కామాక్షమ్మ గారి మాటలు ప్రణవి పై ప్రభావితం చేసాయి.
'అవును ఆవిడ అన్నట్టుగా ముందు నా కాళ్ళ మీద నేను స్ట్రాంగ్ గా నిలబడాలి. ఇలా పావలా అర్ధ కమిషన్ బేస్ లో కాకుండా... చేతి ఖర్చులకు వస్తే చాలు అని అనుకోకుండా, ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. పదిమందిని పోషించగలిగే స్థాయికి నేను వెళ్ళాలి. గవర్నమెంట్ జాబ్ అయితే లైఫ్ కి సెక్యూరిటీగా ఉంటుంది. ఇక ఇలాంటి చిన్న చిన్న వాటికి టైం వేస్ట్ చేసుకోకూడదు.
పైసా సంపాదనలేదు... క్షణం తీరుబడి లేదు... అన్నట్టుగా ఉంది.
మైండ్ ని బిజీగా ఉంచుకుంటే...విషాద జ్ఞాపకాలు వీగిపోతాయి అనుకున్నాను... కానీ బ్రతుకు కు భరోసా కావాలి కదా! నా బిడ్డలకు తల్లి అయినా, తండ్రి అయిన నేనే.
వాళ్లకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే... నేను ముందు స్టెబిలిటీ గా నిలబడాలి. బాగా సంపాదించాలి. సంపాదించాలి అంటే కష్టపడాలి. ఇతర ఆలోచనలు మైండ్ లోకి రానీయకుండా... లక్ష్య సాధన వైపు సాగాలి. ముందు నేను నిల దొక్కుకున్నాకే సమాజం గురించి ఆలోచించాలి,' అని మనసులో అనుకొంది ప్రణవి.
*****
వ్యాపారం బాగా కలిసి రావడంతో... వేసి వేయకుండా ఉన్నారు రాజన్ & కో.
ఓ రోజు రాజన్ మంచి మూడ్ లో ఉండంగా
"బావా! వేరే ఇంట్లోకి షిఫ్ట్ అవుదాము." గోముగా అడిగింది రాణి.
"ఏమి! ఇక్కడ బాగానే ఉంది కదా! మనకి బాగా కలిసి వచ్చింది," అన్నాడు రాజన్.
"బానే ఉంది కానీ, ఇక్కడ ఉండటానికి ఏదో గిల్టీ నెస్ గాఉంది," అంది.
"దేనికి గిల్టీ ఫీలింగ్? నువ్వు తప్పు చేశాను అని అనుకొంటున్నావా?"
"అదేం లేదు. నలుగురూ నన్నేమనుకుంటారో నని..." నసిగింది రాణి.
"నీకు అదే చెప్పేది... ఎవరికోసమో మనం బతకడం లేదు. మనకోసం మనం బతుకుతున్నాం. లోకులు కాకులు.
ఎక్కడ ఉన్నా వాళ్ళు అనాల్సినవి అంటారు. వాటిని పట్టించుకోకూడదు. కొన్ని కొన్ని కావాలనుకుంటే కొన్నింటిని వదులుకోక తప్పదు," అన్నాడు రాజన్.
"అది కాదులేరా! డబ్బులకి ఇప్పుడు ఇబ్బంది లేదు కదా! అద్దె ఇంట్లో ఎందుకు? సొంత ఇంటికి వెళ్దాం అని తను అంటోంది," అంటూ సర్దాడు జంబేష్.
"మనం ఇల్లు మారితే... మళ్ళీ వారొచ్చినప్పుడు ఇబ్బంది పడతారు ఏమోరా!" అన్నాడు కొడుకును ఉద్దేశించి సీతయ్య.
"ఎవరు ఇబ్బంది పడేది?" రయ్యిన లేచాడు జంబేష్ .
"నీ పెళ్ళాం, బిడ్డలు" చెప్పాడు సీతయ్య.
