ఆటోలో కూర్చున్న ముగ్గురు మధ్యలో కాసేపు మౌనం రాజ్యమేలింది. రాజన్ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ...
"అమ్మాయ్ నీ నోరే నీకన్నీ దూరం చేస్తుంది. నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకోవాలి. నిజానికి నీకు ఆరు లక్షలు ఇద్దామనుకున్నా. కానీ నీ నోటి వల్ల వాటిని పోగొట్టుకున్నావు." అన్నాడు రాజన్.
ప్రణవికి ఆ మాటలకి తల తిరిగినట్లు అయింది. ఏమీ అర్ధం కాలేదు. 'ఎందుకలా అంటున్నాడు? ఇప్పుడు నేనేం మాట్లాడాను? తనలో తాను మదన పడిందికాసేపు. ఇలాంటి మాటలు వినడం తనకి కొత్తేమి కాదు. పెళ్లయిన దగ్గర నుంచి ఇవే మాటలు. అనని వన్నీ అన్నాననటం, భరించలేక ఏదైనా ఒక మాట అంటే... ఆ మాటనే పట్టుకుని వెళ్ళాడటం... వినీ వినీ విసుగు వచ్చింది. కానీ ఇప్పుడు కూడా... ఇలా అనటం ఏమిటి? మారారనుకుంది. ఏమి మారలేదు. అదంతా నటనే... వాళ్ళే కదా పిలిచి మాట్లాడతామన్నది. మళ్ళీ ఇదేంటి? ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు! అయినా నేను తప్పుగా ఏం మాట్లాడాను? మాట్లాడతామని పిలిచి, మాట్లాడకుండా వెళ్లిపోమంటేనే... కదా! నోరు విప్పింది. దానికేనా? ఏదో తప్పుగా మాట్లాడినట్లు...!?!
అయినా వీళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలనుకునేది ఏమిటి? దేనికి డబ్బులు? నేనేమన్నా అడిగానా? మనోవర్తిగా ఇద్దామనుకున్నారా? లేక డబ్బులు ఇచ్చి సెటిల్ మెంట్ చేసేసుకోవాలని పిలిచారా? అలాగైతే దానికి నన్ను అక్కడ ఆ రకంగా పిలిచేదేంటి?' మనసులో ఎన్నో రకాల ఆలోచనలు.
'మళ్ళీ ఏమన్నా మాట్లాడితే... ఒకటికి పది కల్పించి చెబుతారు' అని మనసులో అనుకుని మౌనం వహించింది. ఆటో దిగాక ఒక హోటల్ కి తీసుకెళ్ళాడు రాజన్.
ప్రణవి మౌనంగా వారిని ఫాలో అయ్యింది. ఓపెన్ ప్లేస్ లో దూరంగా ఉన్న ఓ టేబుల్ దగ్గర కూర్చున్నారు.
అక్కడ చుట్టూ చూసాడు, "వాడు ఇక్కడికి కూడా వచ్చినట్టు లేదు" అన్నాడు.
"ఏమో బావ ఎటు వెళ్ళాడో!" అంది రాణి.
బేరర్ వచ్చి, "ఏం కావాలి?" అని అడిగాడు.
"మూడు కాఫీలు" చెప్పాడు రాజన్.
"నాకు వద్దు" అంది ప్రణవి.
"అందులో నేను విషం కలిపి ఇవ్వడం లేదు" అన్నాడు.
"నేను అనుమానంతో వద్దనలేదు. అలవాటు లేక వద్దన్నాను" అంది గొంతు పెగుల్చుకుని ప్రణవి.
"మాటకు మాట చెప్పందే ఉండలేవా? వాళ్ళు ఏమన్నా ఊరుకుంటే సరిపోతుంది కదా! ఇంత దాకా తెచ్చుకున్నావ్" అంది రాణి.
"దానితో వచ్చిన చిక్కే అది" అని రాణి కి చెప్పి, ప్రణవి వైపుతిరిగి,
"ఇన్నాళ్లు పుట్టింట్లో ఉండి, నువ్వు మమ్మల్ని ఏమి చేయగలిగావు?" అంటూ అడిగాడు.
