లక్ష్మమ్మ ఆత్మహత్యాప్రయత్నం చేసింది. ఈ సంగతి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆమెకంత బాధ ఏమొచ్చిందో ఎవరికీ అంతుపట్టలేదు. ఆమె బంధుగణమంతా హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ చుట్టుపక్కలే ఉన్నారు. లక్ష్మమ్మ పుట్టి పెరిగిందీ, మెట్టిందీ ఆ ప్రాంతంలోనే. ఆసుపత్రికి చాలా మంది చుట్టాలూ, స్నేహితులూ వచ్చి చూసి వెళ్లారు. కారణం ఏదైనా కానీ ఇప్పుడైతే ప్రమాదం నుండి బైట పడి ఆరోగ్యంగా ఉంది కదా అనుకుని ఎవరూ కారణం గుచ్చి గుచ్చి అడగలేదు, తర్వాత అడగచ్చులే అన్నట్టుగా.
కొడుకు నరహరిని తల్లి ఇలా చేసినందుకు బాధ, తనవల్ల ఏ తప్పు జరిగిందో అన్న అవమానం కలగలిసి కలత పెట్టాయి. కోడలు ఇందిరది కూడా ఇదే పరిస్థితి.
మూడోరోజు లక్ష్మమ్మ హాస్పిటల్నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. ఆమెకి కూడా మొహం చెల్లకుండా ఉంది. నిజానికి తనకి ఉరి పెట్టుకుని చనిపోవాల్సినంత కష్టమేమీ లేదన్న విషయం ఆమెకీ తెలుసు. ఎందుకిలా చేసావని కొడుకు గాని, కోడలు కానీ అడిగితే ఆమె చెప్పబోయే కారణం ఆ ఇద్దరికీ, ఆ మాటకొస్తే ఎవరికీ నచ్చదని కూడా ఆమెకు తెలుసు. కానీ సున్నిత మనస్కురాలైన లక్ష్మమ్మకి మాత్రం ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదనిపించిన మానసికస్థితిలోనే అంతపని చేసింది.
***
లక్ష్మమ్మ హైస్కూల్ మొహం చూడలేదు. పెద్దలు పదమూడేళ్లకే పెళ్లి చేశారు. భర్త నరసింగరావు కూడా పెద్దగా చదువుకోలేదు. కోఠీ సుల్తాన్ బజార్లో చిన్న మాచింగ్ అండ్ కట్‌పీస్ షాప్ పెట్టుకుని సంసారం నడిపాడు. ఒక్కడే కొడుకైన నరహరిని డిగ్రీ చదివించాడు. బి.యస్సీ కంప్యూటర్స్ చదవడం వల్ల చదువు పూర్తయిన దగ్గరనుండీ నరహరి ఖాళీగా లేకుండా పదివేలలో మొదలయ్యి నాలుగేళ్లలో పాతికవేల వరకూ ఎదిగాడు. ప్రస్తుతం, ఒక ప్రైవేట్ కాలేజీలో ఆన్లైన్ ఫీజు పేమెంట్స్ చూస్తూ సిస్టమ్ అనలిస్ట్‌గా ఉన్నాడు.
నరసింగరావు చదువుకున్న పిల్లని కోడలుగా చేసుకుంటే ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటారన్న ఉద్దేశంతో సంబంధాలు చూడడం మొదలు పెట్టాడు.
ఆయిల్ ఫెడరేషన్ అనే ప్రభుత్వరంగ సంస్థలో అకౌంట్స్ క్లర్క్‌గా పని చేస్తూ గవర్నమెంట్ స్కేల్ తీసుకుంటున్న అమ్మాయి సంబంధం ఒక మ్యారేజ్ బ్యూరో తీసుకొచ్చింది. ఆ పిల్ల హైదరాబాద్‌లో పినతండ్రి ఇంట్లో ఉండి ఉద్యోగం చేస్తున్నది. ఆఫీస్ అమీర్‌పేట్‌లో ఉంది. అమ్మాయి పేరు ఇందిర. బీ.కామ్ చదివింది. తండ్రి స్కూల్ టీచర్. నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ. నరసింగరావుకి ఈ సంబంధం బాగా నచ్చింది.
