Menu Close
కుమ్మీ (ధారావాహిక నవల)
బి.వి.డి. ప్రసాదరావు

"మంచిదే. ఇక వాటికి పెద్దగా పట్టింపులు రాకపోవచ్చు. వచ్చినా నేను కలుస్తాను. దిగులు వీడు" అని చెప్పాడు బిట్టు తండ్రి నవ్వుతూనే. తర్వాత, "మళ్లీ కలుస్తాను" అని చెప్పి తన ఇంటికి వెళ్లిపోయాడు.

ఆ పిమ్మట ఈ విషయాలన్నీ తన కొడుక్కు ఫోన్ చేసి చెప్పేశాడు కుమ్మీ నాన్న.

కుమ్మీ అన్నయ్య అన్నీ వినేసి, "సరే కానీయండి." అని అనేసి మొదట కుమ్మీని పిలిపించుకొని తన అభిప్రాయం తెలుసుకోమని తన నాన్నను కోరాడు.

దానికి, "అలాగే" అని అనేసి కుమ్మీకి ఫోన్ చేశాడు ఆ వెంటనే, కుమ్మీ నాన్న.

కుమ్మీ ఫోన్ కలపగానే, "తల్లీ రేపు ఇంటికి రామ్మా. నీతో మాట్లాడాలి" అని చెప్పేశాడు గమ్మున.

"అర్జంటా. ఏమిటి మాట్లాడాలి. ఫోన్లో చెప్పు" అని అంది కుమ్మీ.

"లేదు తల్లీ. మనం కూర్చొని మాట్లాడాలి. అన్నయ్యా అదే చెప్పాడు." అని చెప్పాడు కుమ్మీ నాన్న.

"విషయం ఏమిటి నాన్న" అని మళ్లీ అడిగింది కుమ్మీ అత్రంగా.

"నీ పెళ్లి కబురు" అని చెప్పి, "రేపే రావాలి తల్లీ" అని కూడా అనేశాడు కుమ్మీ నాన్న.

"రేపా. సెలవులు లేవు. అందుకే మరి ఎల్లుండి శనివారం. ఆ రోజు ఉదయం స్కూలు చూసుకొని సాయంకాలంకి వస్తాను. మర్నాడు ఆదివారం. ఏ ఇబ్బంది ఉండదు" అని చెప్పింది కుమ్మీ.

కుమ్మీ నాన్న, "ఆఁ ... అ ... సరేలే. అలాగే కానీ" అని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు.

మరి కుమ్మీ ఫోన్ కబుర్లుకు ప్రయత్నించ లేదు. పైగా తను ఇంటికి వెళ్లే లోగా ఓ మారు శేఖర్ని కలిసి మాట్లాడాలి అని అనుకుంది గట్టిగా.

***

రాత్రి -

పడుకుంటున్నప్పుడు తన రూమ్మేట్, "కుమ్మీ నేను రూం నుండి వెళ్లి పోతున్నాను. కావాలంటే నువ్వు మరో రూమ్మేట్ కై ప్రయత్నించుకో" అని చెప్పింది కుమ్మీతో.

"ఏం ఎందుకు ఎప్పుడు" అని చకచకా గాభరాతో ప్రశ్నించేసింది కుమ్మీ.

ఆ రూమ్మేట్ వెంటనే సమాధానం ఇవ్వలేదు.

కుమ్మీ ఆమెనే చూస్తోంది.

అప్పుడు ఆ రూమ్మేట్, "నా బోయ్ ఫ్రెండ్తో కలిసి ఇకపై వేరేగా ఉండబోతున్నాను." అని చెప్పింది. ఆ వెంబడే, "ఈ శనివారం మేము రిజిష్టర్ మారేజ్ చేసుకోబోతున్నాం. ఆ ఏర్పాట్లు అన్ని కానిచ్చేశాం. అప్పటి వరకు ఇది సీక్రేటే. నువ్వు అందాక దీన్ని బయటకు పొక్కనీకు. నువ్వు పొక్కనియ్యవు, ఎందుకంటే నువ్వూ లవ్లో ఉన్నావు కదా. లవ్వర్స్ అవస్థలు నీకు తెలియనివా" అని అంది తేలిగ్గా.

