Menu Close
మార్గం చూపే మనసు
-- ఆదూరి హైమావతి --

"సరే! అదీ వదిలేద్దాం. ఇంకేం మిగిలాయి సమాజ సేవ చేయను?“ అపార్ట్మెంట్ సెక్రెటరీ ఆలోచనలో ఉండగానే టీ బ్రేక్ వచ్చింది. అంతా టీ బిస్కేట్స్ పోటీపడి మరీ స్వీకరించాక, "త్వరగా తెమల్చండి. కొందరు ఇంకా వంటే చేయలేదు, ఆవురావురని మగవారంతా వస్తే మేం ఏం చేస్తాం అప్పటికపుడు? అదీ ఆదివారం స్పెషల్స్ అంటారాయె!" ఆదిలక్ష్మి తన ఆపద గుర్తుచేసుకుంది.

"పోనీ ఒక పని చేద్దామా! ఏ సేవ చేస్తే శ్రేష్టంగా ఉంటుందని మీరనుకుంటున్నారో అంతా చిట్స్ వ్రాసి ఈ బాక్స్లో వేయండి. మన 'గ్రేట్ ప్యారాగాన్ మెడోస్’ అపార్ట్మెంట్ కు మంచిపేరు, గుర్తింపూ వచ్చే ‘సమాజసేవ’ ఏదైతే మీ మనస్సుకు మంచిగా అన్పిస్తుందో అది సూచించండి, ఎక్కువ మంది ఏది సూచిస్తారో దానికే ‘పెద్దపీట’ వేసి దాన్నే అంతా పాటించక తప్పదు. ఈ విషయంలో ఇహ వాదాలూ, విభేదాలూ ఉండవు. “ఫైనల్ విప్’ జారీ చేశాడు మేనేజర్ మోహన్ ర్రావు. తన అధికార కంఠంతో కఠినంగా.

అంతా మేనేజర్ పోడియం వద్దకు దూసుకెళ్ళి "అదేం కుదరదు. మీ విప్లూ, పప్లూ మా వద్ద ఉడకవు. ఇది ప్రజాస్వామ్య అపార్ట్మెంట్ మీటింగ్, అందరి ఆమోదంతోనే, అందరి మనో భావాలకు అనుకూలంగానే, ఏదైనా నిర్ణయం చేయాల్సి ఉంటుంది. మీరు మేం ఎన్నుకున్న మేనేజర్! మాకు అనుకూలంగా ఉంటే సరే సరి! లేకపోతే కొత్తమేనేజర్ను ఎన్నుకుంటాం"

ప్రతిపక్షాలన్నీఒక్కటై, స్వపక్షంలోనూ మద్దతు లేక విలవిల్లాడే ముఖ్యమంత్రిలా, నీటినుండి బయల్పడ్డ చేపలా గిలగిల లాడాడు మేనేజర్ మోహన్ ర్రావు.

"దయచేసి కూర్చోండి. మీ మనోభావాలకు భిన్నంగా ఇక్కడే నిర్ణయమూ జరగదు. అంతా సహకరించండి, ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. మీరంతా ఏక గ్రీవంగా ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటే మన అపార్ట్మెంట్ చేసిన సమాజసేవ, మన పేర్లూ ఫోటోలూ టి.వీ.9లోనూ అన్ని న్యూస్ ఛానల్స్ లోనూ, న్యూస్ పేపర్స్ లోనూ రావాలని మా కమిటీ అభిప్రాయం. అందుకు మీ అందరి సహకారం కోరుతున్నాం. సహక రించండి please." జాయింట్ సెక్రెటరీ సాయినాధ్ మరీ మరీ కోరగా అంతా వెళ్ళికూర్చున్నారు.

సందట్లో సడేమియా లాగా మెట్లమీద వారు స్టూల్స్ మీదకూ, స్టూల్స్ మీద వారు కుర్చీల్లోకీ దాటుకున్నారు. పదవికోసం పార్టీ మార్చిన M.L.A స్ . M.P స్ లాగా. కుర్చీల్లో ఇంతకుముందు కూర్చున్న పాతవారు ఇది నాసీటు లెమ్మని అడగను మొహమాటం అడ్డొచ్చి మెట్లమీదకు వెళ్ళక తప్పలేదు.

