Menu Close
లేఖిని - కథా లోగిలి - 3
సేకరణ, కూర్పు - అత్తలూరి విజయలక్ష్మి
బోగన్విలియా
-- డా॥ అమృతలత --

ఏమీ తోచనప్పుడు అద్దాల కిటికీలోంచి రోడ్డు మీద వచ్చేపోయే జనాలని చూడటం నాకు అలవాటు... దారెమ్మట పోయేవాళ్ళు ఈ అద్దాలమేడ వంక ఒక్కసారైనా తమ చూపు తిప్పి చూడకుండా వెళ్ళడం నేను చూడలేదు!

అఫ్‌కోర్స్‌... ఎవరికైనా వారికి లేనిదాని మీద మనసు పారేసుకోవడం సహజం! కానీ ఒకసారి అది హస్తగతమైతే దాని మీదున్న మోజు క్రమేణా తగ్గిపోతుందన్న విషయం ఎవరికి వారు తమ స్వానుభవంలో మాత్రమే తెలుసుకుంటారు!

నిజానికి ఇలాంటి చక్కటి ఇల్లుని నాకు తెలీకుండా కట్టించి, దాన్ని మా మొదటి పెళ్ళిరోజు కానుకగా చెప్పి నన్ను సర్‌ప్రైజ్‌ చేశాడు రవి! ఈ ఇంటి అందాలను ఏ కోణంలో చూసినా రవి అభిరుచిని అభినందించకుండా ఉండలేను. రవి గురించి ఆలోచిస్తూ కిటికీ నుంచి బయటకు చూస్తున్నాను.

ఎదురుగా -

రోడ్డు మీద... డివైడర్‌ల మధ్య పూలమొక్కలు పెడుతూ కనిపించారు కూలీలు... పూలమొక్కలంటే ప్రాణమిచ్చే నేను... వాళ్ళు ఆ మొక్కల్ని ఎలా పెడుతున్నారా అని బాల్కనీలో కుర్చీ వేసుకుని, ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నాను.

కూలీలందరూ ఆడవాళ్ళే! వాళ్ళు లంబాడీ అమ్మాయిలేమో... తెల్లగా, అందంగా, బలిష్టంగా ఉన్నారు. ఎర్రటి ఎండలో పనిచేస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలు చకచకా మట్టి తవ్వుతూంటే... మరో ఇద్దరు ఎరువులాంటిదేదో వేస్తున్నారు. ఇంకో ఇద్దరు పూలమొక్కల్ని నాటుతున్నారు. రోడ్డు పక్కన ఉన్న చెట్లకు తమ పాతచీరలని ఉయ్యాల్లా కట్టి, వాటిలో చంటిపిల్లల్ని పడుకోబెట్టి, రెండు మూడేళ్ళ వయసున్న పిల్లలతో ఆ ఉయ్యాలలను ఊగిస్తున్నారు.

ఏ వస్తువైనా ఒకచోటు నుండి మరోచోట పెట్టడానికే ఆపసోపాలు పడే నాకు - ఇంచుమించు నా వయసులోనే ఉన్నట్టుగా ఉన్న ఆ లంబాడీ అమ్మాయిలు ఆడుతూ పాడుతూ ఎంతో సునాయాసంగా పనులు చేసుకోవడం చూసి ముచ్చటేస్తోంది!

వాళ్ళ చేతుల్లో ఏవో పూలమొక్కలు... అవి ఏ పూలవో కన్పించడం లేదు. కాకపోతే... అవి ఏ ఎర్రగన్నేరు మొక్కలో, తెల్లగన్నేరు మొక్కలో కాకపోతే బావుణ్ణనిపించింది!

పూలు తక్కువ, ఆకులెక్కువగా ఉండే ఆ గన్నేరు పూల మొక్కలకన్నా - ఆకుల్నే కన్పించకుండా విరగబూస్తూ చాలారోజులపాటు వాడిపోకుండా నిత్యనూతనంగా కనిపించే బోగన్విలియా మొక్కల్ని ఆ డివైడర్ల మధ్య నాటితే కంటికి ఇంపుగా ఉంటాయి కదా అనిపించింది.