"ఏం మాట్లాడుతున్నావ్." అంది కుమ్మీ చిరాగ్గా.

"మేమిరువురం ప్రేమించుకుంటున్నాం. కానీ మా పెళ్లికి మా పెద్దలు కాదంటున్నారు. సో, మాకు మేమే పెళ్లి చేసుకోబోతున్నాం" అని చెప్పింది ఆ రూమ్మేట్.

"అది కాదు. నేను అడిగేది. నా గురించి. నేను లవ్వులో ఉండడం ఏమిటి" అని అంది కుమ్మీ ఇబ్బందిగా.

"మరే, ఆ ఆఫీసు వాడితో లవ్వులో ఉన్నావుగా" అంది ఆ రూమ్మేట్.

"లేదు లేదు. కాదు కాదు. మేము పరిచయస్తులమే" అని చెప్పి, తప్పదన్నట్టు శేఖర్ విషయాలన్నీ క్లుప్తంగా చెప్పుకొచ్చింది కుమ్మీ ఆ రూమ్మేట్తో.

"అరె. నీ కథ ఇదా. మీరు లవర్స్ అని నేను అనుకుంటున్నాను. ఐనా అతడికీ ఏ అడ్డు లేనట్టుంది పైగా నీకు అతనిలో నీ బిట్టు కనిపిస్తున్నాడు కదా. కనుక మీరు అనుకొని పెళ్లి చేసుకోవచ్చుగా" అంది ఆ రూమ్మేట్.

"మా పెద్దల్ని నొప్పించి నేను ఏ పని చేయను. అలా ఐతే నాకు బిట్టూయే దక్కే వాడేగా" అని చెప్పింది కుమ్మీ.

"ఈ పెద్దలు మారరు కుమ్మీ. నా మాట విను. నువ్వే మారు. ఈ ఛాన్సూ మిస్ కాకు." అని అంది ఆ రూమ్మేట్.

"లేదు లేదు. నేను అలా చేయను. పిల్లలు మీద ఎన్నో ఆశలుతో ఉంటారు పెద్దలు. వాళ్లను ఒప్పించే ప్రయత్నం చేయవచ్చు కానీ నొప్పించే పని చేయకూడదు." అని అంది కుమ్మీ.

"అది నీ ఇష్టం." అని అనేసింది ఆ రూమ్మేట్ చాలా మామూలుగా.

"నువ్వు మీ పెద్దల్ని ఒప్పించేందుకు ఎంత వరకు ప్రయత్నించావు" అని అడిగింది కుమ్మీ.

"మా వైపు కాస్తా పర్వాలేదు. నా లవర్ వైపే అడ్డు. అందుకే మేము దూరంగా పోవాలనుకుంటున్నాం. ఇది నా లవర్ సలహాయే" అని చెప్పింది ఆ రూమ్మేట్.

కుమ్మీ వెంటనే ఏమీ మాట్లాడలేక పోయింది. తనకు తన గతం గుర్తుకు వచ్చింది. బిట్టు ప్రపోజల్ గుర్తుకు వచ్చింది.
ఆ రూమ్మేట్ పడుకోడానికి పక్క సర్దుకుంటుంది.

కుమ్మీ మాట్లాడింది, "నేను ఒకమారు నీ లవర్ పెద్దలుతో మాట్లాడనా" అని.

ఆ రూమ్మేట్ చేతిలో పని ఆపి గబుక్కున కుమ్మీని చూస్తూ, "అన్ని ప్రయత్నాలూ  ఐపోయాయి. ఇక కుదరకే ఈ నిర్ణయంకు వచ్చాం" అని చెప్పింది.

