Menu Close
GVRao
జగతినే ప్రభవింప జేసిన కుంభ మేళా ప్రభంజనం
గుమ్మడిదల వేణుగోపాలరావు

అనాదిగా ప్రతిజీవి తను భరిస్తున్న దుఃఖమయ జీవనానికి త్వరలో ముగింపు కలగాలని, ఆనందానుభవానికి ఎన్నటికీ ముగింపు ఉండరాదని, ఆ సౌఖ్య సంపద ఎంత అల్పమైనదైనా శాశ్వతంగా నిలచిపోవాలని కోరుకుంటుంది. ఆ ఆలోచనాతీరులో మానవులైనా, దేవతలైనా, దానవులైనా అందరూ ఒకటే. అది సాధించగలిగేది ఒక్క అమృతమేనని వారంతా నిర్ణయించుకుని దానిని సాధించగల పద్ధతి కోసం చాలా శోధించి చివరికి భగవాన్ మహా విష్ణువు సహాయంతో క్షీర సాగర మధనమే మార్గమని యోచించి దానికై మంధర పర్వతాన్ని కవ్వముగా ఎంచుకుని సర్పరాజమైన వాసుకిని దానిని తిప్పుటకు తాడుగా మలచి, దైత్యులని వాసుకి తల ముఖ్యమైనది గావున వారికోరికపై తల దిక్కున, దేవతలను తోకవైపున అమర్చి చిలకడం ఆరంభించారు. వెంటనే ఆ రాపిడికి వాసుకి నోట విషము కక్కుట ఆరభించగా దైత్యులు ఆ విషజ్వాలల ధాటికి తట్టుకోలేక తోక వైపుకి మార కోరగా దేవతలు అందుకు అంగీకరించి వాసుకి తలదిక్కున చేరి చిలుకుట ఆరభించగా క్షీర సాగర మధనం ఆరంభమైనదట. ఆ తిరుగుతున్న ఉధృతికి, మంధర బరువుకి వాసుకితో సహా అగాధ సముద్రము లోనికి మెల్ల మెల్లగా కృంగిపోతూండడము చూసి విష్ణువు కూర్మంగా మారి ఆ పర్వతము అడుగున జొరబడి తన బలమైన డొప్పతో దాని సముద్ర లోతులకు జారీపోవుట నాపి, తదుపరి నెమ్మదిగా సముద్ర ఉపరితలానికి తెచ్చి తిరిగి మధనానికి అవకాశాన్ని కల్పించాడు. ఆ అపూర్వ యత్నానికి ఫలితంగా క్షీరసాగరం నుంచి ముందుగా కాలకూట విషము ప్రజ్వరిల్లి లోకాలన్నిటిని దగ్ధం చేయ నారంభించగా దేవదానవులు మహావిష్ణువుని సహాయంకోరగా అతడు పరమశివుడొక్కడే దానికి మార్గనిర్దేశం చేయగలడని తెలిపెను. అంతట వారందరు ఆ మహేశ్వరుని ప్రార్ధింప అతడు అంగీకరించి ఆతని సతీమణి పార్వతికి తెలుపగా ఆమె తన భర్త శక్తి తెలిసికూడా ఆవిషప్రభావము నకు కించిత్ భీతి చెంది, క్షణమాలోచించి తన మాంగల్యం పై గల విశేష నమ్మకంతో అంగీకారము తెలిపినది. ఆతడు ఆ భయంకర జ్వాలతోకూడుకున్న విషాన్ని నేరేడు పండంత గుళికగా మార్చి నోటిలో వేసుకుని పూర్తిగా మ్రిగకుండా కంఠమునందే బిగించి ఉంచెను. ఆవిధంగా తన శరీరమే జ్యోతిర్మండల జగత్తైన ఆ పరమ శివుడు దానిని మ్రిగకుండా, బయటి విదలకుండా బహిర్లోకాలను, అంతర్లోకాలను ఆ విపత్తు నుండి కాపాడెను. ఆ కాలకూట విష ప్రభావం వల్ల తెల్లని శివుని కంఠము నీలంగా మారి నీలకంఠుడాయను. తదుపరి సాగిన క్షీరసాగర మధన ప్రస్థానంలో చంద్రుడు, ఉఛ్చైశ్రవం- ఏడూ తలలు గల బలమైన అశ్వము, ఐరావతం- ఇంద్రుని వాహనమైన తెల్లని ఏనుగు, సురభి- కామధేనువు, కల్పవృక్షము, శంఖం, లక్ష్మీదేవి, కౌస్తుభం-(తదుపరి విష్ణు వక్షస్థలం పై ఆభరణమై నిలిచింది), పారిజాతం, చివరగా అమృతభాండం తో ధన్వంతరి ఒకరి తరువాత ఒకరు సాగరంలోంచి బయటకు వస్తారు. అందులో మరణాన్నించి విముక్తిని లభింపచేసే అమృత భాండంకోసమే అందరు ఆతృత గా వేచియుండుట చేత ఆ అమృత భాండం అంతా తమకే కావాలని దేవ-దానవులు వాదులాడుకుంటున్న సమయంలో గరుత్మంతుడు ఆ భాండాన్ని ఎవరికి అందకుండా ఎగురుకుంటూ తీసుకుని వెళుతుంటే, నాలుగు అమృతబిందువులు నేలమీద పడ్డాయట. అవి పడ్డ ప్రదేశాలు- హరిద్వార్, ప్రయాగ, త్రియంబకం, ఉజ్జయిని. అందువల్ల ఆప్రదేశాలలో ప్రతి పండ్రెడు సంవత్సరాలకోసారి మేళా జరగడం ఆనవాయతీగా మారింది. దేవ-దానవుల తగవు తీర్చు నెపంతో శ్రీ మహావిష్ణువు మోహిని రూపం దాల్చి దానిని ఇరుపక్షాలకు పంచె ప్రయత్నంలో తెలివిగా దేవతలకు  భాన్డామృతాన్ని, రాక్షసులకు సౌందర్య వీక్షణామృతాన్ని పంచుతూ అమృతభాండన్ని ఖాళి చేస్తాడు.