ట్రెజరర్ ఒక వైపు ఖాళీగా ఉండే ఆఫీస్ కంప్యూటర్ కాయితాలు ఇంటికి తెచ్చి దాచి ఉంచుకున్నవాటిని చిన్న ముక్కలు గా చేసి ఇల్లాంటి రిజలూషన్స్ ఓట్లకోసమని భద్రపరచుకుని ఖర్చుతగ్గిస్తాడు గనకే మూడుమార్లుగా ఆ పదవిలో కొనసాగుతున్నాడు. ప్రజల కోరికలు, అవసరాలూ గుర్తించి నెరవేర్చిన ప్రజానాయకుడు తిరిగి ఎన్నికైనట్లు. ట్రెజరర్ అందించిన చిన్న ముక్క కాయితాలలో ఏదో ఒకటి వ్రాసి ఆ అట్టపెట్టెలో పడేసి ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్న అడిగే ప్రజానాయకులు మాత్రమే ఉండే సభలా అంతా కుర్చీలు, స్టూల్స్ ఖాళీ చేయగా, ముందుగా మెట్ల పైవారు మొదటి అంతస్థుకు పైకెళ్ళేవారు ఎక్కను దారిచ్చేందుకు లేచారు.

"ఒక్క క్షణం! మేము ఈ చీటీల మడతలు విప్పి చూసి నిర్ణయం చెప్పేoత సమయం మీకంతా లేనందున మెజారిటీ వారి అభిప్రాయాలను మన నోటీస్ బోర్డ్ లో సాయంకాలానికి పెడతాం. మీరంతా చూసి మీ మీ ఆమోదాలను మాకు మైల్ ద్వారా అన్నట్లు కొత్త వారికి తెలీదేమో మన అపార్ట్ మెంట్మైల్ ఐ.డీ. greatparagan.medoes@gmail.com –కు మెయిల్ చేసి ఏ సమాజ సేవ మనం చేపడితే బావుంటుందో మీ అభిప్రాయాలు తెలపండి.” అంటూ ప్రెసిడెంట్ ముగించగానే….

"మనం భారతీయులమనీ, అదీ తెలుగు వాళ్ళమని నిరూపించుకున్నందుకు నాకెంతో గర్వంగాఉంది. పార్లమెంట్లోనూ, అసెంబ్లీలోనూ సమావేశాలు ముగిసినట్లు మన అపార్ట్ మెంట్ సర్వసభ్య సమావేశమూ ఏ నిర్ణయమూ తీసుకోకుండానే ముగియడo ముదావహం. గత 3 నెల్లుగా మనం సమావేశమవడం సమాజసేవ ఎలా చేయాలో నిర్ణయించుకోలేక పోవడమూ మనకు సమాజంపట్ల ఉన్న నైతిక బాధ్యతకు ఋజువనీ, నేను భావిస్తున్నాను. "ఎంతో గంభీరంగా చమక్కులూ, చురుక్కులతో, చిరువాతలు పెట్టాడు చిరంజీవిరావు. కమిటీ మెంబర్ల నుండీ అంతా ఆయన్ను హాటుగా, ఘాటుగా చూసి మెట్ల వైపు బయల్దేర బోయారు …ఎబౌట్ ఠర్న్ అన్నట్లు.

వాచ్ మెన్ వాసు పరుగు పరుగున ప్రెసిడెంట్ వద్దకువచ్చి ఏదో చెప్పగానే ఆయన “డియర్ ఫెలో రెసిడెంట్స్! ఒక్క నిముషం ఎవరో క్లబ్ మెంబర్స్ మనందరినీ ఏదో సభకు ఆహ్వానించను వచ్చి మన సమా వేశానికి విఘాతమని బయటే ఇంతసేపూ వేచి ఉన్నారుట! ఒక్క రెండు క్షణాలు మీ అమూల్య సమయాన్ని వెచ్చించి మన అపార్ట్ మెంటుకు వచ్చిన విజిటర్ల ముందు మన కీర్తి నిలుప వలసి నదిగా ప్రార్ధన.” అని బ్రతిమాలాక స్వంతపార్టీ సభ్యులను ఉపఎన్నికల ప్రచారానికి బ్రతిమాలే ఇంచార్జి మంత్రిలా అoతా వెనక్కు వచ్చి అర్ధచంద్రాకారంగా నిలిచారు, ‘రెండు క్షణాల కోసం కుర్చీల వేట ఏల ఎటూ ఎలక్షన్స్ వస్తాయిగా’ అని వేచి ఉండే రాజకీయ నాయకుల్లా.

