సన్నగా మిషన్ చేసే చప్పుడుకి తెలివి వచ్చింది.
నైట్ లైట్ కాంతిలో కుర్చీలో కూర్చున్న కామేశ్వరి కనిపించింది. రెండు చన్నులకి అతికించిన పాలు పంప్ చేసే మిషన్ చప్పుడు గుర్గుర్మంటోంది. ఎదురుగా టేబుల్ మీద కొలతలున్న చిన్నచిన్నసీసాలు! టైం చూసాను. తెల్లవారుఝాము నాలుగున్నర. రోజు ఇదే దినచర్య. ఏడున్నర గంటలకి ఆఫీసుకి వెళ్ళాలంటే నాలుగింటికి లేవక తప్పదు. నెలరోజుల పాప ‘రోజాకి’ రోజంతా తల్లిపాలు కావాలంటే ఈ పాట్లు తప్పవు.
మంచం మీదనుంచి దిగుతూ “కామూ! మామూలు టీ కావాలా, గ్రీన్‌టీ కావాలా?” అడిగాను.
జవాబు లేదు. కామూ తలవంచుకుని కుర్చీలో కునుకుపాట్లు పడుతోంది. దగ్గరగా వెళ్లి “కామూ!” అంటూ భుజాలమీద చేతులు వేసి, పిలిచాను.
ఉలిక్కిపడింది. నా చేతులు పట్టుకుని తలఎత్తి చూస్తూ, “అమ్మా రోజా ఎందుకో రాత్రంతా తెలివేసే ఉంది. పాలు తాగుతుంది కానీ నిద్రపోదు. పక్కలో గునుస్తూనే ఉంది… అందుకే సరిగ్గా నిద్రలేదు” అంది.
ఆప్యాయంగా తలనిమురుతూ, “తల్లి పాత్ర చాల కష్టమైనదే కామూ. తల్లి అవడం అంత మాములు విషయం కూడా కాదు.” అన్నాను జుత్తు సవరిస్తూ.
“మామూలు టీ కావాలి. కాస్త మత్తు వదులుతుంది,” అంది పంప్ చేసిన పాలు సీసాల్లో నింపుతూ…
***
అమెరికా రావడం కోసం ఇంట్లో జరిగిన పోట్లాట నిన్నమొన్న అన్నట్లుగానే ఉంది, అప్పుడే నెలరోజులు గడిచిపోయాయి…
టీ కామూ చేతిలో పెడుతూ, “ఇవాళ ఇడ్లీ పెడతాను. రజాక్ తింటాడా?” అన్నాను.
“తింటాడు. పెద్దగా ఇష్టపడడు, అయినా సర్దుకుంటాడు, ఫరవాలేదు.” అంది.
రజాక్ జిమ్‌కి వెళ్తూ ఎగ్ స్టీమర్లో ఎగ్స్ పెడుతూ “గుడ్‌మార్నింగ్ ఆంటీ!” అన్నాడు చిరునవ్వు నవ్వుతూ.
ఆ అబ్బాయి గుడ్‌మార్నింగ్ చెప్పినప్పుడల్లా మావారు గుర్తుకి వస్తుంటారు.
“ఏమే! కాఫీ అయ్యిందా?” ఓ కేక పొద్దున్నే.
మా అమ్మ నాకు లలిత అన్న పేరు ఎందుకు పెట్టిందో చెప్పేది. “నువ్వు లలిత అమ్మవారివే!” అంటూ ముచ్చటగా మురిపెంగా అనేది. ఆ పేరు కాస్తా “ఏమే!”లో కాఫీలో కలిసే పాలలా కలిసిపోయింది.
టిఫిన్ చేసి లంచ్ బాక్స్ సర్దుకుని ఆఫీస్‌కి తయారవుతుండగానే రోజా లేస్తుంది. దానికి పాలు ఇచ్చి కామూ, రజాక్ తయారయ్యి ఎపార్ట్మెంట్ డోరు తీసుకుని వెళ్లడం, ఎవరు వచ్చినా తలుపు తీయద్దని జాగర్తలు చెప్పడం, రోజాని ముద్దులు పెట్టుకుని నాకు అప్పగించేంత వరకు ఓ గంట పాటు అందరం హడావిడి పడడం రోజువారీ దినచర్య.
