డా. వింధ్య గుండె ఉద్వేగంతో చలిస్తోంది. జ్ఞాపకాల ఉప్పెన ఆమెను నిలువెల్లా కుదుపుతోంది. అప్పుడే తను మెడికల్ కాలేజీలో చేరి యాభై ఏళ్ళు పూర్తయ్యిందంటే నమ్మబుద్ధి కావడంలేదు. తనకెంతో ప్రీతిపాత్రమైన విశాఖపట్టణం ఆంధ్రా మెడికల్ కాలేజీలో చేరడం తన కల. ఆ కల నెరవేరి ట్రంకు పెట్టెతో తను వైజాగ్ బయలుదేరడం, కాలేజ్ ఆఫీసులో అడ్మిషన్ తీసుకోవడం, పానగల్ బిల్డింగులోని లెక్చర్ గాలరీలో కూర్చుని సముద్రాన్ని చూస్తూ కలల్లో తేలిపోవడం, రాజేంద్ర ప్రసాద్ వార్డు దగ్గర రాగింగ్ చేస్తున్న సీనియర్స్ వంక బేలగా చూడటం, హాస్టల్ పాత బిల్డింగ్, రోడ్డువైపు పైఅంతస్తు గదిలోకి కొండ క్రింది ప్రభాస్ టాకీస్, పూర్ణా టాకీస్ లో ఆడే సినిమాల పాటలు రాత్రి నిశ్శబ్దంలో తేలితేలి రావడం... స్మృతుల దొంతరలు వింధ్యను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
తమ బ్యాచ్ మెడికల్ కాలేజిలో చేరి ఏభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా, ‘స్వర్ణమైత్రి’ పేరుతో క్లాస్‌మేట్స్ అందరం కలిసి రెండురోజులు ఆనందంగా గడిపేందుకు ఏర్పాట్లుచేస్తున్నామని, తప్పనిసరిగా ఆ వేడుకలోపాల్గొనమనే ఆహ్వానంతో పాటు కాలేజిలో అడ్మిషన్ రోజున అప్లికేషన్‌కి అతికించిన పదహారేళ్ల పడుచు వయసు పాస్‌పోర్ట్ సైజు ఫోటో కాపీని డా. నారాయణమూర్తి పంపించినప్పుడు వింధ్య మనసు వర్ణించనలవికాని థ్రిల్‌తో రెపరెపలాడింది.
ఉత్సవం ప్రారంభం రోజున ఆంధ్రా మెడికల్ కాలేజి పూర్వవిద్యార్థుల సంఘం, ‘ఆమ్‌కోసా’ భవనం హాల్లోకి భర్తతో కలిసి వింధ్య అడుగు పెట్టేసరికి, దాదాపు వందమంది హాల్లో ఉన్నారు. చాలామందిని నలభై మూడేళ్ళ క్రితం కాలేజిని వదిలేక మళ్లీ ఇదే చూడడం... వేదికమీద మైకు ముందు మెడిసిన్ మొదటి సంవత్సరంలో తమ క్లాస్ లీడర్ సుమతీ ఛార్లెస్ హాజరు పిలుస్తోంది. ఒక్కొక్కరి పేరు పిలిచినప్పుడు డా. నారాయణమూర్తి వారి అప్పటి ఫోటోను ప్రొజెక్టర్ ద్వారా స్క్రీన్ మీద చూపిస్తున్నాడు. అప్పటి ఫోటోని ఇప్పటి ఆకారాన్ని పోల్చి చూసి అందరూ మనసారా నవ్వుకుంటున్నారు. తమ పేరు పిలవగానే ఒక్కొక్కరూ వేదికమీదకు వెళ్ళి అందరినీ గ్రీట్‌చేసి క్రిందకు వస్తున్నారు. ఆనాటి ఫోటోలను సేకరించి శ్రద్ధగా ప్రతి ఒక్కరికీ పంపిన నారాయణమూర్తి వంక ప్రశంసగా చూచింది వింధ్య. వేదికపైన నేపథ్యంలో అందరివీ ఆనాటి ఫోటోలతో రూపొందించి అమర్చిన ఫ్లెక్స్ సృజనాత్మకంగా ఉంది.
