నేననుకున్నట్లు, బిల్ ఆవేశ పడి అఘాయిత్యం ఏదైనా చేసేయ లేదు కదా. మనస్సులో అనేక సందేహాలు. అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్నప్పుడు బిల్ ఫోన్ చేసి “మిమ్మల్ని అర్జెంట్ గా కలవాలి” అని ఫోన్ చేస్తే మరేమీ ఆలోచించకుండా “సరే” అన్నాను నేను. ముందు ఫోన్ ఎవరు చేస్తున్నారో అర్థం కాలేదు. స్పష్టంగా వినపడింది, అర్థమైంది ఆ గొంతులోని ఆదుర్తనే. అటు తరువాతే, ఆ ఫోన్ చేస్తున్నది బిల్ అని నిద్రావస్థలో ఉన్న నా మెదడుకు తట్టింది.
జానకి కూడా నాతో బాటు లేచింది.
“బిల్ వస్తాడంట.”
“అర్ధ రాత్రి ఏంటండీ. ఏదైనా ఆపదలో పడ్డాడా?”
“తెలీదు జానకి, అలానే ఉంది. వస్తాడు కదా, చెప్తాడు లే”
రింగ్ బెల్ కొట్టగానే, ఫోన్ లో చూసాను. బిల్ నే. నేను తలుపు తెరవడానికి పోతే, జానకి కూడా నా వెంబడి వచ్చింది.
“రా, లోపల రా బిల్,” అన్నాను నేను.
“అదేంటి, ఆ రక్తపు మరకలు ఏమిటి?” హడావిడి పడిపోతూ అడిగింది జానకి.
అవును బిల్ వేసుకున్న తెల్ల చొక్క మీద రక్తం మరకలు. ముఖం మీద, చేతుల పైన గాయాలు.
బిల్ నా చేతికి గ్లాక్ పిస్టల్ ఇచ్చి, జానకిని హగ్ చేసి కన్నీళ్లు కార్చడం మొదలెట్టాడు.
***
పిల్లలు పెద్దవారై, గూడు వదిలి వాళ్ళ బతుకులు వారు బతుకుతున్నారు. సమయం ఆలా, అలా గడచిపోతున్నా, ఏదో వెలితి.
“ఎందుకండీ ఎప్పుడు అలా ఏదో పోగొట్టు కొన్నట్లు ఆలోచిస్తూ ఉంటారు. అవసరం లేక పోయినా దినమంతా ఆ హాస్పిటల్ లో పనిచేస్తున్నారు. ఇంట్లో ఉన్నప్పుడైన సంతోషంగా కబుర్లు చెప్తూ ఉండొచ్చు కదా,” అంది జానకి.
“ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయే. నాకే తెలియదు. పిల్లల గురించి ఇప్పుడే ఆలోచిస్తూ ఉన్నాను. వాళ్ళు పెరిగితే వాళ్ళతో ఎన్ని పనులు చేద్దామనుకున్నాను. ఎంత ఎంజాయ్ చేయాలనుకున్నాను. ఒక్కటి అనుకున్నట్లు జరగ లేదు,” అన్నాను జానకితో.
“పిల్లల కి పిల్లలున్నారు ఇప్పుడు. వారి గొడవలు వారికి. అలా మీరు అనుకోవడం, పొరబాటే కదా. వారికి తీరిక ఉండి, మీరు అవసరమనిపిస్తే తప్పక మీ దగ్గరికి రావడమో, మిమ్మల్ని పిలవడమో చేస్తారు. అయినా మీరు తీరికగా లేరుగా. ఇంకా ఆ సైకియాట్రిస్ట్ పని మానలేదు.”
“పిల్లలకు అవసరమనిపించి పిలిస్తే, వెంటనే ఉద్యోగం వదిలేస్తా. బహుశా ఉద్యోగం వల్ల కూడా కావచ్చు, ఈ ఆలోచనలు. నా దగ్గరకి వచ్చే వారందరికీ మానసిక సమస్యలే. వారి కథలు వింటుంటే నాకు ఎవరి మీద నమ్మకం కలగడం లేదు. కొన్ని కథలు పని తరువాత కూడా వెంటాడుతూనే ఉంటాయి. అందుకే అలా ఆలోచనలలో పడిపోయి పరధ్యానంగా ఉంటున్నానేమో. సారీ.”
