Menu Close
ఘాలి లలిత ప్రవల్లిక
కొలిమి (ధారావాహిక)
ఘాలి లలిత ప్రవల్లిక

పెళ్లయింది అన్నమాటే గాని మూర్తికి సుఖం లేదు. తనతో పాటు వాళ్ళ పుట్టింటికొచ్చేయమని కూర్చుంది.

"అదెట్లా వీలౌతుంది. తండ్రి ఉద్యోగం తీసుకున్నాను, తండ్రి బాధ్యతలు కూడా తీసుకోవాలి కదా! ఇలా వీళ్లందరినీ వదిలేసి అక్కడికి ఎలా వస్తాను? అయినా నువ్వు ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వస్తాను అన్నావు కదా! నువ్వే ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకుని రా?" అన్నాడు.

"మీ వాళ్ళందరినీ వదిలేస్తే వస్తాను. లేకపోతే రాను," అని కూర్చుంది.

విషయము తెలుసుకున్న గిరిజ,

"పోనీలే నాన్న... మేము ఉంటాము. పిల్ల మనసు నొప్పించక, ఆమె ఇష్టపడ్డట్టే చెయ్యి," అంది.

"అదేంటమ్మా అలా మాట్లాడతావు! తను అందర్నీ చూసుకుంటానని ఒప్పందపడే కదా పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మరి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మని చూసుకోవటం లేదా తాను. నేను నా తల్లిని చూసుకోకూడదా! నాతోబుట్టువు బాధతో ఉంటే దాన్ని ఎలా వదిలేసి వెళ్తాను? అయినా ఇక్కడికి వచ్చి ఓ నెల రోజులైన్నా సంసారం చేయకముందే ఈ రకంగా మాట్లాడిందంటే... ఆ అమ్మాయి కరెక్ట్ కాదమ్మా," అన్నాడు బాధగా.

"తప్పు నాన్న అలా మాట్లాడక, ఏ ఆడపిల్లన్నా సుఖంగా మొగుడుతో ఉండాలని కోరుకుంటుంది. చిన్నపిల్ల కదా! తను అలా ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నట్లుంది. సంసారం అన్నాక ఇద్దరూ బిగదీసుకోకూడదు. ఒకళ్ళు బిగించినప్పుడు ఒకళ్ళు సడలాలి. ప్రెస్టేజ్ లకి పోకూడదు. ఉమ్మడి గా ఉంటే మేము తనకు బరువు అవుతామని భయపడుతోందో...ఏమో! ఒకళ్ళ నొకళ్ళు అర్థం చేసుకునే వరకు మీ ఇద్దరు వేరు కాపురం పెట్టుకొని ఉండండి. నాకు ఎలాగో పెన్షన్ వస్తుంది కదా! నేను, ప్రణవి, దాని పిల్లలు బతుకుతాము. మా కోసంగా నువ్వు కాపురంలో కలతలు తెచ్చుకోబోక," అని నచ్చ చెప్పింది గిరిజ.

"నాకైతే సుతారము నచ్చలేదమ్మా. పెళ్లయిన మూడు రోజులకే ఈ రకంగా కండీషన్స్ పెట్టడం. అక్కనిచ్చుకున్న దగ్గర మనమే ఒదిగి ఉన్నాము. పిల్లను తెచ్చుకున్న దగ్గర కూడా మనమే ఒదిగి ఉండాలా? వృద్ధాప్యంలో తల్లి ని వదిలేసాను అనే నిందలు నేను మోయాలా అమ్మా? సజావైన కోరిక కోరితే తీర్చడంలో తప్పులేదు, కానీ ఇలా బంధాలను తెంపుకోమనే కోరిక కోరటం భావ్యంగా లేదు. వదిలేయ్ అమ్మా నా కర్మ... ఇంతే అనుకుంటాను," అన్నాడు బాధగా.

"అలా అనకు, బంధాలు తెంపుకోమని అనలేదు కదా! ప్రైవసీ కోసం వేరే ఉందామని అడిగింది. నువ్వు నన్ను వదిలేసావు అని నలుగురు అనుకుంటానికి...నేనే వెళ్ళమంటున్నాను కదా! వాళ్ళు ఎందుకు అనుకుంటారు నేను చెప్పనా! అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోబోక. మీరు వేరే కాపురం పెట్టుకొని సుఖంగా ఉండండి." అంటూ నచ్చచెప్పి పంపింది గిరిజ.

