మారిన జీవన దృశ్యాలు
ఒకప్పుడు
ఒక చట్రంలో తిరుగుతున్నాక
అలవాటుగా ఒకే పనిని తొడుక్కున్నాం.
కథ మలుపుతిరిగింది
ఒక విధ్వంసకరపరిస్థితి
అనుభవించాక
బతకడం ఒక యుద్ధమైంది
బతకనేర్చటం ఒక కళ అయింది
కష్టాన్ని నెత్తిన ఎత్తుకుని
కూరగాయల బండిగా మారినా
రోజుకూలీగా మారినా
రోజులు తిప్పే చక్రం వెంట నడవడమే.
క్రిములు
చరిత్రను శాసిస్తాయని
వాగులు వంకలు ఊళ్లనే
ఊడుస్తాయనీ
అనుభవ దృశ్యాలు గా చూస్తూ
తలమునకలౌతున్నాం.
మండే ఎండను ఎత్తుకుని రైతు
క్రిమి ముంగిట పారిశుధ్య కార్మికులు
వైద్యులు నర్సులు
పర్యవేక్షణలో రక్షకభటులు
కర్తవ్యాన్ని ఎలా పాలించాలో
సందిగ్ధం లో సామాన్యుడు
మారిన జీవన దృశ్యాలు
కుదుపుతున్నాయి.
కంటి రెప్పలను తడుపుతున్నాయి.