చైనీస్ పర్యాటకులైన మూడవ శతాబ్దపు ఫా-హెయిన్ మరియు యేడవ శతాబ్దపు హీయున్ త్సాంగ్ ఈ మేళాలగురించి వారి పర్యాటక గ్రంధాలలో ఉదహరించారు. అంటే అప్పటికే అవి చాలా ప్రఖ్యాతి చెందిన మేళాలై ఉండేవి.

కుంభరాశిలో జరిగే మేళా గనుక దానిని "కుంభ మేళ" అనేవారు. ఇది పండ్రెండు సంవత్సరాల కొకసారి హరిద్వార్ లో జరుగుతుండేదని 'ఖులసత్ -ఉత్ - తవారిక్' (1695 -1699), మరియు 'చహర్ గుల్షన్' (1759) ముఘల్ కాలపు గ్రంధాలలో పేర్కొనబడింది. ప్రయాగ్, నాసిక్ మరియు ఉజ్జయిని మేళాలు నదీ స్నాన ఘట్టాలలో స్నాన, అర్ఘ్య ప్రాధాన్యతతో జరిగేవని వాటిని "సింఘస్థ మేళ" గా పిలువబడుతుండేదని వాటిలో ఉటంకించబడినది. ఢిల్లీ లో గల ప్రసిద్ధ యినుప అశోక స్తూపం పైనున్న నిక్షిప్త లిపిలో కూడా వీటి ప్రస్తావన ఉన్నది.

