అంకితం
తన ప్రతిభతో సాహితీప్రపంచంలో ఒక ప్రభంజనం సృష్టించిన రచయిత్రి. మూడు దశాబ్దాల పాటు నవలాప్రపంచంలో మకుటం లేని మహారాణి లాగా వెలిగిన మహా రచయిత్రి. లక్షలాదిమంది పాఠకులకు ఆమె అభిమాన రచయిత్రి. లేఖిని సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షురాలు... ఆమే కీర్తిశేషులు యద్దనపూడి సులోచనారాణి గారు.
ఆ తరం రచయిత్రుల అడుగుజాడలలో నడుస్తూ రచనలు చేస్తున్న ఈనాటి రచయిత్రుల ‘కథల లోగిలి’ కథాసంకలనం మొదటి భాగాన్ని సగౌరవంగా కీర్తిశేషులు యద్దనపూడి సులోచనారాణి గారికి అంకితం ఇస్తున్నాం.
***
శుభాకాంక్షలు
‘లేఖిని రచయిత్రుల వేదిక’ వాసా ప్రభావతి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దగ్గర నుంచి నాకీ సంస్థతో అనుబంధం ఉంది. సుప్రసిద్ధ రచయిత్రులు ఎందఱో ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నారు. శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా, డాక్టర్ వాసా ప్రభావతి అధ్యక్షురాలిగా ఉన్న ఈ సంస్థలో సభ్యులుగా శారదా శ్రీనివాసన్, ముక్తేవి భారతి, శ్యామలారాణి, తమిరిశ జానకి వంటి సీనియర్స్ ఎందఱో సభ్యులుగా ఉన్నారు. నన్నపనేని రాజకుమారి, డాక్టర్ గీతారెడ్డి సలహాదారుగా ప్రతి ఏడాది లేఖిని వార్షికోత్సవాలు జరుపుతూ రచయిత్రులు వారి, వారి తల్లుల పేరిట తోటి రచయిత్రులకు మాతృదేవోభవ పురస్కారాలు ఇవ్వడం గొప్ప సంస్కారం.
డాక్టర్ వాసా ప్రభావతి తదనంతరం కూడా వారి ఆశయం మేరకు ‘లేఖిని’ బాధ్యతలు స్వీకరించి సంస్థని ముందుకు తీసుకుని వెళ్తున్నారు రచయిత్రులు. ప్రస్తుతం ఈ సంస్థలో ఉభయరాష్ట్రాల రచయిత్రులు, కొందరు విదేశాల్లో ఉన్న తెలుగు రచయిత్రులు కూడా ఇందులో సభ్యులు కావడం ముదావహం. వాసా ప్రభావతి గారు తన భుజాలపైన పెట్టిన బాధ్యతని సంతోషంగా స్వీకరించి, ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో కొత్త, కొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ ప్రతిష్టాత్మక సంస్థగా ‘లేఖిని’ని తీర్చిదిద్దుతున్న అధ్యక్షురాలు అత్తలూరి విజయలక్ష్మికి, కార్యదర్శులు సరస్వతి కరవది, నండూరి సుందరీ నాగమణి, కామేశ్వరి చెంగల్వల, ఉపాధ్యక్షురాలు అల్లూరి గౌరీలక్ష్మి మొదలైన సభ్యులకు అభినందనలు తెలియచేస్తున్నాను. అలాగే ఎన్నో విషయాల్లో తమ తమ సలహాలు ఇస్తూ సంస్థని ముందుకు నడిపిస్తున్న పొత్తూరి విజయలక్ష్మి గారికి, మంథా భానుమతి గారికి, తమిరిశ జానకి గారికి కూడా నా అభినందనలు.
