Menu Close
కుమ్మీ (ధారావాహిక నవల)
బి.వి.డి. ప్రసాదరావు

"పోరా. ఆ పిల్ల మంచిదిరా. మనమే ఆ అబ్బాయి మన బిట్టులా ఉంటేనే అతడి వైపు మొగ్గి పోతున్నాం. అలాంటిది మన బిట్టును ప్రేమించిన పిల్ల మన బిట్టు లాంటోడు కనిపిస్తే పలకరించదా, పరిచయం పెంచుకోదా?" అని అనేశాడు బిట్టు తండ్రి.

"పలకరింపులు, పరిచయాలు ఐతే పర్వాలేదు. మరింకేదైనా అవ్వ, ఏమైనా ఉందా" అన్నాడు బిట్టు స్నేహితుడు రొప్పుతున్నట్టు.

"అట్టిదేమీ ఉండదు లేరా. ఆ శేఖర్ మంచోడి లెక్కన ఉన్నాడు" అని అన్నాడు బిట్టు తండ్రి.

"ఏమో మామా. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో ఎవరికి తెలుసు" అని అనేశాడు బిట్టు స్నేహితుడు.

"నోర్మూయ్రా. ఆరిందోడిలా మాట్లాడకు. పోరా" అనేసి అక్కడ నుండి ఆ బిట్టు స్నేహితుడిని వదిలేసి తన ఇంటి వైపు నడిచాడు బిట్టు తండ్రి.

************

మధ్యాహ్నం -

లంచ్ టైం ముగుస్తున్న సమయాన బిట్టు తండ్రి పట్నం వచ్చి శేఖర్ను అతడి ఆఫీసులో కలిశాడు.

"బాబూ మీతో మాట్లాడాలి" అన్నాడు బిట్టు తండ్రి.

శేఖర్ అతడిని ఆఫీసు బయటకు తీసుకు వచ్చి ఆ చెట్ల నీడన బెంచీ మీద కూర్చోమని తనూ అతడి పక్కనే కూర్చున్నాడు.

"ఏమిటో చెప్పండి." అన్నాడు శేఖర్ నవ్వుతూ.

ఆగి, "మీరు మా బిట్టులా ఉన్నారు. కనుక మిమ్మల్ని ఆ నా బిడ్డే అనుకుంటున్నాను." అని అన్నాడు బిట్టు తండ్రి.

"మళ్లీ చెప్పుతున్నాను. నిరభ్యంతరంగా తప్పక అలానే అనుకొండి." అన్నాడు శేఖర్ అలానే నవ్వుతూ.

"మరేమీ లేదు. మీకు పెళ్లి ఐందా" అని అడిగేశాడు బిట్టు తండ్రి శేఖర్ను.

"మొదట మీరు మీ బిట్టును మీరు, మీకు అనే అంటుంటారా" అని అడిగాడు శేఖర్ నవ్వుతూనే.

"అబ్బే లేదు లేదు" అన్నాడు బిట్టు తండ్రి తడబాటులా.

"కదా. ఇక మీ బిట్టుతోనే మాట్లాడుతున్నట్టే నాతో మాట్లాడండి." అని చెప్పాడు శేఖర్.

"సంతోషం బాబూ." అన్నాడు బిట్టు తండ్రి పొంగిపోతూ.

"గుడ్. ఇక నా పెళ్లి. ఐంది. కానీ నా భార్య లేదు. చనిపోయింది. నేను ఒంటిగాడ్నే" అని చెప్పాడు శేఖర్.

బిట్టు తండ్రి వెంటనే ఏమీ మాట్లాడలేదు.

ఆ సమయంలోనే, "నాకు సంబంధమేదైనా ఉందా ఏమిటి." అని అడిగాడు శేఖర్ గలగలా నవ్వుతూ.

"మళ్లీ పెళ్లి చేసుకుంటారా" అని అడిగేడు బిట్టు తండ్రి.

"కుంటారా కాదు కుంటావా అని అడగండి" అని చెప్పాడు శేఖర్.

"అదే అదే" అని అన్నాడు బిట్టు తండ్రి సంశయంగా.

"అందుకే ముందే అడిగాను. సంబంధమేదైనా ఉందా అని. అందుకు నా కుటుంబం గురించి మా పట్టింపులు గురించి ఏమైనా చెప్పాలా" అని నవ్వేడు శేఖర్.