హాజరు ముగిసాక సమావేశపు ప్రధాన నిర్వాహకుడు డా. నారాయణమూర్తి ముఖం నిండా పరచుకున్న నవ్వుతో మైక్‌ని అందుకున్నాడు. ‘‘ఫ్రెండ్స్! అందరికీ స్వాగతం. మన కాలేజిలో మనకు ముందు బ్యాచ్‌లవారు, మన తరువాత బ్యాచ్‌లవారు కనీసం ఒక్కసారి, కొన్ని బ్యాచ్‌లు అనేకసార్లు బ్యాచ్‌మీట్స్ పెట్టుకున్నారు. మనం మాత్రం ఇంతవరకు మన బ్యాచ్‌మీట్ పెట్టుకోలేకపోయాం. మన శశికళ క్రితం సారి అమెరికా నుంచి వచ్చినప్పుడు, ‘మన బ్యాచ్ అందరం కలిస్తే బావుంటుంది కదా!’ అంది. ఇక్కడ ఉన్న మన ఫ్రెండ్స్‌తో చెప్తే, ‘ఇది జరిగే పనేనా?’ అంటూ పెదవి విరిచారు. చాలా తర్జన భర్జన తరువాత చివరకు బ్యాచ్‌మీట్ ఏర్పాటు చేయడానికే నిర్ణయించాము’’ అందరి వంకా కలయచూచాడు మూర్తి.
“దాదాపు వందమంది అడ్రసుల్ని పట్టుకోగలిగాం. వాళ్లు కసిరినా, విసుక్కున్నా, నిర్లిప్తంగా ఉన్నా విడవకుండా పట్టువదలని విక్రమార్కుల్లాగా మన ఆనంద్, కమల, సుమిత్ర రాష్ట్రంలోనూ, రాష్ట్రేతర ప్రదేశాల్లోనూ, యూరప్, యు.యస్, గల్ఫ్‌లోనూ ఉన్న మన మిత్రుల్ని పోరి, ప్రోత్సహించి, రావటానికి ఒప్పించడానికి ప్రయత్నించారు.’’ నెహ్రూ వివరించాడు.
‘‘ఏభైమంది వస్తే గొప్ప అనుకున్నాము కాని... డెబ్భై తొమ్మిది మంది వచ్చారు ఇప్పటివరకూ. ఈ పూట సమావేశం ముగిసేలోగా మరి కొంతమంది జాయినవవచ్చు. అన్నిటికంటే ఆనందం ఎక్కువమంది పతి లేక సతీసమేతంగా వచ్చారు. ఆరునెలలుగా మేము పడిన తపనకు, చేసిన కృషికి ఎంత అద్భుతమైన ప్రతిఫలం!! నాకిప్పుడు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో వర్ణించలేను. మీ అందరినీ చూచిన ఎగ్జయిట్‌మెంట్ నన్ను నిలవనివ్వటం లేదు.’’ నారాయణమూర్తి కంఠం గద్గదమయింది. హాల్లో కూర్చున్న అందరి హృదయాలు భారంగా అయ్యాయి. అందరూ నిలబడి, ఇన్నేళ్ళ తరువాత తమ క్లాస్‌మేట్స్‌ని కలుసుకుని ఆనందాన్ని, ఆత్మీయతను పంచుకునే అవకాశాన్ని కలిగించిన నారాయణమూర్తికి, అతని టీమ్‌కి తమ కృతజ్ఞతను కరతాళ ధ్వనుల్తో ప్రకటించారు. అందరూ మళ్ళీ కుర్చీల్లో ఆసీనులయేసరికి మూర్తి తన ఎమోషన్‌ని సంబాళించుకున్నాడు.
“ఫ్రెండ్స్! మన ఆనంద్ మన అప్పటి ఫోటోలతో పాటు మన కుటుంబ సభ్యులతో ఉన్న మన ఇటీవలి ఫోటోలు, మన చిరుపరిచయాలు, ప్రాఫెసర్స్‌తో మన గ్రూప్‌ఫోటో, మన కాలేజికి, హాస్పటల్‌కి కొండగుర్తులుగా ఉన్న ప్రదేశాలు, మనను విడిచి పైలోకాలకు వెళ్ళిపోయిన మన బ్యాచ్ మిత్రుల ఫోటోలతో చక్కటి సువెనీర్‌ని రూపొందించాడు. ఇప్పుడా సువెనీర్‌ని ఆవిష్కరించుకుందాం. అన్నట్టు, మన బ్యాచ్‌లో ప్రసిద్ధులైన కవులు, కథకులు కూడా ఉన్నారని మీకు తెలుసు. వారి అప్పటి రచనల్ని కూడా సువెనీర్‌లో పొందుపరచాము’’ అన్నాడు డా. నెహ్రూ. అందరూ ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ఆవిష్కరణ తరువాత సువెనీర్‌ని అందుకున్న ప్రతి ఒక్కరూ ఆసక్తితో, ఆనందంతో పేజీలు తిప్పుతున్నారు.