నెలరోజులుగా వీటికి అలవాటు పడ్డాను. రోజాని ఉయ్యాల్లో పడుకోబెట్టి, కాఫీ చేసుకుని వరండాలోకి వచ్చాను. ఎపార్ట్మెంట్లో ఉన్న కారులన్నీ దాదాపు ఖాళీ అయ్యాయి. కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతుంటే ఎదురుగా ఉన్న చెట్టు మీద ఆడుకుంటున్న ఉడుత పలుకరించింది అది. నేను రోజు చూసుకుంటూనే ఉంటాము.
ఫోన్ తీసుకుని మావారు శాస్త్రి దగ్గరనుంచి వాట్సప్ మెసేజ్ ఏమైనా వచ్చిందా అని చూసాను. నా మెసేజ్ చూసినట్లు తెలిసింది. జవాబు లేదు!
హ్యూస్టన్‌కి వచ్చి నెల రోజులు అవుతోంది. రోజూ మెసేజ్ పెడతాను, ‘ఎలా ఉన్నారు?’ అంటూ. జవాబు రాదు. నీలంరంగు టిక్ కోపాన్ని రెట్టింపు చేస్తుంది.
కామూ, రజాక్‌ని పెళ్లి చేసుకుంటాను అన్న దగ్గరనుంచి ఇల్లు రణరంగంగా మారిపోయింది. మతం, కులం ప్రేమ పెళ్ళికి ఎప్పుడూ సరిపడవు అనేది మరోసారి ఋజువు అయ్యింది. అత్తగారి ఏడుపు, చుట్టాల సలహాలు, అంతలోనే పంతంతో చూసిన పెళ్ళి సంబంధాలు అన్నిటిని ఎదుర్కొని మొండిగా రజాక్ కోసం నిలబడింది కామూ. ‘మనసుకి నచ్చిన వాడిని ఎన్నుకోవడం నాఇష్టం’ అన్నట్లుగానే పోరాటం చేసింది. నా తల్లి పాత్రకే రోజూ చీవాట్లు. నావల్లే పాడైందని, మా పుట్టింటి ఏడు తరాల్లో ఎవరో ఒకరు ఇలాంటి ‘వెధవ’ పనులు చేసే ఉంటారని గట్టి నమ్మకం ఆయనకి. ఎందుకంటే పూజాపునస్కారాలు లేని అత్తవారిల్లు అంటే ఆయనకి ఎప్పుడూ చులకనే, ఏదో మా నాయనమ్మ మాట తీసేయలేక చేసుకున్నారుట నన్ను.
మా అత్తగారు నాయనమ్మకి దూరం చుట్టం. చుట్టరికంతో పాటు ఒకే ఊరు. అందులోను కాస్త పొలాలు ఉన్న సిరిగల కుటుంబం. అంతే అక్కడ వరకే! నన్ను ఇష్టపడి కాదు.
ఆ నొప్పి నన్ను చాలా రోజులు వెంటాడింది కానీ సర్దుకోవాలి. సర్దుబాటు ఉంటేనే సంసారం! నాయనమ్మ సూత్రం, అమ్మ మాట తిరుగులేనివి. అలాంటి కుటుంబంలోనుంచి వచ్చిన నేను నా కూతురిని పద్ధతిగా పెంచలేదు. ఇస్టానుసారం గాలికి వదిలేసాను.
పెద్దవాళ్ళ మాట వినాలి. కానీ ఇవేవి నేర్పలేని నేను తల్లి పాత్రకి అర్హురాలిని కాను! ఇది ఆయన తిరుగులేని అభిప్రాయం.
రోజుకో సూత్రం, రోజుకో నీతివాక్యం! ‘ఇంటి రూఫ్లకి కూడా నీతీ, న్యాయం, సంప్రదాయం వంటబట్టే ఉంటాయి’ అనుకుంటాను.
