Menu Close
Ghali-Lalitha-Pravallika
కొలిమి (ధారావాహిక)
ఘాలి లలిత ప్రవల్లిక

ప్రణవి కనబడిన ప్రతీ జాబ్ కి అప్లై చేయడం మొదలు పెట్టింది.

లైబ్రరీ కి వెళ్ళి, ఎంప్లాయిమెంట్ న్యూస్, న్యూస్ పేపర్లతో పాటు, సి.యస్.ఆర్, ఉద్యోగ విజయాలు, ఉద్యోగ సోపానాలు లాంటి కాంపిటీటివ్ బుక్స్ చూసేది. వాటిల్లో ఇచ్చే ప్రాక్టీస్ పేపర్లను టైం పెట్టుకుని ప్రాక్టీస్ చేసేది.

ఎక్కడ ఫ్రీగా కోచింగ్ ఇస్తామంటే అక్కడికి కాలినడకన వెళ్ళేది.

పిల్లలు ఇద్దరినీ ఓ కాన్వెంట్లో చేర్పించారు గిరిజ వాళ్ళు. పిల్లలను తయారు చేయటం, క్యారేజీలు సద్దటం అన్ని గిరిజ చూసుకునేది. ఆంజనేయులు గారు సర్వీస్ లో ఉండి చనిపోవడంతో ఆ ఉద్యోగం ప్రణవి తమ్ముడు మూర్తి కి వచ్చింది.

మూర్తి చాలా సౌమ్యుడు బాధ్యత ఎరిగిన మనిషి. ప్రణవి పడే కష్టాన్ని చూసి,

"అక్కా ఎందుకు నువ్వు అంత కష్టపడతావ్? మీరు నాకు భారం కాదు. నాన్నగారి ఉద్యోగం నేను తీసుకున్నాను, నాన్నగారు బతికుంటే నీ బాధ్యతలు చూసేవారు కదా! ఆ స్థానంలో ఉండి నేను బ్రతికున్నంత వరకూ, నీకు, నీ పిల్లలకి ఏ లోటూ లేకుండా చూసుకుంటాను," అంటే,

"లేదు లేరా, నేను అలా ఎవరి మీదా డిపెండెంట్ గా బ్రతకను. ఆడపిల్లలు స్వతంత్రంగా బ్రతక గలగాలన్నదే నాన్నగారి ఆశయం కూడా. నాన్నగారు నాకు ఎటూ చదువు నేర్పించారు. నా విద్యకి సార్థకత చేకూరాలికదా! నేనేం కష్టపడటం లేదు. నువ్వేం బాధ పడకు," అని చెప్పింది ప్రణవి.

"నీ ఇష్టం అక్కా. నేను చెప్పినా నువ్వు వినవు కదా!" అన్నాడు.

ప్రణవి ఎక్కువ సమయం చదువుకే కేటాయించేది.

కొందరు మిత్రులతో కలిసి కంబైన్ స్టడీ చేసేది. మానవ కృషికి దైవ కృప తోడవ్వాలని సాయీ డివోటీగా మారింది. సమయం దొరికినప్పుడల్లా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేది. వికాస తరంగిణి లో చేరి విష్ణు సహస్రనామ పారాయణ చేసేది.

తెల్లవారుఝామున 4:30 కే లేచేది. ఓం కారంతో రోజు కు శ్రీకారం చుట్టేది. కాసేపు మెడిటేషన్ చేసేది. బాడీ ఫిట్నెస్ కోసం జాగింగ్ చేసేది. ఇలా తనను తాను బిజీ చేసుకొంది.

ప్రతి టెస్ట్ కి అటెండ్ అయ్యేది.

ప్రిలిమినరీస్ లో సెలెక్ట్ అయినా మెయిన్స్ లో పోగొట్టుకొని, ఈవెంట్స్ లో సెలెక్ట్ అయ్యి టెస్టులో పాసవ్వక ఇలా ప్రతి దాంట్లో కూడా ఆమెకు చుక్కెదురయ్యేది.

తన బ్యాచ్ లో తనకన్నా తక్కువ చదివిన వారికి ఉద్యోగాలు వచ్చేసేవి. తనకు మాత్రం వచ్చేది కాదు. వీళ్ళకి తెలియనివి ప్రణవీనే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేది. అలాంటిది ఆమెకు రాకుండా ఆమె ఫ్రెండ్స్ కి వచ్చేసరికి... ఆమె ఫ్రెండ్స్ చాలా బాధ పడేవారు. "నువ్వు అబద్దం చెప్తున్నావ్... నీకు రాకపోవడం ఏంటి?" అంటూ ప్రణవి తనకు రాలేదని ఎంత చెప్పినా మొదట్లో వాళ్ళు నమ్మేవారు కాదు.

ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి రిజర్వేషన్ల సౌలభ్యం గాని, ఆమ్యామ్యాలు అర్పించుకునే స్తోమతగాని, టాప్ మోస్ట్ ర్యాంకర్ గాని అయి ఉండాలని విషయాన్ని గ్రహించింది.

ఇప్పుడు తను ఉండే పరిస్థితులు వాటికి పూర్తి భిన్నంగా ఉండటంతో...గవర్నమెంట్ జాబులు రావని డిసైడైనది. ప్రైవేటు జాబుల కోసం ప్రయత్నించింది. ప్రణవి ఒడ్డు పొడుగు అమాయకమైన ఆమె మొహం చూసి... ప్రైవేట్ సెక్టార్స్ లో ఎక్కువగా ఫీల్డ్ వర్క్ ఇస్తామని ఆఫర్ చేసేవారు. ఫీల్డ్ వర్క్ చేస్తే లేని పోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ గుండె పరిస్థితులకి నీ మైండ్ సెట్ కి అది నీకు సూటబుల్ కాదు అని శ్రేయోభిలాషులు చెప్పడంతో..‌. అలాంటి జాబులు చేయలేదు.

చివరకు ఓ ప్రైవేటు సెక్టార్ లో తక్కువ జీతానికి రిసెప్షనిస్ట్ గా చేరింది. పొద్దున్నే పిల్లలతో పాటు తాను క్యారేజ్ పుచ్చుకొని వెళ్ళిపోతుంది. వీలైనప్పుడు తనతో పాటే పిల్లలను స్కూల్లో దించేసేది. తను దించలేనప్పుడు ఎవరో ఒకరు పిల్లల్ని స్కూల్లో దించేసే వారు.

***

సొంత ఇంటి కల నిజమైంది రాణికి. కొత్త ఇల్లు కొత్త వాతావరణం. ఆధునిక సదుపాయాలతో ఉంది ఆ ఇల్లు.

ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ వీళ్ళ అసలు రంగు తెలియకపోవడంతో...  ఇక్కడ చుట్టుపక్కల 'చాలా మంచి వాళ్ళు వాళ్ళు' అనే పేరు తెచ్చుకున్నారు.

వ్యాపారం బాగా అభివృద్ధి పొందడంతో... అతి తక్కువ కాలంలోనే డబ్బున్న వాళ్ళ జాబితాలోకి చేరిపోయారు. రాజన్ పిల్లలిద్దరూ కూడా ఎదిగి పోయారు.

జంబేష్ లో మాత్రం ఏ మార్పూ రాలేదు. తన పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలనే ఆలోచన కూడా ఉండేది కాదు.

తను ఓ ప్రయివేటు కంపెనీలో తక్కువ జీతానికి ఉద్యోగం చేస్తూ... ఉద్యోగానికి వెళ్ళేందుకు ముందు, ఉద్యోగం నుంచి వచ్చాక అర్ధరాత్రి వరకు... ఇక్కడ వ్యాపారంలో అన్నయ్య రాజన్ కు చేదోడు వాదోడుగా  ఉండేవాడు. ఒదిన రాణికి వారు చేస్తున్న పని మీద అవగాహన కల్పించి శిక్షణ ఇచ్చేవాడు.

జంబేష్ ఇచ్చిన తర్ఫీదు వల్ల జంబేష్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు, షాపు చూసుకునేది రాణి. బయట పనులన్నీ రాజన్ చూసుకునేవాడు.

కొంతకాలం ఇక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళు జంబేష్ కు పెళ్లి కాలేదని అనుకునేవారు. చొరవ తీసుకుని ఒక ఆవిడ సంబంధం తీసుకొచ్చింది.

ఆమెతో రాణి... "మా మరిది గారికి వివాహం అయిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు." అంటూ చెప్పింది.

"మరి ఆ అమ్మాయి ఏది? కనపడదే?" అడిగింది సంబంధం తీసుకొచ్చినావిడ.

“ఆమె ఆరోగ్యం బాగోకపోతే, విశ్రాంతి తీసుకోవటానికి, పుట్టింటికి వెళ్ళింది. తగ్గగానే వచ్చేస్తుంది." అని చెప్పింది.

***సశేషం***

రచయిత్రి పరిచయం ..

Ghali-Lalitha-Pravallika పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక

రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)

పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.

బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.

సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.

ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.

Posted in January 2025, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!