‘‘ఫ్రెండ్స్! ఇప్పుడు ఒక్కొక్కరూ ఒకటి, రెండు నిమిషాలు కాలేజితో తమ అనుభవాల్ని లేక ఇన్నేళ్ళ తమ జీవితంలోని ముఖ్యఘట్టాల గురించి చెప్పమని కోరుతున్నాను’’ అని నారాయణమూర్తి ఆహ్వానించాడు.
తరువాత ఒక్కొక్కరూ ఇన్నేళ్ళుగా సాగిన తమ జీవనయానం గురించి, వృత్తిరీత్యా తాము అధిరోహించిన పదవులు, నిర్వహించిన బాధ్యతలు, తాము సాధించిన విజయాలు, తాము ఎదుర్కొన్న అడ్డంకుల గురించి, తమ జీవిత భాగస్వామి, పిల్లల వివరాలు, కుటుంబ జీవనం గురించి కొంతమంది సంక్షిప్తంగానూ, కొంతమంది విశదంగానూ చెప్తున్నారు. అమెరికా, యూరప్‌లలోని ప్రతిష్టాత్మక హాస్పటల్స్‌లో శిక్షణ పొంది, అత్యున్నత శిఖరాలకు చేరినవారు, గల్ఫ్‌లో, ఆస్ట్రేలియాలో పని చేస్తున్న వారు, దేశంలో ఆర్మీలో, కేంద్ర, రాష్ట్ర వైద్యసర్వీసుల్లో, ప్రైవేట్ రంగంలో, కార్పొరేట్ హాస్పటల్స్‌లో, నగరాల్లో, మారుమూల గ్రామాల్లో వైద్య సేవలందించినవారు, ‘విభిన్నమైన బాటల్లో సాగిన తమ పయనం’ గురించి వివరించారు. సంపదలో, స్థాయిలో, హోదాలో, కీర్తిలో ఎన్నో వ్యత్యాసాలున్నప్పటికి వాటన్నింటినీ బయటే వదిలేసి అతి సాధారణంగా, స్వచ్ఛమైన స్నేహాన్ని, ఆత్మీయతను ఆస్వాదించడానికి ఆ హాలులో కూర్చున్న తన బ్యాచ్‌మేట్స్‌ని పరిశీలనగా చూస్తోంది వింధ్య.
చాలామంది తమ గురించి చెప్పాక ‘‘ఇంకా ఎవరైనా మిగిలారా?’’ అంటూ మూర్తి నలువైపులా పరికించి చూస్తూ డా. మల్లేశం మాట్లాడలేదని గమనించి అతన్ని వేదిక మీదకు ఆహ్వానించాడు.
‘‘ఫ్రెండ్స్! మీలో చాలామందిలా నేను ఎఛీవర్‌ని కాను. అతి సాధారణంగా నా జీవితంగడిచింది. డిగ్రీ చేతికి రాగానే మా ఊరికి వెళ్ళిపోయాను. అక్కడే హాస్పటల్ పెట్టాను. చుట్టుప్రక్కల దాదాపు ముప్పయి గ్రామాల ప్రజలు నా దగ్గరకు ట్రీట్‌మెంట్‌కి వస్తారు. దాదాపుగా అంతా నిరుపేదలు. నా క్లినికల్ పరిజ్ఞానం, ప్రాక్టికల్ అనుభవం నన్ను నడిపిస్తున్నాయి. ఎవరినీ డబ్బు గురించి పీడించను. వారిచ్చినంత తీసుకుంటాను. నాకు మేడలు, మిద్దెలు, ఇళ్ళు, ప్లాట్లు, పొలాలు, లగ్జరీ కార్లూ లేవు. కీర్తి ఉందో లేదో నాకు తెలియదు. కాని నేను చాలా అనందంగా ఉన్నాను. నా జీవితం గురించి నాకు ఎంతో సంతృప్తిగా ఉంది...’’ ఆ సంతృప్తి, ఆనందం మల్లేశం ముఖంలో, స్వరంలో ప్రతిఫలిస్తున్నాయి.
డా. నెహ్రూ ఆప్యాయంగా మల్లేశం చేతిని అందుకున్నాడు. మూర్తి, మల్లేశాన్ని ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు. మిగతావారంతా కరతాళ ధ్వనుల్తో తమ హర్షాన్ని వెలిబుచ్చారు. తరువాత మూర్తి, పరిమళను వేదికమీదకు ఆహ్వానించాడు.
“నా గురించి పెద్దగా చెప్పుకునేదేమీలేదు’’ అంటూ మొదలుపెట్టిన పరిమళ ఒక క్షణం ఏం చెప్పాలో తోచక ఆగిపోయింది. అందరిముందు మాట్లాడే అలవాటు లేకపోవడం వలన బిడియపడుతూంది. అంతలోనే కూడదీసుకుంది.
