Menu Close
Ghali-Lalitha-Pravallika
కొలిమి (ధారావాహిక)
ఘాలి లలిత ప్రవల్లిక

మూర్తి వాళ్ళు ఇంటికి వచ్చారు అన్నమాటే గాని, జంబేష్ వస్తాడో రాడో అనే అనుమానం పీకుతూనే ఉంది. 'రాజన్ ఇచ్చిన ధైర్యం తో శుభలేఖలో ప్రణవి, జంబేష్ ల పేర్లు వేయించాడు. తీరా పీటల మీద కూర్చోకపోతే... ఏం చేయాలి? అసలు ఇన్నాళ్లు పెళ్ళాం బిడ్డలను వదిలేసిన వాడు, బావమరిది పెళ్లికి వస్తాడా?' అని మధనపడుతూ గిరిజ దగ్గర అన్నాడు.

"ఈ మాత్రం దానికి అంత బాధ పడాలా ఏంటి? మర్యాదగా మనం ఇంటికి వెళ్లి పిలిచాము. రెండు మూడు సార్లు ఫోన్ కూడా చేశాము. ఎన్నిసార్లు ఫోన్ చేసినా, రాజన్ నే ఎత్తుతున్నాడు.‌ అతనే మాట్లాడుతున్నాడు. జంబేష్ ని ఎప్పుడు అడిగినా లేడు. అని చెప్తున్నారు. 'ఏంటి రాజన్ ఒక్కసారైనా అల్లుడు దొరకడం లేదే అంటే... వాడి కసలు కాళీ ఉండటం లేదు. మీరేం భయపడకండి ఆ టైం కి వస్తాడు. నేను చెప్తాగా అని నవ్వేస్తాడు'. ఇంక ఇంతకన్నా మనం ఏం చేయగలము. దగ్గర దాపు కాదు. పోని మాటి మాటికి వెళ్ళడానికి. అయినా ఇలాంటి వాడు ఏం వస్తాడు? మన పిచ్చి కొద్దీ పిలవడం గానీ. వచ్చే వాడైతే ఇలా ప్రవర్తించడు. మర్యాద కన్నా మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడేవాడు. మన తప్పు లేకుండా పిలిచాం. గౌరవంగా వచ్చాడా సరే సరి, లేదా పీటల మీద మా అన్నయ్య కొడుకుని, కోడలినీ కూర్చోపెడతాను." అంది కోపంగా.

ఆమె కళ్ళ ముందు ఆ సంఘటన మెదిలింది.

*****

ఆవిడకు జంబేష్ అంటే చాలా కోపం. పెళ్లికి ముందు నుంచి అల్లుడుగారు... అల్లుడుగారు అంటూ చాలా గౌరవించింది. ప్రణవి పెళ్ళినాటికి కొడుకులిద్దరూ చిన్నవాళ్ళు కావటంతో... అల్లుడిని పెద్ద కొడుకుగా భావించింది. ఆయన మాటలకు సై అనేది. "పెళ్ళి కి నాతో సమానంగా అన్నకూ బట్టలు కొనాలని, పెళ్లికూతురుకి ఏమి కొంటే అవే ఒదిన రాణికి కొనాలి," అని... జంబేష్ అడిగినప్పుడు... ఆంజనేయులు గారు... "వీళ్లదేదో వింత పోకడలా ఉంది... ఇలాంటివి ఆదిలోనే తుంచేయాలి. లేకపోతే ముందు ముందు చాలా ఇబ్బందులు పడతాము..." అని గిరిజ దగ్గర అంటే... "పోనీలెండి పాపం, పెద్ద కోడలు పుట్టింటి వారు బీదవాళ్లు... వాళ్ళు ఏం పెట్టి ఉండరు. మేనరికం కావడంతో చేసుకున్నట్టున్నారు. ఇలాంటి ముచ్చట్లు జరిగి ఉండవు. అందుకే అడుగుతున్నట్టున్నారు. మన అల్లుడుగారు నోరు తెరిచి అడిగారు కదా! ఆయన కోరిక తీరుద్దాము." అని చెప్పి ఆంజనేయులు గారిని బలవంతంగా ఒప్పించి, తలకు మించిన భారమైన... ప్రణవికి తీసినట్లే... రాణి కి కూడా మూడు పట్టు చీరలు తీసింది. అదేవిధంగా రాజన్ కి కూడా తీయించింది.

"ఇక మధుపర్కాలు ఒకటి ఆపడం దేనికి అవి కూడా కొనేసి పీటలమీద ఆ జంట ను కూడా కూర్చోబెట్టు," అని గిరిజ అత్తగారు రుస రుసలాడిన ఓర్చుకుంది.

జంబేష్ మాటలకు అంత విలువా గౌరవం ఇచ్చిన, ఆమెను...పెళ్లి అయ్యాక వాళ్ళ ఇంటికి వెళితే... అకారణంగా పెట్టె గిరివాటేసాడు. "మా ఇంటికి రావద్దు నువ్వు" అన్నాడు.