"ఇది చివరి ప్రయత్నం అనుకో. ఒకసారి ఆయన తరపు పెద్దవాళ్ళతో మాట్లాడతాను నేను నీ లవ్వర్ తరపున" అని చెప్పింది కుమ్మీ. బిట్టు సంగతి వారికి చెప్పాలను కుంటుంది.

ఆ రూమ్మేట్ మాట్లాడలేదు. కానీ అదోలా నవ్వేసింది.

"నీ లవర్ పెద్దలది ఈ ఊరేనా" అని అడిగింది కుమ్మీ.

"వాళ్లది ఈ ఊరే. నా లవర్ని నువ్వూ చూశావు" అని చెప్పింది ఆ రూమ్మేట్.

"అవునా. అదే ఆ నల్లగా సన్నగా పొడుగ్గా ఎప్పుడూ టక్ లోనే ఉంటాడు నీతో చాలా మార్లు ఉండడం నేను చూశాను. అతడా?" అని అడిగింది కుమ్మీ సునాయాసంగా.

"అవును. అతడే." అని అంది ఆ రూమ్మేట్.

"నువ్వు యస్సంటే నేను అతడి పెద్దల్ని ఓ మారు కలుస్తాను" చెప్పింది కుమ్మీ.

"వద్దు వద్దు. మా ప్లాన్ ప్లాప్ కావచ్చు. లేనిపోని తంటాలు మరి వద్దు. మా ఆలోచనలు మావి. మొదట పెళ్లి చేసేసుకుంటాం. పిమ్మట మా పెద్దలు దగ్గరకు వెళ్తాం. అప్పుడు వాళ్లు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. లేదంటే మా పాట్లు మావి" అని అంది ఆ రూమ్మేట్ కాస్తా నిబ్బరంగానే.

కుమ్మీ మాట్లాడలేదు.

ఆ రూమ్మేట్ పక్కేసుకొని పడుకుండిపోయింది.

కుమ్మీ పిలిచింది.

ఆ రూమ్మేట్ పలకలేదు.

కుమ్మీని ఆ రూమ్మేట్ వ్యవహారం భయపెట్టింది. దాంతో తనకు నిద్ర పట్టక తెల్లవారే వరకు నానా అవస్థలు పడిపోయింది. తను తన ఊరుకు వెంటనే పోవాలని నిశ్చయించుకుంది అప్పుడే. శేఖర్ కై మరి ఆలోచించలేక పోయింది కూడా.

***

మర్నాడు -

చీకట్లు పోయి సన్నగా వెలుగు వస్తోంది.

కుమ్మీ గబగబా తయారైపోతోంది.

ఆ అలికిడికి కుమ్మీ రూమ్మేట్ నిద్ర లేచి పక్క మీదే కూర్చొని, "ఏమిటి ఇంత త్వరగా తెమిలిపోతున్నావు" అని అడిగింది కుమ్మీని.

"మా ఇంటికి వెళ్తున్నాను. లీవ్ లెటర్ వ్రాసి ఉంచాను. స్కూలులో ఇచ్చేయవా" అంది కుమ్మీ.

"సరిసరే. కానీ ఏమిటీ తొందర. రాత్రి అనలేదు కూడా. ఉదయం ఫోన్ ఏమైనా వచ్చిందా. ఏం మీ అమ్మగారికి మళ్లీ బాగా లేదా" టకటకా అడిగింది ఆ రూమ్మేట్.

కుమ్మీ, "అబ్బే అదేమీ కాదు. పనివుండి వెళ్తున్నాను." చెప్పింది.

ఆ రూమ్మేట్, "అవునా. ఐనా సెలవులు తగ్గిపోతున్నాయి అని అంటున్నావుగా. మరి ఎందుకు ఇప్పుడు. కావాలంటే రేపు క్లాస్ చూసుకొని వెళ్లవచ్చుగా. ఆదివారం కూడా కలిసి వస్తోంది" అని అంది. ఆ వెంటనే, "ఐనా ఉండరాదూ. రేపే నేను రూం నుండి వెళ్లిపోతున్నానుగా." అని కూడా అంది.