“నా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు. పిల్లలింకా పసిగా ఉండగానే నా భర్త చనిపోయారు. జీవితానికి భద్రత, భరోసానివ్వగల ఆస్తిపాస్తులేమీ లేవు. మాది ప్రేమవివాహం అవ్వడం వల్ల బంధువర్గం ఎప్పుడో దూరంగా పెట్టారు. ఒంటరి పోరాటం. జారిపోయిన శక్తులన్నిటినీ కూడదీసుకుని సొంత క్లినిక్‌ని నడుపుతూనే వేరే నర్సింగ్ హోమ్‌లో కూడా పని చేస్తూ పిల్లల్ని పెంచుకున్నాను. వాళ్ళ చదువులు పూర్తికాకుండానే నా జీవితానికి మరొక షాక్. కాన్సర్ బారిన పడిన నాకు ఎటు చూచినా కటిక చీకటే కనిపించేది. పరీక్షలు, మందులు, ఖీమోలు... మూడు సంవత్సరాలకంటే ఎక్కువ బ్రతకనని డాక్టర్లు చెప్పేసారు. కాని... మొండిధైర్యంతో జీవితంతో, నా అనారోగ్యంతో పోరాడాను. పది సంవత్సరాలయింది నాకు కాన్సర్ వచ్చి. ఇప్పుడిదిగో... మీ ఎదుట సజీవంగా నిలబడి ఉన్నాను’’ లిప్తపాటు ఆగింది పరిమళ. అంతా ఊపిరి బిగపట్టి వింటున్నారు.
‘‘డిగ్రీ పుచ్చుకున్న దగ్గర్నుండి నాకో కోరిక ఉంది, నాకంటూ స్వంతంగా ఒక నర్సింగ్ హోమ్‌ని ఏర్పాటు చేసుకోవాలని. మూడేళ్ళ క్రిందటివరకు అది నాకు తీరని కోరికే, వ్యాధితో, ఖీమోలతో యమయాతనను అనుభవిస్తున్న నన్ను నా బిడ్డలు ఓదార్చారు, ధైర్యం చెప్పారు, గుండెల్లో పెట్టుకుని సంరక్షించారు. కష్టపడి చదువుకుని నా కొడుకు, కూతురు ఇద్దరూ డాక్టర్లయ్యారు. బాబు గాస్ట్రోసర్జన్, అమ్మాయి పీడియాట్రీషియన్. ఇద్దరూ కలిసి మూడేళ్ళ క్రితం నర్సింగ్ హోమ్‌ని ప్రారంభించారు. నా అరవై నాలుగోఏట నాపిల్లలు నా కోరిక నెరవేర్చారు’’ మృదువుగా, స్పష్టంగా, ఆర్ద్రస్వరంతో చెప్తూంది పరిమళ. హాస్టల్లో తన గది ప్రక్కగదిలో ఉండి, తనతో అప్పుడప్పుడు కంబైన్డ్ స్టడీస్ చేసిన పరిమళ జీవితంలోని విషాదం వింధ్యను కుదిపేసింది.
ఇప్పుడు వింధ్యకు తన జీవిత ఘట్టాలు గుర్తుకు వచ్చి దుఃఖం గుండెల్లోకి ఎగసి వచ్చింది. తను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకులిద్దర్నీ మృత్యువు ఒకేసారి ఎగరేసుకు పోయింది. డిప్రెషన్ సుడిగుండంలో చిక్కి లోతుకు, మరింత లోతుకు దొర్లిపోతున్న తనను తన భర్త ప్రేమ, సంరక్షణ కాపాడి ఒడ్డుకు చేర్చాయి. కాని మళ్ళీ తనకు పూర్వంలా, ప్రాక్టీస్ చేయడానికి ఉత్సాహం లేదు. యంత్రవతుగా బ్రతకడం అలవాటయి పోయింది.
గ్రూపు ఫోటోకు సర్దుతూ ఉండగా ఒక్కొక్కరూ వచ్చి పలకరిస్తుంటే తనను కమ్ముకున్న విచారాన్ని ప్రక్కకు నెట్టింది వింధ్య. అందరూ గుంపులు గుంపులుగా గుమిగూడి పలకరించుకుంటున్నారు. కబుర్లు కలబోసుకుంటున్నారు. డబ్బయవ దశకానికి అతి చేరువలో ఉన్నవారు వెనక్కు చాలా వెనక్కు నవయవ్వన దశలోకి ప్రయాణించి ఆనాటి ఆనందాల్ని తవ్వి, పెకలించి గుండెల్నిండా నింపుకుంటున్నారు.
