శివరాత్రి నాడు ‘శివపార్వతుల పరిణయం’ జరిగిందని విశ్వసిస్తారు. శ్రీశైలంలో ఆదిదంపతుల కల్యాణాన్ని కనుల పండువుగా పెద్దలు నిర్వహిస్తారు.

మరికొందరు నేడు చేసే అభిషేకాదులు అన్నీ మనిషిని సన్మార్గంలో పయనించేలా మార్చి, మోక్ష మార్గానికి బాట వేసేందుకుపయుక్తం అని భావిస్తారు.

ఇంకొందరు నాట్యశాస్త్రాదుల ప్రాధాన్యత సంతరించుకునేలా ‘నటరాజస్వామిని’ స్మరిస్తూ, వార్షికోత్సవంగా వైభవాన్ని చాటుతారు. చిదంబరం, కోణార్క్ మొదలైన ప్రదేశాలలో ‘నాట్యాంజలి’ ని బాగా ప్రదర్శిస్తారు. నృత్యమే దైవపూజగా భాసిల్లుతుంది.

నేపాల్ లోని పశుపతి ఆలయంలో పెద్దఎత్తున వివాహితులైన స్రీలు తమ భర్త యోగక్షేమాల్ని కాంక్షిస్తూ. కన్యకలు మంచి వరుడు లభ్యం కావాలని ఆకాంక్షిస్తూ పూజాదికాల్ని నిర్వహిస్తారు. వీరికి శివుడు యోగశాస్త్ర పరంపరలో ఆదిగురువు, ఆరాధ్యదైవం.

కాళిదాసు మహాకవి అందించిన శ్లోకం ఇక్కడ స్మరణీయం.

“వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీప రమేశ్వరౌ”

సంస్కృత భాషా సాహిత్యంలో మేటి గురువు అందించిన ఈ శ్లోకం అత్యద్భుతం. కాళిదాసు కవిరత్న, కవికులగురువుగా నేటికీ చిరస్థాయిగా ఉండి పోయాడు.

జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. సదా వందనీయులు. ఏకత్వాన్ని భాసించేలా ఒకే ఒక పదం “పితరౌ” అని వాడాడు. శివపార్వతుల్ని కలిపి, ఏక శేష ద్వంద్వ పదాన్ని ఏకపదంగా “పితరౌ” అన్నాడు. అట్లాగే సమ్యక్ పృక్తౌ పదాలు “సంపృక్తౌ” గా కలిసి ఉండే భావానికి ప్రతీకగా తెలియజేశాడు. ఇంతేకాదు పార్వతీప, రమేశ్వరౌ – శివ రామేశ్వరులు అంటే హరి హరులుగా కూడా తెలియజేయబడుతోంది. ఇది విశేషమైన శ్లోకం. సరైన వాక్కును, తదనుగుణ అర్థాన్ని నేర్పించమని కాళిదాసు జగత్పతరుల్ని వేడుకున్నాడు. ఆవిధంగానే అందించే మహాకవి కాళిదాసు అయ్యేలా చిరస్థాయిగా సాహితీ ప్రపంచంలో నిలిచి ఉండేలా ఆశీర్వదించాడు ఆ భోళాశంకరుడు.

మహాభారత కాలంనుంచీ పూజలందుకుంటున్న మహోన్నత శివాలయం పాకిస్తాన్ లోని లాహోర్ కి సమీపంలో ఉంది. శివుడ్ని “కటస్ రాజీ” గా పిలుస్తారు. దక్ష యజ్ఞ వినాశనం తర్వాత శివుడు సతీదేవికై విలపిస్తాడు. ఆ కన్నీరే రెండు గుండాలుగా మారి, మన దేశంలో పుష్కర్ గా పాకిస్తాన్ లో ‘చక్యాల్’ జిల్లాలో ఏర్పడినాయని ప్రతీతి.

మారిషస్ లో 108 అడుగుల శివలింగాన్ని ప్రత్యేక ఆకర్షణగా నిర్మించారు. రమారమి వడోదర (గుజరాత్) లోని శివ విగ్రహాన్ని పోలి ప్రపంచంలోని అతి పెద్ద శివలింగంగా రెండోస్థానంలో విరాజిల్లుతోంది. శివుడు ఇక్కడ ‘మంగళ మహదేవ్’ గా పేరొందాడు.

‘పరబ్రహ్మన్ – ప్రభంజన్’ గా పరమోత్తముడైన బ్రాహ్మణునిగా శివుడు ఇండోనేషియాలో వెలుగొందుతున్నాడు.

శ్రీలంకలో రామాయణ కాలం నుండి ఉన్నట్టుగా చెబుతున్న శివాలయాన్ని ‘మున్నేశ్వర్’ ఆలయంగా పిలుస్తారు.

మస్కట్ లో సీబ్ విమానాశ్రయానికి దగ్గరలో సుల్తాన్ పాలస్ దగ్గర ‘మోతీశ్వర మందిరం’ గా శివాలయం విరాజమానమై ఉంది.