“ప్రపంచంలో అన్ని రకాల మనుష్యులు ఉంటారండి. మీరు చేస్తున్న పనిలో మీకు తారస పడిన వ్యక్తులను చూసి, చూసి మీకు మనుష్యులు మీద నమ్మకం పోయినట్లు ఉంది.”
“నువ్వు డిఫరెంట్ జానకి. నీ స్నేహితులు నీవంటే పడి చస్తారు. నువ్వు ఏదైనా అడిగితే చేసేస్తారు. పిల్లలు అంతే. నీకు మనుష్యులు మీద నమ్మకం ఉంటే ఆశ్చర్యం లేదు. కానీ నాకు ఎక్కడో అనుమానం - నీకు నీ చుట్టూ ఉన్న వారిమీదున్న నీ నమ్మకం ప్రశ్నించే పరిస్థితులు నీకు తటస్థ పడలేదేమోనని.”
“అలా పరీక్షించడం అవసరమా! ఒక వేళ అనిపిస్తే కూడా నా నమ్మకం సరి అయ్యిందే అనుకుంటాను కానీ దాన్ని పరీక్షించాలని ప్రయత్నించను. ఇంత వరకు నా సన్నిహితులు నా చేయి విడువలేదు. ఎప్పుడైనా సహాయం అవసరం అయితే, ఒకరికిద్దరు ముందుకు వచ్చారు.”
అవును జానకి అన్నది నిజమే. పిల్లలు కూడా జానకితో సరదాగా ఉంటారు. ఇంట్లో ఫంక్షన్ లకు, ఏదైనా అనుకొని అవసరాలు వచ్చినా, జానకి తన స్నేహితుల నెట్వర్క్ తో ఇట్టే చేసుకు పోతుంది.
నా ఆలోచనలు భంగ పరస్తూ జానకినే, “అదిగో మళ్లీ మీ ఆలోచనలలో పడిపోయారు. ఇలా ఎవరికి వారు అయ్యిపోయామంటే జీవితం తొందరలోనే బోర్ కొడుతుంది. ఏదో వాలంటీర్ పనులైన చేద్దాం. కలిసి పని చేసినట్లు ఉంటుంది. మీకు మనుష్యులు మీద నమ్మకం పెరుగుతుంది. కనీసం ఈ పరధ్యానం నుంచి మీకు, దాని బాధ భరించే నాకు విముక్తి దొరుకుతుంది,” అంది నవ్వుతూ.
“నా నమ్మకాలు వమ్ము కావడం నాకు అలవాటై పోయింది. దాని గురించి చర్చ అనవసరం. వాలంటరీ పనా. వీకెండ్స్ లో చేయడానికి నేనూ సిద్దమే.”
అలా ఏదో వాలంటీర్ పని చేద్దామని బిగ్ బ్రదర్, బిగ్ సిస్టర్స్ స్వచ్ఛంద సంస్థలో నేను, జానకి చేరాము. వృత్తి రీత్యా సైకియాట్రిస్ట్ అవ్వడం వల్ల రిటైర్మెంట్ తారీఖు లేని జీవితం. నాకు ఉద్యోగం మానేయాలని లేదు. నేను క్లినిక్ కు పోయినప్పుడు, జానకి ఫ్రెండ్స్, గుడులు, ఇండియాకి కాల్స్ అంటూ తనకూ ఒక రొటీన్ ఏర్పరచుకుంది. అందుకే వీకెండ్స్ మాత్రం ఈ వాలంటరీ పనులకు సిద్దం అని చెప్పాము. సంస్థ కూడా మాకున్న తీరిక సమయం బట్టే తామూ మాకు తగిన అవకాశాల కోసం వెదుకుతాము అన్నారు.