రోజూ పూజాసామాన్లు కడగాలి. పూలు సిద్ధం చేయాలి. నిత్య నైవేద్యం కోసం స్నానం చేసి, ఎలక్ట్రిక్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టాలి. ఇవన్నీ నేను చెయ్యాలి. అలా సిద్ధం చేస్తే, ఆయన చేసే పూజాఫలంలో భార్యగా నాకు సగం పుణ్యం వస్తుంది. అలాంటి పుణ్యం మూట కట్టుకోగలిగే స్థాయిలో ఉన్న నేను నా కూతురికి సరైన మార్గం చూపించ లేకపోయాను.
కామూ ధైర్యంగా రజాక్‌ని పెళ్లి చేసుకుని తనకి నచ్చిన వాడితో బతుకుదామని అమెరికా వచ్చేసింది. మూడేళ్లు మాటామంతీ లేదు. కూతురిని చూద్దామని మనసు కొట్టుకునేది. కొడుకు, కోడలు, కట్టుకున్న భర్త… ఎవరికీ చూడాలనిపించలేదు. అందరిదీ ఒకటే వాదన! ఇతర మతాలు ఎందుకు? మనలో ఎవరు లేరా? బాగా చదువుకున్నపిల్ల. బంగారుబొమ్మలా ఉంటుంది. తల్లి సరిగ్గా చూసుకోకపోతే ఇలాంటి అనర్థాలే వస్తాయి. ఎప్పటికి సర్దుకోని-అర్థం చేసుకోలేని పిడివాదన!
ప్రేమకి మతం, కులం నుదుటన రాసి ఉండదు. ప్రేమ పుడుతుంది. అంతే! అయినా ఒప్పుకోలేదు. సంప్రదాయం ముందు అన్ని గాల్లో కొట్టుకుపోయాయి. నలుగురిలో బతకాలంటే నలుగురిలా ఉండాలి. అంతే… ఒక్కోసారి నాకూ అనిపించేది. ఎందుకు ఈ ప్రేమ పెళ్లి? వీటివల్ల ఎవరు సుఖపడుతున్నారు? తల్లి తండ్రిని వదులుకుని పరాయి దేశంలో ఇలా బతకాలా?
రోజా ఏడుపు గట్టిగా వినిపించింది. గదిలో ఉయ్యాల దగ్గరికి వచ్చి ఎత్తుకుంటుంటే అనిపించింది ఈ గులాబీరంగు పిల్ల భవిష్యత్తు ఏమిటి? మతం పట్టుకుని పీడిస్తుందా? భిన్న సంప్రదాయాలు ఎలా అర్థం చేసుకుంటుంది?
ఒళ్ళో పడుకోపెట్టుకుని పాలు పడుతుంటే మెడలో తాయెత్తు, నేను తెచ్చిన ఆంజనేయస్వామి బొమ్మ లాకెట్టు నల్లతాడులో కనిపించాయి. ఇప్పటినుంచే రెండు మతాల బరువు ఈ పిల్ల మెడలో! దిగులుగా అనిపించింది.
అమెరికాకి రాకముందు మూడేళ్ళగా మాట్లాడని కామూ ఫోన్ చేసింది. తను తల్లి కాబోతున్నానని, రజాక్ వాళ్ళ నాన్నగారికి బాగోలేదని, రజాక్ వాళ్ల అమ్మగారు రాలేకపోతున్నారు, నన్ను డెలివరీకి రమ్మంటూ బతిమాలింది. కదిలిపోయాను. మూడేళ్లు ఎదురుచూసాను ఒక్క ఫోన్ కోసం! ఆరోజు గంటలు తరబడి సాగిన సంభాషణలో కోపం, దుఃఖం, ఎదురుచూపు, ఆవేదన అన్నీకరిగి నీరై ప్రవహించాయి.
