భారంగా కళ్ళు మూసుకున్న అతనికి లండన్ నుండి ఇండియా ఇంత దూరమని ఎప్పుడూ అనిపించలేదు. అసలు లండన్ వెళ్లిపోయాక ఇండియా వచ్చింది ఎన్నిసార్లని?
ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జ్ఞాపకాల దొంతరలు.
“దేవా! ఏమి జరుగుతున్నది ప్రపంచం. అహు! ఏం చిత్రంగనున్నదీ ప్రపంచం...” అనే పాట సుపరిచితమైన కంఠంలో లీలగా వినిపిస్తున్నది. గట్టిగా కళ్ళు మూసుకున్నాడు.
***
‘శివా, పరమేశ్వరా, గంగాధరా...’ అని నామస్మరణ చేస్తూ, “నాయనా శివయ్యా... లేరా... బారెడు పొద్దెక్కింది” అని కొడుకుని లేపుతున్నాడు అప్పన్న. ధనుర్మాసం చలి వణికిస్తున్నా ఇల్లు, వాకిలి లేని వాళ్ళకి ఊరి చివర ఆ పచ్చికబయలే దిక్కు.
తండ్రి పిలుపుకి, “అప్పుడేనా?” అని బద్ధకంగా కళ్ళు తెరిచిన శివతో, “మనమివాళ ఇంకో ఊరు ఎల్లాల... బేగి స్నానమాడి రా...” అంటున్న తండ్రితో “మొన్నే కదా ఇంత దూరం నడుచుకొని వచ్చాం. మళ్ళీనా?” అని ఏడుస్తున్న శివతో, “ఏటి సెయ్యగలం? సంకురాత్రి ముందు ఊరూరా తిరగాల” అని విచారంగా అన్నాడు అప్పన్న.
‘పానానికి ఓ సుఖం లేదు, శాంతి లేదు...’ అని గొణుక్కుంటూ సామాన్లు సర్దసాగింది అప్పన్న భార్య లక్ష్మి.
ఆమె మాటలు వినిపించుకోనట్లుగా గుడారం పక్కనే కూర్చుని పచ్చగడ్డి మేస్తున్న బసవన్న దగ్గరకు వెళ్ళి మూపురాన్ని నిమిరి, “పదరా బసవా...” అని నెమ్మదిగా తడుతూ లేపేసరికి యజమాని మాటలకు నెమ్మదిగా లేచింది.
అప్పటికే లేచి, స్నానపానాలు చేసి వచ్చిన పోచన్న “ఒరేయ్ అప్పన్నా, ఈరోజు ఎటువైపు వెళ్దాం?” అని అడిగాడు. “ఈ ఊర్లో కిట్టుబాటు జరగలేదు. ఎనకటి రోజుల్లో ధర్మ ప్రభువులు, పిలిచి మరీ పెట్టేవాళ్లు...” అని చేతులు జోడించి ఆకాశంలోకి చూస్తూ అన్నాడు శాంతయ్య.
“ఆనాటి రోజులు వేరులే మామా, ధాన్యంతో పాటు బత్తెం కూడా ఇచ్చేవారు” అని అప్పన్న అంటే, “అవున్రా... బట్టలు పెట్టి, డబ్బులు కూడా ఇచ్చేవారు. ఈరోజుల్లో ఎవరూ మన మొహాన చూస్తున్న పాపానే పోవడం లేదు” అని నిట్టూర్చాడు శాంతయ్య.
అంతలో “బేగి బయల్దేరండి. ఎండ పెరిగితే పిల్లలు నడలేరు. పైగా పోచన్న పెళ్ళాం వట్టి మనిషి కాదు...” అని శాంతయ్య భార్య సైదమ్మ హెచ్చరించేసరికి పిల్లలు, పెద్దలు, ఎద్దులు నెమ్మదిగా వేరే ఊరి వైపు అడుగులు వేశారు.
ఏదైనా బండెక్కితే ఇవ్వాల్సిన డబ్బులు తమకు కొన్నిరోజులు పనికొస్తాయని నడుస్తున్నా ఒంట్లో శక్తి అయిపోవడంతో అడుగులు నెమ్మదిస్తున్నాయి ఒక్కొక్కరికి.
సూరీడు నడినెత్తి మీదకి వచ్చేసరికి శివకి ఆకలితో పాటు నాలుక పిడచ కట్టుకుపోతుంది.