ఇప్పుడు ఎందఱో కొత్త రచయిత్రులు సభ్యులుగా ఉన్నారు. వారి అందరి రచనలు తీసుకుని కథాసంకలనం తీసుకురావడం హర్షించదగిన విషయం. ఈ కథా సంకలనం లేఖిని ప్రతిష్ట మరింత పెంచాలని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. -- కె.వి. రమణాచారి , IAS (Rtd)
అందమైన ముంగిలి - ఆలోచనల లోగిలి
కథ వేరు, జీవితం వేరు అని నేనెప్పుడూ అనుకోను. కథ ఎప్పుడు మన జీవితంలో భాగమే. కొండొకచో జీవితమే కథ కూడానూ. కథ మనిషి జీవితాన్ని అల్లుకుపోయిన ప్రక్రియ. కొత్తకాలం వచ్చేసి, సాహిత్యంలో కొన్ని తీర్మానాలు, నిర్వచనాలు చేసి ప్రక్రియ అంటున్నాం కానీ, కథ మానవ సంస్కృతిలో ఒక భాగం. మనసంతా వ్యాకులత నిండి, వ్యధ చెందుతున్నప్పుడు, బ్రహ్మగారు ప్రత్యక్షమై చెప్పమన్నప్పుడు వాల్మీకి ఆదికావ్యం పేరుతో చెప్పింది రామకథే కదా? వైశంపాయనుడు, జనమేజయునికి చెప్పిన కథే కదా మనకి వ్యాసభారతంగా అంది వచ్చింది. మన భారతీయ సంస్కృతికి, ఏవి ఆదర్శవంతమూ, అనుసరణీయమూ అని మనం అనుకుంటున్నామో, ఆ రామాయణం, మహాభారతాలు కథలే కదా! మరీ అంత వెనక్కి ఎందుకులే అనుకుని ముందు కాలానికి నడిస్తే, వచ్చేది ప్రబంధ యుగం. అప్పట్లోనూ, మనం విన్నవి కథలే. అయితే ప్రవరుని కథ, కాదంటే సత్కీరుని కథ, కలభాషిణి కథ సరేసరి. కథ కాలంతో మనలో ప్రవహిస్తూనే ఉంది.
తెలియని కాలాల గురించి ఎందుకు? తెలిసిన కాలం గురించి చెప్పుకుందాం అంటే, నవీన కాలం వచ్చేనాటికి, ఆధునికాంధ్ర మహాభారతంలాంటి కన్యాశుల్కం ఉండనే ఉంది. అదెలా? కన్యాశుల్కం నాటకం కదా! అనే ప్రశ్న వస్తుంది. ప్రక్రియ పరంగా కన్యాశుల్కం నాటకం. కాదనడానికి లేదు. కానీ అందులో చెప్పింది ఆనాటి సమాజం కథ కాదా! ఏవో కొన్ని పాత్రలు కల్పన చేసి, వాటిలో కొన్ని స్వభావాలు ప్రతిష్ట చేసి, అన్నింటికీ సమాకలనం చేసి చెప్పింది. ‘ఆనాటి కుటుంబాల కథ కదా! సరే, అదెలా కుదురుతుంది?’ అనుకుందాం. ఆధునిక సారస్వతానికి యుగకర్త గురజాడ చెప్పిన చెప్పిన ‘దిద్దుబాటు’ కథే కదా? పైగా తెలుగు సాహిత్య చరిత్రకు అందివచ్చిన మొట్టమొదటి కథ అదేననే వాదన ఉండనే ఉంది.
పోన్లెండి. కాసేపు సాహిత్యాన్ని అట్టేపెట్టి జీవితంలోకి తొంగి చూద్దాం. పండగలకో పబ్బాలకో అమ్మమ్మ, తాతయ్యల ఇంటికొచ్చినప్పుడు, కాస్త చీకటి పడ్డాక ఇంటి ముందు వసారాల్లోనో, ఆరుబయట మడత మంచాలపైనో ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ, అమ్మమ్మ పక్కలో పడుకొని ఆసక్తిగా విన్నవి కథలే కదూ! అలా వింటూ, వింటూ నిద్రలోకి జారిపోయిన బాల్యాన్ని తడిమిచూడండి ఎన్ని కథలు పుట్టుకొస్తాయో! నిజానికి కథకి ఆశుగుణం ప్రాణనాడి. పుట్టుకనుంచి ఆశుగుణంతోనే పరిఢవిల్లింది. బ్రహ్మోపదేశం తరువాత నారదుడు వాల్మీకికి చెప్పినా, వైశంపాయనుడు, జనమేజయునికి చెప్పినా, అమ్మమ్మలు మనకి చెప్పినా అన్నింటా కథ ఆశుగుణం కోల్పోయిందనుకోండి. అది వేరే ముచ్చట. ఇటీవలి కాలంలో అంతర్జాల వేదికలు అందుబాటులోకి వచ్చాకా కథ చెప్పుకోవడం మళ్ళీ మొదలయ్యింది.