వాసు వెళ్ళి చెప్పగానే గేటు దాటి సెల్లార్లోకి వచ్చారు ముగ్గురు. వారిని చూసిన ఉమామహేశ్వర్రావూ , ఆనందరావూ, అనసూయమ్మా, పూర్ణచంద్రరావూ, నాగేశ్వర్రావూ తదితరులంతా వారిని 'ఉదయం ఆ పిచ్చితాత’ ఇంట్లోకి వెళ్ళిన వారు వీరేనని గుర్తుపట్టి ఆశక్తిగా కుర్చీల్లోకి తమ శాల్తీలను దించారు.

వారు ముగ్గురూ రంగప్రవేశం చేశాక మేనేజర్ వారికి కుర్చీలు ఆఫర్ చేశాడు. వారిలో ఒకరు "థాoక్యూసర్!  మేము మిమ్మల్ని ఒక సన్మానసభకు ఆహ్వానించేందుకు వచ్చాము. ‘సత్యసాయి నిగమాగమ కళ్యాణమంటపం‘ లో ఒక గొప్ప సమాజ సేవకునికి ‘సమాజ సేవా రత్న’ అనే బిరుదు ప్రదానం చేసి సన్మానం చేయబోతున్నాం. ఈ ఆదివారం నాడు, గవర్నర్ గారు ముఖ్య అతిధిగా వస్తున్నారు. అందరికీ భోజనం కూడా అక్కడే! మీరంతా తప్పక రావాల్సిందిగా ఆహ్వానించను వచ్చాం." అని విషయం వివరించాడు.

అపార్ట్ మెంట్ లోని చాలామందికి ముఖ్యంగా కమిటీ పెద్దలకు తమకు రావల్సిన బిరుదూ గౌరవం ఎవరో లాక్కు పోతున్నట్లు గుండెలు పిండేయగా 'ఈ సభ్యులెవ్వరూ ఇన్నాళ్ళుగా ఏసమాజ సేవకూ ఒప్పుకోక పోతిరి. లేకపోతే మన కమిటీ సభ్యుల్లో ఎవరికో ఒకరికి తప్పక ఈ గౌరవం దక్కేది.' అనుకున్నారు ఎంతో బాధగా.

"నేను లయన్స్ క్లబ్ మెంబర్నినా పేరు రాఘవ్, ఈయన రోటరీ మెంబర్ రత్నాకర్, వారు స్వచ్ఛంద సమాజ సేవకులు సాగర్, మేమంతా సాఫ్ట్ వేర్ జాబ్స్ చేస్తున్నాం” తమను పరిచయం చేసుకున్నాడు రాఘవ్.

"మీ అపార్ట్ మెంట్లో ఎవరికో ఆ మధ్య కిడ్నీ పాడైందనీ ఎవరైనా దాతలు సహకరించాలనీ ప్రకటన ఇస్తే మీకు సరైన సమయానికి ఎవరో ఇన్ ఫొర్మేషన్ ఇచ్చి సహకరించారుట కదా?" అడిగాడు రత్నాకర్.

"ఔనండీ! అది మా ఒక్కగానొక్క అబ్బాయి కామేష్ కే! ఆ పుణ్యాత్ముడు ఎవరో తెలీనేలేదు. కేవలం మాకు ఓ ఫోన్ కాల్ ద్వారానే చెప్పారు. సమయానికి ఆ కిడ్నీఅందడం వలన మావాడు మాకు దక్కాడు. వాడిప్పుడు బిటెక్ పూర్తిచేసి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు." వెంకట్రావ్ చెప్పాడు.

"మీరు అతనెవరో కనీసం తెల్సుకోను ప్రయత్నించ లేదా?" అనే రత్నాకర్ ప్రశ్నకు,

"లేదండీ! ఆ సమయంలో మేము మావాడి ఆరోగ్యం గురించి తప్ప మరేమీ ఆలోచించే స్థితిలో లేము, ఆ పుణ్యాత్ముడు ఎవరో తెలిస్తే కాళ్ళు కడిగి  నెత్తిన చల్లుకుంటాం." ఎంతో భక్తి భావంతో చెప్పాడు వెంకట్రావ్.

