ప్రణవి, పిల్లలూ వచ్చేసరికి అమృత వరం పోలీస్ స్టేషన్ లో ని ఒక రూమ్ లో జంబేష్, రాజన్ లు కూర్చొని ఉన్నారు. వారితో ఎస్సై... ఆ గ్రామ సర్పంచి మాట్లాడారు.
రాజన్ జంబేష్ కి కాస్త దూరంగా కూర్చొని ఉన్నాడు.
పిల్లల్ని వేరే దగ్గర కూర్చోబెట్టారు. ప్రణవీని జంబేష్ వాళ్ళు కూర్చున్న గదిలోకి తీసుకొచ్చారు. వెనకాలే మూర్తి కూడా వచ్చాడు. అంతకు ముందు ఏం చర్చ జరిగిందో ఏమో! అన్నదమ్ములు ఇద్దరూ తలలు వంచుకొని కూర్చొని ఉన్నారు.
"రా అమ్మా... ఇలా వచ్చి కూర్చో" అంటూ ఓ కుర్చీ చూపించాడు ఆ గ్రామ సర్పంచ్.
ప్రణవి కుర్చీలో కూర్చుంది. మూర్తి కూడా ఓ పక్కగా కూర్చున్నాడు.
"మేము జంబేష్ గారితో మాట్లాడాము. వారు ఏమంటున్నారంటే... తప్పైపోయింది ఇక ముందు ఇలా ప్రవర్తించను. ప్రేమగా చూసుకుంటాను అంటున్నారు. మిమ్మల్ని కాపరానికి పంపమని అడుగుతున్నారు. మీరేమంటారు?" అంటూ అడిగాడు ఎస్సై.
"అదీ" అంటూ ఏదో చెప్పబోయింది ప్రణవి.
"అదిగోండి... మీరే చూడండి. ఆ అమ్మాయి ఎదుటి వాళ్ళు చెప్పేది వినదు. మీరేం అడిగారు? తానేం చెబుతోంది...?" అంటున్న రాజన్ మాటలకు ఎస్సై బ్రేక్ వేస్తూ...
"ఇప్పుడే కదా ఏ విషయంలోనూ నేను కల్పించుకోనని మాట ఇచ్చారు. 24 నిమిషాలు కూడా కాలేదు. నా ఎదురుగానే మీరు మళ్ళీ మొదలుపెట్టారు" కోపంగా రాజన్ వంక చూస్తూ అన్నాడు.
"లేదు లేదు నేను కల్పించుకోను. వాళ్ళిష్టం వాళ్ళది. నేను ఇన్వాల్వ్ అవ్వను. వాళ్ళని నా ఇంట్లో కూడా ఉంచుకోను. వేరే పంపించేస్తాను. ఇకమీదట వాళ్లకి నాకు ఎటువంటి సంబంధం లేదు. గతం గతః అనుకోవాలి. గతాన్ని తవ్వుతూ కూర్చుంటే ముందుకి సాగలేరని, వాదులాటలు పెరుగుతాయని..." చెప్పాడు రాజన్.
జంబేష్ సర్వం కోల్పోయినట్లుగా మొహం భూమిలోకి పెట్టుకొని కూర్చొన్నాడు.
రాజన్ చిన్నగా దగ్గి... "కాస్త మంచినీళ్ళు ఇస్తారా?" అని అడిగాడు.
జంబేష్ తలపైకెత్తి... రాజన్ వంక చూసాడు. రాజన్ ఎవరూ చూడకుండా...కండ్లతో సైగ చేసాడు.
జంబేష్ తలాడించాడు.
ఓ కానిస్టేబుల్ మంచినీళ్లు బాటిల్ తెచ్చి రాజన్ కి ఇచ్చాడు. నీళ్లు తాగి, నీళ్లు తెచ్చి, ఇచ్చిన కానిస్టేబుల్ కి థాంక్స్ చెప్పాడు.