లక్ష్మమ్మ మాత్రం ససేమిరా వద్దన్నది ఈ సంబంధం. కారణం, ‘ఆంధ్రా అమ్మాయి కాబట్టి వద్దు. ఆంధ్రవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళ ముందు మనం అమాయకులం, చదువులేని వాళ్ళం. వాళ్లంతా మనల్ని గేలిచేస్తారు. చిన్నచూపు చూస్తారు.’ అని ఆవిడ అనుమానం, నమ్మకం. ఈ మాటే భర్తకి మార్చి, మార్చి చెప్పింది. విని, విని నర్సింగరావుకి విసుగొచ్చింది.
“ఆ పిల్లకి పెర్మనెంట్ ఉద్యోగమున్నది. ఇద్దరూ సక్కగా పైసలకిబ్బంది లేకుండా బతుకుతరు.” ఆమె ఆంతర్యం అర్థమయ్యి నచ్చచెప్పబోయాడు.
“గా ఆంధ్ర పోరి దప్పితే నా కొడుక్కీడ పిల్లలే దొర్కరా?” అందామె ఆవేశంగా.
“ఆంధ్రా పిల్లైతే ఏమైతది?” అన్నాడతను.
“అక్కడి జనాలు బతకనేర్సినోళ్ళుంటారు. హుషారుంటరు...”
“అట్లనే ఉండాలి. మంచిదే గదా...” అన్నాడతను.
“నాకిష్టం లేదు. ఆళ్ళకి తెలివితేటలెక్కువుంటయ్యి...”
“ఉంటే, అత్తనూ, మావనూ మందుబెట్టి సంపుతరా?” అసహనంగా అన్నాడతను.
“అట్లని గాదు గానీ, ఎందుకు అంత దూరం? ఇక్కడోళ్లనే చూసుకుంటే పోతది గదా అని” అంది తగ్గుతూ లక్ష్మమ్మ.
“చూస్తున్నవు గదా! మస్తు సంబంధాలు చూసినం. చదువుకున్న ఆడపిల్లలంతా ఫారిన్ సంబంధాలే ఇష్టపడుతున్నరు. ఆడపిల్లలు లేరు పొమ్మంటున్నారు బ్యూరోలు నడిపేటోళ్లు. ఈ సంబంధం మనకి అదృష్టం కొద్దీ దొరికింది. తండ్రి టీచరు. ఇద్దరే బిడ్డలు. ఈ పిల్ల చిన్నది. పెద్ద కూతురూ, అల్లుడూ కూడా ఉద్యోగమే. ఉద్యోగస్తులంటే ఒక లెక్కుంటరు. ఆళ్ళకి మనకి మల్లే భయాలూ, అనుమానాలూ ఉండయ్యి. ఎప్పుడూ సుఖంగా, సంతోషంగుంటరు. నా మాటిను.” అని అనునయించాడు భార్యని.
“కాకినాడంటే చానా దూరం కదా. రానూ పోనూ కష్టం కాదా?” అడిగింది.
“దినదినాము పోతరా ఏంది?” అన్న భర్త మాటకి సమాధానం చెప్పలేక ఊరుకుంది లక్ష్మమ్మ.
నరహరి, నర్సింగరావు పినతండ్రి ఇంట్లో ఉన్న ఇందిరను సికింద్రాబాద్ పోయి చూసొచ్చారు. ఇద్దరికీ పిల్ల నచ్చింది.
“ఆ రాష్ట్రం పిల్ల ఈడెట్ల పని చేస్తది? అంతా ఎల్లిపోవాలి కద” అంది ఆఖరి అస్త్రంగా లక్ష్మమ్మ.
“భర్త ఈడుంటే ఈడ్నే ఆమె కొలువుంటది” అన్న భర్త మాటకి మరేమీ అనలేక పెళ్ళికి తలూపిందామె.
