Menu Close
Ghali-Lalitha-Pravallika
కొలిమి (ధారావాహిక)
-- ఘాలి లలిత ప్రవల్లిక --

కాఫీ కప్పులు వాళ్ళిద్దరికీ ఇచ్చి, పాలు తెచ్చుకొని తానూ వాళ్ళతో కూర్చుని తాగింది రాణి.

"అసలు ఏంటిట వాళ్ళ బాధ" అడిగాడు రాజన్.

"ఏమో బావా! వాళ్ళ కొంపల్లో ఏం జరిగినా కప్పెట్టేసుకుంటారు. పక్కిళ్లలో పొయ్యి మీద చుయ్యి మన్నా వాళ్లకే కావాలి. ఆరాలు తీస్తూ... వాటికి కాస్త మసాలా రాసి ఊరి మీద ఊదేస్తారు," అంది రాణి.

"అలా అడిగితే! మీరు ఎందుకు వివరాలు చెప్పేది. మా ఇంటి విషయాలు నీకెందుకు అని గట్టిగా చెప్పలేక పోయావా?" అన్నాడు జంబేష్.

"అలా చెప్పకూడదు రా! నలుగురి మధ్యలో ఉన్నప్పుడు," అన్నాడు రాజన్.

"అసలు మన ఇంటి విషయాలు వాళ్లకు ఎందుకు అన్నయ్య! మనం పోయి వాళ్ళని ఏమన్నా అడుగుతున్నామా!" కోపంగా అన్నాడు జంబేష్.

"పక్కింటి పర్సనల్ విషయాలు అడగకూడదనే ఇంగితం వాళ్ళకుండాలి," అన్నాడు రాజన్.

"మనము సమాజంలో బతుకుతున్నాం. అట్లా అడగకుండా ఎలా ఉంటారు? వాళ్ళు అడుగుతారు. వాళ్లకు కావాల్సింది అదే. అలా అడగడం వాళ్ళ జన్మహక్కు. టీవీలో సీరియల్స్ చూసే మాదిరి, ఇరుగు పొరుగు విషయాలను ఇంట్రెస్ట్ గా వింటారు. మేం చెప్పమంటే ఎలా కుదురుతుంది? అడిగితే చెప్పి తీరాల్సిందే! లేక పోతే హంతకులను చూసినట్లు చూస్తారు." అంది రాణి.

"ఎదుటి వాళ్లు మనల్ని ప్రశ్నలు అడగకముందే, మనమే వాళ్ళని దడబిడ నాలుగు ప్రశ్నలు అడిగేసి, వాళ్ళు మనల్ని అడిగే సమయం ఇవ్వకుండా, తప్పించుకుని అక్కడి నుంచి వెళ్లిపోవడం ఒక పద్ధతి. లేదా వాళ్ళు అడిగిన ప్రశ్నకి జవాబు అర్థం కాకుండా చెప్పి తప్పించుకోవటం రెండో పద్ధతి. అంతేగాని, మన తలని వాళ్ళ చేతులకు అప్పచెప్పకూడదు," అన్నాడు రాజన్.

"అలా కాదులే బావ. మనం ఇల్లు మారిపోదాం. ఇక్కడ మనుషులు రాలేనంత దూరంగా వేరే ఇంట్లోకి మారిపోదాం. అక్కడ వాళ్లకి మన విషయాలు తెలియదు కాబట్టి, మనం చెప్పిందే వేదం. మనం ఏది చెప్తే అదే నమ్ముతారు. మళ్ళీ కొత్తగా జీవితాన్ని ప్రారంభిద్దాం." అంది రాణి.

"అసలు ఇదంతా మనకు అవసరం రా! మనం ఎక్కడికి వెళ్ళినా! మన కర్మ మన వెనకాతల వస్తుంది. నిజాన్ని కప్పిపుచ్చడం, నిప్పుని గుప్పెట్లో దాయాలనుకోవడం లాంటిది. అది మనకే ప్రమాదం. వారు పోలీస్ కంప్లైంట్ ఇస్తే మనం అందరం జైలు కి వెళ్ళాల్సి ఉంటుంది. అమ్మాయిని, పిల్లల్ని తీసుకుని వద్దాం," అన్నాడు బయట నుంచి వచ్చి వీరి మాటలు వింటున్న జంబేష్ తండ్రి సీతయ్య.

"ఏంటి తీసుకుని వచ్చేది? నీకు గాని పెళ్ళామా ఏంటి? ఏలుకునేది  నువ్వా? నేనా? అయినా ఇప్పుడు నిన్ను ఎవరు సలహాలు అడిగారు? మూసుకొని కూర్చో," అన్నాడు కోపంగా జంబేష్.

"మరేంలేదురా... ఆయన భయం అల్లా... ఆయనను జైల్లో పెడతారేమో నని" అన్నాడు రాజన్.