"మీ అపార్ట్మెంట్ లోనే అనుకుంటా మూడేళ్ళ క్రితం ఎవరికో కంటి చూపు ఇంఫెక్షన్ సోకి కోల్పోతే ఎవరో తమ మరణానంతరం కళ్ళు దానం చేస్తే అవి అమర్చారుట?" సాగర్ ఆసక్తిగా అడిగాడు.

"ఔనవునండీ! అది మా పాప ఎనిమిదేళ్ళ వసుధకు. అప్పుడు కళ్ళ కు ఏదో తెలీని వ్యాధిసోకి దానికి వైద్యం చేయిస్తే చూపు పోయింది. ఆ హాస్పెటల్ మీద కేసు కూడా వేశాం. ఆ కష్ట సమయంలో దేవునిలా ఒక వ్యక్తి మా పేపర్ ప్రకటన చూసి మాకు కార్డుముక్క రాసి కాపాడాడు. ఇప్పుడు మాపాప వసు ఆరోక్లాస్ చదువుతున్నది. ఆకేస్ ఇంకా నడుస్తూనే ఉంది."వాసవి వివరించింది.

"మరి అంత సాయం చేసిన ఆ కార్డు ముక్క వ్రాసిన వ్యక్తి గురించి తెల్సుకోవాలనిపించనేలేదా మీకు కనీసం?" ఈ మారు రత్నాకర్ అడిగాడు.

"ఆ వ్యక్తి కనీసం సంతకం కూడా పెట్టలేదు. తెల్సుకోడo ఎలా సాధ్యం చెప్పండి? ఎప్పటికైనా తెలిస్తే ఆయన పాదపూజ చేసి కృతఙ్ఞతలు తెలుపుకుంటాం." వాసవి పూజ్యభావం ఉట్టిపడగా చెప్పింది.

"మరి ఎవరికండీ AB నెగటివ్ గ్రూప్ రక్తం కావాలని పేపర్ ప్రకటన ఇచ్చింది? ఏదో యాక్సిడేంట్ అయిందనీ ..." సాగర్ అడిగాడు.

"ఔను మా వారికి స్కూటర్ యాక్సిడెంట్ ఐతే ఆయన బ్లెడ్ గ్రూప్ పెక్యూలియర్, ఎక్కడా దొరక్క ఎంతో బాధలో ఉన్నపుడు, మా పేపర్ ప్రకటన చూసి, ఎవరో దేవుడిలా మాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్పి, కాపాడారు. కార్డ్ కూడా వ్రాశారు బ్లడ్ డోనార్స్ ఫోన్స్ తో సహా. ఆయన మేలు ఎప్పటికీ మరువలేం. కనిపిస్తే కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతా. నా మాంగల్యం కాపాడిన సాక్షాత్ పరమాత్మే ఆయన." సరస్వతి చెప్పింది.

"మరి మీరైనా అంత సహాయం చేసిన వ్యక్తి ఎవరో తెల్సుకోను ప్రయత్నించలేదా?" రాఘవ్ అడిగాడు.

"కేవలం కార్డు ముక్క మీద సంతకం గానీ, పేరు గానీ లేక పోడంతో ఏమీ తెల్సుకోలేకపోయాం, ఆయన ఫోన్ నెంబరూ గుర్తుంచుకోలేదు” అంది సరస్వతి.

"ఇంకెవరికో ట్యూషన్ మాస్టర్ కావాలనీ, మరొకరికి ‘నానీ‘ కావాలనీ, రెంట్ కు ఇల్లు కావాలనీ, ఇలా చిన్న చిన్న ఇంఫర్మేషన్స్ సైతం అందిన వారున్నారా? మీ అపార్ట్మెంట్ లో?" సాగర్ అడిగాడు.

"ఔనౌను, మాకు ఆ విషయాల గురించీ కార్డ్స్ ద్వారానే ఇన్ ఫర్ మేషన్స్ అందాయి, ఎవరో మాత్రం తెలీదు. అందువల్లే మాకు బ్రోకర్ల బాధలు, ఖర్చులు లేకుండా పోయింది." వాసు, చరణ్, మల్లేశ్వర్రావ్, మహేష్, సోమేశ్వర్రావు, సుందరయ్య చెప్పారు.