ఆమె మనసులోని బాధకు ఆమెకు కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి. నరసింగరావూ, లక్ష్మమ్మా చాదర్‌ఘాట్‌లో నివాసం ఉండేవారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగిన సందర్భంలో లక్ష్మమ్మ చాదర్‌ఘాట్ చుట్టు పక్కల జరిగే అనేక మీటింగులకు ఆడవాళ్లతో కలిసి వెళుతుండేది. ఆ నాయకుల ఉపన్యాసాలు ఆమెపై చాలా ప్రభావం చూపాయి. అవి వింటుంటే ఆమె రక్తం మరిగేది. ఆంధ్రావాళ్ళందరూ దొంగలు. అతి తెలివిగల వాళ్ళు. ఇక్కడి కొచ్చి మన ఉద్యోగాలు, స్థలాలు, అవకాశాలు అన్నీ కొల్లగొట్టి వాళ్ళు తీసేసుకున్నారనీ అందువల్లనే తెలంగాణాలో బాగా చదువుకున్న వాళ్లంతా దేశాలు పట్టి పోవలసిన అగత్యం ఏర్పడిందనీ విన్నది. వాళ్లకి డబ్బూ, అధికారం ఉండడం వల్ల ఇక్కడి వాళ్లందరికీ అన్యాయం చేసి తెలంగాణా వాటా ఉద్యోగాలు కూడా కొట్టేశారనీ విన్నది. ఇక్కడి కొచ్చి బిజినెస్ చేసినవారంతా పైకెదిగి పోయారని కూడా విన్నది. అన్నీ విన్నాక ఆమెలో ఒక ఉత్తేజం పొంగింది. మీటింగ్‌లో ముందుగా ఆడవాళ్లు పాడే పాటలు కూడా నేర్చుకుంది. గ్రూప్‌తో కలిసి స్టేజి ఎక్కి ‘పోరు తెలంగాణ’ పాటలు పాడేది. ‘జాగో, భాగో’ అనే కోరస్‌కి గొంతు కలిపి స్లోగన్లిచ్చేది.
ఆమెలో ప్రత్యేకరాష్ట్రం కోసం ఎంత కష్టమైనా పడదాం, పోరాడదాం అనే స్ఫూర్తి కలిగింది. ఉద్యమం ఇంకా తీవ్రంగా నడవాలని కోరుకుంది. ‘మనకి ప్రత్యేకరాష్ట్రం రావాల్సిందే. ఆంధ్రా వాళ్ళని వెళ్లగొట్టాల్సిందే. అప్పుడు అంతా మనోళ్లే ఉంటారు. మనమంతా బాగుపడతాం. మన తోటివాళ్ల కష్టాలన్నిటికీ వాళ్ళే కారణం’ అన్న భావం ఆమెలో బలంగా నాటుకుంది.
అప్పుడప్పుడూ ఆమె ఇంట్లో కూడా ఆ ఆవేశం కనబరిచేది. అది చూసిన భర్త నరసింగరావు ఆమెని కోప్పడేవాడు. “నీలాంటోళ్ళనే దేడ్ దిమాక్ గాళ్ళంటారు. రాజకీయ మీటింగ్‌ల మాటలన్నీ నిజమనుకున్నవా? ఆ ఇస్పీచ్లిచ్చెటోళ్లకు ఆంధ్రాలో బంధువులుంటారు, పొలాలుంటయ్యి పిచ్చిదానా! నిన్నటిదాకా ఆంధ్రోళ్ళకి గూడా అరవయ్యేళ్ళ సందీ అయిదరాబాదే రాజధాని. జనం మన ఆదిలాబాద్, నిజామాబాద్‌ల కెల్లి ఎట్లొస్తరో అట్లనే ఆంధ్రా వాళ్ళొచ్చిన్రు. ఆళ్లంతా బ్రిటిషోళ్ళ కాలంనుండీ వాళ్లతో కలిసి పనిచేసి మనకంటే బాగా చదువుకున్నోళ్ళు. ఉద్యోగాలు తెచ్చుకున్నరు. పొలాలున్నై, డబ్బులున్నయ్, అవి దెచ్చి పెట్టుబళ్ళు పెట్టినారు, సంపాదిచ్చుకున్నారు. మనుషులందరికీ స్వార్థం ఉంటది. అవకాశం ఉన్నోడు ఏ రాష్ట్రపోడైనా దోచుకుంటాడు. ఇన్నేళ్లసందీ ఇక్కడోళ్ళంతా ఆళ్లతో కలిసి అధికారం అనుభవించలేదా? మనోళ్ళలో మన్ని దోచుకున్నోళ్ళు లేరనుకుంటున్నవా? ఐనా నీకెందుకే రాజకీయాలు? ఇంట్లుండేదానికి, గమ్మునుండు! ఎక్వ మాట్లాడకు. హోషియారీ చానయ్యింది నీకు” అనడంతో ఊరుకునేది లక్ష్మమ్మ.