ఏమైనాసరే వెళ్ళాలి అనుకున్నాను. కాదు, గట్టిగా నిశ్చయించుకున్నాను. ఆరోజు నుంచి ఫ్లైట్ ఎక్కేదాకా ఎవరి ముఖంలో ఆనందంలేదు. పాస్‌పోర్ట్ తెచ్చుకోవడం దగ్గరనుంచి అంతా ఒక్కదాన్నే చేసుకున్నాను. ఎయిర్‌పోర్టుకి కొడుకు శివ వచ్చి దిగపెట్టాడు. కారులో కానీ, ఎయిర్‌పోర్ట్‌లో కానీ ఒక్కమాట మాట్లాడలేదు. కొంచెం దిగులనిపించింది. మతం ముందు రక్తసంబధం కూడా తెగిపోయిందా? ఒక్కమాట, చెల్లెలు హాయిగా ప్రసవించాలని అనడం కానీ, చెల్లెల్ని చూసాక ఎలా ఉందో ఫోన్ చెయ్యి అనాలని కానీ అనిపించలేదా? మరీ ఇంత మూర్ఖత్వమా! బాగా చదువుకున్నాడు. ‘చదువు వేరు, సంస్కారం, మానవత్వం వేరు! అన్నీ ఉపన్యాసాలకే బాగుంటాయి. ఆచరణలోకి వస్తే ఇదిగో ఇలాగే ఉంటారు’ అనుకున్నాను కోపంగా.
మనసులోని బాధని అదుపులో పెట్టుకుని మొదటిసారి అమెరికాకి ఒంటరిగా ప్రయాణం చేసాను. ఇక్కడికి వచ్చాక కామూని రజాక్‌ని చూసాక దిగులు తగ్గింది. కామూ ఎంచుకున్నరజాక్ దాన్ని అర్థం చేసుకున్నాడు, దానికి తోడుగా ఉన్నాడు అన్ని విషయాల్లో. ఇది చాలనిపించింది. అందుకే మూడేళ్లు పాటు మమ్మల్ని మరచిపోయిందేమో! అలా అంటే కన్నీళ్లు పెట్టుకుంటుంది.
“మరచిపోలేదు, నాన్నగారు అన్న సంగతి తెలుసు. తెలిసి చేసిన పనికి ఫలితం ఇలాగే ఉంటుంది అనుకున్నాను. అసలు నువ్వు వస్తావని అనుకోలేదు అమ్మా! నువ్వు వచ్చేదాకా నమ్మకం లేదు. నిన్ను చూసి ఇద్దరం ఎంత ఆనందపడ్డామో తెలుసా, అది వర్ణించలేనిది! దీనికి అంతా కారణం మా రోజా! అదృష్టవంతురాలు,” అంటుంది దాన్ని బుగ్గల మీద ముద్దులు పెట్టుకుంటూ.
“తల్లి ప్రేమ అంటే ఇదేరా!” అన్నాను కామూతో మురిపెంగా చూస్తూ…
ఎవరో తలుపు కొట్టినట్లు అయ్యింది. కామూ, రజాక్ వచ్చే టైమ్ కాదు. ఎవరా అనుకుంటూ వెళ్ళాను. మళ్లీ మరోసారి కొట్టారు. తలుపు కీ హోల్లోనుంచి చూస్తే ఎదురింటి వాళ్ళ అత్తగారు. తలుపు తీసాను.
“మీతో చిన్న పని ఉంది,” అన్నారు ఆవిడ కొద్దిగా మొహమాటపడుతూ. ఆవిడని ఒక్కసారి చూసాను. అందరం గుడికి వెళుతుంటే, కారు పార్కింగ్‌లో వాళ్ళు కనబడితే కామూ చెప్పింది,
“మన ఎదురిల్లే! వాళ్ళ అబ్బాయి గుడి పూజారి. వాళ్ళ కోడలు మాత్రం ఉద్యోగం చేస్తోంది,” అంది.
“లోపలికి రండి!” అన్నాను.
వచ్చి కూర్చోకుండా “పాలబాటిల్ ఏమైనా ఎగస్ట్రా ఉందా?” అడిగారు ఆవిడ. ముందు అర్థం కాలేదు.
“పోతపాలు కదండి మనవరాలికి,” అన్నాను.