అప్లికేషన్, బ్యాక్ గ్రౌండ్ చెక్స్, ఇంటర్వ్యూ అంటూ ఒక నెల పాటు ఆ సంస్థ తో నేనూ, జానకి పనిచేశాము. అటు తరువాత మాకు తగిన అబ్బాయిని వెదికి మ్యాచ్ చేసి, మాకు కబురెడతాం అని చెప్పారు. తండ్రులు లేక తల్లులు మాత్రమే చూసుకుంటున్న పిల్లలు, అనాధ పిల్లలు, ఫాస్టర్ హోమ్స్ లో ఉన్న పిల్లలకు సహాయ పడే సంస్థ బిగ్ బ్రదర్స్, బిగ్ సిస్టర్స్. ఆ పిల్లలని మా లాంటి వారికి మ్యాచ్ చేసి, అప్పగించి పిల్లల అభివృద్ధికి పాటు పడే సంస్థ. అలా పిల్లల పేరెంట్స్, పిల్లల తోను, మా లాంటి వాలంటీర్ ల తోనూ పనిచేస్తూ, ఆ గమ్యం చేరడానికి దోహదపడుతుంది.
రెండు నెలల తరువాత సంస్థ కోఆర్డినేటర్ బ్రెండ ఫోన్ చేసి ఆఫీస్ కు పిలిపించింది.
“కంగ్రాట్స్ మీకు ఒక అబ్బాయి మ్యాచ్ అయ్యాడు,” అంది బ్రెండ.
“అమ్మాయి కావాలనుకున్నామే,” అన్నాను నేను.
“అమ్మాయిలను మహిళా వాలంటీర్ లకు మాత్రమే మ్యాచ్ చేస్తాము. మీలా భార్య, భర్త, లేక మగవారు మాత్రమే ముందుకు వస్తే, అబ్బాయిలని మ్యాచ్ చేస్తాము”
జానకి ముఖంలోను కొద్దిగా నిస్పృహ. కానీ చేయాలనుకున్నది స్వచ్ఛంద సేవ. ఇద్దరూ తేరుకొని బ్రెండ తో సంభాషణ కొనసాగించాము.
“అబ్బాయి పేరు బిల్. ఇప్పుడు ఐదో తరగతి చదువుతున్నాడు. ఫాస్టర్ హోమ్స్ లో పెరుగుతున్నాడు. బిల్ వాళ్ళ అమ్మ చిన్నప్పుడే వాళ్ళ నాన్న దగ్గిర వదిలేసి వెళ్ళిపోయింది. తండ్రి డ్రగ్ అడిక్ట్. ఏదో హత్య కేసులో ఇరుక్కున్నాడు. మేన్ స్లాటర్ కింద జైల్లో ఉన్నాడు. అందుకే చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు పిల్ల వాడిని తండ్రి దగ్గరినుంచి విడదీసి ఫాస్టర్ హోమ్స్ లో బలవంతంగా చేర్పించారు. ఇదిగో బిల్ బ్యాక్ గ్రౌండ్,” అంటూ బ్రెండ మాకు చెరొక ఫోల్డర్ అప్పగించింది.
ఇద్దరం చదివిన తరువాత ఒకరిని, ఒకరు చూసుకున్నాం. జానకి కి కూడా నాకు వచ్చిన అనుమానమే వచ్చినట్లు ఉంది.
“బ్రెండ, అంతా బాగానే ఉంది కాని బిల్ వాయిలెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా మసలు కోవాలి అని ఉంది.”
“అది మాకు చైల్డ్ వెల్ఫేర్ వారిచ్చిన సమాచారం. అలా అని బిల్ హిసాత్మకంగ ప్రవర్తిస్తున్నాడని కాదు. అలా ప్రవర్తించడానికి అవకాశాలు ఉన్నాయి అని. బిల్ వాళ్లకు దొరికిన పరిస్థితులను బట్టి వారు అలా జాగ్రత్త పడమని అప్రమత్తం చేస్తున్నారు. అందుకే కదా మనం పని చేస్తున్నది. అలాంటి చిన్నారులకు సహాయం చేయడానికి. డోంట్ వర్రీ. మీతో పాటు నేను పనిచేస్తుంటాను. మీకు ఏ సహాయం కావాలన్న నేను ఒక ఫోన్ కాల్ దూరం లోనే ఉన్నాను.”
తరువాత అడ్డు చెప్పడానికి ఏమి కనపడ లేదు.