మనసులో మాత్రం ప్రత్యేక రాష్ట్రం రావాలని దేవుళ్ళకి దణ్ణాలు పెట్టుకునేది. రాష్ట్రాలు విడిపోయాక ఆమె చాలా ఆనందపడింది. అయితే ఆమెలో ఆంధ్రాద్వేషం మాత్రం అలాగే ఉండిపోయింది. అంచేతే ఈ కాకినాడ సంబంధం వద్దన్నది. ఆమెకి అయిష్టంగా ఉన్నా ఆంధ్రా అమ్మాయి ఇందిర, లక్ష్మమ్మకి కోడలైపోయింది. కాపురానికి కూడా వచ్చింది. ఇందిర మంచిపిల్ల కావడంతో లక్ష్మమ్మకున్న భయాలూ, శంకలూ తొలగిపోయాయి. అత్తాకోడలూ కలిసిపోయారు. నరసింగరావు ఆనందపడ్డాడు. నరహరీ, ఇందిరా ఉద్యోగాలు ప్రశాంతంగా చేసుకుంటున్నారు. ఇంతలో నరసింగరావుకి ఒకరోజు షాపులో ఉండగానే హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్‌కి తీసుకువెళ్లే దారిలోనే ప్రాణం పోయింది. లక్ష్మమ్మ చాలా దుఃఖంలో పడిపోయింది. ఆమెనంతా ఓదార్చారు. “నీకేం బాధ్యత పెట్టకుండా కొడుకు పెండ్లి జేసి పోయిండా పెద్దమనిషి. నీ బాధ నీకు తప్పదు గానీ ఊకే మనాది వెట్టుకోకు. మంచి కొడుకు, మంచి కోడలున్నరు నీకు” అని చెప్పి పోయారామె బంధుమిత్రులు. ఒక సంవత్సరం గడిచిపోయింది.
ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగులని విడదీసి వాళ్ళని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి పంపే కార్యక్రమం మొదలయ్యింది. షీలా భిడే (Sheela Bhide) కమిటీ ఉద్యోగుల విభజనపై కసరత్తు చేసింది. ఇందిర పనిచేసే ఆయిల్ ఫెడరేషన్ సంస్థ ఉద్యోగులను పుట్టిన స్థలం, చదువుకున్న ప్రాంతాన్ని బట్టి రెండు రాష్ట్రాల ఉద్యోగులను విభజించింది. ఇందిరను ఆంధ్ర ప్రదేశ్‌కి కేటాయించారు. ‘నా భర్త తెలంగాణా. పైగా అతని ఉద్యోగం ఇక్కడే ఉంది’ అని ఎండీకి విన్నవిస్తూ లెటర్ ఇచ్చింది ఇందిర. ఇంకా ఉద్యోగుల విభజన పూర్తి కాలేదనీ, ఆమె అభ్యర్థనను పరిశీలిస్తామనీ, ప్రస్తుతానికి ఆంధ్రకి తక్కువ ఉద్యోగులున్నారు కాబట్టి, ఇందిరని ఆంధ్రాకి వెళ్ళమనీ ఆదేశాలొచ్చాయి. చేసేదేం లేక ఇందిర బయలుదేరవలసి వచ్చింది.