గ్రూపు ఫోటో, లంచ్ తరువాత కాలేజిలో పానగల్ బిల్డింగ్‌కి ట్రిప్ అనగానే వింధ్య హృదయంలో ఒక ఆనంద తరంగం లేచింది. కాలేజిలో ప్రవేశించాక ఒక్కొక్క వార్డుని దాటుకుంటూ వెళ్తూంటే క్లినికల్ సైడ్‌కి వచ్చాక మూడేళ్ళు ఆ వార్డుల్లో తిరిగిన జ్ఞాపకాలు ఆత్మీయంగా స్పర్శించాయి. పానగల్ బిల్టింగ్ దగ్గర బస్ దిగేసరికి కాలేజ్ ప్రొఫెసర్స్ ఎదురొచ్చి స్వాగతించి లెక్చర్ గాలరీలోకి తీసుకు వెళ్ళారు. వింధ్య చప్పునవెళ్ళి అప్పట్లో తన అలవాటు ప్రకారం మొదటి వరుసలో కిటికీ ప్రక్క సీట్లో కూర్చుంది. అందరూ ఆనాటి తమ అల్లరిని గుర్తుకు తెచ్చుకు చెప్పుకుని నవ్వుకుంటున్నారు. అంతలో ప్రిన్సిపాల్ వచ్చి స్వచ్ఛమైన తెలుగులో ప్రసంగించి అందర్నీ కలుసుకున్నందుకు హర్షాన్ని, ఆప్యాయతను వ్యక్తం చేస్తూంటే అందరి హృదయాలు సంతోషంతో నిండాయి. ఆయనతో కలిసి బిల్డింగ్ బయట గ్రూపు ఫోటో దిగుతూంటే వింధ్యకు ఆ ప్రాంగణంలో కాలేజ్‌డే ప్రతి సంవత్సరం జరగడం, ప్రతిసారీ తనకు వ్యాసరచనలోనో, మేగజైన్‌కి వ్రాసిన రచనకో బహుమతి రావడం, తన ఫ్రెండ్స్ అంతా తనని ప్రత్యేకంగా చూడడం, తన కళ్ళు చిరుగర్వంతో తళతళలాడడం గుర్తుకొచ్చింది.
తరువాత ఋషికొండపైకి విహారం. సంధ్యారుణ కాంతిలో చిత్రమైన సొగసుతో ఆకట్టుకుంటున్న నగర దృశ్యం. మొదటిసారి అక్కడకు వచ్చిన వింధ్య కళ్ళు విప్పార్చి తనచుట్టూ ఉన్న సౌందర్యాన్ని తనివితీరా చూస్తోంది. జట్లుజట్లుగా చేరి కబుర్లతో కలిపి వేడివేడి స్నాక్స్ ఆరగించాక, తల పైకెత్తితే నక్షత్ర మాలలు, కళ్లు క్రిందికి వాల్చితే తిమిరాన్ని, తోలేస్తున్న దీపతోరణాలు, సముద్రం పైనుండి పాటపాడుకుంటూ తరలివస్తున్న చిరుగాలి... ఇంకా తనివి తీరకముందే తిరుగు ప్రయాణం. వింధ్య మనసులో అసంతృప్తి...
ఉదయం నుండి క్షణం విశ్రాంతి లేకుండా తిరుగుతున్నప్పటికి రెట్టింపు ఉత్సాహంతో వాల్టేర్ క్లబ్‌లో డిన్నర్‌కి హాజరయి పాటలు, మిమిక్రీలు, జోక్స్‌తో తమ అనారోగ్యాల్ని, సమస్యల్ని, దుఃఖాల్ని మరిచిపోయి ఏభై ఏళ్ళు వెనక్కు మళ్ళారంతా. ‘అయ్యో! అప్పుడే ఒక రోజు అయిపోయిందా?! ఒక్కక్షణంలా ఈరోజు జారిపోయిందే!!’ అనే దిగులు ఆవహించింది.
మరుసటి రోజు ఉదయమే విశాఖ సమీపంలోని రిసార్ట్‌లో సమావేశం. బ్రేక్‌ఫాస్ట్ తరువాత దగ్గర్లోని రామానాయుడు స్టూడియోని చుట్టివచ్చి మీటింగ్ హాల్లో సమావేశమయారు. ఎదురుగా ఫ్లెక్స్‌లో తమతోపాటు యాభై సంవత్సరాల క్రితం కాలేజీలో చేరి కాలగమనంలో మృత్యువు ఒడిలోకి చేరిన తమ క్లాస్‌మేట్స్ ఛాయాచిత్రాలు ఉన్నాయి. వారిని స్మరించుకుని నివాళిని సమర్పించడానికీ సమావేశం ఏర్పాటయింది. కొంతమంది ఫ్లెక్స్ దగ్గరకు వెళ్ళి చూస్తున్నారు.