మరుసటి వారం బ్రెండ మమ్మల్ని బిల్ తో కలిపింది. పదహైదు ఏండ్ల క్రితం మాట. అప్పుడు సన్నగా, రివట లాగా ఉంగరాల జుట్టు తో, నల్లని ముఖంలో మెరుస్తున్న తెల్లని కళ్ళతో మమ్మల్ని తీక్షణంగా, ఒక్కింత ఉత్సుకతతో చూస్తున్న పదేళ్ల బిల్ పరిచయం అయ్యాడు.
మొదట్లో ముభావంగా ఉండే వాడు. జానకి ప్రోద్బలం, వాత్సల్యం తో బిల్ ఒక నెల లోనే మాతో మాట్లాడం, మాతో కలిసి తిరగడం మొదలెట్టాడు. ప్రతి శనివారం, ఆదివారం బిల్ తో కలిసి కనీసం నాలుగైదు గంటలు గడపడం అలవాటైపోయింది. ఒకటి, రెండు నెలల లోనే ఈ వీకెండ్స్ కు బిల్, మేము ఎదురు చూడడం మొదలెట్టాం.
బిగ్ బ్రదర్స్, బిగ్ సిస్టర్స్ సంస్థ ఏవేవో ఆక్టివిటీస్ పంపించేది. టెన్నిస్ అకాడెమీ, డాన్స్ స్కూల్స్ లాంటి వారు కొన్ని క్లాసులు సంస్థకు ఫ్రీగా ఇచ్చే వాళ్ళు. అలానే ఫుట్ బాల్, బేస్ బాల్ గేమ్స్ టికెట్స్ కూడా పంచే వారు. అడపదడపా వచ్చే ఆ కార్యక్రమాలే కాక, మేము బిల్ ను మా నగరం చుట్టుపక్కల ఉన్న పార్కులకు, బీచ్ లకు తీసుకు వెళ్ళే వారం. అప్పుడప్పుడు రెస్టారెంట్ లకి.
మొదట్లో బిల్ చేతుల అప్పుడప్పుడు గీరుకుపోయి, ఎవరితోనో గొడవ పడినట్లు కనపడేవి. బ్రెండ అవి బిల్ తరచూ మిగిలిన పిల్లలతో కొట్లాడడం వల్ల గీసుకు పోయిన గాయాలని చెప్పేది.
బిల్ ఇది వరకు చూసిన ప్రపంచం కంటే భిన్నంగా, సంతోషంగా బ్రతక వచ్చు అన్న సందేశం, నమ్మకం బిల్ కు కలిగించడానికి నేను, జానకి చాలా ప్రయత్నించాము. మా ఇద్దరి అనోన్యత, మొత్తం ప్రపంచం బిల్ మాత్రమే అన్నట్లు మేము బిల్ తో గడిపిన సమయం, భగవంతుడి అనుగ్రహం, ఏదో ఒకటి పని చేసి ఉండాలి. బిల్ మాతో బాగా కలిసి పోయాడు.
బిల్ చదువుల గురించి అడిగి, అక్కడక్కడ తోచిన విషయాలు, మా చిన్న నాటి అనుభవాలు చెప్పే వారం. మంచి చదువు, జీవితంలో పైకి పోవడానికి టికెట్ అని, అది పిల్లలందరికీ దొరికే అవకాశం, దానిని సద్వినియోగ పరచు కోవాలని చెప్పే వాళ్ళం. బ్రెండ కూడా మమ్మల్ని కలిసిన తరువాత బిల్ మారాడని, స్కూల్ లో మార్కులు కూడా బాగా వస్తున్నాయని చెప్పేది.
మేమందరం మాకు చేతనైనది చేస్తున్నా, తరచుగా కాకపోయినా ఏడాదికో, రెండేళ్లకోసారి ఏదో పెద్ద గొడవలో ఇరుక్కు పోయి బాగా గాయాలతో బయట పడే వాడు బిల్. అటు తర్వాత బిల్ ను కలిసినప్పుడు, మామూలుగానే ప్రవర్తిస్తూ తనలో మార్పు తేవడానికి, తన అభివృద్ధి కి ప్రయత్నించాము. బిల్ ను తరచూ మా ఇంటికి తీసుకెళ్ళే వాళ్ళం. మాకు తారస పడిన మిత్రులకు బిల్ ను పరిచయం చేసే వారం. వీకెండ్ కి ఇంట్లో పిల్లలు, బంధువులు ఉంటే వారికి బిల్ ను పరిచయం చేశాము. బిల్ కూడా కుటుంబంలో ఒక మనిషి లాగా కలిసిపోయాడు.