కథ అంటే కేవలం మనదే అనుకోవడానికి లేదు. ఎందుకంటే కథ ఏదో ఒక భాషకు పరిమితమైనది కాదు, అన్ని భాషల్లోనూ కథ ఉంటుంది. కథకి విశ్వవ్యాప్తమైన విస్తృతి ఉంది. కాసేపు తెలుగు కథ గురించే మనం మాట్లాడుకుంటే మన కథపైన పాశ్చాత్య సాహిత్య ప్రభావం ఉంది అనేది కాదనలేని సత్యం. పైగా దాదాపుగా అందరూ ఒప్పుకున్న విషయమే ఇది. కథకు కొన్ని, కొన్ని ప్రమాణాలు కల్పించి, సాహిత్యంలో నిలబడిపోయే స్థాయిలో కథలందించిన కథకులు మనకు చాలామందే ఉన్నారు. చలం కాలంలో చేరాకా తెలుగు కథ ఎగసి, ఎగసి పడటం మనకి తెలియనిది కాదు కదా? శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు, చింతాదీక్షితులు, మల్లాది, బుచ్చిబాబు, పాలగుమ్మి పద్మరాజు, కొడవటిగంటి, మునిమాణిక్యం ఇంకా ఎందరెందరో కథకులు ఎన్నెన్నో వన్నెలు అద్దారు తెలుగు కథకి. ఎంతటి జీవితాన్ని మనముందు పోతపోశారు. అలాగే రచయిత్రులలో శ్రీమతులు తురగా జానకీరాణి, అరవింద, మాలతీచందూర్, యద్దనపూడి సులోచనారాణి, కె.రామలక్ష్మి, ఐ.వి.ఎస్ అచ్యుతవల్లి, ఆచంట శారదాదేవి, ముప్పాళ్ళ రంగనాయకమ్మ ఇలా పేర్కొనవలసిన పేర్లు ఇంకా ఎన్నెన్నో... ఈ కాలానికొస్తే ఈ రచయితల, రచయిత్రుల పేర్లు అనేకానేకం.
కథ ఏదైనా పాఠకునికి దగ్గరగా చేరాలంటే, చదివింపజేసే గుణం ఉండాలి. అధికశాతం రచయితలకు, రచయిత్రులకు ఈ విద్య బాగానే పట్టుపడిందని చెప్పుకోవాలి. చాలా సామాన్యంగా కనబడే అంశంతో కథ రాస్తూ, శిల్పరీత్యానో, ఇతరత్రానో కథ బాగుందే అనిపించగలుగుతున్నారు. కథలన్నీ ఒకేలా ఉండాలని లేదు. కొన్ని కాలక్షేపంగా సాగిపోతాయి. కొన్ని మంచి కథలుగా రాణిస్తాయి. ఇంకొన్ని గొప్ప కథలుగా చిరకాలం నిలిచిపోతాయి. ఈ మొదటిరకం కథల్లో చెప్పే అంశం, ఏమంత ప్రామాణికం కాకపోయినా, కాసేపు కులాసాగా చదివిస్తాయి. అవి ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం లేదు. ఇతివృత్తం ఎంపికలోనే ఉదాత్తమై ఉండి శైలీ, శిల్పాలు రమ్యంగా సాగి, విషయం మనసులో నాటుకునేలా ఉంటే కథలన్నీ మంచి కథల జాబితాలో చేరతాయి. గొప్ప కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. అవి క్రమం తప్పకుండా వస్తాయని చెప్పడానికి లేదు. అయితే కాలంతో పాటు నిలిచిపోతాయి. కథలంతా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నవాళ్ళు ఇప్పుడు గమనించే స్థాయిలో వస్తూనే ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు లేఖిని చేస్తున్న ఈ ప్రయత్నం సరికొత్తది అనలేము కానీ మంచి ప్రయత్నం. ‘కథల లోగిలి’ పేరుతో అందరూ రచయిత్రులు రాసిన కథలను ఎంపిక చేసుకుని ఒక సంకలనంగా ప్రచురిస్తున్నది. బహుశ ఇది ప్రథమభాగం అనుకుంటాను. ఇందులో ప్రసిద్ధులైన రచయిత్రులు తారసపడతారు. ఈ ఆలోచన ఉభయులకో గౌరవం ఇచ్చినట్లుగా ఉంది.