ఓ నెలరోజులు సెలవుల్లో అటు ఇటు తిరిగారు ఇరువురూ.

ఓ రోజు మూర్తి తల్లి దగ్గరికి వచ్చి

"అమ్మా! అది వేరు కాపురం అడిగింది ఈ ఊర్లో కాదమ్మా! వాళ్ల ఊర్లో... వాళ్ళ అమ్మ ఇంట్లో వచ్చి ఉండమంటోంది," అన్నాడు బాధగా...

"ఆమె వాళ్ళ అమ్మని వదిలి రాలేకపోతోందేమో రా పాపం... పోనీ నాన్నా మేము ఉంటాము లే... కొంతకాలం అది కోరినట్టే వెళ్లి, దానికి నచ్చచెప్పి తీసుకురా." అంటూ చెప్పింది.

"వద్దులే అమ్మా! మాట నిలకడ లేనిది. క్షణానికో రకంగా మాట మారుస్తూ ఉంటుంది. అసలు ఆ అమ్మాయి వినే దోరణిలో లేదు. తనమాటే నెగ్గించుకోవాలి అనే ధోరణిలో ఉంది. కాలమే సమాధానం చెప్పాలి. నా మీద వత్తిడి తేకమ్మా. నా నియమాలు నాకున్నాయి. నేనెవరినీ నొప్పించను. బాధ్యతలు విస్మరించను," అని చెప్పాడు మూర్తి.

గిరిజకు కూడా అల్లుడు అలాగా కోడలు ఇలాగా అని మనసులో బాధపడి, పై కంటే కొడుకు ఎక్కడ బాధపడతాడో అని, ఏమి అనకుండా...

"సరే నాన్న నీ ఇష్టం." అని ఊరుకుంది.

సుభాషిని ఇక్కడికి రావటానికి ఎప్పుడూ ఏదో వంకలు చెప్తూనే ఉండేది. సెలవుల్లో కూడా వచ్చేది కాదు. ఏదో వచ్చినా ఒక రెండు రోజులను మించి ఉండేది కాదు.

మూర్తి అక్కడికి వెళుతూ ఉండేవాడు. వాళ్ల ప్రవర్తనా విధానం నచ్చకపోయినా, అమర్యాదగా ప్రవర్తించినా, ఎవరికీ చెప్పుకోలేదు. కొంతకాలం ఓర్చుకుని, తర్వాత వెళ్లడం తగ్గించేసాడు.

పైకి చెప్పకపోయినా తమ్ముడు దేనికో మదన పడుతున్నాడని గ్రహించిన ప్రణవి మనసు బాధతో మూలిగింది. తనకోమార్గం చూపించమని దేవుడిని వేడుకున్నది. కనపడ్డ ప్రతీపుట్టకి చెట్టుకి మొక్కింది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

గోదావరి నది పుష్కరాలు వచ్చాయి. తన కర్మ కొంత అన్న తగ్గుతుంది అని చెప్పి వికాస తరంగణి వాళ్ళతో కలిసి, గోదావరి నది పుష్కరాలకు రాజమండ్రి వెళ్ళడానికి సిద్దపడింది ప్రణవి.

"అలా జనసందోహం ఉన్న ప్రదేశాలకు పిల్లల్ని తీసుకు వెళ్తే ఇబ్బంది పడతావు. పిల్లల్ని ఇక్కడే ఉంచేసేయి నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. ఎటువంటి పిచ్చ నిర్ణయాలు తీసుకోబోక. నువ్వు ఎవరితో అయితే వెళ్తున్నావో వాళ్ళతోనే ఉండు. జాగ్రత్త,"  అని చెప్పి పంపించింది గిరిజ.