“నీళ్ళు... నీళ్ళు...” అని అడుగుతున్న పిల్లలని “ఊర్లో తాగుదురు గాని” అని సముదాయిస్తున్నారు పెద్దలు.
మెల్లగా కాళ్లీడ్చుకుంటూ ఒక ఊరికి చేరాక ఊరిబయటే బసవన్న, మిగతా మూడు ఎద్దులు పచ్చగడ్డి తింటుంటే ఏనాడో ఎవరో జమీందారు ఇచ్చిన పాతకోటు వేసుకుని, భుజంపై కండువా వేసుకున్నాడు అప్పన్న. కోరమీసాన్ని దువ్వుకుని, చేతికి వెండి మురుగులు సవరించుకున్నాడు.
ఆకర్షణీయంగా తయారయ్యాక, “లచ్చిమి, మేము ఊరిలోని పెద్ద బజారు దగ్గరికి వెళ్లొస్తామే...” అని అప్పన్న అనగానే “నేనూ, సైదమ్మ ఊర్లోకెళ్ళి, పిన్నీసులు, బొట్టుబిళ్ళలు, తిలకాలు, అద్దాలు, దువ్వెనలు అమ్ముతాం. పోచన్న పెళ్ళాం మాత్రం డేరాలోనే ఉండి ఓపికుంటే ఈత చాపలు, బుట్టలు అల్లుకుంటాది. ఈళ్ళని మాత్రం నీతోనే తీసుకెళ్ళు...” అని శివని, శాంతయ్య కూతురు చుక్కిని అప్పన్న వైపు తోసింది.
మగాళ్లు, గంగిరెద్దులు, పిల్లలు ఊరి మధ్యలోకి నడవగా, ఆడోళ్ళు సామాన్లను ఎవరైనా కొనకపోతారా అని వీధులవైపు వెళ్లారు.
శాంతయ్య వినసొంపుగా సన్నాయి ఊదుతుండగా, పోచన్న ఒక చేతిలో డోలుని, మరో చేతిలో కంచు గంటని వాయిస్తున్నాడు.
అందంగా అలంకరించిన బసవన్నని అప్పన్న నడిపిస్తూ ముందుకు వెళ్ళగా అక్కడి జనాలు వీళ్ళని చూసి చుట్టూ మూగారు.
‘డూ డూ బసవన్నా... ఇటురారా బసవన్నా
ఉరుకుతు రారన్నా... రారన్న బసవన్నా
అమ్మగారికి దండం బెట్టు, అయ్యగారికి దండం బెట్టు
మునసబుగారికి దండం బెట్టూ
కరణంగారికి దండం బెట్టూ
రారా బసవన్నా రారా బసవన్నా...’
అని పాట పాడుతుంటే అనుగుణంగా గజ్జెల కాళ్లతో ఎద్దు నాట్యం చేసిన తర్వాత “అమ్మగారికి దండం పెట్టు...” అనగానే ఒకావిడ ముందు తలవంచింది.
ఇంకో గంగిరెద్దుతో “అయ్యగారికి శుభాలు కలుగుతాయా... అనుకున్నవన్ని జరుగుతాయా?” అని అప్పన్న అడగగానే అవునన్నట్లు అది తలూపేసరికి జనాలు చప్పట్లు కొట్టారు.
తర్వాత కాళ్ళు వెనక్కి మడచి, నేలపై కూర్చుని ఒడిలో ఒక గుడ్డ పరుచుకున్న అప్పన్నపై మెల్లగా బసవన్న కుడికాలు ఎత్తి అతని గుండెలపై పెట్టింది. తర్వాత ఎడమకాలు కూడా ఎత్తి వేసేసరికి ఒక్కసారిగా “అమ్మా...” అని అరిచాడు అప్పన్న కానీ చుట్టూ జనం ఉన్నారని నొప్పి లోపలే అణుచుకున్నాడు.
కాసేపలా అతడిపై కాళ్ళు పెట్టి నాదస్వరానికి అనుగుణంగా తోకను ఊపుతూ లయబద్దంగా కదలసాగి వెనక రెండు కాళ్ళు కూడా పెట్టింది.