తను హై స్కూల్ లో గ్రాడ్యుయేట్ అయ్యాక సంస్థ తన పని అయిపోయిందని తప్పుకుంది. కానీ బిల్ తో మా అనుబంధం కొనసాగింది. బిల్ కమ్యూనిటీ కాలేజీ లో చదవడానికి మేమే సహాయం చేశాం. అటు తరువాత నాకు తెలిసిన ఒకతని సాయంతో ఒక కంపెనీలో ఇంటర్న్ గా చేరి, ఉద్యోగి గా స్థిర పడి పోయాడు.
ఉద్యోగం చేరిన కొత్తలో ఏదో బార్ కు వెళ్లి గొడవపడి, గాయాలతో తిరిగి వచ్చాడు. నాకు బాధతో బాటు విసుగు వచ్చింది. పిల్ల వాడికి తగిలిన దెబ్బలు మా ఇద్దరికీ తగిలినట్లనిపించింది.
“బిల్, నీ సమస్య ఏంటి?” అడిగాను నేను.
“ఏదో మాటలు అని, నాకు కోపం తెప్పిస్తారు. కోపం వేస్తే, నాకే తెలియటం లేదు. నా మీద నాకే అదుపు ఉండదు,” అన్నాడు బిల్.
“నేను సైకియాట్రిస్ట్ కానీ నిన్ను నా దగ్గరకి రమ్మనలేను. నా స్నేహితురాలు కేట్ కు చెప్తాను. ఆవిడ దగ్గరకు వెళ్ళు. ఆవిడ సైకో థెరపీ తో నీవీ సమస్య నుండి బయట పడడమో లేక కనీసం అదుపులో తెచ్చుకోవడమో సాధ్య పడుతుంది.”
కేట్ దగ్గర పోయిన తరువాత బిల్ లో బాగా మార్పు వచ్చింది. కోపం తెచ్చుకోవడం, గొడవలు పడటం అరుదైపోయింది.
ఒక రోజు బిల్ ఇంటికి వచ్చినప్పుడు, ఉన్నట్టుండి,
“మీరు కేట్ దగ్గరకి నన్ను పంపినందుకు ధన్యవాదాలు. నాకు ఒక సమస్య ఉన్నట్లే తెలీలేదు. కేట్ వల్ల తేలినది, నేను నా నాన్న ను ఇంకా మరచి పోలేదు. మా నాన్న కోపంలో అనుకోకుండా చేసిన హత్య, తను నన్ను అనాధ చేసి జైలు వెళ్ళడం, అమ్మ లేక పోవడం నా చిన్న తనంలోనే నా మీద గట్టి ముద్రలు వేశాయి. నాన్న ప్రసక్తి వచ్చినా, నాన్నతో బాటు నా మనసులో ఆయన ఆనవాలుగా గుర్తుండి పోయిన డ్రగ్స్ గురించి, వయోలెన్స్ గురించి మాట్లాడిన నేను అదుపు తప్పి పోతున్నాను. “
“మరి ఆ ఆలోచనలు వదిలి వేయడానికి ప్రయత్నించవచ్చు కదా?”
“ప్రయత్నిస్తున్నాను. కానీ థెరపీ పోయిన దగ్గర నుంచి, మా నాన్న ను వెదికి నా దగ్గర పెట్టుకొని, చేత నైనంత సహాయం చేయవచ్చుననిపిస్తున్నది.”
“బిల్, అది అంత మంచి పని కాదేమో. మీ నాన్న ఆలోచనలే నీలో అలజడి కలిగిస్తుంటే, ఆయననే నీ ముందు ఉంటే, ఏమౌతుందో మనకు తెలియదు.’