Kumbh Mela Image

Kumbh Mela Imageసూర్య కుటుంబంలో 95 చంద్రులతో విరాజిల్లే అతి పెద్దదైన బృహస్పతి (గురు) గ్రహం -10 ఘంటలలో తనచుట్టూ తాను తిరుగుతూ, 12 సంవత్సరాల కొకసారి సూర్యునిచుట్టూ తిరిగే ఆ సమయాన్ని ఒక పుష్కరంగా పరిగణిస్తారు. సాధారణంగా ప్రతి పండ్రెండు ఏళ్లకోసారి నదీమతల్లులకు జరిపే కుంభ మేళాలు - గంగానది కి కుంభ మేళా హరిద్వార్ లోను; శిర్పా నదికి ఉజ్జయిన్లోనూ; గోదావరి నదికి నాసిక్ లోను; గంగ, యమునా, సరస్వతి నదులకు వాటి సంగమమైన ప్రయాగరాజ్ లోను జరుపుతారు. అటువంటి పండ్రెండు పుష్కరాల కొకసారి వచ్చేది మహాహాపుష్కరం. 2025 లో ఆవిధంగా 144 సంవత్సరాల కొకసారి వచ్చే మహాపుష్కరం పవిత్ర గంగ, యమునా, సరస్వతీ నదుల సంగమంలో ఈ కుంభ మేళ జరగడం విశేషం. ఈ కుంభమేళా లో హిందువులే కాక అనేక ఇతర మతస్తులు, దేవునిపై నమ్మకము లేని వారు కూడా పాల్గొన్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు త్రివేణి సంగమం అయిన  ప్రయాగరాయాజ్ లో చాలా ఉత్సాహంగా స్నానాదికాలతో పాల్గొన్నారు. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం అది ఒక గొప్ప పర్వోత్సవం. 45 రోజులు జరిగిన ఆ మేళా 73 దేశాలనుండి 66 కోట్ల వివిధ మతస్తుల జన సందోహంతో అత్యంత వైభవోపేతమైన నదీ స్నాన ఘట్టము వినూత్న వైదిక సమూహ వేదికగా కొనియాడ బడి, "గిన్నెస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్" లో ప్రపంచములోనే ఒక అసాధారణ శాంతియుత సంఘటనగా పేర్కొనబడింది. భారత ప్రభుత్వమూ, రాష్ట్ర ప్రభుత్వం 840 మిలియన్ల డాలర్లు ఖర్చుకై బడ్జెట్ ప్రతిపాదించినా, రాబడి 23 బిల్లియన్లు వచ్చినట్లు అంచనా. చిన్న వ్యాపారస్తులెందరో అనూహ్య లాభాలని ఆర్జించారని నమ్మకమైన వార్త.

Kumbh Mela Imageకుంభమేళాకు సాధారణ దేశ, విదేశీ యాత్రికులతోబాటు, యోగులు, కల్పవాసీలు, సాధువులు, సాధ్విలు అనేక తెగల అఘోరాలు -దిగంబర, గుణ, అగ్ని, ఆవాహన, కిన్నెర, మహనిర్వాణ, అటల్, నిరంజన, నిర్మోహ, ఉదాసీ అఘోరాలు, మఠాధిపతులు పాల్గొన్నారు.

Kumbh Mela Image

ఆ నలభై ఐదురోజుల్లో వచ్చిన ముఖ్య పుణ్య తిధులు -పుష్య పౌర్ణిమ, మకర సంక్రాతి, మౌని అమావాస్య,  వసంత పంచమి, మాఘపౌర్ణిమ మరియు మహా శివరాత్రి- ఆరోజుల్లో నాదీ సంగమ స్నానం చాలా విశేష పుణ్య ఫలితాలనిస్తుందని బహుళ పురాతన గ్రంథ నిక్షిప్తము. అదీ కాకుండా ఆకాలంలో సూర్యుడు మకర రాశి లోను, చంద్రుడు కర్కాటక రాశిలోను, బృహస్పతి  (గురు)  వృషభరాశి  లోను సంచరించడం వల్ల నదీ సంగమ స్నానం అనేక విశేష శుభ ఫలితాలని అందించడమే కాకుండా మోక్ష దాయకమని జ్యోతిషశాస్త్రం వక్కాణిస్తోంది. ఆ నదీ సంగమ స్నానం శరీరాలనే కాక అంతఃశుద్ధిని కలిగించి జ్ఞానోపసానికి మార్గం సులభతరం చేస్తుందని ప్రజల గాఢ నమ్మకం. అందువల్లనే దేశ విదేశాలనుంచి అశేష జనవాహిని అక్కడికి చేరుకుంది.