గుంపులో ఒకరు, “వీళ్ళు తమిళనాడు, కర్నాటకలో కూడా ఉంటారు. మహారాష్ట్రలో వీళ్ళని నందివాలా అని పిలుస్తారట... వీళ్ళకి రిజర్వేషన్ ఉన్నా కానీ ఎక్కడా ఉద్యోగం దొరకదు ఎందుకంటే సంచార జీవులు అవ్వడంతో చదువులు ఉండవు” అని ఇంకొకరితో అనేసరికి “పాపం... అసలు వీళ్ళు ప్రాచీన కాలం నుండి ఉన్నారని శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్రలో రాశాడు కూడా” అని విచారం వ్యక్తం చేశాడు అతను.
అప్పన్న, అతని బృందం ఓ గంటకు పైగా గంగిరెద్దులను రకరకాలుగా ఆడించిన తర్వాత జనాలు చప్పట్లు కొట్టి తమకు తోచినంత ఇవ్వసాగారు.
ఇంతలో శివ కళ్ళు, చక్కగా తల దువ్వుకుని మంచి బట్టలు వేసుకున్న అబ్బాయిపై పడ్డాయి. పక్కనే వాళ్ళ నాన్న కాబోలు చేతినిండా ఉంగరాలు పెట్టుకుని, పట్టు లాల్చీ వేసుకున్నాడు. తండ్రి చెయ్యి పట్టుకున్న ఆ పిల్లాడిని చూడగానే శివలో ఆక్రోశం ఉవ్వెత్తున లేచి దుఖం ఎగదన్నుకు వచ్చింది.
***
“సర్, వాట్ వుడ్ యు లైక్ టు హేవ్?” అని మృదువుగా అడుగుతుండేసరికి అతను కళ్ళు నెమ్మదిగా తెరిచేసరికి ఎదురుగా వెజ్ సాండ్విచ్, చికెన్ బర్గర్, జ్యూస్, శాఫ్రాన్ రైస్, కాలీఫ్లవర్ కర్రీ, బెర్రీ కేక్ ఇలా రకరకాలు ఐటమ్స్ ఉన్న బండి నెట్టుకుంటూ వచ్చి ప్రయాణికులకు ఏది కావాలంటే అది అందిస్తున్న అందమైన ఎయిర్ హోస్టెస్ ఉంది.
మనస్సు బాగోకపోతే ఆకలి కూడా దరి చేరదేమో...
“కెన్ యు ప్లీజ్ బ్రింగ్ ఆఫ్టర్ సమ్ టైమ్...” అనగానే “ఓకే సర్, ష్యూర్...” అని వయ్యారంగా నడుచుకుంటూ వెళ్లిపోయింది.
మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు అతను.
అందరు పిల్లలు మంచి బట్టలు వేసుకుని, కావలసిన తిండి తింటున్నారు. తనకేమో ఎప్పుడూ ‘అన్నీ’ కొరతే అనుకునేసరికి కళ్ళు శ్రావణ మేఘాలయ్యాయి.
అక్కడి జనాలు వేసిన డబ్బులు మూటకట్టి గుడారానికి చేరినవాళ్ళు చీకటిలో ఆరుబయట చలిలో వణుకుతూ ఏదో ఇంత ఉడకేసుకు తిన్నారు.
మర్నాడు ఒకరిoటి ముందు వాయిస్తుంటే “నిన్నే ఇచ్చినా మళ్ళీ వచ్చారా?” అని కోపంగా ముఖం మీదే తలుపేసేయడంతో భారంగా వేరే వీధి వైపు కదులుతున్న తమవారిని చూసి చివుక్కుమంది శివ హృదయం.
వారం అయ్యాక ఆ రాత్రి, “ఏటీ తిప్పలు? మీవోళ్ళలాగా ఏదైనా యాపారం చేసుకోవచ్చును కదా” అని లక్ష్మి బాధపడుతుంటే, “ఎన్నో తరాల నుండి వస్తున్న మన కులవృత్తిని ఎట్టా వదులుకుంటామే? బసవన్నే నా ఆస్తి. ఆడింత దూడగా ఉన్నప్పుడు సింహాచలం వేలం పాటలో రెండు వేలకి కొనుక్కుని అన్ని విద్యలు నేర్పించాను. ఆళ్లలాగా మధ్యలో నా వృత్తిని ఎట్టా వదిలెయ్యాలే?” అని లక్ష్మి మీద కసురుకున్నాడు అప్పన్న.
అతని మాటలకు మూతి తిప్పుతూ, “శాంతయ్యకి ఎవరో రైతు ఉత్తినే ఇచ్చాడు కదేంటి?” అనగా “ఆళ్ళు దేవుడి పేరు మీద మొక్కుకున్నారటలే...” అన్నాడు అప్పన్న.