ఓ పదిమంది దాకా మహిళలు బయలుదేరారు. వారితో కలిసి ప్రణవి కూడా వెళ్ళింది. అందరూ స్నానాలు పూర్తి చేసుకున్నాక చిన్న జీయర్  స్వామి వారు ఏర్పాటు చేసిన టెంట్ దగ్గరకు వెళ్ళి వారి ఉపన్యాసం వినాలని అనుకున్నారు.

కోటిలింగాల రేవు లో స్నానం చేద్దాం అనుకుని అక్కడకు వెళ్లి స్నానాలు చేసుకొని, అక్కడ ఏర్పాటు చేసిన గదులలో బట్టలు మార్చుకొని, బయటపడ్డారు. ఆటో ఎక్కాలంటే ఒక అరఫర్లాంగ్ నడవాలి. రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆటోలను దూరంగానే నిలిపేస్తూ ఉండటంతో ప్రణవీ వాళ్ళు నడవడం మొదలుపెట్టారు.

కొంత దూరం వెళ్ళాక... స్నానానికి వెళ్లే వారిలో రాజన్ దంపతులు కనిపించారు. అవునా! కాదా! సందేహంతో చూసింది. కన్ఫామ్ వాళ్లే... అని మనసులో దృఢపరుచుకుని... ఇంకా ఎవరెవరు వచ్చారా అని... చూసింది. కొద్ది దూరంలో జంబేష్ ఎవరితోనే వెళుతూ కనిపించాడు. అతను ప్రణవిని చూశాడో లేదో తెలీదు. రాజన్ ప్రణవిని చూసాడు. ప్రణవి తలదించుకుని తనతో వచ్చినవాళ్లు ముందుకు వెళ్లిపోవడంతో... ప్రణవి వాళ్ళను కలవాలని, వెళ్ళబోయింది.

"అమ్మాయి ఆగు. నేను నీతో మాట్లాడాలి ఇలారా," అంటూ ప్రణవి ని పిలిచాడు రాజన్.

ఆ పిలుపుతో... ప్రణవి మనసు ఎగిరి గంతేసింది.

'ఇన్నాళ్లూ పట్టించుకోకుండా ఒంటరిగా వదిలేసి, ఇప్పుడు, మాట్లాడాలని పిలుస్తున్నారు. నిజంగా మాట్లాడటానికేనా? మాట్లాడితే ఏం మాట్లాడతారు? నేనొక్కర్తినే ఉన్నానని... ఏమన్నా చేయడానికా? దేనికి పిలిచినట్టు?' రకరకాలుగా ఆలోచించటం మొదలుపెట్టింది.

కొంత దూరం వెళ్లిన వికాస్ తరంగణి బ్యాచ్ వాళ్ళు ప్రణవి రాకపోవడం గమనించి, వెనక్కి తిరిగి చూసారు.

కొద్ది దూరంలో ఆగి ఉండటం చూసి, ఏమైందో? అనుకుంటూ ఒక ఆవిడ ప్రణవి దగ్గరికి వచ్చి, "ఏమైంది? ఎందుకు ఆగావు?" అని అడిగింది.

ప్రణవి వాళ్ళ బావగారిని చూపించి,

"ఆయన మా బావగారు, ఆ పక్కన ఉన్నా విడి మా తోటి కోడలు. నాతో ఏదో మాట్లాడటానికి రమ్మంటున్నారు." అని చెప్పింది.

వచ్చిన ఆవిడ ప్రణవి గురించి తెలిసింది కావడంతో...

"నీ మొర దేవుడు ఆలకించినట్టున్నాడు. నీ కాపురం చక్కబడడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. వాళ్ళే పిలుస్తున్నారుగా వెళ్ళు, వెళ్ళి మాట్లాడు. మేము చిన్న జీయర్ స్వామి వారు ఉన్న దగ్గరికి వెళ్తాము. నువ్వు మాట్లాడేసాక అక్కడికి వచ్చేసేయ్." అని చెప్పి ఆమె వెళ్లిపోయింది.

ప్రణవి అడుగులు రాజన్ దంపతులు ఉన్న వైపు పడ్డాయి.

***సశేషం***

రచయిత్రి పరిచయం ..

Ghali-Lalitha-Pravallika పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక

రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)

పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.

బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.

సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.

ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.

Posted in April 2025, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!