కుమ్మీ, "లేదు నేను వెళ్తాను. ఏమీ అనుకోకు. నేను సోమవారం వచ్చేస్తాను. వీలు ఐతే నువ్వు వస్తే స్కూలులో కలుసుకుందాంలే" అని చెప్పింది.

"నా వంట సామాన్లు, మిగిలిన కొన్ని వస్తువులు ఇక్కడే వదిలేస్తా. నువ్వు వాడుకో వచ్చు" అని చెప్పింది ఆ రూమ్మేట్.
కుమ్మీ ఏమీ అనలేదు. తను బ్యాగ్ సర్దుకుంటుంది.

ఆ రూమ్మేట్ లేచి తన హేండ్ బ్యాగ్లోంచి కొన్ని నోట్లు తీసి కుమ్మీకి అందిస్తూ, "నా షేర్గా రావలసిన రూం రెంట్, కరెంట్ బిల్లు. ఇది ఫైనల్ది" అని చెప్పింది.

కుమ్మీ ఆ నోట్లును అందుకుంది. లెక్కపెట్టి తన హేండ్ బ్యాగ్లో పెట్టుకుంది.

"ఇంతకీ ఏమిటి కుమ్మీ ఈ ఎకాఎకీ ప్రయాణం" అని తిరిగి అడిగింది ఆ రూమ్మేట్.

"నా పెళ్లి విషయం మా వాళ్లతో మాట్లాడాలి" అని చెప్పేసింది కుమ్మీ.

"అవునా. మనసు మార్చుకున్నావా.  ఆ ఆఫీస్ వాడ్నే పెళ్లి చేసుకో బోతున్నావా. పెద్దలు ఏమన్నా అతడ్నే చేసుకో. పైగా నీ బిట్టూలా ఉన్నాడని తెగ ఇదవుతున్నావుగా. ఛాన్స్ వదులుకోకు." అని అనేసింది ఆ రూమ్మేట్ గడబిడిగా.

"లేదు లేదు. అట్టిది ఏమీ లేదు. నేను నా పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటాను. వాళ్లని ఇబ్బంది పెట్టను. నేనూ ఎట్లాంటి ఇబ్బంది పడ తలుచుకోలేదు. పెళ్లిచేసుకొని హాయిగా ఉండాలి తప్ప అలజడిగా ఉండకూడదు అని నేను కోరుకుంటున్నాను" అని ఖచ్చితంగా చెప్పింది కుమ్మీ.

ఆ రూమ్మేట్ ఏదో అనబోతోంది.

అంతలోనే కుమ్మీ, "ఇదిగో ఇక్కడ పెట్టాను లీవ్ లెటర్. తప్పకుండా స్కూలులో ఇచ్చేయవా ప్లీజ్. మరి, నేను బయలు దేరుతున్నాను." అంటూ ఆ రూం బయటకు వచ్చేసింది మరో మాటకు అవకాశం లేకుండా.

***

ఇంట్లోకి వస్తున్న కుమ్మీని చూసి ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. పనికి వెళ్లబోతున్న వాళ్లు కుమ్మీ రాకతో తమ చేతుల్లోని పని ముట్లును పక్కన పెట్టేశారు.

"రేపు సాయంకాలం వస్తానన్నావుగా తల్లీ" అని అన్నాడు కుమ్మీ నాన్న.

"మీరు త్వరగా రమ్మన్నారని వీలు కల్పించుకొని వచ్చేశాను" చెప్పింది కుమ్మీ బల్ల మీద కూర్చుంటూ.

"ఉప్మా ఉంది కొద్దిగా. పెడతాను తల్లీ" అంది కుమ్మీ అమ్మ.

"ఉంటే పెట్టమ్మా. మీరు తిన్నారా" అని అంది కుమ్మీ.