"వద్దు వద్దు. లేదు లేదు. నేను కాదు కాదు మేము ఇప్పుడు వాటిని పట్టించుకోవద్దనుకున్నాం. మీరు ఉహు నువ్వు ఆ రోజు చెప్పినవి మా తలకు ఎక్కాయి" అని చెప్పాడు బిట్టు తండ్రి.

"అవునా. ఐతే నిజంగా సంతోషమే. ఇక నాకు మళ్లీ పెళ్లి మీద తలంపు లేదు. అలా అని ఆలోచించను అనీ అనను" అని చెప్పాడు శేఖర్.

"చాలు బాబు. భలే చెప్పావ్" అని అంటూ మురిసిపోయాడు బిట్టు తండ్రి.

ఆ తర్వాత ఆ మాట ఈ మాట కానిచ్చి తిరిగి ఊరుకై వెను తిరిగాడు బిట్టు తండ్రి.

శేఖర్ కాఫీ ఆఫర్ చేసినా అతడు వద్దనేశాడు సరదాగానే.

************

సాయంకాలం -

స్కూలు కాగానే తిన్నగా వెళ్లి శేఖర్ని కలిసింది కుమ్మీ.

ఆ ఇద్దరూ ఆ చెట్ల నీడనే ఆ బెంచీ అంచుల్నే కూర్చున్నారు. మాట్లాడు కుంటున్నారు.

రాత్రి తన నాన్న, అన్నయ్యల  సంగతులు అన్నీ చెప్పింది కుమ్మీ శేఖర్కు.

"నిజమే, వాళ్ళ భయాలు వాళ్ళ బాధ్యలు వాళ్ళవి. వారిని తప్పు పట్టకూడదు. వారి మాటలను పెడ చెవిన పెట్టకూడదు" అని చెప్పాడు శేఖర్.

కుమ్మీ వింది.

"ఏది ఏమైనా ఎలా ఎప్పుడు ఏది జరగాలో, అలా అప్పుడు అది జరుగుతోంది. ఇది నేను నమ్ముతాను. మీరూ అలా అనుకొండి. మీకూ హాయిగా ఉంటుంది." చెప్పాడు శేఖర్ నవ్వుతూ.

కుమ్మీ నవ్వేసింది.

పిమ్మట మాటలు కరువైపోయినట్టు వాళ్లు ఖాళీగా కూర్చుండి పోయారు కొంత సేపు.

తర్వాత కుమ్మే లేచింది. శేఖర్తో చెప్పేసి తన రూం వైపు నడిచింది.

శేఖర్ ఆఫీసులోకి తిరిగి వెళ్ళిపోయాడు.

తన పక్క కో-ఎంప్లాయ్ అడిగాడు, "ఈ రోజు త్వరగా విడిచి పెట్టేసిందే" అని.

అందుకు శేఖర్, "ఉఁ. షాప్టు కార్నర్ పర్షన్. ఇగ్నోర్ చేయలేను" అని చెప్పుతూనే వర్కు లోకి ప్రవేశించాడు.

************

రాత్రి -

దిగువ వాడకు వెళ్లాడు బిట్టు తండ్రి.

అంతకు ముందు తన వారితో వివరంగా చాలాసేపు మాట్లాడి వాళ్ళ సమ్మతితోనే అటు వెళ్లాడు.

అలా వెళ్లి కుమ్మీ ఇంటి ముందు తచ్చాడుతున్నట్టు కదులుతూ కుమ్మీ నాన్నని పేరు పెట్టి పిలిచాడు కాస్తా లోనికి వినబడేలా.

కుమ్మీ నాన్న బయటకు వచ్చాడు.

బిట్టు తండ్రిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ వెంటనే చిన్నగా షేకయ్యాడు కూడా.

"తమరు ఇటు వచ్చారేమిటి" అని అడిగాడు కుమ్మీ నాన్న.

బిట్టు తండ్రి ఒంగి ఆ ఇంటి వసారా దాటి ఆ గడపలో మంచం దండి మీద కూర్చున్నాడు.

కుమ్మీ నాన్నకు అంతా చిత్రంగా తోస్తోంది.

అంతలోనే గడపలోకి వస్తున్న కుమ్మీ తల్లి అక్కడనే నిలబడిపోయింది.

"రా ఇలా వచ్చి కూర్చో. నీతోనే మాట్లాడడానికి వచ్చాను" అని చెప్పాడు బిట్టు తండ్రి కుమ్మీ నాన్నతో తను కూర్చున్న మంచాన్నే చూపుతూ.