అప్పుడే ఫ్యాక్టరీ నుండి ఇంటికి తొందరగా వచ్చిన రవితో అదే విషయం చెప్తే - “ఛ! బోగన్విలియా మొక్కలా? అవేం బావుంటాయి ఇందూ? పైగా వాటికి సువాసన కూడా ఉండదు!” ఆట పట్టించాడు.

“ఇల్లు కట్టిన కొత్తలో వాటిని మన కాంపౌండ్‌ వాల్‌ మీద పాకేలా పెట్టుకుందామని నేనోసారి అడిగితే - ‘వాటికి ముళ్ళుంటాయి...  నువ్వు ఉత్తినే కూర్చోవు సరికదా... వాటికి నీళ్ళు పోస్తానూ... కత్తిరిస్తానూ అంటూ బయల్దేరుతావు! అసలే సుకుమారమైన శరీరం నీది, వాటి ముళ్ళు గుచ్చుకుంటే - నేను తట్టుకోలేను! కావాలంటే మల్లెపూల మొక్కలు పెట్టుకో’ అంటూ తప్పించుకున్నారు మీరు, గుర్తుందా?” గుర్తుచేసాను.

రవి మాట్లాడలేదు.

“అయినా రవీ - నీకు మల్లెపూలంటే ఎందుకంత మోజు? అవి ఒక్కరోజులో విచ్చుకుని వాడిపోయే పూలు! ఆ బోగన్విలియా పూలు చూడూ - ఎంతకీ వాడిపోవు - పైగా ఎండావానలకి తట్టుకుంటాయి, కంటికి ఆహ్లాదం కలిగిస్తాయి!” అన్నాను. విననట్టు నిల్చున్నాడు రవి.

“అయినా మనకి కావలసింది ఎముకలు కుళ్ళిన మనుషులు కారు రవీ! ఆడుతూ పాడుతూ తమ చెమటచుక్కలు ధారపోస్తూ - ఎంత పనిచేస్తున్నా వాడిపోని బోగన్విలియాలాంటి - ఆ కూలీలు!” నవ్వుతూ చెప్పాను.

రవి ఆలోచిస్తున్నాడు.

“అప్పుడు ఇంట్లో ఆ పూలు పెట్టుకోవడానికి మీరు పడనివ్వలేదు సరే - కనీసం... ఇప్పుడు మన వీధిలోనైనా ఆ పూలను చూసి తరించే భాగ్యం కూడా లేదేమిటీ?” ఏడిపించాను రవిని.

“సర్లే - నేను అడ్డుపడింది ఇప్పుడుకాదు... అప్పుడెప్పుడో మన పెళ్ళైన కొత్తలో కదా! నీకంటికి ఆ పూలు అంత ఆహ్లాదం కలిగిస్తే ఇప్పుడు నేనెందుకు అడ్డం పడతాను చెప్పు!” అంటూ - వాతావరణం తేలిక చేద్దామని కాబోలు... “పూవునైనా కాకపోతినీ... నీ కంటిచూపూ సోకగా...” కూనిరాగం తీస్తూ బాత్రూంలో దూరాడు.

మరో పది నిమిషాల్లో ట్రిమ్‌గా తయారై -

“ఇందూ! మా ఫ్రెండ్‌ వాళ్ళింట్లో ఈరోజు స్టాగ్‌ పార్టీ ఉంది. ఏ అర్ధరాత్రో వస్తాను. పాపని స్కూల్‌ నుండి తీసుకొచ్చి, నేనొచ్చేదాకా డ్రైవర్‌ ఇక్కడే ఉంటాడు. ఫస్ట్‌ టైమ్‌ మిమ్మల్ని ఇంట్లో వదిలి వెళ్తున్నాను కదా... ఎమర్జెన్సీలో మీకు తోడుంటాడని డ్రైవర్‌ని ఇక్కడే ఉండమన్నాను. మా ఫ్రెండ్‌కో చక్కటి గిఫ్ట్‌ కొనాలి... మా ఫ్రెండ్సంతా నన్ను తొందరగా రమ్మంటూ ఒకటే గొడవ చేస్తున్నారు... వస్తా!  బై!” అంటూ బయటపడ్డాడు.