భర్త నరహరిని తీసుకుని ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో, హైదరాబాద్‌నుంచి విడిపోయి వచ్చి కొత్తగా ఆంధ్రలో పెట్టిన ఆయిల్ ఫెడరేషన్ వాళ్ళ హెడ్ ఆఫీసుకి వెళ్లి జాయిన్ అయ్యింది ఇందిర. తోటి సహోద్యోగులు మరో ఇద్దరితో కలిసి ఒక పోర్షన్ అద్దెకి తీసుకుని శనాదివారాల్లో హైదరాబాద్‌కి పోయి వస్తూ ఉంది. అందుకు చాలా శ్రమా, ఖర్చూ కూడా అవుతోందామెకి. విభజన మీటింగులు జరుగుతున్నాయి కానీ కొన్ని చిక్కుముళ్ళు ఉండడంతో ఏదీ తేలడం లేదు. సంవత్సరం గిర్రున తిరిగింది. పరిస్థితిలో మార్పు లేదు.
ఇందిర విసుగు, విరామం లేకుండా రిప్రెజెంటేషన్స్ ఇస్తూనే ఉంది. ఆమె ఇబ్బంది అర్థమైన వాళ్ళ ఎండీ ఆమెను పిలిచి “మీరిన్నిసార్లు అడుగుతున్నారు కాబట్టి ఒక సలహా ఇస్తాను. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు తక్కువున్నారు. మీ భార్యాభర్తలిద్దరూ ఇక్కడే ఉండండి. మీరు యువజంట, ఎక్కడైనా సెటిల్ కావచ్చు. మీ భర్త ఎలాగూ ప్రైవేట్‌లోనే పని చేస్తున్నారు కనుక అతనికి మన సంస్థలో నేనొక కాంట్రాక్టు ఉద్యోగం ఇచ్చే సహాయం మాత్రం చెయ్యగలను. లేదంటే ఉద్యోగుల పూర్తి విభజన అయ్యేవరకూ ఎదురు చూడండి. మీ ఇష్టం” అని తేల్చేసాడు.
నరహరీ, ఇందిరా బాగా ఆలోచించుకున్నారు. ఇంకా ఎన్నాళ్ళు ఎదురుచూడాలో తెలీదు. ఇందిర రిక్వెస్ట్ ప్రకారం ఆమెకి తెలంగాణలో ఎలాట్మెంట్ ఇస్తారన్న గ్యారంటీ లేదు. పిల్లల్ని కూడా ప్లాన్ చేసుకోవాలి. అంచేత ప్రస్తుతపు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, నరహరి ఆంధ్రాకే వెళ్లిపోవడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రెండ్స్ కూడా అదే మంచిదన్నారు.
ఈ సంగతి తల్లికి చెప్పాడు నరహరి. “అమ్మా! ఇందిర ఇక్కడికి వచ్చేవిషయం ఇంకా తేలలేదు. ఇంకెన్నాళ్లు పడుతుందో తెలీదు. నాకిష్టమైతే వాళ్ళాఫీస్లో నాక్కూడా ఉద్యోగం ఇస్తామన్నారు. మనం ఆంధ్రాకి పోవడమే మంచిదనిపిస్తున్నది” అంటూ. అది విన్న లక్ష్మమ్మ గుండె గుభేల్మంది.
ఆమెకీ విషయం అర్థం కావట్లేదు. కోడలు వారం, వారం అటూ ఇటూ తిరుగుతూ ఇబ్బంది పడుతోందని తెలుసు. కొన్నాళ్ళకి ఇక్కడికే వస్తుందని ఎదురుచూస్తోంటే కొడుకు ఇలాంటి కబురు చెప్పాడేంటీ అని గాభరా పడింది. “తప్పదంటావారా?” అంది బేలగా.
“తప్పదు గనుకనే పోదామంటున్నా! ఏమైతది అక్కడికి బోతే? వీలైనప్పుడు మనోళ్ళని వచ్చి చూసి పోతా ఉందాం” అన్నాడు కొడుకు.