“ఆడి ఈడు పిల్లలందరూ బడికి వెళ్తుంటే మన శివ గాడికి మాత్రం ఏవో నాలుగు అచ్చరం ముక్కలు తప్పితే ఏవీరావు...” అని నిట్టూరుస్తున్న లక్ష్మితో “బెంగెట్టుకోకే, దేవుడే ఏదో దారి చూపిస్తాడు...” అని అనునయంగా అన్నాడు అప్పన్న.
డేరాలో మరోపక్క పడుకున్న శివకి తనకి స్నేహితులు లేరు, ఆడుకోవడానికి లేదు అంటూ ఉక్రోషం తన్నుకొస్తుంది.
మర్నాడు ప్రయాణంలో -
“ఓ జాగా ఉన్నా బాగుణ్ణు. ఆడనే ఉండిపోదుం” అని శాంతయ్య అంటే “ఎవరికి చెందని వాళ్ళం కదా. పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలే మొండి చెయ్యి చూపిస్తుంటే మనల్నెవడు ఆదుకుంటాడు?” అని ఆవేశంగా అన్నాడు పోచన్న.
“మరేటి చేస్తాం? ఏ కష్టమైనా, సుఖమైనా మన మూడు కుటుంబాలు కలిసే ఉండాల. నోరులేని ఈ జీవాలే మనకింత కూడు పెట్టే దేవతలు” అని వాత్సల్యంగా ఎద్దులని నిమురుతూ అన్నాడు అప్పన్న.
కొంతదూరం వెళ్ళాక భుజాలపై ఉన్న శివని చూస్తూ, “ఎంత కాలం అలా మోస్తావురా, నీకేదైనా అయితే ఎట్టా?” అని శాంతయ్య మందలిస్తుంటే “నా కొడుకు నాకు బరువేటి మామ? ఆడు ఎప్పటికీ నా ప్రాణం” అని మురిసిపోయాడు అప్పన్న.
ఊరికి చేరుకున్నాక గ్రామ సర్పంచ్ ఇంటి ముందు నిలబడి,
“కొడుకులు, బిడ్డలు, మనవలు మంచిగా ఉండి...
పట్టింది బంగారమై, పుట్టింది ముత్యమై...
పగవాళ్లు బంధువులై...
పాడిపంటలు, చదువులు, ఉద్యోగాలు సక్కగా ఉండాల...”
అని అప్పన్న బృందం ఆ ఇంట్లోవాళ్లని ఆశీర్వదిస్తే వాళ్ళు సంతోషించి డబ్బులు, ధాన్యం ఇచ్చారు.
ఆ రాత్రి అందరూ పడుకున్నాక స్... స్... మని చప్పుడు వస్తుంటే శివ కాలుకి పాము చుట్టుకోవడం చూసిన లక్ష్మి గుండాగినంత పనయ్యి భర్తని మెల్లగా లేపింది. ఆ పరమేశ్వరుడిపై భారమేసి నాగరాజుకి దండం పెట్టుకోగా నెమ్మదిగా వెళ్లిపోయినా, శివకి మాత్రం తమ పరిస్థితి మీద అసహ్యం కలిగింది.
“ఆడిని ఇలా మనతో తిప్పకుండా ఎక్కడైనా ఉంచేస్తే సరి...” అని లక్ష్మి అంటే, “అదేంటే అలా అంటావు? ఆడినొదిలి ఏనాడైనా ఉన్నానా?” అప్పన్న కళ్ళల్లో సన్నటి తడిపొర. బయటికి బింకంగా ఉన్నా ఎక్కువగా బెంగ పెట్టుకునేది లక్ష్మే.
“అయ్యా, నేను హాస్టల్‌లో ఉండి చదువుకుంటాను” అన్నాడు శివ గట్టిగా.
“రేప్పొద్దున్న నువ్వు మన వృత్తిని నిలబెడతావనుకుంటే...” అని నీళ్ళు నములుతున్న అప్పన్నతో, “ఆ... నిలబెడతాడు. ఇప్పుడు నువ్వు సంపాదించినదానికంటే బోలెడు సంపాదిస్తాడు...” అని మూతి విరుస్తూ, చేతులు తిప్పుతూ కోపంగా అంది లక్ష్మి.
“లేదయ్యా నేనిలా తిరగలేను. ఎక్కడో దగ్గర ఉండి చదువుకుంటాను” అని స్థిరంగా అనేసరికి “సర్లే... మంచోడైన ఆ సర్పంచు బాబుని అడుగుదాం” అన్నాడు అప్పన్న.