ఆ మాటలు విన్న బిల్ ఒక క్షణం ఏడవడం మొదలు బెట్టాడు. జానకి దగ్గరికి తీసుకొని సముదాయించాల్సి వచ్చింది.
“కేట్ కూడా అలానే అంది.”
నేను కూడా భుజం తడుతూ, “బిల్, బాధపడొద్దు. కేట్ తో మాట్లాడి చూడు. నీవు మీ నాన్నను దగ్గర ఉంచుకోవడం తప్పని సరి అంటే, తను తప్పకుండా నీకు మార్గం సూచిస్తుంది. అన్నట్టు మీ నాన్నను ఎక్కడని వెదుకుతావు,” అన్నాను.
“అదీ సమస్యే. నేను చేసిన ప్రయత్నాలు ఏవీ ఇంత వరకు ఫలించలేదు. మా నాన్న చేసిన హత్య అనుకోకుండా, కోపంలో చేసింది కాబట్టి ఉరి శిక్ష, యావద్జీవ కారాగార శిక్ష పడలేదు. అతన్ని క్రితం సంవత్సరమే జైల్ నుండి విడుదల చేశారట. తరువాత అతని ఆచూకీ తెలియడం లేదు,” అన్నాడు బిల్. అతని కళ్ళలోని నిరాశ, నిస్పృహలు జానకిని, నన్ను కదిలించి వేశాయి.
“నేను చేస్తున్న ఉద్యోగం వల్ల నాకు చాలా మందే పరిచయం ఉన్నారు. నాకు తెలిసిన ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ఒకరున్నారు. ఆయనతో మాట్లాడితే మీ నాన్న ఆచూకీ త్వరలోనే తెలిసిపోతుంది. నేను నువ్వు కాంటాక్ట్ చేస్తావని, సహాయం చేయమని టెక్స్ట్ చేస్తాను. అటు తరువాత నువ్వు ఫోన్ చేసి నీ నాన్న ఆనవాలు, ఇతర వివరాలు ఇవ్వు. త్వరలోనే అతను నిన్ను మీ నాన్నతో కలుపుతాడు.”
నేను అన్నట్లే బిల్ కు వాళ్ళ నాన్న ఆచూకీ నెలలో తెలిసిపోయింది. కేట్ తో మాట్లాడి బిల్ వాళ్ళ నాన్న డేవ్ ను తన దగ్గర తెచ్చి పెట్టుకున్నాడు. కానీ దీనితో కొత్త సమస్యలు ఎదురయ్యాయి. డేవ్ లో ఏ మాత్రం మార్పు లేదు. తను బిల్ ను కలిసినప్పుడు ఆనంద పడినట్లు కనిపించినా, ఆ ఆనందం బిల్ ను కలిసిన దానికా లేక తనకు డ్రగ్స్ దొరకటానికి మరో బంగారు బాతు దొరికిందనా అన్న ప్రశ్నకు తొందరలోనే సమాధానం దొరికింది. డేవ్ ఇంకా డ్రగ్స్ కు బానిసనే. ఆ బోధలో పడి భాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నాడు. బిల్ తన వంతు ప్రయత్నాలు చేశాడు. అప్పుడప్పుడు డ్రగ్స్ వెదుక్కుంటూ పోయిన తండ్రిని తిరిగి వెదికి పట్టి, ఇంటికి తెచ్చుకోవడానికి, అనేక కష్టాలు పడ్డాడు.
“మనుష్యుల మీద నమ్మకం పెంచుకోవాలంటావు. ఇదిగో ఈ డేవ్ లాంటి వారిని చూస్తే నమ్మకం ఎలా కలుగుతుంది,” అని జానకితో అన్నాను. జానకి ముభావంగా నవ్వింది. ఆవిడ మౌనమే నా మాటకు అంగీకారం అనుకోవడంలో నా సంతోషాన్ని వెదుకున్నాను.