కుమ్మీ నాన్న కీ ఇచ్చిన బొమ్మలా వీధిలోనించి గడపలోకి వెళ్లి కూర్చున్నాడు. ఆ మంచం మీద కాదు తన భార్య తెచ్చి వేసిన బల్ల మీద.

ఆగి మాట్లాడేడు బిట్టు తండ్రి, "ఏమీ లేదు. కుమ్మీకి సంబంధాలు చూస్తున్నారట కదా. ఆ పెళ్లి కబుర్లు కదపడానికే వచ్చాను" అని చెప్పాడు బిట్టు తండ్రి.

కుమ్మీ తల్లిదండ్రులు మొహాలు చూసుకున్నారు.

"అలా తెల్లబోకండి. మరోటి అనుకోకండి. తెమలండి జల్దీగా. కుమ్మీకి ఈడు పోనీకండి. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు తప్పులు తగాదాలు వద్దు. కుమ్మీకి సంబంధం చూసి పెళ్లి చేయండి. కాదు చేధ్దాం. మా బిట్టు ఆత్మ ఇలాగైనా సుఖపడుతోంది. బిడ్డ సౌఖ్యం కంటే కోరుకొనేది ఏముంటుంది" అని చెప్పాడు బిట్టు తండ్రి నెమ్మదిగానే.

"తమరు ... మీరేనా ..." తడబడుతున్నాడు కుమ్మీ నాన్న.

"చూడు ముందే అన్నానుగా. గతం మరి వద్దు. మన మధ్య సంబంధం కాక పోయినా, ఎంతైనా మనం ఒక ఊరు వాళ్లం. అలా అనుకొనే వచ్చాను. నువ్వూ అలానే అనుకో. ఇక మనం మనం ఒకటి. ఏమంటావు." అని ఆ వెంటనే, "ఇంతకు మించి మీరు ఏదన్నా మీకు మా మీద పగ ప్రతీకారం ఉంచుకున్నట్టే అని నేను అనుకుంటాను. తర్వాత మీ ఇష్టం. ఇక చెప్పండి" అన్నాడు బిట్టు తండ్రి.

కుమ్మీ తల్లిదండ్రులు పిమ్మట, వెంటనే ఏమీ అనలేకపోయారు.

అంతలోనే, "కుమ్మీ పెళ్లికి ఏ సాయం చేయమన్నా చేస్తాను. నా ఇంట బిడ్డ మరి ఏడి. కుమ్మీ ఒక బిడ్డే." అని చెప్పాడు బిట్టు తండ్రి బొంగురైన గొంతున.

చలించారు కుమ్మీ తల్లిదండ్రులు.

"మీరు సాయ పడంతానంటే కాదంటామా. బిడ్డ లేని లోటు మేము ఎరగగలం" అని అన్నాడు కుమ్మీ తండ్రి అదే రీతిన.

"చక్కగా అన్నావు. సంతోషం. నాకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉంది. మీరు ఉఁ అంటే ఆ అబ్బాయితో మాట్లాడి తీసుకు వస్తాను. అప్పటికి కుమ్మీని తెప్పించి మాట్లాడదాం" అన్నాడు బిట్టు తండ్రి.

"తమరిష్టం" అని అనేశాడు కుమ్మీ నాన్న.

"లేదు, అబ్బాయిని చూస్తే మీరూ ఇష్ట పడతారేమో అనిపిస్తోంది." చెప్పాడు బిట్టు తండ్రి.

ఆ తర్వాత ఆనందంగా తన ఇంటికి తిరిగి వచ్చేశాడు బిట్టు తండ్రి. ఇంట్లో వాళ్లకి జరిగింది చెప్పాడు.

కుమ్మీ నాన్న తన కొడుకుకు ఫోన్ చేశాడు. విషయం అంతా చెప్పాడు.

తొలుత కుమ్మీ అన్నయ్య ఆశ్చర్యం వగైరాల్లాంటివి వ్యక్త పరిచినా, కుమ్మీ నాన్న బిట్టు తండ్రి తీరును విడమర్చి చెప్పడంతో కుదుట పడి సరే అన్నట్టు మాట్లాడేడు. పైగా ఈ విషయాలేవీ వెంటనే కుమ్మీకి చేరవేయ వద్దని కూడా చెప్పి, "తనకు స్వయంగా కలిసి నప్పుడు తెలియ చేస్తే మంచిది. లేదంటే వాళ్ల మీద కోపంగా ఉన్న తను మరింత రగిలిపోతోందేమో, దాంతో కాదనేస్తాదేమో" అని కూడా అన్నాడు.

