అనుకోని ఈ హఠాత్పరిణామానికి కంగు తింది ప్రణవి. 'పుణ్యానికి పోతే పాపం ఎదురయింది అంటే ఇదే కాబోలు,' అని మనసులో అనుకుని, ఏడుపును దిగమింగుకొని, ధైర్యాన్ని కూడగట్టుకుని,
"ఏంటి సార్? ఏంటి మీరనేది? నేనేంటి? మీ ఇంటికి దొంగతనం చేయడానికి రావటమేంటి? ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి?" అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అతని మీద కుమ్మరించింది ప్రణవి.
"ఆపూ... ఏంటి! రెచ్చిపోతున్నావు? మీ ఇంటికి నేను వచ్చానా? నా ఇంటికి నువ్వు వచ్చావా? తలుపు లేసున్న ఇంట్లోకి చొరబడింది గాక ఎదురు మాట్లాడుతున్నావ్? తాళం వేసున్న ఇంట్లోకి రావలసిన అవసరం నీకేం వచ్చింది?" అంటూ గయ్యన లేచాడు.
"మూలుగు వినిపిస్తే..."
"మూలుగు నీ ఇంటి దాకా వినిపించిందా?"
"లేదు"
"అటువంటప్పుడు ఈ పక్కకి రావాల్సిన అవసరం నీకు ఏమి వచ్చింది? కిటికీ తలుపు తీసి మరీ ఎందుకు చూసావ్?"
"సావిత్రి గారితో మాట్లాడదామని వచ్చాను. మూలుగు వినిపించింది. కిటికీ తలుపు తీసి చూశాను. స్పృహ లేని పరిస్థితిలో ఆవిడ పడి ఉంది. ఇంటికి తాళం పెట్టి ఉంది. అటువంటి పరిస్థితుల్లో మానవత్వం ఉన్న మనిషిగా... ఆమెకి ఏం జరిగిందో అని, నానా తంటాలు పడి, మీ ఇంట్లోకి వచ్చాను. ఇందులో తప్పేం ఉంది? అయినా భార్యకు ఒంట్లో బాగోకపోతే అలా వదిలేసి, మీరు ఎలా వెళ్లారు? హాస్పిటల్లో చూపించాలని మీకు తెలియదా?
స్పృహ లేని మనిషిని ఇంట్లో వదిలేసి మీరు వెళ్లిపోయి, నా మీద అభాండాలు వేస్తున్నారు." అంది ప్రణవి రోషంగా.
"నా భార్య నా ఇష్టం. చూపిచ్చుకుంటానో! మానుకుంటానో! నీకెందుకు? అయినా నా భార్యతో నీకేం పని? మా మధ్య గొడవలు పెట్టడానికి తగుదునమ్మా అని బయలుదేరావా?
నువ్వు ఇలా గోడలు దూకే దానివి కాబట్టే నీ మొగుడు నిన్ను వదిలేసుంటాడు." అంటూ ఉక్రోషంగా గట్టిగా అరిచాడు.
ఈ అరుపులకి ప్రణవి తల్లితో సహా పక్క ఇళ్ళల్లో వారు వచ్చారు.
అతను అన్న మాటలు విన్న గిరిజ...
"మాటలు జాగ్రత్తగా రానీయండి. మా అమ్మాయి పద్ధతిగా పెరిగింది కాబట్టే, బాధపడుతూ ఇంట్లో ఉంది. అందర్నీ వదులుకొచ్చిన భార్యను చిత్రహింసలు పెడుతూ... సైకో ఆనందాన్ని పొందే నీలాగా పద్ధతి తప్పి పెరగలేదు," అంది.
"మా ఇంటికి వచ్చి నన్ను అంటానికి మీకెన్ని గుండెలు? గెటవుట్... గెట్ అవుట్ ఫ్రమ్ హియర్." అన్నాడు గుమ్మం వైపు వేలు చూపిస్తూ.
అందరూ చోద్యం చూసినట్లు చూస్తున్నారు. గానీ అతనిని ఎవరు ఏమీ అనటం లేదు.
"రావే... రా... మనిషైతే చెప్పేది విని అర్థం చేసుకుంటాడు. ఇలాంటి వాళ్లకు చెప్పి ఛీ అనిపించుకొనే కంటే... చెప్పకుండా ఉండటం ఉత్తమం. కందకు లేని దురద కత్తిపీట కు ఎందుకు? వీడిచేత మాట పడాల్సిన అవసరం నీకేంటి? రా..." అంటూ ప్రణవి చేయి పుచ్చుకుని వాళ్ళ ఇంట్లోకి ఈడ్చుకు పోయినంత పని చేసింది గిరిజ.
"వెళ్లండి వెళ్లండి. వెళ్లి, దానికి బుద్ధి చెప్పండి. ఇంకెప్పుడు పక్క వాళ్ళు ఇళ్లల్లోకి చొరబడొద్దని చెప్పండి. లేకపోతే రేపు మీ ఇళ్ళల్లో కి కూడా దూరుతుంది." అని అక్కడ పోగైన వాళ్ళమాటలకి అవకాశం ఇవ్వకుండా, అనేసి వాళ్ళను బయటకు గెంటి, మొహం మీదే తలుపు వేసేసాడు.
వాళ్ళు కొద్ది దూరం కూడా వెళ్ళలేదు... ఆ ఇంట్లో నుంచి శబ్దాలు ఏడుపులు వినిపిస్తున్నాయి.
"లేదు నేనేం చెప్పలేదు..." అంటోంది సావిత్రి.
"నోరు మూయ్. సౌండ్ బయటకు వచ్చిందంటే చంపేస్తాను. నువ్వేం చెప్పకుండానే గోడ దూకేంత సాహసం చేస్తుందా? ఇంకోసారి ఇంటి మీదకి ఎవరినన్నా తీసుకొచ్చావంటే!... చెమడాలు లాగేస్తా జాగ్రత్త!" అంటున్నాడు అతను.
"నేను ఎప్పుడూ ఆ అమ్మాయి తో మాట్లాడలేదు," గొణుగుతోంది ఆమె.
ఆమె మాట పైకి రానీయకుండా...
"ఎదురు మాట్లాడావంటే తంతా... సిగ్గులేని దాన ఎన్నిసార్లు చెప్పాలి నీకు! మొగుడు అంటే విలువలేదు, మొగుడు మాటను గౌరవించడం రాదు. బజారు దానా. ఆడమనిషి కి ఉండే లక్షణమే లేదు నీ దగ్గర. పో పో పోయి అన్నం వండు. ఇప్పటిదాకా చేసిన నిర్వాకం చాలుగాని," అంటూ గట్టిగా అరుస్తూ అన్నాడు.
'వెధవ... వెధవన్నర వెధవ, పెళ్ళాం, పిల్లల్ని ఎలా చూసుకోవాలో తెలియదు గానీ, రోషానికేం తక్కువ లేదు. పాపం ఆ పిల్ల ఎంత ఏడుస్తోందో. పెళ్ళాలను ఏడిపించడానికే పుడతారు ఇలాంటి వెధవలు. తప్పులుచేసే తప్పుడు వెధవలే ఇలా నోరు వేసుకుని ముందు పడతారు. ఎదుటి వాళ్ళని నోరు ఇప్పనివ్వకుండా చేయటానికి. చావు తెలివితేటలూ... వీళ్ళూనూ,' అని మనసులో అనుకుంటూ అక్కడ నుంచి వెళుతూ... ఏదో స్పురణకు రావడంతో పక్కనే ఉన్న ప్రణవి ఇంట్లోకి దూరింది 80 ఏళ్ళ కామాక్షి.
ప్రణవి మంచం మీద బోర్లా పడుకుని ఏడుస్తోంది. తల్లి ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక పిల్లలు బిక్క మొహం వేసి చూస్తున్నారు. గిరిజ కూతుర్ని అనునయిస్తోంది.
గమ్మల్లో ఉన్న కామాక్షి ని చూసి,
"ఏడుపాపేయి, ఆవిడ చూస్తే బాగుండదు," అని కూతుర్ని హెచ్చరించి, "రండి పిన్ని గారు" అంటూ గుమ్మం దగ్గరికి ఎదురు వెళ్లింది గిరిజ.
"ప్రణవి ఏది?" అని అడిగి, చొరవగా ప్రణవి ఉన్న మంచం దగ్గరికి వెళ్ళింది కామాక్షి.
తల్లి చెప్పడంతో, లోపల నుంచి పొంగుకొస్తున్న దుఃఖాన్ని, పంటి బిగువున ఆపుకుని, కామాక్షి వచ్చేసరికే మంచం మీద కూర్చుని ఉంది ప్రణవి.
"అమ్మాయి ఎందుకు వెళ్లావు వాళ్ళ ఇంటికి? అసలే కష్టంలో ఉన్నావు. నీకు ఇలాంటి గొడవలు అవసరమా?" అంది.
"అదేంటి పిన్ని గారు? మీరు కూడా అలా అంటారు? అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆడపిల్లను కాపాడే ప్రయత్నం చేయడం తప్పా?" అంది గిరిజ.
"వాడి దృష్టి లో తప్పే. అయినా మీ పల్లెటూర్లలో లాగా ఈ పట్నాలలో ఇరుగూ పొరుగూలను చూసుకొనేది ఉండదు. పక్కింట్లో ఏం జరుగుతున్నా ఎవరూ పట్టించుకోరు. చూసి చూడనట్లుగా పోతారు. అందులోనూ ఇలాంటి వెధవల విషయంలో అసలు కలిపించుకోరు. వాడి నోరు ఓ పెద్ద అసుద్దపు కుప్ప. ఎవరినైనా ఎంతమాట అయినా అనేస్తాడు. పెద్దంతరం, చిన్నంతరం లేదు. సిగ్గు శరం ఏమాత్రం లేవు. అందుకే వాళ్ళ విషయాల్లో మేం జోక్యం చేసుకోము," చెప్పింది కామాక్షి.
"అలా వదిలేస్తే ఎలా బామ్మగారు? వాడు సావిత్రి గారిని గొడ్డును బాదినట్టు బాదుతున్నాడు. చిత్ర హింసలు పెడుతున్నాడు," అంది ప్రణవి.
"చూసావుగా ఎదురెళ్ళావు! ఏం జరిగింది? అంతే. వాడి చేత లేని మాటలు పడి బాధపడటం అవసరమా?" అంది కామాక్షి.
"ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి. అంతమాత్రాన ఏనుగు విలువ పడిపోదు కదా! అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకోవటం కూడా పెద్ద నేరమే!" అంది ప్రణవి.
"తాదూర సందు లేదు మెడకో డోలు అంట! ముందు నీ లైఫ్ చక్క బర్చుకుంటే... తర్వాత ఇలాంటి వాళ్ళకి సహాయం చేద్దు గానివి.
పెద్దదానిగా ఇది నా సలహా మాత్రమే. అపార్థం చేసుకోక నీ మంచి కోరి చెప్తున్నా. ముందు నువ్వు డెవలప్ అయ్యి తర్వాత ఎదుటి వాళ్ళకి సహాయం చేయి." అని చెప్పింది కామాక్షి.
***సశేషం***
రచయిత్రి పరిచయం ..పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లికరచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.) పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు. బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’. సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు. ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు. |