బిల్ పడుతున్న కష్టాలు మాకు తెలుస్తూనే ఉన్నాయి. చివరకు, నేనే చొరవ తీసుకొని డేవ్ ను నాకు తెలిసిన ఒక అడ్డిక్షన్ సెంటర్ లో బిల్ ద్వారా చేర్పించాను. మొన్నీమధ్యే డేవ్ డిటాక్స్ అయ్యి, తిరిగి బిల్ దగ్గర చేరి ఉండాలి. పరిస్థితులు మెరుగై ఉండాలి అనుకున్న మాకు ఇలా బిల్ రక్త మరకలతో ఎదురుగా ఉంటే మనస్సు కీడు శంకించ కుండా ఎలా ఉంటుంది. జానకి కళ్ళలో అదే దిగులు.
***
“ఏమైంది బిల్. ఆ గాయాలు ఏమిటి? ఈ రక్తపు మరకలేమిటి? నిన్ను ముందు దగ్గర్లో ఉన్న అర్జెంట్ కేర్ క్లినిక్ కు తీసుకెళ్లాలి. మీ నాన్న డేవ్ బాగానే ఉన్నాడు కదా?” ఆదుర్దాగా అడిగింది జానకి.
“నాన్న ఎక్కడ ఉన్నాడు? మొన్న రాత్రే చనిపోయాడని పోలీసు వాళ్ళు నాకు తెలిపారు,” బిల్ గొంతు బొంగురుపోయింది.
“ఎలా? మరి మాకు చెప్పలేదే?” ఈ సారి మరింత షాక్ అయ్యి నేనడిగాను.
“మొదట మీకే చెబుతామనుకున్నాను. కానీ ఎందుకో నాకు పిచ్చి కోపం వచ్చింది. మా నాన్న ఎలా పోయాడో మీకు తెలుసా? పొరపాటున నా పర్స్ టేబిల్ పైన పెట్టాను. కేట్ చెప్పినట్లు మా నాన్నకు అందకుండా సేఫ్ లో పెట్టాల్సింది. డిటాక్స్ అయ్యాడు కదా అని ఏమరుపాటు పడ్డాను. నాన్న ఆ డబ్బు తీసుకొని డ్రగ్స్ కొని మరో వేశ్య దగ్గర పోయాడు. ఆవిడా జంకీ నే. వారున్న చుట్టూ ప్రాంతంలో చాలా మంది ఈ డ్రగ్ అడ్డిక్ట్స్ ఉన్నారు. పోలీసులు చెప్పిన ప్రకారం, మా నాన్నను అక్కడున్న ఆ వేశ్య తన దగ్గరున్న కత్తితో పొడిచి చంపేసింది. ఏమి గొడవలయ్యాయో తెలియదు. ఇద్దరూ హై మత్తులో ఉండి ఉండాలి. ఆవిడ ఇంతకు ముందే పలు సార్లు అరెస్ట్ అయ్యింది. నాకు ఆవిడ ఫోటో కూడా చూపెట్టారు. పోలీసులు ఆవిడకోసం వెదుకుతున్నామన్నారు.”
“అది తెలిసింది బహుశా నీకు నిన్న పొద్దునే కదా. పోలీసులు మీ నాన్నను చంపినావిడని ఒకటి రెండు రోజులలో పట్టి వేస్తారు. మీ నాన్న చనిపోయిన కోపంలో నువ్వు ఏదైనా పిచ్చి పని చేయలేదు కదా. ముందు నీ గాయాలకు క్లినిక్ కు పోదాం పద. నేను వస్తాను,” అన్నాను నేను.
“గాయాలకేముంది. అంత సీరియస్ కాదు. జానకమ్మ సాయంతో నేనే క్లీన్ చేసుకోగలను. మీరన్నది సరే. నాకు మా నాన్న చనిపోయారని తెలిసిన వెంటనే చెప్పలేని కోపం వచ్చింది. అనవసరంగా మా నాన్నను నా దగ్గరకు పిలిపించి చంపేసానే అన్న గిల్టీ ఫీలింగ్ కలిగింది. అటు తరువాత మా నాన్నను చంపిన ఆ వేశ్య మీద అంతులేని కోపం దావానలంలా రగిలింది. వెంటనే ఒక గన్ షాప్ లో ఈ పిస్టల్ కొని ఆ వేశ్యను వెదికి చంపుదామని, మా నాన్న డ్రగ్స్ కోసం పోయిన చోటికే వెళ్ళాను. నా అదృష్టం కొద్ది ఆ వేశ్య కనిపించింది. పోలీసులు నాకు చూపెట్టిన ఫోటో ద్వారా పోల్చుకోగలిగాను,” అన్నాడు బిల్.