దాంతో అట్టి ప్రయత్నం చేపట్టలేదు కుమ్మీ నాన్న.

************

మర్నాడు -

ఉదయం -

ఆఫీసుకు వెళ్లి శేఖర్ని బయటకు తీసుకు వచ్చి ఓ పక్కగా నిలబెట్టి మాట్టాడేడు బిట్టు తండ్రి.

"బాబూ సమయం వచ్చింది. నీకు మళ్లీ పెళ్లి ఇష్టమో కాదో సూటిగా చెప్పు. నేను ఒక సంబంధం చూశాను. వాళ్లతో మాట్లాడేను. నువ్వు చూస్తే తప్పక నచ్చుతావని అనిపిస్తోంది" అని చెప్పాడు.

శేఖర్ తడబడ్డాడు. తటపటాయింపులో పడ్డాడు.

"తేల్చు బాబు. ఈ రోజు మంచిది. నీ మాటతో ఇటు నుండి అటు వెళ్లి వాళ్లతో మాట్లాడి మీకు మీకు ఎదురు పరుస్తాను" అని అన్నాడు బిట్టు తండ్రి ఉత్సాహంగా

"ఏమిటండీ ఇదంతా. తొందర తొందర ఏమిటి. నేను ఏదో అనుకుంటూ మాట్లాడేశాను తప్పా నేను ఆ తలంపులో లేను ఇంకా" చెప్పాడు శేఖర్.

"ఏముంది బాబూ. అంతగా ఆలోచించుకోడానికి. ఒంటరి జీవితం ఎందుకు. ఎంత మందికి అది మంచిది. నా వరకైతే అది కాదంటాను. చెప్పితే మీ పెద్దల్నీ కలిసి మాట్లాడతాను. నీ శ్రేయస్సుకు మీ వాళ్లు ఎవరూ అడ్డు పడరని నేను నమ్ముతాను" అని చెప్పాడు బిట్టు తండ్రి.

"నా వైపు వాళ్లూ అదే చెప్పుతున్నారు. నా మళ్లీ పెళ్లికి వాళ్లు ఒప్పుకుంటారు. ఎటొచ్చి నాదే నిర్ణయం" అని చెప్పాడు శేఖర్.

"మరింకేం. ఒప్పేసుకో బాబూ" అని అన్నాడు బిట్టు తండ్రి తొందరలా.

"నేను ఒకరితో మాట్లాడాలి మొదట. ఆ తర్వాత మీతో మాట్లాడతాను" అని చెప్పాడు శేఖర్ మెత్తబడుతూ.
బిట్టు తండ్రి గమ్మున ఏమీ అనక, ఆగి, "ఎవరితో, ఆ అమ్మాయి అదే కుమ్మీతోనేనా" అని అడిగేశాడు టక్కున.
గతుక్కుమన్నాడు శేఖర్.

"ఆఁ. అది అది మీకు ఇది ఎలా తెలుసు" అన్నాడు శేఖర్ చాలా కంగారులా.

"అదంతా గుర్తించే నేను కలుగుచేసుకుంటున్నాను బాబూ. తొలుత మీ అభిప్రాయాలేమిటో తెలుసుకోడానికే ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నాను" అని చెప్పాడు బిట్టు తండ్రి చిన్నగా నవ్వుతూ.

శేఖర్ నవ్వేడు. "నిజానికి నేను కుమ్మీ తల్లిదండ్రులుకూ తెలుసు. వాళ్లు హాస్పిటల్లో ఉండగా వాళ్లను నాకు కుమ్మీయే పరిచయం చేసింది. అలాగే కుమ్మీతోనూ నాది మామూలు పరిచయమే. అంతే. అందుకే నేనే తొలుత కుమ్మీతో స్ట్రయిట్గా పెళ్లికై మాట్లాడి చెప్పుతాను" అని అన్నాడు.

"తను నిన్ను కలుస్తుంది. తన వారినీ పరిచయం చేసింది. అంటే తనూ పెళ్లికి మొగ్గుతోందని అనుకుందాం. ఐనా నేను కుదురుస్తాగా. నాకు వదులేసి అన్నీ. నేను చూసుకుంటాను" అన్నాడు బిట్టు తండ్రి భరోసాలా.

"సరే మీ ఇష్టం ఇక" అనేశాడు శేఖర్ చివరిగా.