వింధ్య కూడా ఫ్లెక్స్ దగ్గరకు వెళ్ళి ఫోటోలను చూస్తూంది. వేణు ఫోటోపై చూపు పడగానే ఆమెకు దుఃఖం పొంగివచ్చింది. వింధ్య కళ్ళు నీళ్ళతో నిండాయి. తన ప్రియమిత్ర్రుడు వేణు తన కళ్ళముందరే కన్నుమూసాడు. పల్లెటూరినుంచి వచ్చిన తను పిరికిగా ఉండేది. ఎవరితోనైనా మాట్లాడాలంటే బిడియపడేది, భయపడేది. తన వార్డ్ మేట్స్ తప్ప, తన క్లాస్‌మేట్స్ మిగతావారితో ఎక్కువమందితో పెద్ద పరిచయమే లేదు. తామిద్దరివీ ప్రక్క నంబర్లవడంతో అనాటమీ డిసెక్షన్ హాల్లోనూ, లేబ్స్‌లోనూ ప్రక్కప్రక్కన కూర్చుని ప్రయోగాలు చేయడం వలన వేణుతో పరిచయం పెరిగింది. క్లినికల్ సైడ్‌కి వచ్చాక వేణు తన వార్డ్‌మేట్. అతను తస సహచర విద్యార్థే కాక తనకు ధైర్యం నూరిపోసి ఆత్మవిశ్వాసాన్ని నింపిన హితుడు. తన వయసువాడే అయినా పట్నంలో పుట్టి పెరగడంవలనో, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌లో చదవడం వలనో, కుటుంబ నేపథ్యమో, అతను తనకంటే ఎక్కువ తెలివిగా, ఎక్కువ పరిణతితో వ్యవహరించేవాడు. గోల్డ్‌మెడలిస్ట్ అయిన వేణు తనకు విశ్లేషణాత్మకంగా ఎలా చదవాలో బోధించడమే కాక, ఈ ప్రపంచంలో నేర్పుగా ఎలా బ్రతకాలో తెలియజెప్పిన మార్గదర్శకుడు కూడా. హౌస్ సర్జన్సీలో ఒకే వార్డులో పనిచేసిన తమ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తనతో చనువుగా మెలగినప్పటికి వేణు ఎన్నడూ హద్దులు దాటలేదు. ఎంతో అభిమానంతో, గౌరవంతో వ్యవహరించే వేణు స్నేహం తనకు అత్యంత అపురూపం. మరో నెల రోజుల్లో హౌస్ సర్జెన్సీ పూర్తి అవుతుందనగా ఫెండ్స్‌తో కలిసి భీమ్లీ వెళ్ళిన వేణు స్కూటర్‌ని లారీ గుద్దేసింది. చావుబతుకుల మధ్య పెనుగులాడుతున్న డా. వేణుని క్యాజువాలిటీకి తీసుకొచ్చారు. ఆ దుర్వార్తను విని తను కుప్ప కూలిపోయింది. తన ఫ్రెండ్స్ విమల, సుశీల తనకు ధైర్యం చెప్పి క్యాజువాలిటీకి తీసుకు వెళ్లారు. తన కళ్ళెదుటే మృత్యువుతో పోరాడుతూ వేణు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఆ విషాదంనుండి తేరుకుని మామూలు మనిషవడానికి తనకు చాలాకాలమే పట్టింది. వేణు ఫోటో చూస్తున్న వింధ్యకు ఆ దుస్సంఘటన ఇప్పుడే జరిగినట్లనిపించి దుఃఖంతో గుండె పట్టేసింది. చెక్కిళ్ళపై జారబోతున్న కన్నీటిని తుడుచుకుని, సంబాళించుకుని వచ్చి కుర్చీలో కూర్చుంది.
అంతలో వినయ్, ఆనంద్ ఫ్లెక్స్ ముందు దీపాల్ని వెలిగించి నివాళినర్పించారు.