"ఇటీవల రోడ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణావస్తలో ఉన్న ఒక మల్టీ మిలియనీరు కొడుక్కు కావల్సిన రక్తాన్ని కేవలం పేపర్లో వార్త చూసి సమాయానికి ఫోన్ ద్వారా సమాచారం అందించి, తాను ఎరి గున్న వారి రక్తం ఇప్పించి, ప్రాణం కాపాడిన వ్యక్తిని వెతికి పట్టుకుని ఆయన సన్మానం చేస్తున్నాడు. వార్తా పత్రికల్లో ప్రకటనలు చూసి వ్రాసి ఉంచుకుని, ఒక ఫైల్ పెట్టుకుని, పోస్టాఫీస్ నుండి కార్డ్స్ కొని తెచ్చుకుని, ఎనభై ఐదేళ్ళ ఆ ఓల్డ్ మాన్, కాదుకాదు ‘గోల్డ్ మాన్’ ఎవరికి కావల్సిన సమాచారం వారికి అందిస్తున్న మహానుభావుడు, మరీ అర్జెంట్ ఐన వారికి ఫోన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అందిస్తూ అతడు చేసే సమాజసేవ, మానవసేవ మహోన్నతమైనది. ఆయన చేస్తున్న గుప్తసేవ, మూగసేవ, మౌనసేవ, రహస్యసేవ, పోస్ట్ కార్డ్ సేవ ఎలా ఐనా అనవచ్చు. గత ఇరవై ఏళ్ళుగా ఎవ్వరూ గుర్తించనైనా లేదు. ఎవరైనా గుర్తించాలని కూడా ఆయన ఎప్పుడూ భావించలేదు.” సుదీర్ఘంగా చెప్పిఆగాడు సాగర్.

“అసలు ‘ఆ సేవాస్పృహ' సేవ అర్ధం, పరమార్ధం ఏంటో ఆయన్నుంచే అంతా నేర్చుకోవాలి. ఏ సేవ చేస్తే గుర్తింపు వస్తుందాని ఆలోచిస్తారు తప్ప, సేవ ఎలా ఏఖర్చూ లేకుండా చేయవచ్చో, ఎవ్వరికీ తోచదు, అర్ధంకాదు. 'ఓ మారు ఒక న్యూస్ పేపర్ ఏజంటు తాను అందుకున్న సహాయానికి ప్రతిగా ఆయనకు అన్నిన్యూస్ పేపర్స్ ఉచితంగా ప్రతి రోజూ వేస్తూ, మర్నాడు అన్నీతీసుకెళ్తాడు. సేవకు వయస్సుతో, ధనం తో పనిలేదు, మనస్సుముఖ్యం.” రత్నాకర్ చెప్పాడు.

"ఇంతమంది యువత ఉంటున్న మీ అపార్ట్మెంట్ ఏ సేవలూ చేపట్టక పోడానికి కారణం? కనీసం మీ ఇంటి చుట్టు పక్కల ఉంటున్న వృధ్ధులకో, అవసరంలో ఉన్న వారికి ఏదైనా కనీసం మాటసాయంచేయవచ్చుగా?" అన్నాడు సాగర్.

"మేమూ అదే చర్చలో ఉన్నాం. ఏదైనా మంచి సమాజ సేవ చేయాలనే మా మీటింగ్ ఉద్దేశ్యం. మా తపనానూ" మేనేజర్ చెప్పాడు.

"మీ ఇంటి ముందు పెంకు టింట్లో ఉంటున్న ముసలి తాత గారిని ఎప్పుడైనా పలకరించి ఏదైనా సాయం కావాలేమోని అడిగారా మీలో ఒక్కరైనా? పాపం ఒక్కడే వండుక తింటూ కాలక్షేపం చేస్తున్నాడు" రత్నాకర్ అన్నాడు.

"ఆయన కెవ్వరూ లేరని విన్నాం" దినేష్ అన్నాడు.

“వినడం కాదు ఎప్పుడైనా పలకరించారా? మాట్లడే ప్రయత్నం చేశారా?" అడిగాడు సాగర్.