"అదేంటి బాబు, అలా అంటావు. నేను గానీ నా కూతురు గానీ ఏమన్నా తప్పు చేశామా?" అని అడిగితే...

"నీకు జవాబు చెప్పాల్సిన పని లేదు. అన్నయ్య చెప్పాడు చేస్తున్నాను". అని జవాబు చెప్పాడు.

"ఇదేమన్నా భావ్యంగా ఉందా! మీ అత్తగారిని ఇలా గేంటేయటం." అని అడిగినప్పుడు,

"అదిగో... నువ్వు మా మధ్య పొరపొచ్చాలు తీసుకొస్తున్నావ్. 'మీ అత్తగారిని అంటూ' మా ఇద్దరినీ వేరు చేసి మాట్లాడుతున్నావ్. నీ కూతురు కూడా అంతే... రాత్రిళ్ళు నాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. నాతో ఏంటి మాట్లాడేది? ఏమన్నా కావాలంటే వదినని, అమ్మని అడగాలి. ఏమన్నా మాట్లాడుకోవాలంటే వాళ్లతో మాట్లాడుకోవాలి. నాతో ఏంటి మాట్లాడేది?" అన్నాడు జంబేష్.

రాజన్ కల్పించుకుంటూ... "నువ్వు ఆగు జంబూ..." అతనిని వారించి,

“పెళ్లి చేసేసాక మీరు మళ్ళీ ఇక్కడికి రాకూడదు. మీరు వచ్చి పోతుంటే వాళ్ళిద్దరి మధ్య... అన్యోన్యత తగ్గుతుంది. పిల్లని మాకు అనుకూలంగా మార్చుకుంటున్నాం. మీరు రాకండి." అని చెప్పాడు.

"పెళ్లి చేసేసాక మా పిల్ల కాదు మీ పిల్లే... మేము దానికి ఏమీ అబ్జెక్ట్ చేయలేదు కదా. కోడలు అన్నాక అత్తవారి పద్ధతులకు తగిన విధంగా నడుచుకోవాలి. మా అమ్మాయి కూడా అలాగే ప్రవర్తిస్తుంది. దానిని చాలా పద్ధతిగా పెంచాము. ఎదురు తిరిగి మాట్లాడే పిల్ల కాదు. ఆ విషయం మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. నా కూతురు అని, నేను చెప్పకూడదు గాని బంగారమంటి పిల్ల. ఏ తల్లి కూతురు కాపురంలో నిప్పులు పోయడానికి రాదు. కొత్తగా కాపురానికి వచ్చింది కదా! ఇక్కడ ఏదైనా అడగడానికి, మాట్లాడటానికి మొహమాటం గా ఉంటుంది. కాసేపు నాతో మాట్లాడితే తృప్తిగా ఉంటుందని, నేను పిల్లను చూసినట్టు ఉంటుందని వచ్చా..." అని చెప్తుంటే...

"ఏంటి మగాడికి ఎదురు నిలబడి మాట్లాడుతున్నావ్? వెళ్తావా వెళ్ళవా?" అని... ప్రణవిని పిలిచి,

నీకు మొగుడు కావాలి అనుకుంటే నీ తల్లి పెట్టి గిరవాటు వేయి, ఆమె తెచ్చిన స్వీట్లు, చీరలు అవి కూడా విసిరి పారేయ్... మీ అమ్మ మళ్ళీ ఇక్కడ నోరు ఇప్పటానికి వీల్లేదు." అన్నాడు.

ప్రణవి కి ఏం చేయాలో తోచలేదు. 'పెళ్లయి నెల రోజులు కూడా కాలేదు... ఈ గొడవలు ఏంటి? కనిపెంచిన నా కన్న తల్లిని, నా చేతులతో గెంటాలా? భర్త ఆజ్ఞను మీరటం పతివ్రతా ధర్మం కాదు.' ఏం చేయాలి ఏం చేయాలి అని మథన పడుతూ ఉంది.

"ఏం మొగుడు మాట లెక్కలేదు నీకు. నేను చెప్పినట్టు వినలేదు కాబట్టి, నీ గుడ్డలు కూడా తీసుకుని, మీ అమ్మతో మీ ఇంటికి పో." అన్నాడు కోపంగా.

ప్రణవి ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్లి, "అమ్మా ఏమీ అనుకోకు," అంది అంతకన్నా ఏం మాట్లాడలేకపోయింది. ఒక పక్కన వీళ్లు అంటే అసహ్యం ఉన్నా, కేవలం ధర్మానికి కట్టుబడింది.

గిరిజ కూతురిని అర్థం చేసుకునే, దాని పరిస్థితికి జాలి పడుతూ... పెట్టి తీసుకొని బయటకు నడిచింది.

ఆమె రోడ్డు మీదకు రాగానే... ఆమె మొహం మీద పడేట్టుగా... ఆమె తెచ్చిన జంబేష్ పళ్ళు, పూలు, స్వీట్లు, బట్టలు విసిరి కొట్టాడు జంబేష్. పుట్టి బుద్ధెరిగాక, ఇలాంటి అవమానం ఎప్పుడూ పొందలేదు. పెదవి విప్పితే కూతురు కాపురానికి ముప్పు వస్తుందని, గిరిజ తనలో తానే కుమిలిపోయింది.