ఈ సంగతి బంధువులకి చెప్పింది లక్ష్మమ్మ. “కొలువన్నాక తప్పదు కదా! ఇద్దరొక్క చోటైతే నిమ్మళం. ఎన్నాళ్ళు తిరుగుతది నీ కోడలు? ఎల్లిపోడమే మేలు. అప్పుడప్పుడొచ్చిపో! నిన్ను చూడనీకొచ్చి మేం గూడ బెజవాడ కనకదుర్గమ్మ కొండ చూసుకుంటంలే” అన్నారు వాళ్ళు. లక్ష్మమ్మకి వెళ్లే తేదీ దగ్గర పడుతుంటే రోజురోజుకూ దిగులు ఎక్కువవుతోంది. భర్త పోవడం, ఆపై ఇలా కొడుకూ, కోడలూ తనని తీసుకుని హైదరాబాద్ వదిలి ఆంధ్రప్రదేశ్‌కి పోవడానికి సిద్ధమవడం ఆమెను మరీ బాధకు గురి చేస్తున్నాయి.
ఓరోజు రాత్రి నిద్రపట్టక అటూ ఇటూ పొర్లుతూ ఉండగా లక్ష్మమ్మకి వైజాగ్ రమణమ్మ గుర్తొచ్చింది. ఆమె లక్ష్మమ్మ పక్కింట్లో ఉండేది. నీళ్లట్యాంక్ దగ్గర అందర్నీ తోసేసి నీళ్లు పట్టుకునేది రమణమ్మ. గట్టిగట్టిగా వాదనలు చేసేది. ఆమెతో మాటల్లో ఎవరూ గెలవలేకపోయేవారు. ఆ కోపంతో లక్ష్మమ్మ మిత్రులు ఆమెను, “రాష్ట్రాలు ఇడిపోయినాయి. ఇంకెందుకున్నవీడ? పో! మీ వొయిజాక్కి” అని వెక్కిరించారు. ఏమైందో ఏమో, ఆమె నిజంగానే వెళ్ళిపోయింది. పోతూ, పోతూ “మీరెవరూ మా ఆంధ్రాకి ఎప్పటికీ రాకుండా ఉంటారా?” అని అందర్నీ నిలదీసింది.
“సావనైనా సస్తం గానీ, మేం మీ జగాకి రాము నీ లెక్క!” అంటూ అంతా ముక్తకంఠంతో చెప్పడంతో మారుమాట్లాడకుండా వెళ్ళిపోయింది రమణమ్మ. ‘పోతా, పోతా నాకు శాపం పెట్టి పోయినట్టుందా మహాతల్లి. గాడికే పోవాల్సొస్తున్నది.’ అనుకుంది దిగులుగా లక్ష్మమ్మ.
‘గిప్పుడా ఆంధ్రాలో కొడుకూ, కోడలూ ఆఫీసులకి పోయినంక ఇరుగమ్మ, పొరుగమ్మ ‘తెలంగాణానుండొచ్చినావా? మమ్మలందర్నీ ఎల్లగొట్టి నువ్వెందుకొచ్చావిక్కడికి? సిగ్గు,శరం లేదా?’ అంటే ఏంజెయ్యాలె? అందుకే ఈడ్నే సస్తే, ఈడ్నే బొంద బెడ్తరు. పీడా పోతది. ఆ బాధకన్నా ఇదే సుకం’ అని మనసులో అనుకుని ఆరోజు ఆత్మహత్యా ప్రయత్నం చేసింది లక్ష్మమ్మ.
***
విషయం అంతా లక్ష్మమ్మ వివరించాక, కొడుకూ, కోడలూ నవ్వుకుని ఊపిరి పీల్చుకున్నారు. దగ్గరి బంధువులంతా ఈ మాటవిని “పాగల్దానివా, ఏమి? ఎందుకంటరెవరైనా? నీ కొడుక్కాడ కొలువైంది. ఆయనెంబడి పోతున్నవు. తప్పేమున్నది?” అని కేకలేశారు.
హైదరాబాద్‌లో ఇల్లు ఖాళీ చేసి ఇందిర ఆఫీస్‌కి దగ్గరగా మంగళగిరిలో ఒక ఇంట్లో ఒక పోర్షన్ తీసుకుని నరహరి మకాం ఆంధ్రప్రదేశ్‌కి మార్చాడు. మాటిచ్చినట్టుగానే ఇందిర ఆఫీస్‌లో నరహరికి జాబ్ ఇచ్చారు. ఇందిరకి చాలా సంతోషంగా అనిపించింది. అమ్మయ్య, పెద్ద సమస్య తీరిపోయిందని ఊపిరి పీల్చుకుంది. కాకినాడలో ఉండే ఆమె తల్లిదండ్రులు కూడా కూతురు తమకి కాస్త దగ్గరగా వచ్చిందని ఆనందపడ్డారు.