"మేము తినేసి ఇదిగో పనికి పోతున్నాం. నువ్వు వచ్చావు" అని చెప్పాడు కుమ్మీ నాన్న అక్కడే కూర్చుంటూ.

కుమ్మీ అమ్మ ఉప్మా ప్లేట్, నీళ్ల గ్లాసుతో వచ్చింది. వాటిని కుమ్మీకి అందించింది. తనూ అక్కడే కూర్చుండి పోయింది.

"నీ ఆరోగ్యం బాగుంటుంది కదమ్మా" అని అడిగింది కుమ్మీ తన అమ్మను.

"మందులు వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగుంటుంది" అని చెప్పింది కుమ్మీ అమ్మ.

అప్పుడే వీధి లోనించి కుమ్మీ నాన్నను ఎవరో పిలుస్తున్నారు.

"మేస్త్రీ వచ్చాడు. ఈ రోజు పనికి రామని చెప్పేయ్" అని చెప్పింది కుమ్మీ అమ్మ కుమ్మీ నాన్నతో.

కుమ్మీ నాన్న అలానే చేసి తిరిగి వచ్చి అక్కడ కూర్చున్నాడు.

కుమ్మీ ఉప్మా తిని పెరట్లోకి వెళ్లి వచ్చింది.

తన తడి చేతులును తన చున్నీతో తుడుచుకుంటూ, "ఏమైనా సంబంధం చూశారా" అని అడిగింది తన తల్లిదండ్రులును.

"ఇలా బల్ల మీద కూర్చో. చెప్తాను." అని అన్నాడు కుమ్మీ నాన్న నెమ్మదిగా.

కుమ్మీ కూర్చుంది.

కుమ్మీ నాన్న ఆగి, "తల్లీ నీ పెళ్లి గురించి నీ మనసులో ఏదైనా ఉంటే చెప్పమ్మా మొదట. అన్నయ్య నిన్ను మరీ మరీ అడిగి తెలుసుకోమన్నాడు" అని అన్నాడు కుదురుగా.

కుమ్మీ బిత్తరపోయింది.

కుమ్మీ అమ్మ కుమ్మీనే చూస్తోంది.

మళ్లీ అడిగాడు కుమ్మీ నాన్న.

"చెప్పు తల్లీ. నాన్న అడిగిందే నేనూ అడుగుతున్నా" అంది కుమ్మీ అమ్మ.

అప్పుడు, "అదేమిటి అలా అడుగుతున్నారు" అంది విస్మయంగానే.

"గతం లాంటి పొరపాటు రాకూడదని తల్లీ" చెప్పాడు కుమ్మీ నాన్న సౌమ్యంగా.

"లేదు నాన్నా. మీ ఇష్టమే నాకు ఇష్టం ఎప్పటికీ" అని చెప్పింది కుమ్మీ మెల్లిగా.

కుమ్మీ తల్లిదండ్రులు మొహాలు చూసుకున్నారు.

అది చూసింది కుమ్మీ.

"సరే బిట్టు వాళ్లు నీకు ఒక సంబంధం చూశారు. బిట్టు తండ్రి మన ఇంటికి వచ్చి మాట్లాడేడు మాతో" అని చెప్పాడు కుమ్మీ నాన్న కుమ్మీతో.

"ఏమిటీ వాళ్లు మనతో మాట్లాడుతున్నారా. బిట్టు తండ్రి ఆయన మన ఇంటికి వచ్చారా" అని వింతవుతూ అడిగింది కుమ్మీ.

"అవును తల్లీ. బిడ్డ పోవడంతో వారికి తెలిసి వచ్చింది. ఆ పశ్చాత్తాపంతోనే వాళ్లే చొరవ చూపుతున్నారు నీ పెళ్లికి" చెప్పాడు కుమ్మీ నాన్న.

"బాగుందే" అని అనేసింది కుమ్మీ నింపాదిగా.