రేణుకా అయోలా వ్రాసిన ‘చనుబాలు’ మతాంతర వివాహం చేసుకున్న కూతురు కుటుంబానికి దూరమైనా, కన్నకూతురుని కాదనుకోలేక ఆమె తల్లి కూతురు పురిటికి అమెరికా వస్తుంది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులే అయి ఉంటారు కనుక, నెలలు నిండని పసికందుల కోసం చనుబాలు ముందే తీసి బాటిల్స్‌లో భద్రపరుస్తుంటారు. వేళ ప్రకారం పసికందులకు అందించడం అమ్మమ్మల డ్యూటీ. ఇదే పరిస్థితిలో ఉన్న ఎదురింటి ఒక అమ్మమ్మ చేతిలోంచి పాలు ఒలికిపోతాయి. వెంటనే ఆ ఇంటికి పాలకోసం రావడం, లలిత ఇవ్వడం జరుగుతుంది. పని ముగిసిన తర్వాత, ‘మీరు బ్రాహ్మలేనా?’ అని ఆవిడ అడగటంతో ఎంతో మథన పడుతుంది. ఈ కథలో మానవసంబంధాల్లోని భావసంఘర్షణ ఎంతో ఆలోచనాత్మకంగా ఉంది.
మరొక రచయిత్రి ఈరంకి ప్రమీలారాణి అనుకుంటాను. ‘ఇది మయసభా? కాదు కాదు...’ అని ఒక కథ రాసింది. సామాన్యంగానే నడుస్తోంది కానీ, మంచి పరిష్కారాన్ని చెప్పి భ్రమను తొలగిస్తుంది. సరోజ మధ్యతరగతి గృహిణి. పెళ్ళీడుకొచ్చిన కొడుకు, తర్వాత పెళ్ళి కావాల్సిన ఇద్దరు కవల ఆడపిల్లలూనూ. కొడుక్కి పెళ్ళి సంబంధాలు వెతుకుతుంటే, అసలు విషయం తెలుస్తుంది. సమస్యను, తెలివితేటలు లేవనుకునే ఈ మధ్యతరగతి గృహిణి ఇటు కొడుకులోనూ, అటు కానున్న కోడలులోనూ భ్రమలు తొలగిస్తుంది. జీవితం పట్ల వివేచన కలిగిస్తుంది. మంచి పరిష్కారాన్ని చూపించిన తీరు ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తుంది.
డా॥ ముక్తేవి భారతి ‘ఇరుకు’ అనే శీర్షికలో మరో కథ రాసారు. రాజారావు, పద్మజ దంపతులు కౌటుంబికమైన కథ. కొడుకూ కోడలు, ఆపైన మనవలూనూ. చిన్న ఇంటితో ప్రారంభమైన జీవితమే పెద్ద ఇంటికే ఎదిగింది. అయినా నాలుగు రోజుల కోసం ఇంటికి బంధువులొస్తానంటే రాజారావు తప్ప ఏ ఒక్కరికీ మనస్థిమితం ఉండదు. అదే ఇంట్లో పనిచేసే పనిమనిషి రాజమ్మ ఉండేది చిన్న గుడిసే అయినా ఇంటికి వచ్చిన ఆడబిడ్డ కుటుంబంతో తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. ‘ఇరుకు’ ఇంట్లో ఉందా? వాళ్ళ మనసుల్లో ఉందా అనే అంశంపై ఎంతో వివేచనతో కలిగిస్తుంది రచయిత్రి. మానవ మనస్తత్వంలోని వైరుధ్యాన్ని హృదయాకర్షకంగా ఆవిష్కరించారు.