"జైల్లో పెడతారు... హా...హా...హా...అని పెద్దగా నవ్వి, పెడితే పెట్టని, ఇప్పుడు ఏమైంది? ఇక్కడ భయపడి పోయేవాళ్ళు ఎవరున్నారు? మనకి మాట్లాడటం రాదా? ఆమెని దోషిని చేయటం చేత రాదా? దానికి పొగరు ఎక్కువ. చదువుకున్నాను అనే అహం ఎక్కువ." అన్నాడు జంబేష్.

"అది ఎలాంటిదైనా ఇప్పుడు చట్టం ఆడవాళ్ళ పక్షాన్నే నిలబడుతుంది." అన్నాడు రాజన్.

"అందుకే పోయి వాళ్ళని తీసుకుని వద్దాం అంటున్నా. లేకపోతే అందరం కోర్టు ల చుట్టూ తిరగాలి," అన్నాడు సీతయ్య.

"మొగుడిని గౌరవించడం చేతరానిది. వదినతో సఖ్యతగా ఉండదు. అన్నయ్యకు వేలు చూపిస్తుంది. దానిని ఏలుకొనేదేంటీ? నా కక్కర లేదు. నేను ఏలుకోను. అయినా కాదు, కూడదు అని కొడుకులని కాదని వాళ్ళ  వంక నిలబడతావా? పో... నిలబడు. ఇక నిన్ను మేం పట్టించుకోము." ఆవేశం గా అన్నాడు జంబేష్.

"ఆ అమ్మాయి పెడ మనిషి. మనతో కలవలేదు. నేనూ చెప్పా! అమ్మాయి నువ్వు అట్లా ఉండబోక, రాణిని చూడు మా అందరితో కలిసి పోయి ఎలా ఉందో! నువ్వు అలా ఉండాలని, మాట వింటే గా... విష్ణు సహస్ర నామము చదవకు... చదివిన వారు పిచ్చి పట్టి రోడ్లమ్మట పడి తిరుగుతారు, అని పెద్దోడు చెప్పినా... వాడి మాటలు పెడచెవిన పెట్టి చదివింది. నేనూ రాముడ్ని కొలవకు... రాముడిని కొలిస్తే... సీత లాగా కష్టాలు పడాలని చెప్పా. వినకుండా రామ రక్షా స్తోత్రము చదివేది. ఏంటమ్మా యి... మేము వద్దన్నాము కదా! మేము వద్దన్నా ఎందుకు చదువుతున్నావని, నేను అడిగితే, మొక్కుకున్నా... ఈ వారం అవ్వగానే మానేస్తా నంది. మన మాట విననిది మనకెందుకు? వద్దులే, మీఇష్టమే నా ఇష్టం" అన్నాడు సీతయ్య.

'నువ్వు భలే అవకాశ వాది వి నాన్నా. ఏ ఎండ కా గొడుగు పడతావు.' అని మనస్సు లో అనుకొని "అమ్మా నాన్న వచ్చారు. కాఫీ నాన్నకు తీసుకుని రా!" అంటూ పిలిచాడు రాజన్.

*****

ఉదయం నిద్ర లేచిన ప్రణవి కాలకృత్యాలు తీర్చుకుని, పక్కింటి ఆవిడతో మాట్లాడాలని చూసింది.

ఆవిడ బయట ఎక్కడా కనబడలేదు. 'ఇంటికి వెళ్లి మాట్లాడనా! అలా మాట్లాడితే బాగుంటుందా? పక్కవారి పర్సనల్ విషయాలు అడగటం సంస్కారం కాదేమో! మరి అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు అతను. ఆమె పెదవి విప్పి ఎవరికి చెప్పదు. అందుకేనేమో అంత పెట్రేగిపోయాడు. లేకపోతే లోకానికి అన్నా వెరిసేవాడు కదా! అతని శాడిజం తారా స్థాయిలో ఉంది కాబట్టి, ఇది ఓ ఇంటి సమస్య కాదు. ఇంటి పై కప్పు దాటి, ఆకాశంలోకి చేరింది. అంటే అది విశ్వవ్యాపితం. దాన్ని గురించి ఎవరైనా చర్చించ వచ్చు. అవసరం అయితే ఆమెకు అండగా నిలబడవచ్చు.' అని మనసులో అనుకొని పక్కింటికి వెళ్ళింది ప్రణవి.

ఇల్లు లాక్ చేసి ఉంది. 'ఇదేంటి? వాళ్ళు బయటికి వెళ్లినట్టే తెలియ లేదు! ఎప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు?' అని అనుకొని, వెనుతిరగబోయింది.

లోపలి నుంచి మూలుగు లాగా వినపడింది. ఏంటా అని తలుపు సందులలో నుంచి చూసింది. ఏమీ కనిపించలేదు. కిటికీ తలుపులు తోయ ప్రయత్నించింది. గడియ లేదో ఏమో! కిటికీ తలుపు తెరుచుకుంది. తెరిచిన కిటికీలోంచి లోపలికి తొంగి చూసింది. లోపల దృశ్యం చుసిన ప్రణవి మ్రాన్పడిపోయింది.

***సశేషం***

రచయిత్రి పరిచయం ..

Ghali-Lalitha-Pravallika పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక

రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)

పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.

బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.

సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.

ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.

Posted in September 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!