లక్ష్మమ్మ మెల్లిగా కొత్త వాతావరణానికి అలవాటు పడుతోంది. కాస్త వేడిగా, చెమటలుగా, చెమటలుగా ఉంటుందిక్కడ అనుకుంది. కొడుకూ, కోడలూ వెళ్ళిపోయాక లక్ష్మమ్మ దగ్గరకి చుట్టుపక్కల వాళ్ళూ, పక్కపోర్షన్ల వాళ్ళూ వచ్చి ఆరా తీశారు. ఆమె అన్ని విషయాలూ వాళ్ళకి వివరంగా చెప్పింది.
“మావోళ్లంతా చదువులు పూర్తి చేసుకుని హైదరాబాద్ పరుగులు తీశారు. మీరిలా వచ్చారు, బావుంది” అన్నారు వాళ్ళు. మొదట్లో లక్ష్మమ్మ స్వచ్ఛమైన తెలంగాణా భాష వాళ్ళకర్థం కాక బిత్తర పోయారు. లక్ష్మమ్మదీ అదే పరిస్థితి. కాస్త కష్టపడి వాళ్ళ తెలుగును అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది. అందరికీ అర్థమయ్యేలా క్రమంగా తన మాటలు కూడా మార్చుకుంది. లక్ష్మమ్మ తనకు తెలిసిన తెలంగాణా వంటలు అక్కడి వాళ్లకు నేర్పించడంతో అందరికీ ఆమె మీద ప్రత్యేక అభిమానం ఏర్పడింది. ఖాళీసమయాల్లో ఆమెను ఎవరో ఒకరింటికి పిల్చుకెళ్లి అంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఆమెతో తెలంగాణ వంటలు చేయించి, చూసి నేర్చుకుంటున్నారు. వాళ్ళ వంటలు ఆమెకి రుచి చూపిస్తున్నారు.
మంగళగిరి వాళ్ళ స్నేహస్వభావం, లక్ష్మమ్మ మెత్తని మనసూ కల్సి ఆమెకి త్వరలోనే అందరితో సులువుగా మనగలిగే వీలు చిక్కింది. అందరితో కలిసి వాకింగ్‌కి వెళ్లడం, రైతుబజార్కెళ్ళి కూరలు తెచ్చుకోవడం మొదలు పెట్టింది. నరహరి త్వరలోనే ఇందిర ఆఫీసులో మంచి కంప్యూటర్ అనలిస్ట్‌గా పేరుతెచ్చుకుని అందరికీ తలలో నాలికయ్యాడు. ఎండీ గారికి వీడియో కాన్ఫరెన్స్, ఇతర ఆన్లైన్ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు.
ఇంటికి కావలసినవి ఒకటొకటి సమకూర్చుకోవడంలో నెలరోజులు ఇట్టే గడిచిపోయాయి. ఒక ఆదివారం సాయంత్రం ముగ్గురూ లక్ష్మమ్మ చేసిన సకినాలు తింటూ హాల్లో కూర్చున్నారు. తల్లి వైపు చూస్తూ, “ఎట్లున్నదమ్మ ఈడ?” అడిగాడు నరహరి.
“నేనూకే బయపడిన గానీ అంతా మంచోల్లేరా! ఈడకెందుకొచ్చినవని నన్నొక్కరొక్క మాటన్లే. నేనే పిచ్చిగా ఆలోచన చేసి ఇక్కడోళ్ల మీద కోపం పెంచుకున్న. మస్తు దిట్టినా! నేను చేసింది శానా తప్పు. అట్ల జేసి ఆంధ్రాకెట్ల రావాలె అని అంత ఆగమయినా!” అంది లక్ష్మమ్మ సంజాయిషీ చూపుల్తో కొడుకును చూస్తూ.