‘బోగన్విలియా’ అనే మరో కథ కూడా మనకి తారసపడుతుంది. డా॥ అమృతలత వ్రాసిన కథ. ఇందు అందరు గృహిణుల్లాంటిదే. సువాసనలు వెదజల్లే పూలంటే ఇష్టపడే భర్త రవి, ఒక కూతురూనూ. భర్తకంటే భిన్నంగా తానుమాత్రం బోగన్విలియా పూలంటే ఇష్టపడుతుంది, ఆకుల్ని కూడా మించిపోయేంతగా పూస్తాయి కనుక. ఎక్కువ కాలం అందం చిందిస్తూ ఉంటాయి కనుక. ఇంటిముందు రోడ్డుమీద ఆరుగురు వయసులో ఉన్న కూలీలు అందులోనూ ఆడపిల్లలు నాటే మొక్కలు బోగన్విలియాలైతే బావుండునని ఆశపడుతుంది. కూలీపిల్లలు అనుకునే వాళ్ళల్లో ఇద్దరూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని తెలిసి ఆశ్చర్యపోతుంది. అంతే కాదు కథలో కిడ్నాపైన ఆమె కూతుర్ని కూడా వాళ్ళే రక్షిస్తారు. కథ ఆసక్తిగా సాగుతుంది. సురభిళాలు లేని అందమైన పూలమొక్కలు నాటుతున్న ఆడపిల్లల మనసులు మానవత్వంతో పరిమళిస్తుంటే, ఆమె ఆనందానికీ, ఆశ్చర్యానికీ అవధులు ఉండవు. సౌందర్యం కన్నా, సువాసనల కన్నా, మానవత్వం పరిమళించడం ప్రధానమని చెప్పినట్టు కథ విశేషంగా గుభాళిస్తుంది. ఇంకా ఇలాంటివే ఎన్నెన్నో మంచి కథలు.
లేఖిని సంస్థ నిర్వహిస్తున్న శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మితో పాటు సభ్యులందరూ అభినందనీయులు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడొద్దని అపుడెపుడో చెప్పిన శ్రీశ్రీ మాటల్ని జీర్ణం చేసుకున్నట్లున్నారు. అందుకే తమ పని తాము చేసుకుంటున్నారు. కథల లోగిలిగా ఎందరో రచయిత్రుల కథలకు ఇలా గ్రంథరూపం సంతరిస్తున్నారు. ఎంతైనా గృహిణులు కదా! ముందస్తుగా ముంగిళ్ళను ముస్తాబు చేసారు. అక్షరాల చుక్కలు పెట్టి రంగవల్లులు దిద్ది, ముంగిళ్ళను అలంకరించారు. అక్షరాలతో అందాలు తీర్చిన ముంగిళ్ళకు అందరినీ ఆహ్వానిస్తున్నారు. ముచ్చటైన ముంగిలి నుంచి లోగిలికి ప్రవేశించండి. ఇల్లు చూసి ఇల్లాలిని చూడమన్నారు కదా! రచనలను పలికించినట్టు ఉంటుంది. రచయిత్రుల అంతరంగాల్లోకి ప్రవేశించినట్టూ ఉంటుంది. --- డా॥ వోలేటి పార్వతీశం
మా మాట
“ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి – మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి – చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి – గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే, ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడే గొప్ప” ఎంత గొప్ప జీవితానుభవం లేకుంటే ఇంత అద్భుతమైన సత్యాలను చెప్తారు పెద్దవాళ్ళు. డాక్టర్ వాసా ప్రభావతి గారి నుంచి నేను ఇదే నేర్చుకున్నాను.
40 ఏళ్ళకి పైగా నాకు వారితో పరిచయం. మాట కరుకు... కానీ మనసు మంచిది. ఆవిడలో కల్మషం లేదు, మనసులో ఒకటి, పైకి ఒకటి మాట్లాడే మనస్తత్వం కాదు. ఆమె ‘లేఖిని’ పేరుతొ ఒక మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్థ స్థాపించిన రోజే ఆవిడకి ఈ సంస్థ గురించిన ఒక ప్రణాళిక బలంగా ఉంది. రచయిత్రులకి వారి స్వరం వినిపించడానికి ఒక వేదిక కావాలి. అదే ‘లేఖిని’ ఆవిర్భావానికి నాంది. వారు నమ్మిన ఆశయం వైపే మమ్మల్ని కూడా నడిపించారు. అప్పుడు నేను ప్రధాన కార్యదర్శిని. యద్దనపూడి సులోచనారాణి గారు వ్యవస్థాపక అధ్యక్షురాలు. ఆ తరువాత ఎందఱో రచయిత్రులు ఎన్నో పదవులు నిర్వహించారు. శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి, శ్రీమతి తమిరిశ జానకి, డాక్టర్ శరత్ జ్యోత్స్నారాణి, మణి కోపల్లె, శైలజామిత్ర, రేణుకా అయోలా, స్వాతి శ్రీపాద ఇలా ఎందఱో ఈ సంస్థలో వివిధ పదవులు నిర్వహించారు. అప్పట్లో వేదగిరి రాంబాబు గారి ద్వారా, డాక్టర్ వాసా ప్రభావతి గారు ‘దీప తోరణం’ అనే పేరుతో ఒక కథాసంకలనం వేసారు. మళ్ళీ ఇన్నేళ్ళకి ఈ ‘కథల లోగిలి.’
