కుమారి శతకము
కం. | ఆకులొసగిఁనఁజేకొని పోఁకనమిలి సున్నమడుగఁ బోయినఁగని యీ లోకులు నవ్వుదురు సుమీ కైకొనవలె మంచినడత ఘనత కుమారీ! |
తాత్పర్యము: | ఆకులు చేతపట్టుకొని, వక్కనములుచు, సున్నము అడిగినవానిని చూచి లోకులు నవ్వుదురు. అందువలన ఈ విధంగా మంచి నడవడిక కలిగి నడుచుకొనవలెనో ఆ విధంగా నడచిన కీర్తి కలుగును. |
కం. | ఇక్కడి దక్కడ నక్కడి దిక్కడ జెప్పినను వారి కిద్దరికిఁ బగల్ పొక్కినఁగల చేడియల మ్మక్కాయిడుమాళ్ళమారి యండ్రు కుమారీ! |
తాత్పర్యము: | ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి ఇరువురి మధ్య పగలు, ద్వేషాలు పెరుగునట్లు చేయు స్త్రీని తోటి ఆడవాళ్ళు తగవుల మారి, కయ్యాలమారి అని అందురు. |
కం. | ఎంతటి యాకలి గలిగిన బంతిన గూర్చుండి ముందు భక్షింపరు సా మంతులు బంధువులును నిను మంతైనను జెల్లందందు రమ్ము కుమారీ! |
తాత్పర్యము: | పంక్తిలో కూర్చొని భోజనము చేయునపుడు ఎంత ఆకలి అయినను ముందుగా తినరాదు. అట్లు తినినచో బంధువులు తిండి పోతని నిందింతురు. |
కం. | ఇంటగలఁగుట్టు నీపొరు గింట రవంతైనఁదెలుప నేగకు దానన్ గంటసపడి నీవారలు గెంటిచెద రిల్లు వెడలఁ గినుక కుమారీ! |
తాత్పర్యము: | ఇంటిలోని గుట్టును పొరుగింటిలో ఎవరికిని తెలుపకు. అలా తెలిపితివేని అది గోరింతలు కొండంతలై నీ అత్తమామలు, భర్తకు తెలిసి నిన్ను ఇంటినుండి గెంటివేసెదరు. కనుక జాగ్రత్త కుమారీ! |
కం. | ఇద్దరు గూడుక యొకచో నొద్దిక మాటాడుచుండ నొదిగి యొదిగి యా యొద్దకుఁ జనగూడదు తన పెద్దతనం బెల్ల నణఁగబెట్టుఁ కుమారీ! |
తాత్పర్యము: | ఇద్దరు వ్యక్తులు ఒకచోట కూడి రహస్యము మాట్లాడుచున్నపుడు వారి వద్దకు ఒదిగి ఒదిగి ఆ విషయము వినుటకు వెళ్ళరాదు. అటుల వెళ్ళినచో తన గౌరవము పోవును. |
కం. | పెనిమిటి వలదని చెప్పిన పని యెన్నఁడుఁ జేయరాదు బావల కెదుటన్ గనపడఁగ రాదు కోపము మనమున నిడుకొనక యెపుడు మసలు కుమారీ! |
తాత్పర్యము: | భర్త వద్దని చెప్పిన పనిని ఎప్పుడూ చేయక, బావ గారి ముందర తిరుగక, ఇతరుల యందు కోపము మనస్సున ఉంచుకొనక సుఖముగా మెలగవలయును. |