"ఆ పెద్ద మనిషికి ఈ బుద్ధి ముందు ఉండవలసింది. ఇన్ని అనార్ధాలు వచ్చేవి కావు" అంది కుమ్మీ అమ్మ.

"కాదులేయే. మనదీ తప్పు ఉంది. మనమూ అరిచాం కాదనేశాం" అన్నాడు కుమ్మీ నాన్న.

కుమ్మీ ఏమీ అనలేదు.

"అంతేలే. అంత జరగకపోతే వాళ్లూ మారరు మనమూ మారాలనుకోం." అంది కుమ్మీ అమ్మ.

తలెత్తి తన అమ్మను చూసింది కుమ్మీ.

ఆమె తలదించుకొని ఉంది.

చూపు మార్చింది కుమ్మీ. తన నాన్నను చూసింది.

అతడూ తల దించుకొనే ఉన్నాడు.

కుమ్మీ గుండె నిండా గాలి పీల్చుకుంది స్థిమితంగా.

ఒకటి రెండు నిముషాల తర్వాత కుమ్మీ నాన్న, "ఆయన అదే బిట్టు తండ్రి నీ పెళ్లికి చేదోడుగా ఉంటానన్నాడు. పైగా మంచి సంబంధమే తెచ్చాడు. అన్నయ్యతో మాట్లాడాను. వాడూ సరే నన్నాడు. కానీ నీ మతి ముందు తెలుసుకోమన్నాడు" అని చెప్పాడు.

"ఆ సంబంధం వివరాలు ఏమిటి" అడిగింది కుమ్మీ మామూలుగానే.

కుమ్మీ నాన్న చిన్నగా నవ్వుతూ, "అబ్బాయి పట్నంలోనే ఉంటున్నాడు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు" అని చెప్పుతూ ఆగాడు.

ఆ గేప్లోనే కుమ్మీ, "ఎవరు అతను" అని అడిగింది టక్కున.

"ఆ అబ్బాయి నీకు తెలుసు తల్లీ" చెప్పాడు కుమ్మీ నాన్న.
"అవునా" అంది తప్పా మరేమీ అడగలేకపోయింది కుమ్మీ. కానీ తనలో ఆత్రం ప్రవేశించి ఉంది. అలాగే అదే స్థాయిలో తర్జనభర్జనా ఉంది.

కుమ్మీ తల్లిదండ్రులు మళ్లీ మొహాలు చూసుకున్నారు. ఈ మారు ముసిముసిగా ఎవరికివారు నవ్వుకుంటున్నారు.

కుమ్మీ ఇదంతా చూస్తోంది. కానీ ఏమీ అనలేక పోతోంది.

ఆగి చివరికి కుమ్మీ నాన్న, "ఆ బిట్టులాంటివాడే తల్లీ" అని చెప్పాడు నవ్వుతూ.

"నాన్నా" అంది కుమ్మీ చిత్రంగా.

"మరే తల్లీ. ఆ శేఖర్ బాబే" అని చెప్పేశాడు కుమ్మీ నాన్న.

కొద్దిసేపు అక్కడ చాలా మౌనం ఉంది.

పిమ్మట కుమ్మీ నాన్న దానిని చెదరకొట్టాడు, "నీ మాట ఏమిటి తల్లీ" అని అడిగి.

కుమ్మీ ఏమీ అనలేదు ఇంకా. తను కాస్తా చిక్కని చక్కని భావం మధ్య ఇరుక్కుని ఉంది ప్రస్తుతం.

"ఏమంటావు తల్లీ" అని అడిగింది కుమ్మీ అమ్మ.

అప్పుడు కదిలి చెప్పింది కుమ్మీ, "మీ ఇష్టం" అని.

దాంతో అక్కడ అలా మొదలైన సంబరం, కుమ్మీ, శేఖర్ల పెళ్లిని దాటి ఇంకా కొనసాగుతూనే ఉంది.

.... సమాప్తం ....

Posted in June 2018, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!