"శుభమ్. తిరిగి కలుస్తా" అంటూ అక్కడ నుండి కదిలేశాడు బిట్టు తండ్రి జడిలా.

************

సాయంకాలం -

కుమ్మీ తల్లిదండ్రులును కలిశాడు బిట్టు తండ్రి.

"అబ్బాయిని కలిశాను. ఇక మనం అనుకొని కుమ్మీని రప్పిద్దాం. నేను ఆ అబ్బాయిని రమ్మంటాను. పిల్లలు సరే అనుకుంటే తర్వాత పెద్దలం కబుర్లు ఆడేద్దాం" అని చెప్పాడు హుషారుగానే.

"అబ్బాయి వివరాలు ఏమిటి" అని అడిగాడు కుమ్మీ నాన్న నెమ్మదిగానే.

"ఆ అబ్బాయి మీకు తెలిసిన వాడే" అని అని, "శేఖర్. పట్నంలో జాబ్ చేస్తున్నాడుగా, అతడే" అని చెప్పేశాడు బిట్టు తండ్రి చిన్నగా నవ్వుతూ.

"అతడా. అతడు అతడు మీ బిట్టు లానే ఉంటాడు. అతడు మీకు ముందే తెలుసా. మీకు వాళ్లు కావలసిన వారా" అని అడిగాడు కుమ్మీ నాన్న కాస్తా ఇబ్బందిగానే.

"నేను ఒకసారి ఆఫీసు పని మీద వెళ్తే అతన్ని కలవ వలసి వచ్చింది. అదే చూడ్డం. మాట్లాడ్డం. తర్వాత అతనే మా ఇంటికి వచ్చాడు. తను మా బిట్టులా ఉన్నాడని నేను చెపితే ఆ వివరాలుకై. అప్పుడు మాటల్లో వాళ్లకు మాకూ ఏ సంబంధం లేదు అని తేల్చుకున్నాం. తర్వాత కుమ్మీకి అతనికి పరిచయం ఉందని తెలిసింది. జరిగిపోయిన లోటును ఇలా పూడ్చాలని నేను ఈ ప్రయత్నాలు చేపట్టాను" అని చెప్పి ఆగాడు బిట్టు తండ్రి.

కుమ్మీ తల్లిదండ్రులు వింటున్నారు.

"అబ్బాయి యోగ్యుడులా అనిపించాడు. కుమ్మీకి బాగుంటుంది. కానీ ఒక్కమాట. ఆ అబ్బాయి పెళ్లి ఐనవాడు. కానీ నెలల్లోనే భార్యను కోల్పోయిన వాడు. అతడి భార్య చనిపోయింది." అని కూడా చెప్పాడు బిట్టు తండ్రి.

అప్పటికీ కుమ్మీ తల్లిదండ్రులు ఏమీ మాట్లాడలేదు.

"ఏమిటి ఏమీ అనరు. మీ మాట ఏమిటో చెప్పండి" అని అడిగాడు బిట్టు తండ్రి కాస్తా గాభరాగానే.

"అటు వాళ్లు ఎవరో వాళ్ల ఆటంకాలు ఏమిటో తెలియాలికదా" అన్నాడు కుమ్మీ నాన్న మెల్లిగా.

"ఆ మాటలూ తెలుసుకున్నాను. మనలా వాళ్లు ఈ పెళ్లికి ఆలోచించడం లేదు. అంతా ఆ అబ్బాయి మాటే. మీరు ఒప్పుకుంటే ఈ పెళ్లికి అతనూ ఇష్ట పడ్డవాడే" చెప్పాడు బిట్టు తండ్రి.

కొద్ది సేపు తర్వాత, "వద్దు. మళ్లీ జరిగిందే జరగనివ్వ వద్దు. మన పంతాలు ఎట్టి ఫలితాన్ని ఇచ్చావో మనకు తెలియందా. ముఖ్యంగా ఆ దెబ్బ నాకు కొట్టింది. మనం కాలంతో పోదాం. పట్టింపులు పంతాలు చాలు. తెగే వరకు సాగతీయవద్దు. నా మాట విని పిల్లలు ఆలోచనలు విందాం." అని కూడా చెప్పాడు బిట్టు తండ్రి.

"పిల్లలు సరే అంటే మాకూ ఇష్టమే. కానీ నా స్తోమతు గురించీ మాట్లాడండి." అని చెప్పాడు కుమ్మీ నాన్న తన భార్య తల ఊపగానే.

.... సశేషం  ....

Posted in May 2018, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!