“మనతో పాటు ప్రయాణం మొదలుపెట్టిన వారిలో కొంతమంది మనకళ్ళముందే మాయమయిపోయారు. తన అందంతో, అల్లరితో అందర్నీ ఆకర్షించిన విద్యుల్లత ఇంకా మనం కాలేజీ గడపదాటకుండానే మనల్ని వీడిపోయింది. తన హాస్యంతో మనకు గిలిగింతలు పెట్టిన సుధాకర్‌ని మృత్యువు అతి కర్కశంగా తన కౌగిలిలోకి తీసుకుంది. ‘మేము రాఘవ బ్యాచ్ వాళ్ళం’ అని మనందరం గొప్పగా చెప్పుకున్న రాఘవ మనకళ్ల ముందే కేన్సర్‌తో నరకయాతనను అనుభవించి కనిపించని లోకాలకు వెళ్ళిపోయాడు. ఎంతో ప్రతిభ, భవిష్యత్తు ఉన్న వేణు హౌస్ సర్జన్సీలో ఉండగానే రోడ్ ఏక్సిడెంట్‌లో చనిపోయాడు... ఇందులో చాలామంది అకాలమృతి చెందారు’’ ప్లెక్స్‌లోని ఫోటోలవంక చూస్తూ ఒక క్షణం ఆగాడు డా. నెహ్రూ.
‘‘జాతస్య మరణం ధ్రువమ్. మనం ఎంత తాపత్రయపడినప్పటికి, మనకు శాశ్వతత్వపు భ్రమను కలిగించిన జీవితపు బుడగ క్షణంలో ఠప్పున పేలిపోయింది. ప్రతి ఒక్కరికి అది తథ్యం అని తెలిసినప్పటికి దుఃఖపడకుండా ఉండలేము. వీళ్ళతో మనలో చాలామందికి సాన్నిహిత్యం, స్నేహం ఉంది. మన దుఃఖాన్ని నిగ్రహించుకుని శ్రద్ధాంజలిని సమర్పిద్దాం. మీలో ఎవరైనా ఒకటి, రెండు నిమిషాలు మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడండి’’ డా. నెహ్రూ స్వరంలో గాఢమైన విచారం తొణికిసలాడింది. అంతలోనే నిగ్రహించుకుని డా. వినయను మాట్లాడమని డా. నెహ్రూ ఆహ్వానించాడు.
“రెప్ప తెరిస్తే జననం, రెప్ప మూస్తే మరణం అన్నాడో గొప్పకవి. రెప్పపాటు కాలమే జీవితం. ఆ జీవితాన్ని ఎంత అర్థవంతంగా, ఎంత ప్రయోజనకరంగా, ఎంత ఆనందంగా జీవించాం అన్నది కీలకం. మనతోపాటు ప్రయాణం మొదలుపెట్టిన మన ఫ్రెండ్స్ పాదముద్రలు మధ్యలోనే ఆగిపోయాయి. గుప్పున వెలిగి ఈ లోకానికి వెలుగును పంచవలసిన జీవితాలు చప్పున ఆరిపోయాయి. దుఃఖంతో నాకు ఏమి మాట్లాడాలో తోచడం లేదు. మనని విడిచిపోయిన మన ఫ్రెండ్స్‌కి నా నివాళి’’ చెమ్మగిల్లిన నేత్రాలను దాచుకుంటూ వేదిక దిగింది వినయ.
“మృతి చెందిన మన మిత్రులకు నివాళి. నాలుగేళ్ళ క్రితం నాకు ఛెస్ట్ పెయిన్ వచ్చి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. మన రాఘవతో చూపించుకుందామని వైజాగ్ వచ్చాను. ‘‘అరవైదాటాయి, ఇక కౌంట్ డౌన్ మొదలవుతుంది కదా! ఒకసారి చెక్ చేయించుకుందామని వచ్చాను’’ అన్నాను. వెంటనే వాడు ‘కౌంట్‌డౌన్ ఇప్పుడు మొదలవ్వడమేమిటిరా? మనం పుట్టినప్పుడే మన కౌంట్‌డౌన్ మొదలవుతుంది’ అన్నాడు. వాడామాట అన్నాక సంనత్సరం తిరగకుండానే వాడి కౌంట్ సున్నకు చేరిపోయింది, వాడు వెళ్ళిపోయాడు’’ రుద్ధమయింది డా. రామ్ స్వరం. మొత్తం హాలు వాతావరణం గంభీరంగా మారిపోయింది.
రెండు మూడు నిమిషాల తరువాత శశికళ నెమ్మదిగా వేదిక ముందుకు వచ్చి మంద్రస్వరంతో చెప్పసాగింది.