టైమ్‌ చూసాను... మూడున్నర అవుతోంది! బయట... ఇంకా ఎర్రటి ఎండ! అంతటి ఎండలో కూడా నవ్వుతూ తుళ్ళుతూ పనిచేసుకుంటున్నారు కూలీ అమ్మాయిలు.

పెళ్ళై అయిదేళ్ళవుతోంది! నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళలేదు రవి. స్టాగ్‌ పార్టీలో ఆడవాళ్ళకి ప్రవేశం ఉండదు కాబట్టి... మొదటిసారిగా నన్ను వదల్లేక వదల్లేక వదిలి ఒక్కడే వెళ్ళిపోయాడు రవి.

అవునూ... ఎంతటి అదృష్టం చేసుకుంటే... భార్యని కంటికి రెప్పలా చూసుకునే రవిలాంటి భర్త లభిస్తాడు అమ్మాయిలకు... రవి ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి.

***

నా పెళ్ళైన కొత్తలో -

“నా చెంప తాకగానే... చెలీ నీ చేయి కందేనేమో -”

“కుసుమాలు తాకగనే నలిగేను కాదా నీ మేను...” తనకి నచ్చిన పాత పాటల్ని పాడుతూ ఏడిపించేవాడు రవి.

“అవునూ... నిన్ను చూడకముందు - సౌకుమార్యం ఆడవాళ్ళకు అలంకారమంటూ కవులు అభివర్ణిస్తూంటే... అదంతా ఉత్త ట్రాష్‌ అనుకునేవాణ్ణి! కానీ చిదిమితే పాలుగారే సౌకుమార్యం నీది! ఇలాంటి సౌకుమార్యం ఎంత అదృష్టం చేసుకుంటే లభిస్తుందో చెప్పు! పైగా అది నీ సొంతం కావడానికి నీకు ఎన్నితరాల జీన్స్‌ సాయం చేసి ఉంటాయో ఆలోచించు...” మోహావేశం ఎక్కువైనప్పుడల్లా మురిపెంగా అంటాడు రవి.

ఊటీలో, కొడైకెనాల్లో... ఎక్కడ ఏ పార్కులో తిరుగుతున్నా - “ఏయ్‌ ఇందూ! అలా ఎండలో తిరగకు... ఇదిగో ఇలా నీడపట్టున నడువు!” అంటూ నా చేయి పట్టుకుని నేను చెట్లనీడల కిందే నడిచేలా చేసేవాడు రవి...

ఇంట్లో బోర్‌ కొట్టి, ఎప్పుడైనా -

“వాకింగ్‌కి వెళదాం!” అని అడిగితే -

“సన్నగా, నాజూగ్గా ఉన్నావు కదా! ఇంకా ఈ వాకింగ్‌లు ఎందుకు చెప్పు?” అనేవాడు.

అధవా నా పోరు పడలేక ఒకవేళ రవి వాకింగ్‌కి వచ్చినా - చుట్టుపక్కల అటూ ఇటూ చూసి -

“నా దేవేరికి ఛత్రం పడతాను చూడూ!” అంటూ నా కొంగో, దుప్పట్టానో గొడుగులా చేసి - రెండు చేతుల్తో దాన్నెత్తి నామీద కప్పి నా వెనకాలే నడుస్తూ -

“నీ అడుగులోన అడుగు వేసి నడవనీ, నన్ను నడవనీ” పాడేవాడు.

“ఇలా అల్లరి చేస్తే - చస్తే మీతో వాకింగ్‌కి రాను పోండి!” అని మొండికేస్తే -

“సర్లే!  నేనురాను, నువ్వెళ్ళు!  కానీ ఎండ రాకముందే ఇంటికి వచ్చేయాలి!  ఎండలో నడిస్తే కందిపోతావ్‌... జాగ్రత్త!  పొద్దున్నే చలిగా ఉంటుంది. చెవుల చుట్టూ స్కార్ఫ్‌ కట్టుకో! చీరతో నడవకు... కుచ్చెళ్ళు తట్టుకుని పడిపోతావు! చుడీదార్‌ వేసుకో, జీన్స్‌ అయితే ఇంకా కంఫర్టబుల్‌గా ఉంటుంది” అంటూ సవాలక్ష జాగ్రత్తలు చెప్పేవాడు.

ఎప్పుడైనా జన్మకో శివరాత్రిలా పొద్దున్నే - “ఒక్కదానికి నాకు బోర్‌ కొడుతోంది - మీరూ రండి ప్లీజ్‌” అంటూ రవిని వాకింగ్‌కి బయల్దేరదీస్తే - ఇంటి బయట కాలెడుతూనే... నా కొంగుచ్చుకు లాగుతూ... “నీకో సంగతి చెప్పనా?  నువ్వు నడుస్తోంటే... నీ నడుం వెనకాల కదిలీ కదలనట్టు కదిలే ఆ సన్నటి నడుం మడతలు... నీకెంత అందంగా... నాకెంత టెంప్టింగా ఉంటాయో తెలుసా?” అంటూ ఆ మడతల్ని గిల్లి - నన్ను వివశురాల్ని చేసి - ఆ రోజుటి మా వాకింగ్‌కి ఎసరు పెట్టించేవాడు.

నేను మున్ముందు ఏ జబ్బు బారినపడో ఈ సౌకుమార్యాన్ని పోగొట్టుకుంటే... చూసి తట్టుకోగలడా? అప్పుడూ - ఇంత అపురూపంగా నన్ను చూసుకోగలడా?

ఎందుకో రవిలోని ఆ ‘సౌందర్య స్పృహ’ నన్నెప్పుడూ ఏదో తెలీని అభద్రతా భావానికి లోను చేసేది.

అదే మాట పైకి చెప్తే -

“యూ సిల్లీ గాళ్‌! గులాబీ పువ్వు సుకుమారమైంది. దానిది మనకన్నా షార్ట్‌ లైఫ్‌! అలా అని... దాని రెక్కలు రాలి పోతూంటే... చూస్తూ కూర్చోలేం కదా! మరికొన్ని గంటల పాటయినా అది తాజాగా ఉండాలనుకుంటాం. నీళ్ళు చిలకరించో, తడిగుడ్డలో చుట్టో అది వాడిపోకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తాం కదా!” అనేవాడు.

అయితే... నేను భయపడ్డట్టే -

మా పెళ్ళై ఓ పాప పుట్టాక - ఎప్పుడో ఏ యాభై యేళ్ళ వయసు తరువాతో వచ్చే ఆస్టియోపొరాసిస్‌ ముప్పై యేళ్ళ వయసులోనే నా ఎముకల్ని గుల్లబారేలా చేయడం, తుమ్మినా, దగ్గినా చిన్న చిన్న ఫ్రాక్చర్స్‌ కావడం, కాలి వేళ్ళ కణుపుల మీద, చేతి వేళ్ళ కణుపుల మీద ఉబ్బెత్తుగా బుడిపెల్లా స్పర్స్‌ పెరిగి కీళ్ళు నొప్పెట్టడం - తద్వారా నేను ఏ చిన్న వస్తువునీ లేపలేకపోవడం చూసి - షాకయ్యాడు రవి.

“విటమిన్‌ - డీ మాత్రలు బాగా వేసుకోవాలి, ఎండలో తిప్పాలి” అని డాక్టర్లు చెప్పినప్పుడు... తను నన్ను ‘అసూర్యంపశ్య’లా అపురూపంగా చూసుకున్నందుకే నాకిలా జరిగిందేమోనన్న గిల్టీనెస్‌ మొదలై... నాపట్ల అంతకు ముందున్న శ్రద్ధ రెట్టింపైంది రవికి!

అయితే... ఇంతకు ముందులా ప్రతిదానికీ సున్నితంగా చూసుకోవడం మానేసి - ఎండలోనే వాకింగ్‌ చేయించడం, ఇవ్వాల్సిన మోతాదులో ‘డి’ విటమిన్‌ లాంటి టాబ్లెట్స్‌ ఇవ్వడం మొదలెట్టాడు రవి.

***

రాకింగ్‌ చైర్‌లో కళ్ళు మూసుకొని కూర్చుని - రవి తలపుల్లో మునిగి తేలుతోన్న నేను, “అమ్మా!  ఒక్కమాట...” ఆయా పిలుపుకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను.

“అమ్మా! మన ఇంటి ముందున్న రోడ్డుమీద ఇప్పటిదాకా మొక్కలు పెట్టిన వాళ్ళు మన గేటుముందు నిల్చుని మంచినీళ్ళు అడుగుతున్నారు... ఇవ్వమంటారా?” అడిగింది ఆయా.

“వాళ్ళని లోపలికి రమ్మని పిలువు ఆయా! పొద్దుటినుండి ఎండలో పనిచేస్తున్నారు కదా! దాహంగా ఉందేమో పాపం! ఇంట్లో సకినాలూ, లడ్డూలూ కూడా ఉన్నాయి. వాళ్ళకీ, వాళ్ళ పిల్లలకీ తలా కొన్ని ఇవ్వు, టీ కూడా చేసివ్వు!” చెప్పాను.

“సరేనమ్మా!” అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆయా.

పాపకి స్కూల్‌ నుండి వచ్చే టైమ్‌ అయింది. ఈపాటికే డ్రైవర్‌ తీసుకురావాలి! ఏ ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కున్నారో... ఇంకా ఇంటికి రాలేదు! ఫోన్‌ చేస్తూంటే రిసీవ్‌ చేసుకోవడం లేదు... డ్రైవింగ్‌లో ఫోన్‌ మాట్లాడకూడదని మాట్లాడ్డం లేదేమో అని సరిపెట్టుకుందామనుకుంటే - కనీసం నా కాల్‌ చూసైనా ఎక్కడో ఓ చోట కారాపి మాట్లాడవచ్చుకదా అనిపించింది.

నాలో అంతకంతకీ టెన్షన్‌ పెరిగిపోతోంది. ప్రతి రోజూ అయిదు గంటలకల్లా ఇంటికి వచ్చే పాప - ఆరైనా జాడే లేదు. డ్రైవర్‌కి ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా రిప్లయ్‌ లేదు - కాస్సేపటికి ఆ ఫోన్‌ కాస్తా స్విచాఫ్‌ వచ్చింది. మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. రవికి ఫోన్‌ చేసాను. అదీ స్విచాఫ్‌ వస్తోంది. స్టాగ్‌ పార్టీలో వాళ్ళందరూ స్విచాఫ్‌ చేసుకోవడం మామూలే!

ఇప్పుడెలా?

స్కూల్‌కి ఫోన్‌ చేసాను...

“పిల్లల్ని ఎప్పట్లా మూడున్నరకే వదిలారు, మీ డ్రైవర్‌ వచ్చి తీసుకెళ్ళాడు” చెప్పాడు వాచ్‌మాన్‌.

ఇక లాభంలేదని... పాపకి ఉన్న బ్యాండ్‌ ట్రాకింగ్‌, బ్యాగ్‌ ట్రాకింగ్‌ గుర్తొచ్చి వాటినీ వెరిఫై చేసాను. బ్యాండ్‌ ఒక చోట, బ్యాగ్‌ ఒక చోట స్విచాఫ్‌ అయ్యాయి.

కారు జీపీఎస్‌తో అనుసంధానమై ఉంటుందని గుర్తొచ్చి... ఆ దిశగా చెక్‌ చేసాను. కారు మేడ్చల్‌ పరిసర ప్రాంతంలో ఔటర్‌ రింగ్‌ దగ్గర ఎక్కడో ఆగిపోయినట్టుగా తెలిసిపోయింది.

వెంటనే పోలీస్‌ వాళ్ళకి ఫోన్‌ చేసాను... ఎంగేజ్‌ వస్తోంది!

ఇంట్లో ఇంకో కారు ఉంది! నాకు డ్రైవింగ్‌ వచ్చినా - చేతుల్లో చేవలేక, కారు బయటికి తీయలేని నా అశక్తత గుర్తొచ్చి, కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరగడం మొదలెట్టాను.

ఆయా లోపలికి వచ్చి -

“అమ్మా!  మీరు చెప్పినట్టు - ఆ పూలమొక్కలు పెట్టినవాళ్ళకి సకినాలూ, లడ్డూలూ, టీ ఇచ్చాను. వాళ్ళు మీతో మాట్లాడి వెళ్ళిపోతామంటున్నారు” చెప్పింది.

నా మనసంతా ఆందోళనగా ఉంది! ఎవరితోనూ మాట్లాడే స్థితిలో లేను - అదే విషయం చెప్పాను...

ఆయా బయటికి వెళ్ళి - మరుక్షణం గోడక్కొట్టిన బంతిలా తిరిగి వచ్చింది! ఆయాతో పాటు పొద్దుట్నుండీ మొక్కలు పెట్టిన ఆరుగురు అమ్మాయిలూ లోపలికి వచ్చారు.

వాళ్ళంతా వేళకాని వేళ... అందులోనూ... ఆందోళనగా ఉన్న సమయంలో లోపలికి చొచ్చుకు వచ్చినందుకు, ఆయా అడ్డుపడనందుకు ఆమె వంక చిరాగ్గా, అసహనంగా, కోపంగా చూసాను.

అది గమనించిందేమో -

“మేడమ్! అయామ్ సంగీత! వుయ్‌ నో యూ ఆర్‌ వర్రీడ్‌ అబౌట్‌ యువర్‌ డాటర్స్‌ సేఫ్టీ నౌ!” చెప్పింది సంగీత.

ఒక కూలీ అమ్మాయి ఇంగ్లీష్‌ మాట్లాడ్డం చూసి ఒకింత ఆశ్చర్యం, ఆమె నోటెమ్మట నేనున్న పరిస్థితుల్లో నా కూతురి ప్రస్తావన రావడం కొండంత ఆనందం, మరుక్షణం అంతకు మించిన విచారం నాలో ముప్పిరిగొన్నాయి.

“మేడమ్! నా పేరు రజని. సంగీతా నేనూ చైతన్యా ఇంజనీరింగ్‌ కాలేజీలో క్లాస్మేట్స్‌! మీరు మీ పాప గురించి బాధపడ్తున్నారు కదా... ఆ విషయమే చెప్దామని వచ్చాం!” అంది ఆ నలుగురిలో మరో అమ్మాయి.

“ఏంటీ, మీరు స్టూడెంట్సా? పొద్దుటినుంచీ మా ఇంటి ముందున్న డివైడర్స్‌లో మొక్కలు పెడుతోన్న కూలీలు కదా... మీరు?” నాలోని అనుమానం ప్రశ్న రూపంలో బయటికి తన్నుకు వచ్చింది!

“వాళ్ళు నిజంగానే స్టూడెంట్స్‌ అమ్మా! వారానికో రోజు సోషల్‌ సర్వీస్‌లో భాగంగా - మాలాంటి వాళ్ళతో కలిసి అప్పుడప్పుడూ ఇలాంటి కాలేజీ అమ్మాయిలు మొక్కలు పెడ్తుంటారు! ఈవారం మీ కాలనీని సెలెక్ట్‌ చేసుకున్నాం. ఈ రోజు మొక్కలు పెట్టిన ఆరుగురిలో వీళ్ళిద్దరే కాలేజీ స్టూడెంట్స్‌, మిగతా నలుగురం కూలీలం!” చెప్పింది కూలీల్లోని ఇంకో అమ్మాయి.

నా ప్రాణానికి ప్రాణం నా పాప గురించి నేను వర్రీ అవుతూంటే... మధ్య ఈ కాలేజీ పిల్లలేమిటో, వీళ్ళ కథేమిటో... అయోమయంగా ఉంది... ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతోంది? అసలు వీళ్ళు ఏం చెప్పాలని లోపలికి వచ్చారు? నాకంతా అగమ్యగోచరంగా, అంతకు మించి అసహనంగా ఉంది!

“మేడమ్! మీ పాప ఇంకా రాలేదని కదా మీరు బాధ పడుతున్నారు. ఇదిగో మీ పాప! ఈ రాత్రి మీ పాప మీ ఇంటికి క్షేమంగా చేరేలా ఈ కాలేజీ అమ్మాయిలు పూనుకోకపోతే... మీ పాప మీకు ప్రాణాలతో దక్కేది కాదు!” అంటూ లోపలికి అడుగెట్టారు పోలీసులు.

“మమ్మీ!” అంటూ ఒక్కుదుటున పరిగెత్తుకొచ్చి వెక్కివెక్కి ఏడుస్తూ నన్ను వాటేసుకుంది పాప.

పాపని గట్టిగా గుండెలకు హత్తుకుని, ఎడాపెడా ముద్దుల వర్షం కురిపించాను. నా కళ్ళనుండి ధారాపాతంగా కన్నీళ్ళు కురుస్తూనే ఉన్నాయి. ప్రపంచం ఏమైపోనీ... నేనేమీ వినదలుచుకోలేను... నా పాప నాకు దక్కింది, అది చాలు!

“జల్సాల కోసం దొంగతనాలు చేస్తూ మూడేళ్ళ కింద కాలేజీ నుండి డిబార్‌ అయ్యాడు మీ డ్రైవర్‌. వాడి బ్యాగ్రౌండ్‌ తెలీని మీ ఆయన వాడ్ని పనిలోకి పెట్టుకున్నారు. వాడి నక్క వినయాలు చూసి వాడ్ని పూర్తిగా నమ్మారు మీరు. పెళ్ళిళ్ళకీ, ఫంక్షన్స్‌కీ ఎక్కడికి వెళ్ళినా - మీ పర్స్‌ని మొయ్యలేక దాన్ని కార్లోనే వదిలి వెళ్ళేవారు మీరు... కొన్నిసార్లు వాడి చేతికే ఇచ్చేవారు. అందులోంచి డబ్బు కొట్టేస్తూ - ఆ డబ్బుతో తన సరదాలు తీర్చుకునేవాడు వాడు. మీరెప్పుడూ మీ పర్స్‌లో ఎంత డబ్బు ఉందో కూడా చూసుకునే వారు కాదు కాబట్టి - చాలా రోజులుగా వాడికి ఆడింది ఆటగా, పాడింది పాటగా గడిచిపోయిందనీ... ఈ మధ్య మీ ఆరోగ్యం బాలేక మీరు ఎటూ వెళ్ళలేకపోవడంతో... మీ పర్స్‌లోంచి డబ్బు కొట్టే అవకాశం లేక, తన అవసరాలు తీరే దారి లేక -మీ అమ్మాయిని కిడ్నాప్‌ చేసి, డబ్బులు డిమాండ్‌ చేయాలన్న ఆలోచనతో ఛాన్స్‌ కోసం ఎదురుచూసాడనీ - ఆ అవకాశం మీవారి ‘స్టాగ్‌ పార్టీ’ రూపంలో తనకు దొరికిందనీ మా ఇంటరాగేషన్‌లో అంగీకరించాడు మీ డ్రైవర్‌!” చెప్పాడు పోలీస్‌ సబ్‌ ఇన్స్పెక్టర్‌.

“తన చుట్టూ ఉన్న పరిసరాల్లో కూలీలే ఉన్నారు కదా - తను మాట్లాడుతోంది మాకు ఏం అర్థం అవుతుందిలే అన్న నిర్లక్ష్యంతో... మీ పాపని తనతో సహా మరెవరో కిడ్నాప్‌ చేసినట్లుగా ఏమేం చేయాలో, ట్రాకింగ్‌ ద్వారా ఆ పాప ఆచూకీ తెలిసే అంశాలు ఏమేమి ఉన్నాయో, వాటిని ఎక్కడెక్కడ ఎలా ధ్వంసం చేయాలో, చివరకు కారుని ఎక్కడ వదిలిపెట్టాలో, ఒకవేళ తమ ప్లాన్‌ బెడిసికొట్తే... తమ గుట్టు రట్టయితే ఆ పాపని ఎలా చంపేయాలో కూడా, విశదంగా తన స్నేహితుడితో ఇంగ్లీషులో డిటైల్డ్‌గా డిస్కస్‌ చేసాడు మీ డ్రైవర్‌. ఓ వైపు మొక్కలు నాటుతూనే, మరో వైపు ఆ సంభాషణ అంతా యథాతథంగా మా మొబైల్లో రికార్డు చేసి, దాన్ని పోలీసులకు మేము ఫార్వర్డ్‌ చేయడం ద్వారా... వాళ్ళు మీ పాప ఆచూకీని సకాలంలో తెలుసుకోగలిగారు!” చెప్పింది సంగీత.

“అదొక్కటే కాదు - మీ ఆందోళనను గమనించి, మీద్వారా విన్న విషయాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళ భర్తలకు తమ మొబైల్స్‌ ద్వారా చేరవేస్తూ... వాళ్ళ భర్తలు కూడా ఓ క్యాబ్‌ బుక్‌ చేసుకుని మీ డ్రైవర్ని ఫాలో అయ్యేలా ఈ నలుగురు కూలీ అమ్మాయిలు కూడా పూనుకోకపోతే ఈ కేసుని మేము ఇంత తొందరగా - అదీ రెండు గంటల వ్యవధిలో ఛేదించగలిగే వాళ్ళం కాదు! క్రెడిట్‌ గోస్‌ టు దెమ్ ఆల్‌సో!” చెప్పాడు సబ్‌ ఇన్స్పెక్టర్‌.

“వాడు చాలా తెలివైన నేరస్థుడు... అయితే ఎంతటి తెలివైన నేరస్థుడైనా... ఒక చిన్న తెలివితక్కువ పని ద్వారా పట్టుబడిపోతాడు!” చెప్పాడు అప్పుడే ఆ గదిలో అడుగెట్టిన సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌.

“మీవారు పెద్ద బిజినెస్‌ టైకూన్‌... ఎంతకీ మిమ్మల్ని అపురూపంగా చూసుకోవాలన్న తపనే తప్ప - మీ చుట్టూ ఎన్ని విషనాగులు తిరుగుతున్నాయో కూడా పట్టించుకోలేని బిజీ మనిషి! మీ తోటమాలి కూడా మరో విషప్పురుగు... వాడితో కలిసి మరెన్నో పన్నాగాలు పన్నాడు మీ డ్రైవర్‌. మీ అదృష్టవశాత్తూ వాడి పన్నాగం ఇంతలోనే ఇలా బెడిసికొట్టింది! కొత్తగా పనిలోకి డ్రైవర్లని, పనిమనుషుల్ని తీసుకునే ముందు ఆధార్‌ కార్డు అడగడం, వాళ్ళ నడత గూరించి ఊరి పెద్దల్ని అడిగి తెలుసుకోవడం చాలా అవసరం.” చెప్తున్నాడు సబ్‌ ఇన్స్పెక్టర్‌.

నా తల తిరిగిపోతోంది...కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి!

ఆ తర్వాత నాకు ఎప్పుడు స్పృహ వచ్చిందో తెలీదు గానీ... కళ్ళు తెరిచేసరికి... నేనేదో హాస్పిటల్లో ఉన్నట్టుగా అర్థమైంది. నా మంచం చుట్టూ చేరి, నావంకే ఆదుర్దాగా చూస్తోన్న రవి, పాప, నలుగురు కూలీ అమ్మాయిలు, ఇద్దరు కాలేజీ అమ్మాయిలు కన్పించారు.

ముందుగా ఆ ఆరుగురు అమ్మాయిలను దగ్గరకు రమ్మంటూ సైగ చేసి -

“అమ్మాయిలంటే మీలా ధైర్యంగా, చురుగ్గా, అలర్ట్‌గా ఉండాలి! అప్పుడు మీరే కాదు, దేశంలోని ఆడపిల్లలందరూ క్షేమంగా, నిర్భయంగా ఉంటారు - కిడ్నాప్‌లకీ, యాసిడ్‌ దాడులకీ, రేప్‌లకీ, కత్తి పోట్లకీ గురికారు! పద్మశ్రీలూ, పద్మభూషణ్‌లూ ఎందుకు ఇస్తారో, ఎవరికి ఇస్తారో నాకు తెలీదు! అవి - మీలాంటి వాళ్ళకి ఇవ్వాలి!” అంటూ వాళ్ళ చేతుల్ని నా చేతుల్లోకి తీసుకుని ముద్దెట్టుకున్నాను!

పాప కళ్ళు మెరిసాయి! రవి కళ్ళు తడిసాయి!

****సశేషం****

Posted in March 2025, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!