Kumbh Mela Imageజనం గుమిగూడం ఒకయెత్తు, వారికి కావలసిన  సదుపాయాలు సమకూర్చడం  ఒక ఎత్తు. దానికి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పాలనా వ్యవస్థ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి, పరిపాలన వ్యవస్థని చక్కదిద్ది నిర్వహించ వలసివచ్చింది. ఉన్న 12 ఘాట్లని మెరుగు పరచి యాత్రికుల తోపిడి ధాటికి ఆగేటట్లు చెయ్యడం జరిగింది. మేళా కై 4000 హెక్టార్ (15.5 చదరపు మైళ్ళు) లో వస్తున్న జనానికి ఒక ప్రత్యేక నగరాన్ని నిర్మించడం జరిగింది. దానిలో 2 లక్షల గుడారాలు, వారికి అందుబాటులో తాత్కాలిక మరుగుదొడ్లు, అక్కడికి యాత్రికులు చేరుకోవడానికి 10000 రోజువారీ రైళ్లు, 3000 ప్రత్యేక రైళ్ల ఏర్పాటు, యాత్రికులకై పోషకారోగ్య భోజన సదుపాయాలు (రోజు దాదాపు 2000 మందికి ఉచిత ఆహార అమరిక), భాదోహి జిల్లాలో కుంభమేళాకు చేరుకుంటున్న జనాలకి ‘హైవే-19’ లో మూడు ఆస్పత్రులు, జన ప్రవాహ నిర్వహణకు శిక్షిత సిబ్బంది ఏర్పాటు, జన సమూహం ఆ ప్రదేశంలో అటునిటు తిరుగుటకు నిర్ణీత మార్గ నిర్మాణాలు, సులభ మార్గ నిర్దేశ సూచనా ఫలకాల ఏర్పాటు, అందరికి అందుబాటులో నిర్దేశిత ప్రదేశాలలో చెత్త డబ్బాలు, పొందు పరచడం జరిగింది. అద్దెకి రెండు లక్షల గుడారాలు, ఇరవై ఐదు వేల ఉచిత గుడారాలు, ఐదు లక్షల తాత్కాలిక వాహన పార్కింగ్ స్థలాలు, అరవై ఐదు వేల వీధి దీపాలు, ట్రాన్స్ఫార్మర్స్, అవసరమైనన్ని విద్యుత్ జనరేటర్లు, 250 మైళ్ళ  తాత్కాలిక రహదారులు, తొమ్మిది శాశ్వత ఘాట్లు, 30 తాత్కాలిక వంతెనలు, 150 వేల తాత్కాలిక మరుగు దొడ్లు, 775 మైళ్ళ పొడుగు నీళ్లు అవసరమైన స్థలాలకు అందించేందుకు గొట్టాలు కుంభమేళా కు వచ్చే భక్తుల కొరకు నిర్మించడమైంది. వీటిని ప్రణాళికాబద్ధంగా నిర్మించడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది. అనంతరం వాటిని నిర్మూలించడానికి, కొన్నిటిని మళ్ళీ వచ్చే ఉత్సవాలకు వినియోగించడానికై పదిలపరచడానికి పదివేల మందితో సుమారు ఏడాది పట్టవచ్చునని అంచనా. ఇంతటి భారీ ఎత్తున చేస్తున్న ప్రయత్నానికి అనేక ప్రదేశాలనుంచి వివిధ కాంట్రాక్టర్స్ పనిచెయ్యడం సహజమే. కానీ అక్కడే ఉంటున్న సామాన్యప్రజలకి కూడా చిన్నతరహా వ్యాపార అవకాశాలతో లబ్ది పొందేటట్లు, అక్కడి ఆర్ధికవ్యవస్థ పెరిగేందుకు కృషి చేసింది ఆ ప్రభుత్వం. నదీ స్నానాలు చేస్తున్నవారికి మంత్రం చెప్పి వైదిక కర్మల నాచరింపచేస్తూను, వయసుమీరినవారికి హితోధికంగా భౌతిక సహాయం చేస్తూనూ, కాఫీ టీలు తయారుచేసి అక్కడి జనాల కుతి తీరిస్తూను, నదీ తీరం నుంచి గుడారాలకి, బస్సు స్టాండుకి, రైల్ స్టేషన్, డాక్టర్ వద్దకు, హాస్పిటల్ తమ ద్విచక్ర వాహనాలపై తీసుకెళుతూను రవాణా అవసరాలు తీరుస్తూను, అక్కడి యువత సహాయం చేసి ఆర్ధికంగా లాభపడ్డారు.