"మావయ్య గారు 'అమ్మా మా మీద కేసు పెడతావా?' అని అడిగినప్పుడు, 'నేను అలాంటి దాన్ని కాదు. అలా కేసులు పెట్టను' అని చెప్పా. అమ్మ వాళ్ళ కేసు పెడదామన్నా మావయ్య గారికి ఇచ్చిన మాట కోసం... నేను మీ మీద కేసు పెట్టలేదు." అంటూ చెప్పింది ప్రణవి.
"కేసు పెట్టుండాల్సింది మా సత్తా నీకు తెలిసేది. నువ్వు మా వెంట్రుక కూడా పీకలేవు. ఇప్పటికైనా మించి పోయింది లేదు పెడితే పెట్టుకో... మమ్మల్ని నువ్వేం చేయలేవు. ఈ బెదిరింపులు మా కాలి గోటి దాకా కూడా రావు. నలుగురూ నీ మొహం మీద ఉమ్ము వేస్తారు," అన్నాడు రెచ్చగొడుతూ...
ప్రణవి లోని సహనం చచ్చిపోయి, "నేనేం తప్పు చేశానని? నా మొహం మీద ఉమ్ము వేయటానికి? అకారణంగా కడుపుతో ఉన్న పెళ్ళాన్ని ఇంట్లోంచి తరిమేసి, పట్టించుకోకుండా... పుట్టిన పిల్లల్ని కూడా చూడటానికి రాకుండా... ఎన్నో రకాలుగా మానసిక చిత్రవధ చేసింది మీరైతే! నా మొహం మీద ఎందుకు ఉమ్ముతారు?" ఆవేశంగా మాట్లాడింది ప్రణవి.
"ఎవరైనా వింటే నేను నీకు అన్యాయం చేసానని అనుకుంటారు. నీకో నమస్కారం. ఏదో నీకు మంచి చేద్దాం అని పిలిచినందుకు... నా చెప్పు తీసుకొని నన్ను నేను కొట్టుకునేట్టుగా చేసావు. చూడు అందరూ ఇటే ఎలా చూస్తున్నారో! ఆ కాఫీ తాగి ఎక్కడికో వెళ్లాలి అన్నావుగా వెళ్ళు," అన్నాడు.
"మీరు మాట్లాడిన దానికే నేను జవాబు చెప్పాను. ఆయన మీ అడుగుజాడల్లోనే నడిచేది. మీరు ఏది చెప్తే అదే వింటారు. తుమ్మమంటే తుమ్ముతారు దగ్గమంటే దగ్గుతారు. మీ చేతిలో ఆయన కీలుబొమ్మ కదా! మీరు వెళ్లిపోమంటేనే వెళ్లిపోయారు...మాట్లాడటం ఇష్టం లేనప్పుడు పిలవడం దేనికి? మళ్లీ పొమ్మనడం దేనికి? అయినా ఎక్కడికో తీసుకొచ్చి, ఇక్కడి నుంచి వెళ్లిపోమంటే ఎలా వెళ్ళిపోతాను? నాకు ఈ ఊర్లు ఏమీ తెలియవు. అనవసరంగా వాళ్ల వెనకతల వెళ్లే నన్ను పిలిచారు. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళేది? మిమ్మల్ని నమ్మి వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరిగింది." కట్టలు తెంచుకున్న ఉక్రోషాన్ని అదిమి పెట్టి అంది ఏడుపు గొంతుతో...
"నువ్వెటన్నా పోయావంటే మా పీకల మీదకు వస్తుంది. మళ్లీ మాకు ఎందుకు ఆ నిందలు. ఆ కాఫీ తాగు నిన్న అక్కడకు తీసుకెళ్లి వదిలేస్తాం," అన్నాడు రాజన్.
"ఎటన్నా పోయేదాన్ని అయితే... ఇంతకాలం ఎదురుచూడను. మీరు పిలవగానే ఎగురుకుంటూ రాను. మీకే గనుక అలాంటి భయమే ఉంటే మమ్మల్ని ఈరకంగా ఏడిపించేవారు కాదు." అంటూ పైకి లేచింది ప్రణవి.
"కాఫీ తాగు" అంది రాణి.
"నాకేం వద్దు తాగను." చెప్పింది ప్రణవి.
రాజన్ ఆటో పిలిచి మాట్లాడాడు. బరువైన గుండెతో ఆటో ఎక్కింది ప్రణవి.
***సశేషం***
రచయిత్రి పరిచయం ..
పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక
రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)
పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.
బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.
సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.
ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.