Menu Close
sravanthi_plain
Ayyagari-Suryanarayana-Moorthy
మార్పు
అయ్యగారి సూర్యనారాయణమూర్తి
మ.కో. మార్పు జీవనమూలధర్మము, మార్పు లేనిదె సృష్టి చే
         కూర్ప నేరదు మంచి, జీవులఁ గోట్లకొద్ది సృజించుచున్
         మార్పుఁ జెందఁగఁజేసి వృద్ధి కనారతంబును దోడ్పడున్,
         మార్పులేని దచేతనం(1)బగు, మార్పు నేర్పును బాఠముల్
         (1)చైతన్యము లేనిది

మ.కో. కాలమే తగు మార్పుఁ దెచ్చును, గాక యేఁగినవారినే
         చాల వేదనతో స్మరించుచు సాధ్యమే బ్రతుకన్ భువిన్?
         కాలధర్మము మార్ప శక్యము గా ద దెంతటివారికిన్
         బాలలే కద భావిభారతపౌరు లౌదురు మార్పుచే

మ.కో. రంగురంగుల విశ్వమందున రమ్యమౌ సుమరాశులే
         రంగులీనుట మొగ్గ మొగ్గగ మ్రగ్గ సాధ్యమె సృష్టిలో?
         గొంగళుల్ తగు మార్పుఁ జెందక కూర్చునే హరుసంబు? పా
         తంగికం(1) బయి వైద్యపూజల ధన్యమౌ మకరందమే
         (1)తేనెటీగకు సంబంధము కలది (తేనె)

చం. తపసులకైన ధ్యానజపతత్పరతే మది మార్పుఁ దెచ్చి దై
      వపదము చెంతఁ జేర్చు, గురుభక్తికి శిష్యుల మార్పె తోడగున్,
      స్వపథసుధర్మముల్ విడిచి పారిన వచ్చెడు మార్పు వేదనే,
      యపరిమితాశ మార్పు నిడి యందఱి కియ్యెదె(1) గూర్చు నాపయిన్
      (1)వేదనయే

కం. అపరంజి యైన మార్పును
      తపియించుచు నొంద నొందుఁ దగు గౌరవమున్
      దపనీయపతకనాణక
      నృపమకుటద్వారకలశశృంగారములన్(1)
      (1)బంగారు పతకాలు, నాణెములు, రాజకిరీటాలు, వాకిళ్ళు, గోపురశిఖరాలు, అలంకారాలు/ఆభరణాలు

తే.గీ. మార్పు కోసమె మార్పైన మంచి నిడునె?
       వ్రాయవలె నని వ్రాసిన వలయు కృషివి
       నా పరీక్ష యొసంగునే నాణ్యమైన
       ఫలిత? మది వ్యర్థమౌ శ్రమ కలుగఁజేయు
Posted in June 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!