రాత్రి సమయంలో గుడారాలు

నదీ స్నానమే ముఖ్య కార్యక్రమం గనుక అక్కడి పాండాలు అందరి చేత మహామృత్యుంజయ మంత్రము, ద్వైతులచేత -"శ్రీ రామజయరామ జయజయ రామ", "శ్రీ రామ రామ రామేతి రమేరామె మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే", "వినా వేంకటేశం నానాధో ననాధా, సదా వేంకటేశం స్మరామి స్మరామి, హరే వేంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ"; అంటూనూ;

శైవుల చేత "సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమోనమః| భవే భవే నాతిభావే భవస్వమామ్ భవోద్భవాయ నమః ||" అంటూనూ;

అద్వైతులచేత -"జీవో నాహం, దేహో నాహం, త్రిగుణాతీత బ్రహ్మై వాహమ్|
శుద్ధోహమ్, బుద్ధోహమ్, ముక్తోహమ్, శివోహమ్||;  అంటూనూ

వారి ముక్తికాంక్షను ఆ భగవానునికి పాండాలద్వారా తెలియజేసుకుంటారు.

రోజూ క్రమబద్ధంగా నదీ ప్రవాహంలో యాత్రికులు వేసే పుష్పాలు మొదలైన పూజా ద్రవ్యాలు, ఇతర మలినాలు, ఈ మేళా కోసమే ప్రత్యేకంగా నిర్మించిన ఊరిలోని మలినాలని శుభ్రపరచడానికి వేలకొద్దీ కార్మికులు వినియోగించబడ్డారు. రోజుకి దాదాపు 200 చెత్త బస్తాలు చేరేవి. వీటన్నిటిని సక్రమంగా జరిగేటట్లు చూడడానికి పర్యవేక్షణ బృందం ఏర్పాటు చెయ్యబడింది. రోజుకు మూడు పర్యాయాలు స్నాన ఘట్టాలలో నీటి పై పరీక్షలు జరిపిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులిచ్చిన రిపోర్ట్, దానిని పరీక్షించి సరైనదేనని ధ్రువపరిచిన ఐఐటీ, రూర్కీ, ఆ సంగమం స్నానాలకు తగినదని రూఢి పరచింది.

జనవరి 29  బుధవారం సంగమం వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రభత్వ అంచనా ప్రకారం 30 మంది మరణించగా 90 మంది గాయపడ్డారు. ఆ తరువాత ప్రభుత్వం సంగమము దరిదాపులకు నాలుగు చక్ర వాహనాల రాకపోకలు నిలిపివేసింది. తరువాత ఎటువంటి పెను అవాంతరాలు రాకుండా అన్ని సక్రమంగా, అదీ ప్రభుత్వ ఆధిపత్యంలో జరగడం ప్రపంచంలోని ఎన్నో మత నిర్వాహక సంస్థల్ని ఆశ్చర్యంలో ముంచివేసింది.

వీటిని  పరీక్షిస్తున్న "గిన్నెస్  బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్" బృందం 14 ఫిబ్రవరి న 329 మంది నదీశుభ్రతలో ఒకేసారి పాల్గొనడానికి ధృవీకరణ పత్రాన్ని అందించింది. అల్లాగే 10,102  మంది ఒకేసారి చేతి తో ఫిబ్రవరి 25  న 8 ఘంటలపాటు ఏకధాటిగా 'గంగ పందిరి' వద్ద  పెయింట్ చెయ్యడాన్ని కూడా ధృవీకరించింది. అల్లాగే 19,278 మంది ఫిబ్రవరి 24 న నెల శుభ్రం చెయ్యడం ధృవీకరించింది. ప్రపంచంలో ఎన్నడూ జరుగని, కనివిని ఎరుగని ఇంతటి విస్తృత మతపర మేళాకి రూపురేఖల్నిచ్చి, విజయవంతముగా నిర్వహించి, అందరి మన్ననలు పొందిన ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎంతో శ్లాఘనీయము.

********

Posted in April 2025, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!