నాటికీ, నేటికీ ‘లేఖిని’ సంస్థలో లబ్దప్రతిష్టులైన రచయిత్రులే కాదు, స్వర్ణ సుధాకర్, నన్నపనేని రాజకుమారి వంటి రాజకీయాల్లో కీలక పదవులు నిర్వహించిన వారు సైతం లేఖిని సంస్థలో ప్రధానపాత్ర పోషించారు. అంతేనా, సంగీత, నాట్య కళాకారిణులు, టి.వి, రంగస్థల నటీమణులు, సీరియల్స్ రాస్తున్నవారు, స్క్రీన్‌ప్లే రచయిత్రులు, ఉన్నత విద్యావంతులు, ఉన్నతపదవుల్లో ఉద్యోగాలు చేసినవాళ్ళు, చేస్తున్నవాళ్లు, ఎంతో ఉన్నత స్థానంలోకి చేరిన మహిళలు ఎందఱో సభ్యులుగా ఉన్నారు.
ఎందఱో కొత్త రచయిత్రులు వారు, వారు ఎంచుకున్న అంశాలను చక్కని అవగాహనతో, పరిశీలన, పరిశోధనతో authentic గా రాస్తున్నారు. ఏ తరానికి ఆ తరంలో నూతన రచనావిధానం, వినూత్న ఇతివృత్తాలు, జీవన వాస్తవ పరిస్థితులు కథాంశాలుగా వస్తున్నాయి. అలాంటి వాటిని కొన్నిటిని ఇప్పుడు మరో సంకలనంగా వేసి భద్రపరచాలన్న కోరిక నా మనసులో ఎప్పుడో జనించింది. అది అనుకోకుండా ఇప్పుడు కార్యరూపం దాల్చింది.
ఈ సంకలనం తీసుకురావడంలో నాతోపాటు బాధ్యతలు పంచుకున్నారు శ్రీమతి సరస్వతి కరవది గారు. ఎప్పటికప్పుడు లేఖిని గ్రూప్‌లో reminders పెడుతూ, తోటి రచయిత్రులను ఉత్సాహపరుస్తూ, తన సహాయ, సహకారాలు అందించారు. ఆమెకి ప్రత్యేక అభినందనలు. లేఖినిలో ఉన్న రచయిత్రులు సామాన్యులు కాదు, లబ్దప్రతిష్టులు. ముఖ్యంగా ఎలాంటి వాదాలు, వర్గాలు, తేడాలు లేని రచయిత్రులు. సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రేమించే రచయిత్రులు, సంప్రదాయాలను, సంస్కృతిని గౌరవించే రచయిత్రులు, ప్రపంచాన్ని నిటారుగా నిలబెట్టే కుటుంబవ్యవస్థ పట్ల అంతులేని నమ్మకం ఉన్న రచయిత్రులు, సాహిత్యం అనేది విశ్వజనీనం అని భావించే రచయిత్రులు. అందుకే ఏ పత్రిక తిరగేసినా, ఏ పోటీలో గెలుపొందినా కనిపించేవి ఈ రచయిత్రుల పేర్లే. సంస్థ అధ్యక్షురాలిగా ఇది నాకెంతో గర్వకారణం.
మొదటి ప్రయత్నం అయినా, 74 మంది రచయిత్రులు ముందుకు రావడంతో ఈ కథాసంకలనాన్ని రెండు భాగాలుగా ప్రచురించాలని నిర్ణయించాము. అలాగే ఈ కథాసంకలనం ప్రతిపాదన గ్రూప్‌లో చూసిన వెంటనే, రచయిత్రి, కళాకారిణి డాక్టర్ లక్ష్మీ రాఘవగారు వారి సహకారం అందించారు. ప్రముఖ రచయిత్రి లలితారామ్ (శ్రీమతి దేవులపల్లి రేవతి గారు) దేవులపల్లి కృష్ణశాస్త్రి ఫౌండేషన్ ద్వారా పాక్షిక ఆర్థిక సహాయం అందించారు. వారికి ఇరువురికీ ప్రత్యేక కృతఙ్ఞతలు.
