Menu Close
Ghali-Lalitha-Pravallika
కొలిమి (ధారావాహిక)
ఘాలి లలిత ప్రవల్లిక

మూర్తి కి సంబంధం ఒకటి వచ్చింది. పిల్లది గవర్నమెంట్ ఉద్యోగం. పిల్లా పిల్లాడు ఒకళ్ళకొకరు నచ్చుకున్నారు. ఆడపిల్ల భర్త వదిలేసి, ఇద్దరు పిల్లలతో ఇంట్లో ఉంది. వాళ్ళను చూసుకోవాలి. అని చెప్పింది గిరిజ. "అయ్యో! భర్త వదిలేసిన ఆడపిల్ల పుట్టింట్లో కాక ఇంకెక్కడుంటుంది? మా అమ్మయి అలాంటి వాటికి అనేది కాదు." అని పిల్ల తల్లి అంది.

పిల్ల కూడా "తను ఉండటం వల్ల నాకేం అభ్యంతరం లేదు. నేను అలా అనే దానిని కాదు. తనను పువ్వులలో పెట్టి చూసుకుంటాను." అని అంది.

'పిల్ల కష్టం, సుఖం తెలిసిన మనిషిలా ఉంది. ఆడపడుచును, పిల్లల్ని చూసుకుంటానని చెబుతోంది. మంచి అమ్మాయి లాగా ఉంది. ఇంకా ఇద్దరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులే కావడంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు.' అని అనుకున్నారు పెద్దలు.

మూర్తి పెండ్లి సుభాషిణి తో కాయ పడింది. ఆంజనేయులు గారు లేకపోవడంతో... ప్రణవి ఆమె భర్త జంభేష్ పెండ్లి పీటల మీద కూర్చోవాలి అని బంధువులు చెప్పారు.

మూర్తి... పెదనాన్న, పెద్దమ్మలను తీసుకుని పిలవడానికి వెళ్ళాడు. ఇంటి అడ్రస్ తెలుసుకోవడానికి చాలా అవస్థ పడ్డాడు. చివరకు ఇరు పక్షాల మధ్య పెద్దరికం వహించి, పెళ్ళి చేసిన పెద్దల ద్వారా చిరునామా సేకరించి, వారిని తీసుకొని జంబేష్ ఇంటికి వెళ్ళాడు.

జంబేష్ ఇంట్లో లేడు. రాణి వచ్చిన వారికి మర్యాదలు చేసింది.

మూర్తి కి పెళ్లి కాయం అయ్యిందని,
ఆ కార్యక్రమం జంబేష్ దంపతుల చేతులమీదుగా జరిపించాలని, రాజన్ కు చెప్పారు.

"ఓ తప్పకుండా పంపుతాం. మేమూ వస్తాం. ఇది మనింట్లో కార్యం. మేము తప్పకుండా నిలబడతాం." అని చెప్పాడు రాజన్.

"ప్రణవీని, పిల్లల్ని తెచ్చుకోవచ్చు కదా! అలా ఆమెను పుట్టింట్లో ఎంత కాలం ఉంచుతారు?" అంటూ అడిగాడు వచ్చిన పెద్ద మనిషి.

"మాకు మాత్రం సరదా నా అండి? మా మాట వింటంలేదు. పిల్లను దార్లో పెట్టుకుంటున్నాము. చదువుకున్న పిల్ల కదా ఆ పెడసరి తనం తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. పిల్లను మేమేమీ వదిలేయము," అని చెప్పాడు రాజన్.

"ఆ పిల్ల మా వాడిని కొ... వాడు అంది. మొగుడన్న మర్యాద లేదు.

నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది. మమ్మల్ని పట్టుకొని అడుక్కొనే వాళ్ళు అంది. ఎంగిలి మెతుకులు ఏరుకు తినే వాళ్ళు అంది." అంటూ చాడీలు చెప్పడం మొదలు పెట్టింది సుందరి.

"నువ్వు ఉండమ్మా. అది అన్న మాటలు ఎవరూ వినలేదు గానీ! నువ్వు ఆమె మాట్లాడిన మాటలు చెప్తూ ఉంటే... అత్తగారు లేని పోనివి కలిపించి చెప్పారు అంటూ నింద నీ మీద మోపుతారు. నువ్వేం మాట్లాడక" అన్నాడు రాజన్.

మూర్తి కి వాళ్ళ మాటలు వింటుంటే కోపం వస్తోంది.

ఆడపిల్లనిచ్చుకున్న దగ్గర అణిగి మణిగి ఉండాలని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు.

వచ్చిన పెద్దలకి కూడా ప్రణవి తప్పు ఏం లేదని తెలిసినా... మూర్ఖత్వంతో నిండిన వారి మేథో కోటలోకి చొరబడే సాహసం చేయలేక, పెదవి విప్పితే మొదలకే మోసం వస్తుందేమోనని జంకి మెదలకుండా ఉన్నారు.

రాణి ప్రేమనంతా ఒలకబోస్తూ...

"ప్రణవి ఎలా ఉంది? పిల్లలు ఎలా ఉన్నారు? ఏం చదువుతున్నారు?"

అమ్మ ఆరోగ్యం బాగుందా? నీ కాబోయే భార్య ఎలా ఉంటుంది? కట్న కానుకలు ఎంత?" అంటూ వరుసగా ప్రశ్నలు వేసింది.

ఆమె చూపే ప్రేమకు కరిగి పోయాడు మూర్తి. అన్నిటికీ జవాబులు చెప్పాడు.

జంబేష్ వస్తే పిలవాలని చాలాసేపు కూర్చున్నారు. అతను రాలేదు. రాజన్ ని అడిగారు. "కేంపు వెళ్ళాడు. వారం రోజుల వరకూ రాడు. మీరు పనులు మొదలు పెట్టుకోండి. వాడ్ని నేను పంపుతాను," అని రాజన్ చెప్పడంతో...

అందరూ సంతోషంగా ఇంటి ముఖం పట్టారు.

***సశేషం***

రచయిత్రి పరిచయం ..

Ghali-Lalitha-Pravallika పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక

రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)

పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.

బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.

సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.

ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.

Posted in February 2025, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!