తల్లివైపు సాదరంగా చూస్తూ “అమ్మా! అంత పెద్ద రాష్ట్ర విభజన సంఘటనలో ఎన్నో కోణాలుంటయి. మలుపులుంటయి. కీలక విషయాలుంటయి. చారిత్రక సంగతులుంటయి. కొంత రాజకీయముంటది. వాటిల్లో నీ తెలివెంత? నీకర్థమయినదెంత? పదోవంతుంటది” నవ్వుతూ అన్నాడు నరహరి.
“సత్యం జెప్పినవ్ బిడ్డా! మీ నాయన గూడా అట్లనే అనేటోడు.” చిరునవ్వుతో అందామె.
“అమ్మా! నీకు తెలుసా? దేశంలో ఉండే ప్రజలందరికీ ఎవరైనా, ఎక్కడైనా బతికే హక్కుంటదమ్మా! ఎందుకున్నవని ఎవరూ అడగడానికి వీల్లేదు. ఎవరెక్కడికి పోయినా జీవనోపాధికే పోతారు.” అన్నాడతను.
“దాన్నేకదా మరి బతుకుతెరువంటరు!” అంది లక్ష్మమ్మ అర్థమయిందన్నట్టు.
“మనందరం, మనల్ని మనమే పాలించుకోవాలి, మనకి ప్రత్యేకరాష్ట్రం కావాలని సత్యంగా కోరుకున్నాం. న్యాయంగా పోరాడినం. మన రాష్ట్రం మనం సాధించుకున్నాం. చిత్రం చూడు. నువ్వూ, నేనూ పక్క రాష్ట్రం పోవాల్సొచ్చింది. జీవితం అట్లుంటదమ్మా!” అని నవ్వాడు నరహరి.
అవునన్నట్టు చిరునవ్వు నవ్వింది లక్ష్మమ్మ. ఇందిర టీ తెచ్చింది. ముగ్గురూ తాగారు.
ఇంతలో “లక్ష్మమ్మగారూ రండి! రండి! గుళ్లో ప్రవచనానికి టైమవుతోంది” గట్టిగా అంటున్న ఒకావిడ మాట వినబడింది. ముగ్గురు ఆడవాళ్లు వాకిట్లో బంతిపూల చెట్ల దగ్గర నిలబడున్నారు.
“మొన్న మా ఇంట్లో పాడిన దుర్గమ్మ పాట ఇవాళ పాడాలక్కడ మీరు!” ఇంకొకావిడ అంటోంది.
“ఆ పాట మాకెవరికీ తెలీదసలు” మరో గొంతు.
సిద్ధంగా ఉన్న లక్ష్మమ్మ “వస్తున్నానండీ!” అంటూ కుర్చీలోంచి లేచింది. ఆమె, తన పైటను సర్దుతున్న కోడలిని చూసి చిన్న గొంతుతో, “మీ ఆంధ్రోళ్లు నన్నెట్ల కలిపేసుకున్నరో జూసినవా!” అంది మురిపెంగా.
“మీది స్నేహాలు చేసే మంచిమనసు కాబట్టి!” అంది ఇందిర వంగి ఆమె చీర కుచ్చెళ్ళు సరిచేస్తూ. కోడలి వీపుమీద చిన్న దెబ్బ వేసి, “నాదేమున్నదే! ఆళ్ళ ప్రేమ వల్లనే నేనిక్కడ సుకంగ, సంతోషంగున్న” అంది.
ఇందిర నవ్వి, “వాళ్లంతా చూస్తున్నారు మీ కోసం” అంది.
“పోతున్న! నువ్వే చీర సదిరి లేట్ జేస్తున్నవ్ పిల్లా!” అంటూ నవ్వుతూ పర్సు తీసుకుని, చెప్పులేసుకుని, ఇంట్లోంచి బైటికి నడిచి, అందరితో కలిసి కబుర్లు చెబుతూ బయలుదేరింది లక్ష్మమ్మ.
వాళ్ళను చూస్తూ నిలబడ్డ నరహరికి, తల్లి కొత్తమట్టిలో చక్కగా కుదురుకుని, ఏపుగా ఎదిగి, పూలు పూస్తున్న మల్లెమొక్కలా తోచింది.