"ఎప్పుడూ తలుపేసుకునే ఉంటాడు! ఏం పలకరిస్తాం చెప్పండి" శైలేష్ అన్నాడు.

"ఇంతకూ మీరు సన్మానించబోయే ఆ మహానుభావుడు ఎవరో తెల్సుకోవాలని మా కంతా చాలా తొందరగా ఉంది, ఆయన సేవలు  అందుకున్నవారు ఎంతో మంది మాఅపార్ట్ మెంట్ లోనూ ఉన్నారు. చెప్పండి మేమూ వచ్చి ఆయన సన్మానంలో మీతో పాటు భాగం పంచు కుని కృతఙ్ఞతలు ఇప్పుడైనా తెలుపుకుంటాం" అందరి తరఫునా మేనేజర్ అడిగాడు.

“అందరి అవసరాలూ, ఇంకా ఎంతో మంది ఇబ్బందులూ ఎవ్వరూ అడక్కుండానే తెల్సుకుని తీర్చుతున్న దేవుడు, మీ ఎదురింట్లో నివసిస్తూన్న, మీరంతా ‘పిచ్చితాత’ అనుకునే ‘పిచ్చయ్య పంతులు’ గారు అతడే!” అని సాగర్ చెప్పాడు.

"ఆ!" అంతా ఆశ్చర్యంతో నోళ్ళుతెరిచారు.

“పిచ్చయ్య పంతులు గారు మాకు పాతికేళ్ళుగా తెల్సు. ఆయన విశ్రాంత స్కూల్ మాస్టర్, గణితమేధావి, ఆయన ముగ్గురు కుమారులూ విదేశాల్లో ఉంటున్నారు. అక్కడికి వెళ్ళి డిపెండెంట్ గా బ్రతకలేక భార్య గతించినా ఈయన ఇక్కడే వంటరిగా ఉంటూ సమాజ సేవ చేస్తున్నారు. వారి పెన్షన్తో జీవిస్తూ జీవితాంతం తన దేశప్రజలకు సేవచేసి తన మాతృదేశ ఋణం ఇలా తీర్చుకోవాలన్నదే ఆయన ఆశయం" వివరించాడు రాఘవ్.

అంతా నిరుత్తరులై నిల్చిపోయారు. ఒక్కమారుగా వారి మనసుల్లో కల్లోలం వ్యాపించింది. ఏమీ తెలీకుండా ఆయనపట్ల తాము చేసిన వ్యాఖ్యానాలకూ ఊహాగానాలకూ వారి మనస్సులు వంగి పోయాయి. అహం కుంగి పోయింది. మానవత్వం పొంగి పొరలింది. తమపై తమకే అసహ్యమేసింది.

"ఏంటీ! ఆ పిచ్చితాతా ఈ సేవలన్నీచేస్తున్నది?, ఆయన ఇలా సమాజ సేవ చేస్తున్నాడా?” అని అంతా ఆశ్చర్యం ఒలక బోసుకున్నారు తమలో తాము.

"ఇదిగో చూడండి అందరూ! ఆయన సన్మాన సభకే మిమ్మల్నంతా ఆహ్వానించను మేం వచ్చాం." రత్నాకర్ ఆయన ఫోటోతో ఉన్న ఇన్విటేషన్ తీసి పైకెత్తి అందరికీ చూపాడు.

"అయ్యా! మా మనస్సు పొరలు తెరుచుకున్నాయి. ఆ మహాత్ముని గురించీ ఏమీ తెలీకుండానే, ఎంతో సాయం పొందిన మేం ఏమేమో అన్నాం. ఆయన సన్మాన సభకు తప్పకవస్తాం, అంతే కాదు ఇహ నుండీ  ఆయన నేతృత్వంలో సమాజ సేవ చేస్తామని మాట ఇస్తున్నాం. ఇప్పటికైనా మాకళ్ళు తెరిపించారు. మీకెంతో ఋణపడిఉన్నాం." అంతా ముక్త కంఠంతో చెప్పారు.

తాము అందుకున్నసాయం గుర్తువచ్చి అందరికళ్ళూ ఆర్ర్ధమయ్యాయి.

(సమాప్తం)

Posted in April 2021, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!