“తెలుసు. మాకోడలు, మీ అమ్మాయి ఇంచుమించు ఒక వారం తేడాలో పిల్లల్ని కన్నారు. అందుకే ఊహించాను. మాకోడలు కూడా ఆఫీస్‌కి వెళ్లేముందు పాలు పంప్ చేసి ఫ్రిడ్జ్‌లో పెడుతుంది. కానీ నిన్న ఎందుకో బాటిల్ స్టాక్ పెట్టలేదు. మరచిపోయిందో ఏమో! ఇందాకల చూసుకుంటే ఒక్క బాటిలే ఉంది. ఇంకో అరగంటలో వచ్చేస్తుంది కానీ పిల్లవాడి పాల టైమ్ అయ్యింది. లేచాడంటే గోల పెడతాడు. ఆ ఆఖరి బాటిల్ నా చెయ్యి నుంచి జారి పడిపోయింది. వాడు లేచే టైమ్ అయ్యింది. ప్లీజ్! సహాయం చేయరా? కోడలు అర్థం చేసుకోదు. పోనీ మాములు పాలు పడితే రేపొద్దున ఏమైనా అయితే ఇక్కడ డాక్టర్ల సంగతి మీకు తెలిసే ఉంటుంది. ఒక పట్టాన అప్పాయింట్మెంట్ దొరకదు. పెద్ద గొడవ అయిపోతుంది. ఒక్క బాటిల్ ఉంటే ఇవ్వరూ?” ప్రాధేయపడింది ఆవిడ. కళ్ళలో భయం, కంగారు కనిపించాయి.
ఏమైతే అదే అయ్యిందని ఫ్రిడ్జ్‌లోంచి ఒక బాటిల్ తీసి ఇచ్చాను. “చాలా థాంక్స్, నా పరువు కాపాడారు,” అంది.
“దానిదేముందిలెండి! పరాయిదేశంలో మనకి మనం తోడు ఉండాలి,” అన్నాను.
“మీ కోడలు, మా అమ్మాయి స్నేహితులా?” అడిగాను తలుపు దగ్గరగా వెళుతున్న ఆవిడని.
“కాదు, మా అబ్బాయి ఒప్పుకోడు. మీ అల్లుడు ముస్లిమ్ కదా!” అన్నారు ఆవిడ వాళ్ళ ఇంటి తలుపు తీస్తూ!
“మరి ఈ పాలు?” అన్నాను అయోమయంగా!
“మీరు బ్రాహ్మలే కదా!” అన్నారు నవ్వుతూ. ఇంతలో పిల్లవాడి ఏడుపు వినిపించింది. ఆవిడ వెళ్ళిపోయింది.
ముఖంమీద కొట్టినట్లు అయ్యింది. తలుపు వేసి కుర్చీలో కూలబడిపోయాను. ఆవిడ మాటలు నా చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి.
చాలాకాలం నేను, నా భర్త కూడా నా కూతురు చేసిన పనికి దాన్ని వెలేసాము. కానీ కన్న మమకారం అన్నీ మర్చిపోయి, దగ్గరకు చేర్చింది. మమకారమే లేకుంటే నేనూ ఇలాగే ఆలోచించేదాన్నా!
కావచ్చు. ఎంతైనా మూలాలు అవే ఉంటాయి. తరతరాలుగా జీర్ణించుకున్న కొన్ని అభిప్రాయాలు, నమ్మకాలు వదులుకోడం కష్టమే. వదులుకోడానికి తగిన అనుకూల వాతావరణం ఉండాలి, అవతలివారు కూడా తమని సమర్థించే విధంగా మసలుకోవాలి.
ఎంత అభివృద్ధి చెందిన దేశం అయినా, మానసిక, శారీరక, వ్యక్తిగత అభివృద్ధి కాదు కదా… దేశాభివృద్ధి కలిగిన ఈ దేశంలో జీవించినా మతపరమైన, జాతిపరమైన భావజాలం పోదు. అది సమంజసమో, అసమంజసమో కలిసి కాపురం చేస్తున్న కామూకి, రజాక్‌కి అలాంటి దంపతులకి మాత్రమే తెలియాలి. మూడో వ్యక్తి ఎవరు జడ్జ్ చేయడానికి?
కాలింగ్ బెల్ మోగడంతో ఆలోచనల నుంచి తెప్పరిల్లి టైమ్ చూసాను. కామూ వచ్చినట్టుంది. పాలసీసా సంగతి ఎలా చెప్పాలో, ఏమని చెప్పాలో రిహార్సల్స్ వేసుకుంటూ డోర్ తీయడానికి వెళ్లాను.
Very nice story, many stories of this nature is needed for a change in our outlook, thanks 🙏