ఆస్ట్రేలియా మెల్బోర్న్ నగరంలో గల శివాలయాన్ని కాంచీపుర పండితులు ప్రతిష్టించారని చెప్తారు.

ఇలా ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల శివాలయాలు పూజలందుకుంటూ జనుల్ని ఉత్సాహపరుస్తూ ప్రశాంత చిత్తులై మెలిగేలా చేస్తున్నాయి. ఆలయాలు శాంతి కారకాలు.

ఇక ‘శివరాత్రి’ గురించి అవగాహన చేసుకునే యత్నం చేద్దాం. మహాశివరాత్రికి మనం నిత్యానైమిత్తిక క్రియల్ని చేసి, విశేషంగా ‘శివపూజ’ నేడు చేయాలని సృష్టికి సంకేతంగా పద్మదళాల ముగ్గు వేసి, మంటపారాధన చేసి, పూజాదికాల్ని నిర్వర్తిస్తాం. మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం. ఉపవసిస్తాం. తేజోలింగమూర్తికి అభిషేకిస్తాం. అయితే తేజోలింగోద్భవం అంటే ఏమిటి?

బ్రహ్మ, విష్ణువుల అహంకారాన్ని అణగద్రొక్కి, శివుడు మహా తేజోలింగ రూపంలో ఆవిర్భవించిన రోజు “మహా శివరాత్రి”. ఎందుకు? జీవకోటి మనుగడ కోసం.

గర్భాలయంలో శివుని దర్శించుకుని, ఆలయ ప్రాంగణంలో రాత్రివేళ కూర్చుని యధాశక్తిగా మహన్యాస రుద్రాభిషేకం చేసుకుంటే ప్రశాంతత మన స్వంతం. నిర్మల చిత్తంతో శివపూజ చేయడం మన శక్తికి తార్కాణం.

ఒకనాడు బ్రహ్మ తన సృష్టిని చూద్దామని బయలుదేరి క్షీరసాగరంలో మనోహరంగా విరాజిల్లుతున్న విష్ణువును చూసి అసూయపడి యుద్ధానికి తలపడ్డాడు. దీనితో సమస్తలోకాలు దద్దరిల్లి పోయాయి. సముద్రాలు తమ చెలియలి కట్టను దాటేశాయి. దేవతలు రక్షణకై ఈశ్వరుని ప్రాధేయపడితే అగ్నిలింగాకారంలో అమిత తేజస్సుతో విరాజమానుడై లోక రక్షణ చేశాడు. ఆ అగ్ని లింగమే నేటి అరుణాచలం (శివపురాణం). ఆ ఈశ్వరుని ధ్యానించే పాశుపతాస్త్రాన్ని అర్జునుడు పొందాడు (హర విలాసం). కరుణామయుడు, దయార్ద్ర హృదయుడు శివుడు సదా మంగళకరుడు.

ప్రదోష సమయంలోనే పరమదైవం భూమిని వీక్షిస్తూ ఆకాశమార్గాన కైలాసాన్ని చేరి నృత్యం చేస్తాడు. సాంబశివుని దర్శనం సదా మంగళకరం. అందుకే ప్రదోష సమయంలో నిదురించరాదని పెద్దలంటారు.

అమావాస్య ముందు రాత్రి మాసశివరాత్రి గానూ, ఒక్క మాఘమాసంలోనే బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి గాను, దైవపండుగగా పూజాదికాల్ని నిర్వహిస్తుంటాము. శివుడు సదా మంగళకరుడై, శుభప్రదుడై, తండ్రియై, తన బిడ్డల్ని సదా రక్షిస్తుంటాడు. భక్తితో, ఆర్తితో అర్చిస్తే వెనువెంటనే అనుగ్రహిస్తాడు. దైవానుగ్రహం తోటే మనం పంటలు, నీరు, ఎండ, వర్షం, ప్రకృతి అందించే ఆహారం మొ|| పొందుతున్నామని గ్రహించాలి. మన లోపల జ్ఞానం పండాలంటే లౌకికంగా దైవాన్ని భక్తితో ఆరాధించాలి కదా! ఎవరెవరు ఎంత భక్తితో అర్చిస్తే అంతటి పూర్ణత్వాన్ని అనుగ్రహిస్తాడు శివుడు. ఆ అనుగ్రహమే సర్వదా మనకి రక్ష.

**** జగత్పితరుడు సర్వదా రక్షించుగాక ****

Posted in February 2019, ఆధ్యాత్మికము

4 Comments

  1. Sarma Danturthi

    క.మ్రింగెడి వాఁడు విభుండని
    మ్రింగెడిది గరళ మనియు మేలని ప్రజకున్
    మ్రింగు మనె సర్వమంగళ
    మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో? [8-241]

    రాసేటప్పుడు తప్పులు లేకుండా కాస్త చూసుకోగలరు. పోతన భాగవతం మొత్తం http://telugubhagavatam.org/ అనే చోట దొరుకుతోంది.

    • భారతీనాథ్ చెన్నంశెట్టి

      రెoడో పాదములో, ఒక లఘువు తక్కువయ్యిoది

      “మ్రిoగెడిదియు గరళమనియు”
      అనాలేమో.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!