మా ప్రయత్నాన్ని ఆశీర్వదించి, ప్రోత్సహించిన డాక్టర్ కె.వి. రమణాచారి గారికి అనేకానేక ధన్యవాదాలు. వారు లేఖిని సంస్థకి ఆది నుంచి ఎంతో అండగా ఉంటూ ప్రోత్సాహం అందిస్తున్నారు. అలాగే మేము కోరిన వెంటనే సహృదయంతో వారి శుభాకాంక్షలు అందించిన మా అందరి అభిమాన రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు.
ఇక డాక్టర్ ఓలేటి పార్వతీశం గారు నాటి నుంచీ లేఖిని కుటుంబ సభ్యులే. వారికి వాసా ప్రభావతి గారంటే ఎంతో గౌరవం. ఆ గౌరవంతోటే మాకు కూడా సదా వారి సహాయ, సహకారాలు అందిస్తూ పీఠిక రాసారు. వారికీ మా గౌరవాభివందనాలు.
ఇక అంతర్జాతీయ కళాకారుడు, రచయిత, అందరికీ ఆత్మీయుడు ‘బ్నిం’ గారు మేము కోరగానే వారి శైలిలో శుభాకాంక్షలు అందించారు, వారికి వందనాలు. లేఖిని సభ్యులే అయినా, ఇతరపనుల ఒత్తిడి వల్ల వారి కథలు ఈ సంకలనంలో ప్రచురించడానికి సమయానికి ఇవ్వలేకపోయినా, పీఠిక ద్వారా వారి అభిప్రాయం అందించిన శ్రీమతి శీలా సుభద్రాదేవి గారికి, శుభాకాంక్షలు అందించిన శ్రీమతి గంటి భానుమతి గారికి ధన్యవాదాలు.
చిన్నప్పుడు చదువుకున్నాం. భగవంతుడు నీకు రెండు చేతులు, ఒక నోరు ఎందుకు ఇచ్చాడు అంటే, తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయడానికి అనే సమాధానం. అందుకు అసలైన ఉదాహరణ మిత్రుడు, దర్శకుడు, మంచి కళాకారుడు, రచయిత ‘ఉలి’ గారు. మా కథా సంకలనానికి కవర్ పేజీని సుందరంగా తీర్చిదిద్దారు. వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు.
శ్రీమతి నండూరి సుందరీ నాగమణి గారికి తెలుగుభాష పట్ల మక్కువ ఎక్కువ. లేఖిని సంస్థ పట్ల అంకితభావంతో ఎంతో సమయం వెచ్చించి ప్రతి వాక్యంలోనూ ఎలాంటి పొరపాటు లేకుండా, పంక్చుయేషన్ మార్క్స్ తో సహా దిద్ది, పుస్తకం చక్కగా రావడానికి తన సహకారం అందించారు. అలాగే లేఖిని ఉపాధ్యక్షురాలుగా తన బాధ్యత విస్మరించకుండా, తన వంతు కర్తవ్యంగా మరోసారి కథలన్నీ చదివి ఎక్కడన్నా పొరబాటు జరిగిందా అని చూసి, జరిగిన చోట సవరిస్తూ సహకరించారు. వీరిద్దరికీ అభినందనలు.
ఇది ఒక్కరి వల్ల అయేది కాదు, సమిష్టి కృషి. ఇదొక మహా యజ్ఞం. ఈ యజ్ఞం విజయవంతంగా నిర్వహించడంలో అందరూ వారి, వారి సహకారం అందించారు. ఈ సంకలనంలోని రచయిత్రులకు అందరికీ అభినందనలు.
ఈ కథా సంకలనాన్ని అంతర్జాల మాస పత్రిక ‘సిరిమల్లె’ (sirimalle.com) లో ధారావాహికగా ప్రచురించేందుకు అంగీకరించిన సంపాదకులు డా. మధు మరియు శ్రీమతి ఉమా బుడమగుంట గార్లకు ధన్యవాదాలు.
ఈ కథలన్నీ చదవండి, మీ, మీ అభిప్రాయాలను ఈ క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియచేయండి. సదా మీ అందరి సహకారం, ప్రోత్సాహం కోరుకునే,
.... మీ అత్తలూరి విజయలక్ష్మి, లేఖిని అధ్యక్షురాలు.