కుమారి శతకము
కం. | చెప్పెడి బుద్ధులలోపల దప్పకు మొకటైన సర్వదర్మములందున్ మెప్పొంది ఇహపరంబులఁ దప్పింతయు లేక మెలఁగ దగును కుమారీ. |
తాత్పర్యము: | నేను చెప్పే నీతులను జవదాటక సర్వ ధర్మములందు మెప్పును పొంది, ఇహపరములందు తప్పులేకుండ జీవించి సుఖములను పొందవలెను. |
కం. | మఱదండ్రు వదినె లత్తలు మఱఁదులు బావలు కొమాళ్ళు పెద్దలు రా నుఱవడిఁ బీటలు మంచము లురుగులు దిగుచుండవలయు నమ్ము కుమారీ. |
తాత్పర్యము: | అత్తమామలు, మరదులు, బావలు, వదినలు, మరదళ్ళు, పెద్దవారు వచ్చినపుడు పీటలు, మంచములు అరుగుల మీద కూర్చున్నచో త్వరపడి దిగవలయును. |
కం. | తన బావల పిల్లలయెడఁ దన మఱఁదుల పిల్లలందు దన పిల్లలకం టెను మక్కువ యుండవలెన్ వనితల కటులైన వన్నె వచ్చు కుమారీ. |
తాత్పర్యము: | తన బావగారి బిడ్డలయందు, తన మరిది పిల్లల యందు, తనకన్న బిడ్డలకంటే ఎక్కువ ప్రేమ కలిగి ఉండిన స్త్రీ అధిక కీర్తివంతురాలై విరాజిల్లును. |
కం. | జపములు గంగాయాత్రలు తపములు నోములు దానధర్మంబులు పు ణ్యపురాణములు పతి భక్తికి నుపమింపను సాటిరాక యుండు కుమారీ. |
తాత్పర్యము: | జపతపాలు, తీర్థయాత్రలు, నోములు, దాన ధర్మములు, పురాణములు మొదలగు పుణ్య కార్యాలేవీ పతి భక్తికి సాటి రావు కుమారీ. |
కం. | పోకిళ్ళు పోక పొందిక నాకులలోఁబిందెరీతి నడఁకువగా నెం తో కలసిమెలసి యుండిన లోకములోపలును దా వెలుంగుఁ గుమారీ. |
తాత్పర్యము: | అధిక ప్రసంగములు చేయక, ఆకు చాటు పిందె వలె అణుకువతో మెలగవలెను. అందరితోనూ వినయ విధేయతలతో కలిసియుండు స్త్రీ లోకము నందు పేరు పొందును. |
Hi sir, Indulo migilina padyaalu eppudu prachuristaru? Thanks in advance.
జక్కుల గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ఈ శీర్షికకు తాత్కాలికముగా విరామవివ్వటం జరిగింది. త్వరలో తిరిగి ప్రారంభించు ఆలోచన వున్నది.
నమస్కారములతో,
మధు బుడమగుంట.