మర్నాడు, “ఈ చుట్టుపక్కల పిల్లల్నే జాయిన్ చేసుకుంటారు” అని సందేహంగా అంటున్న సర్పంచ్‌తో “అయ్యా, తమరే పెద్ద మనసు చేసుకుని ఈడిని హాస్టల్‌లో చేర్పించాల...” అని బ్రతిమాలాడాడు అప్పన్న. కాసేపు తర్జనభర్జన పడి అతను ఒప్పుకున్నాక సంకెళ్ళు తెంపుకుని స్వేచ్ఛాప్రపంచంలోకి వచ్చినట్లయ్యి కేరింతలు కొట్టాడు శివ.
‘కొడుకు దగ్గర లేకుండా ఎలా?’ అని తండ్రి, ‘నూతన ప్రపంచంలోకి వెళ్తున్నా’నన్న ఉద్వేగంలో కొడుకు...నీరసంగా గుడారానికి వచ్చిన అతనిని చూడగానే ఓ పక్క దుఖం, మరోపక్క సంతోషం కమ్ముకొచ్చాయి లక్ష్మికి.
అంతే! అప్పటినుండి ఎప్పుడో ఒకసారి వాళ్ళు హాస్టల్‌కి వచ్చి చూస్తేనే... లేదంటే లేదు. చదువులో పుంజుకుంటున్న తెలివైన శివతో, “మీ నాన్నేం చేస్తుంటాడ్రా?” అనే స్నేహితుల ప్రశ్నలకు మౌనమే అతని సమాధానం అయ్యేది.
కానీ వాళ్ళకి ఎలా తెలిసిందో కానీ “గంగిరెద్దులా అలా తలూపకపోతే ఏదో ఒకటి చెప్పరా...” అని గేలి చేస్తుంటే తల్లితండ్రుల మీద నిరసన తారాస్థాయికి చేరుకునేది.
ఊర్లు మారుతుంటే కన్నపేగు శివ కోసం అల్లాడుతుంటే, “బాధపడకే, లోకాల్ని రక్షించే ఆ శివయ్య పేరెట్టాను. బాగా చదువుకుని ఆడే మనల్ని చూసుకుంటాడే...” అని మీసాలు మెలేసేవాడు అప్పన్న.
కొన్నాళ్ళకి “పదోతరగతి మంచి మార్కులతో పాసయ్యాను. ఇంకా చదువుకోవాలి. నీతో రాను” అని మొండికేసాడు అతనిని తీసుకువెళ్దామని వచ్చిన అప్పన్నతో.
‘పోనిలే’ అని సరిపెట్టుకున్న అప్పన్న అప్పుడప్పుడు పంపే డబ్బులతో పట్నంలో పైచదువులు పూర్తి చేశాడు శివ.
కొన్నాళ్ళకి “అమ్మా, నాన్నా... బొంబాయిలో పెద్ద ఉద్యోగం వచ్చింది” అని చెప్పేసరికి ఆనందం అంబరాన్ని తాకినా, ‘అంత దూరమా?’ అని మథనపడ్డ అప్పన్న, లక్ష్మిలకి ఏడాదికోమారు దర్శనమిచ్చిన శివ ఆపై అమావాస్య చంద్రుడే.
***
“కైండ్లీ అటెన్షన్ పాసెంజెర్స్, ఉయ్ హేవ్ రీచ్డ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, హైదరాబాద్...” అని అనౌన్స్ మెంట్ వినిపించగానే, ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడతను.
గబగబా ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుని, లగేజ్ తీసుకుని బయటకు రాగానే, మనస్సంతా ఉద్విగ్నత, ఆందోళన. ఎక్కడ, ఎలా ఉన్నారో... అసలు ఉన్నారో, లేదో! అలల్లా ఎగిసిపడిన కన్నీటి సంద్రంలో తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకుని వెక్కివెక్కి ఏడ్చే స్నేహితుడు గుర్తుకువచ్చాడు.
అసలు ఇలా రావడానికి కారణం... గొప్ప తండ్రినని గర్వపడుతున్న తన భ్రమపై చెళ్లుమని చెరిచిన తనయుడి మాటల తూటాలు...