*****

'ఎన్నో విధాలుగా కూతురిని ఏడిపించినా... కూతురు అతనినే వెనకేసుకొచ్చి మాట్లాడేది. ఒక్కనాడు తన కష్టాలు చెప్పుకునేది కాదు. అలాంటి పిల్లని చాలా దుఃఖ పెట్టాడని, ముద్దు ముచ్చట్లు లేకపోగా... కడుపుతోందని చూడకుండా ఇంట్లోంచి గెంటేయటం... పిల్లలు పుట్టినా చూడటానికి రాకపోవటం... పెళ్ళాం బిడ్డల విషయంలో బాధ్యతలు లేకుండా ఉండటం, ఆమెకు నచ్చలేదు. కూతురు పైకి నవ్వుతూ ఉన్నా లోపల ఎంత కుమిలిపోతోందో ఆమెకు తెలుసు. దీనికి అంతటికీ కారణం ఆ జంబేషే... ఇష్టం లేని వాడు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. పెళ్లి చేసుకుని పరాయి అమ్మ కన్న బిడ్డని, ఈ రకంగా ఏడిపించటం ఏంటి?' అని అనుకున్నది.

ఏ తప్పు చేయని ప్రణవిపై నిందలు మోపాలని చూడటం, ఆమె చేసిన పనులను బూతద్దం లో పెట్టి చూడటం, అతని కొడుకు పేగు మేడను వేసుకుని పుడితే, కన్నదండ్రిగా వచ్చి, శాంతి పూజ చేయించలేదని,  మేనమామకు కీడు అని తెలిసిన... నూనెలో మొహం చూపించాల్సిన బాధ్యతను కూడా విస్మరించి ప్రవర్తించాడని, మొగుడు ఉండి లేనిదాని లాగా అది, తండ్రి ఉండీ లేని వాళ్ళ లాగా పిల్లలు బతుకుతున్నారని...ఇవన్నీ ఆ కన్నతల్లి మనసుని గాయపరిచాయి. మనిషిని మించిన బాధల్లో కుటుంబాన్ని ముంచేసిన అతని మీద కోపంతో రగిలిపోతోంది. అతని ప్రస్తావన వస్తే ఏక వచనమే వాడుతోంది.

*****

మూర్తి పెళ్లి దగ్గర పడింది. పెళ్ళి పనులతో అందరూ బిజీగా ఉన్నారు. జంబేష్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. మూర్తికి 'అక్కా బావ పీటల మీద కూర్చుని చేస్తే బాగుంటుంది. ఈ వంకతో అన్న ఇద్దరూ ఒకటి అవుతారు.' అని మనసులో ఉండేది. అనుకున్నంత మాత్రాన అయిపోవుగా. వీళ్ళ మనసుని మార్చగలిగే శక్తి భగవంతునికి కూడా లేనట్టుంది, పెళ్లికి... జంబేష్ కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. పీటల మీద గిరిజ అన్న కొడుకు, కోడలు కూర్చుని మూర్తి పెళ్లి జరిపించారు.

ప్రణవి, భర్త రాలేదు అన్న బాధను మొహంలో కనపడనీయకుండా నవ్వుతూ తిరిగింది. ఎవరైనా తెలియని వాళ్ళు అడిగితే... "అనుకోకుండా ఆఫీస్ పని పడింది. తప్పకుండా వెళ్లాల్సిన పని కావడంతో రాలేకపోయారు," అని చెప్పేది. పెళ్లి తంతు ముగిసింది.

"మీ అక్కగారు నన్ను చూసి ఏడ్చారు." అంటూ మూడు నిద్రలలోనే మొదలెట్టింది మూర్తి భార్య... సుభాషిణి.

"అక్క ఎందుకు ఏడుస్తుంది? అలా ఏడ్చే మనిషి కాదు," అన్నాడు మూర్తి.

"లేదు నేను చూశాను. మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు, మనిద్దరిని చూసి ఏడ్చింది," అంది.

తనతో పుట్టి పెరిగిన అక్క మనస్తత్వం ఎలాంటిదో మూర్తికి తెలుసు. కానీ కొత్తగా వచ్చిన భార్య ఇలా చాడీలు చెబుతూ ఉంటే బాధ వేసింది. కాదని చెప్పినా వినటం లేదు. అని చెప్పింది రైట్ అన్నట్టుగా మొండిగా ఉంది. తన మాట కాదంటే సంసారంలో గొడవలు వస్తాయి. అవును అంటే కుటుంబంలో గొడవలు వస్తాయి. ఏం చేయాలి? అడకత్తెరలో పోక చెక్కలాగా నలిగింది మూర్తి మనస్సు.

***సశేషం***

రచయిత్రి పరిచయం ..

Ghali-Lalitha-Pravallika పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక

రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)

పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.

బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.

సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.

ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.

Posted in March 2025, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!