"ఏ అమ్మా! ఏమంటావు? అక్కడ ఉండేది నువ్వు. ఆలోచించుకొని, నిర్ణయం చెప్పు," అన్నాడు సర్పంచ్.
"నేను ఎప్పుడూ వదిలి ఉండాలనుకోలేదు, బాబాయ్! నేను వెళ్తాను." అంది ప్రణవి.
జంబేష్ వంక తిరిగి
"బాబూ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి," అన్నాడు సర్పంచ్.
జంబేష్ తలాడించాడు.
"తల ఆడించటం కాదు. అమ్మాయి కంటతడి పెట్టకూడదు. అమ్మాయి మంచిది కాబట్టి నువ్వు అన్ని బాధలు పెట్టిన నిన్ను వదిలి పెట్టడం లేదు. నీతోనే ఉంటాను అంటోంది. నీ తప్పు తెలుసుకుని బాగా చూసుకుంటాను అన్నావు కాబట్టి, మీకే పనిష్మెంట్ లేకుండా... నిన్ను, మీ కుటుంబాన్ని వదిలేస్తున్నాం. ఈసారి అమ్మాయి దగ్గరనుంచి ఏమన్నా కంప్లైంట్ వస్తే మాత్రం, వదిలి పెట్టేది లేదు. బి కేర్ఫుల్." అంటూ హెచ్చరించాడు ఎస్సై.
"అలాగే సార్ మీరే చూస్తారు గా! నేను ఎంత బాగా చూసుకుంటానో," అన్నాడు జంబేష్.
"మీ పెళ్ళాన్ని, బిడ్డలను ఇప్పుడు మీతో పాటు తీసుకెళ్ళండి," చెప్పాడు సర్పంచ్.
"వారం రోజుల్లో మేము తీసుకెళ్తాం సార్. అక్కడ నేను ఉద్యోగం చేసే దగ్గర... ఇల్లు వెతకాలి. వేరే కాపురం పెట్టాలి కదా! కావలసినవన్నీ చూసుకున్నాక తీసుకెళ్తాను." అన్నాడు జంబేష్.
"ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకోవటానికి అలా చెప్పారేమో! తర్వాత తీసుకెళ్తారో! తీసుకెళ్ళరో!?!" అనుమానంగా అన్నాడు మూర్తి.
"ఇప్పుడు అలా మాట్లాడటానికి కుదరదు. పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్నాడు కాబట్టి తప్పకుండా తీసుకెళ్తాడు. తీసుకెళ్లకపోతే మాదైన స్టైల్ లో మేము ట్రీట్మెంట్ చేస్తాము." అన్నాడు ఎస్సై.
"లేదు నేను తప్పకుండా తీసుకెళ్తాను. ఇప్పుడు మాతో పాటు తీసుకెళ్తే నేనే మా అన్న ఇంట్లో ఉన్నాను. వాళ్లు ఇప్పుడు నన్ను పొమ్మన్నారు. నేనే ఎవరింట్లోనో ఉండి ఇల్లు వెతకాలి. ఇల్లు వెతకగానే తప్పకుండా తీసుకెళ్తాను." అన్నాడు జంబేష్.
"ఇప్పుడు మా ఇంటికి రండి. రెండు రోజులు ఉండి వెళ్లండి," అని పిలిచాడు మూర్తి.
"నాది ప్రైవేటు ఉద్యోగం నాకు సెలవులు ఇవ్వరు. ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను. నేను ముహూర్తం పెట్టి ఫోన్ చేస్తాను. ప్రణవి నీ పిల్లల్ని పంపించండి," అని చెప్పాడు జంబేష్.
"మీరు వచ్చి తీసుకెళ్తే బాగుంటుందేమో! బావగారు!" అన్నాడు మూర్తి.
***సశేషం***
రచయిత్రి పరిచయం ..
పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక
రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)
పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.
బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.
సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.
ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.