‘‘ఫ్రెండ్స్! మన మిత్రులకు శ్రద్ధాంజలిని సమర్పించే ఈ ఘట్టం మనకో అద్భుతమైన అవకాశాన్నిచ్చింది. అందుకు మన మూర్తి, నెహ్రూ, వారి బృందానికి మనం కృతజ్ఞత తెలుపుకోవాలి. మన గురించి మనం ఆత్మశోధన చేసుకోవడానికి, మనలోకి మనం తొంగిచూచుకోవడానికి ఈ సమావేశం స్ఫూర్తినిస్తోంది. సామాన్యంగా చాలామందికి మృత్యువు వాకిట్లోకి వచ్చాక ఈ స్పృహ కలుగుతుంది. ఇంతవరకు మనం పరిజ్ఞానంవెంట, పదవుల వెంట, ఆస్తులవెంట, పేరు ప్రతిష్టలవెంట పరుగుపెట్టాము. వీటిపై వ్యామోహాన్ని త్యజించటం అంత సులభంకాదు. మన స్వార్థాల్ని, అహాల్ని, అజ్ఞానాల్ని తొలగించుకోవటమూ అంత సులభం కాదు. మనని, మన కుటుంబాన్ని దాటి మన పరిధిని సమాజానికి విస్తరించాలనే దృఢమైన నిర్ణయాన్ని తీసుకోగలిగితే వీటన్నిటి నుంచి విముక్తమవడానికి మనకి బలం వస్తుంది’’ శశికళ స్వరం, మాటలు, సందర్భం, వాతావరణం తాత్కాలికంగానైనా అందర్నీ ఒప్పించే విధంగా ఉన్నాయి.
“మనకీ సమాజం ఎంతో ఇచ్చింది. చదువుకునే అవకాశం, సంపద, గౌరవం, ప్రతిష్ట... మన మేధస్సు, కృషి, శ్రమప్రధానమైనవే, కాని... సమాజపు అండ, ఆమోదం, ఆసరా లేకపోతే వాటికి తగిన ఫలం దక్కేది కాదు. ఇప్పటివరకు మనకోసం, మన కుటుంబం కోసం బ్రతికాము, మనలో కొంతమంది సమాజానికి కొంత చేస్తూ ఉండి ఉండొచ్చు. కాని... శశికళ అన్నట్లు మనం అందరం నిర్ణయించుకోవలసిన సమయం వచ్చేసింది. మనం చురుగ్గా జీవితాన్ని గడపగలిగే కాలం మహా అయితే పదేళ్ళు. మనం చెయ్యగలిగిన పనుల్ని ఇప్పుడే ప్రారంభిద్దాం, ఇవ్వడంలోని ఆనందాన్ని ఆస్వాదిద్దాం. ఆలస్యం చేస్తే సంతృప్తితో కన్నుమూయగలిగే గొప్ప అవకాశాన్ని కోల్పోతాం’’ భావోద్వేగంతో నెహ్రూ కంఠం కంపిస్తోంది. అప్పటికే సేవలోకి, ఆధ్యాత్మికతలోకి తనను మళ్ళించుకున్న నెహ్రూ స్వరంలో నిజాయితీ ధ్వనించింది.
వింధ్యకు వేణు మాటలు గుర్తుకొస్తున్నాయి. ‘‘డాక్టర్ కేవలం మేధస్సుతో కాక హృదయాన్ని కూడా కలిపి తన ప్రొఫెషన్ చెయ్యాలి. రోగిపట్ల నిజాయితీ, ఎంపతీ లేని వ్యక్తి డాక్టర్ వృత్తికి అనర్హుడు’’ అనేవాడు. దానికి చిన్న చేర్పు, ‘కుటుంబం నుండి సమాజానికి తమ పరిధిని విస్తరించుకోవాలి. కొంతమంది వ్యక్తిగత ఔదార్యాలవల్ల సమాజానికి పెద్ద ప్రయోజనం చేకూరకపోవచ్చు. ధర్మాన్ని సమన్యాయాన్ని పరిరక్షించాల్సిన వ్యవస్థలు సజావుగా పనిచెయ్యకపోతే ఇలాంటి చిన్ని చిన్ని ప్రయత్నాల వల్ల పెద్దగా లాభం ఉండకపోవచ్చు. కాని... వ్యక్తుల సమూహమేకదా సమాజం! ఇక్కడ ఉన్నవారిలో కనీసం ఇరవై మంది శశి, నెహ్రూ కోరినట్లు తమ స్వార్థాన్ని వదిలించుకోగలిగితే... ఇంక తమ స్వంతం గురించి ఆలోచించడం మానేసి సమాజం గురించి ఆలోచిస్తే... కేవలం తమ స్వంత ఆనందం గురించి కాక ఇతరుల ఆనందం గురించి కూడా ఆలోచిస్తే... అదంత సులభం కాకపోవచ్చు... కాని అసాధ్యం మాత్రం కాదు. సమాజం ఎంతో కొంత లాభపడకుండా ఎలా ఉంటుంది?!’ తనలో తాను తర్కించుకుంటూ తన లోపలికి చూపు నిలిపిన వింధ్యకు తన లక్ష్యం ఎదుట నిలిచినట్లనిపించింది.