“డాడ్, ఐ యామ్ గెట్టింగ్ బోర్డ్. నా వాటా నాకిచ్చేస్తే వెళ్లిపోతా...” అని సార్థక్ కూల్‌గా అనగానే మ్రాన్పడిపోయి పేలవంగా చూస్తున్న తనతో, “కమాన్ డాడ్... హెల్త్ ఇష్యూస్‌తో పాటు ఓల్డ్ ఏజ్ కాబట్టి ఎక్కడికీ వెళ్లకు అంటారు కానీ ఐ డోంట్ కేర్. నువ్వు నీ పేరెంట్స్‌ని ఎలా చూశావో నేను కూడా సేమ్...” అని నిర్లక్ష్యంగా భుజాలెగరేసి వెళ్ళిపోయాడు.
ఒక్కసారిగా సునామీ వచ్చిన భావన. కాలచక్రం తిరుగుతుంది. కొడుకు తమని వదిలేసి వెళ్లిపోతే... కోట్ల ఆస్తి ఉంది కానీ...
అంతే...
వెంటనే పయనమైతే అయ్యాడు కానీ చిన్నప్పుడున్న హాస్టల్, తిరిగిన ఊర్లు వెతికినా ఎక్కడా వారి ఆచూకీ లేదు.
మనస్సంతా నిరాశ, నిస్పృహ!‘ బహుశా ప్రపంచంలో ఏ కొడుకు ఇలాంటి పని చేసి ఉండడు. తనలాంటి వాడికి బ్రతికే హక్కు లేదు’ అని పొగిలి పొగిలి ఏడుస్తుండగా, ఎఫ్‌బిలో ఒక రిక్వెస్ట్... ‘మీతో ఒకసారి మాట్లాడాలి’ అంటూ... “యస్ ప్లీజ్...” అని సమాధానం ఇచ్చాడు.
పరుగుపరుగున అతను ఇచ్చిన చిరునామాకి వెళ్ళేసరికి నులకమంచంపై గాజుకళ్లతో శూన్యంలోకి చూస్తుందామె.
“అమ్మా...” అని ఒక్కసారిగా ఆమె పాదాలపై పడి ఏడుస్తుంటే, “మీ చిన్నప్పటి ఫోటోని అత్త దగ్గర చూసి ఎఫ్‌బిలో వెతకగా అదృష్టం కొద్ది దొరికారు.” అని చెప్పి, “మా అమ్మకి నొప్పులు వస్తుంటే అప్పన్న మామే పరుగుపరుగున ఆసుపత్రిలో చేర్చి రక్తం ఇచ్చి సొంత అన్నలా కాపాడితే లక్ష్మి అత్త అమ్మలా ఆదరించింది. నేను పోచన్న కొడుకుని” అని రిక్వెస్ట్ పెట్టిన సత్యం చెప్తుంటే, ‘సాయం చేసినందుకే తన తల్లిని కొడుకులా కాపాడుకుంటుంటే కన్నకొడుకైన తను చేసిందేంటి?’ అని గుండెలు పగిలేలా ఏడ్చాడు.
“అత్తా, నీ శివయ్య వచ్చాడు...” అని ఆమె చెవి దగ్గర సత్యం చెప్పగానే నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ “నాయనా శివా...” అని వణుకుతున్న స్వరంతో ఆర్తిగా పిలిచేసరికి “అమ్మా... అమ్మా... ఈ పాపాత్ముడిని క్షమించు...” అని ఆమె పాదాలను కన్నీళ్లతో అభిషేకిస్తున్న అతనితో “బాగున్నావా, నాయనా?” అని, “నా శివయ్య ఏనాటికైనా రాజాలాగ నన్నెతుక్కుంటూ వస్తాడు. ఆడికిచ్చియ్యే అనేవోడు మీ అయ్య. ఇంద...” అని తలగడ కింద ఉంచిన ఒక పాత ‘చిక్కం’ (గుడ్డతో చేసిన చేతి సంచి) ను ఇచ్చింది లక్ష్మి. ఆ మాసిపోయిన చిన్న సంచిని ఎంతో అపురూపంగా అందుకున్న అతను తెరిచి చూసేసరికి తాను సంపాదించిన కోట్ల కంటే ఎంతో అమూల్యమైన కొన్ని నలిగిపోయిన నోట్లు, చిల్లర నాణేలు...
తిరిగిరాని లోకాలకు తరలిపోయిన ఆ ప్రేమను ఏనాటికి పొందలేని అతని రోదన అరణ్యరోదనే.
Well written story!!