"నాకు అలాంటి వాళ్ళెవరూ లేరు. మరోసారి వాళ్ల గురించి మాట్లాడితే ఊరుకోను," గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు జంబేష్.
"వాడి మనసు ఎంత గాయపడిందో! పాపం పిచ్చి నాయన," అంది జాలిగా సుందరి.
"పాపం జంబేష్ బావకు సుఖం లేకుండా పోయింది." బాధగా అంది రాణి.
"పాపం పిచ్చి నాయన!" అంది సుందరి.
'ఏ తప్పూ చేయని ఆ పిల్లను ఉత్తి పుణ్యానికి ఇంట్లోంచి గెంటేసి, తప్పు ఆ పిల్లదే అన్నట్లుగా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు వీళ్ళు. కనీసం మనస్సులో కూడా మేము చేసింది తప్పు అని అనుకుంటున్నట్లు లేదు. మహా మహా నటులు,' పైకనే ధైర్యం లేక, మనస్సులో అనుకున్నాడు సీతయ్య.
"ఇప్పుడు ఇల్లు మారటం పెద్ద సమస్యే కాదు. రేపీ పాటికి ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోతాం. ఇక్కడ వాళ్ళు రాకూడదనుకున్నాం కాబట్టి... మనం ఎక్కడున్నది వాళ్ళకు అడ్రస్ చెప్పం. విడాకులు తీసుకోలేదు కాబట్టి, ఆ పిల్ల వచ్చే అవకాశం ఉన్నది. రేపా పిల్ల వచ్చి ఇక్కడ గందరగోళం చేస్తే!" అన్నాడు రాజన్.
"దానికంత సీన్ లేదులే అన్నయ్యా... దద్ది మొహం ది. దాన్ని మనం ఈజీగా మోల్డ్ చేసుకోవచ్చు. అసలు దానికోసం అంత ఆలోచించాల్సిన పని లేదు.
వదిన వేరే ఇంటికి వెళ్దాం అని అడిగింది కదా! మారిపోదాం. మన షాపు ఉన్న తట్టు చూడు. అటే వెళ్దాం. ఇల్లు షాప్ కి దగ్గరలో ఉంటే వ్యాపారాన్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవచ్చు," చెప్పాడు జంబేష్.
"సొంతిల్లు, ఆస్తులు ఉన్నట్లు తెలిస్తే అది వంతుకి వస్తుంది ఏమో బావా!" అంది రాణి.
"భయపడకు దానికి ఎవరు చెప్తారు?" అన్నాడు జంబేష్.
"అదేదో అడుగుతుందని మనం భయపడితే ఎట్లా!?! ఇది నేను కష్టపడి సంపాదించుకున్నాను. నా ఇష్టం. అదేమీ ఇక్కడ ఉండి పొడిచింది లేదు." అన్నాడు రాజన్.
"అవేమీ నువ్వు ఆలోచించక. అంత దాకా వస్తే నేను చూసుకుంటాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. అమ్మ అన్నయ్యకు వేడిగా కాఫీ పట్టుకురా!" అంటూ చెప్పాడు జంబేష్.
'వీడేం మనిషి, భార్యాబిడ్డల గురించి ఆలోచించకుండా...! ఛీ... ఛీ... వీడికి పెళ్ళి చేసి తప్పు చేసాను.' అని మనసులో అనుకున్నాడు సీతయ్య.
కొన్ని నెలలకే సొంతిల్లు కొనుక్కుని, అక్కడున్నవారికి బాడుగకు వేరే ఇంటికి వెళ్తున్నాం అని, ఆ ఏరియా ఏదో మాకు తెలీదు... అని చెప్పి తప్పించుకుని అక్కడి నుంచి సొంత ఇంటికి వెళ్ళి పోయారు రాజన్ కుటుంబం.
***సశేషం***
రచయిత్రి పరిచయం ..పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లికరచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.) పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు. బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’. సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు. ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు. |