కుమారి శతకము
గత సంచికతో భాస్కర శతకం పూర్తైనది. ఈ సంచికలో మరో మంచి శతకము; ‘కుమారి శతకము’ తో మీ ముందుకు వస్తున్నాను. మంచి అని ఎందుకు అన్నానంటే ఈ శతకము దాదాపు 186 సంవత్సరాల క్రితం రచించినను నేటికీ తెలుగు వారి ఇంటి అభిమాన శతకముగా విరాజిల్లుతున్నది. ‘కుమార శతకము’, ‘కుమారి శతకము’ అని రెండు శతకాలను మన తెలుగు వారికి పరిచయం చేసిన గ్రంథ కర్త కీర్తిశేషులు శ్రీ ఫక్కి వెంకట నరసయ్య గారు. వీరు 19 వ శతాబ్ద కాలంలో నివసించినట్లు తెలుస్తున్నది. పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేసిన ఈయన శకుంతలా పరిణయం, అమరపద కల్పద్రుమము, నారాయణస్తవము, మదన నాయకా పరిణయం ఇలా ఎన్నో గొప్ప గ్రంథాలను రచించినట్లు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు రచించిన ‘కవుల చరిత్ర’ ద్వారా తెలుస్తున్నది. క్రీ.శ 1869 లో ప్రథమ ముద్రణకు నోచుకోనిన ఈ శతకం నేటికీ ఎంతో ప్రజాదరణ పొందింది అంటే ఈ శతకము యొక్క సాహితీ విలువలు ఏపాటివో మనకు అర్థమౌతుంది. అంతేకాదు, నాటి సామాజిక పరిస్థితులు మరియు జీవన స్థితిగతులను మనం ఈ శతక పద్యాల ద్వారా గ్రహించేందుకు అవకాశం మెండుగా ఉన్నది.
********
కం. | శ్రీ భూ నీళా హైమావతీ భారతు లతుల శుభవతిగ నెన్నుచు స త్సౌభాగ్యము నీ కొసఁగంగ లో భావించెదరు ధర్మలోల కుమారీ!! |
తాత్పర్యము: | మంచి నడవడిక కలిగిన ఓ బాలికా! లక్ష్మి, భూదేవి, నీళహైమావతి, సరస్వతులు నీకు సకల సౌభాగ్యములు ఇచ్చుచు, కాపాడుచుండును. |
కం. | అత్తపయిన్ మఱఁదలిపయు నెఁత్తిన కోపమున బిడ్డ నేడ్పించుటకై మొత్తినఁ దనకే కీడగుఁ జిత్తములో దీనిఁజింతసేయు కుమారీ!! |
తాత్పర్యము: | అత్తమీద, మరదళ్ళమీద కోపమును తన బిడ్డల మీద చూపించి, వారిని ఏడ్పించినచో తనకే కష్టము కలుగునని మనసులో ఆలోచింపుము ఓ కుమారి! |
కం. | అమ్ముకు రెం డబ్బకు రెం డిమ్మహిఁ దిట్టించు కూతు రెందుకు ధర నా ద్రిమ్మరి పుట్టకపోయిన నిమ్మళమని యండ్రు జనులు నిజము కుమారీ!! |
తాత్పర్యము: | తల్లిదండ్రులను ఈ భూమి మీద తిట్టించు కూతురెందుకు? అటువంటిది ఈ భూమి మీద పుట్టకపోయినను మంచిదని జనులందరు అనుకొందురు. ఇది సత్యము కుమారి. |
కం. | ఆటలఁ బాటలో నే మాటయు రాకుండఁ దండ్రి మందిర మందున్ బాటిల్లు కాపురములో వాటమెఱిఁగి బాల తిరుగ వలయు కుమారీ!! |
తాత్పర్యము: | ఆట పాటలలో పుట్టింటి వద్దగానీ, కాపురము చేయు నపుడు అత్తింటి వద్దగానీ నిష్ఠూరపు మాటలు రాకుండా జాగ్రత్తగా నడుచుకొనవలయును. |
కం. | ఆపదలకోర్చి సంపద నాపయి భోగింపు మనెడి హర్షోక్తుల నీ లోపలఁ దలంచుచు లాంతరు దీపము చందమున వెలుఁగ దివురు కుమారీ!! |
తాత్పర్యము: | చలించని లాంతరులో దీపము ఉన్నట్లు కష్టములను తట్టుకొని తరువాత సుఖ సంపదలను అనుభవించ వచ్చును కదా అని చలించకుండుము. |