అనుకున్నంత పని చేశాడు బిల్. కేట్ తనకు ఇది వరకే హెచ్చరిక చేసింది. బిల్ కోపంలో వాళ్ళ నాన్న లాగా ప్రవర్తించే అవకాశం ఉందని, జాగ్రత్తగా మసలుకొమ్మని. ఆ వేశ్యను చంపేసి నేరుగా ఇక్కడికి వచ్చాడు. ఆ చంపే ప్రయత్నంలో వేశ్య, బిల్ తో పోరాడి ఉంటుంది. అందుకే ఈ రక్తం మరకలు.
ఇన్ని రోజులు నేను, జానకి కలిసి చేసిన వాలంటరీ పని, సమయం బూడిదలో పోసిన పన్నీరయ్యింది. జానకిని చూసాను. జానకి ముఖంలో బిల్ పట్ల వాత్సల్యం, బాధ తప్ప మరేమీ కనపడటం లేదు. అమాయకురాలు బిల్ ను ఇంకా నమ్ముతూ నే ఉంది, అమ్మ లాగే ప్రవర్తిస్తున్నది.
“కొంప దీసి, నీ కోపంలో ఆ వేశ్యను కాల్చి చంపావా?” అన్నాను నేను. బిల్ ను ఈ సమస్యనుంచి ఎలా కాపాడడం. 911 కు ఫోన్ చేయాలా అన్న మరో ఆలోచన.
“చంపాలనుకొనే వెళ్ళాను. కానీ చంపలేక పోయాను. గన్ బయటకి తీసి, చంపలేక తిరిగి పరిగెడుతూ వస్తుంటే అక్కడ ఉన్న మరికొందరు డ్రగ్ అడిక్ట్స్ వారి చేతికందిన వస్తువులు తీసి కొట్టారు, విసిరారు. దారిలో పడి లేచాను కూడా. ఎలానో తప్పించుకొని, ఇదిగో ఇలా ముందు, మీ ఇంటికే రావాలనిపించింది.”
“అంత కోపంతో వెళ్ళానన్నావు. చంపేసి ఉండాలే. ఎలా అదుపులో తెచ్చుకో గలిగావు?” ఆశ్చర్యంగా అడిగాను నేను.
“మీతో గడిపిన సమయం. మీరు నాకు నేర్పించిన మంచి చెడులు ఒక్కసారి నా మదిలో మెదిలాయి. ట్రిగ్గర్ నొక్క లేకపోయాను,” అంటూ నన్ను, జానకిని దగ్గరకి లాగి హగ్ చేసుకుంటూ, గద్గద స్వరంతో అన్నాడు మా బిల్.
మనిషిలో మానవత్వాన్ని నిద్ర లేపిన ఈ కథ చాల బాగా వ్రాశారు భాస్కర్. ఏ కథకైనా ముఖ్య లక్షణం మొదలుపెట్టినప్పటినించీ చివరి దాకా దానంతట అదే చదివించుకోవటం. ఈ కథ అలాగే వదిలిపెట్టకుండా ఎలా ముగిస్తారా అనే ఉత్సుకతతో చదివాను. అభినందనలు.
కొంత సస్పెన్స్ తో కధ బాగుంది భాస్కర్
శాయి ప్రభాకర్
ధన్యవాదాలు. మీరు రచయితగా మంచి కథలు వ్రాయటమే కాక సమయం తీసుకొని నా లాంటి సహ రచయితల కథలు చదివి మీరు స్పందించడం మీ సహృదయతకు తార్కాణం. కథ మీకు నచ్చినందుకు సంతోషం
కథ చాలా బాగుంది భాస్కర్ గారూ 👏👏👏👏
జాబిలమ్మ గారు
మీ నుండి మెప్పు పొందడం కథకు మెడల్ వచ్చినట్లే(ఒలింపిక్ క్రీడల ప్రభావమేమో, మెడల్ లాగా అనిపించింది!). సమయం తీసుకొని కథ చదివి మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు.