
కిటికీ జలుబులు తోసిన ప్రణవికి,
ఒంటిమీద గాయాలతో... మూలుగుతూ...గజగజా వణుకుతూ... కనిపించింది పక్కింటి ఆవిడ.
"సావిత్రి గారు" అంటూ పిలిచింది.
ఆవిడ పలకలేదు. మళ్లీ గట్టిగా రెండు మూడు సార్లు పిలిచింది ప్రణవి.
"ఊ..." అంటూ పలికింది. ఆమె గొంతు చాలా లో గా ఉంది.
"ఏమైంది?" అడిగింది ప్రణవి.
జవాబు లేదు...
ఆమె మాట్లాడే స్థితిలో లేదని అర్థమైంది ప్రణవి కి.
ప్రణవి మెదడులో రకరకాల ప్రశ్నలు తలెత్తాయి. ఆమె ఒంటిమీద గాయాలు చూస్తే... 'ఆమె భర్త కొట్టి ఉంటాడని ఈజీగానే అర్థమవుతోంది. మరి అంతలా తల్లిని కొడుతూ ఉంటే పిల్లలు చూస్తూ ఊరుకున్నారా? వాళ్ళు ఒకవేళ ఆపటానికి భయపడినా... గట్టిగా అరవచ్చు కదా! అటువంటి అరుపులు కూడా పక్కనే ఉన్న మాకు వినపడలేదు. అసలైనా! పిల్లలు ఏమయ్యారు?
తండ్రి, పిల్లలు ఈమెను ఇంట్లో పెట్టి తాళం వేసి, ఎక్కడికి వెళ్లినట్లు?'
రకరకాల ప్రశ్నలు ఆమెను చుట్టుముట్టాయి.
వెంటనే, 'అనవసరమైన ఆలోచనలతో కాలయాపన చేయకుండా, ఆమెను రక్షించే ప్రయత్నం చేయాలి. ఎలా?' అని మనసులో అనుకుని, తాళం లాగి చూసింది. అది రాలేదు. మళ్ళీ కిటికీలోంచి లోపలి పక్క పరిశీలనగా చూసింది.
లోపల వెలుతురు పడుతూ కనపడింది. అంటే వెనక తల తలుపు తీసే ఉంది. అటు నుంచి వెళ్లే ప్రయత్నం చేద్దామని అనుకుంది. కానీ ఎలా? పక్కపక్క ఇల్లు అయినా వాళ్ళ పెరటి దొడ్లోకి వెళ్లాలంటే... మనిషి అంత ఎత్తున గోడ అడ్డం ఉంది. ఆ గోడ దాటుకుని వెళ్ళాలి. ఎలాగైనా వెళ్లి తీరాలి. సాటి మనిషి ఆపదలో ఉంటే రక్షించడం మన విధి. అని అనుకుని, ఇంటికి వచ్చి... గిరిజకి చెప్పింది.
ఇద్దరు కలిసి లోపల ఉన్న టేబుల్ ని గోడ పక్కకి తీసుకెళ్లారు.
ప్రణవి టేబుల్ పై కెక్కి, గోడమీద కెక్కింది. ఎక్కడమైతే ఎక్కింది, కానీ అవతల పక్క దిగడం ఎలాగా? అంతే ఎత్తులో ఉంటుంది కదా! 'దూకేద్దామా అంటే! అమ్మో లేనిపోని రిస్క్. అసలే జీవితం అంతంత మాత్రం, దానికి తోడు ఇంకో అవకరం ఏర్పడితే! ఇంకా ఏమన్నా ఉందా!' అనుకుంది.
ఈ లోపల వాళ్ళ అమ్మ లోపల నుంచి ఒక స్టూల్ తీసుకొచ్చి, "గోడ ను జాగ్రత్తగా పట్టుకుని, ఈ స్టూల్ ని అవతల పక్కకి మెల్లగా దించి దాని మీంచి దిగు," అంటూ స్టూల్ను ప్రణవికి అందించింది.
ప్రణవి అలాగే ఆ స్టూల్ అవతలపక్కకి వేసుకుని, దిగి పక్క ఇంట్లోకి వెళ్ళింది.
సావిత్రి ని మొదట పిలిచింది.
ఊ అంటోంది కానీ కళ్ళు తెరిచి చూడలేక పోతోంది. నుదిటిపై చేయి వేసి చూసింది. కాలుతోంది.
ఫ్రిజ్ లోనుంచి కూలింగ్ వాటర్ తెచ్చి, గుడ్డ తడిపి, నుదుటి పై వేసింది.
తగిలిన గాయాలకు డ్రస్సింగ్ చేసింది. వంటింట్లో టిఫిన్ దొరుకుతుందేమో అని వెతికింది.
అసలు పొయ్యి అంటించినట్లు లేదు. గోడ దగ్గరికి వెళ్లి తల్లి ని పిలిచి చెప్పింది.
గిరిజ ఓ ప్లేట్లో టిఫిన్, జ్వరం తగ్గే టాబ్లెట్ తెచ్చి గోడమించి అందించింది.
ప్రణవి... సావిత్రి ని లేపి కూర్చోబెట్టి, టిఫిన్ తినిపించ బోయింది.
"ఆయన... ఆయన..." అంటూ బెదురు గా అటూ ఇటూ చూసింది.
"ఎవరూ లేరు. బయట తాళం పెట్టి ఉంది," చెప్పింది ప్రణవి.
" మీరు ఎలా వచ్చారు?" చిన్న స్వరంతో అడిగింది సావిత్రి.
" నేను పెరటిగోడ మీద నుంచి వచ్చాను. ఏమైంది? మీ ఇద్దరి మధ్య గొడవ ఏమైనా అయ్యిందా? మీ ఒళ్లంతా ఆ గాయాలు ఏమిటి?" అంటూ అడిగింది ప్రణవి.
"ఏమీ లేదు... కాలు జారి పడ్డాను. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి," అంది సావిత్రి.
"సరే వెళ్తాను గాని, మీరు ముందు టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకోండి," అంటూ టిఫిన్ ప్లేట్ ఆమెకి అందించింది.
"ధన్యవాదాలు. నేను తింటాను. మీరు వెళ్లిపోండి." అంది సావిత్రి.
"నేనేమీ ఇక్కడ ఉండను. వెళ్ళి పోతాను. మీకు జ్వరంగా ఉంది ముందు టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకోండి." అంటూ
టిఫిన్ పళ్ళెంలోని టిఫిన్ ని చిన్న ముక్కలుగా చేసి సావిత్రి కి తినిపించింది. ముందు వద్దన్నా... తర్వాత టిఫిన్ తినేసింది సావిత్రి. టాబ్లెట్ వలిచి ఆమె చేతికిచ్చి వేసుకోమని, మంచినీళ్లు అందించింది.
టాబ్లెట్ వేసుకుని, మంచినీళ్లు తాగేసి, ఈ పిల్ల ఎప్పుడు వెళ్ళిపోతుందా!?! అన్నట్టుగా చూస్తూ కూర్చుంది సావిత్రి.
ఈ లోపల కాఫీ పెట్టి, గిరిజ గోడ దగ్గర నుంచి పిలిచింది. ప్రణవి గోడ మీద నుంచి కాఫీ అందుకుని... సావిత్రి చేత తాగిపిచ్చింది.
"మీరు రెస్ట్ తీసుకోండి" అని చెప్పి, "ఇంతకీ పిల్లలు ఏమయ్యారు?" అంటూ అడిగింది ప్రణవి.
"వాళ్లు స్కూలుకు వెళ్లారు. ఆయన వచ్చే టైం అవుతోంది మీరు వెళ్ళండి." అంది సావిత్రి.
'ఆయన వస్తే ఏంటిటా? కొంపదీసి, ఈమెకు గాని అనుమానమా? వాళ్ళ ఆయనతో నేనేమన్నా... అనుకుని అనుమానిస్తోందా? ఛీ... ఎందుకు వచ్చిన గోల? మంచికి పోతే చెడు ఎదురయ్యేట్టు గా ఉంది,' అని మనసులో అనుకుని,
"పర్వాలేదండి. ఇరుగు పొరుగు అన్నాక, అవసరమైనప్పుడు ఒకళ్ళకి ఇంకొకళ్ళు సహాయం చేసుకోవాలి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అవసరమైతే పిలవండి. సహాయం చేస్తాము," అని చెప్పి లేచింది ప్రణవి.
తలుపు శబ్దమైతే తిరిగి చూసింది.
ఇంతలో తలుపు తాళం తీసుకొని సావిత్రి వాళ్ళ ఆయన లోపల వచ్చాడు.
వస్తూనే ప్రణవి ని చూసి, "ఎవరు నువ్వు? తాళం వేసిన నా ఇంట్లోకి నువ్వు ఎలా వచ్చావు?" అంటూ అడిగాడు.
"తనూ..." చెప్పబోయింది సావిత్రి.
"నువ్వు నోరు మూయి. నిన్ను నేను అడగలేదు." అని సావిత్రి వంక కోపంగా చూసి, ప్రణవి ని ఎగాదిగా అనుమానంగా చూస్తూ
"నిన్నే అడిగేది? నా భార్యకు స్పృహ లేని టైం లో, తాళం వేసిన ఇంట్లోకి నువ్వు ఎందుకు వచ్చావు? ఏం పట్టుకు పోదామని వచ్చావ్? ఉండు నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను." అంటూ ఫోన్ తీశాడు సావిత్రి భర్త.
***సశేషం***
రచయిత్రి పరిచయం ..
|